Friday, June 9, 2017

Studio N 'వేకువ' ముఖాముఖి

చర్చలో నాలుగు అంశాలపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలు:

1.గడచిన కొన్ని దశాబ్ధాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నలోపభూయిష్టమైన విధానాల‌ పర్యవసానంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో కూరుకపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొనే దౌర్భాగ్య పరిస్థితులు కొనసాగుతున్నాయి. పండించిన పంటకు సముచితమైన మార్కెట్ సదుపాయాలు కల్పించమని కోరుతున్న రైతులపై ప్రభుత్వాలు లాఠీలు, తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులను సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో రైతన్నల చేతులకు బేడీలు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని మాన్డ్ సౌర్ లో ఐదుగురు రైతన్నలను పోలీసు కాల్పుల్లో పొట్టన పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించాల్సిన ప్రభుత్వాలు రైతాంగంపై దమనకాండకు పూనుకోవడం తీవ్రగర్హనీయం.

రైతు రుణ మాఫీ పథకాలను అమలు చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతాయన్న‌ దోరణిలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించారు. మిగులు బడ్జెట్లున్న రాష్ట్రాలు అమలు చేసుకొంటే పర్వాలేదన్నట్లు కూడా మరో వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ పథకాలను ఏదో ఒక మేరకు పరిమితంగానైనా అమలు చేసిన నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా చర్యలకు ఉపక్రమించిందన్న వార్తలు వచ్చిన పూర్వరంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు లోటు బడ్జెట్లతోనే నెట్టుకొస్తూ, ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుకొంటూ పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి, అమలు చేసి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయడానికి రాజకీయ సంకల్పంతో పూనుకోవాలి. అందులో భాగంగా రైతు రుణ మాఫీ పథకాన్ని దేశ వ్యాపితంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

2. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల కమీషన్ నగారా మ్రోగించింది. దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడంలో ఏకాభిప్రాయ సాధనకు చొరవ చూపాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై ఉన్నది. ఇటీవల సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం అనుసరించే వైఖరి ఎలా ఉంటుందో! అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ప్రతిపాదిస్తుందో! లేదో! వేచి చూద్దామన్న వైఖరి తీసుకొన్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. దేశంలో నేడు నెలకొని ఉన్న కలుషిత వాతావరణ‍ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రజాస్వామ్యం మరియు లౌకిక విలువలను పరిరక్షించే వ్యక్తిత్వం, అంకిత భావం ఉన్న వారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్న ఆకాంక్షను దేశ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

3. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందనడానికి తాజా ఉదాహరణ‌ ఇరాన్ పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదాన్ని మతం కోణం నుండి చూసి కొందరు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఉగ్రవాదం పెనుసవాలుగా పరిణమించింది. ఉగ్రవాదుల దుశ్చర్యలకు, మారణహోమానికి పాకిస్తాన్ మొదలుకొని ఆప్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాక్, సిరియా, టర్కీ, తాజాగా ఇరాన్, అలాగే అన్నిముస్లిం దేశాలు గురౌతూనే ఉన్నాయి. ఉగ్రవాదులకు అండగా ఉందన్న కారణంగా ఖతార్ తో మిగిలిన గల్ఫ్ దేశాలు దౌత్య సంబంధాలను తెంచుకొన్నాయి. అమెరికా మొదలు ఇంగ్లండు, ప్రాన్స్, రష్యా, చైనా, భారత్, తదితర అభివృద్ధి చెందిన, చె౦దుతున్న దేశాలన్నీ ఉగ్రవాదుల దాడులతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని తుద ముట్టించే దౌత్య నీతికి అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్యత నిచ్చి, ఉగ్రవాదంపై ఉమ్మడిగా యుద్ధం ప్రకటించాలి.

4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుని కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చిన అంశం చిన్నదిగా కనిపించినప్పటికీ తీవ్రమైనదిగా పరిగణించాలి. భవన నిర్మాణం నాసిరకంగా చేశారా! లేదా! అన్నదానిపై నిశితంగా పరిశీలించుకొంటే, శాశ్వత భవనాల నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడానికి దోహదపడుతుంది. మరొక కోణంలో కూడా ప్రభుత్వం నిశిత పరిశీలన చేయాలి. భవనంపైన ఉన్న‌ డ్రైనేజీ పైపును ఎవరో కుట్ర పూరితంగా కట్ చేయడం మూలంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేయబడ్డాయి. అదే నిజమైతే కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న భవనంపైకి దుండగులు ఎలా వెళ్ళి డ్రైనేజీ పైపును కట్ చేయగలిగారు? భద్రతా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటే అదీ ప్రమాదకరమే! అందు వల్ల అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలి.


Friday, June 2, 2017

వైద్య విద్య అనారోగ్యానికి అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంపుదల పరిష్కారమా!

It was mentioned in the Governement of Andhra Pradesh, GO Ms.N0. nil dated 31-05-2017 "Due to dearth of the teaching faculty the medical education facing the problem of acute shortage of experienced medical teachers essential for running undergraduate, postgraduate and super-specialty medical courses".

1. నైపుణ్యం, నాణ్యత, అనుభవం ఉన్న అధ్యాపకుల కరవు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని  ప్రభుత్వ ఉత్తర్వు చెప్పకనే చెబుతున్నది. మరి, ప్రభుత్వం ఎంచుకొన్న పరిష్కార మార్గం ఏమిటి? అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63 కు పెంచడం ద్వారా ప్రస్తుతానికి ఉపశమనం పొందవచ్చని తలపోసింది. అసలు సమస్యకు ఇది పరిష్కారమేనా?

2. వైద్య విద్యా కళాశాలల్లో అసిస్టెంట్ట్ ప్రొఫెసర్లుగా చేరిన అనేక మంది ఒక్క ప్రమోషన్ కు కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పదవీ విరమణ చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది. మరొక వైపు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఒకేసారి ఉద్యోగంలో చేరినా, కొన్ని విభాగాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు త్వరత్వరగా ప్రమోషన్లు వచ్చి ప్రొఫెసర్లుగా అయిపోయి, తదనుగుణంగా వారికి వేతనాలు పెరుగుతాయి.  ఈ తరహా అశాస్త్రీయమైన, అసంబద్ధమైన, లోపభూయిష్టమైన ప్రమోషన్ల విధానంపై ఎందుకు ప్రభుత్వం సమీక్ష చేసుకోదు?

3. ఆయా విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయితే ప్రభుత్వం దయత‌లిచినప్పుడు అసోషియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. అసోషియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్ల భాగ్యం కలిగినప్పుడు ఏర్పడే పోస్టులకు ఆ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చే అసంబద్ధమైన విధానాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్ధాల సర్వీసు, అర్హతలు ఉన్నా ప్రమోషన్లకు నోచుకోని అసిస్టెంట్ మరియు అసోషియేట్ ప్రొఫెసర్లలో నిరాశ, నిస్పృహలు పాదుకు పోయి ఉన్నాయన్న సంగతిని ప్రభుత్వం చూడ నిరాకరిస్తున్నది. దాని ప్రభావం వారి పని విధానంపై పడుతుందనడంలో సందేహం లేదు.

4. అధ్యాపకులుగా పని చేస్తున్న‌ వారు నిరంతర విద్యార్థులుగా, పరిశోధకులుగా నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, నాణ్యమైన విద్యా బోధన, బోధనలో నైపుణ్యాన్నినిరంతరాయంగా పెంపొందించుకొన్నప్పుడే విద్యా ప్రమాణాలు కూడా వృద్ధి చెందుతాయి. అప్పుడే కళాశాలల నుండి నాణ్యమైన పట్టభద్రులు సమాజాభివృద్ధికి అందుబాటులోకి వస్తారు. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కాకపోతే సమాజానికి నష్టం వాటిల్లుతుంది. వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల్లో ఈ దృక్పథం, పని సంస్కృతి బాగా కొరవడి ఉన్నదన్న ఆందోళన సర్వత్రా నెలకొని ఉన్నది.

5. వైద్య విద్యా రంగంలో ప్రమాణాల అభివృద్ధికి కృషి చేయాల్సిన యన్.టి.ఆర్. వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పనితనం అత్యంత నాసిరకంగా ఉన్నా పట్టించుకొనే వారే కరవైనారు. అది పేరుకే విశ్వవిద్యాలయం. పతనమౌతున్న వైద్య విద్యా ప్రమాణాల పట్ల సమాజం ఆందోళన చెందుతున్నా విశ్వవిద్యాలయానికి మాత్రం ఈ విషయంలో చీమ కుట్టినట్లు కూడా లేదనిపిస్తోంది. విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించాలని కానీ, ప్రోత్సహించాలని కానీ విశ్వవిద్యాలయం ఆలోచించిన పాపానా పోయినట్లు కనబడదు. పైపెచ్చు నిరుత్సాహ పరిచే వాతావరణం ఉన్నది. పి.హెచ్.డి. చేయాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, గైడ్ చేసే గైడ్స్ లేని దుస్థితి పట్ల దృష్టి సారించాలనే ఆసక్తి విశ్వవిద్యాలయానికి గానీ, డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ కు గానీ, ప్రభుత్వానికి గానీ ఉన్న దాఖలాలు లేవు.

6. ఘనమైన దశాబ్ధాల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల‌ లాంటివి రాష్ట్రంలో ఉన్నా, ఒక్క కళాశాల కూడా దేశంలో పేరు గాంచిన వైద్య కళాశాలల సరసన నిలబడ గలిగే స్థితికి ఎదగక లేక పోవడానికి ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు కారణం కాదా! లోతుగా ఆలోచించుకోవాలి.

7. ప్రభుత్వ మరియు ప్రయివేటు వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఉన్నదా? నాణ్యత, నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల కొరత ఉన్నదని మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనమేంటి? కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సంతృప్తి పరచడానికే అన్నట్లు పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా కొద్ది మంది అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను మరో మూడేళ్ళ పాటు వినియోగించుకోగలరు. అటు తరువాత?

8. పదవీ విరమణ వయస్సును పెంచడంతో ప్రమోషన్లకు నోచుకోని అధ్యాపకుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోదా?

9. యు.జి.సి. తరహా వేతనాలను మాత్రం ఇస్తారు. యు.జి.సి. అమలు చేస్తున్న ప్రమోషన్ల (టైం బౌండ్) విధానాన్నిమాత్రం అమలు చేయరు. అలాగే, వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత సమస్య నుండి బయటపడడానికి వైద్య‌, ఆరోగ్య శాఖ పరిథిలోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏరియా మరియు జిల్లా ఆసుపత్రుల్లో పని చేస్తున్నడాక్టర్లను తీసుకొచ్చి అధ్యాపకులుగా నియమిస్తున్నారు. ప్రమోషన్స్ అంశం వచ్చే సరికి అధ్యాపకులుగా పని చేసిన సర్వీసును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న యు.జి.సి. నిబంధనను అమలు చేస్తున్నారు. ఇదెక్కడి నీతి, న్యాయం? ఒకవైపున లోప భూయిష్టమైన ప్రమోషన్ల విధానాన్ని అమలు చేస్తూ మరొక వైపున అనుభవం ఉన్న అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నామని ఏడ్వడంలో అర్థం ఉన్నదా! ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, స్పందించాలి.

10. పోస్ట్ గ్రాడ్యుయేట్(పి.జి.) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు మాత్రమే వర్తింపజేస్తూ పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా నూతనంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు ఉద్యోగావకాశాలను లేకుండా చేసినట్లు కాదా?

11. వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య పెరుగుదల నిష్పత్తికి అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోషియేట్  ప్రొఫెసర్ల, ప్రొఫెసర్ల సంఖ్యను పెంచడం ద్వారా అధ్యాపక, విద్యార్థి నిష్పత్తిని శాస్త్రీయంగా ఉండేలా చూసినప్పుడే వైద్య విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి దోహదపడుతుంది.

12. వైద్య విద్యా ప్రమాణాల పెంపుదలకు దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళికను ప్రభుత్వం సత్వరం రూపొందించాలి. రాజకీయ సంకల్పంతో అమలుకు పూనుకోవాలి. సంక్షోభంలో ఉన్న వైద్య విద్యా వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడానికి, ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత చర్యలు చేపడుతుందని ఆశిద్ధాం!

టి.లక్ష్మీనారాయణ‌
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు

గమనిక: దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు 'ఎపి సియం కనెక్ట్' ఆఫ్ లోను, వైద్య ఆరోగ్య శాఖామాత్యుల వాట్స్ ఆఫ్ లోను, ప్రసార మాధ్యమాల్లో పని చేస్తున్న పాత్రికేయ మిత్రులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల వాట్స్ ఆఫ్ లో పోస్ట్ చేస్తున్నాను.