Wednesday, March 26, 2014

అంపశయ్యపై కాంగ్రెస్‌




నేత ఫిరాయింపులు, పార్టీల కలయికలు
„ద శాబ్దం పాలన తర్వాత కాంగ్రెస్‌ కుదేలు
ఐక్య ప్రగతిశీల కూటమి కకావికలు
జారుకుంటున్న యుపిఎ పక్షాలు
ప్రాంతీయ పార్టీలు హస్తానికి దూరం
పొత్తులకోసం ముందుకు రాని కొత్త మిత్రులు
సీమాంధ్రలో అభ్యర్ధులే దొరకని దుస్థితి
తెలంగాణ- సీమాంధ్రల్లో కూలిన కోటలు


పదహారవ లోక్‌ సభకు, మన రాష్ట్రంతో పాటు నాలుగు రాషా్టల్ర శాసన సభల ఎన్నికల నిర్వహణకు దశల వారీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కొనసాగుతున్నది. అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీలు, వ్యక్తులు సిద్ధాంతాలను ప్రక్కకు నెట్టి కలయిలకు సై అంటే సై అనేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావహులు గెలుపు గుర్రాలుగా కనిపిస్తున్న పార్టీలలోకి జంప్‌ చేసేస్తున్నారు. మన రాష్ట్రంలోనైతే పిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరి ముఖాన మరొకరు ఉమ్మేసుకొన్న వారు, ఆ మరకలను పార్టీల జెండాలతో తుడిపేసుకొని, చిరునవ్వులతో కౌగలించుకొంటు న్నారు. ముక్కున వేలేసుకొని నివ్వెరపోవడం ప్రజల వంతయ్యింది. గెలుపే కొలబద్దగా రాజకీయ శక్తుల పునరేకీకరణ, విచ్ఛిన్నం రెండూ నిత్యనూతనంగా సాగిపోతున్నా యి. దశాబ్దం పాటు కేంద్రంలోను, మన రాష్ట్రం లోను అధికారాన్ని వెలగబెట్టి ప్రజాగ్రహానికి గురెన కాంగ్రెస్‌ పార్టీ డీలా పడింది. కాంగ్రెస్‌ నేతృత్వం లోని ప్రగతిశీల ఐక్య కూటమి (యుపిఎ) కకా వికలయ్యింది. మిగిలిన రాజ కీయ పార్టీలు ఎన్నికల సమ రంలో అన్నిరకా ల అస్త్ర శసా్తల్ర ను వినియోగిం చడానికి సన్నద్ధమైనాయి. ప్రసారమాధ్యమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌ షోల ద్వారా ప్రచార హోరు మొదలయ్యింది.

అరచేతిలో స్వర్గం చూపెట్టే నైపుణ్యాన్ని బాగా వంటబట్టించుకొన్న నాయకులు తమ నాలుకలకు బాగా పదును పెట్టారు. ప్రత్యర్థులను నైతికంగా కృంగదీసి దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొంత మంది నోళ్ళు అదుపు తప్పుతున్నాయి. దూషణ పర్వం కొనసాగుతున్నది. వేసవి వడగాల్పులతో పాటు ఎన్నికల వేడితో ప్రజల బురల్రు వేడెక్కుతున్నాయి. ఎవరి మాట నమ్మాలో, ఏ పార్టీని విశ్వసించాలో, ఎవరికి ఓటేసి, ఏ పార్టీని గద్దెనెక్కిస్తే తమ జీవితాలకు ఊరటనిచ్చే ఆర్థిక, రాజకీయ విధానాలను అమలుచేస్తారో పాలుపోక ప్రజలు తలలు బాదుకుంటున్నారు. కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం వంటి ఆయుధాలతో, మాయమాటలు, నయవంచనలు, పాదాభివందనాలు వంటి నయవంచనలతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పడరాని పాట్లు పడుతున్నారు. బెల్లమున్న చోటికే ఈగలు చేరతాయన్న నానుడిగా అధికారానికి చేరువగా ఉన్నాయని తలపోస్తున్న పార్టీల వైపు నాయకులు ఉరకలు, పరుగులు తీస్తూ, సీట్లను అందిపుచ్చుకోవడానికి అర్రులు చాస్తున్నారు. ఎన్నికల సందర్భంలో పార్టీ ఫిరాయింపులు అనైతికమన్నది ఒకనాటి నానుడి. ప్రజలకు సేవ చేయాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందనేది నేటితరం నేతల ఉవాచ. పైపెచ్చు ప్రజలు, తమ కార్యకర్తల అభిప్రాయాల మేరకే నడుచుకొంటున్నామని ముక్తాయింపిస్తున్నారు. నైతిక విలువలకు- విలువే లేదని చెప్పకనే చెబుతున్నారు. కాలం మారింది, కాలంతో పాటు మారితేనే రాజకీయ మనుగడ, అప్పుడే ప్రజలకు సేవ చేయగలమనే భాష్యాలు చెబుతూ- ఎన్ని వేషాలైనా వేయవచ్చనే అవకాశవాద భావజాలం ఊపందుకొన్నది. రాజకీయ, సైద్ధాంతిక వైరుధ్యాలున్నా- ఉన్న పార్టీల్లోనే బానిసలుగా పడి ఉండాలనేది నేటి అధిష్ఠానాల హుకుం.

ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణకు సైతం ఊతం ఇవ్వలేని పరిస్థితులు నేటి రాజకీయ రంగంలో నెలకొని ఉన్నాయి. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. తెలుగు జాతిని ముక్కలు చేసి- కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్రలో తన గోతిని తానే తవ్వుకొన్నది. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార పోరులో జబ్బలు చరుచుకొంటున్న రెండు ప్రధాన ప్రాంతీయపార్టీల్లో ఏదో ఒక పంచన చేరిపోతున్నారు. కేవలం పదవీకాంక్ష, స్వార్థ చింతనతో ఎన్నికల సందర్భంలో జరిగే పార్టీల ఫిరాయింపులను ప్రజలు ఆహ్వానించరాదు.
ఈ నేపథ్యంలో దేశ వ్యాపితంగా జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పూర్తిగా నీరుగారి పోకుండా నైతిక సై్థర్యాన్ని నింపడం కోసమన్నట్లు, భావి ప్రధానిగా కాంగ్రెస్‌ శ్రేణుల కీర్తనలు అందుకుంటున్న రాహుల్‌ గాంధీ- 2009 నాటి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయని గ్రహించిన నేతలు ప్రజా వ్యతిరేక వెల్లువలో కొట్టుకపోతామనే నిర్ధారణకొచ్చి పోటీ చేయలేమని పలాయనం చిత్తగిస్తున్నారు. కొత్తవారికి తర్పీదు ఇచ్చే ఎన్నికలుగా ఈ ఎన్నికలను భావించి యువతను అభ్యర్థులుగా రంగంలోకి దించాలని కేంద్ర మంత్రివర్యులు చిదంబరం సెలవిచ్చి, తన కుమారునికి పోటీ చేసే అవకాశం కల్పించారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి దేశ వ్యాపితంగా ప్రతికూల గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిథి కూడా అయిన్‌ పి.సి. చాకో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రివర్యులు, రాజకీయాల్లో తలపండిన శరద్‌ పవార్‌ మాత్రం యు.పి.ఎ.కి ఈ దఫా అధికారం కల్లే అని విస్పష్టంగా ప్రకటించి రాహుల్‌ ఆశలపై చన్నీళ్ళు చల్లారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాజకీయాల్లో ఆరితేరిన ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్‌ పార్టీ దరిచేరడానికి సాహసిస్తాయా! కొత్త స్నేహితుల మాట అటుంచి, పాత మిత్రులు ఒక్కొక్కరే చేతికి గుడ్‌ బై చెప్పి సొంత దారులు వెతుక్కొన్నారు. యు.పి.ఎ- 2లో భాగస్వాములైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నిష్క్రమణతో మొదలైన ఈ ప్రక్రియ డి.యం.కె.తో తుది దశకు చేరుకొంది. బయటి నుండి వెన్నుదన్నుగా నిలిచి ఐదేళ్ళ పాలనకు కొండంత అండగా నిలిచిన సమాజవాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ ప్రత్యర్థులుగా కత్తులు నూరుతున్నాయి. లోక్‌ జనశక్తి పార్టీ చెయ్యి వదిలేసి కమలాన్ని ఆశ్రయించింది. రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ వెంటే ఉన్నా, బీహార్‌ లో లోక్‌ సభ స్థానాల పంపకంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించారు. ఆర్‌.జె.డి.తో పాటు నేషలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్‌‌స కాంగ్రెస్‌ కు స్నేహితులుగా విధిలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. కేరళ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ లాంటి చిన్నా చితకా పార్టీలు మినహా స్వతంత్ర బలం ఉన్న పార్టీలేవీ కాంగ్రెస్‌తో అంటకాగడానికి సిద్ధంగా లేవు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రిఫైనల్‌గా భావించిన ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ (గత లోక్‌ సభ ఎన్నికల్లో 206 స్థానాల్లో గెలుపొందింది) ఈ ఎన్నికల్లో వంద స్థానాలనైనా నిలబెట్టుకొంటుందా- అన్న అనుమానాలు బలపడుతుండడంతో దాని పరిస్థితి దయనీయంగా తయారయింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని చేజిక్కించకోవడంలో ముఖ్య భూమిక పోషించింది ఆంధ్రప్రదేశ్‌. ఇక్కడ 2009 ఎన్నికల్లో 33 పార్లమెంట్‌ స్థానాలలో విజయబావుటా ఎగురవేసింది. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం రాష్ట్ర విభజనలో అనుసరించిన నిరంకుశ వైఖరితో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నేడు ఆ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాని దుస్థితిలో లోక్‌ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థులు దొరకడం దుర్లభం. ప్రస్తుత లోక్‌ సభ సభ్యుల్లో ఏడుగురే మిగిలారు. 12 మంది లోక్‌ సభ సభ్యులు వివిధ దశల్లో కాంగ్రెస్‌ను వీడారు. ఇంకా ఒకరిద్దరు ప్రక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీచేసి, కోట్ల రూపాయలు తగలబెట్టి సాధించేదేమిటి అన్న మీమాంసలో పార్టీ నేతలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఎంపీ కనుమూరి బాపిరాజు చెప్పడమంటే అర్థం- ఇప్పుడు ఓటమి ఖాయమని ఒప్పేసుకొన్నట్లేనని పలువురు కాంగ్రెస్‌ వాదులు భావిస్తున్నారు.

పి.సి.సి. నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి- ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఔత్సాహికులు ఎవరైనా ముందుకొస్తే కాంగ్రెస్‌ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తామని బహిరంగంగా బంపర్‌ ఆపర్‌ ఇచ్చినా స్పందన కరవయ్యింది. తెలంగాణ రాషా్టన్న్రి ప్రసాదించాం, తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో కలిపేయండని కె.సి.ఆర్‌. వెంటబడిన కాంగ్రెస్‌కు తీవ్రనిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన కె.సి.ఆర్‌. తన విస్వరూపాన్ని ప్రదర్శించి ఎన్నికల పొత్తు కూడా ఉండదని తేల్చేసి, తెలంగాణలో ఎన్నికలపోరు తెరాస- కాంగ్రెస్‌ మధ్యనే ప్రధానంగా ఉంటుందని ప్రకటించడంతో కాంగ్రెస్‌ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఎన్నికల తదనంతరం యు.పి.ఎ. కి మద్దతునిస్తామని కె.సి.ఆర్‌. మాటవరసకు చెప్పినా దానిని నమ్మే స్థితిలో మాత్రం ఎవరూ లేరు. తద్వారా దక్షిణాదిన బలమైన పునాదులున్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కోటలు కూలిపోయాయి. తమిళనాట డియంకె దూరం కావడంతో కాంగ్రెస్‌ పీకల్లోతు కష్టాల్లో ఉన్నది. అధికారంలో ఉన్న కేరళలో ముఖ్యమంత్రిపైనే వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై వామపక్ష కూటమి నాయకత్వంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన పూర్వరంగంలో కాంగ్రెస్‌ గడ్డు స్థితిలో ఉన్నది. కాకపోతే సిపిఐ(యం) ఆధిపత్య దోరణి ప్రదర్శిస్తున్నదని ఆరోపించి వామపక్ష ప్రజాతంత్ర కూటమి వ్యవస్థాపక పార్టీల్లో ఒకటైన రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ లో చేరడం వారిని సంతోషపరుస్తోంది. కర్ణాటకలో 2009లో 28 స్థానాలకుగాను కేవలం ఆరింటినే పొందగలిగింది.

తరువాత 2013లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అవినీతి ఊబిలో కూరుకు పోయిన భాజపాను ఓడించి అధికారంలోకి వచ్చింది. దక్షిణాదిన ఆ పార్టీని ఇది కాస్త ఊరడినిస్తున్న అంశం. యడ్డూరప్ప, శ్రీరాములు వంటి భాజపా నేతలు సొంత కుంపట్లు పెట్టుకోవడం కూడా నాడు కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడింది. మళ్ళీ వారు సొంత గూటికి చేరిపోయారు. కుల సమీకరణలు కూడా కొంత వరకు ప్రభావితం చేయగల ఆ రాష్ట్రంలో రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఏ మేరకు కాంగ్రెస్‌ నెట్టుకు రాగలదో చూడాలి. గుండెకాయ వంటి ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్‌ అత్యంత దయనీయమైన దుస్థితికిలో పడింది. ఈ సువిశాల ప్రాంతంలో 180 స్థానాలుంటే 2009 ఎన్నికల్లో 86 స్థానాల్లో విజయం పొందింది. నేటి పరిస్థితిని పరిశీలిస్తే వాటిలో నాలుగవ వంతు స్థానాలనైనా నిలబెట్టుకోగలదా అన్న సంశయం కలుగుతున్నది. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో 25 కు 20, డిల్లీలో 7కు 7, హర్యానాలో 10 కి 9, ఉత్తరాఖండ్‌ లో 5 కు 5, మధ్యప్రదేశ్‌ లో 29 కి 12, యు.పి.లో 80 కి 21, పంజాబ్‌ లో 13 కు 8 గెలుపొందింది. నేడా పరిస్థితి లేదు. భాజపా గుజరాత్‌లో అధికారాన్ని పదిల పరుచుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాషా్టల్ల్రో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా రాజస్థాన్‌ పీఠాన్ని కైవసం చేసుకొన్నది. దాని మిత్రపక్షం అకాళీదళ్‌ పంజాబ్‌ లో పాగా వేసింది. ఈ రాషా్టల్రతో పాటు తామే అధికారంలో ఉండి అభాసుపాలైన హర్యానా, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాషా్టల్ల్రో బి.జె.పి.ని- అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ ఎదురొడ్డి నిలవడం దుస్సాధ్యంగా కనబడుతున్నది.

ఇటీవలే అవమానకరమైన ఓటమిని చవిచూసిన దేశ రాజధానిలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపాల మధ్యే సంకుల సమరం జరుగబోతున్నదన్న వాతావరణంలో కాంగ్రెస్‌ ఊసెత్తే వారే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పునరావాసం కింద కేరళ గవర్నర్‌ గా పంపిచేశారు.
తూర్పు భారత దేశంలో 118 స్థానాలుంటే 15వ లోక్‌ సభ ఎన్నికల్లో కేవలం 15 స్థానాల్లోనే గెలిచింది. అందులో ఆరింటిని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడ్పాటుతో సాధించుకొన్నది. ఈ దఫా మమతా బెనర్జీ బయటికి గెంటి వేయడంతో 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌, అలాగే 21 స్థానాలున్న ఒడిశాలో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నది. నలబై స్థానాలతో మరొక పెద్ద రాష్టమ్రైన్‌ బీహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, ఆయన కేటాయించిన పన్నెండు స్థానాలకే పరిమితమై పోటీ చేయాల్సిన దుస్థితి. పోయిన ఎన్నికల్లో రెండింటిలోనే గెలిచిన కాంగ్రెసుకు ఇప్పుడు అంతకంటే మెరుగైన అవకాశాలు లేవన్నది స్పష్టం. 14 స్థానాలునాలు ఉన్న జార్ఖండ్‌ పరిస్థితీ అంతే. అప్రతిష్ఠపాలైన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్‌.జె.డి.పైన ఆధారపడే నెట్టుకు రావాలి. ఈశాన్య భారత దేశంలో 24 స్థానాలుంటే 2009 ఎన్నికల్లో 13లో గెలిచిన కాంగ్రెస్‌ అస్సాం, మణిపూర్‌లలో మునుపటి ఫలితాలు పొందడానికి ఆపసోపాలు పడవలసిందే. సెవన్‌ సిస్టర్‌‌సగా పిలిచే ఆ రాషా్టల్ల్రో బలంగా వేళ్ళూనికొని ఉన్న అస్సాం గణపరిషత్‌, నాగాలాండ్‌ పీపుల్‌‌స ప్రంట్‌, మిజో నేషనల్‌ ప్రంట్‌, సిక్కిం డెమోక్రటిక్‌ ప్రంట్‌, మణిపూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వంటి పది ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. త్రిపురలో సిపిఐ (యం) తిరుగులేని శక్తిగా ఉన్నది.

పశ్చిమ భారతాన ఉన్న 78 స్థానాల్లో కాంగ్రెస్‌ 29 మాత్రమే గెలిచింది. దాని మిత్రపక్షం శరద్‌ పవర్‌ నాయకత్వంలోని నేషనలిస్‌‌ట కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిదింటిలో గెలిచింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కేంద్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాలకు తోడు ఆదర్‌‌శ కుంభకోణంతో అభాసుపాలైన్‌ మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ నిర్వాకం పర్యవసానంగా 48 స్థానాల్లో ఎన్నింటిని నిలుపుకోగలదో! భాజపా, శివసేన కూటమితో పాటు ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉన్నది. ముంబాయిలో ఉన్న ఆరు స్థానాలను గతంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఢిల్లీ శాసనసభ ఫలితాల ప్రభావం పడ్డ మహానగరాలలో ముంబాయి ముందు వరసలో ఉన్నదన్న వార్తల మధ్య కాంగ్రెసు గడ్డు పరిస్థితిని ఆ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. గుజరాత్‌లో భాజపా స్థానం పదిలం కావడంతో పాటు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థి కావడంతో 26 స్థానాలున్న ఆ రాష్ట్రంలో గతంలో సాధించుకొన్న 11 నిలబెట్టుకోవడం దుర్లభమే!

మూలిగే నక్కపై తాటి కాయపడ్డ నానుడిగా కాంగ్రెసు రానున్న ఎన్నికల్లో 70-80 స్థానాలకే పరిమితమవుతుందని పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలిపోవడంతో ఆ పార్టీ మరింత జావగారి పోయిందనే చెప్పవచ్చు. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ శ్రేణులు చేజారి పోకుండా పెనుగులాడుతున్నది. 2009 ఎన్నికల్లో లాగా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు మృగ్యమయిపోయాయని రూఢిగా తెలిసినా- భాజపా ప్రత్యర్థి పార్టీల్లో కాంగ్రెస్‌ మాత్రమే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, తమను కాదని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని బలంగా విశ్వసిస్తున్నది. అదొక్కటే కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా మిణుగు మిణుగు మంటున్న ఆశ.

Tuesday, March 11, 2014

పదవుల వేటలో నేతలు - నిర్వేదంలో జనం

March 12, 2014   సూర్య దినపత్రిక
అధికారాన్ని చెరబట్టే పనిలో పెద్ద పార్టీలు
ప్రాతినిథ్యం కోసం చిన్న పార్టీల ఆరాటం
అవకాశాలకోసం నేతల కప్పదాట్లు
భవిష్యత్తుపై ఆశతో కొత్త పార్టీలు
రాష్ట్రంలో మూడేళ్ళుగా అనిశ్చితి
కుదిపిన విభజన, సమైక్య ఉద్యమాలు
రాష్ట్ర రాజకీయాలు అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అధికారాన్ని చెర బట్టే పనిలో పడ్డాయి. చిన్న మధ్య తరహా పార్టీలు చట్టసభల్లో ప్రాతినిథ్యం కోసం పోరు చేయడానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయంగా అభద్రతా భావంలో ఉన్న కాంగ్రెస్‌, తెదెపా నాయకులు కప్పదాట్లకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. ప్రజల మనోభావాలను సొమ్ము చేసుకో వాలనే ఆరాటంలో పార్టీలున్నాయి. ప్రజల నిజ జీవితాలపై ప్రభావం కలిగించే అంశాలు మాత్రం ఎన్నికల అజెండాగా రూపొందే అవకాశాలు కనపడడం లేదు. గడచిన ఐదేళ్ళుగా కేంద్రంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.పి.ఎ.-2 ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వెన్ను విరిచాయి. అవినీతి అందలమెక్కి, దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా అథఃపాతాళానికి కూరుకుపోయింది. మన రాష్ట్రంలో అయితే అసలు ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానాల మధ్య కాలం గడచి పోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, సమైక్యాంధ్ర పరిరక్షణ నినాదాలతో ఇటు అటు ఉద్యమాల వేడితో తెలుగు నేల అట్టుడికి పోయింది. మంత్రి మండలి సమష్ఠిగా పని చేయలేదు. చట్ట సభలైన్‌ శాసన సభ, శాసన మండలి సమావేశాలను సహితం సజావుగా నిర్వహించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఐదేళ్ళు గతించాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ గాడితప్పాయి. ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా పనిచేసే విద్యుత్‌ శాఖకు మంత్రివర్యులు లేకుండానే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ప్రజలు మౌలిక సమస్యలతోనే కాదు, దైనందిన, తక్షణ సమస్యలకు సైతం ఉపశమనం లభించక తల్లడిల్లి పోతున్నారు. ఈ విచిత్ర పరిస్థితి నడుమ పురపాలక, నగర పాలక సంస్థలకు, లోక్‌ సభ, శాసన సభకు ఏక కాలంలో ఎన్నికల ప్రకటనలు ముంచుకొచ్చాయి. గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లు యం.పి.టి.సి.- జెడ్‌.పి.టి.సి. ఎన్నికలను కూడా నిర్వహించి తీరాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం హుకుం జారీ చేసింది. నేడు తెలుగు జాతి ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఒకవైపున ఎన్నికలు, మరొక వైపున రాష్ట్ర విభజనలో కీలకమైన పంపకాల ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో, అచేతనావస్థలో ఉన్నారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న నానుడిగా రాజకీయ పార్టీల తీరు తెన్నులున్నాయి. రాష్ట్ర విభజనాంశం రాజకీయ పార్టీ డొల్లతనాన్ని, దివాలాకోరు తనాన్ని బట్టబయలు చేసింది. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధపడి ప్రదర్శిస్తున్న విన్యాసాలు ప్రజలకు జుగుప్సాకరంగా ఉన్నాయి.వే సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగు జాతి- నైజాం నవాబుల ప్రజా కంటక పాలనలో, తెల్లదొరల పాశవిక పాలనా కాలంలో ముక్క చెక్కలై దుర్భర జీవితం గడిపింది. సమగ్రాభివృద్ధి సాధించడానికి యావత్తు తెలుగు జాతి ఒకే పరిపాలనా వ్యవస్థ కింద ఉండాలనే మహదాశయంతో ఇరవైవ శతాబ్దం తొలినాళ్ళలో నాటి తరం ప్రారంభించిన ఉద్యమం, దశాబ్దాల సమరశీల పోరాటాలు, అపార త్యాగాలతో తెలుగు జాతి ఆశాసౌధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1956 నవంబరు 1న ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఎన్నో ఒడుదుడుకులు, సమస్యలు, అడపా దడపా విచ్ఛిన్నకర ఆందోళనల మధ్య దాదాపు ఆరు దశాబ్దాల పాటు కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబంగా జీవనం సాగిస్తూ, పురోగమిస్తున్న తెలుగు జాతిలో దురదృష్టవశాత్తు విభేదాలు పొడచూపాయి. అవకాశవాదం, స్వార్థ రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు, కడకు- కండ బలం పైచేయి సాధించాయి. రాజ్యాంగ స్ఫూర్తి మంట గలిచింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడం జరిగిపోయింది. పార్లమెంటు ప్రతిష్ఠకు తీవ్ర కళంకం తెచ్చిపెట్టిన గొడవలు, తీవ్ర నిరసనల హోరు మధ్య భిన్నధృవాలుగా ఉన్న పాలక పార్టీ అయిన కాంగ్రెస్‌- ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిజెపి నిస్సిగ్గుగా ఒక్కటై రాషా్టన్న్రి రెండు ముక్కలు చేయాలన్న బిల్లుకు మూజువాణి ఓటుతో ప్రాణం పోశాయి. స్వాతంత్య్రానంతర కాలంలో రాషా్టల్ర పునర్వ్యవస్థీకరణ నిమిత్తం ఏర్పడిన మొదటి కమిషన్‌ సిఫార్సు మేరకు ఆవిర్భవించిన ప్రథమ భాషా ప్రయుక్త రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయంతో- మిగిలిన భాషా ప్రయుక్త రాషా్టల్ర విభజనకు తెరƒలేచింది. ఆ రెండు పార్టీలపై అత్యధిక తెలుగు ప్రజానీకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికిన పూర్వరంగంలోనే ప్రస్తుత ఎన్నికల సమరం ప్రారంభమయ్యింది. ఆ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు మళ్ళీ ప్రత్యర్థులుగా కత్తులు నూరుకొంటున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో ఆందోళనలకు నాయకత్వం వహించిన పార్టీలు, పోటీలు పడి మద్దతు పలికిన పార్టీలు, పచ్చి అవకాశవాద వైఖరి ప్రదర్శించి చతికిలబడ్డ జాతీయ, ప్రాంతీయ పార్టీలు- ఈ ఎన్నికల వేళ ప్రజలను వంచించడానికి రోడ్డెక్కాయి. తమ సోనియమ్మే రాషా్టన్న్రిచ్చిందని కాంగ్రెస్‌, తాము లేకపోతే రాష్ట్రం వచ్చేదే కాదని బి.జె.పి., తానే రాషా్టన్న్రి సాధించానని కె.సి.ఆర్‌., మా నాయకుడు ఉత్తరం ఇవ్వబట్టే రాష్ట్రం వచ్చిందని తెదేపా- తెలంగాణ ప్రాంతంలో సిగపట్లు పట్టుకొంటున్నాయి.
తెరాసా విలీనంతో ఈ ఎన్నికలలో సునాయాసంగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవచ్చని కలలు గన్న కథ అడ్డం తిరగడంతో కాంగ్రెస్‌ పరిస్థితి- కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే, తెలంగాణ రాష్ట్ర సాధన అంశాన్నే పెద్ద ఎత్తున మార్కెట్‌ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని, అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని ఇప్పుడు వివిధ పార్టీలు విఫలయత్నం చేస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్ర విభజనను ప్రతిఘటిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా లెక్కలేనితనంతో వ్యవహరించి, తెలుగు జాతిని అడ్డగోలుగా ముక్కలు చేసిన హేయమైన చర్యను జీర్ణించుకోలేని వాతావరణం ఆ ప్రాంతంలో ఉన్నది. ప్రజలు నిరాశ నిస్పృహలతో రాజకీయ పార్టీలపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. కాకమీదున్న ప్రజలను వంచనతో మభ్యపెట్టాలనే కుటిల నీతితో కాంగ్రెస్‌, బి.జె.పి. రెండూ ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడుగా ఉండి, రాష్ట్ర విభజనలో క్రియాశీలక పాత్ర పోషించిన జయరాం రమేష్‌- ప్రజాగ్రహాన్ని చవిచూస్తూనే, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ, విభజనకు తానూ వ్యతిరేకినేనని, సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ప్రకటించామని మభ్యపెట్టే మాటలతో సీమాంధ్ర ప్రజలను వంచింప చూస్తున్నారు. తాను రాజ్యసభలో నిల్చోవడంవల్లనే ఆ మాత్రం ప్యాకేజీఅయినా వచ్చిందని, వెనుకబడ్డ రాయలసీమ కడగండ్లను అసలు పట్టించుకోలేదని బి.జె.పి. నాయకుడు వెంకయ్య నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. అధికారాన్ని అప్పగిస్తే సీమాంధ్రను స్వర్గతుల్యం చేస్తామని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. లౌకికవాదంపై తమదే పేటెంట్‌ హక్కని ప్రకటించుకొనే కాంగ్రెస్‌, హిందుత్వవాదమే తమ ఊపిరి అని సగర్వంగా ప్రకటించుకొనే బి.జె.పి. పార్లమెంటు వేదికగా అపవిత్ర కూటమిగా ఏర్పడి ప్రదర్శించిన వింత రాజకీయ విన్యాసాలను తెలుగు జాతే కాదు, యావత్తు భారత జాతి వీక్షించి, అసహ్యంతో నిట్టూర్పులు విడుస్తున్నది. నీచంగా మారిన రాజకీయ చదరంగంలో తెలుగు జాతిని బలి పశువును చేసింది చాలక, ఓట్ల రాజకీయంలో పై చేయి సాధించాలని పడరాని పాట్లు పడుతున్నారు. ఆ రెండు పార్టీలు కూడబలుక్కొని పార్లమెంటు సాక్షిగా తెలుగు జాతి భవిష్యత్తుకు సమాధి కట్టాయని కోస్తాంధ్ర, రాయలసీమ జనం భావిస్తున్నారు. అధికారమే పరమావధిగా బతుకుతున్న పార్టీలు ఎవరేమనుకొంటే తమకేమి సిగ్గు అన్న తీరులో వ్యవహరిస్తూ ఓట్ల వేటలో తలమునక లవుతున్నాయి.
చిన్న రాషా్టల్ర భావజాలానికి అనుకూలమని ఒకరు, వ్యతిరేకం కాదని మరొకరు చెప్పుకొంటూ భారత రాజ్యాంగ మౌలిక లక్షణమైన సమాఖ్య వ్యవస్థ మూలాలపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఆ దుర్నీతి రాజకీయాల మొదటి గొడ్డలి పెట్టు తెలుగు జాతిపై పడింది. ఓట్లు, సీట్ల కోసం ప్రజలను నిలువునా చీల్చడానికి, అనుబంధాలను విచ్ఛిన్నం చేసి శతృత్వానికి ఆజ్యం పోయడమే రాజకీయమన్నట్లు రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. భారత రాజ్యాంగం మౌలికంగా సమాఖ్య వ్యవస్థను పరిరక్షించే అత్యంత శక్తిమంతమైనదిగా నేటి వరకు పౌరులందరూ విశ్వసిస్తూ వచ్చారు. సామాజికాభివృద్ధికి అనుగుణంగా సముచితమైన సవరణలు చేసుకొంటూ, రాజ్యాంగాన్ని సమున్నతంగా అభివృద్ధి చేసుకొంటూ అడుగులు ముందుకు వేయాల్సిన తరుణంలో రాజ్యాంగంపై ప్రజలకు విశ్వాసం సడలిపోయేలా రెండు జాతీయ ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ పార్లమెంటులో శాసనం చేసిన తీరుతెన్నులు ప్రజాస్వామ్యం పైన, సమాఖ్య వ్యవస్థ మనుగడపైన విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతున్నదన్న అనుమానాలు రేకెత్తాయి. జాతీయ పార్టీలను నమ్ముకొంటే నట్టేట ముంచుతాయని, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవడం ద్వారా కనీసం రాజకీయ ఒత్తిళ్ళతో కొంతైనా ఊరట పొందవచ్చనే ఆలోచన ప్రజల్లో బలపడుతున్న సూచనలు కనబడుతున్నాయి.
బలమైన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో ఇప్పటికే జాతీయ పార్టీల పట్టు సడలిపోయింది. రెండు పార్టీల వ్యవస్థను కోరుకొంటున్న కాంగ్రెస్‌, బి.జె.పి. కనీసం తమతమ నాయకత్వాల్లోని రెండు కూటముల వ్యవస్థనైనా నెలకొల్పుకోవాలని ఉబలాట పడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చేస్తున్న కార్పొరేట్‌ రంగం కూడా ఈ శక్తులకే వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ఈ శక్తులు విజయం సాధించడమంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత బలంగా వేళ్ళూనుకోవడానికే దోహదపడుతుంది. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సరళీకృత ఆర్థిక విధానాల అమలు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా విజ్ఞతతో ఓటర్లు ఆలోచించి, దేశ ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తుకు బరోసా ఇవ్వగలిగిన శక్తులను గుర్తించి ఆదరించాలి, దుష్టశక్తులకు కీలెరిగి వాత పెట్టాలి.


Sunday, March 2, 2014

కూడలిలో దేశ రాజకీయం





March 1, 2014 Surya daily
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తున్నది. నేడు డిల్లీ గద్దెపై ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యు.పి.ఎ.) పాలనకు చరమగీతం పాడి, ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా దుష్ట‌పాలన నుండి విముక్తి పొందాలని ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఈ మధ్య కాలంలోనే జరిగిన ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని స్పష్టమయ్యింది. దాంతో అధికార‌మార్పిడి అనివార్యమనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పాలనా పగ్గాలు ఎవరి చేతికి దక్కుతాయన్నదే ప్రజల మెదళ్ళను తొలుస్తున్న హిమాలయ పర్వతమంత ప్రశ్న. డిల్లీ గద్దె కోసం జరుగుతున్న పరుగు పందెంలో కాషాయధారణులు ఒకడుగు ముందున్నారనే వాతావరణం సృష్టించబడింది. మూడంకెల సంఖ్య(112)తో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, సంఘ్ పరివార్ కూటమి అండదండలతో, మరీ ప్రత్యేకించి కార్పోరేట్ రంగంలోని దిగ్గజాలు నరేంద్ర మోడీకి వెన్నుదన్నుగా నిలవడంతో మొగ్గు ఉన్నట్లు ప్రసార మాధ్యమాలు ఊదరగొడుతున్నాయి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే జాతీయ ప్రజాతంత్ర కూటమి(యన్.డి.ఎ.) లోక్ సభలో కావలసిన సాధారణ మెజారిటీ(272+) కి ఆమడ దూరంలోనే ఆగిపోతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
చీలికలు పేలికలుగా ఉన్న యు.పి.ఎ. మరియు యన్.డి.ఎ. యేతర పార్టీలు ఎన్నికలు తరుముకొస్తుండడంతో సర్దుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూ ఒకే వేదికపైకి వచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ఏర్పడి, పదకొండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎన్నికల బరిలో దిగడానికి సన్నాహాలు మొదలు పెట్టాయి. యు.పి.ఎ. మరియు యన్.డి.ఎ. కూటములకు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి.లు నాయకత్వం వహిస్తుంటే, తృతీయ‌ కూటమి బహుళ నాయకత్వం క్రింద పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది కొంత వరకు నాయకత్వ లేమిగానే కనబడుతున్నది. జాతీయ పార్టీలుగా ఉన్న సి‍.పి.ఐ.(యం), సి.పి.ఐ. మిగిలిన వామపక్ష పార్టీలైన ఆర్.యస్.పి. మరియు పార్వర్డ్ బ్లాక్ లతో కలిసి ఒక కూటమిగా చాలా కాలం నుంచి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయి. మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్ లోను, అనేక సంవత్సరాల పాటు కేరళలోను, అధికారంలో ఉండి ప్రజానుకూల పాలనను అందించిన ఘనమైన చరిత్ర వామపక్షాలకున్నది. ప్రస్తుతం త్రిపురలో సి.పి.ఐ.(యం) నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్నది. వారికి సంకీర్ణ ప్రభుత్వాల నిర్వహణానుభవం ఉన్నది. పైపెచ్చు యు.పి.ఎ.-1 ప్రభుత్వానికి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా వెలుపలి నుండి మద్దతు ఇచ్చి, సమన్వయ కమిటీలో భాగస్వాములుగా ఉంటూ నాలుగేళ్ళకుపైగా కేంద్రంలో కలిసి పని చేసిన అనుభవమూ ఉన్నది. 14వ లోక్ సభలో 61 మంది సభ్యుల బలంతో ప్రభావశీలమైన పాత్రను పోషించాయి. భారత్, అమెరికా అణు ఒప్పందంపై విభేధించి, నాటి యు‍.పి.ఎ.-1 ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొన్నాయి. అటుపై 15వ లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాల బలం 24కు పడిపోవడం, కమ్యూనిస్టులకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్ మరియు కేరళలో అధికారాన్ని కోల్పోవడంతో వామ‌పక్షాల ప్రాభవంపై కారుమబ్బులు కమ్ముకొన్నాయి. బలహీనపడ్డాయనే వాతావరణం నెలకొన్నది. అయినా ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన అలుపెరగని పోరుసల్పడంలో ముందు వరుసలోనే ఉన్నాయి. వామపక్షాలకు అధికార వ్యామోహం ఉన్నదని ప్రత్యర్థులు కూడా అనలేరు. 
తృతీయ కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. సమాజవాది పార్టీ(22), జనతా దళ్(యునైటెడ్)(19), బిజూ జనతా దళ్(14), ఎ.ఐ.ఎ.డి.యం.కె.(9), జనతా దళ్(సెక్యూలర్)(1), అస్సాం గణ పరిషత్(1), జార్ఖండ్ వికాస్ మోర్చా(2), వీటన్నింటికీ కలిపి ప్రస్తుత లోక్ సభలో 68 మంది సభ్యులున్నారు. అంటే ప్రస్తుత‌ లోక్ సభలో తృతీయ కూటమిలోని 11 పార్టీల బలం 92. యు.పి.ఎ., యన్.డి.ఎ. ల తరువాత స్థానంలో ఈ కూటమి ఉన్నది. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమాజవాది పార్టీ, జనతా దళ్(యు), బిజూ జనతా దళ్, ఎ.ఐ.ఎ.డి.యం.కె. లకు రాజకీయ‍ పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో 16వ లోక్ సభకు జరుగనున్న‌ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాలు తృతీయ కూటమికి ఆశాజనకమైన అంశం. ఆయా రాష్ట్రాలలో ఈ పార్టీలకు శక్తివంతమైన నాయకత్వం, విస్తృతమైన ప్రజా బలం, నిర్మాణ పటిష్టత‌ ఉండడంతో నిస్సందేహంగా యు.పి.ఎ. కూటమి కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకొనే మెరుగైన స్థితిలో ఈ కూటమి ఉన్నది. కానీ తనకు తానుగా అధికారంలోకి రాగలిగిన శక్తి సామర్థ్యాలు మాత్రం లేవనే చెప్పాలి. పైపెచ్చు ప్రధాన మంత్రి కావాలనే కోర్కెను ములాయం సింగ్ యాదవ్, జయలలితలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. అలాగే నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ లకు ఆ కోరిక లేదని చెప్పలేం. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం లేక పోవడం ఈ కూటమికున్న పెద్ద బలహీనత. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలమనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించడంలో వెనుకబడి ఉన్నది. స్థిరమైన, మెరుగైన పాలన ఈ కూటమి అందించగలదా! అన్న సంశయం ప్రజలకు రావడం సహజం.
యు.పి.ఎ., యన్.డి.ఎ. మరియు నూతనంగా ఆవిర్భవించిన తృతీయ కూటమి, ఈ మూడు కూటములకు వెలుపల ఉన్న మరికొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కా‍గ్రెస్(19), ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజవాది పార్టీ(21), ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం(6), వై.యస్.ఆర్. కాంగ్రెస్(2), వీటన్నింటికీ ప్రస్తుత లోక్ సభలో 48 మంది సభ్యులున్నారు. అలాగే ఇటీవల డిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో రెండవ పెద్ద పార్టీగా అవతరించి అధికార పీఠాన్నెక్కి దేశ ప్రజలను కాస్త ఆశ్చర్యానికి గురిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలు ప్రస్తుతానికి ఏ కూటమితోనూ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ పార్టీలు డెబ్బయ్ ఎనబై స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల తరువాత వీటి వైఖరి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మమతా బెనర్జీ ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో బి.జె.పి.కి సన్నిహితంగా వ్యవహరించిన టి.డి.పి. రాష్ట్ర విభజన విషయంలో బి.జె.పి. దగా చేసిందనే భావనతో మళ్ళీ దూరం జరిగినట్లు కనబడుతున్నది. యు.పి.ఎ.కు బయటి నుండి మద్దతిస్తున్న బి.యస్.పి. ఎన్నికల తరువాత ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో ఊహించడం కష్టమే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న నానుడిగా వామపక్షాలున్న కూటమిలో మమత, ములాయం ఉన్న చోట మాయావతి, చంద్రబాబున్న చోట జగన్, జయలలిత ఉన్న చోట కరుణానిథి ఇలా తీవ్రమైన‌ వైరుద్యాలతో ప్రత్యర్థులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, నాయకులు ఒకే గొడుగు క్రిందికి రావడం సాధ్యమా! అన్న సంకోచం ఎవరికైనా వస్తుంది. అలా అని అసాధ్యమని చెప్పలేము. యు.పి.ఎ.-2 ప్రభుత్వానికి బయట నుండి ములాయం, మాయావతి ఇద్దరూ వారి వారి అవసరాల కొద్దీ అంటకాగిన తాజా అనుభవం ఉంది కదా! అధికార పగ్గాలు చేతికందిన తరువాత ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడగలిగిన శక్తిశాలి సి.బి.ఐ. ఉండనే ఉంది. ప్రస్తుతానికి ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయ రంగంలో అనిచ్ఛిత పరిస్థితి నెలకొని ఉన్నది.
యు.పి.ఎ.కి గానీ, యన్.డి.ఎ.కి గానీ, తృతీయ కూటమికి గానీ 544 స్థానాలున్న లోక్ సభలో 272+ స్థానాలను సాధించుకొని అధికారంలోకి రాగల శక్తిసామర్థ్యాలు లేవన్నది సుస్పష్టం. అందుకే అధికారం కోసం సాగుతున్న‌ పెనుగులాటలో ఆధిక్యాన్ని సాధించాలనే తలంపుతో ప్రత్యర్థి పార్టీలను మిత్రులుగా మలచుకొని తమ పంచన చేర్చుకోవాలనే కుట్రలు కుతంత్రాలు, ప్రలోభాలతో కాంగ్రెస్, బి.జె.పి.లు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయి. అందులో భాగంగానే బీహార్ లో కాంగ్రెస్ వైపున్న‌ లోక్ జన శక్తి పార్టీని సీట్ల అయస్కాంతంతో బి.జె.పి. లాగేసుకొన్నది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత అధికారం కోసం జరిగే పోరులో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి. 
ప్రజల‌ ఆకాంక్ష‌ : 2004కు ముందు యన్.డి.ఎ. పాలనను ప్రజలు చవి చూశారు. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బి.జె.పి., మరీ ప్రత్యేకించి కర్నాటక అవినీతి ప్రభుత్వాన్నీ చూశారు. ఆర్థిక విధానాల్లోను, అవినీతిలోను కాంగ్రెస్ కంటే ఏ మాత్రమూ బి.జె.పి. భిన్నమైన పార్టీ కాకపోగా వైవిద్యభరితమైన భారత దేశంలో మతోన్మాద రాజకీయాలతో లౌకిక వ్యవస్థ పునాదులను గొడ్డలి పెట్టుకు గురిచేస్తున్న పార్టీగా అపకీర్తిని మూటకట్టుకొన్నది. ఈ పూర్వరంగంలో మెరుగైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవిస్తే ఆదరించడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇటీవల జరిగిన డిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. విధానాల ప్రాతిపదికగా మాత్రమే కాంగ్రెస్, బి.జె.పి.యేతర పార్టీలతో జట్టు కడతామని నిన్నమొన్నటి వరకు వామపక్షాలు చెబుతూ వచ్చాయి. ఎన్నికలు సమీపించడంతో ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పి స్థూలంగా "ప్రజాస్వామ్య, లౌకిక మరియు సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ, ప్రజానుకూల విధానాల అమలు" అన్న అజెండాతో ఎన్నికల కూటమికి నడుంకట్టాయి.
భారీ కుంభకోణాలతో అవినీతి కూపంలో కూరుకపోయి, ప్రజావ్యతిరేక పాలనతో ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ దింపుడు కళ్ళం ఆశతో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోనే ప్రయత్నాల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్ళించడానికి రాష్ట్ర‌ విభజన అంశాన్ని ముందుకు తెచ్చి పార్లమెంటే జరగని పరిస్థితిని కల్పించింది. యు.పి.ఎ. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని బి.జె.పి. ఉవ్విళ్ళూరుతున్నది. ఈ రెండు పార్టీల, కూటముల‌ ఆర్థిక విధానాల్లో ఇసుమంత తేడా లేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల ప్రధాన లబ్దిదారులు కార్పోరేట్ సంస్థలు. కాంగ్రెస్ గుర్రం బక్కచిక్కి పోయింది కాబట్టి కొత్త గుర్రమైన బి.జె.పి. పైకెక్కి స్వారిని కొనసాగించాలనే నిర్ణయానికి కార్పోరేట్ రంగం వచ్చింది. తమ దోపిడి నిర్విఘ్నంగా కొనసాగాలంటే మన్మోహన్ స్థానంలో మోడీని కూర్చోబెట్టాలనే నిర్ధారణకు కార్పోరేట్ దిగ్గజాలొచ్చినట్లు విస్పష్టంగా కనబడుతున్నది. తదనుగుణంగానే కార్పోరేట్ ఆధిపత్యంలోని ప్రసారమాధ్యమాలు బహుళ ప్రచారాన్ని చేస్తూ, ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డాయి.
కరడుగట్టిన హిందూ మతోన్మాద రాజకీయాలకు ప్రతినిథి అయిన నరేంద్ర మోడీ చేతికి పాలనా పగ్గాలు అప్పగిస్తే భారత దేశ ఐక్యతకు మూలస్థంభమైన లౌకిక వ్యవస్థ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని, తద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థ బీటలు వారుతుందని, కాంగ్రెస్ మరియు బి.జె.పి. లు ఒకే తానులోని ముక్కలు కాబట్టి ప్రజావ్యతిరేక, స్వదేశీ మరియు విదేశీ గుత్త పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక విధానాలే కొనసాగుతాయన్న వాదనలతో తృతీయ‌ కూటమి తెరపైకొచ్చింది. మోడి పేరు వింటేనే 2002లో గోద్రా ఘటనల తదనంతరం ముస్లిం మైనారిటీలపై జరిగిన‌ మారణహోమం దేశ ప్రజలకు గుర్తుకొస్తుంది. అలాగే నాలుగు వందల సంవత్సరాల చారిత్రక కట్టడమైన బాబ్రి మసీదును సంఘ్ పరివార్ కూటమి నేలమట్టం చేసిన దుర్ఘటన బి.జె.పి.ని వెన్నంటుతూనే ఉన్నది. పర్యవసానంగా కాంగ్రెస్, వామపక్షేతర పార్టీలు బి.జె.పి.తో మిత్రత్వం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొంటున్నాయి. ప్రత్యేకించి మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే జనతాదళ్(యు) పార్టీ యన్.డి.ఎ. కూటమి నుండి తెగదంపులు చేసుకొన్నది. ఒకే భావజాలంతో ఉన్న శివసేన(11), అలాగే అకాళీదళ్(4) పార్టీలు మాత్రమే ఆ పార్టీకి మిత్రులుగా మిగిలారు. ప్రస్తుతo యన్.డి.ఎ. బలం 127 మంది సభ్యులు. కొత్తగా లోక్ సభలో ప్రాతినిథ్యం లేని లోక్ జనశక్తి దగ్గరికి చేరింది. కర్నాటకలో గతంలో గెలిచిన 19, జార్ఖండ్ లో 6 స్థానాలను నిలబెట్టుకొనే అవకాశమే కనబడడం లేదు. కాకపోతే రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో మెరుగైన పరిస్థితులున్నాయి. యాతావాతా 150 స్థానాలకు వరకు సాధించుకోగలదు. బి.జె.పి.కి బలమూ, గుదిబండ మోడీనే అన్న ప్రచారమూ జరుగుతున్నది. అందుకేనేమో! బి.జె.పి. అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ గతంలో జరిగిన తప్పులకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. మోడీ మాత్రం చెప్పలేదు సుమా!
ఈ నేపథ్యంలో యు.పి.ఎ.కి, యన్.డి.ఎ.కి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఆవిర్భవించడం స్వాగతించదగిన పరిణామం. యు.పి.ఎ.-1 నుంచి వామపక్షాలు నిష్క్రమించాక బ్రేకులు వేసే అడ్డుతొలగడంతో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల అమలులో దూకుడు ప్రదర్శించి, ఆర్థిక సంస్కరణల అమలులో వేగం పెంచింది. జాతి సంపదైన సహజ వనరులను, శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలను కార్పోరేట్ రంగం అడ్డగోలుగా దోపిడి చేసుకొని సంపదను ఇబ్బడి ముబ్బడిగా పోగేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చింది. స్వాతంత్య్రానంతర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా బాసిల్లిన ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ద్వంసం చేసింది. నష్టాల పేరుతో చాలా సంస్థలను మూసివేసింది. లాభాలు గడిస్తున్న సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రయివేటు సంస్థలకు దారాదత్తం చేసింది. దేశ భద్రతను కూడా పణంగా పెట్టి వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. మన ఆర్థిక వ్యవస్థను బహుళ జాతి సంస్థల గుప్పెట్లోకి నెట్టివేసే అత్యంత హానికరమైన ఆర్థిక విధానాల అమలుకు పూనుకొన్నది. తదనుగుణంగా చట్టాలలో మార్పులు చేసింది.
కార్మికుల, ఉద్యోగుల జీవనోపాథిపై గొడ్డలి పెట్టు వేసింది. ప్రభుత్వ రంగంలో ఉపాథి కల్పన మృగ్యం. అధిక లాభార్జనే ధ్యేయంగా పెట్టుబడులు పెట్టే ప్రయివేటు రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ అత్యాధునిక యంత్రసామగ్రిని వినియోగించడం మూలంగా ఉపాథి కల్పన పరిమితంగా ఉన్నది. సేవా రంగమైన ఐ.టి. తదితర రంగాలలో మిన‌హాయిస్తే అసంఘటిత రంగంలోనే కాస్తా ఉపాథి అవకాశాలు ఉన్నాయి. ఈ తరగతి కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా తయారైనాయి. చమురు ఉత్పత్తులైన పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలపై ఉన్న ప్రభుత్వ‌ నియంత్రణను ఎత్తివేసి, మార్కెట్ శక్తులకు అప్పగించడంతో ప్రజలపై మోయలేని ఆర్థిక‌ భారం పడింది. నిరంతరం పెరుగుతున్న‌ నిత్యావసర వస్తువుల ధరల వల్ల సామాన్యుల జీవితాలు అతలాకుతలమైపోయాయి. నిజవేతనాలు దారుణంగా పడిపోయాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ఆర్థిక కుంభకోణాలు, అవినీతి ఏడాదికేడాది రికార్డులు బద్దలుకొడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రజాకంఠక పాలన సాగింది. ఈ దుర్భర పరిస్థితుల నుండి త్వరితగతిన విముక్తి కావాలని సామాన్య ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ దుష్టపాలనకు సమాధి కట్టాలన్న కృతనిశ్చయానికి ప్రజలొచ్చారు. సరియైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. యు.పి.ఎ. ఆర్థిక విధానాలే యన్.డి.ఎ. విధానాలు. ఈ నేపథ్యంలో ప్రజానుకూల‌ ఆర్థిక విధానాలతో, జవాబుదారితనంతో, స్వ‌చ్ఛమైన, నీతివంతమైన, అవినీతిరహిత పాలన అందించే నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.