Monday, January 30, 2012

ఇరాన్‌పై ఆంక్షలు భారత్‌కు చమురు చిక్కులు

జనవరి 30,2012 , సూర్య దినపత్రిక


మొన్న ఇరాక్‌, నిన్న లిబియా, నేడు ఇరాన్‌ చమురు నిక్షేపాలపై అమెరికా కళ్ళు పడ్డాయి. యురేనియం అభివృద్ధి పథకాన్ని కొనసాగిస్తూ, అణ్వాయుధాల సామర్థ్యాన్ని సముపార్జించుకొనే ప్రయత్నం లో ఇరాన్‌ ఉన్నదని, ఆ దేశాన్ని కట్టడి చేయకపోతే ప్రపం చానికే ప్రమాదమని అంటూ అమెరికా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలను విధించింది. ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధింపజేసింది. ఆర్థిక ఆంక్షలతో పాటు ఇరాన్‌ను అష్టదిగ్భంధంలో ఉంచి ఎలాగై నా లొం గ దీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్న ది. తమ వ్యూహాత్మక భాగస్వాములైన ఐరోపా యూనియన్‌ను, ఇజ్రాయిల్‌ను ఉసిగొలిపింది. ఐరోపా యూనియన్‌ ఆంక్షల అమలుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది.

2012 జూలై 1 నుండి క్రూడ్‌ ఆయిల్‌ను ఇరాన్‌ నుండి దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. తద్వారా ఆ దేశాన్నిఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టాలని నిశ్చయించుకొన్నది. ఐరోపా యూనియన్‌ విధించిన వేసవి గడువు కంటే ముందే ఐరోపా దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని ఇరాన్‌ కూడా హెచ్చరించింది. మరొక వైపున అమెరికా ప్రోద్భలంతో ఇజ్రాయిల్‌ ఇరాన్‌ యురేనియం అభివృద్ధి, అణ్వస్త్ర తయారీ కేంద్రాలపై సైనిక దాడికి పూనుకొని చావు దెబ్బ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నది. తాజా పరిణామాలను గమనిస్తే యుద్ధ వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతున్నది.

ఇరాన్‌ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు మహ్మోద్‌ అహ్మది నెజాద్‌ నిర్ద్వందంగా ప్రకటించారు. పర్షియన్‌ గల్ఫ్‌- గల్ఫ్‌ ఆఫ్‌ ఒమాన్‌ను భౌగోళికంగా అనుసంధానం చేసే, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన స్ట్రైట్‌ ఆఫ్‌ హార్మూజ్‌గా పిలిచే కేవలం 54 కి.మీ. వెడల్పు ఉన్న సన్నటి సముద్ర జల మార్గం ద్వారానే గల్ఫ్‌ దేశాల నుండి ఎగుమతి చేసే ముడి చమురులో తొంబై శాతం, ప్రపంచ వ్యాపిత సరఫరాలో ఇరవై శాతం రవాణా కావాలి. గల్ఫ్‌కు ముఖ ద్వారమైన ఆ కీలక మార్గాన్ని మూసేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అమెరికా సైనిక విమానాలు, ప్రెంచ్‌- బ్రిటిష్‌ యుద్ధ నౌకలు గల్ఫ్‌ ప్రాంతంలోకి ప్రవేశించి, చమురు రవాణాకు అవరోధాలు కల్పిస్తే సహించేది లేదన్న రీతిలో బలప్రదర్శన కూడా చేశాయి. ఇరాన్‌ యురేనియం అభివృద్ధి పథకంపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వేదికల ద్వారా నిజనిర్ధారణ, చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. కానీ అమెరికా విధానాలతో సమస్య మరింత జఠిలమవుతున్నది. పర్యవసానంగా ఇరాన్‌ పై యుద్ధ మేఘాలు కమ్ముకొని ప్రపంచ శాంతికి విఘ్నం కలిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. టెహ్రాన్‌కు పశ్చిమంగా 130 కి.మీ. దూరంలో ఉన్న ఒక భూగర్భ కేంద్రంలో అధునాతన యంత్ర సామగ్రితో నిర్వహిస్తున్న యురేనియo అభివృద్ధి కార్యకలాపాలను ఐ.ఎ.ఇ.ఎ. బృందం ఇటీవల పరిశీలించిందని వార్తలొచ్చాయి.

అణ్వస్త్రాల తయారీకి యురేనియం అభివృద్ధి పథకాన్ని చేపట్ట లేదని, అణు ఇంధనం- వైద్యం వంటి సమాజిక అవసరాల కోసమే నిర్వహిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. తమ దగ్గర అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్న అమెరికా మాత్రం ఇరాన్‌ యురేనియం అభివృద్ధి పథకాన్ని వివాదాస్పదం చేస్తూ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నది.భారత్‌ వంటి చమురు దిగుమతి దేశాల పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్లు తయారు కాబోతున్నది. ఇది మన దేశాన్ని మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. యూపీఏ-2 ప్రభుత్వం అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఇప్పటికే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐ.ఎ.ఇ.ఎ.లో రెండు సార్లు ఓటు వేసింది. ముడి చమురు ధరల ఎగుడు దిగుడలతో దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి.

కువాయిత్‌పై ఇరాక్‌ యుద్ధం మొదలుకొని, ఇరాక్‌- లిబియా దేశాలపై అమెరికా దురాక్రమణ యుద్ధాల సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి, తద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతం. తీవ్ర రూపం దాల్చిన ద్రవ్యోల్బణం బారిన పడి నేటికీ ఆ కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాం. ముడి చమురు ఉత్పత్తిచేస్తున్న మొదటి పది దేశాలలో నాలుగో స్థానంలో ఉన్న దేశం ఇరాన్‌. అలాంటి దేశంపై అమెరికా విధించిన ఆంక్షల అమలు వల్ల భారత్‌ వంటి దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. అంతర్జాతీయ కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్లలోనే మనం దిగుమతి చేసుకొనే ముడిచమురుకు విలువ కట్టి చెల్లింపులు చేయాలి- లేదా యూరో కరెన్సీలోనే చేయాలి. డాలర్ల చెల్లింపుపైన , ఇరాన్‌ కేంద్ర బ్యాంకుతో లావాదేవీలు నెరపడానికి వీల్లేకుండా అమెరికా నిషేధం విధించింది. దాంతో ఇరాన్‌ చమురు అమ్మకాలకు, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపుకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ దుష్ఫలితాలు ఇరాన్‌ ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడతాయి.

అంతర్జాతీయంగా చమురుఎగుమతుల్లో నాలుగవ స్థానంలోఉన్న ఇరాన్‌నుండి ఎగుమతులు దిగ్బంధనకు గురైతే ముడిచమురు ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర వంద డాలర్లకు అటు ఇటూ కదలాడుతున్నది. అది కాస్తా 150 డాలర్ల వరకు పెరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరిస్థితే దాపురిస్తే మన ఆర్థిక వ్యవస్థ అనివార్యంగా సంక్షోభంలో పడుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలో కెల్లా ముడి చమురు నిల్వల్లో మూడవ దేశంగా, సహజ వాయువు నిక్షేపాలలో రెండవ స్థానంలోఉన్న ఇరాన్‌ నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా మన అవసరాల మేరకు దిగుమతి చేసుకోవడానికి వీలుగా పాకిస్థాన్‌ మీదుగా నిర్మించ తలపెట్టిన పైప్‌ లైన్‌ నిర్మాణాన్ని అమెరికా వ్యతిరేకించి, అడ్డుకొట్టింది.

మనకు, పాకిస్థాన్‌కు ఉభయతారకంగా రూపొందవలసిన ఆ పథకం మూలనబడింది. ఇరాన్‌ నుండి ముడి చమురును దిగుమతి చేసుకొంటున్న దేశాలలో చైనా తరువాత మన దేశమే రెండవ స్థానంలో ఉన్నది. దాదాపు రూ. 60,000 కోట్ల విలువజేసే ముడి చమురును దిగుమతి చేసుకొంటున్నాము. మన చమురు అవసరాలలో 80 శాతం- దిగుమతులపై ఆధారపడి ఉన్నాము. అందులో 12 శాతానికిపైగా ఇరాన్‌నుండే దిగుమతి చేసుకొంటున్నాము.ఇరాన్‌ నుండి ముడి చమురు దిగుమతులకు ఎదురౌతున్న ఆటంకాలను అదిగమించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని మన కేంద్ర ఇంధన శాఖ మంత్రి అంటున్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మన దేశం బంగారాన్ని వినియోగించబోతున్నట్లు ఇజ్రాయిల్‌ దుష్ప్రచారం మొదలు పెట్టింది. గతంలో భారత్‌, రష్యాల మధ్య కుదుర్చుకొన్న రూపాయి, రూబుల్‌ కరెన్సీలలో చెల్లింపులకు వీలు కల్పించిన వాణిజ్య ఒప్పందం తరహాలో ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తక్షణావసరం. అదే సందర్భంలో ఇరాన్‌ సంక్షోభానికి పరిష్కారాన్ని అన్వేషించాలి. అలాగే వస్తుమార్పిడి వాణిజ్య , వ్యాపార లావాదేవీల ఒప్పందాలకున్న అవకాశాలను శీఘ్రగతిన ఆలోచించాలి . కాకపోతే నట్వర్ సింగ్ నేతృత్వంలో గతంలో జరిగిన కుంభకోణం లాంటి వాటికి ఆస్కారం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలి .

అదే సందర్భంలో ఇరాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని అన్వేషించాల్సిన బాధ్యత కూడా మన దేశ నాయకత్వంపై ఉన్నదని గుర్తించాలి . అలీనోద్యమ స్ఫూర్తితో స్వతంత్ర విదేశాంగ విధానానికి కట్టుబడి అమెరికా మరియు దాని పెత్తనంలోని నాటో కూటమి దేశాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కృషి చేయాలి . బ్రెజిల్ , రష్యా , ఇండియా , చైనా మరియు దక్షిణాఫ్రికా కూటమి ( బ్రిక్స్ ) తదితర అంతర్జాతీయ వేదికలు , ప్రాంతీయ కూటములను క్రియాశీలంగా వినియోగించుకొని ప్రపంచ శాంతికి విఘాతం కలగకుండా తన వంతు పాత్ర పోషించడానికి మన ప్రభుత్వం చొరవ ప్రదర్శించాలి .








Thursday, January 26, 2012

వివాదాల మధ్య ‘ఆధార్‌’

published in Surya daily on 27th January 2012

భారత పౌరులందరికీ గుర్తిం పు కార్డులు జారీ చేయా లని కేంద్ర ప్రభు త్వం పథక రచన చేసింది. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నింటికీ ఆధార్‌ కార్డే ప్రామా ణికమని ఊదరగొట్టి, హడావుడి సృష్టించింది. ప్రభుత్వం జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో కెల్లా ఇదే విశిష్టమై న గుర్తింపు కార్డని ప్రకటించింది. ప్రభు త్వ ఆర్థిక రంగ సంస్థ లైన బ్యాంకులు అంద జేసే సేవలను పొందడానికి పేదలు, వెనుకబడ్డ పౌరులందరికీ ఇది అవకాశాన్ని కల్పిస్తుంది, ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేస్తుంది. వలస వెళుతున్న ప్రజలకు గుర్తింపునిస్తుంది. ఇలాంటి లక్షణాలెన్నో చెప్పారు. దేశ పౌరులందరూ విధిగా ఆధార్‌ కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

బయోమెట్రిక్స్‌ విధానంలో చిరునామాలను, పది చేతి వేళ్ళ ముద్రలను, ఐరిస్‌ కెమెరాలతో కళ్ళ ఫోటోలను, సంతకాలను సేకరిస్తూ నమోదు ప్రక్రియను దాదాపు ఏడాది క్రితం మొదలు పెట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను పొందాలన్నా, వంట గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు మొదలుకొని గ్యాస్‌ సరఫరాకు, మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పనకు, సబ్సీడీ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు విశ్వసనీయ ఆధారం ‘ఆధార్‌ కార్డు’ అన్న వాతావరణాన్ని, సామాన్య ప్రజానీకంలో భయాందోళనలను సృష్టించింది. ఆలసించిన ఆశాభంగం, నష్టదాయకం, త్వరపడండని ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వంలోనే ఈ పథకం పట్ల స్పష్టత పూర్తిగా కొరవడింది. దీనిని బట్టి పౌరుల భద్రతతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని స్పష్టమవుతున్నది.

ఆధార్‌ కార్డుల జారీకి అవసరమైన సమాచారాన్ని బయోమెట్రిక్స్‌ విధానంలో సేకరించడం ఎవరి ఆధీనంలో జరగాలనే అంశంపై తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కు కేంద్ర హోమ్‌ మంత్రి చిదంబరం రాసిన ఉత్తరాన్ని బట్టి బహిర్గతమయ్యింది. హోమ్‌ మంత్రిత్వ శాదా, లేక ప్రణాళికా సంఘానిదా అన్న సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టమని ఆ ఉత్తరం ద్వారా కోరారు. సమాచారాన్ని సేకరించవలసినది హోమ్‌ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే రిజిష్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) ఆధ్వర్యలోనా, లేదా ప్రణాళికా సంఘం అధీనంలోని యునీక్‌ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడిఏఐ) సంస్థ ఆధ్వర్యంలోనా అనేది తేల్చిచెప్పమన్నారు. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సమాచారాన్ని సేకరిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని, నిక్షిప్తం చేసిన సమాచారానికి రక్షణ కరవవుతుందని, సమాచార సేకరణ ప్రభుత్వాధికారుల అజమాయిషీలో జరగడం లేదని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు.

ఆర్‌.జి.ఐ. సమాచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి జవాబుదారీతనంతో పౌరుల నుండి సేకరిస్తారని, యు.ఐ.డి.ఎ.ఐ.- బయోమెట్రిక్స్‌ సమాచారాన్ని కాంట్రాక్టు తీసుకొన్న కిరాయి సంస్థల వారు నెలకొల్పుకొన్న నమోదు కేంద్రాల వద్దకు ప్రజలను రప్పించుకొని సేకరిస్తుందని, పర్యవసానంగా భద్రత కొరవడిందని స్వయంగా హోమ్‌ మంత్రి చెప్పడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. కార్డులను పౌరులకు మాత్రమే కాకుండా దేశంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ ఇవ్వాలన్నది లక్ష్యం. చట్ట వ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన చొరబాటుదారులు కూడా ఆధార్‌ కార్డులు పొందే అవకాశం ఉందని చెప్పడం చూస్తే, ఉగ్రవాదుల దాడులకు తరచూ గురవుతూ తల్లడిల్లిపోతున్న మన దేశం మరిన్ని సమస్యలను కొనితెచ్చుకొన్నట్ల వుతుంది.దేశ జనాభా గణాంకాల సేకరణ కార్యక్రమం- పౌరుల నమోదు శాఖ సంచాలకులు/ జనాభా సేకరణ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో పౌర సమాచార నిథి ఏర్పాటు నిమిత్తం బయోమెట్రిక్‌ నమోదు కార్యక్రమం జరుగుతున్నది.

మరొకవైపున ఈ పథకం రూపశిల్పి నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా ఉన్న యునిక్‌ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యు.ఐ.డి.ఎ.ఐ.) సంస్థ ఆధ్వర్యంలో బయోమెట్రిక్స్‌ను సేకరించడానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నది. ‘1955 పౌరసత్వ చట్టం’, 2003 నుండి అమలులో ఉన్న ‘పౌరసత్వ నిబంధన’ల మేరకు పౌరులందరూ విధిగా నమోదు చేసుకోవాలి. కానీ బయోమెట్రిక్‌ నమోదు కాదు. అంటే ముందుగా చట్టానికి సవరణ చేయాలి. పౌరుల సమాచారం దుర్వినియోగం కాకుండా భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలి. అలాగే ఆధార్‌ కార్డులకు సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి సంబంధమూ లేకుండా చేయాలి. అత్యంత కీలకమైన ఈ తరహా అంశాలన్నింటిపైన సమగ్రంగా పార్లమెంటులో చర్చించిన మీదట ప్రతిపాదిత నేషనల్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటి ఆఫ్‌ ఇండియా బిల్లుకు ఆమోద ముద్ర పడకముందే ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

ఈ పూర్వరంగంలోనే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఈ పథకంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ బిల్లును తిరస్కరించింది.చట్ట సభలను ఖాతరు చేయకుండా, ప్రస్తుత శాసనాలను ఉల్లంఘించి, మౌలికమైన, విధానపరమైన చర్యలు చేపట్టకుండానే కేంద్ర ప్రభుత్వం పథకం ఈ అమలుకు పచ్చజెండా ఊపి, అనుమతులు మంజూరు చేయడం అనాలోచితం , బాధ్యతారాహిత్యం, చట్ట వ్యతిరేకం. దేశంలోని దాదాపు నూట ఇరవై కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ చేయడానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆధార్‌ ప్రాజెక్టు మిషన్‌ డైరెక్టర్‌ రామ్‌ సేవక్‌ శర్మ వెల్లడించారు.

సంక్షేమ పథకాల అమలుకు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, ఆధార్‌ కార్డుల జారీతో ఆ పథకాల అమలులో జరుగుతున్న అవకతవక లను అరికట్టడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, అందు వల్ల ఈ పథకానికి వెచ్చించే మొత్తం అత్యల్పమని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తిరష్కరించక పోయినా రెండు సంస్థల ద్వారా సమాచార సేకరణకు అభ్యంతరం చెప్పినట్లు వార్తలు పొక్కాయి. కానీ ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.2014 సంవత్సరం నాటికి అరవై శాతం మంది ప్రజల బయోమెట్రిక్‌ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొన్నారు.

2012 మార్చి నాటికి ప్రథమంగా ఇరవై కోట్ల మందికి ఆధార్‌ కార్డులను జారీ చేయాలన్న ఒప్పందం మేరకు యు.ఐ.డి.ఎ.ఐ.తో కాంట్రాక్టు కుదుర్చుకొన్న ప్రైవేటు సంస్థలు పౌరుల వివరాలను సేకరిస్తున్నాయి. ఇప్పటికే పన్నెండు కోట్లమంది నుండి బయోమెట్రిక్‌ నమోదు ప్రక్రియలో భాగంగా నివాస చిరునామాలను, చేతి వేళ్ళ ముద్రలను, ఐరిస్‌ కెమరాలతో కళ్ళ ఫోటోలను, సంతకాలను సేకరించాయి. వివరాలు అందజేసి, నమోదు చేసుకొన్న పౌరులకు మూడు నెలల వ్యవధిలో ఆధార్‌ కార్డులు పోస్టు ద్వారా సురక్షితంగా వారి చిరునామాలకు అందుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రాథమిక దశలో కొంత మందికి కార్డులను అందజేశారు. 2011 మే మాసంలో ఆధార్‌ కేంద్రాల వద్దకు వెళ్ళి నమోదు చేసుకొన్న వారికి నేటికీ కార్డులు జారీ కాలేదు.

మరొకవైపున మొత్తం దేశ ప్రజలందరికీ ఆధార్‌ కార్డులను అందించే బాధ్యతను యు.ఐ.డి.ఎ.ఐ.కే అప్పగించాలని ప్రభుత్వం తలపోస్తున్నది. ప్రస్తుతం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలం కావడమే కాకుండా ఆధార్‌ కార్డుల జారీ విధానాన్నే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదంగా ఒకరి మీద ఒకరు నెపం మోపుకొంటూ దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రస్తుతానికి స్తబ్దత నెలకొన్నట్లు బోధపడుతున్నది . పథకం భవిష్యత్తు కేంద్ర మంత్రివర్గ నిర్ణయంపై ఆధారపడి ఉన్నదని యు.ఐ.డి.ఎ.ఐ. ఛైర్మన్‌ నీలేకని ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకొనే లోపభూయిష్టమైన విధానాలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి చెప్పి, మెరుగైన ఆలోచనలు చేయాలి.

Wednesday, January 18, 2012

యుపిలో పావులు ప్రజలే !

published in Surya daily on 18th January 2012

ఊసరవెల్లి రాజకీయాల కు, భ్రష్ట నాయకత్వ లక్షణాలకు ఉత్తర ప్రదేశ్‌ రాజ కీయ ముఖచిత్రమే ప్రబల నిదర్శ నం. ఢిల్లీ పీఠం క్రింద భూప్ర కం పనలు సంభవించకుండా చూసు కోవాలన్న తాపత్రయం కాంగ్రెస్‌ పార్టీది. ఢిల్లీ గద్దెనెక్కించిన రామ బాణం ఏక ప్రయోగంతో నిర్వీ ర్యమై పోవ డంతో భారతీ య జనతా పార్టీ ఉనికికోసం సంఘవ్యతిరేక శక్తులను అక్కున చేర్చుకొంటు న్నది. అస్తిత్వ రాజకీయాలతో అరంగేట్రం చేసి అధికార వ్యామో హం, వ్యక్తి పూజ రాజకీయాలకు సరికొత్త నిర్వచనాలు చెబుతూ డిల్లీ కుర్చీపై కన్నేసిన మాయావతి రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎన్నికల క్రీడకు జెండా ఊపింది.

పూర్వ వైభవానికి నోచుకోక పో యినా లక్నో గద్దె దక్కితేచాలన్న మనోవేథనలో ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కన్నేసి, మాయావతి వది లించుకొన్న నేరగాళ్ళను చేరదీసి యుద్ధతంత్రం పన్నుతున్నారు. రాజకీయ పార్టీల విన్యాసాలు ప్రజలను విస్తుగొలుపుతు న్నాయి. భవిష్యత్తులో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ప్రస్తుతం జరు గుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రీఫైనల్‌ లాంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజమే, లక్నోలో కింగ్‌మేకర్‌ ఎవరో ఆపై ఢిిల్లీలో కింగ్‌మేకర్‌ ఎవరో ! ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు తేల్చనున్నారు.

కేంద్రంలో యు.పి.ఎ. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ కష్టాల కడలిలో బండిని లాక్కొస్తున్న కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే ఫలి తా ను సాధించకపోతే సంక్షోభాల సుడిగుండంలో పడకతప్పదు. యువరాజు రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తు అంధకారమే. అహంకారంతో హూంకరిస్తూ, తన పెత్తనం క్రింద ఉండ లేకపోతే పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రప్రభుత్వం నుండి నిష్క్రమించండని తలుపులుతెరిచిన మమత మరింతరెచ్చిపోయి వ్యవహరిస్తుందన డంలో ఎలాంటి సంద ేహంలేదు. శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వాతావరణంలో మార్పు రాకముందే లోక్‌ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేసి లబ్ధిపొందా లనే దుందు డుకుతనంతో మమత ఆలోచిస్తున్నట్లుంది. అవినీతి కుంభకో ణాలు, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి ప్రజలు దూరమైనారని గుర్తించిన ఆమె రాజకీయప్రయాణానికి బోటు మార్చినా ఆశ్చర్యం లేదు.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ప్రత్యేకంగా రాహుల్‌గాంధీ నాయకత్వ లక్షణాలను రుజువు చేసుకోవడానికి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 22 స్థానాలు, 8.6 శాతం ఓట్లు సాధిస్తేనే రాహుల్‌ను ఆకాశానికెత్తారు. అంటే అతిపెద్ద రాష్ట్రంలో, ఉద్దండులైన ప్రధా నమంత్రులను అందించి న, ప్రధాన మంత్రులను నిర్ణయించే శక్తి ఉన్న ఉత్త రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎంత టి అధ్వాన్నస్థితిలో ఉన్నదో విదితమే. ఆ దుస్థితి నుం డి బయటపడి కాంగ్రెస్‌పా ర్టీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలు వారికేలేవు. కాకపోతే ఉన్న బలాన్ని పెంచుకోవాలని తాపత్రయ పడుతున్నారు. తద్వారా యుపి రాజకీయాలలో కింగ్‌మేకర్‌ పాత్రధారులై డిల్లీ రాజకీయాలకు స్థిరత్వం తెచ్చుకోవాలని, ఛరిస్మా ఉన్న నాయకుడుగా రాహుల్‌ని భుజాలకెత్తుకొని ప్రధాన మంత్రి పీఠంవద్దకు మోసుకు పోవాలని
ఉవ్విళ్ళూరుతున్నారు.

ఈ రాజకీయ లక్ష్యంలో భాగంగానే రాహుల్‌గాంధి కొంతకా లంగా ఆ రాష్ట్రంపై కేంద్రీకరించారు. బహుజన్‌, సమాజవాది పార్టీకి పునాదిగాఉన్న దళితులకు దగ్గరకావాలనే తపనతో తర చూ పర్యటనలు చేశారు. ముస్లిం మైనారిటీలను ఆకట్టుకోవడాని కి ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న సందర్భంలో వెనుక బడిన కులాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లలో 4.5 శాతాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించే ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా యు.పి.లో దళితులు, ముస్లిం మైనారిటీలు, రైతాం గాన్ని ప్రలోభ పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్‌ చూస్తున్నది. మరొకవైపు జాట్‌ కులస్తుల్లో పట్టున్న రాష్టీయలో క్‌దళ్‌ పార్టీ అగ్రనేత అజిత్‌సింగ్‌కు కేంద్ర మంత్రి పదవికట్టబెట్టి తమ గాటిలో కట్టేసుకొన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల్లో పైచేయి సాధించడం ద్వారా ప్రయోజనం పొం దాలని కాంగ్రెస్‌ ఎత్తు వేసింది. పడరాని పాట్లుపడుతున్నది.

దళిత పార్టీగా ఆవిర్భవించి, బ్రాహ్మణ భావజాలాన్ని ద్వేషించి న బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బి .యస్‌ .పి) అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి 2007‚లో జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణులు తది తర కులాలతో కూడిన విశాల ఐక్యతకు పిలుపిచ్చి, సీట్లిచ్చి అధి కారంలోకి వచ్చింది. 30.4 శాతం ఓట్లతో మొత్తం 403 శాసన సభస్థానాల్లో 206 గెలుచుకొని బొటాబొటి ఆధిక్యత సాధించిం ది. ఆపై మెల్లిమెల్లిగా బలాన్ని 218కి పెంచుకొన్నది. బడుగు బల హీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కల్పించి, వారి అభివృద్ధికి జరిగిన కృషి ఎంత అన్నది ప్రశ్నార్థకం.

కానీ కుంభకోణాలు, అవినీతి పెచ్చుమీరిపోయాయి. 22 మంది మంత్రులు, 28 మంది శాసనసభ్యుల అవినీతి కేసులపై ఆ రాష్ట్ర లోకాయుక్త విచారణ జరుపుతున్నది. మాయావతి సోద రుడు ఆనంద్‌కుమార్‌ 10వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నా డు. వీటినిబట్టి ఎంత విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలిందో స్పష్ట మవుతున్నది. హత్యల కేసుల్లో బి. యస్‌ .పి.కి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు కోర్టులు శిక్ష విధించాయి. పార్లమెంటు సభ్యులు ధనంజయ్‌సింగ్‌ ఒక హత్య కేసులో అరెస్టయ్యాడు. ప్రజాప్రతినిధులే హత్యానేరాల్లో ప్రత్య క్షంగా భాగస్వాములైనారన్నదానికి ఇవికొన్ని ఉదాహరణలు మాత్రమే.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న దుష్టశక్తులకు రక్షణ కల్పించిన పర్యవసానంగా హత్యలు, నేరాలు పెరిగిపో యాయి. 21 మంది రాష్టమ్రంత్రులను తొలగించడంద్వారా చేతులు దులిపేసుకోవాలని మాయావతి ఇప్పుడు ప్రయత్నిం చడం వంచనచర్యల్లో భాగమే. డా: బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ శిలావిగ్రహాలతో పాటు మాయావతి, బి.యస్‌.పి. ఎన్నికల చిహ్నమైన ఏనుగు శిలావిగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడానికి వందల కోట్ల రూపాయలు దుబారా చర్యలతో అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరుకొంది.

ఐదు సంవత్సరాల దుష్పరిపాలన, నియంతృత్వ విధానాల అమలువల్ల మాయావతి అపఖ్యాతి పాలైనారు. ఇప్పుడు అధికార దా హంతో కుటిలనీతిని ప్రదర్శిస్తూ యుపిని నాలుగు ముక్కలు చేస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని కొత్త పల్లవి అందుకొన్నారు. హడావుడిగా శాసనసభను సమావేశపరచి పట్టు మని పదిేహను నిమిషాలపాటు కూడా కూర్చోకుండానే మూజువాణి ఓటింగ్‌తో తీర్మానం చేసినట్లు సభాపతితో ప్రకటన చేయించి విభజన రాజకీయాలకు తెరలేపారు.

దేశానికి గుండె కాయలాంటి అతి పెద్దరాష్టమ్రైన యుపిపై పెత్తనాన్ని కొనసాగించుకొంటూ దాన్ని మెట్టుగా ఉపయోగించుకొని డిల్లీ గద్దెనెక్కాలని ఉవ్విళ్ళూరుతున్నట్లుంది. ఆ తీర్మానాన్ని డిల్లీకి పం పితే తిరుగు తపాలాలో తిరిగొచ్చింది. ఈ అంశంపై దివాలా కోరు విధానాలతో పార్టీలు పోటీపడుతున్నాయి. పాలకపార్టీలు రాష్ట్రా లవిభజన సమస్యను పాశుపతాస్త్రంగా వాడుకోవాలని పడరాని పాట్లు పడుతున్నాయి. అధికార యావతప్ప దేశ ప్రయో జనాలు గానీ, విస్తృత ప్రజాప్రయోజనాలుగానీ రాజకీయ పార్టీలకు పట్టవన్న విషయం యుపి పరిణామాలతో మరొకసారి బట్ట బయలయింది. కాంగ్రెస్‌ రెండో యస్‌.ఆర్‌.సి. అని కూనిరాగా లు తీస్తున్నది. బి.జె.పి.కి జాతీయ విధానమంటూ లేకుండా పో యింది. ప్రాంతానికో మాటచెబుతూ అవకాశవాదంతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నది.

ఎన్నికల జాతర మొదలు కాగానే రంగులు మార్చే రాజకీయ నాయకులు ఆలసించిన ఆశాభంగం అన్న నానుడిగా చకచకా పార్టీలను మార్చేస్తున్నారు. పాలకపార్టీ బి.యస్‌.పి. పని అయిపో యిందని భావించినవారు, మాయావతి చేత తొలగించబడిన వారు, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో పోటీ చేసే అవకాశ లభించదని నిర్ధారణకు వచ్చిన వారు శరవేగంతో జెండాలు మార్చేస్తున్నారు. అధికార మే పరమావధిగా భావిస్తున్న రాజకీయపార్టీలు మంచి చెడులను ఆలోచించకుండానే పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి భారీ అవినీతికి పాల్పడి మంత్రి పదవిని కూడా కోల్పోయిన బాబు సింగ్‌ కుష్వాహకు పార్టీ తీర్థం ఇచ్చారు. దాంతో అల్లరిపాలుకావడమే కాకుండా ఆ పార్టీ ఆంత రంగిక సమస్యల్లో పడింది. ఈ విషయంలో సమాజ్‌ వాది పార్టీ కూడా ఏ మాత్రం వెనుకబడి లేదు.

ఎన్నికల చిత్రాన్ని స్థూలంగా పరిశీలిస్తే బి.యస్‌.పి., సమా జ్‌వాది పార్టీ , కాంగ్రెస్‌ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమి , బి.జె.పి.ల మధ్యనే నాలుగు స్థంభాలాటగా కనిపిస్తున్నా అధికారం కోసం జరుగుతున్న పోరు మాత్రం బి.యస్‌.పి., సమాజ్‌వాది పార్టీల మధ్యనే ఉంటుందని భావించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకోవడానికి మిగిలిన మూడుపార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బి.యస్‌.పి. నుండి దూరమైన ఓటర్లలో ఎవరు ఎంత శాతం ఓట్లను ఆకర్షించుకోగలరనే దానిపై ఆధారపడి వారి స్థానమెక్కడ? అన్నది తేలుతుంది. గత ఎన్నికల్లో 25.4 శాతం ఓట్లతో 97 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద ప్రతిపక్షపార్టీగా ఉన్న ములాయంసింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదిపార్టీ అతిపెద్దపా ర్టీగా ఆవిర్భవిస్తుందని కొందరు అంచనాలు వేస్తున్నారు.

ప్రస్తుత శాసన సభలో 17 శాతం ఓట్లతో 51స్థానాలు గెలిచి మూడవ స్థానంలో బి.జె.పి. ఉన్నది. నాలుగ స్థానంలో కాంగ్రెస్‌ ఉన్నది. డిల్లీ గద్దె కోసం దెబ్బ లాడుకొంటున్న ఈ రెండు జాతీయ పార్టీలూ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు కూడా మూడు, నాలుగు స్థాన ాల కోసమే పోటీ పడుతున్నాయని భావిస్తున్నారు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. సమస్యల్లా ఎవరు కింగ్‌ మేకర్‌ అన్నదే ! కాంగ్రెస్‌ యస్‌.పి., బి.యస్‌.పి., బిజెపి, కాంగ్రెస్‌, బి.యస్‌.పి.లాంటి ఇచ్చిపుచ్చు కొనే భాగస్వామ్య ఒప్పందాలు గతంలోనూ చేసుకొన్నారు. కాక పోతే అంతిమంగా ఈ రాజకీయ క్రీడలో ప్రజా సమస్యలు పరి ష్కారం కాకపోగా జటిలమై నష్టపోతున్నది ప్రజలే !

Tuesday, January 10, 2012

పంజాబ్‌లో ఎవరి పాగా?

published in Surya Telugu daily on January 10, 2012

ఈశాన్య భారత దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం మణిపూర్‌. మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. ఇన్సర్జెన్సీ (తిరుగుబాట్లు) వంటి తల పోట్లతో ప్రజలు తీవ్రమైన అభద్రతా వాతావరణలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని రోజులు వెళ్ళదీస్తునారు. రక్షణ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రక్షణ దళాలు అకృత్యాలకు, నిర్బంధకాండకు పూనుకొంటున్నాయి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం చెవికెక్కించు కోవడం లేదు. మరొకవైపు యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ విచ్ఛిన్నకర ఆందోళన ఉధృత రూపం దాల్చి గత ఏడాది 121 రోజుల పాటు ఆర్థిక దిగ్బంధం, వారం పైగా రెండు జాతీయ రహదారులను మూసి వేయడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పర్యవసానంగా గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ. 2,000, బియ్యం, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు కిలో దాదాపు రూ.100కు పెరిగాయి. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సామాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ప్రజాగ్రహం ఏ రీతిలో ప్రతిబింబిస్తుందో వేచి చూడాలి.

అరవై స్థానాలున్న మణిపూర్‌ శాసన సభకు 2007లో జరిగిన ఎన్నికల్లో ముప్పై స్థానాల్లో గెలుపొంది, సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చమటోడ్చాల్సిందే. కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక అనుకూలాంశం బలమైన ప్రతిపక్ష పార్టీ లేకపోవడమే. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు, దాదాపు 16 శాతం ఓట్లు సాధించుకొన్న మణిపూర్‌ పీపుల్స్‌ పార్టీ మరింత బలహీనపడడంతో పాటు, ప్రస్తుత శాసన సభ్యుల్లో నలుగురు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, ఎలాగైనా ఆ రాష్ట్ర శాసన సభలో అడుగుపెట్టాలన్న చిరకాల కోర్కెను తీర్చుకోవాలని బీజేపీ తలపోస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలలో సీపీఐకి బలమైన పునాది ఉన్న రాష్ట్రం మణిపూరే. నేటి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి.

ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాల నుండి పై కెదిగి మరింత క్రియాశీల పాత్రను పోషించాలని ఆశిస్తున్నది. ఐదారు చిన్న పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగుతున్నాయి. డిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి గల రాష్ట్రం కాకపోయినా, దేశ ఐక్యత, సార్వభౌమత్వం కోణంలో చూస్తే- ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు అధికారంలోకి రావలసిన అవసరం ఎంతో ఉన్నది. పంజాబ్‌ రాష్ట్రంలో అకాలీదళ్‌, బీజేపీ కూటమి నుంచి అధికార పగ్గాలు కాంగ్రెస్‌ చేతికి చిక్కుతాయా, లేదా అన్నదే ప్రశ్న. యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న డా మన్మోహన్‌ సింగ్‌కు ఇది పరిక్షే. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందలేదనే అపఖ్యాతి నుండి ఆయన ఎలాగూ బయటపడలేరు.
కనీసం స్వరాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి, పంజాబ్‌ ప్రజలు తనతో ఉన్నారని చెప్పుకొనే అవకాశమన్నా మన మార్కెట్‌ ఆర్థిక సిద్ధాంత వేత్త, ప్రధాన మంత్రికి దక్కుతుందో, లేదో వేచి చూడాలి. డిల్లీ రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేసే స్థితిలో ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్‌, అకాలీదళ్‌ బీజేపీ కూటమి మధ్యనే సంకుల సమరం జరుగనున్నది. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ పెట్టింది పేరు. అభ్యర్థుల ఎంపికలో అదే మార్కు రాజకీయాలను మరొకసారి సార్థకం చేసుకొన్నది. గెలుపే గీటురాయని డిల్లీ పెద్దలు సమర్ధించు కొంటున్నారు. పర్యవసానంగా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రచ్చకెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ సోదరుడు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అలాంటి పరిణామాలు గుది బండై నిండా మునుగుతారో, అందివచ్చిన అవకాశం చేజారకుండా జాగ్రత్తపడతారో వేచి చూడాలి.

గోవా అస్థిర రాజకీయాలకు కేంద్రం . కాంగ్రెస్ , బి . జె .పి . క్రిందా మీదా పడుతూ ఆయారాం గయారాంలను చంక నెక్కించుకొంటూ , బుజ్జగించుకొంటూ పాలన సాగిస్తుంటారు . అది అలా నడిచి పోతుంటుంది . ఒకనాడు ఉత్తర ప్రదేశ్ లో అంతర్భాగమైన ఉత్తరాకాండ్ లో ప్రస్తుతం బి . జె . పి . అధికారంలో ఉన్నది . కుర్చీ కాంగ్రెస్ చేతికంద కుండా చూసుకోవాలన్న‌ కాషాయదారణుల ప్రయత్నాలు ఫలిస్తాయో ? లేదో ? వీటన్నింటి కంటే అసలు సిసలైన రాజకీయ సమరం దేశానికి గుండె కాయ లాంటి ఉత్తర్ ప్రదేశ్ గడ్డపైన శాసన సభకు జరుగుతున్న ఎన్నికలే ! అన్నది నిర్వివాదాంశం .

Wednesday, January 4, 2012

కొరియన్ల కల నెరవేరేనా!

published in Surya daily on January 4 , 2012

- దక్షిణ కొరియాలో అమెరికన్ల తిష్ఠ
- పునరేకీకరణే ఉత్తర, దక్షిణ కొరియన్ల వాంఛ
- నాయకుడి మృతితో దిగాలుపడ్డ ఉత్తర కొరియా
- ఆంతరంగిక సంక్షోభంపై ఊహాగానాలు
- సోషలిస్టు నిర్మాణంలో ఉత్తర కొరియా
- ఉన్నత విద్యావంతుల్లో మహిళలే అధికం


కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణించారని అధికా రికంగా 2011 డిసెంబరు 19న ప్రకటించగానే ఉత్తర కొరియా ప్రజలు దుఖః సాగరంలో మునిగిపోయారు. అమెరికా, పశ్చిమ దేశాల ప్రసారమాధ్యమాలు ఉత్తర కొరియాలో ఆంతరంగిక సంక్షోభం తలెత్తు తుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు చేశాయి. అమెరికా అడుగులకు మడుగులొత్తే దేశంగా పరిగణన పొందుతున్న దక్షిణ కొరియా సరిహద్దుల్లో సైనిక దళాలను అప్రమత్తం చేశాయి. నాయకుడి మృతితో దిగాలు పడ్డ ఉత్తర కొరియాలో రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపిం చడానికేమైనా అవకాశాలున్నాయా అని శతవిధాలా ప్రయత్నించాయి. వారి ఆశలు అడియాశలయ్యాయి.

ఉక్కు క్రమ శిక్షణకు, విశ్వసనీయతకు, నిబద్ధతకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డెమోక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా పౌరులు రాజకీయ పరిణతితో నాయకత్వ మార్పిడిని ఒక సాధారణ ప్రక్రియగా పూర్తి చేశారు.
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల ప్రజల ప్రగాఢ వాంఛ- స్వచ్ఛంద పునరేకీకరణ జరగాలన్నదే! డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డి.పి.ఆర్‌. కె./ ఉత్తర కొరియా)కు గొప్ప నాయకుడుగా కీర్తినందుకున్న కిమ్‌ ఇల్‌ సంగ్‌ శకం అనంతరం అధికారపగ్గాలు చేపట్టిన కిమ్‌ జాంగ్‌ ఇల్‌ శకం ముగిసింది. మూడవ తరం నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అధికార పీఠాన్ని అధిరోహించారు. రెండు పదుల వయస్సులో ఉన్న, పరిణతి చెందని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నేతృత్వంలో ఆ దేశం గడ్డు పరీక్షను ఎదుర్కొంటున్నదని భావించవచ్చు. కానీ, ఉత్తర, దక్షిణ కొరియా దేశాల పునరేకీకరణ, ఒకే కొరియా అన్న కిమ్‌ ఇల్‌ సంగ్‌ కన్న కలలను నెరవేర్చడానికన్నట్లు దృఢ చిత్తంతో జాతి ఐక్యతను ప్రదర్శించారు.

మార్క్సిస్టు సిద్ధాంతం వెలుగులో కిమ్‌ ఇల్‌ సంగ్‌ ఆలోచనా సరళికి అనుగుణంగా జూచే (స్వయంపోషకత్వ) భావజాలం ఉత్తర కొరియాలో అమలవుతున్నది. వ్యక్తి ఆరాధన కేంద్ర బిందువుగా వ్యవస్థ నిర్మితమైంది. వారసత్వ ప్రాతిపదికపై అధికార మార్పిడి జరుగుతున్నది. ఈ లక్షణాల వల్ల సహజంగానే ఆ వ్యవస్థ కొన్నిపరిమితులకు లోబడి పనిచేస్తున్నదని భావించవచ్చు. కానీ స్థూలంగా సోషలిస్టువ్యవస్థ నిర్మాణానికి కట్టుబడి ప్రయాణం సాగిస్తున్నది. చైనాకు సరిహద్దు దేశమైన ఉత్తర కొరియాను ఎలాగైనా లొంగదీసుకొవాలని దశాబ్దాలుగా అమెరికా ప్రయత్నిస్తున్నది.1950లో జరిగిన కొరియన్‌ యుద్ధంలో ఉత్తర భాగంలో బాంబుల వర్షం కురిపించి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణాలను ధ్వంసం చేసింది. 28,000 మంది సైనికుల్ని దక్షిణ కొరియాలో తిష్ఠ వేయించి అమెరికా ఆ దేశాన్ని శాశ్వతంగా సైనిక స్థావరంగా మార్చుకొన్నది. అణ్వాయుధాలతో అమెరికన్‌ నావికా దళాలు కొరియన్‌ పెనిన్సులాలో చక్కెర్లు కొడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి.

2005లో లిబియా, ఇరాన్‌ దేశాలతో బాటు ఉత్తర కొరియాను కూడా కలిపి ‘రోగ్‌ కంట్రీస్‌’గా అమెరికా ప్రకటించింది. అణ్వాయుధాలను సమకూర్చుకొంటున్నదనే కారణం చూపెట్టి ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను విధించింది. సహాయ సహకారాలందిస్తూ వచ్చిన సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం ఉత్తర కొరియా తన రక్షణ వ్యూహంలో భాగంగా అణ్వాయుధాలను సముపార్జించుకోవడానికి 2006లో అణు పరీక్షలు నిర్వహించింది. దక్షిణ కొరియా భూభాగం నుంచి పొంచిఉన్న ప్రమాదం నుండి తనను తాను రక్షించుకొనే విధానంలో భాగంగా అణ్వాయుధాల తయారీ, రక్షణ రంగాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవాలనే దృష్టితో కిమ్‌ జాంగ్‌ ఇల్‌ ఆర్మి పస్ట్‌ (సాంగ్‌ అన్‌) అన్న నినాదంతో భారీగా నిధులు వెచ్చించింది.

దానికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వచ్చినా ఆర్థిక ఒడిదుడుకుల్ని సమర్థవంతంగానే నెట్టుకొచ్చింది. ఉత్తర కొరియా మహిళా సాధికారతను సాధించడమే కాదు, ఉన్నత విద్యను ఆర్జించిన వారిలో పురుషుల కంటే మహిళలే అధికం. రాజకీయ, రక్షణ రంగాలలో ముందంజలో ఉన్నది. ఆ దేశానికున్న పరిమితమైన ఆర్థిక వనరుల్లోనే పౌరులకు సామాజిక సేవలను అందించడంలో, అందరికీ చదువు, ఉపాథి , పౌష్టికాహారం, గృహ వసతి కల్పించడంలో శ్రద్ధ వహించిందని, శిశు మరణాల సంఖ్య చాలా తక్కువని, ఆయుర్దాయం రేటు ఎక్కువని, అవినీతికి ఆస్కారం లేని దేశమనీ- అంతర్జాతీయ సంస్థలే వ్యాఖ్యానించాయి.

దేశ వ్యాపితంగా వ్యాధి నిరోధక ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో, డాక్టర్లు, నర్సుల కొరత లేని దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ.హెచ్‌.ఒ.) డైరెక్టర్‌ జనరల్‌ ప్రశంసించారు. ఉత్తర కొరియా నిఖారె్సైన సామ్రాజ్యవాద వ్యతిరేక దేశంగా ఎదిగి, మనుగడ సాగిస్తున్నది. 1950లో జరిగిన యుద్ధం పర్యవసానంగా తీవ్రంగా నష్ట పోయిన ఈ దేశం మరొక యుద్ధాన్ని ఏ మాత్రం కోరుకోవడం లేదు . కొరియన్‌ ప్రజలు ఆత్మగౌరవంతో, ఇతరుల జోక్యానికి తావివ్వకుండా కిమ్‌ ఇల్‌ సంగ్‌ స్పూర్తితో ఉత్తర- దక్షిణ కొరియాల పునరేకీకరణను, శాంతి, భద్రత, సోషలిస్టు పంథాలో అభివృద్ధిని సాధించాలని ప్రగాఢంగా కోరుకొంటున్నారు .

ఉత్తర కొరియాలో నిర్వహించిన13వ ప్రపంచ యువజన విద్యార్ధి ఉత్సవాలలో ఆ దేశానికి బద్ధ శతృత్వం వహించే అమెరికా, జపాన్‌ దేశాల నుండి కూడా యువత పాల్గొన్నది. కొరియన్‌ పెనున్సుల ఐక్యతకు దక్షిణ కొరియా యువజన, విద్యార్థులు ఏ విధంగా పరితపిస్తున్నారో వెల్లడించడానికి ఒక యువ మహిళా ప్రతినిథి రిమ్‌సు జియోంగ్‌ అక్కడి నిర్బంధాలను ఛేదించుకొని వచ్చి ఈ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. యువజనోత్సవాలలో అంతర్భాగంగా కొరియన్‌ సంఘీభావ సభ జరిగింది. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల స్వచ్ఛంద పునరేకీకరణ, జాతీయ స్వతంత్ర ప్రతిపత్తి ఆధారంగా శాంతి, అభివృద్ధి సాధించాలన్న కొరియన్‌ ప్రజల ఆకాంక్షలకు సభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రిమ్‌ సు జియోంగ్‌ తిరిగి దక్షిణ కొరియా సరిహద్దుల్లో అడుగు పెట్టగానే ఆమెను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు.

తాజాగా కిమ్‌ జాంగ్‌ ఇల్‌ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వెళ్ళే ప్రయత్నం చేసిన దక్షిణ కొరియా పౌరులను నిర్దయగా ఆ దేశ ప్రభుత్వం అడ్డుకొన్నది. నియంతృత్వ పాలన ఉత్తర కొరియాలో ఉన్నదో, దక్షిణ కొరియాలో ఉన్నదో ఈ ఘటనలను బట్టి స్పష్టమవుతుంది. సియోల్‌లో జరిగిన ఒలంపిక్స్‌ క్రీడల సందర్భంగా దక్షిణ కొరియా ప్రజలను అమెరికా ఏ విధంగా అవమానించిందో కూడా ఆ దేశ యువతకు బాగా గుర్తుండే ఉంటుంది . అందుకే కొరియన్ల ఐక్యతకు పరితపిస్తున్నారు.
2000లో ఉత్తర, దక్షిణ కొరియా ప్రభుత్వాలు పునరేకీకరణ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని సూత్ర ప్రాయంగా అమోదిస్తూ పియోంగ్యాంగ్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ ప్రాంతంలో, అలాగే ప్రపంచ శాంతికి దోహదపడే కొరియన్‌ పెనున్సులా ఐక్యతను అందరూ కోరుకొంటున్నారు. తెర వెనుక నుంచి అమెరికా- అడుగు ముందుకు పడకుండా దక్షిణ కొరియాను కట్టడిచేస్తూ సియోల్‌ కేంద్రంగానే పునరేకీకరణ జరగాలని, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఉత్తర కొరియా ప్రాభవాన్ని దెబ్బకొట్టి, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి స్వస్తిపలికేలా చేసి, ఐక్య కొరియా దేశాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని బలంగా ఆశిస్తోంది.
ఈ పూర్వరంగంలో పాలనా పగ్గాలు చేబట్టిన కిమ్‌ జాంగ్‌ ఉల్‌ కు కొరియన్‌ దేశాల ఐక్యతా చర్చలు, అత్యంత క్లిష్టమైన- అణు శక్తి వినియోగ పథకంపై కొనసాగుతున్న అంతర్జాతీయ సంప్రదింపులు, కిమ్‌ ఇల్‌ సంగ్‌ ప్రభోధించిన జుచే భావజాలానికి అనుగుణంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో ముందుకు సాగిపోవడం పెద్ద సవాలుగా నిలిచాయి. కష్ట కాలంలో ఉత్తర కొరియా ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఉత్తర- దక్షిణ కొరియా దేశాల పునరేకీకరణకు మార్గాన్ని సుగమం చేస్తుందని, ప్రపంచ శాంతికి ఉపకరిస్తుందని ఆశించవచ్చు.