Wednesday, August 10, 2011

అందలమే మీది... అన్యాయమెక్కడ!

సాక్షి దిన పత్రిక

అందలమే మీది... అన్యాయమెక్కడ!





విశ్లేషణ
టి. లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర నాయకులు





అవకాశవాద రాజకీయ నాయకుల వికృత విన్యా సాలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి పొన్నాల లక్ష్మయ్య తాజా పోకడలు. నిన్నటి వరకు అందరికీ సుద్దులు చెప్పిన రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటిపారు దల శాఖ మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య నేడు ప్లేటు ఫిరాయించడం దారుణం. గత ఆరు దశా బ్దాల కాలంలో వంచనకు గురై తాగునీటికి, సాగు నీటికి కటకటలాడిపోతున్న కరువు సీమపై నిరాధా రమైన ఆరోపణలు చేయడం విజ్ఞత అనిపించుకోదు.

చట్టాన్ని ఉల్లంఘించి, అనైతికంగా జలదోపిడీకి పాల్పడ్డారని కరువు పీడిత రైతులపై ఆరోపణలు చేస్తూ కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్ తెలంగాణ ఫోరం తరఫున సమర్పించిన నివేదికలో పేర్కొనడం గర్హనీయం. ఆరేళ్లు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన పొన్నాల ఇచ్చిన నివేదిక సహజంగానే ప్రాధాన్యం సంతరించుకొంటుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయిం పుల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని వాస్తవాల ఆధారంగా ఎత్తిచూపి, సమన్యాయం కోసం దెబ్బలాడితే సమాజం హర్షిస్తుంది. ప్రజా తంత్రవాదులు సంపూర్ణ మద్దతు పలుకుతారు.


కృష్ణా జలాల పంపకంపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో తెలం గాణకు తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. నిజమే రాష్ట్రంలో ఉన్న 29,441 చదరపు మైళ్ల కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో 20,167 (68.5 శాతం) చదరపు మైళ్లు తెలంగాణలోనే ఉంది. కానీ బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 800 టీఎంసీ నికర జలాలలో 33 టీఎంసీలను శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఆవిరైపోయే నష్టాల పద్దు కింద తీసేయగా మిగిలిన 767 టీఎంసీలలో తెలంగాణ ప్రాంతానికి 266.83 (35 శాతం) టీఎంసీలు మాత్రమే కేటాయించారు. పర్యవసానంగా అన్యాయం జరిగిందనే భావన తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉన్నది.

అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో 5,414 (18.4 శాతం) చదరపు మైళ్లు ఉంటే 122.7 (16 శాతం) టీఎంసీలను కేటాయించడంతో అక్కడి ప్రజల్లోనూ అసంతృప్తి ఉన్నది. 3,860 (13.1 శాతం) చదరపు మైళ్లు మాత్రమే ఉన్న కోస్తాంధ్రకు 377.47 (49 శాతం) టీఎంసీలు కేటాయించారు. ఈ విధంగా కేటాయింపులు చేయడానికి బచావత్ ట్రిబ్యునల్ అనుసరించిన సూత్రబద్ధమైన విధానమేంటో అందరికీ విదితమే. ఆ నాటికి వినియోగంలో ఉన్న లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ‘ప్రొటెక్టివ్ యుటిలైజేషన్’ నియమానుసారం నీటి కేటాయింపులు చేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా కడగండ్లను పరిగణనలోకి తీసుకొన్న ట్రిబ్యునల్ జూరాల ప్రాజెక్టుకు మాత్రమే 17.84 టీఎంసీల నికర జలాలను అదనంగా కేటాయించింది.

కాబట్టే 2,060 టీఎంసీల నికర జలాలలో మన రాష్ట్రానికి 800 టీఎంసీలు దక్కాయి. నదీ పరీవాహక ప్రాంతాన్ని మాత్రమే కొలబద్దగా తీసుకుంటే మొత్తం 99,980 చదరపు మైళ్లలో మన రాష్ట్రంలో ఉన్నది 29,441 (29.5 శాతం) చదరపు మైళ్లే అంటే 2,060 టీఎంసీల నికర జలాల్లో దామాషా విధానంలో అయితే 608 టీఎంసీలు మాత్రమే మన వాటాగా వస్తాయనే వాస్తవాన్ని గుర్తించాలి. అలా కాని పక్షంలో దాదాపు 48 శాతం పరీవాహక ప్రాంతం ఉన్న కర్ణాటకకు అధిక నీటిని కేటాయించి ఉండాలి.

ఈ అంశంపై బచావత్ ట్రిబ్యునల్ లోతైన చర్చ చేసిన మీదటే, నీటి రంగంలో అమలులో ఉన్న అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకొని మూడు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన తీర్పును ఆనాడు ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ విచారణ మొదలైన నాటి నుంచి తీర్పు (అవార్డు) వెలువడి, 1976 మేలో ‘గెజిట్ నోటిఫికేషన్’ ద్వారా అమలులోకి వచ్చిన కాలంలో రాష్ట్ర ముఖ్యమం త్రులుగా తెలంగాణ ప్రాంతం వారే ఉన్నారు. 1971, సెప్టెంబర్ 30 మొదలు 1982, ఫిబ్రవరి దాకా పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్యలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అన్యాయం జరిగిందని భావించినా ఎవరిని నిందించాలి? ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరుగుతుంటే వారు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారా? ఎందుకు గళమెత్తి పోరాడలేదు? ఆరోపణలు చేసే ముందు చరిత్రను, వాస్తవాలనూ అధ్యయనం చేస్తే మంచిది. వక్రీకరణలు, అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

‘పొన్నాల’ ఏం చేశారు?
గడచిన రెండున్నర దశాబ్దాల కాలంలో భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ మంత్రులుగా పనిచేసిన వారు అత్యధికులు తెలంగాణ వారే కదా? తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య నుంచి నేటి సుదర్శన్‌రెడ్డి దాకా అందరూ అక్కడి వారే కదా! మధ్యలో కొంత కాలం మాత్రమే కోడెల శివప్రసాద్ ఉన్నారు. 1976 మొదలు 2000, మే 31 నాటి వరకు అధికారికంగాను, మరొక మాటలో చెప్పాలంటే జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన రెండవ కమిషన్ 2010, డిసెంబర్ 30న నివేదిక సమర్పించే నాటి వరకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది.

మిగులు జలాలను వినియోగించుకొనే సంపూర్ణ స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి దఖలు పరిచింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిగులు జలాల ఆధారంగా రూపొందించబడిన వివిధ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదించి నీళ్ల కేటాయింపు పొంది ఉండవచ్చు. తద్వారా ఇటు తెలంగాణ, అటు సీమ ప్రాంతాలకు కాస్తయినా న్యాయం జరిగి ఉండేది.

బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిన 2004, ఏప్రిల్ నుంచి ఆ ట్రిబ్యునల్ నివేదిక సమర్పించే నాటి వరకు ఆ శాఖకు మంత్రిగా బాధ్యతలు వహించింది స్వయానా పొన్నాల వారే! ఆయన పుణ్యానే బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో క్యారీ ఓవర్ పద్దు కింద బచావత్ ట్రిబ్యునల్ చేర్చిన 150 టీఎంసీలను కూడా మనకు కేటాయించిన నీటిలోనే అంతర్భాగం చేశారు. ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని, అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆ శాఖ మంత్రిగా ఆనాడు ఉన్న పొన్నాలను చరిత్ర క్షమించదు. నిజాయితీ ఉంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఎందుకు వాదించలేదు? సమన్యాయాన్ని సాధించడానికి ఆయనకెవరు అడ్డొచ్చారు? ఆగస్టు 16 నుంచి ట్రిబ్యునల్, మూడు రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై మళ్లీ విచారణ చేపట్టింది.

ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకొనైనా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దించండి. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు అవసరమైన 77 టీఎంసీల నీటి కేటాయింపును సాధిస్తే అందరూ హర్షిస్తారు. మన రాష్ట్ర పరిధిలో నీటి పంపకంలో సర్దుబాట్లకు ఉన్న ఎన్నో అవకాశాలను అధ్యయనం చేయవచ్చు. ఆ పనిచేయడానికి బదులు ‘ఆడలేక మద్దెల ఓడన్నట్లు’ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొంటూ, వెనకబడ్డ రాయలసీమ ప్రజలను నీళ్ల దొంగలుగా చిత్రించడం క్షమార్హం కాదు. కృష్ణానదిని మొత్తంగా మళ్లించుకుపోతున్నారని అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమా?
శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటి వినియోగానికి సంబంధించిన ప్రాధాన్య తాక్రమాన్ని నిర్దేశిస్తూ 1996వ సంవత్సరంలో విడుదల చేసిన జీఓ నంబర్ 69 అమలులో ఉన్నది. అలాగే 854 అడుగుల నీటి నిల్వను పరిరక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఆ నీటి మట్టం కంటే ముందే నీటి విడుదలకు ప్రభుత్వానికి వీలుకల్పిస్తూ 2004లో జారీ చేసిన జీఓ నంబర్ 107 అమలులో ఉన్నది. ఈ రెండు ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో ఉన్నంత కాలం ఏ ప్రాం తానికి అన్యాయం జరిగే అవకాశమే లేదు. రాయలసీమ ప్రాంతానికి న్యాయ బద్ధంగా విడుదల చేయాల్సిన నీటి తరలింపుకు మరో ప్రత్యామ్నాయం ఉన్నదా? ఆరేళ్లు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన పొన్నాలే చెప్పాలి. నాడు సమ ర్థించి, నేడు ప్రశ్నించడం విజ్ఞత అనిపించుకుంటుందా! అత్యంత సున్నితమైన, జటిలమైన నీటి సమస్యను రావణకాష్టంగా మార్చడం శ్రేయస్కరం కాదు.

‘చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్న’ చందంగా తెలంగాణ పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదగడమే పనా? లేదా మేలు చేయడానికి నిర్మాణాత్మకంగా చేసిందేమయినా ఉన్నదా? గోదావరి నీటిని సద్వినియోగం చేసి, చారిత్రకంగా వెనుకబడ్డ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి దోహదపడే ప్రాణహిత - చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధించడానికి ఎవరడ్డొచ్చారు? శ్రీరాంసాగర్ రెండవదశ-వరద కాలువ, దేవాదుల, ఎల్లం పల్లి, కాంతాలపల్లి, ఇందిరాసాగర్ మరియు రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం పథకాలు) వగైరా నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతి పదికపై పూర్తి చేసి సాగునీటి అవసరాలను తీరిస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపకరిస్తుంది.

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వలసలకు మారుపేరుగా నిలిచిన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా లాంటి కరువు పీడిత ప్రాంతాల నీటి దాహాన్ని తీర్చవచ్చుకదా! అధికార పీఠంపై కూర్చొని ఉన్న పొన్నాల ఆ బాధ్యతను నిర్వర్తించకుండా విద్వేషాలను రెచ్చగొట్టడానికి తమ తెలివితేటలను ఉపయోగించడం దేశ హితానికి ప్రయోజనం చేకూర్చదు. వెనుకబడ్డ ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందరికీ అందించే లక్ష్యం వైపున ఆలోచనలు, ఆచరణ ఉంటే భావితరాలు హర్షిస్తాయి.


‘అడుగడుగునా అన్యాయం!’
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత తెలంగాణకు సాగునీటి పంపిణీలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌కు జూలై 30న ఢిల్లీలో పొన్నాల లక్ష్మయ్య సమర్పించిన నివేదికలోని ముఖ్యాంశాలు:
నాటి హైదరాబాద్ ప్రభుత్వం 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక వాటిని కుదించడమో, రద్దు చేయడమో చేశారు.
కృష్ణా జలాలపై ఉన్న హక్కును గుర్తించక, నిరాకరించడంతో 174.3 టీఎంసీల నీటిని తెలంగాణ కోల్పోయింది.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఆర్డీఎస్, జూరాల, ఎగువ మానేరు, కోయిల్‌సాగర్, ఘనాపూర్ ప్రాజెక్టులకు నిధుల మంజూరులో సవతితల్లి ప్రేమ.
చిన్ననీటి పారుదల, చెరువుల నిర్వహణపై పూర్తి నిర్లక్ష్యం.
జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాల ఉల్లంఘనకు పాల్పడుతూ తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల నిరాకరణ.

No comments:

Post a Comment