Thursday, November 9, 2017

ఈ ఏడాదికి నీటి అవసరాలు తీరినట్లేనా!

  1. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, జూరాల, పులిచింతల‌ జలాశయాల్లో 330 టియంసిల నీరు వినియోగానికి అందుబాటులో ఉన్నదని, 2017 నవంబరు 4న హైదరాబాదులో సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ధారించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో 217.8, 112.2 టియంసిల చొప్పున వినియోగించు కోవాలని నిర్ధేశించింది. ఆ నిర్ణయానికి లోబడి వివాదరహితంగా 2018 జూన్ వరకు త్రాగు నీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ నీటిని వినియోగించు కోవాలని ఆదేశించింది.
  2. నైరుతీ రుతుపవనాలు ప్రారంభంలో నిరాశ పరిచినా, ముగింపులో కాస్తా ఆనందాన్నినింపి నిష్క్రమించాయి. మంచి వర్షాలు పడ్డాయన్న భావన కలిగించి వీడ్కోలు తీసుకొన్నాయి. కొన్ని మినహాయింపులతో మొత్తం మీద వాగులు, వంకలు, చిన్న పెద్ద నదులు ప్రవహించాయి. అత్యధిక భాగం కుంటలు, చెరువులు నిండాయి. భూగర్భజలాలు కాస్తా పెరిగాయి. ఖరీప్ సాగుకు నీరు లభించక పోయినా ఏడాది పాటు నీటి కష్టలుండవన్న భావన నెలకొన్నది. నిత్య కరవులతో బాధపడుతున్న‌ రాయలసీమ ప్రాంతంలో కూడా కురిసిన వర్షాల పట్ల‌ ప్రజలు స్థూలంగా సంతృప్తితో ఉన్నారు. ఈశాన్య రుతుపవనాల వల్ల‌ కూడా ప్రయోజనం వనకూడుతుందని ఆశిద్దాం.
  3. ఈ ఏడాది జూన్ 1 నుండి నవంబరు 9 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ వర్ష పాతం 775 మి.మీ. గాను 729 మి.మీ. నమోదయ్యింది. సాధారణ వర్షపాతం కంటే 6% తక్కువ. శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు సాధారణ వర్ష పాతం కంటే తక్కువ నమోదైతే, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాలలో సాధారణ వర్షపాతం, అనంతపురం, కడప మరియు చిత్తూరు జిల్లాలలో 21% నుంచి 25% వరకు అధిక వర్షపాతం నమోదయ్యిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర సగటు వర్షపాతం కంటే రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల సగటు వర్షపాతం తక్కువ. ఉదా: తూర్పు గోదావరి జిల్లాలో 1003 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 814 మి.మీ. నమోదయ్యింది. అనంతపురం జిల్లాలో 462 మి.మీ. సాధారణ వర్షపాతంకు గాను 559 మి.మీ. నమోదు కావడంతో 21% అధికంగా వర్షం పడ్డట్లు పేర్కొనబడింది. కడప జిల్లాలో 565% మి.మీ. సాధారాణ వర్షపాతానికి గాను 690 మి.మీ. నమోదైనా కోడూరు శాసనసభా నియోజకవర్గంలోని చెరువుల్లోకి పెద్దగా నీరు చేరలేదు. పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు ప్రవహించినా, చెయ్యేరుకు ఉపనదిగా ఉన్న గుంజన ప్రవహించ లేదు.
  4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక‌ సగటు వర్ష పాతం 852 మి.మీ. తూర్పు గోదావరి జిల్లా సగటు వర్షపాతం దాదాపు 1100 మి.మీ.గా ఉంటే అనంతపురం జిల్లా 550 మి.మీ. మాత్రమే. రాయలసీమ ప్రాంత సగటు వర్ష పాతం 645 మి.మీ. నైరుతీ రుతు పవనాల వల్ల లభించాల్సిన సగటు వర్షపాతం కంటే కాస్తా అధికంగా వర్షపాతం నమోదైనా రాయలసీమ ప్రాంతం సగటు వర్షపాతం తక్కువన్న వాస్తవాన్నిపరిగణలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నీటి వాడకంలో ఆ ప్రాంత నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  5. నైరుతి రుతు పవనాల వల్ల జూన్ నుండి సెప్టంబరు వరకు కురిసే వర్షాల ద్వారానే 65% నీటి లభ్యత ఉంటుంది. గోదావరి నదీ జలాలు పుష్కలంగా లభించడంతో గోదావరి డెల్టా ఆయకట్టులోను, కృష్ణా జలాలపై ఆధారపడిన క్రిష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేయడం, వాటికి తోడు నాగార్జునసాగర్ క్రింది భాగంలో లభించిన వర్షపు నీటితో ఖరీప్ పంటను సాగు చేసుకొన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లోను, అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల క్రింది ఆయకట్టుకు ఖరీప్ పంట సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేదు. రబీలో ఆరుతడి పంటలు పండించు కోకపోతే రైతాంగం నిలదొక్కుకోలేదు.
  6. కృష్ణా, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లోని తాజా నీటి నిల్వలను పరిశీలిద్దాం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాలు నిండి పొంగి పొర్లిన తరువాతనే క్రిందికి నీరు వదిలి పెట్టబడింది. ఆల్మట్టి, నారాయణపూర్ దాటుకొని జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపించేలా నీరు చేరింది. శ్రీశైలంలోకి ఆశాజనకంగా నీరు చేరిన మీదట‌ నాగార్జునసాగర్ జలాశయానికి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి.కి మరియు తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు రిజర్వాయరుకు, హంద్రీ ‍- నీవాకు, తెలంగాణలోని కల్వకుర్తికి నీటిని తరలించడం ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. నవంబరు 9వ తేదీ నాటి గణాంకాలను బట్టి శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం ఆగి పోయింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216 లకు గాను 185 టియంసిలు ఉన్నాయి. నాగార్జునసాగర్ లో 312కు గాను 270 టియంసిలకు నిల్వ చేరింది. పులిచింతలలో 46కు గాను 9 టియంసిలే ఉన్నాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 17కు గాను 16 టియంసిల నిల్వ చేయబడింది. కానీ 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం జలాశయంలో రెండు, మూడు టియంసిల నీరు కూడా చేరలేదు. శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడ్డ ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగమైన గోరకల్లులో 12.5కు గాను 7, ఔక్ లో 4కు గాను 2 టియంసిలు ఉన్నాయి. గండికోటలో 28కి గాను 4, మైలవరం 10కి 2, అలగనూరులో 2.6 టియంసిల నీటి నిల్వలు ఉన్నాయి. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టియంసిలకు గాను ప్రస్తుతం 75 టియంసి లున్నాయి. పిఎబిఆర్ లో 11కు గాను తుంగభద్ర జలాశయం మరియు హంద్రీ – నీవా ద్వారా వచ్చిన నీరు 3 టియంసిలు మాత్రమే చేరాయి. పెన్నా నదికి ఉపనదులైన కుందు, చెయ్యేరు, పాపాఘ్ని ప్రవాహంతో నెల్లూరు జిల్లాలోని సోమశిలలో 78కి గాను 50 టియంసిలు, కండలేరులో 68కు గాను 18 టియంసిలకు మాత్రమే నిల్వలు చేరాయి.
  7. మహారాష్ట్ర, కర్నాటక మరియు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతగా చెన్నయ్ నగరానికి 15 టియంసిల త్రాగు నీటిని కండలేరు నుంచే సరఫరా చేయాల్సి ఉన్నది.
  8. రాయలసీమ ప్రాంతంలోని వెలుగోడు మినహాయిస్తే మిగిలిన‌ జలాశయాలలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టానికిపైన నీటి నిల్వ ఉన్న కాలంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నయ్ నగరానికి 15 టియంసిలను త్రాగు నీటి కోసం సరఫరా చేయడానికి కండలేరులో నిల్వ చేయాలి, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.)కి 19 మరియు కె.సి.కెనాల్ కు 10, మొత్తం 44 టియంసిల నికరజలాలతో పాటు తెలుగు గంగకు 29, గాలేరు – నగరి సుజల స్రవంతి పథకానికి 38 కలిపి 67 టియంసిల వరద నీటితో కలిపి స్థూలంగా 112 టియంసిల నీటిని తరలించాల్సి ఉన్నది.
  9. కృష్ణా నదీ ప్రవాహ కాలం 30 రోజులకు మించి ఉండడం లేదన్న ఉద్ధేశ్యంతోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుండి 44,000 క్యూసెక్కుల తరలింపుకు వీలుగా విస్తరించడానికి 2005 డిసెంబరు 21న జరిగిన అఖిల పక్ష సమావేశం ఆమోదం తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్నెండేళ్ళు గడచి పోతున్నా హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నత్త నడకన‌ సాగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మధ్య 16 కి.మీ. పొడవున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులను పూర్తి చేస్తే తప్ప 44,000 క్యూసెక్కుల నీటిని తరలించడం సాధ్యం కాదు. ఈ ఏడాది 14,000 క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్ళ లేక పోయారంటే నిర్మాణ పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. పర్యవసానంగా బి.మఠానికి నీరు పెద్దగా చేరలేదు.
  10. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జారీ చేసిన జి.ఓ.నెం.69 మేరకు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులుగా నిర్ధారించినా, గత ఏడాది 785 అడుగుల వరకు నీటిని తోడేశారు. పర్యవసానంగా ఈ ఏడాది 854 అడుగులకు నీరు చేరడానికే చాలా రోజులు పట్టాయి. ఇప్పుడు నదీ ప్రవాహం ఆగిపోయింది. నాగార్జునసాగర్ ఇంకా నిండలేదు. దాన్ని నింపడానికి శ్రీశైలం నుండి జలవిద్యుదుత్పాదన చేసుకొంటూ నీటిని క్రిందికి వదులుతున్నారు. పర్యవసానంగా శ్రీశైలంలో ఇప్పటికే 191 టియంసిలకు నిల్వ పడిపోయింది.
  11. ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగంగా నిర్మించబడిన గోరకల్లు గరిష్ట‌ నీటి నిల్వ సామర్థ్యం 12.5 టియంసిలైతే నేడు 7 టియంసిలకు మించి నిల్వ చేయలేని దుస్థితి. నాసిరకం నిర్మాణం పర్యవసానంగా లీకేజీల సమస్య వెంటాడుతున్నది. 4 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన ఔక్ రిజర్వాయరులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు అటవీ భూముల ముంపు సమస్య అపరిష్కృతంగా కొనసాగుతున్నది. ఫలితంగా 2 టియంసిలకు మించి నిల్వ చేసుకోలేని దుస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 1,95,000 ఎకరాల నిర్ధేశిత ఆయకట్టుకు నీరెలా అందిస్తారు?
  12. గండికోట జలాశయం నిల్వ సామర్థ్యం 27 టియంసిలు. పెన్నా నది వరద నీరు, ఔక్ నుండి విడుదల చేసిన కొద్దిపాటి కృష్ణా నదీ జలాలు కలిపి దాదాపు ఐదు టియంసిలు మాత్రమే చేరాయి. అందులో 10 టియంసిల సామర్థ్యమున్న మైలవరానికి 2 టియంసిలను, మరికొంత నీటిని పైడిపాళెంకు ఎత్తిపోతల ద్వారా తరలించారు. గండికోట జలాశయంలో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేయాలంటే ముద్దనూరు, కొండాపురం మండలాల్లో ముంపుకు గురయ్యే 22 గ్రామాల ప్రజలకు నష్ట పరిహారాన్ని పూర్తిగా చెల్లించి, పునరావాసం కల్పించాలి. ముంపుకు గురౌతున్న రహదారి, రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉన్నది. జలాశయంలో నీరు చేరినా నిర్ధేశిత ఆయకట్టుకు నీరందించడానికి అవకాశమే లేదు. మొదటి దశలో 30,000 ఎకరాలకు సాగు నీరివ్వాలన్నా నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. కాకపోతే వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తే కనీసం ఆ చుట్టు ప్రక్కల భూగర్భ జలాలన్నా పెరుగుతాయన్న ఆశ ప్రజల్లో ఉన్నది. రెండవ దశ నిర్మాణ పనులను ప్రభుత్వం అటకెక్కించి కూర్చొన్నది. చిత్రావతి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులు ‘ట్రయిల్ రన్’ కంటే ముందే పగిలి పోయాయన్న వార్తలొచ్చాయి.
  13. తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించబడిన వెలుగోడుకు కృష్ణా నీటిని సామర్థ్యానికి అనుగుణంగా తరలించారు. అంత వరకు అభినందనీయం. కానీ, 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం రిజర్వాయరుకు ఇప్పటికీ రెండు, మూడు టియంసిల నీటిని కూడా చేర్చలేదు. ఆ రిజర్వాయరు క్రింద పంట కాల్వల వ్యవస్థ నిర్మాణం కూడా నత్తలతో పోటీ పడుతున్నది. గతంలో రిజర్వాయరులోకి నీరు చేరిన సందర్భాలలో పోరుమామిళ్ళ, బద్వేల్, తదితర చెరువుల‌ ద్వారా సాగుకు నీరిచ్చారు. ఇప్పుడూ అలా చేయవచ్చు. అయితే, రిజర్వాయరులో నీళ్ళే లేని పరిస్థితి.
  14. కె.సి. కెనాల్ క్రింద సాగవుతున్న‌ 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర నదీ ప్రవాహం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది. కేవలం 1.2 టియంసిల నిల్వ సామర్థ్యమున్న సుంకేసుల ఆనకట్ట, 3 టియంసిల సామర్థ్యమున్న అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మాత్రమే ఉన్నాయి. తుంగభద్ర నుంచి కె.సి.కాలువకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టియంసిలను పిఎబిఆర్ కు కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కె.సి.కాలువకు శ్రీశైలం నుండి సర్దుబాటు చేస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు కృష్ణా జలాలను సరఫరా చేయాలి.
  15. ఈ పూర్వరంగంలో శ్రీశైలం జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతించిన నీటి వినియోగంలో రాయలసీమ నీటి అవసరాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి. తుంగభద్ర‌ జలాశయం నీటి వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా న్యాయమైన వాటా సాధనకు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి.
         టి.లక్ష్మీనారాయణ‌

Saturday, October 7, 2017

కమ్యూనిస్టు నీతే వి.కె. వ్యక్తిత్వానికి మణిహారం


వి.కె. అన్న రెండక్షరాలు చెవుల్లో ధ్వనించగానే అనిర్వచనీయమైన గాఢానుబంధంతో కూడిన అనుభూతులు మెదడులో కదలాడుతాయి. వాటన్నింటినీ క్రోడీకరించి, అక్షర బద్దం చేయడం సాధ్యం కాని పని. నా స్మృతి పథంలోని కొన్నింటిని ప్రస్తావించే ప్రయత్నమే ఇది. కమ్యూనిస్టు నైతికత, నిబద్ధత, నమ్రత, నడతకు నిలువుటద్దం మా వి.కె. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాయకుడన్న దర్పాన్ని ప్రదర్శించడం, కార్యకర్తలు మరియు క్రింది స్థాయి నాయకత్వంపై పెత్తనం చేసే మనస్తత్వం, పార్టీని స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలన్న ఆలోచన ఆయన దరికి చేరలేదు. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచాలనే ఆసక్తి కనబరచలేదు. తన ప్రసంగాల ద్వారా శ్రోతలను విసిగించనూ లేదు. కమ్యూనిస్టు శ్రేణులే ఆయన‌ కుటుంబం. అత్యంత వెనుకబడ్డ, నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంత ప్రజల గొంతు. శ్రామిక ప్రజల నికార్సైన నేత. రాయలసీమ నాలుగు జిల్లాల కమ్యూనిస్టు శ్రేణుల అప్యాయతానురాగాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కమ్యూనిస్టులు, మరీ ప్రత్యేకించి ఎ.ఐ.ఎస్.ఎఫ్. శ్రేణుల  అభిమానాన్ని చూరగొన్న విలక్షణమైన‌ వ్యక్తిత్వం ఆయనది. కమ్యూనిస్టుగా సాదా సీదా జీవితాన్ని గడిపిన ధన్యజీవి. భావితరాలకు ఆదర్శప్రాయుడు.
కడప జిల్లా, చిట్వేలి ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.)లో చేరి, కార్యకర్తగా ఎదిగాను. రాజంపేటలో ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకొని, 1975 జూన్ లో తిరుపతి ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులో చేరాను. అమరజీవి కామ్రేడ్. వి.కె. గారు భారత కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర బాధ్యులుగా చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాన్ని'గైడ్' చేయడానికి తిరుపతికి వస్తుండే వారు. మృదు స్వభావి. కార్యకర్తలు, నాయకులు అన్నతారతమ్యం లేకుండా అందరితో కలిసి పోయే వారు. విద్యార్థి రంగం నుండి నేను జిల్లా కమ్యూనిస్టు సమితి సమావేశాలకు హాజరయ్యే వాడిని. ప్రపంచ పరిణామాలపై సోవియట్ యూనియన్ మరియు ఇతర సోషలిస్టు దేశాల ప్రభావం గణనీయంగా ఉండే రోజులు. దేశ రాజకీయాలపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉండేది. రాష్ట్ర పార్టీ బాధ్యులుగా సమావేశాలకు హాజరయ్యే నాయకులు మొదట అంతర్జాతీయ పరిణామాలతో మొదలు పెట్టి, జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాలపై 'రిపోర్టు' ఇచ్చేవారు. రాజకీయ రిపోర్టు విని, నూతన విశేషాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస‌ సభ్యుల్లో ఉండేది. అంకిత భావంతో దశాబ్ధాలుగా పార్టీలో పని చేస్తున్న పలువురు పెద్దలు జిల్లా సమితిలో సభ్యులుగా ఉండేవారు. వారిలో దాదాపు అరడజను మంది వరకు ఏళ్ళ తరబడి గ్రామ సర్పంచ్ లుగా ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న సీనియర్ కామ్రేడ్స్ కూడా ఉండే వారు. కామ్రేడ్స్ మధ్య ఉండాల్సిన ఆప్యాయతానురాగాలు వారి మధ్య నిండుగా ఉండేవి. వారంతా అత్యంత ఆసక్తితో సమావేశాలకు హాజరయ్యే వారు.
జిల్లా కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా అమరజీవి కా. గంధమనేని శివయ్య గారు బాధ్యతలు నిర్వహిస్తుండే వారు. ఆయన సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉపోద్ఘాతం మొదలు పెట్టి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా మాట్లాడే వారు. అధికార పార్టీలోని ఆంతరంగికుల ద్వారా డిల్లీ నుండి మద్రాసు మీదుగా తన చెవికి నేరుగా చేరిన సమాచారం అంటూ చెప్పుకొచ్చే వారు. వి.కె.గారితో సహా అందరూ ఆసక్తిగా వినేవాళ్ళు. ఇంతలో మధ్యాహ్న భోజనానికి సమయం సమీపించేది. ఏంటి శివయ్యా! భోజనం 'టైం' అయ్యిందే! వి.కె. గారు రాజకీయ రిపోర్టు ఎప్పుడిచ్చేది? అని కొందరు సీనియర్ కామ్రేడ్స్ గుర్తు చేసే వారు. హైదరాబాదు విశేషాలు తప్ప ఆయనకేం తెలుసప్పా! అని శివయ్య గారు 'జోక్' చేసే వారు. శివయ్య గారు మాజీ శాసన సభ్యులు. పాలక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రముఖ నాయకుల్లో కొందరు శివయ్య గారికి మంచి మిత్రులుండే వారు. వారి ద్వారా డిల్లీలో జరిగే రాజకీయ పరిణామాలు(గాసిప్స్) ఆయన చెవికి చేరేవి. వాటిని గుదిగుచ్చి రాజకీయ నివేదికగా వినిపించే వారు. శివయ్య చెప్పింది నిజమేనప్పా! ఆయనకున్నంత ఆంతరంగికమైన సమాచారం నాకు లేదని వి.కె. గారు సరదాగా వ్యాఖ్యానించే వారు. దాంతో అందరూ భోజనాలకు లేచి వెళ్ళేవాళ్ళు. భోజనానంతరం ఎవరి దారిన వాళ్ళు వూళ్ళకు వెళ్ళి పోయేవారు. పెద్ద వాళ్ళు, బస్సులు పట్టుకొని, చీకటి పడక ముందే వాళ్ళ గ్రామాలకు చేరుకోవాలి కదా! ప్రతిసారి ఇలానే జరిగేది. అయినా కా.వి.కె. గారు కానీ, సమితి సభ్యులు కానీ విసుగు చెందే వారు కాదు, సరదాగా 'కామెంట్' చేస్తూ సమావేశానికి హాజరయ్యామన్న సంతృప్తితో వెళ్ళి పోయే వారు. నేను ఇంత దూరం నుంచి శ్రమపడి వచ్చానే, హాజరైన సభ్యులందరూ ఉండగా రాజకీయ రిపోర్టు ఇవ్వలేక పోయానన్న కొద్ది పాటి చిరాకు కూడా వి.కె.గారి ముఖకవళికల్లో నేను ఏనాడు గమనించ లేదు. అంతే! అలా జరిగి పోయేది.
నదీ జలాల సమస్యలపై అధ్యయనం చేయాలన్న‌ఆసక్తి నాకు కలగడానికి వి.కె.గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రాయలసీమ కరవు నివారణకు కృష్ణా జలాల మళ్ళింపే శాశ్వత పరిష్కారమన్న నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో కూడా పలు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాం. 1977 నవంబరు 20న‌ "రాయలసీమ సమగ్రాభివృద్ధికి యువజన - విద్యార్థి సదస్సు"ను తిరుపతిలో నిర్వహించాం. దానికి కా.నీలం రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు. రాయలసీమకు కృష్ణా నదీ జలాలను మళ్ళించాలన్న ప్రధానమైన డిమాండుతో 1980 ఆగస్టు 25న‌ హైదరాబాదులో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించాం.
1981 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడి హైదరాబాదుకు మకాం మార్చాను. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా. గిరిప్రసాద్ గారిని కలవడానికి ఆయన గదిలోకి వెళ్ళాను. నన్ను చూడగానే రండి లక్ష్మీనారాయణ గారు అని సంబోధించారు. ఆ మాట వినగానే వెంటనే వెనుదిరిగాను. ఏంటి వెళ్ళిపోతున్నారు, రండి, కూర్చోండని పిలిచారు. గిరిప్రసాద్ గారి వైపు తిరిగి మీరు పెద్ద వారు, నన్ను బహువచనంతో సంబోధించడం నాకు నచ్చలేదు, మా వి.కె. గారి లాగా ఏకవచనంతో పిలవండి అన్నాను. ఏరా, రా, ఎలా ఉన్నావ్, ఎప్పుడొచ్చావ్, అన్న పలకరింపుల్లో ఉన్న ఆప్యాయత, అనురాగం, సాన్నిహిత్యం యొక్క మాధుర్యాన్ని వి.కె. గారి నుండి ఆస్వాధించాను.
 విద్యార్థి రంగానికి రాష్ట్ర పార్టీ బాధ్యులుగా కా.వి.కె. గారు ఉండే వారు. ఆయన పార్టీ 'ఇన్ ఛార్జ్'గా ఉండడంతో నాకు కొండంత ధైర్యంగా ఉండేది. కార్యక్రమాల రూపకల్పనలో సలహాలు ఇవ్వడం తప్ప, అవసరానికి మించి జోక్యం చేసుకొనే వారు కాదు. ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ, ప్రోత్సాహం వి.కె. గారి నుండి లభించేది. విద్యార్థి ఉద్యమ విస్తరణ, పటిష్టత, సైద్ధాంతిక శిక్షణ, నాణ్యమైన కార్యకర్తల తయారీ, పని విభజన, బాధ్యతల అప్పగింత, నియంత్రణ, జవాబుదారీతనం, విద్యార్థుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి, సలహాలిస్తూ వెన్నంటి ఉండేవారు. ముఖ్యమైన జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో నిర్వహించబడిన సమావేశాలు, వర్క్ షాప్స్, సదస్సులకు మాతో పాటు హాజరయ్యే వారు. ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు సుమా! జిల్లాల పార్టీ నాయకత్వాల సహకారాన్ని విద్యార్థి ఉద్యమానికి అందేలా చూడడానికి, పూర్తి కాలం లేదా పాక్షికంగా సమయాన్ని వెచ్చించి పని చేస్తున్న కార్యకర్తల ఎంపిక, నియామకం, వారికి అవసరమైన ఆర్థిక సహకారంపై పార్టీ నాయకత్వాలతో చేసే సమాలోచనల్లో క్రియాశీలంగా తోడ్పాటునందించడాని మా వెన్నంటి ఉండే వారు.
ఇక్కడొక ఘటనను ప్రస్తావించడం సముచితంగా ఉంటుందను కొంటున్నాను. పదవ తరగతి పరీక్షా ఫలితాల జాప్యాన్ని, కంపూటర్ల అవకతవకలను నిరసిస్తూ సచివాలయం ముందు పికెటింగ్ చేయాలని ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర సమితిలో చర్చించిన మీదట నిర్ణయించాo. 1984 జూన్ 22న‌ ఎవరికి వారు విడివిడిగా వెళ్ళి సచివాలయంకు ఎదురుగా ఉన్న బ్రిటీష్ లైబ్రరీలోను, ప్రక్కనున్న టీ హోటల్, వాటి పరిసరాలకు చేరుకొని, ఒక్కసారిగా 'మెయిన్ గేట్' ముందుకు దూసుకు పోయి పికెటింగ్ చేయాలని వ్యూహాన్ని రచించుకొని, ఆ మేరకు అమలు చేశాం. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమితి సభ్యులందరూ పాల్గొన్నారు. పోలీసుల కన్నుకప్పి సచివాలయం ముందు పికెటింగ్ చేయడంతో కంగుతిన్న పోలీసులు కసికొద్దీ లాఠీలకు పని చెప్పారు. కొంత మందికి తలలపై గాయాలై, రక్తంతో తడిసి పోయారు. లాఠీ చార్జీలో నాతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందర్నీ అరెస్టు చేసి అసెంబ్లీకి ఎదురుగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, లోపల పెట్టారు. విశాలాంధ్ర విలేకరి కా.నర్సింగ్ ఈ సమాచారాన్నిరాష్ట్ర పార్టీ కార్యదర్శి కా.గిరిప్రసాద్ గారికి చేరవేసి, మీరు జోక్యం చేసుకొంటే గానీ పోలీసులు విడుదల చేయరని చెప్పారట. ఆయన మొదట కాస్త అసహనం వ్యక్తం చేసినా అటుపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఫలితంగా మేము విడుదలై, మగ్ధూం భవన్ కు ఆ రోజు రాత్రి పొద్దుపోయాక చేరుకొన్నాం.
మరుసటి రోజు ఉదయాన్నే గిరిప్రసాద్ గారు నన్ను పిలిచి, ఎందుకు అలా చేశారని అడిగారు. రాష్ట్ర సమితి చేసిన సమిష్టి నిర్ణయం మేరకే పికెటింగ్ చేశామని చెప్పా. కా.వై.బాబురావు(ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు)ను కూడా అడిగి తెలుసుకోమ‌ని, ఆయన్ను కూడా పిలిచా. కా. వి.కె. గారి సమక్షంలోనే చర్చించి తీసుకొన్న నిర్ణయమని చెప్పా. వి.కె. గారి మద్ధతు కూడా ఉందన్న మాట. ఈ తరహా ఆందోళనల వల్ల జరిగే ప్రయోజనమేంటి? అని అడిగితే, జరిగిన లాఠీ చార్జీపై రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు స్పందించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొంటారని చెప్పా. అలాగే, రాష్ట్ర వ్యాపితంగా తీవ్ర స్థాయిలో సమ్మె జరిగింది. పదుల వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వి.కె. గారు మాకు మద్ధతుగా నిలిచారు. ఆందోళన వల్ల వచ్చిన సత్ఫలితాలను గమనించాక గిరిప్రసాద్ గారు అభినందించారు. అలాంటి పరీక్షా సమయాల్లోనే నాయకులు నికార్సుగా కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలవాలి, ప్రోత్సహించాలి. వి.కె. గారు ఆచరణలో అలాగే చేసే వారు. ఇది ఒక నిర్ధిష్టమైన ఉదాహరణ మాత్రమే.
రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా కార్యక్రమాలను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పాఠశాలలను ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో నిర్వహించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాం. ఒకసారి అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పిఎబిఆర్) వద్ద రాయలసీమ ప్రాంతీయ శిక్షణా శిబిరాన్ని నిర్వహించాం. ఒక పూట పొట్టేలు మాంసం వడ్డించారు. మాంసం కూరలో నూనె, ఎర్రటి కారం బాగా దట్టించి వేసి చేశారు. చిత్తూరు జిల్లా నుండి వచ్చిన విద్యార్థి కార్యకర్తలకు ఆ మాంసం తింటుంటే నాలుకలు మండి పోయాయి. కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి. దాంతో మాంసం ముక్కలను గ్లాసుల్లోని నీళ్ళతో కడుక్కొని తిన్నారు. ఆ దృశ్యాన్ని గమనించి, ఆ మాత్రం కారం తినలేని మీరేం రాయల‌సీమోళ్ళురా! పౌరుషం ఎలా వస్తుందని వి.కె. గారు వ్యాఖ్యానిస్తే, వాళ్ళు ముసిముసి నవ్వులతో పంటి బిగువున ఆ కూరను తిన్నారు.
సమావేశాల్లో చర్చల సందర్భంగాను, పిచ్చాపాటిగా మాట్లాడే సందర్భాలలోను కార్యకర్తలను ఏరా! అప్పెంతుంది? అని అడిగే వారు. అప్పు లేదంటే, ఎంత అప్పు ఉంటే అంత బాగా కార్యక్రమాలు చేస్తున్నట్లు లెక్కని సరదాగా వ్యాఖ్యానించే వారు. ఒకసారి నా విద్యార్థి ఉద్యమ‌ సహచరుని పెళ్ళికి ఇద్దరం వరంగల్ వెళ్ళాం. ఆశీర్వదించడానికి ఆయనతో పాటు వేదికెక్కుతుంటే, రేయ్! నీకు పెళ్ళి కాలేదు, ఆశీర్వదించే అర్హత నీకు లేదన్నారు. అలా సరదాగా జోకులు వేస్తూ మాలో ఒకరుగా కలిసి పోయే వారు.
1985 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్. జాతీయ మహాసభను గుంటూరులో నిర్వహించాం. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతను స్వీకరించాలన్న ప్రతిపాదనను పార్టీ నాయకత్వం నా దృష్టికి తీసుకొచ్చింది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ విషయాన్ని వి.కె. గారికి ఫోన్ ద్వారా తెలియజేశాను. జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించే సామర్థ్యం లేదని, తెలుగులో తప్ప ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో మాట్లాడడం రాదని, నన్ను రక్షించండని మొరపెట్టు కొన్నాను. అంతా విని, ఆయన ఒక్కటే మాట అన్నారు. అది పార్టీ నిర్ణయం. నీవు పార్టీలో ఉండదలుచుకొంటే అంగీకరించక తప్పదు. ఒకసారి గిరి గారితో కూడా మాట్లాడు అన్న సలహా ఇచ్చారు. అటుపై గిరి గారితో మాట్లాడాను. కేంద్ర పార్టీ నిర్ణయాన్నిమార్పించ లేనని కరాకండిగా చెప్పేశారు. దాంతో విధిలేక అంగీకరించి, డిల్లీకి వెళ్ళాను. జాతీయ పార్టీ నుండి విద్యార్థి రంగ బాధ్యులుగా కా.ఎ.బి.బర్ధన్, పార్టీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ బాధ్యులుగా కా. నీలం రాజశేఖరరెడ్డి గారు ఉండే వారు. వారిరువురి సహాయ సహకారాలు, రాష్ట్రంలో వి.కె. గారి తోడాటుతో నెట్టుకొచ్చేశాను. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో నాకు వెన్నుదన్నుగా కా.వి.కె. గారు నిలిచారు.
విద్యార్థి ఉద్యమం నుంచి సెలవు పుచ్చుకొన్నాక‌ కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచు కోవాలన్నతలంపుతో 1991లో కడపకు చేరుకొన్నాను. రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద దిక్కుగా వి.కె. గారు కడప జిల్లా సమావేశాల్లో పాల్గొనే వారు. చిత్తూరు జిల్లాకు భిన్నమైన‌ వాతావరణంలో కడప జిల్లా సమావేశాలు జరిగేవి. రాష్ట్ర బాధ్యులుగా హాజరైన కా.వి.కె. గారి రాజకీయ రిపోర్టును సమావేశం ప్రారంభంలోనే చాలా శ్రద్ధగా వినేవారు. రాజకీయ నివేదిక ఇవ్వడంతో నా పని అయిపోయిందనుకోకుండా సభ్యులు వ్యక్తం చేసే అభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా ఆలకించి, స్పందించే గుణం ఆయనది.
ఎ.ఐ.ఎస్.ఎఫ్. మరియు కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా వి.కె.గారితోను, ఆయన కుటుంబ సభ్యులతోను ఏర్పడిన అనుబంధం అమూల్యమైనది. వి.కె. గారి సతీమణి శ్రీమతి పార్వతమ్మ పలకరింపు, ఆతిథ్యంలో తల్లి వాత్సల్యం తొణికిసలాడుతుంది. ఆయన సోదరి అమరజీవి పార్వతమ్మ గారు మహిళా ఉద్యమ నేతగా రాణించారు. ఆయన ఆయన సోదరుల కుమారులు వి.కె.వెంకట్రామిరెడ్డి గారు తాడిపత్రి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించడమే కాకుండా విద్యార్థి దశలో కా.కొల్లి నాగేశ్వరరావు సహచరుడుగా ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో పని చేశారు. స్వగ్రామానికే పరిమితమై పని చేసినా విశ్వనాథరెడ్డి గారి కృషిని విస్మరించలేం. వి.కె.రంగారెడ్డి గారు ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యమ నిర్మాణంలో నాకు సహచరుడు. 1978 డిసెంబరులో నాటి జనతా ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బంద్ నిర్వహిస్తే, అందులో బి.టి.కళాశాల విద్యార్థులు పాల్గొనక పోవడంపై ఆగ్రహించిన స్థానిక శాసనసభ్యుడు విద్యార్థులపై కాల్పులు చేసిన ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి, చెయ్యి కోల్పోయాడు. ఆ కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ఉధృతమైన పోరాటాన్ని నిర్వహించాం. ఆ ఉద్యమానికి నాయకత్వ‍ం వహించిన కార్యాచరణ కమిటీకి నేను కన్వీనర్ గా వ్యవహరించాను. వి.కె.రంగారెడ్డి గారు మదనపల్లి సబ్ జైల్ లో 15 రోజులు నిర్భందించబడ్డారు. నేను రెండు రోజులు ఆ జైల్ లో నిర్భందించబడ్డాను. నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో వెంకట్రామిరెడ్డి గారి కుమార్తె రాధమ్మ, కుమారుడు ప్రదీప్ ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో క్రియాశీలంగా పని చేశారు. అలా కా.వి.కె.గారి కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై పని చేసింది. వి.కె.గారి కుటుంబానికి చెందిన‌ మూడు తరాల‌ సభ్యులతో ఉద్యమ రీత్యా, వ్యక్తిగతంగా నాకు ఏర్పడిన అనుబంధం కమ్యూనిస్టు ఉద్యమం నాకిచ్చిన ఒక అపురూపమైన‌ కానుక. అమరజీవి కా.వి.కె. గారు నేడు భౌతికంగా లేక పోయినా నాలాంటి వారికి నేటికీ మార్గదర్శే.

టి.లక్ష్మీనారాయణ‌

Tuesday, September 26, 2017

అణ్వస్త్రరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలి!

1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో, హీరోషిమా, నాగసాకిలపై హైడ్రొజన్ బాంబులు వేసి మారణహోమానికి అమెరికా పాల్పడింది. ఆనాటి నుంచే ప్రపంచ ప్రజానీకం మనస్సుల్లో అమెరికా అంటే ఒక యుద్ధోన్మాద దేశం అన్న భావన పదిలంగా ఏర్పడింది. సోవియట్ యూనియన్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించి, రక్షణ రంగంలో పోటాపోటీగా అభివృద్ధి చెంది ఉన్నంత కాలం కాస్త వెనకడుగు వేసి చర్చలకు అంగీకరించింది. పర్యవసానంగా, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(స్టార్ట్)పై రెండు దేశాలు 1991లో సంతకాలు చేశాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తదనంతర పరిణామాల పూర్వరంగంలో 1994లో ఆ ఒప్పందం అమలులోకి వచ్చింది. అణ్వాయుధాల ఉత్ఫత్తిని కొనసాగించ కూడదని, నిల్వ ఉన్న అణ్వాయుధాలను క్రమేపీ తగ్గించుకొంటూ రావాలన్ననిర్ధేశిత లక్ష్యాల సాధనలో అడుగు ముందుకు పడలేదు.

గడచిన ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలను పరిశీలిస్తే అమెరికా దుశ్చర్యల వల్లనే యుద్ధాలు వచ్చాయి. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఆప్ఘనిస్తాన్ లో ఆంతరంగిక యుద్ధం, మరొకొన్ని దేశాల్లో జరిగిన యుద్ధాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొన్న లేదా పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్ర అమెరికాకే ఉన్నది. అలాగే ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా మరికొన్ని దేశాలను అమెరికా 'రోగ్ కంట్రీస్'గా ప్రకటించింది. ఎందుకు అమెరికా అలాంటి దౌత్యనీతిని ప్రదర్శిస్తూ వస్తున్నదో మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకోవాలి.

నేడు ప్రపంచంలో పదహైదు వేల అణ్వాయుధాలు ఉంటే వాటిలో అమెరికా దగ్గర ఏడు వేలు, రష్యా దగ్గర మరో ఏడు వేలు ఉన్నాయి. ఇంగ్లండు, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దేశాల వద్ద వెయ్యి ఉన్నాయి. ఏడు వేల అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్నఅమెరికా వల్ల ప్రపంచానికి ముప్పులేదన్నట్లు వ్యవహరిస్తూ, పైపెచ్చు అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతున్నదని, పది అణ్వాయుధాలను సమకూర్చుకొన్న ఉత్తర కొరియా ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించిందన్న ప్రచారాన్ని అమెరికా చేస్తున్నది. ఒక్కటి మాత్రం నిజం. అణ్వాయుధాలు ఏడు వేలున్నా, పది ఉన్నా, వాటిలోఒక్క దాన్ని ప్రయోగించినా జరిగే విధ్వంసం అపారంగానే ఉంటుంది.

తనను 'రోగ్ కంట్రీ'గా ప్రకటించిన అమెరికా నుండి తనను తాను రక్షించుకోవాలంటే, మరొక ఇరాక్ గా, ఆఫ్ఘనిస్తాన్ గా, సిరియాగా కాకుండా ఉండాలంటే అణ్వాయుధాలను తయారు చేసుకోవడమొక్కటే మార్గమన్న దుస్థితికి ఉత్తర కొరియా నెట్టబడిందేమో! దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించడం, కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వతంగా సైనిక స్థావరాన్నిఏర్పాటు చేసుకోవడం లాంటి యుద్ధోన్మాద చర్యలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టాయనడంలో సందేహం లేదు.

అణ్వాయుధాలను నిర్వీర్యం చేయండి, కొత్తగా తయారు చేయవద్దని ప్రపంచ దేశాలన్నీకోరుకొంటున్నాయి. ఒక్క ఉత్తర కొరియాకే కాదు, అణ్వాయుధాలు కలిగి ఉన్న అన్ని దేశాలకు ఇది వర్తింప చేయాలి. అణ్వాయుధరహిత సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేద్దామన్న దృక్పథంతో ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చి నుండి చర్చల ప్రక్రియను ప్రారంభించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి దేశం అమెరికానే. అలాగే, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలు, దాని మిత్ర దేశాలు ఉన్నాయి. భారత్ సహా అణ్వస్త్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి.

సెప్టంబరు 20 నుండి సంతకాల సేకరణను మొదలు పెడితే ఇప్పటికే 53 దేశాలు ఆ తీర్మానంపై సంతకాలు చేశాయని, మూడు దేశాలు 'ర్యాటిపై' కూడా చేశాయని చెప్పబడుతున్నది. ప్రపంచాన్ని కాపాడు కోవాలంటే ఒక్క ఉత్తర కొరియాను కట్టడి చేస్తే సరిపోతుందా! భారత దేశం పోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు తమకే ఆ హక్కు ఉన్నది, ఇతర దేశాలకు ఉండకూడదనే ద్వంద నీతి ప్రదర్శించడం సమర్థనీయం కాదు. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన అణ్వాయుధాలన్నింటినీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం.
 
అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో ప్రకటించిన దేశాల జాబితా నుండి సుడాన్ ను తొలగించి ఉత్తర కొరియా, చాద్, వెనుజువెలా దేశాలను కొత్తగా చేర్చి డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల పూర్వరంగంలో ఈటీవి 'అమెరికా నిషేధాస్త్రం' అన్న శీర్షికతో ప్రతిధ్వని నిర్వహించింది. చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ డి.పాపారావు, జెన్ మనీ సంస్థ, జనరల్ మేనేజర్ శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చర్చలో నేను పై అభిప్రాయాలను స్థూలంగా ప్రస్తావించాను.

https://www.youtube.com/watch?v=BRq8f1TYam8&t=994s

Wednesday, July 5, 2017

జలాశయాల్లో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయ్!


1. కృష్ణా నదీకి 73% నీటి లభ్యత నైరుతీ రుతుపవనాల మీదే ఆధారపడి ఉన్నది. జూన్ మొదలు సెప్టంబరు వరకు నైరుతీ రుతుపవనాల ద్వారా లభించే వర్షపు నీటిని జలాశయాల్లో నిల్వ చేసుకొని వ్యవసాయానికి, త్రాగు నీటికి, జల విద్యుదుత్ఫాదనకు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించు కోవాలి. జూలై మొదటి వారంలో ఉన్నాం. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన పది రోజుల కాలంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిథిలోని ముల్సీ డ్యాం, ఆల్మట్టి డ్యాం, తుంగభద్ర డ్యాం, ప్రకాశం బ్యారేజ్ లను సందర్శించే అవకాశం నాకు లభించింది.
2. కృష్ణా నదికి ఉపనది భీమా. భీమాకు ఉపనది ముల్సీ. పూనే సమీపంలోని 'ముల్సీ లేక్'ను జూన్ 25న సందర్శించాను. ఆ రోజు పూనేలో వర్షం లేదు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ‘ముల్సీ లేక్’ వద్ద మాత్రం వర్షం కురిసింది. జలకళతో తొణికిసలాడుతున్న ‘ముల్సీ లేక్’ ను వర్షంలో తడుస్తూ తిలకించి, పులకించే సదవకాశం లభించింది.
3. అత్యంత కీలకమైన ఆల్మట్టి జలాశయాన్ని జూన్ 29న సందర్శించాను. బస్సు దిగి 'డ్యాం' వైపు నడకసాగిస్తూ, అక్కడ వందల ఎకరాలల్లో నిర్మించబడిన మొగల్ గార్డన్స్, ఇటాలియన్ గార్డన్స్, రాక్ గార్డన్స్ తదితర ఉద్యానవనాలు వెదజల్లుతున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ, ‘సెల్ ఫీ’ మరియు కొత్త మిత్రుల సహకారంతో ఫోటోలు దిగాను. ఆల్మట్టి డ్యాంపైకి సందర్శకులను అనుమతించడం లేదు. జలాశయం 'బ్యాక్ వాటర్'ను చూడడానికి మాత్రమే అనుమతించారు. ఆల్మట్టి నీటి నిల్వ గరిష్ట సామర్థం 130 టియంసిలు అయితే, నేను వెళ్ళిన రోజు కేవలం 12 టియంసిలు ఉన్నాయి. జలాశయంలోకి నీటి ప్రవాహం 9,387 క్యూసెక్కులు. ఆ దృశ్యం చూశాక కాస్తా నిరుత్సాహం కలిగింది. ఆల్మట్టి ఎప్పుడు నిండుతుంది, దాని దిగువన 38 టియంసిల సామర్థ్యం కలిగిన నారాయణపూర్ జలాశయం ఎప్పుడు నిండుతుంది, జూరాల జలాశయంలోకి, శ్రీశైలం జలాశయంలోకి, అటుపై నాగార్జునసాగర్ జలాశయంలోకి ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తాయన్న ఆలోచన మనసును కలచి వేసింది.
4. కృష్ణా నదికి అత్యంత ప్రధానమైన ఉపనది తుంగభద్ర. శ్రీకృష్ణదేవరాయుల సామ్రాజ్యానికి కేంద్ర స్థానంగా వెలుగొందిన హంపికి జూలై 1న వెళ్ళాను. ఆ ప్రక్కనే ప్రవహిస్తున్న తుంగభద్ర నది మధ్యలో ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్ళపై కూర్చొని ఫోటోలు దిగి, ఉల్లాస పడ్డాను. ఆ బండ రాళ్ళ మధ్య కొద్ది పాటి నీరు ప్రవహిస్తున్నది. అక్కడి నుండి తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్ళాను. వర్షపు జల్లుల మధ్య డ్యాం సందర్శన సంతృప్తినిచ్చింది. కానీ, 101 టియంసిల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్నతుంగభద్ర జలాశయంలో 4 టియంసిలు మాత్రమే ఉన్నాయి. కరవు కాటకాల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ప్రధాన నీటి వనరు తుంగభద్రా నది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు, అలాగే కొంత మేరకు కె.సి.కెనాల్ కు నీళ్ళు తుంగభద్ర నుండే సరఫరా కావాలి. గడచిన కొన్నేళ్ళుగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు తుంగభద్ర డ్యాం నుండి నీళ్ళు విడుదల చేయడం లేదనే ఆవేదన రాయలసీమ ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్నది. గత ఏడాది 50 టియంసిలకు అటు ఇటుగా తుంగభద్ర డ్యాంలోకి నీళ్ళు చేరాయి. జలాశయంలోని ప్రస్తుత నీటి నిల్వ ఆందోళన కలిగిస్తున్నది.
5. జూలై 3న విజయవాడకు చేరుకొని, ‘మార్నింగ్ వాక్’ వెళ్ళినప్పుడు నిండుగా ప్రవహిస్తున్న ఏలూరు కాలువను చూశాను. క్రిష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు ప్రస్తుతానికి కృష్ణా నదీ జలాలు అందుబాటులో లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216కు గాను 20 టియంసిలు, నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312కు గాను 117 టియంసిలు, పులిచింతల జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 46కు గాను 2 టియంసిలు ఉన్నాయి. ఈ మూడు జలాశయాలలోకి వర్షపు నీటి ప్రవాహం నేడు లేదు.
శ్రీశైలం జలాశయం నుండి  రాయలసీమ ప్రాంతంలో పాక్షికంగా నిర్మాణం పూర్తి అయిన‌ ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలంటే 854 అడుగుల కనీస నీటి మట్టం ఉంటే తప్ప సాధ్యపడదు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. 834 అడుగుల మట్టానికి నీరు పడిపోతే త్రాగు నీటికి తప్ప నీటిని వినియోగించడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుతం 779 అడుగులకు నీటి మట్టం చేరుకొన్నది.
నాగార్జునసాగర్ లో గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. నీటి మట్టం 510 అడుగులకుపైన ఉంటే తప్ప క్రిష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయరు. ప్రస్తుతం 501 అడుగుల నీటి మట్టం వరకే నీరుంది.
ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 130కి గాను 31 టియంసిలు, జలాశయంలోకి నీటి ప్రవాహం 40,547 క్యూసెక్కులు. నారాయణపూర్ గరిష్ట నీటి నిల్వ 38కి గాను 15 టియంసిలు ఉన్నాయి. తుంగభద్రలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101కి గాను 8 టియంసిలు ఉన్నాయి. నేను తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్ళిన జూలై 1న‌ జలాశయంలోకి నీటి ప్రవాహం 14,573 క్యూసెక్కులుగా ఉంటే ఆ ప్రవాహం కాస్తా జూలై 5 నాటికి 9,256 క్యూసెక్కులకు తగ్గి పొయింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో జూలై 5 నాటి గణాంకాల మేరకు వివిధ జలాశయాలల్లోని నీటి నిల్వలను పరిగణలోకి తీసుకొంటే కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఉన్న జలాశయాలు నిండేదెప్పుడు, తెలుగు రాష్ట్రాలకు నీళ్ళొచ్చేదెప్పుడు అన్న ప్రశ్న అనివార్యంగా ఉద్భవిస్తుంది.
6. గోదావరి నదికి కూడా నైరుతీ రుతుపవనాల ద్వారానే అత్యధిక నీరు లభిస్తుంది. ధవళేశ్వరం ఆనకట్టకు పైభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడి ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తక్కుగా ఉన్నాయి. అయినా, గోదావరి నది దిగువ ప్రాంతంలో వర్షపు నీరు పుష్కలంగా లభిస్తున్నది. ధవళేశ్వరం ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2.93 టియంసిలు.ఆ మేరకు నీటిని నిల్వ చేసి, గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా 88,265 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం ఆనకట్ట నుండి క్రిందికి వదిలేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో పొందు పరచిన గణాంకాలను బట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజీలోకి 7,668 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఇందులో అత్యధిక భాగం పట్టిసీమ‌ ఎత్తి పోతల  ద్వారా తరలిస్తున్న గోదావరి నీరే.
7. జూలై మొదటి వారం గడచిపోతున్నా కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా ఉంటే, గోదావరి నది నీరు సముద్రం పాలౌతున్నది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోలేం. పోలవరంతో సరిసమానంగా ప్రాధాన్యతనిచ్చి రాయలసీమ ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలోను నిర్మాణంలో ఉన్న ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ‌ ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప కరవు సీమ దాహార్తి తీర్చడం సాధ్యం కాదు.

టి.లక్ష్మీనారాయణ‌

Saturday, July 1, 2017

పరోక్ష పన్నుల వ్యవస్థ - మౌలిక మార్పులు: జి.ఎస్.టి



1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 17 రకాల పరోక్ష పన్నులను ప్రజలపై మోపి అడ్డగోలుగా దోపిడీ చేసేవి. పర్యవసానంగా బహుళ పన్నుల వ్యవస్థ పట్ల దేశ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో “ఒకే దేశం - ‍ ఒకే మార్కెట్ - ఒకే పన్నుల వ్యవస్థ” నినాదంతో వస్తు సేవల పన్ను(GST) చట్టం పట్టాలెక్కింది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ వచ్చిన‌ వాట్ వగైరా పన్నులన్నింటి స్థానంలో వస్తువుల ఉత్ఫత్తి, అమ్మకం, వినియోగం మరియు సేవలపై ఒకే పన్ను విధించే సమగ్ర జాతీయ విధానమే ఈ "గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ (జి.ఎస్.టి.)". ఈ విధానాన్ని150 దేశాలకుపైగా అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ పునాదులపై నిర్మితమై ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి రాజ్యాంగం అనుమతించింది. రాజ్యాంగానికి 122వ సవరణ చేసి, నూతనంగా అమలులోకి తెచ్చిన జి.ఎస్.టి. విధానం కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను రాబడి పంపిణీలో హేతుబద్ధత,
సమతుల్యత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ పట్ల రాజ్యాంగబద్ధంగా వ్యవహరించక పోతే భారతీయ సమాజానికి తలనొప్పులు తప్పవు. కేంద్రం మీద ఆధారపడే దుస్థితి రాష్ట్రాలకు ఏర్పడితే, కేంద్ర - రాష్ట్ర సంబంధాలు దెబ్బతిని, దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతుంది.

2. ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టిన 1990 దశకానికి ముందే 1986-87 ఆర్థిక సం.లో నాటి ఆర్థిక మంత్రి వి.పి.సింగ్ 'వ్యాట్' ను ప్రవేశ పెట్టడం ద్వారా జి.ఎస్.టి. విధానం వైపు మొదటి అడుగు వేశారు. అటుపై 1991 తరువాత నాటి ఆర్థిక మంత్రి డా. మన్మోహన్ సింగ్ 'సర్వీస్ టాక్స్' ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక సంస్కరణల యుగంలో జి.ఎస్.టి. విధానం అమలుపై దృష్టి మళ్ళింది. 2000 సం.లో అతల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని భావించి జి.ఎస్.టి.పై చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. పాలన కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆనాడు జి.ఎస్.టి. పై భిన్నవైఖరి ప్రదర్శించినప్పటికీ నేడు ప్రధాన మంత్రిగా 'ఒకే దేశం - ఒకే మార్కెట్ - ఒకే పన్ను వ్యవస్థ' నినాదంతో అమలుకు పట్టుదలతో వ్యవహరించారు. పదిహేడు సంవత్సరాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి, ఎట్టకేలకు స్థూల ఏకాభిప్రాయంతో వస్తు, సేవల పన్ను చట్టానికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. 2017 జూలై 1 నుండి అమలులోకి వచ్చింది.

3. దేశ ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేసే జి.ఎస్.టి. అమలు పర్యవసానాలు ఎలా ఉండబోతాయన్న అంశంపైనే ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంలో పలు సందేహాలు, అనుమానాలు, ఆందోళనలు నెలకొని ఉన్నాయి. తొలి దశలో కొంత మేరకు ప్రతికూల ఫలితాలను చవి చూడక తప్పదని, అయితే, దేశానికి దీర్ఘకాలిక ఫలితాలు వనగూడుతాయన్న నిశ్చితాభిప్రాయాలను పలువురు ఆర్థిక నిపుణులు బలంగా వ్యక్తం చేస్తున్నారు.
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదానికి అక్రమ మార్గంలో అందుతున్నకరెన్సీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, రెండు, మూడు నెలలు ప్రజలు ఓపికతో సహకరిస్తే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేయబడుతుందని దేశ ప్రజలకు నాడు మోడీ గారు గట్టి వాగ్ధానం చేశారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర సానుకుల, ప్రతికూల ఫలితాల అనుభవాలు అందరికీ విధితమే.
ఒకటి,రెండేళ్ళు క‌ష్ట నష్టాలను బరించడానికి సిద్ధమై ప్రజలు తోడ్పాటును అందిస్తే జి.ఎస్.టి. అమలుతో దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ గారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన‌ వ్యాఖ్యల ద్వారా సమీప భవిష్యత్తులో ప్రజలపై పరోక్ష పన్నుల‌ భారం తగ్గదన్న సంకేతాన్ని విస్పష్టంగానే సెలవిచ్చినట్లుగా భావించవచ్చు.

4. ఆర్థిక సంవత్సరాన్ని కూడా జనవరి - డిసెంబరుగా మార్చబోతున్నారు. కాబట్టి కనీసం ఏడాదిన్నర(ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు మరొక ఆర్థిక సంవత్సరం) కాలం వేచి చూస్తే తప్ప జి.ఎస్.టి. అమలు వల్ల దేశానికి, సామాన్య ప్రజలకు వనగూడిన ఆర్థిక ప్రయోజనాలను అంచనా వేయడం ఇప్పుడు కష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరోక్ష పన్నుల రాబడి పెరిగిందా? తగ్గిందా?, కార్పోరేట్ రంగం, పారిశ్రామిక, వాణిజ్య మరియు వ్యాపార వర్గాలకు లాభాలను పెంచిందా? తగ్గించిందా?, సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గిందా? పెరిగిందా? అన్నప్రశ్నలకు సమాధానం లభించాలంటే వేచి చూడాల్సిందే! తప్పదు.

5. జి.ఎస్.టి. అమలుతో స్థూల జాతీయోత్ఫత్తి(జిడిపి) ముందుకు ఉరకలు వేస్తుందని, ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని, వాణిజ్య మరియు వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా నిర్వహించుకోవడానికి సానుకూల వాతావరణం నెలకొంటుందని, పర్యవసానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తాయని, పన్నులు ఎగవేసే వారి ఆటలు ఇహ! సాగవని, పన్నులు చెల్లించే వారి సంఖ్య అధికమై ప్రభుత్వాలకు పరోక్ష‌ పన్ను రాబడి బాగా పెరుగుతుందని, డిజిటలైజేషన్ విధానం అమలు వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, ద్రవ్యోల్భణానికి కళ్ళెంపడుతుందని, నిత్యావసర వస్తువుల‌ ధరలు తగ్గుతాయన్న భావనను ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. ఆ లక్ష్యాలు నెరవేరుతాయా! లేదా! అన్నది ప్రభుత్వాలు అనుసరించే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.

6. సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన సమీప భవిష్యత్తులో జి.ఎస్.టి. ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై మార్కెట్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న కొందరు నిపుణులు ఆచితూచి వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాం. జి.ఎస్.టి. నూతన విధానం సామాన్య ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గిస్తుందన్న గ‌ట్టి బరోసా లభించడం లేదు. వినియోగదారుల ధరల సూచిక పరిథిలోకి వచ్చే 50% వస్తువుల ధరలపై పెద్దగా ప్రభావం ఉండక పోవచ్చని, 30% వస్తువుల ధరలు కొంత మేరకు పెరుగుతాయ‌ని, 20% వస్తువుల ధరలు బాగా పెరుగుతాయన్న అంచనాలు వేస్తున్నారు. పన్ను మినహాయింపు ఇచ్చిన ఆహార ధాన్యాలు, కొన్ని నిత్యావసర‌ వస్తువులను మినహాయించి, ప్రజలు వినియోగించుకొంటున్న 1200లకు పైగా వస్తువులు మరియు సేవలపై నాలుగు స్లాబుల్లో 5%, 12%, 18%, 28% మేరకు పన్నులు విధిస్తారు. ఈ జాబితాలోని 81% వస్తువులపై 18% లోపు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణకు గతంలో 15% ఉన్న సేవా పన్నును 18%కి పెంచారు. అలాగే కొన్నింటి మీద తగ్గించారు.

7. దేశ ఆర్థిక వ్యవస్థకు ఒకనాడు వెన్నుముఖగాను, చాలా రాష్ట్రాలకు నేటికీ వెన్నెముఖగాను, దాదాపు 60% ఉపాథి కల్పనా రంగంగా ఉన్న వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. వ్యవసాయ ఉత్ఫత్తులపై పన్ను విధించలేదని గొప్పలు చెప్పుకొంటూ, వ్యవసాయ ఉత్ఫత్తులను ముడిసరుకుగా వినియోగించుకొని అదనపు విలువను జోడించి  ఉత్ఫత్తి చేసే వస్తువులపై(వ్యాల్యూ యాడెడ్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్) పన్ను విధిస్తున్నారు. ఉదా: చెరకు నుండి బెల్లం, పసుపు నుండి పసుపు పొడి, మిర్చి నుండి మిరప పొడి, పండ్ల నుండి పండ్ల రసాలు, ధాన్యం మరియు తృణ ధాన్యాలను సుభ్రం చేసి బ్యాండెడ్ ప్యాకెట్స్ గా తయారు చేస్తే పన్ను విధిస్తారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలంటే వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన రంగాలపై పన్ను విధిస్తే ఆశించిన ఫలితాలు లభించవు.

గ్రామీణ చేతి వృత్తులైన చేనేత రంగం వంటి రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో జీవన్మరణ పోరు సాగిస్తున్నాయి. ఈ రంగాల్లోని అసంఘటిత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చేనేత‌ రంగానికి కావలసిన యార్న్, రంగులు, పనిముట్లపై పన్ను భారం మోపారు. చీమకుర్తి గ్రానైట్, తదితర క్వారీ పరిశ్రమపై కూడా భారం వేశారు. అత్యధికంగా ఉపాథి కల్పనా రంగాలుగా ఉంటూ సంక్షోభంలో ఉన్న  అసంఘటిత రంగాల పట్ల‌ ప్రత్యేక దృష్టి సారించడానికి బదులు పన్ను రాబడే ముఖ్యమనుకొంటే దుష్పలితాలను చవిచూడాల్సి వస్తుంది.

8. వస్తు సేవల పన్ను(GST), రాష్ట్రాల వస్తు సేవల పన్ను(SGST), విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వస్తువులు మరియు సేవలకు సంబధించిన పన్ను(Integrated GST) ఇలా వర్గీకరించబడిన GST పన్నుల వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఒకే దేశం - ఒకే మార్కెట్ - ఒకే పన్ను వ్యవస్థ అన్న నినాదం పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి సంక్లిష్టమైన వ్యవస్థగానే జి.ఎస్.టి. చట్టాన్ని రూపొందించారు. ద్రవ్యోల్బణానికి హేతువు పెట్రోల్ ఉత్ఫత్తులు. రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఆర్థిక వనరు కాబట్టి, వాటిపై పన్ను విధించే హక్కును వదులు కోవడానికి రాష్టాలు ఒప్పుకోలేదన్న సాకుతో జి.ఎస్.టి. పరిథి నుండి పెట్రోల్ ఉత్ఫత్తులను మినహాయించారు. అలాగే మద్యాన్ని, స్థిరాస్థి వ్యాపారాన్ని కూడా పక్కన బెట్టారు. ప్రజలపై పన్నులు, సెస్ ల రూపంలో ఆర్థిక భారాలు మోపి ప్రభుత్వ ఖజానాలను నింపు కోవడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నైజంగా నడచిన చరిత్రకు అంత సులభంగా ముగింపు పలుకుతారా! అన్న సందేహం లేక పోలేదు.

9. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా స్వదేశీ చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించు కోవడానికి ఆ రంగాల విదేశీ ఉత్ఫత్తుల దిగుమతులపై దిగుమతి సుంకం విధించడం ద్వారా నిర్ధిష్టమైన చర్యలను ప్రభుత్వం గతంలో తీసుకొనేది. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ఆ రెగ్యులేషన్స్ ను ఎత్తి వేశారు. పర్యవసానంగా ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మన దేశ మార్కెట్ లోకి వచ్చి పడుతున్నాయి. పర్యవసానంగా దుష్పలితాలను అనుభవిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. ద్వారా నియంత్రణ చేస్తామంటున్నహామీ అమలు తీరు తెన్నులపై ఈ అంశం ఆధారపడి ఉన్నది.

10. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో విస్పష్టంగా కేంద్రం జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అంశాలను పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు విధించే హక్కు కలిగి ఉండేవి. జి.ఎస్.టి. అమలులోకి వచ్చాక జి.ఎస్.టి. కౌన్సిల్ నిర్ణయాల మేరకే పన్నులు విధించాల్సి ఉంటుంది. జి.ఎస్.టి. కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా సభ్యుల పొందిక ఉండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈవాళ యన్.డి.ఎ. ప్రభుత్వం ఉండవచ్చు, భవిష్యత్తులో మరొక ప్రభుత్వం రావచ్చు, ఎవరున్నా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి అవకాశం కల్పించేలా జి.ఎస్.టి. కౌన్సిల్ సభ్యుల పొందిక ఉండడం సమర్థనీయం కాదు. జి.ఎస్.టి. సభ్యుల పొందిక విషయంలో సమతుల్యత సాధించాలి.

11.కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, అలాగే రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య భవిష్యత్తులో సమస్యలు ఉద్భవించవచ్చు. పన్నుల ఆదాయం వృద్ధిని 14% ను ప్రామాణికంగా పరిగణించి ఆపైన వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించదని, 14% లోపు ఉండే రాష్ట్రాలకు మాత్రమే ఏ మేరకు తగ్గితే ఆ మేరకు ఆదుకొంటుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల ఆదాయం వృద్ధి రేటు 22%గా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే జి.ఎస్.టి. అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్నికేంద్రం భరించదన్న మాట. ఈ తరహా సమస్యలు అనేకం ఆచరణలో ఎదురు కాబోతున్నాయి. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఎస్.టి. కౌన్సిల్ వేదికగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

12. కేంద్ర ప్రభుత్వం జి.ఎస్.టి. కౌన్సిల్ ను సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా, ఏకాభిప్రాయ సాధనతో, సమిష్టి నిర్ణయాలతో, జవాబుదారితనంతో పని చేయించక పోతే కేంద్రం, రాష్ట్రాల మధ్య తగవులు మొదలౌతాయి. ప్రారంభం నుంచే నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలను సమర్థవంతంగా సమన్వయంతో కలుపుకు పోయినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. జి.ఎస్.టి. ద్వారా సమకూరే ఆదాయాన్ని ఏ నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకోవాలో స్పష్టత వచ్చినట్లు కనబడటం లేదు.

13. జి.ఎస్.టి. వ్యవస్థ పూర్తిగా సమాచార, సాంకేతిక వ్యవస్థ(ఐటి నెట్ వర్క్)పై ఆధారపడి నిర్మితమై ఉన్నది. మన దేశం ఐటి రంగంలో ముందడుగు వేస్తున్నా, ఇంకా బలమైన, పటిష్టమైన వ్యవస్థగా ఆవిర్భవించ లేదు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం 'డిజిటలైజేషన్' వైపు ప్రయాణించాలని ప్రజలను ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఎలాంటి సమస్యలు ఎదురౌతున్నాయో గమనిస్తూనే ఉన్నాం. మౌలిక వసతులను విస్తరించుకొని, పటిష్టమైన భద్రతా వ్యవస్థను నెలకొల్పుకొంటే తప్ప జి.ఎస్.టి. విధానాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

14. వాణిజ్య, వ్యాపార రంగాల్లో, ప్రత్యేకించి చిల్లర వర్తక రంగంలో 'ఇ _ కామర్స్ బిజినెస్' సరవేగంగా పెరుగుతున్నది, ఇన్ టర్ నెట్ వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఏమేరకు ఉన్నదో కూడా పరిగణలోకి తీసుకోవాలి. పన్ను ఎగవేతకు అలవాటుపడ్డ అక్రమార్కులు 'ఇ_కామర్స్' విధానాన్నివాడుకొనే అవకాశమూ లేక పోలేదు. ‍ఇ_కామర్స్ విధానంలో ఏది వస్తువో! ఏది సేవో! నిర్వచించడంలోను, వ్యాపారస్తునికి - వ్యాపారస్తునికి మధ్య, వ్యాపారస్తునికి - వినియోగదారునికి మధ్య, వినియోగదారునికి - వినియోగదారునికి మధ్య సంబంధాలను నిర్వచించడంలోను కూడా సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.

15. బహుళ‌ పన్నుల వ్యవస్థ నుండి విముక్తి లభించడం స్థూలంగా సానుకూలాంశం. జి.ఎస్.టి. అమలులో ఎదురయ్యే సమస్యలను రాజ్యాంగం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా,  ప్రజానుకూల దృకథంతో పరిష్కరించుకొంటూ అడుగు ముందుకేస్తే సత్ఫ‌లితాలు వనగూడతాయి. సరళీకృత ఆర్థిక విధానాల నీతికి బానిసలై కార్పోరేట్ రంగం సేవలో నిమగ్నమై ఉన్న పాలకులు అదే బాటలో జి.ఎస్.టి. విధానం అమలులో కూడా నడక సాగిస్తే సామాన్యుల ఆశలు అడి ఆశలుగానే మిగిలి పోతాయి.

టి.లక్ష్మీనారాయణ‌

Friday, June 9, 2017

Studio N 'వేకువ' ముఖాముఖి

చర్చలో నాలుగు అంశాలపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలు:

1.గడచిన కొన్ని దశాబ్ధాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నలోపభూయిష్టమైన విధానాల‌ పర్యవసానంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో కూరుకపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొనే దౌర్భాగ్య పరిస్థితులు కొనసాగుతున్నాయి. పండించిన పంటకు సముచితమైన మార్కెట్ సదుపాయాలు కల్పించమని కోరుతున్న రైతులపై ప్రభుత్వాలు లాఠీలు, తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులను సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో రైతన్నల చేతులకు బేడీలు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని మాన్డ్ సౌర్ లో ఐదుగురు రైతన్నలను పోలీసు కాల్పుల్లో పొట్టన పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించాల్సిన ప్రభుత్వాలు రైతాంగంపై దమనకాండకు పూనుకోవడం తీవ్రగర్హనీయం.

రైతు రుణ మాఫీ పథకాలను అమలు చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతాయన్న‌ దోరణిలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించారు. మిగులు బడ్జెట్లున్న రాష్ట్రాలు అమలు చేసుకొంటే పర్వాలేదన్నట్లు కూడా మరో వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ పథకాలను ఏదో ఒక మేరకు పరిమితంగానైనా అమలు చేసిన నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా చర్యలకు ఉపక్రమించిందన్న వార్తలు వచ్చిన పూర్వరంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు లోటు బడ్జెట్లతోనే నెట్టుకొస్తూ, ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుకొంటూ పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి, అమలు చేసి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయడానికి రాజకీయ సంకల్పంతో పూనుకోవాలి. అందులో భాగంగా రైతు రుణ మాఫీ పథకాన్ని దేశ వ్యాపితంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

2. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల కమీషన్ నగారా మ్రోగించింది. దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడంలో ఏకాభిప్రాయ సాధనకు చొరవ చూపాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై ఉన్నది. ఇటీవల సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం అనుసరించే వైఖరి ఎలా ఉంటుందో! అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ప్రతిపాదిస్తుందో! లేదో! వేచి చూద్దామన్న వైఖరి తీసుకొన్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. దేశంలో నేడు నెలకొని ఉన్న కలుషిత వాతావరణ‍ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రజాస్వామ్యం మరియు లౌకిక విలువలను పరిరక్షించే వ్యక్తిత్వం, అంకిత భావం ఉన్న వారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్న ఆకాంక్షను దేశ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

3. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందనడానికి తాజా ఉదాహరణ‌ ఇరాన్ పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదాన్ని మతం కోణం నుండి చూసి కొందరు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఉగ్రవాదం పెనుసవాలుగా పరిణమించింది. ఉగ్రవాదుల దుశ్చర్యలకు, మారణహోమానికి పాకిస్తాన్ మొదలుకొని ఆప్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాక్, సిరియా, టర్కీ, తాజాగా ఇరాన్, అలాగే అన్నిముస్లిం దేశాలు గురౌతూనే ఉన్నాయి. ఉగ్రవాదులకు అండగా ఉందన్న కారణంగా ఖతార్ తో మిగిలిన గల్ఫ్ దేశాలు దౌత్య సంబంధాలను తెంచుకొన్నాయి. అమెరికా మొదలు ఇంగ్లండు, ప్రాన్స్, రష్యా, చైనా, భారత్, తదితర అభివృద్ధి చెందిన, చె౦దుతున్న దేశాలన్నీ ఉగ్రవాదుల దాడులతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని తుద ముట్టించే దౌత్య నీతికి అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్యత నిచ్చి, ఉగ్రవాదంపై ఉమ్మడిగా యుద్ధం ప్రకటించాలి.

4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుని కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చిన అంశం చిన్నదిగా కనిపించినప్పటికీ తీవ్రమైనదిగా పరిగణించాలి. భవన నిర్మాణం నాసిరకంగా చేశారా! లేదా! అన్నదానిపై నిశితంగా పరిశీలించుకొంటే, శాశ్వత భవనాల నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడానికి దోహదపడుతుంది. మరొక కోణంలో కూడా ప్రభుత్వం నిశిత పరిశీలన చేయాలి. భవనంపైన ఉన్న‌ డ్రైనేజీ పైపును ఎవరో కుట్ర పూరితంగా కట్ చేయడం మూలంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేయబడ్డాయి. అదే నిజమైతే కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న భవనంపైకి దుండగులు ఎలా వెళ్ళి డ్రైనేజీ పైపును కట్ చేయగలిగారు? భద్రతా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటే అదీ ప్రమాదకరమే! అందు వల్ల అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలి.


Friday, June 2, 2017

వైద్య విద్య అనారోగ్యానికి అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంపుదల పరిష్కారమా!

It was mentioned in the Governement of Andhra Pradesh, GO Ms.N0. nil dated 31-05-2017 "Due to dearth of the teaching faculty the medical education facing the problem of acute shortage of experienced medical teachers essential for running undergraduate, postgraduate and super-specialty medical courses".

1. నైపుణ్యం, నాణ్యత, అనుభవం ఉన్న అధ్యాపకుల కరవు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని  ప్రభుత్వ ఉత్తర్వు చెప్పకనే చెబుతున్నది. మరి, ప్రభుత్వం ఎంచుకొన్న పరిష్కార మార్గం ఏమిటి? అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63 కు పెంచడం ద్వారా ప్రస్తుతానికి ఉపశమనం పొందవచ్చని తలపోసింది. అసలు సమస్యకు ఇది పరిష్కారమేనా?

2. వైద్య విద్యా కళాశాలల్లో అసిస్టెంట్ట్ ప్రొఫెసర్లుగా చేరిన అనేక మంది ఒక్క ప్రమోషన్ కు కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పదవీ విరమణ చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది. మరొక వైపు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఒకేసారి ఉద్యోగంలో చేరినా, కొన్ని విభాగాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు త్వరత్వరగా ప్రమోషన్లు వచ్చి ప్రొఫెసర్లుగా అయిపోయి, తదనుగుణంగా వారికి వేతనాలు పెరుగుతాయి.  ఈ తరహా అశాస్త్రీయమైన, అసంబద్ధమైన, లోపభూయిష్టమైన ప్రమోషన్ల విధానంపై ఎందుకు ప్రభుత్వం సమీక్ష చేసుకోదు?

3. ఆయా విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయితే ప్రభుత్వం దయత‌లిచినప్పుడు అసోషియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. అసోషియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్ల భాగ్యం కలిగినప్పుడు ఏర్పడే పోస్టులకు ఆ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చే అసంబద్ధమైన విధానాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్ధాల సర్వీసు, అర్హతలు ఉన్నా ప్రమోషన్లకు నోచుకోని అసిస్టెంట్ మరియు అసోషియేట్ ప్రొఫెసర్లలో నిరాశ, నిస్పృహలు పాదుకు పోయి ఉన్నాయన్న సంగతిని ప్రభుత్వం చూడ నిరాకరిస్తున్నది. దాని ప్రభావం వారి పని విధానంపై పడుతుందనడంలో సందేహం లేదు.

4. అధ్యాపకులుగా పని చేస్తున్న‌ వారు నిరంతర విద్యార్థులుగా, పరిశోధకులుగా నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, నాణ్యమైన విద్యా బోధన, బోధనలో నైపుణ్యాన్నినిరంతరాయంగా పెంపొందించుకొన్నప్పుడే విద్యా ప్రమాణాలు కూడా వృద్ధి చెందుతాయి. అప్పుడే కళాశాలల నుండి నాణ్యమైన పట్టభద్రులు సమాజాభివృద్ధికి అందుబాటులోకి వస్తారు. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కాకపోతే సమాజానికి నష్టం వాటిల్లుతుంది. వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల్లో ఈ దృక్పథం, పని సంస్కృతి బాగా కొరవడి ఉన్నదన్న ఆందోళన సర్వత్రా నెలకొని ఉన్నది.

5. వైద్య విద్యా రంగంలో ప్రమాణాల అభివృద్ధికి కృషి చేయాల్సిన యన్.టి.ఆర్. వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పనితనం అత్యంత నాసిరకంగా ఉన్నా పట్టించుకొనే వారే కరవైనారు. అది పేరుకే విశ్వవిద్యాలయం. పతనమౌతున్న వైద్య విద్యా ప్రమాణాల పట్ల సమాజం ఆందోళన చెందుతున్నా విశ్వవిద్యాలయానికి మాత్రం ఈ విషయంలో చీమ కుట్టినట్లు కూడా లేదనిపిస్తోంది. విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించాలని కానీ, ప్రోత్సహించాలని కానీ విశ్వవిద్యాలయం ఆలోచించిన పాపానా పోయినట్లు కనబడదు. పైపెచ్చు నిరుత్సాహ పరిచే వాతావరణం ఉన్నది. పి.హెచ్.డి. చేయాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, గైడ్ చేసే గైడ్స్ లేని దుస్థితి పట్ల దృష్టి సారించాలనే ఆసక్తి విశ్వవిద్యాలయానికి గానీ, డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ కు గానీ, ప్రభుత్వానికి గానీ ఉన్న దాఖలాలు లేవు.

6. ఘనమైన దశాబ్ధాల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల‌ లాంటివి రాష్ట్రంలో ఉన్నా, ఒక్క కళాశాల కూడా దేశంలో పేరు గాంచిన వైద్య కళాశాలల సరసన నిలబడ గలిగే స్థితికి ఎదగక లేక పోవడానికి ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు కారణం కాదా! లోతుగా ఆలోచించుకోవాలి.

7. ప్రభుత్వ మరియు ప్రయివేటు వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఉన్నదా? నాణ్యత, నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల కొరత ఉన్నదని మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనమేంటి? కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సంతృప్తి పరచడానికే అన్నట్లు పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా కొద్ది మంది అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను మరో మూడేళ్ళ పాటు వినియోగించుకోగలరు. అటు తరువాత?

8. పదవీ విరమణ వయస్సును పెంచడంతో ప్రమోషన్లకు నోచుకోని అధ్యాపకుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోదా?

9. యు.జి.సి. తరహా వేతనాలను మాత్రం ఇస్తారు. యు.జి.సి. అమలు చేస్తున్న ప్రమోషన్ల (టైం బౌండ్) విధానాన్నిమాత్రం అమలు చేయరు. అలాగే, వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత సమస్య నుండి బయటపడడానికి వైద్య‌, ఆరోగ్య శాఖ పరిథిలోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏరియా మరియు జిల్లా ఆసుపత్రుల్లో పని చేస్తున్నడాక్టర్లను తీసుకొచ్చి అధ్యాపకులుగా నియమిస్తున్నారు. ప్రమోషన్స్ అంశం వచ్చే సరికి అధ్యాపకులుగా పని చేసిన సర్వీసును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న యు.జి.సి. నిబంధనను అమలు చేస్తున్నారు. ఇదెక్కడి నీతి, న్యాయం? ఒకవైపున లోప భూయిష్టమైన ప్రమోషన్ల విధానాన్ని అమలు చేస్తూ మరొక వైపున అనుభవం ఉన్న అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నామని ఏడ్వడంలో అర్థం ఉన్నదా! ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, స్పందించాలి.

10. పోస్ట్ గ్రాడ్యుయేట్(పి.జి.) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు మాత్రమే వర్తింపజేస్తూ పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా నూతనంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు ఉద్యోగావకాశాలను లేకుండా చేసినట్లు కాదా?

11. వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య పెరుగుదల నిష్పత్తికి అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోషియేట్  ప్రొఫెసర్ల, ప్రొఫెసర్ల సంఖ్యను పెంచడం ద్వారా అధ్యాపక, విద్యార్థి నిష్పత్తిని శాస్త్రీయంగా ఉండేలా చూసినప్పుడే వైద్య విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి దోహదపడుతుంది.

12. వైద్య విద్యా ప్రమాణాల పెంపుదలకు దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళికను ప్రభుత్వం సత్వరం రూపొందించాలి. రాజకీయ సంకల్పంతో అమలుకు పూనుకోవాలి. సంక్షోభంలో ఉన్న వైద్య విద్యా వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడానికి, ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత చర్యలు చేపడుతుందని ఆశిద్ధాం!

టి.లక్ష్మీనారాయణ‌
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు

గమనిక: దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు 'ఎపి సియం కనెక్ట్' ఆఫ్ లోను, వైద్య ఆరోగ్య శాఖామాత్యుల వాట్స్ ఆఫ్ లోను, ప్రసార మాధ్యమాల్లో పని చేస్తున్న పాత్రికేయ మిత్రులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల వాట్స్ ఆఫ్ లో పోస్ట్ చేస్తున్నాను.

Monday, May 22, 2017

డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ !

కంప్యూటర్ల వ్యవస్థను ప్రపంచ వ్యాపితంగా ఒక కుదుపు కుదిపేసి, తీవ్ర ఆందోళనకు గురి చేసిన 'వర్నా క్రైం వైరస్' లేదా 'హ్యాకింగ్' సమస్య తలెత్తిన నేపథ్యంలో 'డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ' అన్న అంశంపై దూరదర్శన్, విజయవాడ కేంద్రం చర్చను నిర్వహించింది. చర్చలో నాతో పాటు 'ఎథికల్ హాకర్' గా పని చేస్తున్న శ్రీ సాయిసతీశ్ పాల్గొన్నారు.
నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాం. విజ్ఞాన సమాజం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం. 'డిజిటల్' ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం చేయకుండా మనుగడ సాగించలేం. ఆ వైపున ప్రయాణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.
అవినీతిని, నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే లక్ష్యంతో పాత రు.500, 1000 పెద్ద నోట్లను రద్దు చేసినట్లు దేశ ప్రధాన మంత్రి మోడీ గారు ప్రకటించారు. నగదు లావాదేవీలను నిరుత్సాహపరుస్తూ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించారు. నిరక్షరాస్యులను చైతన్య పరచడానికి యువత నడుంకట్టాలని పిలుపిచ్చారు.
ప్రజలు కూడా పెద్ద నోట్ల రద్దు పూర్వరంగంలో బ్యాంకులు, ఏటియంలలో నగదు లభించక పోవడంతో అనివార్యంగా మొబైల్, ఇంటర్నెట్ లావాదేవీల వైపు మళ్ళారు. గడచిన ఏడాది నవంబరు, డిసెంబరు మాసాలలో ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అటుపై కొంత తగ్గిన మాట వాస్తవమే.
ఈ పూర్వరంగంలో తాజా హ్యాకింగ్ సమస్య పర్యవసానంగా డిజిటలైజేషన్ వ్యవస్థ పట్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొనడం సహజం. పోలీసు వ్యవస్థ మొదలుకొని వివిధ రంగాలను కలవర పాటుకు గురిచేసిన హ్యాకింగ్ ఇంటర్నెట్ వినియోగదారులైన సామాన్య ప్రజానీకాన్నీ ఆందోళనకు గురి చేసింది.
దేశ రక్షణ శాఖ, రిజర్వ్ బ్యాంకు, కార్పోరేట్ సంస్థలు,తదితర సంస్థలు సైబర్ క్రైం బారిన పడకుండా తమ కంప్యూటర్ల వ్యవస్థలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని కాపాడు కోవడానికి రక్షణ వ్యవస్థలను నెలకొల్పుకొన్నాయని, ఎథికల్ హాకర్స్ ను కూడా నియమించు కొన్నారన్న వార్తలు వచ్చాయి. ఇంజనీరింగ్ పట్టభద్రులు కాని వారు కూడా హ్యాకింగ్ నైపుణ్యాన్ని పొందిన వారు నేడు 'ఎథికల్ హ్యాకర్స్' గా సేవలందించడానికి సంస్థలను నెలకొల్పి, నిర్వహిస్తున్నారు. ఇదొక ఉపాథి కల్పనా రంగంగా ఎదుగుతున్నదని కూడా చెబుతున్నారు.
సైబర్ క్రైం ను కేవలం ఆర్థిక నేరాల కోణంలోనే చూడకూడదు. వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసి, సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థను మాత్రమే కాదు, అణు విద్యుత్తు కేంద్రాలు, దేశ రక్షణ, పోలీసు, నేరాల నమోదు, రవాణా, విద్యుత్తు, విద్యా, వైద్య వ్యవస్థలు, భూ యాజమాన్య హక్కుల రికార్డులు, రిజిస్ట్రేషన్స్, ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, ఇలా అన్నింటినీ డిజిటలైజేషన్ వ్యవస్థలోకి తీసుకెళ్ళడం జరిగింది, జరుగుతున్నది. ఆధార్ కార్డుల అనుసంధానంతో పౌరుల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం జరుగుతున్నది. కంపూటర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ, సమాజం యావత్తు సంక్షోభంలోకి నెట్టబడుతుంది.
ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన టెర్రరిస్టులు ఎలాంటి ఘాతుకానికైనా పాల్పడతారు. సైబర్ క్రైం కు ఆ దుష్టశక్తులు పాల్పడవని బరోసాగా అంతర్జాతీయ సమాజం ఉండ లేదు. తాజా 'వర్నా క్రైం' సైబర్ నేరానికి ఉత్తర కొరియా కేంద్రంగా జరిగిందన్న దానికి ఆధారాలను ఎవరు బయట పెట్టలేదు. ఆ దేశంపైన వేసిన ఒక అపవాదుగానే కనబడుతున్నది.
అణుయుద్ధం, స్టార్ వార్స్ వంటివి ప్రపంచ మానవాళిని ఇప్పటి వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో సైబర్ వార్స్ జరుగుతాయన్న ఊహాగానాలు చేస్తున్నారు. ఈ పెనుముప్పు నుండి మన సమాజాన్ని రక్షించుకోవడానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
'సైబర్ సెక్యూరిటీ' వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పు కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపులను పెంచి(కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ లో కేవలం రు.116 కోట్లు కేటాయించింది), యుద్ధ ప్రాతిపథికపై కార్యాచరణను అమలు చేయాలి.
సైబర్ క్రైంల నేరాలు పెరిగి పోతున్నాయి. 2015లో 50,000 జరిగాయని ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. 32,000 ఏటియం కార్డుల సమాచారం తస్కరించ బడిందని రిజర్వ్ బ్యాంకే అనుమానాలు వ్యక్తం చేస్తూ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందన్న వార్తలు కొన్ని నెలల క్రితం విన్నాం. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 కు పదును పెట్టి పకడ్బందిగా అమలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట చేయాలి. దొంగల బెడద నుండి ఇంటికి గట్టి తాళాలు వేసుకొన్నట్లే, సైబర్ నేరస్తుల బారిన పడకుండా పటిష్టమైన రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇవీ నేను చర్చలో స్థూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు. 

Monday, May 15, 2017

ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు: సమర్థనీయమా!


1. నినాదం బాగుంది. భారత రాజ్యాంగం స్ఫూర్తికి లోబడి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, బహుళ పార్టీల వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థలను పటిష్టవంతం చేసుకోవడానికి ఆలోచనదోహదపడుతుందో! లేదో! లోతైన అధ్యయనం చేయాలి.  సమగ్ర ఎన్నికల సంస్కరణల వైపు ప్రయాణం చేయాలి. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయిందని, డబ్బు ప్రభావం పెరిగి పోయిందని, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయలేక పోతున్నాయని, ఎన్నికల నిబంధనలు అవరోధంగా నిలుస్తున్నాయని వగైరా వగైరా వాదనలతో 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' అన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఒక్కసారిగా ఎన్నికలతంతు పూర్తి అయిపోతే, ఇహ! స్థిరమైన పాలనతో, అభివృద్ధిపైనే ప్రభుత్వాలు దృష్టి లగ్నం చేసి, జాతి సంపదను ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చేస్తాయని, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న భ్రమలు కల్పించే దోరణిలో చర్చకు తెర లేపారు.
2. సమస్య అత్యంత సంక్లిష్టమైనది. మంచి చెడులపై లోతైన చర్చ జరగాలి. స్వాతంత్ర్యానంతరం మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన 1952 మొదలు 1967లో జరిగిన నాలుగవ లోక్ సభ ఎన్నికల వరకు రాష్ట్రాల శాసనసభలతో కలిపే ఒకేసారి జరిగాయి. అటుపై వేరుపడి పోవడానికి దారి తీసిన పరిణామాలేంటో నిశితంగా పరిశీలించాలి.
3. మొట్ట మొదటిసారి ఇందిరా గాంధీ లోక్ సభను రద్దు చేసి గడువు ప్రకారం 1972లో జరగాల్సిన ఎన్నికలను 1971లోనే నిర్వహించేలా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. మొత్తం 16 లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏడు దఫాలు ముందస్తుగానే ఎన్నికలు జరిగాయి. పదమూడు రోజులకే కేంద్ర ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు జరిగిన చరిత్ర కూడా ఉన్నది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది, కానీ, కేంద్ర ప్రభుత్వం పడిపోతే సౌలభ్యం లేదు. విధిగా ఎన్నికలకు వెళ్ళాల్సిందే.
4. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను 125 సార్లుకుపైగా ప్రయోగించింది. సమాఖ్య వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురి చేస్తూ, రాష్టాలలో రాష్ట్రపతి పాలనను విధించింది. ప్రప్రథమంగా 1957లో కేరళలో ప్రజల చేత ఎన్నుకోబడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం 1959లో రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి మొదలైన ఆర్టికల్ 356 దుర్వినియోగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. మధ్య కాలంలోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తారాకాండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొన్న ఉదంతాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
5. తాజాగా ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని ప్రక్కకు నెట్టేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఫిరాయింపులను కూడా ప్రోత్సహించి ఏరీతిలో అధికార పగ్గాలు చెరబట్టిందో అందరికీ విధితమే. కంచే చేను మేసినట్లు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నంపై గెలుపొందిన శాసనసభ్యుడ్ని అక్కున చేర్చుకొని, అతనికి మంత్రి పదవి కట్టబెట్టి, మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
6. దేశంలో చిన్న రాష్ట్రాల సంఖ్య పెరిగి పోతున్నది. చిన్న రాష్ట్రాల భావజాలానికి బిజెపి అనుకూలం. చిన్న రాష్ట్రాలలో తరచూ రాజకీయ అస్థిరత నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ చక్కటి ఉదాహరణ. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. అక్కడ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అత్యధికులు వివిధ పల్టీలు కొట్టి అంత్యమంగా బిజెపిలో చేరి, ప్రభుత్వ రంగును ఊసరి వెల్లి లాగా రూపాంతరం చెందించారు. చిన్న రాష్ట్రాలలో అవకాశాలు అంది వచ్చినప్పుడల్లా కేంద్రంలోని పాలక జాతీయ పార్టీ తరహా అనైతిక చర్యలకే పాల్పడుతుందని చరిత్ర నేర్పుతున్న పాఠం.
7. జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రజల్లో నెలకొన్న ప్రాంతీయ ఆకాంక్షల ప్రాతిపదికగా ప్రాంతీయపార్టీలు ఆవిర్భవించి, చాలా రాష్ట్రాలలో బలంగా వేళ్ళూనుకొని ఉన్నాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలతోను, వారసులు లేక పోవడం మూలంగాను కొన్ని పార్టీలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా, ఇంకా పలు రాష్ట్రాలలో పలు ప్రాంతీయ పార్టీలు పటిష్టంగానే ఉన్నాయి.
8. జాతీయ పార్టీల్లో ఒకనాడు కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యo చెలాయించింది. నేడు దాని పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. కాంగ్రెస్ దుష్టపాలన పుణ్యమాయని బిజెపి అధికారంలోకి వచ్చింది. దీని తాత్విక చింతన కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్నదే. ఒకనాడు ఎన్.టి.ఆర్. కేంద్రం మిథ్య, రాష్ట్రాలే వాస్తవం అని వ్యాఖ్యానించారు. మాటల్లో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూనే కేంద్రమే వాస్తవం, రాష్ట్రాలు మిథ్య అన్న భావజాలంతో నరేంద్ర మోడీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అదే ఆయన పార్టీ భావజాలమన్నదీ సుస్పష్టం. దాంట్లో దాపరికం లేదు. అది మంచిదా! కాదా! అన్నది దేశప్రజలు ఆలోచించు కోవాలి అంతే.
9. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండే రోజులకు కాలం చెల్లి పోయింది. పైపెచ్చు, కొన్ని దశాబ్ధాలుగా కేంద్రం, రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిన‌  ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి జ్వాలలను సానుకూలంగా మలచుకొని ఏకపార్టీ పాలనకు సరిపడ బలాన్ని 2014 ఎన్నికల్లో మోడీ సమకూర్చు కొన్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. ఏక పార్టీ పాలనకు కాలం చెల్లిపోయిందనే భావం బలపడుతున్న కాలంలో కాస్త మార్పు కనిపించినా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పలేం.
10. సంకీర్ణ ప్రభుత్వాల స్థిరత్వం భాగస్వామ్య పార్టీలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పొరపొచ్చాలు పొడచూపినా ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు అనివార్యంగా వెళ్ళ వలసిందే. అప్పుడు అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? ఒక వేళ అలా చేశారనుకోండి, చర్య ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందా! ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా రద్దు చేస్తారు?
11. కొంత మంది అమెరికాతో పోలుస్తున్నారు. దేశంలో ఉన్నది అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ, మన రాజ్యాంగ నిర్ణేతలు మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ శ్రేష్టమైనదని నిర్ధారించారు. అమెరికా వ్యవస్థలో ఉన్న బలహీనతలేంటో డోనాల్డ్  ట్రంప్ అధ్యక్షుడైన తరువాత యావత్తు ప్రపంచానికి మరొకసారి తెలియజేస్తున్నారు.
12. ఐదేళ్ళ వరకు ఇహ! ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు అన్న భావం పాలక పార్టీల్లో బలపడి, నియంతృత్వ పోకడలతో, పెత్తందారీతనంతో వ్యవహరించవనే 'గ్యారెంటీ' ఏముoది! అధికారంలోకి వచ్చాక పాలక పార్టీ అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దెదించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఒక వేళ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధిస్తే, లేదా, వార్షిక బడ్జెటుకు కోత తీర్మానాలు పెట్టి నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలక పార్టీలో చీలికొచ్చి ప్రభుత్వం మెజారిటీ మద్ధతు కోల్పోయి కూలి పోవచ్చు. కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయినా అప్పుడు ప్రత్యామ్నాయమేంటి? రాష్ట్రపతి పాలన విధించి, కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుందా? అలా చేస్తే, రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ లక్ష్యాలకు వ్యతిరేకం కాదా?
13. మన దేశం సువిశాలమైనది. 125 కోట్ల జనాభాతో వైవిధ్యబరితమైనది. వివిధ మతాలు, జాతులు, కులాలు, తెగలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం. అందరి ఆకాంక్షలు ప్రతిబింబించినప్పుడే మన పార్లమెంటరీ వ్యవస్థ, బహుళ పార్టీ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుంది, పటిష్టవంతం అవుతుంది.
14. డబ్బు ప్రభావం, ఆర్థిక నేరస్తుల ప్రవేశం, నేరమయ రాజకీయాలు, వ్యాపారమయమైన రాజకీయ వ్యవస్థ పర్యవసానంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. ఎన్నికల వ్యవస్థను సమగ్ర ఎన్నికల సంస్కరణలతో సత్వరం ప్రక్షాళన చేయాలి. దీనికి సంబంధించి పలు కమిటీలు, కమీషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. వాటికి దుమ్ముదులిపి, వాటిలో ఆమోదయోగ్యమైన అంశాలను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. దామాషా ఎన్నికల విధానం లాంటి ప్రతిపాదనలపై ఎందుకు ఆలోచించడం లేదు. ఎందుకో మరి మోడీ ప్రభుత్వానికి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై ఆసక్తి ఉన్నట్లు కనబడడం లేదు.
15. మనది సమాఖ్య వ్యవస్థ. మన రాజ్యాంగంలోని 7వ‌ షెడ్యూలులోని ఒకటవ పట్టికలో పొందు పరచిన  97 అంశాలను కేంద్రం అధికార పరిథిలోను, రెండవ పట్టికలో పొందు పరచిన 61 అంశాలను రాష్ట్రాల అధికార పరిథిలోను, మిగిలిన 52 అంశాలను ఉమ్మడి జాబితాలోను పొందు పరిచారు. ఎన్నికల సంస్కరణలపై చేసే ఆలోచనలు సమాఖ్య వ్యవస్థను పటిష్టపరిచే దృక్పథంతోనే సాగాలి.
స్థానిక సంస్థలకు అధికారాలను, బాధ్యతలను, ఆర్థిక వనరులను బదలాయిస్తూ రాజ్యాంగానికి 73,74 సవరణలు చేయబడ్డాయి. కానీ, అవి పాక్షికంగానే అమలుకు నోచుకొన్నాయి. రాజ్యాంగ సవరణల మేరకు తక్షణం స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి కూడా క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి.

టి.లక్ష్మీనారాయణ