Tuesday, March 6, 2012

నడిబజారులో ‘నవరత్నాలు’

సూర్య దినపత్రిక, మార్చి ౭,2012

- మార్కెట్‌ విధానాలతో ముప్పు
- ఉపసంహరణలతో కోట్ల రాబడి
- ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం
- కళ తప్పిన మహా రత్న, నవ రత్నాలు
- స్వావలంబన పునాదులపై వేటు
- ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక పీఎస్‌సీలే
- ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే కర్తవ్యం


మిశ్రమ ఆర్థిక విధానాలకు చెల్లుచీటీ రాసేసి, మార్కెట్‌ ఆర్థిక విధానాలకు దాసోహం పలికిన కేంద్ర ప్రభుత్వం, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను నడి బజారులో వేలంవేసి అమ్మకానికి పెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2010-11లో రు. 22,500 కోట్లు ఆర్జించి ఖజానా నింపుకొన్నది. 2011-12లో రు.40,000 కోట్లు పోగేసుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని అడ్డదారులూ తొక్కుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలలోని ప్రభుత్వ వాటాలను ఆయా ప్రభుత్వ రంగ సంస్థలే తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్‌) విధానానికి, ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థలు ప్రభుత్వ షేర్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వకమిటీ- కేంద్ర మంత్రివర్గం తాజాగా అమోదముద్ర వేసింది.

దేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో ప్రభుత్వరంగ సంస్థలు ముఖ్య భూమిక పోషించాయి, పోషిస్తున్నాయి. జాతి సంపదను పెంపొందించడానికి, సామాజిక, అర్థిక అసమానతలను తొలగించడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఉఫాథి కల్పన తదితర బహుముఖ లక్ష్యాలతో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ- సహకార రంగాలలో పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పి ప్రోత్సహించింది. ఒకనాడు వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతఇచ్చి వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపు చేసేవారు.

స్వాతంత్య్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలు ప్రభుత్వరంగ సంస్థలకు అగ్రపీఠం వేశారు. 1980 దశకం వరకు ఈ ఒరవడి కొనసాగింది. వలస దోపిడీలో మగ్గిపోయిన మన దేశ ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాదులు వేసి పారిశ్రామికాభివృద్ధిలో, సంపదను సృష్టించడంలో అగ్రభాగాన నిలబడ్డాయి. 1990 దశకం ప్రారంభం నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు.

ప్రభుత్వ రంగానికి గర్వకారణమైన మహారత్నాలు, నవరత్నాలు ఆయా రంగాలలోని అంతర్జాతీయ సంస్థలకు దీటుగా పోటీ పడుతున్నాయి. 1951 నాటికి కేవలం రూ. 30 కోట్ల పెట్టుబడులతో ఐదు సంస్థలుంటే నేడు 249 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి వాటి ఆస్తుల నికర విలువ రూ. 6,60,245 కోట్లుగా అంచనా వేశారు. 12.42 శాతం వృద్ధి రేటుతో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ( జి.డి.పి.) పెరుగుదలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి.

ఎక్సజ్‌ డ్యూటి, కస్టమ్స్‌ డూటి, కార్పొరేట్‌ ట్యాక్స్‌, ఆదాయపు పన్ను, రుణాలపై వడ్డీలు, పెట్టుబడులపై డివిడెండ్లు- ఇతర పన్నుల రూపేణా 2009-10లో రూ. 1,39,830 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు రూ.1,08,435 కోట్ల నికరలాభాలు గడించాయి. దాదాపు రూ.35,000 కోట్లు డివిడెండ్లు ప్రకటించాయి. అది చాలదన్నట్లు లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని వార్తలొస్తున్నాయి. రూ. 77,745 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టాయి.

నగదు నిల్వలు, మిగులు రు.6,05,648 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభం నాటికి 23,00,000 మంది కార్మికులు, ఉద్యోగులుంటే ఆ సంఖ్య 2009-10కి 14,91,000 కుదించుకుపోయింది. ఒక వైపు పర్మినెంట్‌ వర్కర్ల సంఖ్యను తగ్గిస్తూ మరొకవైపు కాంట్రాక్ట్‌ వర్కర్లను నియమించుకొంటున్నారు. వారికి కనీస వేతనాలు గాని, సామాజిక భద్రత గానీ కల్పించకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.

జాతికి గర్వకారణంగా నిలిచి , ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనే దుర్నీతిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ విధానం దేశ ఆర్థిక స్వావలంబనకే గొడ్డలి పెట్టు. మహారత్న, నవరత్నాలుగా పిలిచే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఇప్పటికే ప్రభుత్వ వాటాలు గణనీయంగా తగ్గిపోయాయి. హెచ్‌.పి.సి.యల్‌. లో 51.11, బి.పి.సి. యల్‌. లో 54.93, గెల్‌ లో 57.34 , బి.హెచ్‌.ఇ.యల్‌. లో 67.72 , ఒ.యన్‌.జి.సి.లో 69.14 , బెల్‌ లో 75.86 , ఐ.ఒ.సి . లో 78.92 , యన్‌.టి.పి.సి.లో 84.5, సెయిల్‌ లో 85.82, కోల్‌ ఇండియాలో 90 శాతాలకు తగ్గిపోయాయి.

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ , పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ , యన్‌.టి.పి.సి. లిమిటెడ్‌ , ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, నేషనల్‌ మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ , సట్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగం, ఈ.ఐ.యల్‌., యన్‌.యం.డి.సి. వగైరా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 22,500 కోట్లు సేకరించుకొన్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓ.యన్‌ .జి.సి., సెయిల్‌, పి.ఎఫ్‌.సి., ఐ. ఒ.సి., యం.యం.టి.సి., ఆర్‌.ఐ.యం.యల్‌., యన్‌.బి.సి. సి., హిందుస్తాన్‌ కాపర్‌, బి.హెచ్‌.ఇ.యల్‌., హెచ్‌.ఎ.యల్‌. తదితర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతంచేసి తద్వారా రూ.40,000 కోట్ల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఏడాది పొడవునా మార్కెట్‌ అననుకూలంగా ఉండడంతో ఇప్పటి వరకు రూ.1,145 కోట్లు మాత్రమే సేకరించుకోగలిగింది .

ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నది. అందులో భాగంగా నగదు నిలలున్న ప్రభుత్వరంగ సంస్థలను, ఆర్థిక సంస్థలను రంగ ప్రవేశం చేయించి, ప్రభుత్వ షేర్లను వాటికి అమ్మి సొమ్ము చేసుకోవాలన్న కార్యాచరణను అమలు చేసింది. ఒ.యన్‌.జి.సి.లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా షేర్లను బహిరంగ వేలం వేసి, యల్‌.ఐ.సి.ని 95 శాతం షేర్లను కొనుగోలు చేసేలా పథకం ప్రకారం ఒత్తిడి చేసి రూ.12,500 కోట్లు రాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకొంటున్నది.

ప్రభుత్వ రంగ సంస్థలు తమవద్ద ఉన్న నగదు నిల్వలు, మిగులును ఆయా సంస్థల విస్తరణకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టి వాటిని గాడిలోకెక్కించి, అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలకు వెచ్చించమని ప్రోత్సహించడానికి బదులు, ఆ నిథులను ఖజానాకు ఎలా మళ్ళించుకోవాలని ఆలోచించడం జాతి ప్రయోజనాలకు హానికరం.

కోట్లాది ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ, మదుపుదార్లకు సామాజిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థ యల్‌.ఐ.సి.ని బలోపేతం చేసి సమాజానికి మరింత మేలైన సేవలందించేలా ప్రోత్సహించడానికి బదులు, ఆ సంస్థను పావుగా వాడుకోవడం తీవ్ర అభ్యంతరకరం.దేశ ఆర్థికాభివృద్ధిలో, సామాజికాభివృద్ధిలో ఛోదక శక్తిలా పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. వాటిని పరిరక్షించుకోవడం దేశభక్తులందరి కర్తవ్యం.

No comments:

Post a Comment