Tuesday, May 1, 2012

శ్రమకు తగ్గ ఫలితం దక్కేదెన్నడు?

May 1st  2012  Surya Daily
విముక్తి కోసం శ్రమ శక్తి సాగిస్తున్న సమరశీల ఉద్యమాలకు ప్రతీక మే డే. నాడు (1886 మే 1) చికాగో నగరంలోని కార్మికు లు 8 గంటల పని దినం కోసం సమ్మె పోరాటం చేసి, రక్తం చిందించారు. 126 సంవత్సరాల అనంతరం నేడు కూడా 8 గంటల పని దినం కోసం, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధి, సామాజిక భద్రతల కోసం, అనేక రెట్లు పెరిగిపో యిన శ్రమ దోపిడీకి అంతం పలకాలని ప్రపంచ వ్యాపితంగా శ్రామిక వర్గం ఉద్యమాల నిర్వహణలో నూతన పుంతలు తొక్కుతున్నది. నాటి చారిత్రాత్మకమైన కార్మికోద్యమానికి నేతృత్వం వహించి అమరులైన కార్మిక నేతల త్యాగాలు ఆరని జ్యోతిలా కార్మిక వర్గానికి స్ఫూర్తి నింపుతున్నాయి . ప్రపంచ కార్మికవర్గాన్ని అజేయమైన శక్తిగా ఆనాటి వీరోచిత హే మార్కెట్‌ సంఘటన నిలబెట్టింది.

సంపన్నదేశాల కూటమికి నాయకత్వంవహిస్తున్న అమెరికాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డ కార్మికులు, సామాన్య ప్రజలు ‘ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌’, ‘మేం 99 శాతం మీరు ఒక్క శాతం మాత్రమే’ నినాదాలతో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడంతో దోపిడీ శక్తులకు ముచ్చెమ టలు పట్టాయి. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఈ తరహా పోరాటాల్లో పాల్గొం టున్న ఉద్యమకారులకు మార్స్కిజం లెనినిజం పట్ల స్పష్టమైన అవగాహన లేకపో యినా రాజకీయ, సైద్ధాంతిక అనుబంధాలకు అతీతంగా ఉద్యమాల్లో ఉరకలు వేస్తున్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానే ప్రజానుకూల, సామాజిక న్యాయాన్ని అందించే ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఉద్యమాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. సక్రమమైన పంథాలో దిశానిర్దేశం చేసి ఆ పోరాటాలను నడిపించగల రాజకీయశక్తి లేని కారణంగా అనేక దేశాలలో విపరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.

అధిక లాభాల వేటలో పడ్డ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తాను తవ్వుకొన్న గోతిలోనే పడి, సమస్యల వలయంలో చిక్కుకొన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఆధునికీకరించుకోవడం ద్వారా సంక్షోభం నుండి బయట పడవచ్చని కొందరు ఆర్థికవేతలు కూనిరాగాలు తీస్తున్నారు. పాలక వర్గాలు ఆర్థిక సంక్షోభ దుష్ఫలితాలను శ్రామికవర్గం, సామాన్య ప్రజలపైకి నెట్టేస్తున్నారు. దోపిడీ వ్యవస్థను కాపాడుకొనే పనిలో పెట్టుబడిదారీ వర్గం నిమగ్నమై ఉన్నది. సహజవనరులు, ఉత్పత్తిసాధనాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకొని, అతి తక్కువ వేతనాలతో శ్రమ శక్తిని ఉపయోగించుకొని లాభాల శాతాన్ని పెంచుకోవాలని, ఉత్పత్తులకు విశాలమైన మార్కెట్‌, ప్రసార మాధ్యమాలు, రాజకీయ రంగాలపై పటు ్టబిగించడం ద్వారా దోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించాలని బహుళజాతి సంస్థలు పావులు కదుపుతున్నాయి.

మన దేశంలోని గుత్త సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు వాటితో జత కలిసి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగంపై, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిలో క్రియాశీల భూమిక పోషిస్తున్న కార్మిక వర్గంపైన ముప్పేటా దాడి చేస్తున్నాయి.
ఆ దోపిడీ శక్తులకు వత్తాసు పలుకుతూ, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించాలంటే ప్రజాసంక్షేమాన్ని అటకెక్కించి, నయా ఉదారవాద ఆర్థికసంస్కర ణల అమలులో వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొన్నది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం 2011-12 లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకొన్నదని చెప్పుకొంటూనే, సంక్షోభం బారిన పడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించి, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో గొడ్డలి వేటుకు గురిచేస్తున్నది.

పెట్టుబడుల ఉపసంహరణతో మహారత్నాలు, నవరత్నాలుగా పేరొందినతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే జాతి వ్యతిరేక విధానాన్ని- జాతీయ కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో నిరసిస్తూ దేశ వ్యాపిత ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఖాతరు చేయకుండా మన్మోహన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ పద్దు కింద 2011-12లో రూ.40,000 కోట్లతో ఖజానా నింపుకోవాలని ప్రయత్నించి రూ.14,000 కోట్లు పోగేసుకొన్నది. 2012-13 బడ్జెట్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. బ్యాంకింగ్‌ రంగంలో ప్రైవేటీకరణ చర్యలకు పదును పెడుతున్నది. బ్యాంకు చట్టాల సవరణ బిల్లు 2011, బీమా చట్టాల సవరణ బిల్లు 2008, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవెలెప్‌ మెంట్‌ అథారిటీ 2011- పార్లమెంటరీ స్థారుూ సంఘాల సిఫార్సులు అందాయని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడాన్ని బట్టి ప్రభుత్వరంగ, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. విదేశీ, స్వదేశీ కార్పోరేట్‌ సంస్థలకు, సంపన్నులకు ఊడిగం చేస్తూ జాతి సంపదను దోచిపెడుతున్నది.

జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవాలంటే సంస్కరణల వేగాన్ని పెంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. జాతి సంపద వృద్ధి చెందాలనే ప్రజలందరూ కోరుకొంటారు. కానీ సమస్యల్లా, ఆ అభివృద్ధిలో శ్రామికులకు దక్కుతున్న వాటా ఎంవ అన్నదే. జీడీపీ వృద్ధి రేటుకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి. ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం, నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను ప్రాథమిక హక్కుగా పొందగలిగిన పరిస్థితులు కల్పించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. అభివృద్ధి అన్న పదానికి అర్థం, పరమార్థం ఉండదు.

స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాలనే మాయమాటలతో స్థూల జాతీయోత్పత్తిలో సబ్సీడీల శాతాన్ని 2012-13లో 2 శాతానికి, అటుపై 1.75 శాతానికి- అలా కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం, పెట్రోల్‌ ఉత్పత్తులు, ఎరువులపై ఇస్తున్న సబ్సీడీలను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. రెండంకెలకు అటు ఇటూ కదలాడుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే ఆర్థిక వ్యవస్థే తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని చెప్పి, రిజర్వు బ్యాంకు ద్రవ్యనియంత్రణకు పూనుకొన్నది. పర్యవసానంగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు- బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థల నుండి తీసుకొన్న గృహరుణాల వడ్డీ రేట్లు 13 సార్లు పెరిగాయి. నెలవారీ చెల్లింపులలో అత్యధిక భాగం వడ్డీ పద్దు కిందే జమైపోతుండడంతో రుణ విముక్తులు కాలేని దుస్థితి ఏర్పడుతున్నది. ఆహార ద్రవ్యోల్బణం 2010 ఫిబ్రవరిలో 20.2 శాతానికి ఎగబాకి క్రమేపీ తగ్గింది.

ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు తగ్గుతాయన్నది ఆర్థిక వేత్తల సూత్రీకరణ. కానీ ఆచరణలో పెరిగినధరలు తగ్గడం లేదు. పతనమవుతున్న రూపాయి మారకం విలువ, తరిగిపోతున్న కార్మికుల నిజవేతనాలు, ఖరీదై పోయిన విద్య, వైద్యం, ఇళ్ళ కిరాయి ప్రజల కొనుగోలు శక్తిని క్షీణింపచేశాయి. వేతనాల మీదే ఆధారపడి జీవిస్తున్న శ్రామిక ప్రజానీకానికి, అసంఘటిత కార్మికుల ఆహార భద్రతకు పెనుముప్పు సంభవిస్తున్నది. గడచిన రెండు దశాబ్దాలుగా సంస్కరణలను అమలు చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలు కనుమరుగై పోతున్నాయి. సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలన్నింటిలో కాంట్రాక్టు కార్మికులనే నియమించుకొంటున్నారు. క్యాజువల్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో కార్మికులను, ఉద్యోగులను నియమించుకొని నికృష్టమైన దోపిడీకి గురిచేస్తున్నారు .

అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నది. దేశ శ్రామిక జనాభా దాదాపు 46 కోట్లుంటే, అందులో 42.5 కోట్లు అసంఘటిత కార్మికులే.సాధించుకొన్న కార్మిక చట్టాలు చట్టుబండ లుగా మారిపోయాయి. పోషకార లోపంతో బాధపడే వారి సంఖ్య అధికమ వుతున్నది. కోటాను కోట్ల మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల, అర్థ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపో తున్నది. రవాణా, విద్యుత్తు వగైరా ఖరీదై పోయి అందుబాటులో లేకుండా పోయాయి. కార్మిక హక్కులు, మానవ హక్కులపై దాడి జరుగుతున్నది. ప్రైవేటీకరణ, వేతనాలు, పెన్షన్లలో కోతలు విధించడం, లేఆఫ్‌, సంఘం పెట్టుకొనే హక్కునే హరించివేయడం, ఉమ్మడి బేరసారాలాడే శక్తిని బలహీనపరచడం, న్యాయబద్ధమైన, శాంతియుతమైన నిరసనలను కూడా సహించ లేని వాతావరణం నెలకొన్నది.
ఆర్థిక సంక్షోభం పేరిట ఉద్దీపన పథకాల ద్వారా ప్రజాధనాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం పంచిపెట్టింది. లక్షల కోట్ల సంపద సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థల వద్ద పోగయ్యింది. దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. దీన్ని బట్టి కార్మిక వర్గం ఏ స్థాయిలో దోపిడీకి గురౌతున్నదో బోధడుతుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ శ్రామిక ప్రజల సంక్షేమానికంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి అడుగులు ముందుకు వేస్తున్న పాలక వర్గాల ఆటలు కట్టించాలంటే కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో చైతన్యయుతంగా, సమైక్య ఉద్యమాలకు పదును పెట్టాలి.

(నేడు మే డే!)

No comments:

Post a Comment