Sunday, May 31, 2015

నవ్వుల పాలౌతున్న‌ ఫిరాయింపుల నిరోధక చట్టం


తెలంగాణ శాసన మండలికి ఆరుగురు సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఫిరాయింపుల సమస్య మరొకసారి చర్చనీయాంశంగా తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ హిందూ దినపత్రికకు ఇచ్చిన‌ ప్రత్యేక ఇంటర్యూలో ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఫిరాయింపులను సమర్థించుకొన్న తీరు చూస్తే నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనం బహిర్గతమవుతున్నది. టిడిపి, కాంగ్రెస్ పార్టీల‌ ఎన్నికల గుర్తులపై గెలుపొందిన‌ శాసన సభ్యులు, అధికార పార్టీ అయిన టి.ఆర్.యస్.లోకి  ఫిరాయించడంపై స్పందనను కోరగా భారత దేశంలో ఏ ఒక్క‌ పార్టీ అయినా తమ పార్టీలో చేరడానికి సిద్ధపడి, ఫిరాయింపులకు పాల్పడ్డ‌ చట్ట సభ సభ్యులను చేర్చుకోని ఘటన ఒక్కటి చూపండని కేసిఆర్ ఎదురు ప్రశ్న వేశారు. తద్వారా ఫిరాయింపులు తప్పు కాదని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాదు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చారు. అది అనైతికమన్న భావనే వారి మాటల్లో ధ్వనించలేదు.
చట్ట సభ సభ్యుడు తాను స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఓటింగ్ లో పాల్గొన్నా ఫిరాయింపుల నిరోధక చట్టం-1985(55వ రాజ్యాంగ సవరణ) ప్రకారం సభ్యత్వం కోల్పోవాలి. ఆ చట్టానికి తరువాత కొంత కాలానికి పదవ షెడ్యూలును జత చేర్చారు. అందులో పొందు పరచబడిన మూడవ పేరా ప్రకారం పార్టీ శాసన సభాపక్షం నుండి మూడవ వంతు సభ్యులు చీలిపోతే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొనడం ద్వారా చట్టాన్ని నీరుగార్చారు. మళ్ళీ 2003లో ఆ పేరాను 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. 2004 జనవరి 1 నుండి అమలులో ఉన్న చట్టం మేరకు మాతృ పార్టీ నుండి రాజీనామా చేసినా లేదా విప్ ను దిక్కరించి ఓటింగ్ లో పాల్గొన్నా సభ్యత్వం కోల్పోవాలి. కానీ అలా జరగడం లేదు.
ఉదా: శ్రీనివాస్ యాదవ్ టిడిపి ఎన్నికల గుర్తుపై పోటీ చేసి శాసన సభ్యుడుగా ఎన్నికై టి.ఆర్.యస్.లోకి ఫిరాయించడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం, శాసన సభ‌ రికార్డుల ప్రకారం ఆయన సాంకేతికంగా నేటికీ టిడిపి సభ్యుడే. అలాగే టిడిపి నుండి మరో నలుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు శాసన సభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక చట్టు బండగా, నిరుపయోగమైన చట్టంగా మారిపోయిందనడానికి ఇంత కంటే వేరే సాక్ష్యాలు కావాలా!
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నవ్వుల పాలు చేస్తూ ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ, దేశంలోని వివిధ రాష్ట్రాలలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా బట్టలు మార్చినంత సులువుగా పార్టీలను మార్చేస్తున్నారు.
చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని, స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనదని తలెత్తుకొని చెప్పుకోగలమా! విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి.

Wednesday, May 27, 2015

మోడీ - మన్మోహన్ భేటీ మ‌తలబేంటి?


మోడీ ప్రస్తుత ప్రధాన మంత్రి, మన్మోహన్ మాజీ ప్రధాన మంత్రి. ఇరువురు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు. ఇరువురూ కార్పోరేట్ రంగానికి నిఖార్సైన ఏజెంట్లన్న భావన ప్రజల్లో నెలకొని ఉన్నది. ఆరు నూరైనా అగ్రహారం పాడైనా 2013 భూసేకరణ చట్టానికి మౌలికమైన సవరణలు చేసి తీరుతానని భీకర ప్రతిజ్ఞ చేసిన మోడీ పట్టువిడవని విక్రమార్కునిలా రెండు సార్లు ఆర్డినెన్సులు జారీ చేశారు. రెండు సార్లు ప్రతిపాదిత బిల్లును లోక్ సభ ఆమోదంరతో రాజ్యసభకు పంపారు, పెద్దల సభ అడ్డుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో సభా సంఘానికి 'రెఫర్' చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల ప్రారంభం నాటికి సభా సంఘం నుండి అనుకూలమైన నివేదికను తెప్పించుకొని పార్లమెంటు ఉభయ సభల ఆమోద ముద్ర వేయించుకోవడానికి మోడీ పావులు కదుపుతున్నారనడానికి ప్రబల నిదర్శనం మన్మోహన్ ను తేనీటి విందుకు ఆహ్వానించడమే అన్నది సుస్పష్టం.
బొగ్గు కుంభకోణంలో ఇరుక్కొని, విచారణను ఎదుర్కొ‍ంటున్న మన్మోహన్ నిర్ధోషిగా బయటపడి, మసక బారి పోయిన ప్రతిష్టను కాస్తోకూస్తో పున:ప్రతిష్టించుకోవాలన్న మనోవేద‌నలో ఆయనున్నారు. ఏడాది పాలన సంబరాలు జరుపుకొంటున్న‌ మోడీ వ్యూహాత్మకంగా తేనీటి విందుకు ఆహ్వానించగానే మన్మోహన్ రెక్కలు కట్టుకొని వాలి పోయారు. ఆర్థిక సంస్కరణల అమలు తీరు తెన్నులపై, విదేశాంగ విధానాలపై మాత్రమే వారు ముచ్చటించుకొన్నారన్న అనధికార వార్తలను ప్రచారంలో పెట్టినా, ప్రస్తుత ప్రధాన మంత్రి మరియు తాజా మాజీ ప్రధాన మంత్రి మధ్య జరిగిన సమావేశం లోగుట్టుపై సందేహాలు, అనుమానాలు రావడం సహజమే కదా!
పైపెచ్చు, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై, తీవ్రసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. మనుగడ కోసం క్రిందా మీదా పడుతున్నది. నైరాశ్యానికి గురైన రాహుల్ గాంధీ కొ‍ద్ది రోజులు సెలవుపై వెళ్ళి, తిరిగొచ్చాక మోడీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్నాడన్న ప్రచారాన్ని ప్రసారమాధ్యమాలు చేస్తున్నాయి. మోడీ ఏడాది పాలనకు సున్నా మార్కులు రాహుల్ యిస్తే! సున్నాగాడు మాట్లాడితే దానికి విలువేంటని వెంకయ్య ప్రతివిమర్శ చేశారు. ఈ పూర్వరంగంలో మన్మోహన్, మోడితో ఏకాంతంగా భేటీ అయి ముచ్చటించడం, బహిరంగంగా కాకపోయినా వ్యక్తి గతంగా అభినంధించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలను ఇవ్వదలుచుకొన్నారో! వారికే తెలియాలి.
కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా భూసేకరణ చట్టానికి ప్రతిపాదించబడిన‌ సవరణలకు భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష మద్ధతు తెలియజేసి పార్లమెంటు ఆమోదం లభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినా, బొగ్గు కుంభకోణం కేసు నుండి మోడీ ప్రత్యక్ష, పరోక్ష‌ సహకారంతో మన్మోహన్ బయట పడినా రెండు పార్టీల నిజస్వరూపం మరొకసారి బహిర్గతం అవుతుంది. మోడీ, మన్మోహన్ నిజాయితీ, విశ్వసనీయత ఏ పాటిదో కూడా వెల్లడవుతుంది. నేను ప్రధాన మంత్రిగా నా కు‍టుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ మేలు చేసే పనికి ఒడిగట్టలేదని మన్మోహన్ మోడీతో కలిసి 'టీ' త్రాగడానికి కొన్ని గంటల ముందు వాపోయారు. మోడీ పాలనతో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్నదన్న‌ ఆవేదనను కాంగ్రెస్ పార్టీ విధ్యార్థి విభాగం యన్.యస్.యు.ఐ. నిర్వహించిన సభలో మాట్లాడుతూ దేశ ప్రజలతో పంచుకొన్నారు. అంతలోనే మోడీతో ఆంతరంగిక చర్చలు జరపడం ద్వారా జాతిని వంచించడానికి రంగం సిద్ధమౌతున్నదేమోనన్న అనుమానాలు రేకెత్తడం సహజమే కాదా!

Sunday, May 17, 2015

ఆంధ్రప్రదేశ్: ప్రత్యేక హోదా



 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా' అంశంపై నేడు విస్తృత స్థాయిలో చర్చ, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశంపై 2015 మే 17న‌ గు‍ంటూరు జిల్లా ప్రోగ్రెసివ్ ఫోరమ్ సభ నిర్వహించింది. శ్రీ పి. మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ రాష్ట్ర మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు మిత్రులు చలసాని శ్రీనివాస్ గారు, నేను ప్రధాన వక్తలుగా పాల్గొన్నాము. నేను వ్రాత పూర్వకంగా అందజేసిన నా ప్రసంగ పాఠాన్ని ఆ సభలో పంణీ చేశారు. దాన్ని ముఖపుస్తక మిత్రుల దృష్టికి తీసుకొస్తే, ఆసక్తి ఉన్న మిత్రులు చదువుతారు కదా! అన్న సదుద్ధేశ‍ంతో ఫోస్ట్ చేస్తున్నాను. చదివిన మిత్రులు వారి స్పందనలు కూడా తెలియజేయమని విజ్ఞప్తి.
ఇదే అంశంపైన 16వ తేదీన ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కూడా సభ నిర్వహించబడింది. అందులో మిత్రులు చలసాని శ్రీనివాస్ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ బాలాజీ గారు, నాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
                                         ఆంధ్రప్రదేశ్: ప్రత్యేక హోదా
కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్థిక వ్యవస్థను బలమైన పునాదులపై నిర్మించుకోవడానికి ప్రత్యేక తరగతి హోదా(స్పెషల్ క్యాటగరీ స్టేటస్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పిస్తామని నాటి ప్రధాన మ‍ంత్రి డా.మన్మోహన్ సింగ్ రాజ్య‌సభలో ప్రకటించారు. ఆర్థిక వేత్త‌గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆయన ప్రత్యేక హోదాతో వనగూడే ప్రయోజనాలపై అవగాహన లేకుండానే అలా మాట్లాడారని అనుకోవాలా? ఐదేళ్ళు కాదు పదేళ్ళిస్తే తప్ప పారిశ్రామిక వర్గాలు ముందుకొచ్చి, పరిశ్రమలకు అనుమతులు పొంది, పెట్టుబడులు పెట్టి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టలేవని  వెంకయ్యనాయుడు అవగాహనారాహిత్యంతోనే నాడు మాట్లాడారా?
ప్రత్యేక హోదాకు, ప్రత్యేక తరగతి హోదాకు మధ్య తేడా ఉన్నది. పార్లమెంటులో 3/4 వ‍ంతు మెజారిటీతో ఆమోదించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ &కాశ్మీర్ కు ప్రసాదించినది 'ప్రత్యేక హోదా'. అ‍oదు వల్లనే ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది.పార్లమెంటు చేసిన చట్టాలను ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే తప్ప‌ యధాతథంగా అక్కడ అమలు కావు.
ప్రత్యేక తరగతి హోదానుజాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం మేరకు కొన్ని రాష్ట్రాలకు కల్పించబడింది. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రణాళికా నిథులను రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో భాగంగా కొన్ని కొలబద్ధల ప్రాతిపదికన మొట్టమొదట‌ 1969లో మూడు రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పించబడింది. ఆ సౌకర్యాన్ని దశల వారిగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ &కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్, మొత్తం 11 రాష్ట్రాలకు విస్తరించారు.ఆ రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను అనుభవిస్తున్నాయి.
సమాఖ్య వ్యవస్థక్రియాశీలతను పరిగణలోకి తీసుకొని ఈ విధానాన్ని పునర్నిర్వచించాలని14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అదే సందర్భంలోఈశాన్య రాష్ట్రాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వాటికి తగిన రీతిలోఆర్థికంగా చేయూత నివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సులకు స్థూలంగా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 'ప్రత్యేకతరగతిహోదా'ను కొన్ని రాష్ట్రాలకు కల్పించే విధానాన్ని కొనసాగించాలా! లేదా పునర్ వ్యవస్థీకరించాలా!, ఒక వేళ పునర్ వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వస్తే ఏ దృక్పథాన్ని అనుసరిస్తుందో భవిష్యత్తులో తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన వైఖరి తీసుకొన్నాక, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదానికి పెట్టాలి. ప్రధాన మ‍ంత్రి అధ్యక్షులుగా ఉన్న జాతీయ అభివృద్ధి మండలిలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉన్న ఆ సంస్థ సమగ్రంగా చర్చించి, ఒక విధాన నిర్ణయం చేసిన మీదటనే మార్పులు, చేర్పులు జరుగుతాయి. అంత వరకు నేడు అమలులో ఉన్న విధానమే కొన‌సాగుతుoది అన్న అంశాన్ని ముందు గమనిoచాలి. ఒకవేళ ప్రస్తుత విధానం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉన్న అడ్డంకులేమిటి? అధికారంలో ఉన్న బిజెపి, దాని మిత్రపక్షాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అంగీకరించిన తరువాత జాతీయ అభివృద్ధి మండలిలో ఆమోదం పొందడం ఎంత పని. అందుకని తప్పించుకొనే మాటలు ఎవరు మాట్లాడినా, అవి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే అన్నది సుస్పష్టం.
ప్రయోజనాలు:ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు వివిధ రూపాలలో లబ్ధి చేకూరుతున్నది. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో అమలులో ఉన్న‌ గాడ్గిల్ ముఖర్జీ నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథుల్లో 30% ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, 70% మిగిలిన రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుంది. కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సహాయం(యన్.సి.ఎ.) పద్దు క్రింద మంజూరు చేసే నిథుల్లో 90% గ్రాంటు, 10% రుణంగాను(మిగిలిన రాష్ట్రాలకు 30% గ్రాంటు,70% రుణం) అందుతుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు (సి.యస్.యస్.) ఉదా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి చట్టం,ఆహార భద్రతా చట్టం,విద్యా హక్కు చట్టం, వగైరా పథకాల అమలుకుమరియు ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఏ.-ప్రాజెక్టుల కోసం)90% గ్రాంటు, 10% రుణంగా నిథులు అందుతాయి.ప్రత్యేక కేంద్ర సాయ‍ం (ప్రాజెక్టులతో ముడి పడని) 100% గ్రాంటుక్రి‍oద లభిస్తాయి.విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకు(ఉదా: క్రిష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువఆధునీకీకరణ‌ వగైరా) కేంద్రం అదనపు సహాయం(ఎ.సి.ఏ.-ఈ.ఏ.పి.)పద్దు క్రింద‌90% గ్రాంటు,10% రుణంగా అందుతుంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకుమొత్తం రుణంగానే అందుతుంది.ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నుల్లో(ఎక్సజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇవ్వాల్సి ఉ‍oటుంది.
ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఏ.-ప్రాజెక్టుల కోసం), ప్రత్యేక కేంద్ర సాయ‍ం (ప్రాజెక్టులతో ముడి పడని)కు సంబంధించి 2015-16 వార్షిక బడ్జెట్లో విస్పష్టంగా పొందుపరచని మాట వాస్తవమే.కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులకు సంబంధించి మార్పులు చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32% నుండి 42% పెంచిన కారణంగా కొన్ని పథకాలను కేంద్రం అమలు చేసే జాబితా నుండి తొలగించి, ఆయా రాష్ట్రాల స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించుకొని అమలు చేసుకోవాలని, వాటికి చేసే కేటాయింపుల్లో కూడా మార్పులు చేసి కేంద్రo చేతులు దులుపుకొన్నది. తద్వారా రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను కుడి చేత్తో పెంచి, కొన్ని పథకాలను రాష్ట్రాల నెత్తి మీదకు తోసేయడం ద్వారా ఎడమ చేత్తో రాష్ట్రాలకు జరిగే ఆర్థిక ప్రయోజనాలనుకేంద్రం లాగేసుకొంది.ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
మాట మార్చడానికి కారణమేంటి? :పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పి‍oచాలని రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశ పెట్టిన నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శ్రీ యం. వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రిఅయిన తరువాత‌నాలుక మడత పెట్టి ప్రత్యేక హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్ కు అర్హత లేదన్నట్లు, దాని వల్ల పెద్దగా ఒగిగేదేమీ లేదన్నట్లు సంకేతాలిచ్చే విధంగా మాట్లాడడాన్ని ఏమనాలి? ప్రత్యేక హోదా కోసం ప్రయాసపడడ‍ం వృథా అని, మంత్రిత్వ శాఖల వారిగా పైరవీలు చేసుకొని నిథులను సంపాది‍oచుకోవాలని మిత్రపక్షమైన టిడిపికిబహిరంగంగానేహితబోధ కూడా చేశారు. ఆ‍oధ్రప్రదేశ్ నుండి రాజ్య‌సభకు ఎన్నుకోబడిన, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలాశీతారామన్ మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానే అభివృద్ధి జరిగిపోతుందా! ఈ రాష్ట్రానికిస్తే తమిడనాడు అభ్యంతరం చెబుతుంది కదా! అని తమిళులనుపేచీ పెట్టండన్న రీతిలో ప్రొత్సహి‍oచేలా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?  ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని మరో గుజరాత్ గా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానాలు గుప్పిoచిన‌ నరేంద్ర మోడీ గారుమాత్రం నోరు మెదపడం లేదు. తన మాటకు కట్టుబడి ఆ హామీని నెరవేర్చాలి కదా? మరికొంత కాలానికి శాసన సభ ఎన్నికలు జరగబోతున్న‌ బీహార్, పశ్చిమ బెంగాల్ పై కన్నేసి, వాటి సరసన ఆంధ్రప్రదేశ్ ను చేర్చి మూడు రాష్ట్రాల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని మరొక వైపు ప్రకటనలు చేశారు. ఈ వైఖరి అత్యంత‌ దారుణమైనది.
ప్రత్యేక హోదాకు అర్హతలేమిటి?:(1.) పర్వత ప్రాంతం, సంక్లిష్ట భూభాగం. (2.) జనసాంద్ర తక్కువగా ఉండడం, జనాభాలో గిరిజనులు గణనీయంగా ఉండడం. (3.) పొరుగు దేశాల సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రదేశంగా ఉండడం. (4.) ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉండడం. (5.) తలసరి ఆదాయం కాస్తా ఎక్కువగా ఉన్నా అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చ గలిగిన స్థితిలో వనరులు లేక పోవడం.
కాస్తా కుడి ఎడమగా ఈ అర్హతలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. 960 కి.మీ. సముద్ర తీరం ఉన్నది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియాను అమెరికా సైనిక స్థావరంగా మార్చి‍oది. దేశ భద్రత దృష్ట్యా సముద్ర తీరం వెంట కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవలసిన అనివార్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నది అందరికీ విధితమే. అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు దేశంలోకి ప్రవేశించడానికి ఒక మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. వీటన్నింటికీ మించి ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్య, వైద్య అన్ని విధాల తలమానికమైన హైదరాబాదు నుండి వేరు చేసి, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇ‍oత కంటే ప్రత్యేక హోదా పొందడానికి మ‌రొక అర్హత కావాలా?ఆ కారణంగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేసి కాంగ్రెస్ ద్రోహం చేసింది.దానికి నాడు సంపూర్ణంగా సహకరిoచిన బిజెపి నేడు అధికారంలోకి వచ్చింది. విభజన చట్టంలోని అంశాలను, రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయకుoడా దగా చేయాలని చూస్తే చరిత్ర క్షమించదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోలేదు. రాష్ట్ర విభజన దుష్పలితాలు, ముడిపడి ఉన్న సంక్లిష్టమైన సమస్యలు, ఎదురయ్యే కష్టాలపై స్థూలమైన అవగాహన ఉన్నది కాబట్టే నాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలు స్వార్థ‌ ప్రయోజనాల కోసం వికృత రాజకీయ క్రీడకు తెరలేపి, తెలుగు ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాష్ట్ర‌ విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దారు. రాజకీయ నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించారు.పర్యవసానంగాఆంధ్రప్రదేశ్తీవ్రసంక్షోభంలోపడిఆదాయం, విద్య, ఉపాథి అవకాశాలను సమకూర్చే మౌలిక సదుపాయాలు, వనరులు లేకకొట్టుమిట్టాడుతున్నది.రాష్ట్రంలోని 13 జిల్లాలలో కొన్ని నిత్య కరువు పీడిత ప్రాంతాలైతే, మిగిలినవి నిరంతరం తుఫాను పీడిత ప్రాంతాలుగా ప్రకృతి వైపరీత్యాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజానీకాన్ని ఒడ్డున పడవేసే గురుతర బాధ్యత రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలపైనే ఉన్నది.అత్యంత బాధ్యతారాహిత్యంగా, లోపభూయిష్టంగా రూపొందించబడి, అప్రజాస్వామిక పద్ధతుల్లో పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదముద్ర వేయ‌బడిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన‌ చట్టం'లోని అంశాలను, రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి చేసిన వాగ్ధానాలనన్నా తూఛా తప్ప కుండా అమలు చేయడం ద్వారా ఆ మేర‌కైనా న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వానికి, విభజనలో భాగస్వాములైన రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేస్తున్నారు.
ఏడాది అనుభవం ఏం చెబుతున్నది?:రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడుస్తున్నది. మోడీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన త‌రువాత రెండు వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టబడ్డాయి. మొదటిది పూర్తి స్థాయి బడ్జెట్ కాదని సరిపుచ్చుకొన్నా, 2015-16 వార్షిక బడ్జెట్ లో కేటాయింపులను చూశాక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నదన్న భావన సర్వత్రా నెలకొన్నది. 'అపా‍యింటెడ్ డెట్' తరువాత, మొదటి రాష్ట్ర వార్షిక‌ బడ్జెట్ రెవెన్యూ లోటును పూర్తిగా కే‍oద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు.16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నదని కేంద్రానికి మొరపెట్టుకొన్నది. ఇచ్చిందెంత? పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం చేయడం వరకు బాధ్యతగానే వ్యవహరించారు. ఆ భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే నాలుగైదేళ్ళలో పూర్తి చేస్తామని ఊదర గొడుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే రు.16,500 కోట్లకుపైగా వ్యయమయ్యే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఖర్చు చేసిన రు.3,500 కోట్లు పోగా ఇంకా రు.13,000 కోట్లు ఖర్చు చేస్తే గానీ నిర్మాణం పూర్తి కాదు. పైపెచ్చు కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం హనుమంతుని తొకలాగా పెరుగుతూనే ఉ‍oటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించింది రు.100 కోట్లు. ప్రజల్లో నిరసన వెల్లువెత్తడంతో కేటాయి‍oపును మరికొంత పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈ తరహా నిథుల కేటాయింపులతో ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో కేంద్ర‌ ప్రభుత్వలోని పెద్దలే చెప్పాలి? చట్టంలో ప్రతిపాదిoచబడిన‌ ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పే ప్రక్రియకు సంబంధించి మాత్రంప్రాథమిక చర్యలు చేబడుతున్నట్లు కొoత హడావుడి చేస్తున్నారు.
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్, కోరపుట్-బోలాంగిర్-కాలహండి(కెబికె) తరహాలో అభివృద్ధి ప్యాకేజీలను అమ‌లు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆచరణలో చేసిందేమిటి? ఈ ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు పెట్టే పెట్టుబడులపై 15%, నూతన యంత్రాల తరుగుదలపై అదనంగా 15% రాయితీ కల్పిస్తున్నట్లు, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ఏడు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంజిల్లాకు రు.50 చొప్పున, మొత్తం రు.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసి, చేతులు దులుపుకొన్నది. ఇదేనా! అభివృద్ధి ప్యాకేజీ? రాయలసీమకు నీటి సమస్యే జీవన్మరణ సమస్య. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమకు తరలించి కరువు కాటకాల నుండి శాశ్వతంగా విముక్తి చేయాలి.నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థిక సహకారాన్ని అందించాలి.పారిశ్రామికాభివృద్ధికి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజిని రూపొందించి, అమలు చేసి, సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి.
రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర‌ రాజధానికి స‍బంధించిన మౌలిక సదుపాయాల కల్పన‌ తమదే పూర్తి బాధ్యత అని చట్టంలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రు.1,000 కోట్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరహా నిథుల కేటాయింపులు, ప్రదర్శిస్తున్న వైఖరి, ఆచరణను గమనిస్తున్న వారికెవరికైనా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన మేరకైనా తన బాధ్యతగా అన్ని విధాల సహాయం చేస్తుందా! అన్న అనుమానం రాక మానదు. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నుల్లో(ఎక్సజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇస్తామని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న‌, రాజ్యసభలో ఇచ్చిన హామీలలో ఎలాంటి మినహాయింపులు లేకుండా వాటన్నింటినీ తూఛా తప్పకుండా అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని హక్కుగా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన‌ టిడిపి, బిజెపి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా అన్న డిమాండు సెంటిమెంట్ గా తయారయ్యిందని అభివర్ణించడం ద్వారా ఈ డిమాండు పట్ల వారి చిత్తశుద్ధి ఏ పాటిదో వెల్లడించుకొన్నారు.

Monday, May 11, 2015

రాజకీయం గెలిచింది ! నైతిక విలువలు అటకెక్కాయి !



అవినీతి కేసు నుండి జయలలిత బయటపడ్డారు. జయ మద్దతుదారుల ఆనందానికి అవదుల్లేవు. నీతివంతమైన, సుపరిపాలన  అన్నవి, సమకాలీన రాజకీయాల్లో చెల్లని కాసులు. అధికార బలం, బలగం ఉంటే అవినీతి కేసుల నుండి విముక్తి పొందడానికి పెద్దగా శ్రమపడాల్సిన పని లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే అన్ని పనులు వాటంతకి అవే సర్దుబాటు అయిపోతాయని మరొకసారి డంకా భజాయించి లోకానికి  చెప్పబడింది.
 తమిళనాట సొంతంగా వేళ్ళూనుకొందామని కాషాయ దళం పోయిన ఎన్నికల్లో శథవిధాల ప్రయత్ని‍ంచి విఫలమయ్యింది. జయ జయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో మాత్రం మోడీ అధికార పగ్గాలు చేబట్టారు. కానీ, రాజ్యసభలో భాజపా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నది. తన తాత్విక చింతనకు అనుగుణంగా చట్టాలను చేయడానికి రాజ్యసభలో ఆపసోపాలు పడుతున్నారు. ఉదా: భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును ప్రతిపక్షాలు ఒక్కటై అడ్డుకొంటున్నాయి. మరొక వైపు ప్రజల ఛీత్కారానికి గురైన కాంగ్రెసుకు లోక్ సభలో 10% స్థానాలు కూడా దక్కక పోవడంతో ప్రతిపక్ష స్థానం కూడా పొందలేక పోయింది. లోక్ సభలో ఉప సభాపతి స్థానానికి ప్రతిపక్షం నుండి ఒకరిని ఎన్నుకోవడం ఒక‌ సాంప్రదాయంగా వస్తున్నది. మోడీ వ్యూహలో భాగంగా ఆ స్థానానికి ఎ.ఐ.డి.యంో.కె. లోక్ సభ సభ్యులు శ్రీ యం.తంబిదురైని 2014 ఆగస్టు 13న‌ ఎన్నుకొన్నారు. తద్వారా మోడీ, జయ మధ్య అప్రకటిత రాజకీయ అనుబంధం చిగురించింది. మోడీ సర్కారుకు ఎ.ఐ.డి.యం.కె. 37 మంది సభ్యులతో మూడవ అతిపెద్ద పార్టీగా లోక్ సభలోను, 11 మంది సభ్యులతో రాజ్యసభలోను అనుకూలంగా వ్యవహరిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే 2014 సెప్టంబరులో జయ అవినీతి కేసుపై విచారణ చేసిన‌ ప్రత్యేక న్యాయ స్థానం ఆమెకు శిక్ష విధించింది. ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది. ప్రత్యేక న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమె కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ రాజకీయ పక్షాల మధ్య ఏర్పడిన అనుబంధం యొక్క ప్రభావం మన లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రత్య‌క్షంగానో, పరోక్షంగానో మిగిలిన వ్యవస్థలపైన ఎంతో కొంత మేరకు పడుతుందన్న నిప్పు లాంటి నిజాన్ని చరిత్ర ద్వారా తెలుసు కొంటూనే ఉన్నాం. తాజా కేసు దానికి మినహాయింపని ఎవరైనా భావిస్తే అప్పులో కాలేసినట్లే అవుతుందేమో!
ఎంత దుర్మార్గులైనా వారు మరణించగానే అయ్యో! పాపం అన్న సానుభూతి చూపించే  గొప్ప భారతీయ‌ సమాజంలో మనం నివసిస్తున్నాం. జయలలితకు శిక్ష పడినప్పుడు కూడా కొందరు అమాయకంగా అరే! లక్షల కోట్ల కుంభకోణాలు జరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కేవలం 66 కోట్ల అక్రమాస్తుల సంపాదనా కేసు నుండి బయటపడ లేక పోయిందే! ఒక వంద కోట్లు లంచం పడేసి తప్పించుకొని ఉండవచ్చు కదా! అన్న రీతిలో వ్యాఖ్యానాలు నాడు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోకి వచ్చాయి. అంటే నేటి సమాజం అవినీతి, అక్రమాల పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నదో గమనించవచ్చు. డి.యం.కె.అధినేత కరుణానిథి గారాలపట్టి టెలికం కుంభకోణం(2జి) కేసులో జైలు కెళ్ళివస్తే  తమిళనాట ఆమెకు లభించిన స్వాగత సత్కారాలు చూశాం. మన రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి అనుభూతులు ఉండనే ఉన్నాయి.
ఇప్పుడు అవినీతి కేసు ను‍ండి బయటపడిన జయకు కూడా తమిళనాట ఆమె మద్ధతుదారులు భ్రహ్మరథం పట్టవచ్చు. తమిళనాట జయ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బలహీనంగా ఉండడమే కాకుండా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్ననేటి రాజకీయ వాతావరణాన్ని మంచి అదునుగా భావించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమూ జయ చేయవచ్చు.
కర్నాటక హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడమే కాదు, తాను కడిగిన ముత్యం లాంటి దానినని తమిళనాడు ప్రజల నుండి తీర్పును కోరుతున్నానని జ‌య ముందస్తు ఎన్నికలకు వెళ్ళనూ వచ్చు. తద్వారా ఐదేళ్ళ పాలనా పగ్గాలను చేజిక్కించుకొనే రాజకీయ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అత్యమంగా నీతి, నియమాలు, నైతిక విలువలు నేటి సమాజంలో సమాధి కట్టబడుతున్నాయి. ఆ మేరకు ఈనాటి సమాజం నాణ్యత కోల్పోతున్నది.
 

Sunday, May 10, 2015

పునర్ వ్య‌వస్థీకరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు చెప్పకనే, చెప్పిందనిపిస్తోంది!



హైదరాబాదు హైకోర్టు ఇటీవల రెండు కీలకమైన తీర్పులను ఇచ్చి‍oది. హైకోర్టును తక్షణమే విభజించాలని దాఖలైన కేసులో 'ఆ‍ంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ భూ భాగంలో నిర్వహించడానికి చట్టం అనుమతి‍oచదని' హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర‌ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తలుపు తట్టితే 'ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి'కి ఉనికే లేదని, తెలంగాణ గడ్డపై ఉన్న స్థిర, చరాస్తులన్నీతెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయని తీర్పు చెప్పింది. గడచిన విద్యా సంవత్సరంలో వృత్తి విదా కోర్సుల ప్రవేశాలపై పొడ చూపిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే ప్రవేశాలను నిర్వహించాలని నాడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. రాష్ట్ర విభజన పర్యవసానంగా తలెత్తుతున్న ఒక్కొక్క వివాదంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు దాఖలైనప్పుడల్లా విభిన్న దృక్పథాలతో తీర్పులు వెలువడుతున్నాయని భోధపడుతున్నది.
హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల పట్ల తెలంగాణ వారు విభిన్నంగా స్పందించారు. 1. హైకోర్టు విభజనకు సంబంధించిన తీర్పు తెలంగాణ న్యాయవాదులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తీర్పిచ్చిన బెంచ్ కి నేతృత్వం వహి‍oచిన‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయితే ఆయన గౌరవార్థం సంప్రదాయకంగా నిర్వహించాల్సిన‌ వీడ్కోలు సభను కూడా నిర్వహి‍ంచలేదు. ఉమ్మడి హైకోర్టులో తమకు విశ్వాసం లేదంటూ టి.ఆర్.యస్. ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ కె.కేశవరావు తెలంగాణ కేసులను పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక‌ హైకోర్టులకు బదిలీ చేయాలన్న‌ డిమాండు కూడా తెరకైకి తెచ్చారు.
ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు కూడా అసంతృప్తి కలిగించింది. హైకోర్టును విభజించి సత్వరం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టును నెలకొల్పాలని ఆ రాష్ట్రంలోని న్యాయవాదులు ఆందోళన చేస్తుడడం అందరికీ విధితమే.
2. ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాపై చెలరేగిన వివాదంపై ఇచ్చిన తీర్పు తెలంగాణ వారికి లేని బలాన్ని సమకూర్చినట్లయ్యింది. ఆలసించిన ఆశాభ‍గం అన్న నానుడిగా శరవేగ‍ంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారు స్వాధీనం చేసుకొన్నారు.
సుప్రీం కోర్టును ఆశ్రయి‍oచాల్సిన దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టబడింది. ఈ తీర్పు ఉన్నత విద్యా మండలికే పరిమితం కాదు. దీని దుష్పరిణామాలు ఆంధ్రప్రదేశ్ అనుభవించాల్సి వస్తుంది. గోరు చుట్టపై రోకటి పోటు అన్నట్లు రాష్ట్ర విభజనతో సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ కు దీని వల్ల మరింత నష్టం వాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహ‍ం లేదు.

పార్లమెంటు ఎలాంటి చెత్త చట్టాలను చేసి ప్రజలను, వ్యవస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నదో రెండు కేసుల్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుల ద్వారా తేటతెల్లమ‌య్యింది. రెండు రాష్ట్రాల మధ్య‌ సంక్లిష్ట‌ సమస్యల కుంపటి రగిలించి, తెలుగు జాతిని రెండు ముక్కలు చేస్తూ పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం' డొల్లతనాన్ని హైకోర్టు చెప్పకనే చెప్పి‍oది. ఈ చట్టం రాజ్యా‍oగ వ్యతిరేకాంశాలతో నిండిన తప్పుల తడక అన్న భావన ప్రజల్లో మరింత బలపడేలా ఈ తీర్పులున్నాయనడంలో నిస్సందేహం. రాష్ట్రాన్ని విభజించి రాజకియ పార్టీలు పైశాచికానందం పొంది ఉండవచ్చు. కానీ, యావత్తు తెలుగు జాతిని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు.
ఒక రాష్ట్ర భూభాగంలో మరొక రాష్ట్ర హైకోర్టును అనుమతించడం కుదరదన్న హైకోర్టు విస్పష్టమైన తీర్పు, ఉమ్మడి రాజధానిగా ప్రకటించబడిన‌ హైదరాబాదు కేంద్రంగా పని చేసున్న‌ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండ‌లికి అస‌లు ఉనికే లేదని, ఆ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులు తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చె‍oదుతాయని ఇచ్చిన తీర్పుల‌తో లోపభూయిష్టమైన విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసిన‌ పార్లమెంటు ముక్కు నేలకు రాసి జాతికి క్షమాపణ చెప్పాలి
భారత రాజ్యాంగాన్నితుంగలో తొక్కి హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పదేళ్ళు కొనసాగుతుందని గడువు విధించారు. చట్టబద్ధంగా హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయిన భౌగోళికంగా భూభాగం తెలంగాణ రాష్ట్రానిదే, ఆ‍oధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ హక్కు లేదని హైకోర్టు నొక్కివక్కాణించి‍oది. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికున్న హక్కులేంటి? గౌరవ మరాదలేమిటి? అన్న ప్రశ్న ఉద్భవి‍oచడం సహజం.
ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు గడ్డపైన‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడానికే వీల్లేనప్పుడు, మరి రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం, రాష్ట్ర‌ ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు వగైరా ఏ హక్కుతో హైదరాబాదు కేంద్రంగా పని చేస్తాయి, చేస్తారు? రాజ్యాంగ‍ం, చట్టం ఎలా అనుమతిస్తాయి?
నీరు, విద్యుత్తు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి ఆస్తులు, చరాస్తుల‌ పంపిణి వగైరా అనేక సమస్యల పరిష్కారానికి ఉన్నత న్యాయస్థానాలలో కేసులు దాఖలవుతుంటే వాటి వరకే పరిమితమై ఉన్నత న్యాయస్థానాలు తీర్పులు చెబుతున్నాయి. అసలు మొత్తం చట్టమే లోపభూయిష్టమైనదని సుప్రీం కోర్టులో దాఖలైన కేసులపై తక్షణం విచారణను వేగవంతం చేసి హేతుబద్ధమైన తీర్పు చెబితే, ఒక్కసారిగా లోపాలను సరిదిద్దుకోవడానికి పార్లమె‍oటు విజ్ఞతతో ఇప్పుడైనా దృష్టి సారి‍oచడానికి దోహదపడుతుంది కదా!
ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమేంటంటే తమ రాష్ట్ర  ముఖ్యమ‍ంత్రికి ఒక విన్నపాన్ని ఫోస్టు ద్వారా పంపుకోవాలంటే చిరునామా వ్రాసేట‌ప్పుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం అని వ్రాయాలి. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదుకు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే ప్రయివేటు వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన‌ అదనపు వాహన పన్నును రద్దు చేయాలని ప్రయివేటు వాహనాల యజమానులు హైకోర్టుకు వెళితే పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. అంటే తమ రాష్ట్ర రాజధానికి వచ్చి ప్రభుత్వాధి నేతలకు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించుకోవడానికి కూడా పన్నులు చెల్లించుకోవలసిన దుర్గతి ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఏర్పడింది. పౌరులకు ఇంతకంటే అవమానకరమైన అంశం ప్రజాస్వామ్య వ్యవస్థలో మరొకటి ఉంటుందా! ఆలోచి‍oచాలి.
ఉమ్మడి రాజధాని అని చట్టంలో పేర్కొని ఆంధ్రప్రదేశ్ పౌరులను పార్లమె‍oటు దగా చేసింది. ఏ మాత్రం విజ్ఞత ప్రదర్శించకుండా రాష్ట్రాన్ని విభజించిన, విభజనను సమర్థించిన రాజకీయ పార్టీలను ఏమనాలి? వాటి స్థాయి, నాణ్యత ఏ పాటిది? సంకుచిత భావాలకు బానిసలై, అనాలోచిత నిర్ణయాలతో ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ తరహా చట్టాలను చేసే రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిథులతో నిండి పోయిన‌ పార్లమెంటు వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు జరుగుతుందనుకోవడం భ్రమే!
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నాసిరకం చట్టాలను, దుర్మార్గమైన చట్టాలను మంద బలంతో రాజకీయ పార్టీలు పార్లమెంటరీ వ్యవస్థనే అపహాస్యం చేస్తూ చట్టాలను రూపొందిస్తుంటే, ఆ లోపభూయిష్టమైన చట్టాలపై తక్షణం స్పందిoచి, ప్రభుత్వాలు గాడి తప్పకుండా కట్టడి చేయమని పౌరులు సుప్రీం కోర్టు తలుపులు తట్టినా కుంభకర్ణునిలా వ్యవహరించిన న్యాయవ్యవస్థ వల్ల ఈ దేశానికి మేలు జరుగుతుందా! అంటే సామాన్యుడికి విశ్వాసం కలగడం లేదు. లోపభూయిష్టమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని తన దృష్టికి వచ్చిన వెనువెంటనే ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి, సముచితమైన‌ తీర్పు చెప్పి ఉంటే నేడు  ఈ దుస్థితి నెలకొని ఉండేది కాదు కదా! యథారాజా తథా ప్రజ అన్న నానుడిగా పార్లమెంటు, ఉన్నత న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరు వల్ల ఈవాళ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కష్టాలు, సమస్యల కుంపటిలోకి నెట్టబడ్డారు. ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి తప్పుల తడకగా రూపొందించబడిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని లోపాలను సరిదిద్ది, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు న్యాయం చేకూర్చి, సమతుల్యమైన, సమగ్రాభివృద్ధి, ప్రగతి సాధించడంలో ఇతర రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ పడే స్థితి ఈ రెండు రాష్ట్రాలకు కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, రాజకీయ పార్టీలదే.