Tuesday, March 11, 2014

పదవుల వేటలో నేతలు - నిర్వేదంలో జనం

March 12, 2014   సూర్య దినపత్రిక
అధికారాన్ని చెరబట్టే పనిలో పెద్ద పార్టీలు
ప్రాతినిథ్యం కోసం చిన్న పార్టీల ఆరాటం
అవకాశాలకోసం నేతల కప్పదాట్లు
భవిష్యత్తుపై ఆశతో కొత్త పార్టీలు
రాష్ట్రంలో మూడేళ్ళుగా అనిశ్చితి
కుదిపిన విభజన, సమైక్య ఉద్యమాలు
రాష్ట్ర రాజకీయాలు అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అధికారాన్ని చెర బట్టే పనిలో పడ్డాయి. చిన్న మధ్య తరహా పార్టీలు చట్టసభల్లో ప్రాతినిథ్యం కోసం పోరు చేయడానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయంగా అభద్రతా భావంలో ఉన్న కాంగ్రెస్‌, తెదెపా నాయకులు కప్పదాట్లకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. ప్రజల మనోభావాలను సొమ్ము చేసుకో వాలనే ఆరాటంలో పార్టీలున్నాయి. ప్రజల నిజ జీవితాలపై ప్రభావం కలిగించే అంశాలు మాత్రం ఎన్నికల అజెండాగా రూపొందే అవకాశాలు కనపడడం లేదు. గడచిన ఐదేళ్ళుగా కేంద్రంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.పి.ఎ.-2 ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వెన్ను విరిచాయి. అవినీతి అందలమెక్కి, దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా అథఃపాతాళానికి కూరుకుపోయింది. మన రాష్ట్రంలో అయితే అసలు ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానాల మధ్య కాలం గడచి పోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, సమైక్యాంధ్ర పరిరక్షణ నినాదాలతో ఇటు అటు ఉద్యమాల వేడితో తెలుగు నేల అట్టుడికి పోయింది. మంత్రి మండలి సమష్ఠిగా పని చేయలేదు. చట్ట సభలైన్‌ శాసన సభ, శాసన మండలి సమావేశాలను సహితం సజావుగా నిర్వహించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఐదేళ్ళు గతించాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ గాడితప్పాయి. ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా పనిచేసే విద్యుత్‌ శాఖకు మంత్రివర్యులు లేకుండానే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ప్రజలు మౌలిక సమస్యలతోనే కాదు, దైనందిన, తక్షణ సమస్యలకు సైతం ఉపశమనం లభించక తల్లడిల్లి పోతున్నారు. ఈ విచిత్ర పరిస్థితి నడుమ పురపాలక, నగర పాలక సంస్థలకు, లోక్‌ సభ, శాసన సభకు ఏక కాలంలో ఎన్నికల ప్రకటనలు ముంచుకొచ్చాయి. గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లు యం.పి.టి.సి.- జెడ్‌.పి.టి.సి. ఎన్నికలను కూడా నిర్వహించి తీరాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం హుకుం జారీ చేసింది. నేడు తెలుగు జాతి ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఒకవైపున ఎన్నికలు, మరొక వైపున రాష్ట్ర విభజనలో కీలకమైన పంపకాల ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో, అచేతనావస్థలో ఉన్నారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న నానుడిగా రాజకీయ పార్టీల తీరు తెన్నులున్నాయి. రాష్ట్ర విభజనాంశం రాజకీయ పార్టీ డొల్లతనాన్ని, దివాలాకోరు తనాన్ని బట్టబయలు చేసింది. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధపడి ప్రదర్శిస్తున్న విన్యాసాలు ప్రజలకు జుగుప్సాకరంగా ఉన్నాయి.వే సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగు జాతి- నైజాం నవాబుల ప్రజా కంటక పాలనలో, తెల్లదొరల పాశవిక పాలనా కాలంలో ముక్క చెక్కలై దుర్భర జీవితం గడిపింది. సమగ్రాభివృద్ధి సాధించడానికి యావత్తు తెలుగు జాతి ఒకే పరిపాలనా వ్యవస్థ కింద ఉండాలనే మహదాశయంతో ఇరవైవ శతాబ్దం తొలినాళ్ళలో నాటి తరం ప్రారంభించిన ఉద్యమం, దశాబ్దాల సమరశీల పోరాటాలు, అపార త్యాగాలతో తెలుగు జాతి ఆశాసౌధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1956 నవంబరు 1న ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఎన్నో ఒడుదుడుకులు, సమస్యలు, అడపా దడపా విచ్ఛిన్నకర ఆందోళనల మధ్య దాదాపు ఆరు దశాబ్దాల పాటు కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబంగా జీవనం సాగిస్తూ, పురోగమిస్తున్న తెలుగు జాతిలో దురదృష్టవశాత్తు విభేదాలు పొడచూపాయి. అవకాశవాదం, స్వార్థ రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు, కడకు- కండ బలం పైచేయి సాధించాయి. రాజ్యాంగ స్ఫూర్తి మంట గలిచింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడం జరిగిపోయింది. పార్లమెంటు ప్రతిష్ఠకు తీవ్ర కళంకం తెచ్చిపెట్టిన గొడవలు, తీవ్ర నిరసనల హోరు మధ్య భిన్నధృవాలుగా ఉన్న పాలక పార్టీ అయిన కాంగ్రెస్‌- ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిజెపి నిస్సిగ్గుగా ఒక్కటై రాషా్టన్న్రి రెండు ముక్కలు చేయాలన్న బిల్లుకు మూజువాణి ఓటుతో ప్రాణం పోశాయి. స్వాతంత్య్రానంతర కాలంలో రాషా్టల్ర పునర్వ్యవస్థీకరణ నిమిత్తం ఏర్పడిన మొదటి కమిషన్‌ సిఫార్సు మేరకు ఆవిర్భవించిన ప్రథమ భాషా ప్రయుక్త రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయంతో- మిగిలిన భాషా ప్రయుక్త రాషా్టల్ర విభజనకు తెరƒలేచింది. ఆ రెండు పార్టీలపై అత్యధిక తెలుగు ప్రజానీకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికిన పూర్వరంగంలోనే ప్రస్తుత ఎన్నికల సమరం ప్రారంభమయ్యింది. ఆ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు మళ్ళీ ప్రత్యర్థులుగా కత్తులు నూరుకొంటున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో ఆందోళనలకు నాయకత్వం వహించిన పార్టీలు, పోటీలు పడి మద్దతు పలికిన పార్టీలు, పచ్చి అవకాశవాద వైఖరి ప్రదర్శించి చతికిలబడ్డ జాతీయ, ప్రాంతీయ పార్టీలు- ఈ ఎన్నికల వేళ ప్రజలను వంచించడానికి రోడ్డెక్కాయి. తమ సోనియమ్మే రాషా్టన్న్రిచ్చిందని కాంగ్రెస్‌, తాము లేకపోతే రాష్ట్రం వచ్చేదే కాదని బి.జె.పి., తానే రాషా్టన్న్రి సాధించానని కె.సి.ఆర్‌., మా నాయకుడు ఉత్తరం ఇవ్వబట్టే రాష్ట్రం వచ్చిందని తెదేపా- తెలంగాణ ప్రాంతంలో సిగపట్లు పట్టుకొంటున్నాయి.
తెరాసా విలీనంతో ఈ ఎన్నికలలో సునాయాసంగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవచ్చని కలలు గన్న కథ అడ్డం తిరగడంతో కాంగ్రెస్‌ పరిస్థితి- కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే, తెలంగాణ రాష్ట్ర సాధన అంశాన్నే పెద్ద ఎత్తున మార్కెట్‌ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని, అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని ఇప్పుడు వివిధ పార్టీలు విఫలయత్నం చేస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్ర విభజనను ప్రతిఘటిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా లెక్కలేనితనంతో వ్యవహరించి, తెలుగు జాతిని అడ్డగోలుగా ముక్కలు చేసిన హేయమైన చర్యను జీర్ణించుకోలేని వాతావరణం ఆ ప్రాంతంలో ఉన్నది. ప్రజలు నిరాశ నిస్పృహలతో రాజకీయ పార్టీలపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. కాకమీదున్న ప్రజలను వంచనతో మభ్యపెట్టాలనే కుటిల నీతితో కాంగ్రెస్‌, బి.జె.పి. రెండూ ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడుగా ఉండి, రాష్ట్ర విభజనలో క్రియాశీలక పాత్ర పోషించిన జయరాం రమేష్‌- ప్రజాగ్రహాన్ని చవిచూస్తూనే, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ, విభజనకు తానూ వ్యతిరేకినేనని, సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ప్రకటించామని మభ్యపెట్టే మాటలతో సీమాంధ్ర ప్రజలను వంచింప చూస్తున్నారు. తాను రాజ్యసభలో నిల్చోవడంవల్లనే ఆ మాత్రం ప్యాకేజీఅయినా వచ్చిందని, వెనుకబడ్డ రాయలసీమ కడగండ్లను అసలు పట్టించుకోలేదని బి.జె.పి. నాయకుడు వెంకయ్య నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. అధికారాన్ని అప్పగిస్తే సీమాంధ్రను స్వర్గతుల్యం చేస్తామని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. లౌకికవాదంపై తమదే పేటెంట్‌ హక్కని ప్రకటించుకొనే కాంగ్రెస్‌, హిందుత్వవాదమే తమ ఊపిరి అని సగర్వంగా ప్రకటించుకొనే బి.జె.పి. పార్లమెంటు వేదికగా అపవిత్ర కూటమిగా ఏర్పడి ప్రదర్శించిన వింత రాజకీయ విన్యాసాలను తెలుగు జాతే కాదు, యావత్తు భారత జాతి వీక్షించి, అసహ్యంతో నిట్టూర్పులు విడుస్తున్నది. నీచంగా మారిన రాజకీయ చదరంగంలో తెలుగు జాతిని బలి పశువును చేసింది చాలక, ఓట్ల రాజకీయంలో పై చేయి సాధించాలని పడరాని పాట్లు పడుతున్నారు. ఆ రెండు పార్టీలు కూడబలుక్కొని పార్లమెంటు సాక్షిగా తెలుగు జాతి భవిష్యత్తుకు సమాధి కట్టాయని కోస్తాంధ్ర, రాయలసీమ జనం భావిస్తున్నారు. అధికారమే పరమావధిగా బతుకుతున్న పార్టీలు ఎవరేమనుకొంటే తమకేమి సిగ్గు అన్న తీరులో వ్యవహరిస్తూ ఓట్ల వేటలో తలమునక లవుతున్నాయి.
చిన్న రాషా్టల్ర భావజాలానికి అనుకూలమని ఒకరు, వ్యతిరేకం కాదని మరొకరు చెప్పుకొంటూ భారత రాజ్యాంగ మౌలిక లక్షణమైన సమాఖ్య వ్యవస్థ మూలాలపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఆ దుర్నీతి రాజకీయాల మొదటి గొడ్డలి పెట్టు తెలుగు జాతిపై పడింది. ఓట్లు, సీట్ల కోసం ప్రజలను నిలువునా చీల్చడానికి, అనుబంధాలను విచ్ఛిన్నం చేసి శతృత్వానికి ఆజ్యం పోయడమే రాజకీయమన్నట్లు రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. భారత రాజ్యాంగం మౌలికంగా సమాఖ్య వ్యవస్థను పరిరక్షించే అత్యంత శక్తిమంతమైనదిగా నేటి వరకు పౌరులందరూ విశ్వసిస్తూ వచ్చారు. సామాజికాభివృద్ధికి అనుగుణంగా సముచితమైన సవరణలు చేసుకొంటూ, రాజ్యాంగాన్ని సమున్నతంగా అభివృద్ధి చేసుకొంటూ అడుగులు ముందుకు వేయాల్సిన తరుణంలో రాజ్యాంగంపై ప్రజలకు విశ్వాసం సడలిపోయేలా రెండు జాతీయ ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ పార్లమెంటులో శాసనం చేసిన తీరుతెన్నులు ప్రజాస్వామ్యం పైన, సమాఖ్య వ్యవస్థ మనుగడపైన విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతున్నదన్న అనుమానాలు రేకెత్తాయి. జాతీయ పార్టీలను నమ్ముకొంటే నట్టేట ముంచుతాయని, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవడం ద్వారా కనీసం రాజకీయ ఒత్తిళ్ళతో కొంతైనా ఊరట పొందవచ్చనే ఆలోచన ప్రజల్లో బలపడుతున్న సూచనలు కనబడుతున్నాయి.
బలమైన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో ఇప్పటికే జాతీయ పార్టీల పట్టు సడలిపోయింది. రెండు పార్టీల వ్యవస్థను కోరుకొంటున్న కాంగ్రెస్‌, బి.జె.పి. కనీసం తమతమ నాయకత్వాల్లోని రెండు కూటముల వ్యవస్థనైనా నెలకొల్పుకోవాలని ఉబలాట పడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చేస్తున్న కార్పొరేట్‌ రంగం కూడా ఈ శక్తులకే వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ఈ శక్తులు విజయం సాధించడమంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత బలంగా వేళ్ళూనుకోవడానికే దోహదపడుతుంది. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సరళీకృత ఆర్థిక విధానాల అమలు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా విజ్ఞతతో ఓటర్లు ఆలోచించి, దేశ ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తుకు బరోసా ఇవ్వగలిగిన శక్తులను గుర్తించి ఆదరించాలి, దుష్టశక్తులకు కీలెరిగి వాత పెట్టాలి.


No comments:

Post a Comment