Tuesday, January 10, 2012

పంజాబ్‌లో ఎవరి పాగా?

published in Surya Telugu daily on January 10, 2012

ఈశాన్య భారత దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం మణిపూర్‌. మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. ఇన్సర్జెన్సీ (తిరుగుబాట్లు) వంటి తల పోట్లతో ప్రజలు తీవ్రమైన అభద్రతా వాతావరణలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని రోజులు వెళ్ళదీస్తునారు. రక్షణ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రక్షణ దళాలు అకృత్యాలకు, నిర్బంధకాండకు పూనుకొంటున్నాయి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం చెవికెక్కించు కోవడం లేదు. మరొకవైపు యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ విచ్ఛిన్నకర ఆందోళన ఉధృత రూపం దాల్చి గత ఏడాది 121 రోజుల పాటు ఆర్థిక దిగ్బంధం, వారం పైగా రెండు జాతీయ రహదారులను మూసి వేయడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పర్యవసానంగా గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ. 2,000, బియ్యం, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు కిలో దాదాపు రూ.100కు పెరిగాయి. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సామాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ప్రజాగ్రహం ఏ రీతిలో ప్రతిబింబిస్తుందో వేచి చూడాలి.

అరవై స్థానాలున్న మణిపూర్‌ శాసన సభకు 2007లో జరిగిన ఎన్నికల్లో ముప్పై స్థానాల్లో గెలుపొంది, సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చమటోడ్చాల్సిందే. కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక అనుకూలాంశం బలమైన ప్రతిపక్ష పార్టీ లేకపోవడమే. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు, దాదాపు 16 శాతం ఓట్లు సాధించుకొన్న మణిపూర్‌ పీపుల్స్‌ పార్టీ మరింత బలహీనపడడంతో పాటు, ప్రస్తుత శాసన సభ్యుల్లో నలుగురు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, ఎలాగైనా ఆ రాష్ట్ర శాసన సభలో అడుగుపెట్టాలన్న చిరకాల కోర్కెను తీర్చుకోవాలని బీజేపీ తలపోస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలలో సీపీఐకి బలమైన పునాది ఉన్న రాష్ట్రం మణిపూరే. నేటి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి.

ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాల నుండి పై కెదిగి మరింత క్రియాశీల పాత్రను పోషించాలని ఆశిస్తున్నది. ఐదారు చిన్న పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగుతున్నాయి. డిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి గల రాష్ట్రం కాకపోయినా, దేశ ఐక్యత, సార్వభౌమత్వం కోణంలో చూస్తే- ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు అధికారంలోకి రావలసిన అవసరం ఎంతో ఉన్నది. పంజాబ్‌ రాష్ట్రంలో అకాలీదళ్‌, బీజేపీ కూటమి నుంచి అధికార పగ్గాలు కాంగ్రెస్‌ చేతికి చిక్కుతాయా, లేదా అన్నదే ప్రశ్న. యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న డా మన్మోహన్‌ సింగ్‌కు ఇది పరిక్షే. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందలేదనే అపఖ్యాతి నుండి ఆయన ఎలాగూ బయటపడలేరు.
కనీసం స్వరాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి, పంజాబ్‌ ప్రజలు తనతో ఉన్నారని చెప్పుకొనే అవకాశమన్నా మన మార్కెట్‌ ఆర్థిక సిద్ధాంత వేత్త, ప్రధాన మంత్రికి దక్కుతుందో, లేదో వేచి చూడాలి. డిల్లీ రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేసే స్థితిలో ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్‌, అకాలీదళ్‌ బీజేపీ కూటమి మధ్యనే సంకుల సమరం జరుగనున్నది. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ పెట్టింది పేరు. అభ్యర్థుల ఎంపికలో అదే మార్కు రాజకీయాలను మరొకసారి సార్థకం చేసుకొన్నది. గెలుపే గీటురాయని డిల్లీ పెద్దలు సమర్ధించు కొంటున్నారు. పర్యవసానంగా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రచ్చకెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ సోదరుడు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అలాంటి పరిణామాలు గుది బండై నిండా మునుగుతారో, అందివచ్చిన అవకాశం చేజారకుండా జాగ్రత్తపడతారో వేచి చూడాలి.

గోవా అస్థిర రాజకీయాలకు కేంద్రం . కాంగ్రెస్ , బి . జె .పి . క్రిందా మీదా పడుతూ ఆయారాం గయారాంలను చంక నెక్కించుకొంటూ , బుజ్జగించుకొంటూ పాలన సాగిస్తుంటారు . అది అలా నడిచి పోతుంటుంది . ఒకనాడు ఉత్తర ప్రదేశ్ లో అంతర్భాగమైన ఉత్తరాకాండ్ లో ప్రస్తుతం బి . జె . పి . అధికారంలో ఉన్నది . కుర్చీ కాంగ్రెస్ చేతికంద కుండా చూసుకోవాలన్న‌ కాషాయదారణుల ప్రయత్నాలు ఫలిస్తాయో ? లేదో ? వీటన్నింటి కంటే అసలు సిసలైన రాజకీయ సమరం దేశానికి గుండె కాయ లాంటి ఉత్తర్ ప్రదేశ్ గడ్డపైన శాసన సభకు జరుగుతున్న ఎన్నికలే ! అన్నది నిర్వివాదాంశం .

No comments:

Post a Comment