Friday, April 13, 2012

ముడుపుల ముట్టడిలో రక్షణ!

సూర్యా దినపత్రిక, ఏప్రిల్ 10, 2012

ప్రధాన మంత్రికి పదాతిదళాల ప్రధానా ధికారి వి.కె.సింగ్‌ వ్రాసిన ఉత్తరం లీక్‌ కావడం, నాసిరకం సైనిక వాహనాల కొనుగోలుకు రు. 14 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు, ప్రస్తుతం సైన్యం వద్ద రెండు రోజులకు సరిపడేంత ఆయుధ సంపత్తి మాత్రమే ఉందని అందులో పేర్కొనడం లాంటి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు బిహ ర్గతమయిన పూర్వరంగంలోనే వెలు గు చూసిన ఈ వార్త సహజంగానే రాజకీయ వ్యవస్థలో వేడి పుట్టించింది. దేశ ప్రతిష్టను, సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బదీసే ఘటనలుగా వీటిని పరిగణించాలి. భద్రతాపరంగా దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు ఆరోగ్యకరంగా లేవు. కాశ్మీరు సమస్య రావణా సురుని కాష్ఠంలా రగులుతూనే ఉన్నది.

పాకిస్తాన్‌ శతృపూరిత వైఖరిలో మౌ లికమైన మార్పు గోచరించడం లేదు. పైపెచ్చు ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా ఆ దేశ సైన్యం శిఖండిలా అడ్డుపడుతున్నది. మనదేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. నిరంతరం సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సహజీ వనం గడపాల్సిన దుస్థితి నెల కొని ఉన్నది. ఐ.యస్‌.ఐ. తర్ఫీదు, ప్రోత్సాహం తో సీమాంతర ఉగ్రవాద శక్తులు మన దేశంపై కక్ష గట్టి, దొంగ దెబ్బలు కొడుతున్నాయి. మన రక్షణ వ్యవస్థల కన్నుగప్పి దేశంలో అక్రమంగా చొర బడి మారణహోమాలు సృష్టిస్తున్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి, ఆర్థి క నగరంగా పేరుగాంచిన ముంబాయి మహానగరంపై బాంబులతో దాడి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బాం బుపేలుళ్ళు, హైదరాబాదు మొదలుకొని దేశంలోని నలుమూలలా సంభవిం చిన బాంబు పేలుళ్ళ సంఘటనలు దేశ భద్రతకు గొడ్డలి పెట్టు లాంటివి. ప్రజ ల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి.

పోనీ మిగిలిన ఇరుగుపొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్‌, బాంగ్లా దేశ్‌, బర్మాలతో విశ్వసనీయమైన, నమ్మశక్యమైన దౌత్య సంబం ధాలున్నాయా అంటే అదీలేదు. అపనమ్మకాల మధ్యకాలం వెళ్ళబుచ్చు తున్నాము. ఈశాన్య ప్రాంతంలో చొరబాటుదారులు సమస్య పెద్ద తల నొప్పిగా మారింది. ఆంత రంగికంగా మతోన్మాద శక్తులు, అతివాద తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా నిలిచాయి. పర్యవసానంగా రక్షణ రంగా నికి మన వార్షిక బడ్జెట్స్‌లో సింహభాగం కేటాయిస్తున్నారు. 200506 ఆర్థిక సంవత్సరంలో రు.80,549 కోట్లు ఖర్చుచేస్తే 2012-13లో ఏకంగా రు.1,93,408 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక భాగం రక్షణ కొనుగోళ్ళకు వెచ్చిస్తున్నారు. ప్రణాళికేతర పద్దుక్రింద రు.1,13,829 కోట్లు. ప్రణా ళిేతర పెట్టుబడి వ్యయం పద్దు రు.79,579 కోట్లు ఉన్నది. అంటే ఆయుధసంపత్తి సేకరణ, ఆధునీకీకరణ, సైనికదళాల శిక్షణ వగైరా అవసరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది.

రక్షణ శాఖ జమా, ఖర్చులపై ఆడిట్‌ చేసే అధికారం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సంస్థకు లేకపోవడంతో అడ్డగోలు వ్యవహారా లకు అడ్డాగా తయారయ్యింది. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోనే ప్రక్రియ లో అంతర్భాగంగా చేసే కొనుగోళ్ళకు నిర్దిష్టమైన నియమనిబంధనలు పాటిం చకపోవడం, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం అవినీతి రాజ్యమే లడానికి అవకాశం కల్పించింది. రక్షణ శాఖకు భారీ నిథుల కేటాయింపులు ఉండడంతో ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారుచేసే బహుళజాతి సంస్థల డేగకన్ను మన రక్షణ రంగం పై దశాబ్దల క్రితమే పడింది. ఫలితంగా ఆయుధ సంపత్తి కొనుగోలు లావాదేవీ వ్యవహారాల్లో కత్రోచీ లాంటి దళారులు ప్రవేశించి, అవినీతిని ప్రోత్సహించి, రక్షణ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

బోఫర్స్‌ కుంభకోణం మొదలుకొని కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భౌతిక కాయాలను తరలించడానికి వినియో గించిన శవ పేటికల కొనుగోలు కుంభకోణం వరకు అవినీతి, అక్రమాల భాగోతాలు దేశ రక్షణ వ్యవస్థకే తలవంపులు తెచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన బోఫర్స్‌ శతఘు్నలు వగైరా ఆయుధ సంపత్తికి నేడు విడి భాగాలూ, మందు గుండు సామగ్రి లభించక పోవడంతో ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నామా? అన్న అనుమానాలు వస్తున్నాయి. దశాబ్దాల తదనంతరం కూడా మందు గుం డు సామగ్రిని, శవ పేటికలను కూడా తయారు చేసుకోలేనంత వెనుకబడి ఉన్నామా? స్వయంపోషకత్వాన్ని సాధించే వైపు ఎందుకు ప్రయాణం చేయ లేక పోతున్నాం ?

సైనిక దళాల ప్రధానాధికారి వి.కె.సింగ్‌ ఉత్తరంలో ప్రస్తావించినట్లు 600 నాసిరకం టెట్రా టెర్రాయిన్‌ సైనిక వాహనాలను (ట్రక్స్‌) 2010 సం.లో కొను గోలు చేయడానికి అనుమతిస్తే తనకు రు.14 కోట్లు లంచం ఇవ్వజూపిన విష యం వాస్తవమైతే అవినీతిచెదలు ఏ స్థాయిలో విస్తరించిందో స్పష్టమవుతున్న ది. ఉత్తరం ఎలా బహిర్గతమయ్యిందన్నది ఒక చిదంబర రహస్యమైతే, అసలు ఆ ఉత్తరంలోని అంశాలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయి. దానిపై ప్రధాన మంత్రిగానీ లేదా రక్షణశాఖా మంత్రిగానీ ఎందుకు తక్షణం స్పందించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో లేదో ! జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, అత్యంత ఉన్నతస్థానంలో ఉన్న తనకు లంచం ఇవ్వజూపిన దుష్టశక్తులపై ఎందుకు సైనిక దళాల ప్రధానాధికారి చర్యలు తీసుకోలేదో కూడా బహిర్గతం చేయాల్సి ఉంది.

ఏదైనా ఉపద్రవం జరిగి ఇప్పటికిప్పుడు యుద్ధమంటూ జరిగితే రెండు రోజులకు సరిపడ ఆయుధ సంపత్తి మాత్రమే ఉన్నదని సైనిక దళాల ప్రధానా ధికారి పేర్కొనడం వాస్తవమైతే తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఎందుచేత ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనేదే అసలు సమస్య. గడచిన కొన్ని దశాబ్దా లుగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సముపార్జించుకొన్న ఆయుధ సం పత్తి అంత నిరుపయోగంగా తయారయ్యిందా! దీనికి కారణం పాత సాం ేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలకు విడి భాగాలు లభించక పోవ డమేనా ? చైనా, పాకిస్తాన్‌ బూచి చూపెట్టి దారిద్య్రం, నిరుద్యోగం, పిల్లలు, గర్భిణీ మహిళల్లో పౌష్టికాహార లోపం లాంటి తీవ్రమైన సమస్యల పరిష్కా రానికి గానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలులాంటి రంగాలకు అవసరమైన నిధులను కేటాయించకుండా, వార్షిక బడ్జెట్స్‌లో రక్షణ శాఖకు పుష్కలంగా నిథులను కేటాయిస్తున్నా ఈ దుస్థితి నెలకొనడానికి దారి దీసిన కారణా లేంటో! నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

రక్షణ రంగంపై చైనా 16.1 శాతం మేరకు బడ్జెట్‌ నిథులను వ్యయం చేస్తుంటే మన ప్రభుత్వం 16.4 శాతం ఖర్చు చేస్తున్నది. స్థూల జాతీ యోత్ప త్తిలో చైనా 2.1 శాతం వ్యయం చేస్తుంటే మనం 2.7 శాతం వెచ్చిస్తున్నాం. కాకపోతే వారికీ, మనకు ఒక తేడా ఉన్నట్లు చెప్తున్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సంపాదించు కొని తదనంతర కాలంలో చైనా సొంతంగా ఆయుధాలను, విడి భాగాలను ఉత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని సాధించుకొంటున్నది. కానీ స్వదేశంలో ఉత్ప త్తి చేసుకోగలిన ఆయుధాలను, వాహనాలను, విడిభాగాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికే మన ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నది. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి తక్కువ ఆయుధ సంపత్తిని పొందుతున్న దేశాల సరసన ఉన్నామని కూడా వార్తలు చెబుతున్నాయి.

టాటా కంపెనీ దేశీయంగానే నాణ్యమైన సైనిక వాహనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా రక్షణ శాఖ ఆసక్తి కనబరచ లేదన్న సమాచారాన్ని ఆ సంస్థ ప్రతినిథులే వెల్లడించారు. దాన్నిబట్టి కిక్‌ బాక్స్‌ స్వీకరించడానికి విదేశీ గడ్డ అన్ని విధాలా అనువైనదని దళారులు, ఉన్న తాధికారులు, రాజకీయ నాయకత్వం భావిస్తున్నట్లుంది. కారణం పుచ్చుకొన్న అవినీతి సొమ్మును స్విస్‌ బ్యాంకుల్లో పదిలంగా దాచుకొనే సౌలభ్యం ఉంది కాబట్టే. మన దేశానికి చెందిన ఘరానా పెద్ద మనుషుల స్విస్‌ బ్యాంకు ఖాతా ల్లో ఈ తరహా అవినీతి, పన్ను ఎగవేత ద్వారా ఆర్జించిన సొమ్ము దాదా పు రు.74,00,000 కోట్లు ( రు.24,00,000 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రే ప్రకటించారు) పోగుపడ్డదని కోడై కూస్తున్నది. ఆ నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని, అవినీతిని కూకటి వేళ్ళతోపెకలించాలని పెద్ద ఎత్తున ఉద్యమా లు జరుగుతున్న నేపథ్యంలోనే మరొకసారి రక్షణరంగంలోని అవినీతి సమస్య గుప్పుమనడం కళంకం తెచ్చి పెట్టింది.

రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల లో భాగంగా రక్షణ రంగంలోకి కూడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) ముసుగులో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తు న్నది. ఈ లోపభూయిష్టమైన విధానాల మూలంగా దేశ భద్రతకు, రక్షణ రం తగం సమాచారానికే రక్షణ కొరవడే ప్రమాదం ముంచుకొస్తున్నది. సరిహద్దు దేశాలతో దౌత్యపరమైన మైత్రి సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా రక్షణరంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించుకోవడానికి, అవినీతిని అరికట్టి ప్రజా దనం దుర్వినియోగం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభు త్వం అమలు చేయాలి.
మన దేశంతో పాటు శ్రీలంక, బాంగ్లాదేశ్‌, నేపాల్‌, మాల్దీవ్స్‌ సరిహద్దుల్లో ప్రత్యేక సైనిక దళాలు తిష్టవేసిన నిప్పులాంటి నిజాన్ని అమె రికా పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ రోబెర్ట్‌ విల్లాడ్‌ యు.యస్‌.ఎ. కాం గ్రెషనల్‌ కమిటీకి ఈ ఏడాది మార్చిలో నివేదించిన విషయం వెల్లడయ్యింది. అయినా మన పాలకులు అది అవాస్తమని కొట్టిపారేస్తున్నారంటే అమెరికాతో కుదుర్చుకొన్న వ్యూహాత్మక ఒప్పందాల్లో ఇవన్నీ అంతర్భాగమేమోననిపి స్తుం ది. వాస్తవానికి విదేశాంగ విధానాలలో మన ప్రభుత్వ లొంగుబాటు వైఖరి పర్యవసానంగా దేశ రక్షణ వ్యవస్థ పెను సవాళ్ళును ఎదుర్కొంటున్నది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి మౌలికమైన అంశాలపైన ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

1 comment:

  1. డియర్ లక్ష్మీనారాయణ గారు, మీ వెబ్ సైట్ చాలా విజ్ఞానదాయకంగా వుంది.కానీ, ఆర్కైవ్స్ లో అప్ అండ్ డౌన్ షేక్ అవుతున్నట్లు పెట్టారు. అది ఎడమకంటికి చాలా ఇబ్బందికరంగా వుంటోంది. దయచేసి బ్లాగు డిజైన్ లో మార్పులు చేసుకోగలరు.

    ReplyDelete