Monday, May 23, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేను వ్రాసిన వ్యాసాన్ని వివిధ వాట్స్ ఆఫ్ గ్రూపుల్లోను, ఫేస్ బుక్ లోను ఫోస్ట్ చేశాను. అలాగే ఇ-మెయిల్స్ ద్వారా మిత్రులకు పంపాను. చాలా మంది మిత్రులు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్స్ చేశారు. నా వ్యాసం పూర్వరంగంలో ప్రస్తావనకు వచ్చిన మూడు అంశాలపై స్పందించాలని పించింది.

1. పశ్చిం బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలు - కాంగ్రెస్ కలిసి  పోటీ చేయక పోయి ఉంటే బిజెపి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించేదన్న వాదనను సిపిఐ(యం) పశ్చిం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి హిందూ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో వినిపించారు.

ఏంట్రా! పడ్డావ్ అంటే అదొక లగువులే! అన్నాడంట ఒకడు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని తప్పులు చేయడమంటే ఇదేనేమో! చిన్న పిల్లలు ఏడుస్తుంటే పెద్ద వాళ్ళు అంటుంటారు, 'బూచోడొస్తున్నాడు, ఏడిస్తే పట్టుకెళ్ళతాడు'. సిపిఐ(యం), పశ్చిం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి వాదన కూడా ఆ కోవకు చెందినట్లుగా కనబడుతున్నది. బిజెపి బూచిని చూపెట్టి తప్పుడు ఎన్నికల పొత్తును ఎలాంటి జంకు లేకుండా సమర్థించుకోవడానికి ఆయన గారు ప్రయత్నించారు. అది సరియైన ఎన్నికల ఎత్తుగడే అయితే సిపిఐ(యం) జాతీయ నాయకత్వం ఎందుకని నిర్భీతిగా సమర్థించుకోవడం లేదన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. పైపెచ్చు రాష్ట్ర శాఖ మీద నెపాన్ని నెట్టి వేసే దోరణిలో ఆ పార్టీ నాయకులు 'కేంద్ర కమిటిలో సమీక్ష చేస్తామని' సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా!

పోనీ, సూర్జ్య కాంత మిశ్రా గారు ఒప్పుకొన్నట్లు వామపక్షాలు - కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవగాహన కుదుర్చుకొన్నాయి కదా! మరి, కలిసి ఎందుకు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించుకొని, ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అయ్యేలా వామపక్షాలు ప్రయత్నించ లేదు? లోపాయికారి ఒప్పందాలతో ఓట్లు బదిలీ అవుతాయా! కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ఒప్పందం చేసుకొన్నామని ప్రచారం చేసుకొని లబ్ధి పొందింది.

2011లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 30.08% ఓట్లను సాధించుకొన్న సిపిఐ(యం), 2014 లోక్ సభ ఎన్నికల నాటికి 22.96% కి పడి పోయి, నేడు 19.7% కి దిగజారి పోయింది. పతనానికి దారి తీసిన కారణాలను నిజాయితీగా పరిశోధించుకోవలసిన తరుణంలో బిజెపి బూచిని చూపెట్టో, బిజెపి - తృణమూల్ కాంగ్రెస్ కుమ్మక్కు అయినాయనో నమ్మపలకడం వల్ల వామపక్ష ఉద్యమానికి జరిగే ప్రయోజనమేమీ ఉండదేమో! కాంగ్రెసుతో అపవిత్ర పొత్తు కుదుర్చుకొని భంగపడడమే కాకుండా ఘోరంగా ఓడి పోయిన తరువాత కూడా నిజాయితీతో ఆత్మవిమర్శ చేసుకోవడానికి బదులు తప్పుడు నిర్ణయాలను సమర్థించుకోవడానికి పూనుకొంటే ప్రతిష్ట మరింత మసక బారుతుందేమో!

2. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలు సాధించిన ఫలితాల గణాంకాలను ప్రస్తావిస్తూ బిజెపి 696 స్థానాల్లో పోటీ చేసి 64(9.1%) స్థానాల్లో మాత్రమే గెలిచిందని, వామపక్షాలు 452 పోటీ చేసి 124(27.4%) గెలిచాయని, కాంగ్రెస్ 363 పోటీ చేసి 115(31.6%) విజయం సాధించిందని ఫోస్ట్ పెట్టారు.
ఫోస్ట్ లో పొరపాటుగా అన్నింటినీ కూటములుగా పేర్కొన్నారు. గణాంకాలను ప్రస్తావించేటప్పటికి సిపిఐ(యం), సిపిఐ, ఆర్.యస్.పి., పార్వర్డ్ బ్లాక్ నాలుగు పార్టీలతో కూడిన లెఫ్ట్ ప్రంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. బిజెపి, కాంగ్రెస్ లను పార్టీలుగానే పరిగణించి వాటికొచ్చిన స్థానాలను పేర్కొన్నారు. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి.

ఈ తరహా  పాక్షికమైన గణాంకాలతో పొందే ప్రయోజనమేమిటో నాకు బోధపడ లేదు. వామపక్ష శ్రేణులు, శ్రేయోభిలాషులలో వేళ్ళూనుకొన్న నిరాశ, నిస్పృహకు ఈ తరహా ప్రచారం ఏమన్నా నూతనోత్సాహాన్ని నింపుతుందా? పైపెచ్చు నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవలసిన సందర్భంలో ఆ ప్రక్రియ అవసరం లేదన్న తప్పుడు సంకేతాన్ని ప్రచారంలో పెట్టినట్లు అవుతుంది. ఆలోచించాలి.

2014 మొదలు నేటి వరకు 16 రాష్ట్రాలలో శాసనసభల ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 2,209 శాసన సభా స్థానాలున్నాయి. వాటిలో జాతీయ పార్టీలైన బిజెపికి 379, కాంగ్రెసుకు 296, సిపిఐ(యం)కు 88, సిపిఐకి 21 వచ్చాయి. బిజెపి 9 రాష్ట్రాలలోను, కాంగ్రెస్ 8 రాష్ట్రాలలోను, వామపక్షాలు 2 రాష్ట్రాలలోను అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీలు 12 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ&కాశ్మీర్ లో బిజెపి చిన్న భాగస్వామి పార్టిగా ఉంటే మహారాష్ట్ర, అస్సాంలలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది. వాస్తవాలను, వాస్తవాలుగా పరిగణలోకి తీసుకొని దేశ రాజకీయాలలో పార్టీల బలాబలాను అంచనా వేసుకోవాలి తప్ప, వంకరబుద్ధితో ఆలోచిస్తే జరిగే మేలేమిటి?

ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు గడచిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలను పరిశీలిస్తే బిజెపి - 282, కాంగ్రెస్ - 44, సిపిఐ(యం) - 9, సిపిఐ - 1, బి.యస్.పి. - 0, యన్.సి.పి. - 6, మొత్తం 543కు గాను జాతీయ పార్టీలు గెలుపొందిన స్థానాలు 342. ఓట్ల శాతాన్ని చూస్తే 60.70%. అంటే ప్రాంతీయ పార్టీల బలాన్ని తక్కువ అంచనా వేయలేం కదా! 2014 లోక్ సభ ఎన్నికల తదనంతర కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బలం తగ్గిపోతున్నది. పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కోలుకోవడం లేదు. ప్రస్తుతానికి పెద్ద రాష్ట్రాలలో ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉన్నది. మిగిలినవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. అక్కడ కూడా తన్నుకు చస్తూ, ఒడుదుడుకుల మధ్య నెట్టుకొస్తున్నారు.

బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, గోవా రాష్ట్రాలలో రాబోయే రెండు సంవత్సరాలలో శాసన సభలకు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితులు కనపడడం లేదని, తక్షణం దిద్దుబాటు చర్యల్లో భాగంగా నాయకత్వంలో ప్రక్షాళన జరగకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో నూతన శక్తులు ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని,   కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గారు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖాస్త్రం సందించినట్లు వార్తలొచ్చాయి.

వామపక్షాలు బలహీనపడ్డాయి. కేరళ, త్రిపుర  మినహా ఇస్తే మిగిలిన రాష్ట్రాలలో పరిస్థితులు ఆశాజనకంగా కనపడడం లేదన్నది వాస్తవం. ఇవన్నీ కూడా ఎన్నికలలో ఆయా పార్టీలు సాధిస్తున్న ఫలితాలను బట్టి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే. ఉద్యమాల ప్రాతిపదికన కాదు.

నేడు దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై మార్క్సిస్టు దృక్పథంతో సక్రమ పంథాను, రాజకీయ విధానాన్ని రూపొందించుకోవడం, స్థిరచిత్తంతో వాటి అమలుకు పూనుకోవడం వామపక్షాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.

3. ఒకనాడు సిపిఐ, నేడు సిపిఐ(యం) కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని వామపక్ష ఉద్యమానికి నష్టాన్ని కొని తెచ్చుకొన్నాయని, చేసిన తప్పులను సైద్ధాంతిక కోణంలో సమర్థించుకొనే ప్రయత్నాలను నిరంతరం చేస్తూనే ఉన్నారని పి.యస్.వి. చేసిన వ్యాఖ్యను తృణీకార భావంతో కొట్టి వేయలేం. కాంగ్రెసును ప్రధానమైన వర్గ శత్రువుగా ఎంచుకొని, భావజాల పోరాటాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళి, కడకు కమ్యూనిస్టు ఉద్యమ చీలికకు అది కూడా ఒక ప్రధానమైన కారణంగా చరిత్రలో చెప్పబడుతున్నది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైనే సిపిఐ(యం) నిర్మించబడిందని చెబుతుంటారు. నేటి పరిణామాలను చూస్తుంటే చరిత్ర తిరగబడినట్లనిపిస్తున్నది.

టి.లక్ష్మీనారాయణ

Saturday, May 21, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠం


అస్సాం మొదలు పశ్చిం బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వరకు ఓటర్లు స్పష్టమైన ఆధిక్యత కట్టబెడుతూ తీర్పు ఇచ్చారు. 'ఎగ్సిట్ పోల్స్' అధ్యయన సంస్థల(వ్యాపార సంస్థల) అంచనాలను తిరగరాశారు. విజ్ఞత ప్రదర్శించారు. తమదైన శైలిలో రాజకీయ పార్టీలకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల నుండి గుణపాఠాలు నేర్చుకోవలసిన బాధ్యత రాజకీయ పక్షాలదే! ఆ విజ్ఞత రాజకీయ పక్షాలకున్నదో! లేదో! కాలమే తెలియజేస్తుంది. 
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ ఎన్నికల ఫలితాలతో చంకలు చరుచుకొంటున్నది. గడచిన రెండేళ్ళ కాలంలో జరిగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కొన్నింట విజయం సాధించినా, దేశ రాజధాని డిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఓటమి చెందడంతో మోడీ ఛారిస్మా మసక బారుతున్నదన్న ఆందోళనకు బిజెపి గురయ్యిందనే చెప్పాలి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం క్రమేపీ తగ్గుతున్నది. కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోను చేదు అనుభవాలు చవి చూడవలసి వచ్చింది. 
ఈ పూర్వరంగంలో అస్సాంలో విజయం నూతనోత్సాహాన్ని బిజెపిలో నింపింది. ఈశాన్య భారత దేశానికి ముఖ ద్వారంగా ఉన్న అస్సాంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఒక గుణాత్మకమైన మార్పే. అయితే, బిజెపికి ఈ విజయం సానుకూల ఓట్లతో వచ్చిందనుకొంటే పప్పులో కాలేసినట్లే! అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ప్రంట్ లతో జట్టుకట్టి పదహైదు సంవత్సరాల పాలనానంతరం కాంగ్రెస్ కూడగట్టుకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం వల్లనే గద్దె దక్కింది. అస్థిత్వ రాజకీయాలలో భాగంగా 1980 దశకంలో ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ నేతృత్వంలో "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అస్సాం" అన్న నినాదంతో దూసుకొచ్చిన విచ్చిన్నకర ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన అస్సాం గణ పరిషత్ నాడు అధికార పీఠాన్నెక్కింది. నేడు బిజెపి కూటమి భాగస్వామ్య పార్టీగా బిజెపికి "సెవన్ సిస్టర్స్" గా భావించబడే ఈశాన్య భారత దేశంలో పెద్ద రాష్ట్రమైన అస్సాంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశాన్ని కల్పించింది. 2011 లోక్ సభ ఎన్నికల్లో సగం(ఏడు) స్థానాల్లో గెలుపొందిన బిజెపి తాజాగా తన స్థానాన్ని పదిల పరచుకొంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరిగా ఎంతో కొంత దేశ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం కల్పిస్తుందనడంలో సందేహం లేదు.   
పశ్చిం బెంగాల్ లో మూడు స్థానాల్లోను, కేరళలో ఒక స్థానంలో గెలుపొందడం కంటే వామపక్షాలకు బలమైన స్థావరాలుగా భావించబడిన ఆ రెండు రాష్ట్రాలలో బిజెపి పది శాతానికిపైగా ఓట్లు సంపాదించుకోవడం గమనార్హం. 2011 ఎన్నికల్లో పశ్చిం బెంగాల్ లో 4.06% వస్తే, నేడు 10.2%కి, కేరళలో 6% నుండి 10.5% కి ఎగబాకింది. భారత్ ధర్మ జన సేన(బిడిజెయస్) పేరిట కొత్తగా నెలకొల్పబడిన హిందుత్వవాద పార్టీతో కలిసి బిజెపి పోటీ చేసింది. బిడిజెయస్ పార్టీ శాసనసభలోకి అడుగుపెట్ట లేక పోయినా, 3.9% ఓట్లను తన ఖాతాలో వేసుకొన్నది. అంటే హిందుత్వ భావజాల పార్టీలైన బిజెపి - బిడిజెయస్ లకు కలిపి 14.4% ఓట్లు కేరళలో రావడాన్ని తక్కువ అంచనా వేయలేం. 
దశాబ్ధాలుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయుయంయల్) ముస్లింలకు, కేరళ కాంగ్రెస్ గ్రూపులు క్రైస్తవులకు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలుగా చెలామణిలో ఉండడమే కాదు, బలంగా వేళ్ళూనుకొని ఉన్నాయి. ఐయుయంయల్ 7.8% ఓట్లతో 18 స్థానాల్లోను, కేరళ కాంగ్రెస్(మణి గ్రూపు) 4% ఓట్లతో 6 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమిలో ఈ రెండు పార్టీలు భాగస్వాములే. ద్రవిడ రాజకీయాలు బలంగా వేళ్ళూనుకొన్న తమిళనాడులో మాత్రం 2.8% నుంచి 2.2%కు బిజెపి ఓట్ల శాతం పడిపోయింది. పుదుచ్చేరిలో పోటీనే చేయలేదు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళ మరియు పశ్చిం బెంగాల్ ప్రజానీకంలో మతపరమైన పార్టీలకు పెరుగుతున్నఆధరణ వామపక్ష రాజకీయాలకు పెనుసవాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ పార్టీ జారుడు బండ మీద ఉన్నది. అస్సాం, కేరళ రాష్ట్రాలను చేజార్చుకొన్నది. ఇహ! పెద్ద రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఒక్క కర్నాటకలోనే. పశ్చిం బెంగాల్ లో వామపక్షాలతో ఎన్నికల పొత్తు పెట్టుకొని లబ్ధి పొందింది. గతంలో 42 ఉంటే ఈ ఎన్నికల్లో 44 స్థానాలను సంపాదించు కొన్నది. డియంకెతో కలిసి పోటీ చేసి పుదుచ్చేరిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకొన్నది. తమిళనాడులో 8 స్థానాలకు పెరిగింది. పతనావస్తలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ ఫలితాలు భవిష్యత్తుపై బరోసా నింపేలా లేవన్నది మాత్రం సుస్పష్టం. మణిశంకర్ అయ్యర్ మాత్రం క్రింద పడ్డా మాదే పై చేయి అంటున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో మొత్తం 822 శాసనసభ స్థానాలుంటే, వాటిలో 139 కాంగ్రెసుకు, 65 మాత్రమే బిజెపికి వచ్చాయని, ఓట్ల శాతాలను పరిశీలించినా కాంగ్రెసుకు  , బిజెపికి   వచ్చాయని, అందుచేత మాదే పై చేయంటున్నారు. అది ఆయన 'లాజిక్'.
అవినీతి కేసులో జైలుకెళ్ళి వచ్చినా జయలలితకు తమిళ ప్రజలు జేజేలు కొట్టారు. ప్రత్యర్థి డియంకె కూడా అవినీతిలో తక్కువేం తినలేదు. యుపిఎ ప్రభుత్వ కాలంలో ఆ పార్టీ నేతలు పీకల్లోతు అవినీతి కుంభకోణాల్లో కూరుకపోయారు. పైపెచ్చు కరుణానిధి ఇంట రాజకీయ వారసత్వంపై చిచ్చు కొనసాగుతున్నది. అప్రతిష్ట పాలైన డియంకె _ కాంగ్రెస్ పార్టీల కూటమి కంటే జయలలితే నయమనుకొన్నట్లుంది. జయలలిత కురిపించిన ప్రజాకర్షక పథకాల హామీలు, ప్రధానంగా మహిళా ఓటర్లకు ఇచ్చిన హామీలు సత్ఫలితాలను ఇచ్చినట్లుంది. గత ఎన్నికల్లో విజయకాంత్ తో కలిసి పోటీ చేసి అధికార పగ్గాలను చేజిక్కించుకొన్న జయలలిత ఈ దఫా ఒంటరిగా బరిలోకి దిగి విజయ బావుటా ఎగరేయడం చూస్తుంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ ఎంత బలహీనంగా ఉన్నాయో! వెల్లడయ్యింది. గత ఎన్నికల్లో 29 స్థానాల్లో గెలుపొందిన విజయకాంత్ నేతృత్వంలోని డియండికె, వైగో నాయకత్వంలోని పార్టీతోను, వామపక్షాలతోను జట్టు కట్టి పీపుల్స్ ప్రంట్ గా బరిలో దిగినా ఖాతానే తెరవ లేక పోయింది. తమిళనాట కుల రాజకీయ పార్టీలు బాగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఏ ఒక్క పార్టీ కూడా శాసనసభలో ప్రాతినిథ్యాన్నిసంపాదించుకోలేక పోయింది.

పశ్చిం బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ హవా బాగానే వీచింది. అప్రజాస్వామిక పాలన, అవినీతి పాలన, ప్రత్యర్థులను హతమార్చుతున్న అర్థ ఫాసిస్టు పాలన రాజ్యమేలుతున్నదని ప్రత్యర్థి రాజకీయ పక్షాలన్నీ విమర్శలు గుప్పించినా ప్రజలు ఆమెకే తిరిగి పట్టం కట్టారు. అంతే కాదు, 184 నుండి 211 స్థానాలకు, ఓట్ల శాతాన్ని 38.93% నుండి 44.9%కి ఆ పార్టీ పెంచుకొన్నది. అంటే ఐదేళ్ళ పాలనానంతరం మమతకు ప్రజాధరణ ఇంకా పెరిగింది. ఇది ఆమె సుపరిపాలనకు మెచ్చి ప్రజలిచ్చిన తీర్పుగా భావించాలా! లేదా! వామపక్షాలపై ప్రజల్లో పెల్లుబికిన ప్రజాగ్రహం ఇంకా చల్లారలేదని భావించాలా! ఈ పరిణామాన్నినిశితంగా పరిశోధించాల్సి ఉన్నది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వామపక్షాల దుస్థితిని చెప్పకనే చెప్పాయి. అవినీతి కుంభకోణాల ఊబిలో కూరుకపోయి, భ్రష్టు పట్టి, ప్రజల చేత 'ఛీ' కొట్టబడిన కాంగ్రెస్ పార్టీ సహకారం లేక పోతే మమతా బెనర్జీని ఎన్నికల్లో ఎదుర్కోలేమన్న బేలతనాన్ని ప్రదర్శించి, ఉన్న కాస్త ప్రతిష్టను కూడా వామపక్షాలు భంగపరుచుకొన్నాయని చెప్పక తప్పదు. శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపి, పోరాట పటిమతో గెలుపోటములతో నిమిత్తం లేకుండా వర్గ శత్రువులపై రాజకీయ యుద్ధం చేయాల్సింది పోయి, ఎన్నికల సమరంలో తమ బలహీనతను బహిర్గతం చేసుకోవడంతో ఫలితాలు మరింత ప్రతికూలంగా వచ్చినట్లుగా భావించాల్సి వస్తున్నది. వారు ప్రకటించుకొన్న జాతీయ రాజకీయ విధానానికి భిన్నంగా కాంగ్రెసుతో ఎన్నికల అవగాహన కుదుర్చుకొన్నా, దాన్ని బహిరంగంగా ప్రకటించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిని కొనితెచ్చుకొన్నారు. కాంగ్రెస్ మాత్రం పొత్తుందని బహిరంగంగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది, 42 నుండి 44 స్థానాలకు, ఓట్ల శాతాన్ని 9.09% నుండి 12.3%కి బలాన్ని పెంచుకోగలిగింది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకొన్నది. ఎన్నికల ఫలితాల విశ్లేషణా కార్యక్రమంలో నాతో పాటు టీవి చర్చల్లో పాల్గొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ పశ్చిం బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో మేమే ఎదుగుతామని ఈ ఫలితాలను బట్టి వెల్లడవుతున్నదని వ్యాఖ్యానించారు. వారి కోరిక వాస్తవ రూపం దాల్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ, పతనావస్థలో ఉన్న కాంగ్రెసుకు ఊపిరులు ఊదినట్లుగా పశ్చిం బెంగాల్ పరిణామాలున్నాయి. 
వామపక్షాల బలం 60 నుండి 32కు పడిపోయింది. ఓట్ల శాతం 39.68% నుండి 25.6% పడిపోయింది. వామపక్ష కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఐ(యం) బలం 40 నుండి 26 కి, ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే 30.08% నుండి 19.7%కు దిగజారి పోయింది. పశ్చిం బెంగాల్ లో అనుసరించిన తప్పుడు ఎన్నికల ఎత్తుగడలు వికటించి, ప్రతికూల ఫలితాలను మూటకట్టుకోవడంతో కేరళలో సాధించిన ఘన విజయం వల్ల వామపక్ష శ్రేణుల ముఖాల్లో వెల్లివిరయాల్సిన ఆనందం, ఆవిరై పోయింది. 
కమ్యూనిస్టు ఉద్యమంలో తమిళనాడు ఒక బలమైన స్థానం ఉన్న రాష్ట్రంగానే భావించబడుతున్నది. గడచిన ఎన్నికల్లో సిపిఐ(యం) 10, సిపిఐ 9 స్థానాల్లో గెలుపొంది, ఈ ఎన్నికల్లో ప్రాతినిథ్యానికే నోచుకోకపోవడం, ఓట్ల శాతం కూడా పడిపోవడం, ద్రవిడ రాజకీయాల దాటికి తట్టుకోలేక పోవడం ప్రగతి శీల ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగించే పరిణామం. అస్సాంలో కూడా ఉనికి చాటుకోలేక పోయాయి. 
ఈ రాజకీయ పరిణామాలు వామపక్ష ఉద్యమ శ్రేణులు, శ్రేయోభిలాషులను తీవ్ర మనోవేధనకు గురి చేస్తున్నాయి.  ఈ ఎన్నికల ఫలితాలు నేర్పిన గుణపాఠాల పట్ల వామపక్షాలు ఎలా స్పందిస్తాయో! వేచిచూద్ధాం!

టి.లక్ష్మీనారాయణ