Tuesday, April 16, 2013

వ్యవసాయం: నీరు, విద్యుత్తు



                  
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లనే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి నెట్టబడిందనే కొందరు అవగాహనారాహిత్యంతో దుష్ప్రచారాన్ని  చేస్తున్నారు. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలోని మొత్తం ఉపాధిలో 58% కల్పిస్తూ, దేశ స్థూల జాతీయోత్పత్తికి (జి.డి.పి.) 12% ఆదాయాన్ని సమకూర్చుతూ, దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ముఖ్య భూమికను పోషిస్తోంది. మన రాష్ట్ర జనాభాలో అరవై శాతానికి పైగా వ్యవసాయమే జీవనాధారంగా వుంది. 2012-13 ఆర్దిక సం.లో రాష్ట్ర జి.డి.పి.లో వ్యవసాయ రంగం 18.7% వాటా కలిగివుంది. అయినా మన వ్యవసాయరంగం దీనావస్థలో వుంది. వేలాది మంది చిన్న,మధ్య తరగతి రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ పూర్వరంగంలో కూడా 1.96% వృద్దిరేటుతో రాష్ట్ర ఆర్దికాభివృద్ధిలో కీలకపాత్రను కలిగివుంది(ఆం.ప్ర. సోషియో ఎకనామిక్ సర్వే 2012-13 వివరాల ఆధారంగా). వ్యవసాయ రంగానికిస్తున్న సబ్సిడీలపై కొంత మంది అనవసరమంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆహారోత్పత్తి  దెబ్బ తింటే ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ విషయాన్ని మరచిపోకూడదు. అంతేకాక అనేక భారీ, మధ్య తరగతి పరిశ్రమలకు ముడి సరుకులను వ్యవసాయ రంగమే సరఫరా చేస్తోంది. అదే సమయంలో వ్యవసాయ రంగం అనేక సమస్యలతో సతమతమవుతూ అతి కష్టంతో మనుగడ సాగిస్తూండడం దేశ ఆర్ధిక పునాదిని బలహీన పరుస్తోంది. ఉపాధికి, ఆర్ధిక ప్రగతికే కాక దేశ ఆహార భద్రతకూ  వ్యవసాయ రంగ అభివృద్ధి మూలం అని మర్చిపోరాదు. “వ్యవసాయ రంగాన్ని కాపాడు కొందాం! దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించు కొందాం!” అన్నది అందరి నినాదం కావాలి. వ్యవసాయనికిస్తున్న సబ్సిడీలను విమర్శించే వారంతా ఈ నిజాలను గుర్తెరిగి మాట్లాడాలి .                             ప్రభుత్వ భాధ్యతారాహిత్యం, జవాబు దారీతనం లేని, అప్రజాస్వామిక విధానాలే విద్యుత్ రంగంలో ప్రస్తుత దుస్థితికి కారణం. మొత్తం రాష్ట్రానికి 95,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా కేవలం 70,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. విద్యుత్ కోతలను అమలు చేయడంలో ప్రభుత్వం విసక్షణారహితంగా వ్యవహరిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురిచేస్తున్నది. వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం కడకు 7 గంటలు కూడా సరఫరా చేయకుండా రైతాంగం వెన్ను విరిచింది. వోల్టేజి, తీవ్ర స్థాయిలో కోతలు, సరఫరా చేస్తున్న విద్యుత్తును కూడా నిరాటంకంగా ఇవ్వకపోవడం, రాత్రి పూట సరఫరా పర్యవసానంగా రైతాంగం అనిభవిస్తున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వ అసమర్ధత వలన విద్యుత్తు, సాగు నీరు, ఇతర కారకాల సరఫరాలో నాణ్యత లోపించడంతో మన వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడింది. భూగర్భ జల మట్టం తగ్గిపోకుండా వర్షా కాలంలో నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోక పోవడంతో  వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మెట్ట మరియు వాణిజ్య  పంటలను పండించడానికి పగటి పూట విద్యుత్ సరఫరా  తప్పనిసరిగా కావాలి. ఈ దృష్ట్యా పగటి పూట కోతలు లేకుండా 3 ఫేస్ విద్యుత్ ను నిరంతరాయంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.                                                                      ఉచిత విద్యుత్ రైతు కోసమా! సమాజం కోసమా! :  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇతర రంగాల వారు చేస్తున్న పెద్ద త్యాగంగా పరిగణిస్తున్నారు.కాని నిజానికి విద్యుత్ కొరతల కాలంలో కేవలం రాత్రిళ్ళు మాత్రమే సరఫరా చేస్తున్నారు.అర్ధరాత్రి తరువాత ఇతర రంగాలకు విద్యుత్ అవసరం అతి తక్కువ ఉంటుంది, అలా అని విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయడం వీలు కాదు. కాబట్టి ఆ తప్పనిసరి విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే ఉచిత సరఫరా పేరిట వ్యవసాయానికి ఇస్తూ త్యాగ ధనుల్లా నటిస్తున్నారు.దేశ ఆహార భద్రతను కాపాడుతూ, అహర్నిశలు కష్టించే రైతన్నలు త్యాగ మూర్తులా లేక తమకు అనవసరమైన దానిని విదిలిస్తున్న వారా అనేది గుర్తించాలి. ఇక్కడ అసలు రైతు విద్యుత్ మీద ఎందుకు ఆధారపడాలి? కేవలం వ్యవసాయానికి నీటి లభ్యత తగ్గడమే దీనికి కారణం. అంటే నీరు రైతుకు, విద్యుత్ కు మధ్య ఒక వారధిలా నిలుస్తోంది. మనకు లభ్యమయ్యే నీటిని మొదటి ప్రాధాన్యతగా త్రాగు నీటికి, ఆ తరువాత రెండో ప్రాధాన్యత  వ్యవసాయానికి ఇవ్వాలని ప్రపంచ దేశాలన్నీ అనేక సందర్భాలలో ఏకగ్రీవంగా ఒప్పుకున్న విషయం. కాబట్టి రైతే నీటికి ప్రధాన హక్కుదారు. ప్రభుత్వం నీటిని అందించలేనప్పుడు విద్యుత్తునైనా పొందే హక్కు రైతుకున్నది.                                                                                               నీటికి, విద్యుత్తుకు ఉన్న అనుబంధం:  నీరు , విద్యుత్ ఒక దానిపై  మరొకటి ఆధార పడి వుంటాయి. నీరు "జల విద్యుత్" ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్తును వినియోగించుకొని భూగర్భ జలాలను తోడుకోవడం, ఎత్తిపోతల పధకాల ద్వారా నీటిని సాగు అవసరాలకు తరలించడం జరుగుతున్నది. రాష్ట్రంలో దాదాపు 70,000 కుంటలు, చెరువులు ఉన్నాయి. వాటి మరమ్మత్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన అత్యధిక భాగం నిరుపయోగమవుతున్నాయి. భూగర్భ జల వినియోగంపై తప్పని సరిగా ఆధారపడాల్సి రావడంతో భూగర్భ జలాలు అతి త్వరగా అడుగంటి పోతున్నాయి. దీని వలన వ్యవసాయ పంపు సెట్లు పెరిగి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. కుంటలు, చెరువులకు మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి, వీలున్న చోట్ల చెక్ డ్యాం లను నిర్మించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రభుత్వం ఒక నిర్మాణాత్మకమైన‌ విధానాన్ని రూపొందించి, అవసరమైన‌ నిథులను కేటాయించి అమలు చేస్తే బహుళ ప్రయోజనాలు వనగూడుతాయి. జలవనరుల అభివృద్ధి, నిర్వహణ, వినియోగం మరియు విద్యుత్ ఉత్పత్తి , హేతుబద్ద వినియోగానికి సంబంధించి సమగ్రమైన విధానాన్ని రూపొందించి  ప్రణాళికాబద్దంగా అమలు చేస్తే సత్ఫలితాలుంటాయి. నీరు, విద్యుత్ లను పొదుపుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు వర్షా కాలంలో, జల విద్యుత్ సరఫరా వున్న సమయాల్లో  ఎత్తైన ప్రదేశాలలో వున్న  చెరువుల్లోకి నీటిని పంప్ చేసి, తరువాత అవసరం వున్నప్పుడు చిన్న కాలువలు, పైపుల సాయంతో వ్యవసాయానికి నీటిని అందేలా చేయవచ్చు. అదే సమయంలో చిన్న, చిన్న జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపడితే మరింత ఉపయోగం వుంటుంది. ఉదాహరణకి, ప్రాణహిత - చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం కష్ట సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. ఆ పథకానికి అవసరమైన 3,500 మెగా వాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం ఆయకట్టు క్రిందికి వచ్చే ప్రాంతాలలో దాదాపు ఏడు లక్షల వ్యవసాయ పంప్ సెట్ల వినియోగం ఉన్నట్లు ఒక అంచనా. ఈ ఎత్తిపోతల పథకానికి అయ్యే విద్యుత్ ఖర్చు, ప్రస్తుతం ఈ ప్రాంతంలో వినియోగంలోనున్న బోర్ వెల్స్ కు వాడుతున్న విద్యుత్ కంటే తక్కువగానే ఉంటుందని అంచనా.                                                                                                                              సౌరశక్తి పంప్ సెట్లు :  సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు లేని ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలలో పంప్ సెట్లకు సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అవసరమైన పెట్టుబడులను పెట్టాలి. డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించడానికి ఇస్తున్నట్లుగానే సౌరశక్తి పంప్ సెట్లను నెలకొల్పుకోవడానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలి. తద్వారా మెట్ట పైర్లు, వాణిజ్య పంటల సాగుకు సాంప్రదాయక విద్యుత్తు సరఫరాపై ఆధారపడ‌కుండా స్వయం పోషకత్వాన్ని సాధించడానికి దోహదపడుతుంది. ఈ పైర్ల సాగుకు పగటి పూటే విద్యుత్తు కావాలి. వర్షా కాలంలో విద్యుత్ అవసరం ఉండదు. ఈ పంటలు పండించే ప్రాంతాలలో సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్నాయి. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉపాథి కల్పనకు అవకాశాలు ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తి వికేంద్రీకరించబడి, ప్రజల చేతుల్లోకి వెళుతుంది. ఒక విధంగా ప్రజాతంత్రీకరించబడుతుంది. మొదట సౌర శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే పలకలు (ప్యానల్స్) కోసం పెద్ద పెద్ద పరిశ్రమలపై ఆధారపడవలసి రావచ్చు, కానీ తరువాత నిర్వహణ, మరమ్మత్తులు వంటి వాటి కోసం స్థానికంగానే తర్పీదు పొందిన వారితో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుతెన్నులు చూసినట్లు విద్యుత్ కోసం విద్యుత్ తీగల వైపు ఆశగా ఎదురు చూసే దుస్థితి నుండి కొంత వరకైనా రైతాంగం విముక్తి అవుతుంది. అనివార్యమైనప్పుడు మాత్రం గ్రిడ్ నుండి విద్యుత్తు సరఫరాకు ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను యదాథదంగా నిర్వహించాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు ఆ ఏర్పాటు అనివార్యం.                                                                                            థర్మల్ కేంద్రాలకు సముద్ర జలాలు:  రోజు రోజుకూ నీటి లభ్యత, నిల్వ తగ్గిపోతున్న ఈ దశలో విద్యుదుత్పత్తి కోసం నీటిని వృధా చేయలేము. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు నీటి అవసరం చాల ఎక్కువ. ఇప్పుడు సముద్ర జలాలను శుద్ధి చేసి విద్యుత్ కేంద్రాలలో బాయిలర్లను చల్లబరచడానికి ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రతిపాదనలు చేస్తున్నారు. కాని ఆచరణలోకి వస్తే సముద్ర జలాలను శుద్ధి చేయడం అత్యంత వ్యయంతో కూడుకున్నదే కాక అక్కడ ఉత్పత్తయిన విద్యుత్తులో అధిక భాగం శుద్ధి చేయడానికే ఉపయోగించాల్సి వుంటుంది. కావున ఈ ప్రతిపాదన ద్వారా కేవలం బయటి ప్రపంచానికి గంతలు కట్టి మామూలు నీటిని తాము వాడుకోవడం లేదని నమ్మబలకడానికి చేసే ప్రయత్నమే ఇది!        క‌డ‌ప‌ జిల్లా పులివెందుల‌ స‌మీపంలోని తుమ్మలపల్లి వద్ద ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రానికి సోమశిల రిజర్వాయరు నుండి 12.5 టి.యం.సి.ల నీటిని సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా ఆమోదించింది. త్రాగు నీటికి,సాగు నీటికి తల్లడిల్లి పోతున్న క‌ర‌వు సీమ‌లో నీరెక్కడిది?                                                                                                                                              జల విద్యుత్: మన రాష్ట్రంలో జల విద్యుత్ కు ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో విస్తరణకు అవకాశాలు తక్కువ. నీరు, విద్యుత్ రెండూ ఒకదానికొకటి విడదీయలేనివి. ఈ విషయంలో మరింత ముందు చూపుతో ఆలోచించి సమన్వయం చేసుకోవాలి. వర్షాకాలంలో నీటి లభ్యత ఎక్కువగాను, గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం తక్కువగాను వుంటుంది. ఈ సమయంలో ఉత్పత్తయ్యే విద్యుత్ ను ఎత్తిపోతల పథకాలకు ఉపయోగించి ఎత్తైన ప్రదేశాలలో వున్న పెద్ద జలాశయాలు, చెరువులు నింపుకుని వర్షాకాలానంతరం వ్యవసాయానికి వినియోగించాలి. వ్యవసాయ, గృహ సముదాయాలలో  ఇంకుడు గుంటల ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచుకోవడాన్ని ప్రోత్సహించాలి. దీని వలన భూగర్భ జలాలు పెరిగి జలాశయాలలో నీటి వినియోగం తగ్గుతుంది. అలాగే బోర్ వెల్స్ లో నీరు పైనే ఉండడం వలన విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మధ్య తరహా, సూక్ష్మ జల విద్యుత్ కేంద్రాలను సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పేలా ప్రోత్సహించాలి, వీటికి రాష్ట్రంలో అనేక చోట్ల అనుకూల ప్రదేశాలున్నాయి. రాష్ట్రంలో 250 మె.వా. ఉత్పత్తికి అవకశమున్నట్లుగా గుర్తించిన 377 ప్రదేశాలలో 57 మాత్రమే వినియోగించుకోబడుతున్నాయి. సూక్ష్మ జల విద్యుత్ కేంద్రాలతో మరో 310 మె.వా. ఉత్పత్తికి అవకాశమున్నా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు.                                                                                   విద్యుత్ సరఫరా విధాన ప్రతిపాదన :  దేశ ఆర్ధికాభివృద్ధికి, ఉద్యోగావకాశాల పెరుగుదలకు విద్యుత్ ఉత్పత్తి - వినియోగం మూల కారణంగా వుంటుంది. విద్యుత్ లోటు ఎక్కువగా వున్న ఈ తరుణంలో ఏయే అవసరాలకు ఎంతెంత విద్యుత్ కేటాయించాలనేది ఏ ప్రభుత్వం ముందైనా వుండే సమస్యే . 1) త్రాగు నీరు మరియు గృహావసరాలు, 2) వ్యవసాయం,  3) భారీ పరిశ్రమలు, 4) చిన్న తరహా పరిశ్రమలు, 5) వ్యాపార సముదాయాలు (షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటల్స్ వగైరా అవసరాలను ప్రాధాన్యతా క్రమంలో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని కేవలం వినియోగ సంబంధితం కాగా మిగతావి దేశ వస్తూత్పత్తికి సంబంధించినవి. ఉదా:- గృహ, వ్యాపార, కార్యాలయాలు  కేవలం వినియోగ సంబంధితం మాత్రమే ఎటువంటి ఉత్పత్తి వుండదు, కాని మిగిలినవి అలా కాదు. విద్యుత్ పంపిణీలో త్రాగు నీటి తరువాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సామాజిక బాధ్యత అవుతుంది.                                                                                                                                                                                         సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం:                                                                                                        1) ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా వలన వస్తున్న నష్టాలను అధిగమించడానికి ఆయా ప్రాంతాలలో అవకాశాల మేరకు ప్రభుత్వం సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాలి.                                                   2) ప్రతి గ్రామం లేదా మండలం లేదా విద్యుత్ సబ్ స్టేషన్ ను ఒక యూనిట్ గా తీసుకుని డిస్కామ్స్ లేదా సహకార సంఘాల ఆధ్వర్యంలో పని చేసేలా సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి వ్యవసాయ పంపు సెట్లకు నిరంతరాయం విద్యుత్ ను సరఫరా చేయాలి. వీటికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి.                                                                                                                                                3) వ్యవసాయ పంపు సెట్ల పనితీరును మెరుగు పరచాలి.                                                                                                     

టి. ల‌క్ష్మీనారాయ‌ణ                                                                                                                     డైరెక్టర్,యన్.ఆర్.ఆర్.పరిశోధనా కేంద్రం

గమనిక: నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం "వ్యవసాయం:నీరు,విద్యుత్తు" అన్న అంశంపై 2013 ఏప్రిల్ 14 వ తేదీన వివిధ రైతు సంఘాల రాష్ట్ర నాయకులతో హైదరాబాదులో నిర్వహించిన చర్చావేదికలో ఈ పత్రం సమర్పించబడినది.                                                                                                                                                                                                              
                                                                                                                

No comments:

Post a Comment