Wednesday, January 1, 2014

పెడధోరణులపైనే ప్రణబ్ గురి

Sakshi  January 01, 2014 
పెడధోరణులపైనే ప్రణబ్ గురి


 ఒకప్పుడు జనా భా నలభై ఐదు కోట్లుగా ఉన్నప్పుడే దేశాన్ని ఐక్యంగా ఉంచుకోలేక పోయాం. నేడు 125 కోట్ల జనాభాను ఒక్కటిగా ఉంచాలి. ఇది జాతి ముం దున్న అతి పెద్ద సవాలు. రాష్ట్రాల విభజన డిమాండ్లు చాలా ముందుకు వస్తున్నాయి. సవ్యమైన విధానాల రూపకల్పనకు దోహదపడే విధంగా వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపై ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత నెల 19న అన్నారు.  తద్వారా అయన చాలా లోతైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటూ పలు పెడ ధోరణులు పెచ్చరిల్లుతున్న పర్యవసానంగా జాతీయ ఐక్యత పెను సవాలు ఎదురవుతోందని ప్రణబ్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన సమస్య నుంచి ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా పార్లమెంటు అచేతనమై పోవడం పట్ల కలత చెంది అలా వ్యాఖ్యానించారా? ప్రత్యేక తెలంగాణ లోతుపాతులు, పర్యవసానాలపై రాజకీయ విజ్ఞత లోపించిందని భావించారా? ఆ అంశంపై హేతుబద్ధమైన సమాచారాన్ని అందించడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని సూచించారా? ఏది ఏమైనా ఇవన్నీ నిశితంగా పరిశీలించాల్సిన ప్రశ్నలే.

 ‘విభజన’ మూలాలు: పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్ర అభివృద్ధి గమనం ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్‌లో ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 1965-75 మధ్య కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్ లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్‌కు (కొంత వరకు విశాఖపట్నానికి) పునాదులు పడ్డాయి. ఏ ఒక్క ప్రభుత్వమూ పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు దృష్టి పెట్టలేదు. 1990 దశకం నుంచి ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా ఎదిగి అభివృద్ధి నమూనాలుగా వెలిశాయి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు అతి వేగంగా పెరిగిపోతుండగా ప్రజల్లో అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. ఈ పరిస్థితులు విభజనోద్యమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్న భావజాలంతో బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. అవకాశవాదాన్ని తలకెక్కించుకొన్న కాంగ్రెస్ ఓట్లు, సీట్లే కొలబద్దగా  ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది. ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోంది. అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు పట్టంగట్టే రాజకీయ శక్తులు ఆ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లేవీ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించవని కొందరి వాదన. శాంతియుత సహజీవనం సాగించాల్సిన ప్రజల మధ్య విషబీజాలను నాటుతున్నామనే స్పృహ లోపించడం శోచనీయం.

 అనుభవాల నుంచి ఏం నేర్చుకొన్నాం? బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ కుట్రపూరితంగా దేశాన్ని రెండు ముక్కలు చేసి, సరిహద్దుల్లో రావణ కాష్టాన్ని రగిల్చి పోయారు. మన దేశం అండదండలతో సాగిన తూర్పు పాకిస్థాన్ విముక్తి ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో పాక్ మనపై మరింత కక్ష పెంచుకుంది. కాశ్మీర్ సమస్య సాకుతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నది. అలాంటి సున్నిత రాష్ట్రం జమ్మూ-కాశ్మీర్‌ను జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈశాన్యంలో గ్రేటర్ నాగాలాండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్ వగైరా డిమాండ్లతో నిరంతరం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పొందుపరచిన 15 భాషలలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే సదుపాయాలు పార్లమెంటులోనే లేని దుస్థితి కొనసాగుతున్నది. జనాభాలో 38 శాతం హిందీ మాట్లాడుతున్నా దాన్ని అందరిపై రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. రాష్ట్రాల చట్టసభల్లో మాతృభాష అమలుకు సైతం చిత్తశుద్ధి ప్రయత్నించాల్సి ఉంది. పార్లమెంటు కార్యకలాపాలపై హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది.

 ఒకటి మాత్రం వాస్తవం... ప్రాంతీయ, భాషాపరమైన సమస్యల వంటి సున్నిత సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలు సున్నితంగా, జటిలంగా తయారవుతున్నాయి. అవి ఎప్పుడు ఎలా పరిణమిస్తాయోననే సందేహాలను కలుగజేస్తున్నాయి. రాష్ట్రపతి ఆ కోణాన్నే స్పృశించినట్లుంది. ఇలాంటి సమస్యలపై ఆషామాషీగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పకనే చెప్పారనిపిస్తుంది. నిఘా వర్గాలు నిష్పాక్షికంగా, వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విధాన నిర్ణేతలకు అందించి, సముచిత నిర్ణయాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రణబ్ ఉపదేశించారు.

 నేటి సంకీర్ణ రాజకీయాల యుగంలో సైతం అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏకమై ఎలాంటి లోపభూయిష్టమైన, హానికరమైన చట్టాన్నయినా తీసుకొచ్చి దేశంపై బలవంతంగా రుద్దగలవు. అలాంటి ప్రమాదమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ముంచుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రాష్ట్రాల విభజనకు అవి బరితెగించగలవనడానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు. ఈ విషయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, సమాఖ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. తెలంగాణ అంశాన్ని నానబెట్టి ఎన్నికలు సమీపిస్తుండగా దుందుడుకుగా వ్యవహరించడంలోని హేతుబద్ధతను, లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.  
 టి. లక్ష్మీనారాయణ,  డెరైక్టర్  నీలం రాజశేఖరరెడ్డి  పరిశోధనా కేంద్రం
 

No comments:

Post a Comment