Saturday, December 25, 2010

అవినీతి పై వ్యాసం

హోం > వివరాలు
అందలం ఎక్కుతున్న అవినీతి మహమ్మారి
దేశ భవితవ్యానికి ఎసరు
గత కుంభకోణాల చరిత్ర రికార్డును బద్దలు కొడుతూ 2010 సంవత్సరంలో పలు భారీ కుంభకోణాలు వెలుగు చూశాయి. వాటిలో ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ. 1,76,000 కోట్లకు గండి కొట్టిన భారీ కుంభకోణం అతిపెద్దది.

‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పార్లమెంటు నిండు సభలో ప్రకటించడంతో దేశాధి నేతలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజులు గడవక ముందే జాతి మొత్తం తలదించుకునే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు కుంభకోణం వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలను అచేతనం చేస్తే దిక్కుతోచక అధికార కూటమి నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు. అవినీతి చట్ట ప్రకారం నేరం.


కానీ, అవినీతే నేడు రాజ్యమేలుతు న్నది. అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతూ వ్యవస్థీకృత మయింది. అవినీతి, నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను సవాలు చేస్తూ, సమాంతరంగా, విషవృక్షంలా ఎదుగుతూ, అభివృద్ధికి అవరోధంగా పరిణమిం చాయి. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2003 సంవత్సరం సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం 133 దేశాల్లో మన దేశం అవినీతిలో 87వ స్థానాన్ని ఆక్రమించి అత్యంత అవినీతి దేశంగా నమోదయింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూఎన్‌డీపీ) వెల్లడించిన మానవ వనరుల అభివృద్ధి సూచిక-2010 గణాంకాల ప్రకారం 169 దేశాల్లో మన స్థానం 119. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం. కానీ, విచ్చలవిడి అవినీతి కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతున్నది.

అవినీతి అంతానికి ఏకైక పరిష్కారమార్గమంటూ ఏదీ లేదని, వివిధ స్థాయిల్లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిం చాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ సీబీఐ, ఏసీబీ అధికారులకు ఆ మధ్య ఒక సమావేశంలో హితబోధ చేశారు. కానీ, ఒక కుంభకోణాన్ని మరో కుంభ కోణం తలదన్నుతూ ప్రజా ధనాన్ని కొల్లగొడుతుంటే చేవ చచ్చి, గుడ్లప్పగించి చూస్తున్నారు. అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అవినీతి అంతానికి న్యాయవ్యవస్థ ఇతర సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దురదృష్ట మేమంటే ఆ అత్యున్నత న్యాయస్థానం వైపు కూడా వేలెత్తి చూపించే దుస్థితి దాపురించింది.

అభివృద్ధి పేరిట అమలవుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల అవినీతి, నల్ల ధనం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీ ఆర్) సంస్థ 2000 సంవత్సరంలో ప్రచురించిన అధ్యయన నివేదిక ప్రకారం నల్లధనం స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 18 నుంచి 21 శాతం వరకు ఉన్నది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని దేశ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం శాతం ఏటేటా పెరిగిపోతున్నది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఎకనామిక్స్ డిపార్టుమెంటులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా॥అరుణ్‌కుమార్ ‘భారతదేశంలో నల్లధనం’ అన్న తన పుస్తకంలో నల్లధనం దాదాపు 40 శాతానికి పెరిగిం దని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ.61,64,000 కోట్లు. అంటే అందులో నల్లధనం మొత్తం దాదాపు రూ.25 కోట్లు అన్నమాట. నల్లధనానికి అధిపతులుగా ఉన్న కార్పొ రేట్ సంస్థలు, పౌరులు నిజాయితీగా చట్టానికి బద్దులై తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని ఆదాయంగా ప్రకటిస్తే ఆదాయ పన్ను చట్ట ప్రకారం 30 శాతం పన్ను చెల్లిస్తే, ప్రభుత్వ ఖజానాకు రూ.7 లక్షల 50 వేల కోట్లు జమ అవుతుంది.

అవినీతిని నిర్ధిష్టంగా అంచనా వేయడానికి కొల బద్దలు లేవు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ అధ్యయన నివేదిక 2010 గత నెలలో విడుదలైంది. దాని ప్రకారం అక్రమ లావాదేవీల ద్వారా ప్రతిరోజు సరాసరిన 240 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. 1948-2008 సంవత్సరాల మధ్య దేశం నుంచి 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపో యింది. మరో 17,800 కోట్ల డాలర్ల సొమ్ము దేశంలోనే నల్లధనంగా చలామణిలోకి వచ్చింది. అందులో గడచిన దశాబ్ద కాలంలోనే 5.75 లక్షల కోట్ల రూపా యలను కోల్పోయినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ అంచనాల కంటే అధికంగానే నల్ల ధనం పోగు పడ్డదని కూడా వ్యాఖ్యానించింది.

1988 సంవత్సరంలో అవినీతి నివారణ చట్టం అమలులోకి వచ్చింది. యూపీఏ-1 ప్రభుత్వ కాలంలో సమాచార హక్కు చట్టం వచ్చింది. అవినీతిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ) 2003 అక్టోబర్ 13న కన్వెన్షన్ 58/4 (తీర్మానం) చేసి, సభ్య దేశాలన్నింటినీ అమలు చేయాలని కోరింది. అలాగే ప్రతి ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని యూఎన్‌ఓ పాటిస్తున్నది.
గత కుంభకోణాల చరిత్ర రికార్డును బద్దలు కొడుతూ 2010 సంవత్సరంలో పలు భారీ కుంభ కోణాలు వెలుగు చూశాయి. వాటిలో ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ.1,76,000 కోట్లకు గండికొట్టిన భారీ కుంభకోణం అతిపెద్దది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి, ఐపీఎల్ క్రికెట్ కుంభకోణం, దేశ రక్షణ కోసం యుద్ధంలో ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుం బాల వితంతువుల కోసం నిర్మిస్తున్న ‘ఆదర్శ్ సొసైటీ’ అపార్ట్‌మెంట్స్‌ను రాజకీయ నాయకులకు, సైన్యాధికా రులకు, ఉన్నతాధికారులకు కేటాయించడం, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మ కమైన ఆర్థిక సంస్థలలో రుణాల మంజూరులో భారీ లంచాలకు పాల్పడటం, కర్ణాటక ముఖ్యమంత్రి ప్రభు త్వ భూములను సమీప బంధువులకు దారాదత్తం చేయడం వంటి అవినీతి కుంభకోణాలు ఇటీవల దేశాన్ని కుదిపేశాయి.

జాతి యావత్తు తల దించు కునేలా చేశాయి. కుంభకోణాలకు బాధ్యులైన కేంద్ర మంత్రులు ఎ.రాజా, శశిథరూర్, పార్లమెంటు సభ్యు లు సురేష్ కల్మాడీ, కేవలం పదవులు కోల్పోతున్నారు. అక్రమ సంపాదన వారి సొంతమవుతున్నది. ప్రజాధ నాన్ని, ఆస్తులను తిరిగి రాబట్టుకోవాలి కదా? అలాంటి చర్యలు చేపట్టడానికి చట్టాలే కరువ య్యాయి. 1986 సంవత్సరంలో బోఫోర్స్ ఆయుధాల కొనుగోలులో కుంభకోణం మొదలుకొని, ఫ్రాన్స్ నుండి 1990 సంవత్సరంలో ఎయిర్‌బస్ ఎ-320 కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన రూ.2,500 కోట్లు కిక్‌బ్యాక్ కుంభకోణం, 1993 సంవత్సరంలో రూ.3,000 కోట్ల హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కాం, గోల్డ్ స్టార్ స్టీల్ అండ్ అల్లాయ్స్ వివాదం, 1992 సంవత్సరంలో ప్రధాన మంత్రి పదవిని కాపాడుకో వడానికి కోటి రూపాయల లంచంతో పి.వి.నరసింహా రావు సూట్‌కేస్ ఇచ్చారనే కేసు, జేఎంఎం అవినీతి కేసు, హవాలా స్కామ్, యూరియా స్కామ్ వగైరా కుంభకోణాల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్విని యోగానికి పాల్పడ్డ వారికి ఎవరికీ శిక్షలు పడలేదన్న సంగతి తెలిసిందే.

అధికార యంత్రాంగంలో అవినీతి అంతర్భాగమై పోయింది. రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ (ఎసీబీ) అంచనా మేరకు 10శాతం మంది ప్రభుత్వోద్యోగులు మాత్రమే అవినీతికి దూరంగా నిజాయితీతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. 10 నుంచి 15శాతం మంది పూర్తిగా ఊబిలో కూరుకుపోయి సంస్కరించడానికి కూడా అనర్హులుగా ఉన్నారు. 70శాతం మందిని సంస్కరించడానికి అర్హులుగా గుర్తించారు. ఏ అవినీతి ఉన్నతాధికారిని లేదా ఉద్యోగిని పట్టుకున్నా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయట పడుతున్నాయి. అయినా, అవినీతి అధికారులకు ఏమాత్రం భయం లేకుండా పోతున్నది. కారణం ఏసీబీ నమోదు చేసిన కేసులను మర్నాటికే ఉపసంహరించుకోగలుగుతు న్నారు. పెపైచ్చు ప్రమోషన్లు పొందుతున్నారు. 2003 సంవత్సరం నుంచి ఏడాదికి సరాసరిన 500 నుండి 700 వరకు కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా. అవినీతి అధికారులందరిపై కేసులు నమోదు చేయడం కూడా అసాధ్యం.

ఏసీబీ ఎన్ని కేసులు పెట్టింది? ఎన్ని కేసులను ఉపసంహరించింది? ఉపసంహరణకు కార ణాలేంటి? ఎంత మందిని శిక్షించారు? అన్న వివరా లను బహిరంగ పరిచి పారదర్శకతను ప్రదర్శించగ లిగితే ఆ సంస్థ విశ్వసనీయత పెరుగుతుంది.

సీబీఐ, ఏసీబీ, రాష్ట్ర, కేంద్ర విజిలెన్స్ కమిషన్స్, లోకాయుక్త లాంటి సంస్థలు అవినీతిని బహిర్గతం చేసి అరికట్టాల్సిందిపోయి ‘కాగితపు పులులు’గా మారిపో యాయి. బహుళ జాతి సంస్థలు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను, ధనాన్ని దోపిడీ చేస్తుంటే నివారించే శక్తి ప్రభుత్వాలకు లేకపోయింది.

అక్రమ సంపాదనను, నల్లధనాన్ని కాపాడుకోవ డానికి స్విస్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక నేరస్తులు, పన్ను ఎగవేతదారులు, అవినీతిపరులు పోగు చేసుకున్న దొంగ డబ్బును భద్రంగా కాపాడే నేరపూరిత బ్యాంకింగ్ వ్యవస్థను స్విట్జర్లాండ్ దేశం పటిష్టంగా నిర్వహిస్తున్నది. ఖాతాదారుల రహస్యా లను ఎట్టి పరిస్థితుల్లోను బహిరంగపరచకుండా అక్రమార్జనపరులకు రక్షణ కవచంగా స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ప్రపంచ నలుమూ లల నుంచి నల్లధనాన్ని దాచుకోవడానికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, డిపాజిట్ చేస్తున్నారు. స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించిన సమా చారం మేరకు దాదాపు 75 లక్షల కోట్ల రూపాయల మేర భారతీయుల డిపాజిట్స్ అక్కడి బ్యాంకుల్లో ఉన్నాయి.


సుమారు 250 లక్షల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను మన దేశస్తులు స్విస్ బ్యాంకుల్లోనే కాక ఇతర దేశాల ఆర్థిక సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసుకొన్నట్లు మరో అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నది డాలర్. ఆ విదేశీమారక ద్రవ్యపు నిల్వలను కొల్లగొట్టి విదేశాలకు తరలించడం వలన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. మరొక వైపున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధుల కొరతతో అప్పుల వేటలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, సంపన్న దేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టి, విషమ షరతులకు తలొగ్గి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల డబ్బును స్వదేశానికి తీసుకురాగలిగితే జాతి ఆర్థికావసరాలు తీరడమే కాకుండా ప్రపంచ దేశాలలోని సంపన్న దేశాల సరసన మన దేశం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది అంతసులభమైన పనికాదు. రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం, జాతి యావత్తూ అంకిత భావంతో కృషి చేయాలి. అంతర్జాతీయ వేది కలైన ఐక్యరాజ్య సమితి, ఇతర వేదికలపై అంతర్జా తీయంగా రాజకీయ ఒత్తిడి పెద్ద ఎత్తున తీసుకొస్తే తప్ప ఈ లక్ష్యం నెరవేరదు. అలాగే మన దేశం నుంచి ఏటా లక్ష మంది వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తు న్నారు. వారిలో దాదాపు 25 వేల మంది సంవత్స రంలో పలు దఫాలు ఆ దేశానికి వెళ్ళి వస్తున్నట్లు సమాచారం. అలాంటి వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించి ఆర్థిక నేరాల నిఘా సంస్థలు పని చేస్తే స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారిని పసిగట్టవచ్చునని నిపుణుల అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజా యితీతో, రాజకీయ సంకల్పంతో, దేశ ప్రయోజనా లను పరిరక్షించడానికి కంకణబద్ధులైతే స్విస్ బ్యాం కుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకు రావడం అసాధ్యం కాదు.

ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడానికి రాజకీ యాలకతీతంగా ప్రజానీకం, ప్రత్యేకంగా యువతరం విస్తృతమైన ఉద్యమాన్ని అవినీతికి వ్యతిరేకంగా నిర్మిం చాల్సిన తక్షణావసరం ఎంతైనా ఉన్నది.
టి. లక్ష్మీనారాయణ
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐటీయూసీ
(నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం)
More Headlines

No comments:

Post a Comment