Tuesday, January 4, 2011

కృష్ణా జలాలపై భ్రజేస్ కుమార్ త్రిబునల్ అవార్డు పై వ్యాసం

‘తీర్పు’ సాగురంగం బాగుకు కాదు, ఓగుకే!
మిగులు జలాలు ఇక మిథ్యేనా?
Sakshi telugu daily 4th jan. 2011

కృష్ణానదీ జలాల పంపిణీ వివాదంపై గడిచిన ఆరేళ్లుగా విచారణ జరిపిన జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వం లోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. నిత్య కరువు పీడిత ప్రాంతాల ప్రజల ఆశలు అడి యాసలయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఏ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వచ్చారో, వాటికి వాస్తవరూపం కల్పిస్తూ తీర్పును వెలువరిం చడం అత్యంత దురదృష్టకరం. కర్ణాటక-మహారాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూల మైన వాదనలను సమర్థంగా ట్రిబ్యునల్ ముందు వినిపించి సంపూర్ణ విజయాన్ని సాధించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత, అపరిపక్వత, చేతగానితనం ట్రిబ్యునల్ తీర్పుతో లోకానికి వెల్లడైంది. పర్యవసానంగా మిగులు జలాలపై మనకున్న హక్కును శాశ్వతంగా కోల్పోయాం. అపార నష్టాన్ని కొనితెచ్చుకుంటున్నాం.

కృష్ణానది మిగులు జలాలను ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛ నదీ పరీవాహక ప్రాంతంలో చివరగా ఉన్న మన రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 1976లో దఖలు పరచింది. నదీ ప్రవాహంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకకు మిగులు జలాల్లో ఏమాత్రం హక్కులేదని స్పష్టంగా పేర్కొన్నది. కానీ బచావత్ తీర్పు గడువు ముగియగానే ఆ రాష్ట్రాలు మిగులు జలాల్లో వాటా ఇవ్వాలని ఉడుం పట్టుబట్టి సాధించు కున్నాయి. మిగులు జలాలను కూడా పంపిణీ చేసే విధానం అశాస్ర్తీయమైనది. ఏడాది చివరలో మొత్తం నీటి లభ్యతను బట్టి నికర జలాలు పోను మిగిలిన వాటిని మిగులు జలాలుగా పరిగణిస్తారు. మిగులు జలాలను ముందుగానే అంచనాకట్టి పంపకాలు చేయడం అసంబద్ధం.


ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్ల ఎత్తుకు పెంచడం ద్వారా అధిక నీటిని నిల్వ చేసుకొని వాడుకోవాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కర్ణాటక ట్రిబ్యునల్ చేత ఆమోదముద్ర వేయించుకున్నది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం జరిగిన తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప నీటిని విడుదల చేయడం లేదు. ఫలితంగా మనకు కేటాయించిన నికర జలాలను పొందడం కూడా దుర్లభమైపోయింది. గతంలో నాగార్జునసాగర్, కృష్ణాడెల్టా కింద కరువు పరిస్థితులు నెలకొన్న చేదు అనుభవం చవి చూశాం. ఇలాంటి స్థితిలో తాజా తీర్పు వల్ల కర్ణాటక రాష్ట్రానికి నీటి కేటాయింపు పెరిగిన దృష్ట్యా నిలవచేసుకునే అవకాశం కూడా కల్పించాలనే దృష్టితో ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమ తించటంతో భవిష్యత్తు దుష్ఫరిణామాలు ఎలా ఉం టాయో ఊహించటం కష్టసాధ్యం కాదు.

‘కృష్ణానదీ జలాల పంపిణీ తీర్పు-అమలు బోర్డు’ను మూడు నెలల తర్వాత ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ కోరింది. ఇది అత్యంత ఆవశ్యకమైనది అయినా, దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేకుండా ప్రయోజనం లేదు. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబంధించిన చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత తీర్పు ద్వారా తుంగభ్ర బోర్డు రద్దయిపోయి మొత్తం కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది.

కరువు పీడితుల ఆవేదన అరణ్య రోదనే!

1976వ సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో నికర జలాల కేటాయింపునకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందని ఇటు తెలం గాణ, అటు రాయలసీమ ప్రాంత ప్రజానీకం బలంగా భావిస్తున్న పూర్వరంగంలో ఇప్పుడు మిగులు జలాలు కూడా చేజారిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతాల నీటి అవసరాలు ఎలా తీరుతాయి? మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి? ప్రస్తుత తీర్పు యథాతథంగా అమలైతే నిత్య కరువు పీడిత, వెనుకబడిన ప్రాంతాల నీటి సమస్య నిస్సందేహంగా మరింత జటిలంగా తయారవు తుంది. కర్ణాటక, మహారాష్టల్రు విసిరిన సవాలును దీటుగా త్రిప్పికొట్టి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించు కోవడానికి న్యాయబద్దమైన, సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ లేదా జనతాదళ్ (సెక్యులర్) లేదా బీజేపీ, అలాగే మహారాష్ట్ర శివసేన-బీజేపీ కూటమి లేదా కాంగ్రెస్- ఎన్‌సీపీ కూటమి ఎవరు అధికారంలో ఉన్నా నీటి సమస్యపై ఐక్యంగా నిలబడి సాధించుకున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీల సమష్టి అవగాహనతో రాజకీయ సంకల్పంతో కృషి చేయకపోవడం మూలంగానే ఈ దుష్ఫలితం వచ్చింది.

నదీ పరీవాహక ప్రాంతంలో ఆఖరు భాగంలో ఉన్న మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, పర్యావరణ మార్పులు, భూగర్భ జలాల కొరత, వ్యవసాయమే జీవనాధారంగా మనుగడ సాగిస్తున్న గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, రక్షిత తాగునీరు, తక్కువ వర్షాలు పడిన సంవత్సరాలలో నికర జలాలకే దిక్కులేని దుస్థితి. నదీ పరీవాహక ప్రాంతంలో ప్రస్తుత ఆయకట్టుకు పూర్తి రక్షణ, వరదలు ముంచు కొచ్చినప్పుడు జరిగే నష్టం, వరద ప్రవాహం రోజులు కూడా బాగా కుదించుకుపోయిన వాస్తవ పరిస్థితు లను, దిగువ ప్రాంతాల కష్టనష్టాలను సమర్థంగా ట్రిబ్యునల్ ముందు వినిపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.

జలయజ్ఞాన్ని రాజకీయ సంకల్పంతో చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణంతో, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయోనన్న అనుమా నాలు ప్రజల్లో రేకెత్తాయి. వార్షిక బడ్జెట్ కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు మూలనపడ్డాయి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు తరహాలో మిగులు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ మన రాష్ట్రానికి దక్కకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ శాశ్వతంగా మూలనపడే ప్రమాదం ఉంది.

ప్రామాణికం కొంప ముంచింది

నదీ జలాల సమస్య అత్యంత సున్నితమైనది. జటిలమైనది. నాడు బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాలలో కృష్ణా నదీ ప్రవాహం గణాంకాలను పరిశీలించి 75 శాతం నీటి లభ్యతను విశ్వసనీయమైన ప్రామాణికంగా తీసుకుని నికర జలాలను 2,060 టీఎంసీలు మరియు పునరుత్పత్తి ద్వారా 70 టీఎంసీలు తీసుకుని 2,130 టీఎంసీలుగా నిర్ధారిం చింది. అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ మేరకు నికరంగా నీరు లభిస్తుందని అంచనా కట్టారు. ఆ మేరకు మహారాష్టక్రు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734(700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811(800+11) టీఎంసీలు కేటాయిం చారు. ఈ నికర జలాల కేటాయింపుపై గడువు ముగిశాక చేపట్టే పునఃవిచారణ సందర్భంలో ఎలాంటి మార్పులూ చేయడానికి వీలులేదని కూడా నిర్ద్వంద్వం గా ప్రకటించింది. ఏ సంవత్సరంలోనైనా నికర జలాల పరిమాణానికి మించి ప్రవహించే నీటిని మిగులు జలాలుగా భావించి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కోవడానికి స్వేచ్ఛను కల్పించారు.

బచావత్ ట్రిబ్యునల్ తిరస్కరించిన 50 శాతం విశ్వసనీయతపై ఆధారపడి రూపొందిన స్కీమ్-బిని అమలు చేయాలన్న కర్ణాటక, మహారాష్టల్ర వాదనలకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొంతవరకు లొంగినట్లు కనపడుతున్నది. కాబట్టే నేడు 47 సంవత్సరాల నీటి ప్రవాహం ఆధారంగా 65 శాతం నీటి లభ్యతను ప్రామాణికంగా సంవత్సరానికి సగటున 2,578 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి ఇందులో నుంచి 65 శాతం ప్రామాణికంగా నిర్ధారించిన 2,293 టీఎంసీల నికర జలాలను తీసివేసి, మిగిలిన 285 టీఎంసీలను మిగులు జలాలుగా నిర్ధారించింది. 2,293 టీఎంసీల నికర జలాలలో బచావత్ ట్రిబ్యునల్ గతంలో 2,130 టీంఎసీలను 3 రాష్ట్రాలకు చేసిన కేటాయింపులను యథాతథంగా ఉంచి, మిగిలిన 163 టీఎంసీల నికర జలాలను, 285 టీఎంసీల మిగులు జలాలు మొత్తం 448 టీంఎసీలను పంపిణీ చేసింది. స్థూలంగా వివిధ ఆధారిత ప్రాతిపదికలపై ప్రస్తుత తీర్పు మేరకు (బచావత్ ట్రిబ్యునల్ కేటాయిం పు, ప్రస్తుత అదనపు కేటాయింపులను కలిపితే) ఆంధ్రప్రదేశ్‌కు 1001(811+190) టీఎం సీలు, కర్ణాట కకు 911 (734 +177) టీఎంసీలు, మహారాష్టక్రు 666(585+81) టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ పరిణామం మన రాష్ట్రానికి చావుదెబ్బ.

జలయజ్ఞానికి ముప్పు

మన రాష్ట్రం సగటు నీటి సంవత్సరంలో 1001 టీఎంసీలు వాడుకోవడానికి హక్కు కల్పించారు. అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు పోను, ప్రస్తుతం అదనంగా కేటాయించిన 190 టీఎంసీలలో 9 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు, 25 టీంఎసీలు తెలుగుగంగ ప్రాజెక్టుకు, 6 టీఎంసీలు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సాధారణ నదీ ప్రవాహానికి, 150 టీంఎసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లలో నిల్వ చేసుకుని ఆపై సంవత్సరానికి వినియో గించుకునే నిమిత్తం క్యారీ ఓవర్ స్టోరేజ్‌కు ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే, 2,578 టీఎంసీలకు పైబడి ఏ సంవత్సరంలోనైనా నీరు వస్తే ఆ నీటిని మళ్లీ పునఃవిచారణ వరకు అంటే 2050, మే 31 నాటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు వాడుకునే స్వేచ్ఛను కల్పించారు. అలాగే జూన్-జూలై మాసాలలో కర్ణాటక రాష్ట్రం 8 నుండి 10 టీఎంసీల దాకా ఆల్మట్టి నుండి మన రాష్ట్రానికి (నీటి విడుదల క్రమబద్ధీకరణలో భాగంగా) విడుదల చేయాలని ఆదేశించారు.

బహుశా ఈ నీటి విడుదల ఖరీఫ్‌లో నార్లు పోసుకోవడానికి వీలు కల్పించే ఉద్దేశంతో కావచ్చు. ఈ తాజా తీర్పు పర్యవసానంగా ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు మిగులు నీళ్లు కూడా దక్కకుండా పోతాయి. మరి వీటి గతేంటి? శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో క్వారీ ఓవర్ స్టోరేజ్ పద్దు కింద కేటాయించిన 150 టీఎంసీలను నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులకు కేటాయించి ఉండవలసింది. దీని కోసం ఇప్పటికైనా ట్రిబ్యునల్‌ను ఒప్పించి, సాధించాలి.

మన రాష్ట్రం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమీక్ష చేసి, న్యాయం చేయమని ట్రిబ్యునల్‌ను గట్టిగా కోరాలి. వందేళ్ల నదీ ప్రవాహాన్ని, 75 శాతం నీటి లభ్యతను నికర జలాల నిర్ధారణకు ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకునేలా ఒప్పించాలి. మిగులు జలాల నిర్ధారణ, పంపిణీ అశాస్ర్తీయమైనది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. మన రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నింటికీ వాటి అవసరాల మేరకు నీటిని సాధించాలి. కేసీ కెనాల్‌కు కేటాయించిన నీటి నుంచి అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్‌కు కేటాయించిన 10 టీఎంసీల నీటికి ప్రత్యామ్నాయంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నీటికి ట్రిబ్యునల్ ఆమోదం పొందాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణంపై మరింత ఒత్తిడి పెం చాలి. అన్ని డిమాండ్ల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, సాగునీటిలో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను విశ్వాసంలోకి తీసుకుని అంకిత భావంతో కృషి చేయాలి.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

No comments:

Post a Comment