Friday, December 13, 2013

వినూత్న శక్తులే విధాతలు

Sakshi  December 11, 2013
వినూత్న శక్తులే విధాతలు


 కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ పోరాటంగా పరిణమించిన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి చరమగీతం పాడాయి. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రేఖామాత్రంగా సూచించాయి. రాజ స్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం ఎన్నికలకు, ఢిల్లీ ఎన్నికలకు మౌలికమైన తేడా ఉన్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. ప్రజల ముంగిట మరో బల మైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో గుడ్డిలో మెల్ల మేలన్నట్టు ప్రజలు ఉన్న రెండు పార్టీల్లోనే ఏదో ఒక దాన్ని ఎన్నుకోక తప్పలేదు. కానీ ఢిల్లీ ఎన్నికల సమరం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

అవినీతి, అధిక ధరల వ్యతిరేక పోరాటాల బాట నుంచి ఎన్నికల బరిలోకి దూకిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ కొత్త రక్తంతో, వినూత్నమైన ఎన్నికల ప్రచారంతో ఈ ఎన్నికల సమరాన్ని కొత్త పుంతలు తొక్కించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, ఎన్నికల నిధి వసూళ్లు, వ్యయాల వరకు పారదర్శకంగా వ్యవహరిం చింది. ప్రత్యేకించి గెలుపోటముల లెక్కలతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై పోటీకి దిగి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు, పోరాట పటిమగల నేతగా గుర్తింపు పొందారు. ఈ అంశాలన్నీ కలిసి ఆ పార్టీని అనూహ్యమైన రీతిలో విజయపథాన నడిపించాయి. అన్నింటికీ మించి కేజ్రీవాల్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో ప్రసార మాధ్యమాలు నిర్వహించిన పాత్ర గణనీయమైనది.

 డబ్బు, కులం, మతం, ప్రాంతం, కండ బలం వగైరా దుష్టశక్తులు ఆధిపత్యం చలాయిస్తున్న ఎన్నికల వ్యవస్థతో విసిగివేసారి పోయిన ప్రజలకు ‘ఆమ్ ఆద్మీ’ విజయాలు గొప్ప ఊరటను కలిగించాయి. లోపభూయిష్టమైన సామాజిక ఆర్థిక వ్యవస్థను మార్చే సైద్ధాంతిక పునాది, పరిణతి, పటిష్టమైన నిర్మాణం ఆ పార్టీకి లేవనే వాదన సద్విమర్శే అయినా వాస్తవాలను నిష్పక్షపాతంగా పరిశీలించవలసి ఉన్నది. నందిని పందిని, పందిని నందిని చేయగల శక్తి డబ్బుకున్నది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగే కొద్దీ రాజకీయ అవినీతి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ధనబలం నిలవరించలేక పోవడం ప్రజాస్వామ్యానికి శుభసూచన. అంకితభావంతో, నిస్వార్థంగా, కష్టనష్టాలకు సిద్ధమై అంకితభావంతో పనిచేసిన యువ కార్యకర్తల భుజాలపైనే విజయబావుటా ఎగిరింది. ఆ పార్టీ మురికివాడల్లోకి చొచ్చుచుపోయి కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసి ఓటు బ్యాంకులను కొల్లగొట్టింది. మరోవంక మధ్యతరగతి ప్రజల భాగస్వామ్యంతో బీజేపీని దీటుగా ఎదుర్కొన్నది.

 ప్రత్యర్థులుగా నిలిచిన కుబేరులను ఎందరినో మట్టి కరిపించింది. నిత్య అత్యాచారాల నగరమైన ఢిల్లీలో తిరుగుబాటు బాట పట్టిన మహిళా లోకం ఆ పార్టీ వైపే నిలిచింది. శాసనసభకు ఎన్నికైన ముగ్గురు మహిళలూ ఆమ్ ఆద్మీకి చెందిన వారే. నైరాశ్యం అలముకున్న నేటి పరిస్థితుల్లో సామాన్యులకు పరిమితమైన ప్రయోజనం కలిగించే ఇలాంటి విజయాలు సమాజ ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తాయి.

 అవినీతిపై కన్నెర్రజేసి, లోక్‌పాల్ చట్టం కోసం సాగించిన శక్తిమంతమైన ఉద్య మం నుంచి పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ... అవినీతి రహిత సుపరిపాలన, పాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడం వంటి వాగ్దానాలతో బరిలోకి దిగింది. ఆ నినాదాలు యువతను, పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాయి. అవినీతిపరులకు, ధన బలం ఉన్న వారికే రాజకీయాలన్న భావన నెలకొని ఉన్న తరుణంలో... సమాజంలోని కుళ్లును పారదోలడం రాజకీయాల ద్వారానే సాధ్యమనే చైతన్యాన్ని రగిల్చే నూతన శక్తుల రంగప్రవేశానికి ఆమ్ ఆద్మీ నాంది పలికింది. ప్రత్యేకించి యువత ఆదర్శవాదంతో ముందడుగు వేసింది. ఫలితంగా అధికారబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని, హిందూత్వ భావజాలం, నిర్మాణ బలమున్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీని సవాలు చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కేంద్ర స్థానమైన ఢిల్లీలో పాగా వేసింది. అధికారాంధకారంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీని తేలికగా తీసిపారేస్తే, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ దాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే నామమాత్రపు పార్టీగా ఈసడించింది. కాంగ్రెస్‌పార్టీ 25 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. నరేంద్రమోడీని ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టాలని కలలు కంటున్న బీజేపీ ఢిల్లీలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యా బలాన్ని సాధించలేక చతికిలబడింది, 33 శాతం ఓట్లు, 32 స్థానాలతో మిగిలి అంతర్మథనంలో పడింది.

 ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంతగా గాండ్రించినా రాజకీయాల్లో పిల్ల కూన అయిన ఆమ్ ఆద్మీని నిలవ రించలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన 30 శాతం ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ‘ప్రతికూల ఓట్లు’గా భావించడం పొరపాటు అవుతుంది. అవి ఆ పార్టీ అనుసరించిన ప్రజానుకూల రాజకీయాంశాలకు లభించిన సానుకూలమైన ఓట్లుగా గుర్తిస్తేనే ప్రజాతీర్పును సక్రమంగా అర్థం చేసుకున్న వారమవుతాం. అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడని రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేటి పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో 28 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, అధికారాన్ని అందుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ప్రతిపక్షంలో కూర్చుం టామని ప్రకటించడం ద్వారా ఆమ్ ఆద్మీపై ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అది వమ్ము చేయలేదనిపిస్తుంది.

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ మూడవసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా గత  ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతాన్ని 38 నుంచి 46కు, శాసనసభా స్థానాలను 143 నుంచి 165కు పెంచుకోగలిగింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోలేని దుస్థితి కాంగ్రెస్‌ది.

 అందుకే అది ఓట్లశాతాన్ని పెంచుకోగలిగినా 71 స్థానాల నుంచి 58 స్థానాలకు దిగజారింది. గతంలో ఏడు స్థానాలను గెలుచుకున్న బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఆపసోపాలు పడుతూ ఉన్న అధికారాన్ని నిలుపుకొన్నది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇటీవలే మావోయిస్టు దాడిలో రాష్ట్ర నేతలను కోల్పోయిన సానుభూతి జతై అధికారం దక్కించుకోవచ్చనుకున్న కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ఓటమి ఊహించినదే. ఈశాన్య భారత్‌లోని మిజోరాంలో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఊరట కలిగించగలిగేది కాదు.

 ఎన్నికల బరిలో దిగి, సత్ఫలితాలను సాధించలేకపోయిన ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికల ఫలితాల నుంచి సరైన గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. బీఎస్పీ గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను, సీట్లను నిలబెట్టుకోలేకపోయింది. సమాజ్‌వాది పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ, వామపక్ష పార్టీలు ఫలితాలను లోతుగా విశ్లేషించుకోవడం అవసరం. కాంగ్రెస్, బీజేపీలకు దీటైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించకపోవడానికున్న అవరోధాలు, కారణాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ ఢిల్లీ విజయంతో ఇదే వరవడిలో దేశంలోని మిగిలిన మహానగరాలకు కూడా ఆ పార్టీ విస్తరించే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో జాతీయ పార్టీలు వైఫల్యం చెందడం మూలంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల వైఫల్యం వల్ల కొత్త ప్రాంతీయ పార్టీలు మొగ్గ తొడుగుతున్నాయి.

 ఆమ్ ఆద్మీ లాంటి రాజకీయ పార్టీల మనుగడపై ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా... ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించుకొంటూ, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయకుంటే, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ఆర్థిక అసమానతలను, సాంఘిక అసమానతలను పెంచిపోషిస్తూ పోతే రాజకీయరంగంలో ఇలాంటి పెను మార్పులు సంభవిస్తూనే ఉంటాయని గుర్తించక తప్పదు. కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో పాలన సాగిస్తూ, సామాన్య ప్రజల సంక్షేమాన్ని మరచిన కాంగ్రెస్ పార్టీని పెట్టా బేడా సర్దుకోమని ఈ ఎన్నికల ఫలితాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయని చెప్పవచ్చు. యూపీఏ2 ప్రభుత్వం ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, గృహరుణాల వడ్డీ రేట్ల పెరుగుదల, మహిళపై అఘాయిత్యాలు వగైరా అన్నింటా ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందడమే గాక అందుకు నిరసన తెలిపిన ప్రజలపై, ఉద్యమాలపై లాఠీలు, తూటాలతో, అరెస్టులు, నిర్బంధాలతో విరుచుకుపడింది. తాజా శాసనసభ ఎన్నికల ప్రజాతీర్పు దాని గూబ గుయ్యిమనిపించింది. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇలాగే ప్రవర్తిస్తే అదే శాస్తి తప్పదు
విశ్లేషణ
టి.లక్ష్మీనారాయణ, డెరైక్టర్, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం 

No comments:

Post a Comment