Monday, June 20, 2016

రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి: డా.రఘురాం రాజన్


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డా. రఘురాం రాజన్ ను వదిలించుకోవాలన్ననిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చి, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామిని ఉసిగొలిపి వదిలి పెట్టింది. ఆయన అమెరికా ఏజెంటని, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని, తక్షణం రాజీనామా చేయాలని స్వామి బహిరంగంగా దాడి చేశారు. డా.రాజన్ ను తొలగించాలని మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. అల్లరి నుండి బయట పడడానికి డా. రఘురాం రాజన్ , తాను రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవిలో రెండవ 'టర్మ్' కొనసాగాలని కోరుకోవడం లేదని రిజర్వు బ్యాంకు సిబ్బందికి వ్రాసిన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు. తద్వారా ఊహాగానాలకు తెరదించారు
డా.రఘురాం రాజన్ నిష్క్రమణ వార్తపై వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్పందించాయి. పాలక పక్షం స్వాగతించింది. ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. 2013 సెప్టంబరులో బాధ్యతలు స్వీకరించిన డా.రాజన్ అంతర్జాతీయంగా అననుకూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదాల బారిన పడకుండా కాపాడారని ఆయనను పారిశ్రామిక, ద్రవ్య మార్కెట్ వర్గాలు కొనియాడాయి. ఆయన ప్రకటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వారి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలకు రాజన్ అగ్రపీఠం వేశారు కాబట్టి వర్గాలు అలా స్పందించడంలో ఆశ్చర్యమేమీ లేదు. నోబుల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ గారు డా.రాజన్ నిష్క్రమణ ఆహ్వానించతగ్గ పరిణామం కదన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడొకరు 'కాకుల్లో కోకిల యిమడదు' అని డా. రాజన్ ను కోకిలగా అభివర్ణించడం కాస్తా ఎబ్బెట్టుగానే అనిపించింది. శతృవు శతృవు మన మిత్రుడన్న నానుడి అన్ని సందర్భాలలోను పనికిరాదు. దాన్ని గుడ్డిగా అనుసరిస్తే ఒక్కోసారి పప్పులో కాలేసిన వారౌతారు.
డా.రఘురాం రాజన్ ఉదంతాన్ని తేలికగా తీసిపారేయలేం. అంత వరకు అంగీకరించాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా రాజ్యాంగ బద్ధమైన బాధ్యతల్లో ఉన్న డా.రఘురాం రాజన్ పట్ల మోడీ ప్రభుత్వం అమర్యాదకరంగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. డా.రఘురాం రాజన్ పదవీ కాలం సెప్టంబరుతో ముగియనున్న దశలో సుబ్రమణ్యస్వామి ద్వారా ఆయనను వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరించి, అల్లరి పెట్టాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన‌, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డా.రఘురాం రాజన్ పై ఎక్కుపెట్టిన దాడి, వ్యవస్థపై దాడిగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు గవర్నరుకు రాజ్యాంగం దఖలు పరిచిన అధికారాలకు కత్తెర వేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది. డా.రఘురాం రాజన్ వాటికి అడ్డుగా నిలిచారన్నవార్తలు బహిర్గతమయ్యాయి.
మోడీ అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. కొలీజియం స్థానంలో నేషనల్ జుడిషియల్ కమీషన్ ఏర్పాటు, అందులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిథుల నియామకం అంశంపై ప్రభ్యుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య వివాదంగా మారి, కడకు రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించడంతో సమస్య పరిష్కారం అయిందనుకొంటే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే దోరణిలో రిజర్వు బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచే దుష్ట ఆలోచనతో మోడీ ప్రభుత్వం ప్రయాణం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం క్షేమం కాదు. అంశాలపై విస్తృత చర్చ జరగాలి.
అదే సందర్భంలో రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఘరాం రాజన్ అనుసరించిన ద్రవ్య విధానం, దాని పర్యవసానాలపై కూడా చర్చ జరగాలి. ఆయన ప్రగతిశీల లేదా ప్రజాతంత్ర భావాలున్న ఆర్థిక వేత్త అని ఎవరైనా భ్రమిస్తే చేయగలిగిందేమీ లేదు. రాజన్ బాధ్యతలు నిర్వహించిన మూడేళ్ళకాలంలో ఆర్థిక వ్యవస్థపై రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల ప్రభావంపై నిశితంగా అధ్యయనం చేస్తే ఆయన ఆర్థిక భావజాలం వర్గానికి ప్రయోజనాలు వనగూడ్చి పెట్టిందో అర్థమవుతుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరగడం ఆహ్వానించతగ్గ అంశమే. రాజన్ కృషి ఫలితంగా ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని, ద్రవ్యోల్భణానికి కళ్ళెం వేసి, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టారని అతిశయోక్తులతో పొగిడేవారూ లేక పోలేదు.
ఒక్కసారి వాస్తవాలను పరిశీలిస్తే ఆయన విధానాల్లోని డొల్లతనం బయటపడుతుంది. హోల్ సేల్ మార్కెట్ ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడమే కాకుండా రీటేయిల్ మార్కెట్ ద్రవ్యోల్భణాన్ని కూడా తగ్గించారని కొందరు కితాబిస్తున్నారు. కళ్ళుండి చూడలేని కబోధుల్లా వ్యవహరించే వారిని ఏమనాలి? మార్కెటుకెళితే నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయో! తగ్గుతున్నాయో! బోధపడుతుంది.
అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం. రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. రంగాన్ని గట్టెక్కించడానికి బ్యాంకింగ్ వ్యవస్థ చేపట్టిన చర్యలు గానీ, చొరవలు గానీ ఏమీలేకపోగా, రైతు రుణ మాఫీ పథకాల అమలులో భాగంగా రుణాల రీషెడ్యూల్ కు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వు బ్యాంకుకు విజ్ఞప్తి చేస్తే తిరస్కరించడం జరిగింది.
కార్పోరేట్ దిగ్గజాలు, బడా పారిశ్రామిక వేత్తలు వేలకు వేలు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి, ప్రభుత్వ రంగ బ్యాంకుల మనుగడకే ప్రమాదం తెచ్చిపెడుతున్నా, మొండి బాకీలను వసూలు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రాజన్ అమలు చేసిన కార్యాచరణ ఏమీలేదనే చెప్పాలి. పారుబాకీల అంశంపై దృష్టి సారించాలని, బ్యాంకు ఖాతాలను సక్రమంగా ఉండేలా చూసుకోవాలని హితబోధ చేయడం తప్ప నిర్ధిష్టంగా చేపట్టిన చర్యలేమీ లేవు. మొండి బాకీల జాబితాను బహిర్గతం చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ప్రజలు కోరినా డిమాండును నిర్ద్వందంగా తిరస్కరించారు. పైపెచ్చు ఉద్ధేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టే వారు, వ్యాపారంలో నష్టం వచ్చి చెల్లించలేక పోయిన వారు అన్న వర్గీకరణ చేసుకొని, రుణగ్రహీతల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని, లేనియడల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు నిరుత్సాహపడతాయని, తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. విజయ మాల్యా లాంటి వారు కోవలోకి వస్తారో! డా. రాజన్ గారే చెప్పాలి. ప్రజల సొమ్మును కాజేసి, ప్రభుత్వబ్యాంకింగ్ వ్యవస్థనే భ్రష్టుపట్టించిన గరానా పెద్ద మనుషులు, సంస్థలను కఠినంగా శిక్షించడానికి అనుసరించిన విధానమేమి కనిపించడం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచవలసిన, విస్తరించ వలసిన, బలోపేతం చేయవలసిన, ప్రజల ధనానికి రక్షిణ కల్పించాల్సిన ప్రాధమిక బాధ్యత రిజర్వు బ్యాంకుపైన లేదా? దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మొండి బాకీలు(యన్.పి..లు) పేరుకపోవడంలో రిజర్వు బ్యాంకు వైఫల్యం లేదని భావించాలా?
వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వడ్డీ రేట్ల తగ్గింపులో రాజన్ అనుసరించిన వైఖరి పర్యవసానంగా రంగం కుదేలయ్యింది. అనేక వత్తిళ్ళ తరువాత రిజర్వు బ్యాంకు రెపో రేటును ఐదుసార్లు తగ్గించినా, నిష్పత్తిలో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించలేదు. దాని వల్లవినియోగదారులకు జరిగిన ప్రయోజనం పరిమితమే. ద్రవ్య మార్కెట్ కు, కార్పోరేట్ రంగానికి సేవలందించడంలో చూపెట్టిన శ్రద్ధ, వ్యవసాయ మరియు చిన్న,మధ్య తరగతి పారిశ్రామిక రంగం, గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై మాత్రం పెట్టలేదన్నది వాస్తవం.
డా.రఘురాం రాజన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆయన భావజాలం ఏమిటో బోధపడుతుంది. చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేస్తూ, "పెట్టుబడిదారుల నుండి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవాలి" అన్న గ్రంథాన్ని మరొక ఆర్థిక వేత్తతో కలిసి వ్రాశారు. దానికి మెచ్చి అంతర్జాతీయ ద్రవ్య నిథి సంస్థ(ఐయంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా, ఒక విభాగానికి డైరెక్టర్ గా సంస్థబాధ్యతలను అప్పగించింది. .యం.ఎఫ్.లో సేవలందించిన మీదటరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు గవర్నరుగా నియమించబడ్డారు.
డా.రఘురాం రాజన్ రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉంటారా! మరొకరొస్తారా! అన్నదాని కంటే కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా అడుగు ముందుకు వేయడానికి, ప్రగతి సాధించడానికి, దేశ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయడానికి రిజర్వు బ్యాంకు అనుసరించాల్సిన ద్రవ్య విధానం, ప్రభుత్వ రంగబ్యాంకింగ్ వ్యవస్థ పరిరక్షణ తదితర మౌలికాంశాలపై దేశ ప్రజలు స్పందించాలి, చర్చించాలి.


   

Sunday, June 12, 2016

కృష్ణా 'బోర్డు'కు ఎందుకు మోకాలడ్డుతున్నట్లు?

1. తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నదిపై నిర్మించబడి, వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల నియంత్రణను విభజన చట్టం మేరకు నది యాజమాన్య బోర్డుకు అప్పగించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళయినా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఆవైపు అడుగులు వేయడానికి బొర్డు చొరవ ప్రదర్శిస్తే, ఆ ప్రక్రియను అడ్డుకొనే పనిలో తెలంగాణ ప్రభుత్వం పడింది. నోటిఫికేషన్ జారీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం వత్తిడి పెంచడం సమంజసమేనా? జల జగడాలు కొనసాగాల్సిందేనా? బోర్డు పూర్తి స్థాయిలో పనిస్తే తెలంగాణకు వచ్చే నష్టమేమిటి? తెలంగాణ ప్రభుత్వo లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధమైనవేనా? విజ్ఞతతో రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
2. విభజన తరువాత అత్యంత వివాదాస్పదంగా మారిన కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి తీసుకొన్న చర్యలను ఒకసారి పరిశీలిద్ధాం! ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క రాజోలిబండ మళ్ళింపు పథకం(ఆర్.డి.యస్.) వద్దే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు గొడవ పడే వారు. విభజనానంతరం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద నీటి వినియోగంపై తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. ఒకటి రెండు సార్లు రెండు రాష్ట్రాల పోలీసులే తన్నుకొనే దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సోద్యం చూస్తూ కూర్చున్నదే కానీ చట్టాన్ని అమలు చేసి, ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూడాలన్న బాధ్యతను విస్మరించింది. విమర్శలు వెల్లువెత్తిన పూర్వరంగంలో ఎట్టకేలకు ఈ విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో కాస్త చలనం వచ్చినట్లున్నది. బోర్డుకు అధికారాలను దఖలు పరిచే ముసాయిదా నోటిఫికేషన్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసిందన్న అంశంపై రగడ మొదలయ్యింది. ఒక్క అడుగు ముందుకు పడిందో! లేదో! అప్పుడే, ముందరి కాళ్ళకు బంధం వేయాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అసంబద్ధమైన వాదనలు, ఆరోపణలతో బోర్డు పూర్తి స్థాయిలో పని చేయడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించే పనిలో పడింది.
3. కృష్ణా నది యాజమాన్య బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తున్నదని ఆరోపిస్తూ, నోటిఫికేషన్ జారీ చేయవద్దని ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ గారు , నీటి పారుదల శాఖామాత్యులుగా హరీష్ రావు గారు కేంద్ర జల వనరుల శాఖామాత్యులు ఉమాభారతి గారికి లేఖాస్త్రాలను సంధించారు. గవర్నరును, కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారిని కలిసి తమకు సహకరించమని కోరారు. దానిపై స్పందించిన దత్తాత్రేయ గారు తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ఉమాభారతి గారిని స్వయంగా కలిసి నోటిఫికేషన్ జారీ కాకుండా నిలుపుదల చేయించాలని, హరీష్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిథి బృందం డిల్లీకి వెళ్ళి విన్నవించింది.
4. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరుగుతున్నదని, తెలంగాణ వాటా సంగతి తేలిన తరువాతనే నోటిఫికేషన్ జారీ చేయాలనే అసంబద్ధమైన వాదనను ముందుకు తెచ్చారు.
బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా నికర జలాలను నిర్ధారించి, చేసిన పంపిణిని సమీక్షించే అవకాశం లేదని, ఆ కేటాయింపులను యధాతథంగా తన తీర్పులోనూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పొందుపరచింది. మిగులు జలాల వినియోగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ స్వేచ్ఛ కల్పించింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ స్వేచ్ఛను హరించి వేసింది. 65% నీటి లభ్యత ప్రామాణికంగా అదనంగా 263 టియంసిలు, ఆపైన కూడా 4 టియంసిల మిగులు జలాలు లభిస్తాయని నిర్ధారించి పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఇది తెలుగు ప్రజల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా భావించి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. పర్యవసానంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రస్తుతానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. దాని ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి వినియోగానికి సంబంధించిన కార్యాచరణను విభజన చట్టానికి అనుగుణంగా అమలు చేయాలి.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో విస్పష్టంగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయబడ్డాయి. ప్రజలను ప్రక్క దారి పట్టించే దురుద్ధేశంతో అవాస్తవాలను ప్రచారంలో పెట్టడం సమంజసం కాదు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నందున బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకే నీటిని వినియోగించుకొనే హక్కు ఉంటుంది. నదీ జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. ట్రిబ్యునల్ తీర్పు ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణపై రాజీలేని పోరాటాన్ని రెండు రాష్ట్రాలు చేయవచ్చు. అందులో తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం ఎవరు చేసినా చెల్లుబాటు కాదు.
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 800 టియంసిల నికర జలాలను, 11 టియంసిల పునరుత్ఫత్తి నీటిని ట్రిబ్యునల్ కేటాయించింది. ప్రాజెక్టుల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా డెల్టాకు 181.2 టియంసిలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 281(తెలంగాణ వాటా 106.2, ఆంధ్రప్రదేశ్ వాటా 174.8), మున్నేరు ప్రాజెక్టుకు 3.3, వికె పురం పంపింగ్ స్కీమ్ 2.6, గుంటూరు చానల్ 4, కోస్తాలో మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 11.54, మొత్తం 377.47 టియంసిలను కేటాయించింది. రాయలసీమ ప్రాంతంలోని కె.సి.కెనాల్ 39.9, తుంగభద్ర ఎగువ కాలువ 32.5, తుంగభద్ర దిగువ కాలువ 29.5, బైరవానితిప్ప 4.9, గాజులదిన్నె 2, మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 13.9, మొత్తం 122.7 కేటాయించబడ్డాయి.
తెలంగాణలోని రాజోలి బండ మళ్ళింపు పథకానికి 15.9, జూరాల ప్రాజెక్టుకు 17.84, పాకాల్ లేక్ 2.6, వైరా 3.7, పాలేరు 4, డిండి 3.7, కోయిల్ సాగర్ 3.9, మూసి 9.4, లంకసాగర్ 1, కోటిపల్లివాగు 2, ఓకచెట్టివాగు 1.9, హైదరాబాదు త్రాగు నీరు 3.9, మైనర్ ఇరిగేషన్ పద్దు క్రింద 90.82, మొత్తం 266.83 టియంసిలను కేటాయించింది. మిగిలిన 33 టియంసిలను శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి పద్దు క్రింది పేర్కొనబడింది.
బచావత్ తీర్పు తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం జరిగింది. క్రిష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టియంసిలను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించబడుతున్న భీమా పథకానికి సర్దుబాటు చేశారు. పునరుత్ఫత్తి ద్వారా లభించే 11టియంసిలకు తోడు కెసి కెనాల్ ఆధునీకీకరణ ద్వారా లభించే 8 కలిపి మొత్తం 19 టియంసిలను యస్.ఆర్.బి.సి.కి కేటాయించి, నిర్మించుకోవడం జరిగింది. తుంగభద్ర జలాశయం నుండి కెసి కెనాల్ కు కేటాయించిన 10 టియంసిలను అనంతపురం జిల్లాలో నిర్మించబడిన పిఎబిఆర్ కు సర్దుబాటు చేసి, కెసి కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిలను సర్దుబాటు చేయడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులే జరగలేదని అడ్డగోలుగా వాదించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
5. విభజన చట్టం ఏం చెబుతున్నది?:
Apex Council: Section 84 (1) The Central Government shall, on and from the appointed day, constitute an Apex Council for the supervision of the functioning of the Godavari River Management Board and Krishna River Management Board.
(2) The Apex Council shall consist of–––
(a) Minister of Water Resources, Government of India—Chairperson;
(b) Chief Minister of State of Andhra Pradesh—Member;
(c) Chief Minister of State of Telangana—Member.
River Management Board: Section 85 (1) The Central Government shall constitute two separate Boards to be called the Godavari River Management Board and Krishna River Management Board (to be known as the Board), within a period of sixty days from the appointed day, for the administration, regulation, maintenance and operation of such projects, as may be notified by the Central Government from time to time.
చట్టంలో పేర్కొన్న మేరకు అపెక్స్ కౌన్సిల్, యాజమాన్య బోర్డులనైతే ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఛేర్మన్ గా నియమించబడిన వ్యక్తి ఇటీవలే పదవీ విరమణ చేశారు. మరొకరిని ఇంకా నియమించ లేదు. పూర్తి కాలం పని చేసే కార్యదర్శిని కూడా నియమించలేదు. బోర్డు బాధ్యతలను నిర్ధేశిస్తూ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ను జారీ చేయలేదు.
Section 85(2) The headquarters of Godavari River Management Board shall be located in the successor State of Telangana and of the Krishna River Management Board shall be located in the successor State of Andhra Pradesh.
(3) The Godavari River Management Board and Krishna River Management Board shall be autonomous bodies under the administrative control of the Central Government, and shall comply with such directions as may, from time to time, be given to them by the Central Government.
చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి. తద్భిన్నంగా తాత్కాలిక కార్యాలయాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేసే బోర్డుకు చట్టంలో పేర్కొన్న మేరకు బాధ్యతలను, అధికార పరిథులను నిర్ధేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, పూర్తి స్థాయిలో పని చేయించడానికి చర్యలు చేపట్టబడలేదు. పర్యవసానంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల వద్ద ఘర్షణలతో కొన్ని చేదు అనుభవాలను చవి చూడవలసి వచ్చింది.
ఈ ఏడాది తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం జలాశయానికి పై నుండి 65 టియంసిల నీళ్ళు కూడా రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్నితాత్కాలిక ప్రాతిపధికపై పరిష్కరించడానికి సమావేశాలు నిర్వహించి, త్రాగు నీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నఆరోపణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది.
Jurisdiction of Board:
Section 87: (1) The Board shall ordinarily exercise jurisdiction on Godavari and Krishna rivers
in regard to any of the projects over headworks (barrages, dams, reservoirs, regulating structures), part of canal network and transmission lines necessary to deliver water or power to the States concerned, as may be notified by the Central Government, having regard to the awards, if any, made by the Tribunals constituted under the Inter-State River Water Disputes Act, 1956.
(2) If any question arises as to whether the Board has jurisdiction under sub-section (1) over any project referred thereto, the same shall be referred to the Central Government for decision thereon.
చట్టంలో పేర్కొన్న పై బాధ్యతలను బోర్డు నిర్వర్తించడానికి అనుగుణంగా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలి.
Section 85 (8) The functions of each Board shall include––
(a) The regulation of supply of water from the projects to the successor States having regard to––
(i) Awards granted by the Tribunals constituted under the Inter-State River Water Disputes Act, 1956;
(ii) Any agreement entered into or arrangement made covering the Government of existing State of Andhra Pradesh and any other State or Union territory;
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956 ప్రకారం ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్దుబాట్లకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలని చట్టంలో పేర్కొనబడింది. ఆ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆయా నీటి సంవత్సరాలలో నీటి లభ్యతను బట్టి నీటిని విడుదల చేసే షెడ్యూల్స్ ను రూపొందించి, అమలు చేయాలి.
Section 85 (7) Each Board shall be assisted in the day to day management of reservoirs by the Central Industrial Security Force constituted under the Central Industrial Security Force Act, 1968, on such terms and conditions as the Central Government may specify.
జలాశయాల రోజు వారి నిర్వహణ నిమిత్తం బోర్డుకు సహకరించడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను ప్రత్యేకంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల చట్టం-1968 మేరకు ఏర్పాటు చేయబడతాయి. గతంలో చవి చూసిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా నివారించబడుతాయి.
Section 84 (3)(ii) planning and approval of proposals for construction of new projects, if any, based on Godavari or Krishna river water, after getting the proposal appraised and recommended by the River Management Boards and by the Central Water Commission, wherever required;
కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, బోర్డుకు నియంత్రణ అధికారాలను దఖలు పరిస్తే, పై సెక్షన్ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బోర్డు, అపెక్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా నిర్మించడం సాధ్యం కాదు. అందుకే నోటిఫికేషన్ జారీని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పక తప్పదు.
THE ELEVENTH SCHEDULE:
4. The allocations made by the River Water Tribunals with regard to various projects on Godavari and Krishna Rivers or for the regions of the existing State of Andhra Pradesh, in respect of assured water shall remain the same.
నికర జలాల కేటాయింపుకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులే శిరోధార్యమని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నది. విభజన చట్టంలో కూడా నికర జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పే ఫైనల్ అని పేర్కొన్నతరువాత కూడా లేని వివాదాన్ని దురుద్ధేశంతో లేవనెత్తి బోర్డుపై ఆరోపణలు చేయడం, నోటిఫికేషన్ జారీని అడ్డుకొనే ప్రయత్నాలు చేయడంలో ఔచిత్యం ఉన్నదా!
5. Allocations, if any, to be made on excess flows by any Tribunal in future shall be binding on both the State of Telangana and the successor State of Andhra Pradesh.
సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యం పరిష్కారమై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే, అప్పుడు మిగులు జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పే శిరోధార్యమవుతుంది. దానికి అనుగుణంగా మిగులు జలాలను వాడుకోవలసి వస్తుంది. తదనుగుణంగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తు౦ది.
7. No new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the State of Telangana or the State of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on River water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective Board, before sanction by the said Apex Council.
9. In case of non-implementation of the decision by either of the States, the defaulting State shall bear the responsibility and shall face financial and other penalties imposed by the Central Government.
అపెక్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టకూడదు. ఒక వేళ దిక్కరించి నిర్మాణానికి పూనుకొంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించే జరిమానాను చెల్లించాల్సి వస్తుందని విస్పష్టంగా పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టని తెలంగాణ ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. జూరాల జలాశయం వద్ద నుండి ప్రతిపాధించబడ్డ ఆ పథకం యొక్క సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం కోసం మాత్రమే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాజెక్టును శ్రీశైలం జలాశయం నుండి నీటిని తరలించే లక్ష్యంతో నిర్మించ తలపెట్టారు. దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం అనుమతి విధిగా తీసుకోవాలి.
10. The following irrigation projects which are under construction shall be completed as per the plan notified by the existing State of Andhra Pradesh and the water sharing arrangement shall continue as such:—
(i) Handri Niva (ii) Telugu Ganga (iii) Galeru Nagiri (iv) Venegondu (v) Kalvakurthi (vi) Nettempadu.
పాలమూరు - రంగారెడ్డి పథకం నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో లేదు. హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను మాత్రమే పదకొండవ షెడ్యూల్ లోని పదవ సంఖ్య క్రింద చేర్చారు. ఎందుకో మరి, నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి. ఈ జాబితాలో చేర్చలేదన్న విషయాన్ని కూడా గమనించాలి. ఆ ప్రాజెక్టును జాబితాలో చేర్చకపోయినా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిర్మాణంలో ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు.
పదకొండవ షెడ్యూల్ లో పేర్కొన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో ఒక్క తెలుగు గంగకు మాత్రమే మిగులు జలాల పంపిణీ పద్దులో నుండి 25 టియంసిలను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. మిగిలిన వాటికి మిగులు జలాలను కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులు లేని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి సమస్య పరిష్కారంపై విచారణ చేసి, సిఫార్సు చేయమని, విభజన చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును రెండేళ్ళు పెంచి, ఆదేశించింది. నికర జలాల కేటాయింపుపై పునర్విచారణకు ఎలాంటి అవకాశమే లేని నేపథ్యంలో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పేంత వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి బోర్డుకు అధికారాలను, బాధ్యతలను అప్పగించడానికి వీల్లేదని డిమాండ్ చేయడం అర్థరహితం, చట్ట వ్యతిరేకం.
కృష్ణా నీటి సమస్య పూర్వరంగాన్ని పరిశీలించిన వారికెవరికైనా కెసిఆర్ గారు ప్రభోదించిన 'రాజకీయ విజ్ఞతతో రెండు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకోవాలన్న ప్రతిపాదన' మాటలకు, చేతలకు పొంతనలేనిదని అర్థమవుతుంది. రాష్ట్రం విడిపోయాక నీటి విషయంలో హక్కుల పోరాటమే గానీ, సర్దుబాట్లకు అవకాశాలే లేవు. దక్షిణ తెలంగాణ, రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే చిత్తశుద్ధి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంటే గోదావరి –కృష్ణా - పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని సత్వరం చేపట్టి, యుద్ధ ప్రాతిపధికపై పూర్తి చేయాలి. ఈ పథకాన్ని నదుల అనుసంధానంలో అంతర్భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరాలి. అదొక్కటే ఏకైక పరిష్కారం మార్గం.
టి.లక్ష్మీనారాయణ