Tuesday, February 28, 2012

జలయజ్ఞం సాగదీత

సూర్య February 23, 2012
  • గత కేటాయింపులే ఖర్చుకాలేదు
  • ప్రాజెక్టుల్ని పూర్తిచేసే సంకల్ప లోపం
  • కరవుకు పరిష్కారం ప్రాజెక్టులే
  • లోపించిన ప్రాధాన్యతా క్రమం
  • జాప్యం వల్ల పెరుగుతున్న నిర్మాణ వ్యయం
  • మూలన పడుతున్న ప్రాజెక్టు నిర్మాణాలు
  • విద్యుదుత్పత్తి సామర్ధమూ పెరగాలి
    polavaramప్రభుత్వ విశ్వసనీయతకు, జవాబుదారీతనానికి శాసన సభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ అమలే గీటు రాయి. 2010-11 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అమలు తీరు తెన్నుల నేపథ్యం నుండి ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తే, ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమవుతున్నది. జలయజ్ఞం పేరు ఉచ్ఛరించడానికే జంకుతున్నట్లుంది. గత బడ్జెట్‌లో రూ.15,010 కోట్లు కేటాయించి, జనవరి నాటికి కేవలం రూ.8,459 కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.

    గడచిన ఏడాదిలో నిథులను పూర్తిగా వ్యయం చేయలేక పోవడం మూలంగా ఈ సంవత్సరం కేటాయింపులు పెంచలేదని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇచ్చిన వివరణను బట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పసిద్ధి ప్రభుత్వానికి లేనట్లు చెప్పకనే చెప్పారు. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు.మన రాష్ట్ర ప్రగతి ప్రధానంగా వ్యవసాయంపై అధారపడి ఉన్నది. నూటికి అరవై నాలుగు మందికి జీవనాధారం వ్యవసాయ రంగమే. నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కరవుకాటకాలు నిత్యకృత్యమైనాయి.

    ఈ ఏడాది కూడా ఇరవై రెండు జిల్లాలలో 876 మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. నిత్య కరవులను శాశ్వతంగా పారద్రోలాలంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసుకోవడం ఒక్కటే మార్గం. ప్రాణప్రదంగా భావిస్తున్న పోలవరానికి వెయ్యి కోట్లు కేటాయించి రూ.452 కోట్లు వ్యయంచేసి, ఇప్పుడు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం నుండి ఆమోదం లభించబోతున్నదని, 90 శాతం నిథులు కేంద్రమే భరిస్తుందని, అన్ని శాఖల నుండి అనుమతి మంజూరై నిర్ణయం కేంద్ర మంత్రిమండలి ముంగిట ఉన్నదని ఊరిస్తున్నారు.

    మరొకవైపు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, అవి బహిర్గతం కావడంతో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. పర్యవసానంగా 2004 అంచనాల మేరకు రూ.8,198 కోట్లు వ్యయం అవుతుందనుకొన్నది రూ.17,000 కోట్లకు చేరుకొన్నది. కాలం గడచే కొద్ది ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం కూడా తడిసి మోపెడవుతూనే ఉంటుంది. ఇది అన్ని ప్రాజెక్టులకు వర్తిస్తుంది.

    తెలంగాణలోని అత్యధిక మెట్ట ప్రాంతాలకు ప్రాణ ప్రదంగా భావిస్తున్న ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి రూ.608 కోట్లు కేటాయించి 256 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టు సర్వే కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు రూ.1,050 కోట్లు ప్రతిపాదించారు. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను త్వరితగతిన రూపొందించి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, జాతీయ ప్రాజెక్టు హోదా సాధించుకొంటేనే ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోగలం. దుమ్మగూడెం సాగర్‌ టేల్‌ పాండ్‌ కు రూ.200 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.75 కోట్లు, చింతలపూడికి రూ.75 కోట్లు, మహేంద్రతనయకు రూ.35 కోట్లు, వంశధార మొదటి దశకు రూ.20 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. కల్వకుర్తికి రూ.250 కోట్లు కేటాయించి రూ.155 కోట్లు , భీమాకు రూ.260 కోట్లకు గాను రూ.77 కోట్లు, నెట్టంపాడుకు రూ.233 కోట్లకు రూ.75 కోట్లు , ఎస్‌.యల్‌.బి.సి.కి రూ.450 కోట్లకు రూ.297 కోట్లు, ఎస్సారెస్పీకి రూ.205 కోట్లకు కేవలం రూ.16 కోట్లు, ఇందిరా దుమ్మగూడెంకు రూ.150 కోట్లకు రూ.18 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు రూ.277 కోట్లు, పిబిసి పథకానికి రూ.305 కోట్లకు రూ.83 కోట్లు ఖర్చు చేశారు. వార్షిక బడ్జెట్‌లో నిథులు కేటాయించడం, ఖర్చు చేయకుండా ప్రజలను దగా చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.

    200511 సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు సగటున 9.26 శాతం నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ఘనంగా ప్రకటించుకొన్నారు. అందులో సంపద సృష్టి కర్తలైన సామాన్యుల వాటా ఎంత అన్న దానికి సమాధానం దొరకదు. సమాజం సృష్టిస్తున్న సంపద దోపిడీ దొంగల సొత్తుగా మారిపోతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి గడచిన ఐదారు సంవత్సరాలలో రూ.71,292 కోట్లు ఖర్చు చేసినా రావలసిన సత్ఫలితాలు రాక పోవడానికి అవినీతే ప్రధాన కారణం. వ్యవసాయం కునారిల్లి పోతున్నది. ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, వ్యవసాయానికి ఊపిరి పోసి, ఉపాథి అవకాశాలను మెరుగుపరచడానికి, కరవు కాటకాల బారినుండి ప్రజలను రక్షించడానికి, గ్రామసీమల నుండి వలసలను నివారించడానికి, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజానీకాన్ని నాగరిక ప్రపంచంలో అంతర్భాగం చేయాలన్నా నదీజలాల సద్వినియోగంపై మాత్రమే ఆధారపడి ఉన్నది.

    జల వనరులను అభివృద్ధిపరచి, ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కృషి చేయాలి. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుండి నీటి కోసం కటకట లాడుతున్న ప్రాంతాల ప్రజల గొంతులు తడపాలన్నా, మరుభూములను పంట పొలాలుగా మార్చాలన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని రాజకీయ సంకల్పంతో కొనసాగించాలి. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిథులను మంజూరు చేయకుండా, నిర్మాణ పనులను నత్త నడకన సాగించడం చూస్తుంటే ప్రస్తుత పాలకులకు ప్రాజెక్టుల సత్వర నిర్మాణం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదనిపిస్తున్నది. ఓట్ల రాజకీయంపై ఉన్న ధ్యాస దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పథకాలపై లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

    జలయజ్ఞంలో అంతర్భాగంగా 44 భారీ, 30 మధ్య తరహా పథకాలు, 8 ఆధునికీకరణ పథకాలు, నాలుగు వరద గట్ల మరమ్మతు కార్యక్రమాలకు రూ.1,85,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2012 జనవరి నాటికి రూ.71,292 కోట్లు ఖర్చు చేశారు. 97.3 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని , 9.45 లక్షల ఎకరాల భూమికి సాగు స్థిరీకరణ కల్పిస్తామని, దాంతో పాటు 6,553 గ్రామాలలోని 2.54 కోట్ల జనాభాకు మంచినీటిని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొనే నీటి పారుదల ప్రాజెక్టుల ప్రస్తుత నిర్మాణ తీరుతెన్నులపై శ్వేతపత్రం విడుదలచేస్తే దాని డొల్లతనం బయటపడుతుంది . 2004-05 తరువాత 13 ప్రాజెక్టులను సంపూర్ణంగా, 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 16.94 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని, 3.96 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కల్పించామని కాకి లెక్కలు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు గంగ, యస్‌.ఆర్‌.బి.సి., గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టులలో అంతర్భాగంగా రిజర్వాయర్లను , ప్రధాన కాల్వల నిర్మాణాలను పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంను, పంట కాలువల నిర్మాణాన్ని చేపట్టకుండానే సాగునీరు విడుదల చేస్తున్నామని ప్రకటించి చేతులు దులిపేసుకొన్నారు. వీలున్న చోట్ల చెరువులకు నీటిని తరలించి, కొత్తగా సాగుకు నీరందిస్తున్నట్లు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు.

    ప్రాధాన్యతా క్రమంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు చేసిన సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఈ దుస్థితి నెలకొన్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న నానుడిగా ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తామని కబుర్లు చెబుతున్నది. వాస్తవానికి ప్రభుత్వం ఆచరణలో నిష్క్రియగా తయారయ్యింది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాలు గడప దాటటం లేదన్న నానుడిగా ప్రభుత్వ చర్యలున్నాయి. గుత్తేదారులు- చేసిన పనులకే డబ్బులు చెల్లించడంలేదని గోలచేస్తున్నారు. అప్పులు చేసి యంత్రాలను కొనుగోలు చేసి, నిర్మాణ పనులు చేసిన చిన్న గుత్తేదారులు వడ్డీలు చెల్లించుకోలేక దివాలా తీస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిథులను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నది. పర్యవసానంగా నిర్మాణ పనులు ఆలస్యం అయ్యేకొద్దీ నిర్మాణవ్యయం తడిసి మోపెడై అసలుకే మోసం జరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మూలనపడతాయి. ఇప్పటికే కొన్నిప్రాజెక్టుల కింద తవ్విన ప్రధాన కాలువలు పూడిపోయి, చెట్లు మొలచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
    ఈ దుస్థితినుండి బయట పడడానికి నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి అంకితభావంతో పూనుకోవాలి. పోలవరం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడం ద్వారా ఆర్థిక వెసులుబాటు సాధించి, రాష్ట్ర నిధులతో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి ఇప్పటికైనా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి. విద్యుత్‌ కొరతతో సతమతమౌతున్న పూర్వరంగంలో ఎత్తిపోతల పథకాల విద్యుదవసరాలను తీర్చడానికి అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరొక వైపు చర్యలు తీసుకొంటే తప్ప సత్ఫలితాలు పొందలేము.
  • Thursday, February 16, 2012

    సా‘రాజ్యం’ ఆగేదెన్నడు?

    Surya Daily Feb.15 2012

  • మద్యం వ్యాపారం ద్వారా అవినీతి, నేరాలు వ్యవస్థీకృతం
  • అనుమతి లేకుండానే వేల సంఖ్యలో బార్లు, వైన్‌ షాపులు సంక్షేమంపై ఖర్చు ఏడెనిమిది వేల కోట్లు మించిలేదు
  • ఎకై్సజ్‌ ఆదాయం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ
  • నిర్ధిష్ట లెక్కలు సంపాదించడం అసాధ్యం
  • ఎసిబి దాడులను అన్ని జిల్లాలలోనూ నిర్వహించాలి
  • దాడుల సమాచారాన్ని క్రోడీకరించి బహిర్గతం చేయాలి

    సమాజ హితం కోరుకొనే వారెవరైనా మ ద్యం వ్యాపారానికి ప్రత్యక్షంగాగానీ, పరో క్షంగా గానీ భాగస్వాములు కారు. తెలుగునాట మద్యాన్ని ఏరులై పారిస్తూ, కాసుల కోసం కక్కు ర్తిపడుతూ ప్రజల మానప్రాణాలను బలి గొంటూ, పేద పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మాఫి యా గ్యాంగులకు కళ్ళెం వేయాల్సిన ప్రభుత్వ పెద్దలే అవినీతికి పా ల్పడ్డ్డారని అవినీతి ని రోధక సంస్థ (ఎ. సి. బి.) ప్రాథమిక సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసింది. అనైతికమైన మ ద్యంవ్యాపారాన్ని చేయడమే కాకుండా చట్ట ప్రకారమే చేస్తున్నామని బుకా యించడం కొందరి నీతిమాలిన రాజకీయాలకు ప్రబల నిదర్శనం. సమస్య కొత్తది కాకపోయినా తాజాగా మరొకసారి మద్యం మాఫియా అండ్‌ కంపెనీ గుట్టు రట్టయ్యింది. రాజకీయ, వ్యాపార, పత్రికా రంగాలకు, అధికార గణాని కి తీరని కళంకం తెచ్చి పెట్టింది. ఈ శాసన సభా సమా వేశాల్లోనైనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ తరహా సమస్యలపై సవ్యమైన చర్చలు జరిపి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తారో ! లేదో ! వేచి చూడాలి.

    ప్రజల సంక్షేమం, ఆరోగ్యం మా ధ్యేయమని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పాలకులు రక్త పిపాసులుగా మారడం మానవత్వాన్ని మంటకలపడమే. పేద లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే సొమ్ములు కావాలి కదా ! అని ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దారిద్యరేఖకు దిగు వనున్న ప్రజానీకాన్ని ఆర్థికంగా ఆదుకోవడం సంక్షేమ రాజ్యం యొక్క ప్రాథ మిక కర్తవ్యం. రాజ్యాంగబద్ధమైన ఈ కర్తవ్యాన్ని కూడా ప్రభుత్వం నిర్వర్తిం చనప్పుడు ఇ! ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం లేదు. సంక్షేమ పథకాలకు నిథులను సమకూర్చడం సమాజం బాధ్యత. అంతే కానీ సంక్షేమ పథకాల లబ్ధిదారులను మద్యం వ్యసనపరులుగా మార్చి, వారి నుండే నిథుల ను పోగేసుకొంటామంటే ! అది ముమ్మాటికీ అనైతికం.

    నీతిమాలిన వ్యాపా రానికి ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలందించే వారెవరైనా రాజకీయాల కు అతీతంగా సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడక తప్పదు. అయితే ఆ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. తమపార్టీవారనో, వర్గం వారనో వారిని కాపాడే ప్రయత్నం రాజకీయ నాయకులు, ప్రభుత్వం చేస్తే అంతకు మించిన అపరాధం మరొకటి ఉండదు. మద్యాన్ని విస్తత్రంగా అమ్మడం ఒక ఎత్తు అయితే దానిని ఎంఆర్‌పి రేట్లకు మించి అమ్మడం మరొక దారుణం.

    రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశ పెట్ట బోతున్నది. కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తాలను, మద్యం అమ్మకాల (ఎకై్సజ్‌) ద్వారా ఆర్జించ తల పెట్టిన రాబడి అంకెలను పరిశీలించండి. ప్రభుత్వ శాఖ పేరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ డిపార్ట్‌మెంట్‌, మద్యపానం వల్ల సంభవించే దుష్పలితాలపై ప్రజ ల్లో విస్తృతంగా ప్రచారంచేసి, వ్యసనపరులను చైతన్యపరచి, మద్యాన్ని సేవిం చకుండా నిరుత్సాహ పరచడం శాఖ ప్రధాన కర్తవ్యం. ఈ లక్ష్యంతో ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీల ఉనికే గల్లంతయ్యింది. బాధ్యతను మరచిన ఎకై్సజ్‌ శాఖ మద్యం వ్యాపారంలో నిమగ్నమై పోయింది. మద్యం ఉత్పత్తి, నిల్వ, కొనడం, అమ్మడం, రవాణా వగైరా కార్యకలాపాలు నిర్వహి స్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మద్యం ఉత్పత్తి ని పెంచి, అమ్మకాలను పెంచుతారు.

    మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజు, అమ్మ కం పన్ను, ఎకై్సజ్‌ డ్యూటి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతులాంటిది ఎకై్సజ్‌శాఖ. మద్యం వ్యాపారస్తులు సిండికేట్‌లుగా ఏర్పడి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించు కొంటున్నారు. ఆ మాఫియా గ్యాంగ్స్‌ తో మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులు చేతులు కలిపి అప విత్ర కూటమిగా ఏర్పడి అక్రమార్జనను, అవినీతిని, నేరాలను వ్యవస్థీ కృతం చేశారు .

    మద్యం షాపులకు అత్యధిక మొత్తాల చెల్లింపుకు మాఫియా గ్యాంగ్స్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తూ టెండర్లు వేసి వేలంలో పాట పాడుకొంటు న్నారు. సిండికేట్లుగా తయారై మద్యం వ్యాపార వ్యవస్థనే నియంత్రిస్తు న్నారు. సొంతంగాను, బినామీ పేర్లతోనూ షాపులను కైవసం చేసుకొని ప్రభుత్వానికి లైసెన్స్‌ ఫీజు, అమ్మకపు పన్ను, ఎకై్సజ్‌ పన్ను చెల్లించాలి. చట్టం కళ్ళు కప్పి సాగించే అక్రమార్జనకు అడ్డు లేకుండా చేసుకోవడానికి మంత్రు లు, ప్రజాప్రతినిథులు, ఎకై్సజ్‌‌‌, పోలీసు, తూనికలు కొలతలు వగైరా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు, సిబ్బందికి క్రమం తప్పకుండా నెలవారి లంచా లు, కమీషన్లు ముట్టజెప్పుకోవాలి.

    పైనుంచి క్రిందికి గొలుసులా అవినీతి పరుల బంధం వ్యవస్థీకరించబడి ఉన్నది. రక్షణ కవచంగా గూండాలను పోషించాలి. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వాలి. దిన పత్రికలు, టి.వి. చానల్స్‌ యాజమాన్యాలు విలేకరులకు చట్టబద్దమైన వేతనాలు చెల్లించక పోవడంతో వారూ అవినీతికి పాలడుతూ లంచాలకు కక్కుర్తిపడు తున్నారు. చట్టబద్ధమైన, చట్టవ్యతిరేకమైన ఖర్చులను భరిస్తూ కోట్లకు కోట్లు ఆర్జించాలంటే మద్యం వ్యాపారులు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధ నలను తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన షాపు లు దాదాపు 7,000 , బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ 1,500 ఉంటే అనుమతి లేని బెల్ట్‌ షాపులు లెక్కకు మించి పదుల వేల సంఖ్యలో నిర్వహించబడుతున్నాయి.

    నిషేధిత ప్రాంతాలైన ఆలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు వగైరా ప్రదేశాలు, జాతీయ రహదారుల వెంబడి కూడా నిర్భీతిగా షాపులను ఏర్పాటు చేసి, గరిష్ట అమ్మకపు ధర (యం. ఆర్‌.పి.)పై కనీసం యాభై శాతానికి మించి డిమాండుకు అనుగుణంగా అధిక ధరలకు అమ్ముతూ మద్యం వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నది. మరోవైపు కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకొంటున్నా చీమ కుట్టినట్లు కూడా లేక పోవడం పాలకుల నిర్వాకాన్ని తెలియజేస్తున్నది. కల్తీ మద్యాన్ని అరికట్టేం దుకు చర్యలు తీసుకోకపోవడమే కాదు తాగినవారిదే తప్పు అయినట్టుగా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది.

    ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకొంటున్న ప్రభుత్వం ఎకై్సజ్‌ శాఖ నుండి రూ. 20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అంటే నలభై యాభైవేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. సబ్సిడి బియ్యం పంపిణీపై రూ. 2,500 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంపై రు. 2,000 కోట్లు, సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య, వితంతు, వికలాం గులకు ఇస్తున్న ఫించన్లు వగైరా సంక్షేమ పథకాలకు రూ.2,000 కోట్లు , ఇలాగా వివిధ సంక్షేమ పథకాలకు మొత్తంగా వెచ్చిస్తున్నది ఏడెనిమిది వేల కోట్ల రూపాయలకు మించి ఉండదు. కానీ ప్రజానీకాన్ని మద్యం మత్తులోకి నెట్టి గుంజుకొంటున్నది రూ. 50,000 కోట్లు.

    ఈ రంగంలోని వ్యాపారానికి సంబంధించిన మొత్తం లావాదేవీలపై అధికారిక లెక్కలు సంపాదించడం దుర్లభం. అందుకే, సింగిల్‌ విండో విధానంలో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తే బాగుంటుందని కొందరు ప్రముఖులు వ్యంగంగా సలహా ఇచ్చారు. అప్పుడ న్నా లెక్కాపక్కా తేలుతుందని, కనీసం జవాబుదారీతనం ఉంటుం దేమోనన్న ది వారి అభిప్రాయం కావచ్చు .

    2జి స్కాంలో రూ. 1,76, 000 కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ అంచ నా వేయగలిగింది. రాష్ట్రంలో యధేచ్ఛగా సాగిపోతున్న మద్యం కుంభకో ణంలో అవి నీతి సొమ్మెంతో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అవినీతి నిరోధక సంస్థ (ఎ.సి.బి.) దాడుల్లో జిల్లాల వారిగా వెలుగు చూస్తున్న వాస్త వాలు నామ మాత్రమే. గుడ్డి కంటి కంటే మెల్ల మేలన్న నానుడిగా రాష్ట్ర ప్రభు త్వం ఎ.సి. బి. దాడులకు ఆదేశించడం ఆ మేరకు అభినందనీయమే. కానీ దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలన్నింటినీ బహిర్గతం చేయకుండా, రాజకీ య స్వప్రయోజనాల కోసం ఏ.సి.బి. నివేదికల్ని ఆయుధంగా వాడుకొంటే అంతకంటే నీచమైన చర్య మరొకటి ఉండదు. ఇప్పటికే ఎసిబి దాడులను ఆదేశించడానికి కారణాల గురించి అధికార పార్టీ నాయకులే పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కనుక స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, రాజకీయ వత్తిడులకు లొంగకుండా అన్ని జిల్లాలలో దాడులు కొనసాగించి, మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి బహిర్గతం చేయాలి. అక్రమార్జనపరులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలరు.
  • Friday, February 10, 2012

    వొడాఫోన్‌ ఉదంతం అంతంకాదు, ఆరంభమే!

    సూర్య దినపత్రిక , పిబ్రవరి ౧౦,2012

    ఒక మధ్య తరగతి ఉద్యోగి లేదా ఒక సామాన్యుడు తన కష్టార్జితంలో కాస్త కూడబెట్టుకొని అపార్ట్‌ మెంట్‌ లేదా ఇంటి స్థలం లేదా ఏదైనా స్థిరాస్థి కొని, కొంత కాలం తరువాత డబ్బు అవసరమై ఆ స్థిరాస్థిని విక్రయిస్తే ఆదాయపు పన్ను శాఖ మూలధన లాభం (క్యాపిటల్‌ గెయిన్స్‌ ) పై పన్ను వసూలు చేస్తుంది. కానీ విదేశీ సంస్థలు ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో భారత గడ్డపై అడుగుపెట్టి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఆస్తులను వృద్ధి చేసుకొని, వాటి క్రయ విక్రయాల లావాదేవీలను- రెండు విదేశీ కంపెనీలు- విదేశీ గడ్డపై జరిపితే మూలధన లాభంపై పన్నువిధించే అధికారం ప్రస్తుత ఆదాయపన్ను చట్టం ప్రకారం భారత ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

    ప్రపంచీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో బహుళ జాతి సంస్థలు సాగిస్తున్న దోపిడీ, మోసానికి వొడా ఫోన్‌- హచ్‌ ఈస్సర్‌ కంపెనీల మధ్య జరిగిన క్రయవిక్రయాల తంతే ప్రబల నిదర్శనం. ఈ దోపిడీకి సుప్రీం కోర్టు తీర్పు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది. భారత ప్రభుత్వానికి, వొడాఫోన్‌ సంస్థకు మధ్య పన్నువివాదం కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మోసం, దగా బోధపడుతుంది. భారత మొబైల్‌ రంగ వ్యాపార సంస్థ హాంగ్‌ కాంగ్‌ కుచెందిన హుట్చిసన్‌ వాంపోయా (హచ్‌)కు చెందిన 67 శాతం వాటాను బ్రిటిష్‌ టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో బడా కంపెనీ అయిన వొడాఫోన్‌ గ్రూప్‌ సంస్థ రూ.54,000 కోట్లకు (11.08 బిలియన్స్‌)కు 2007లో కొన్నది. ఆదాయపు చట్టం ప్రకారం మూలధన లాభాలపై 22 శాతం పన్ను చెల్లించాలి.

    ఆ మేరకు ఆదాయ వనరు వద్ద పన్ను మినహాయింపు (టిడి.ఎస్‌) నిబంధన మేరకు హుట్చిసన్‌ వాంపోయా సంస్థకు చెల్లించాల్సిన మొత్తం నుండి మూలధన లాభంపై పన్నును ఆదాయపన్ను శాఖకు జమచేసి మిగిలిన సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత వొడాఫోన్‌ గ్రూప్‌ సంస్థపై ఉన్నది. పన్ను భారాన్ని తప్పించుకొనే దురుద్దేశంతో పన్నురహిత దేశాలు(టాక్స్‌ హెవెన్‌ కంట్రీస్‌)గా పేరొందిన కేంద్రాలలో క్రయవిక్రయాల లావాదేవీలను నిర్వహించడం బహుళ జాతి సంస్థలకు పరిపాటిగా మారింది.

    ఆదాయపు పన్ను శాఖ 2007లో హుట్చిసన్‌ వాంపోయా సంస్థకు, వొడాఫోన్‌ సంస్థకు మధ్య జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన మూలధన లాభంపై రూ.11,000 కోట్ల పన్ను చెల్లించాలని వొడాఫోన్‌ సంస్థకు తాకీదిచ్చింది. దాన్నిసవాలు చేస్తూ వొడాఫోన్‌ సంస్థ ముంబాయి హైకోర్టులో దావా వేసింది. పన్ను చెల్లించాల్సిందేనని 2010 సెప్టెంబర్‌లో కోర్టూ తీర్పు చెప్పగా వొడాఫోన్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం భారత ప్రభుత్వానికి ప్రతికూలమైన తీర్పును 2012 జనవరి 20న వెలువరించింది. హచ్‌ సంస్థకు చెందిన భారత దేశంలోని మొబైల్‌ ఆస్తులను వొడాఫోన్‌ కొనుగోలు చేసిన ఆర్థిక లావాదేవీలు విదేశాలలో జరిగాయి కాబట్టి అవి భారత దేశ ఆదాయపు పన్ను చట్టం పరిథిలోకి రావని ప్రధానన్యాయమూర్తి ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది.

    ఆదాయ పన్ను శాఖ వద్ద డిపాజిట్‌ చేసిన రూ.2,500 కోట్లను 4 శాతం వడ్డీతో సహా వొడాఫోన్‌ సంస్థకు రెండు మాసాల లోపు తిరిగిచెల్లించాలని, అలాగే రూ.8,500 కోట్లకు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారెంటీ పత్రాలను నాలుగు వారాల్లోపు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, వొడాఫోన్‌ సంస్థల మధ్య చెలరేగిన పన్ను వివాదంపై సుప్రీం కోర్పు ఇచ్చిన ఈ తీర్పు పర్యవసానాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.

    2-జి స్పెక్ట్రం కుంభకోణంలో సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చి దేశ సంపదను కొల్లగొట్టడానికి బరితెగించిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థల అడ్డగోలు దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేసిందని దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. 2-జి కుంభకోణం వ్యవహారంలో వొడాఫోన్‌ సంస్థ కూడా భాగస్వామే. ఈ సంస్థపై సీబీఐ 2011 నవంబర్‌లో దాడులు చేసింది. టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 49 శాతానికి పరిమితం చేస్తున్న నిబంధనను 2005 నవంబర్‌ 3న తొలగించి- 74 శాతం వరకు అనుమతించిన తర్వాత సంభవిస్తున్న దుష్పరిణామాలల్లో ఇదొకటి.

    హచ్‌ సంస్థకు చెందిన 67 శాతం వాటాలను కొన్న వొడాఫోన్‌ సంస్థ , మిగిలిన 33 శాతం వాటాదారూగా ఉన్న ఈస్సర్‌ సంస్థతో కలిసి 2007 నుండి వొడాఫోన్‌ ఈస్సర్‌ సంయుక్త సంస్థగా మన దేశంలో భారత కంపెనీగానే వ్యాపారాన్ని కొనసాగించింది. ఆనాడు దాని ఆస్తుల అంచనా విలువ రూ.92,000 కోట్లు (18.8 బిలియన్లు). అటుపై ఆ రెండు సంస్థల మధ్య వివాదం పొడచూపడంతో ఈస్సర్‌ సంస్థ వాటాలను కూడా 2011 జూలైలో కొని మొత్తం కంపెనీకి యజమానిగా మారింది.

    మన లాంటి దేశాల చట్టాల కళ్ళు కప్పి ఆదాయ పన్నులను చెల్లించకుండా తప్పించుకొనే దురుద్దేశంతోనే బహుళ జాతి సంస్థలు ఆదాయపు పన్నురహిత చట్టాల అమలులో ప్రసిద్ధి చెందిన కేమన్‌ దీవులు, నెదర్లాండ్‌, మారిషస్‌ వగైరా దేశాలలో పేరుకు మాత్రమే కంపెనీలను రిజిస్టర్‌ చేసి, అక్కడనుంచి వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు రికార్టులు సృషి స్తున్నాయి. ఆ కోవలోనే భారత దేశంలోని ఆస్తులను విక్రయించే ముందస్తు పథకంలో భాగంగానే హచ్‌ సంస్థ కేమన్‌ దీవుల్లో బోగస్‌ సంస్థను నెలకొల్పింది. నెదర్లాండ్‌లో రిజిస్టర్‌ అయిన వొడాఫోన్‌ గ్రూపుకు చెందిన సంస్థతో క్రయవిక్రయాల వ్యవహారాన్ని నడిపింది. ఇదంతా బూటకపు వ్యవహారమనే తేలుతోంది.
    సుప్రీం కోర్టు తీర్పును శిరోధార్యంగా భావించి కేంద్ర ప్రభుత్వం నిష్క్రియగా కూచుంటే భవిష్యత్తులో విదేశీ కంపెనీలే కాదు, స్వదేశీ కంపెనీలూ ఇదే బాటపట్టి పన్నులు ఎగ్గొట్టే అనైతిక వ్యవహారాలు నడుపుతాయి. ఇప్పటికే ఆ మార్గంలో పలు కార్పొరేట్‌ సంస్థలు ప్రయాణిస్తున్నాయి. తాజా ఆర్థిక కుంభకోణాల చరిత్రలో ఇదొక కీలకాంశం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత ప్రభుత్వం, ఆ కంపెనీలు ఆదాయపు పన్నుచట్టంనుండి తప్పించుకోవడానికి వీలులేని చట్టానికి పదును పెట్టాలి.