Monday, November 10, 2014

కమ్యూనిస్టుగా పేదల పక్షాన నిలబడ్డందుకు .....



ఓ భూ పోరాట అనుభవం

హైదరాబాదు మహానగరంలో గుడిసెవాసుల గూడు కోసం జరిగిన ఉద్యమమది .
దానికి పోలీసులిచ్చిన‌ బహుమానం; తీవ్రమైన‌ లాఠీ దెబ్బలు, పోలీసు తిట్లు, చిరిగిన బట్టలు.
ఆరున్నరేళ్ళకు కేసు నుండి విముక్తి.

అది 2007వ సంవత్సరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పట్టణ ప్రాంతాలలో నివేశన స్థలాలులేని పేదలు ప్రభుత్వ బంజరు భూములలో గుడిసెలను వేసుకోవాలని, గ్రామీణ‌ ప్రాంతాలలో భూమిలేని వ్యవసాయ కార్మికులు ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమించుకొని సాగు చేసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ భూ పోరాటానికి పిలుపిచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా హైదరాబాదు నగర శివారు ప్రాంతంలోని జవహర్ నగర్ పరిథిలోని ప్రభుత్వ బంజరు భూమిని దాదాపు వెయ్యి కుటుంబాలకు చెందిన పేదలు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొన్నారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా కటిక చీకట్లో అనేక మంది ఆ గుడిసెల్లోనే నివాసం ఉండేవారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వ‍ం కక్ష గట్టింది. ఎలాగైనా వారిని ఆ భూమి నుండి ఖాళీ చేయించాలన్న కృతనిశ్చయానికొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2007 సెప్టంబరు 13 వ తేదీ తెల్లవారు జామున 4-5 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు ఐదారు  వందల మంది స్పెషల్ పోలీసు దళాలను వెంటబెట్టుకొచ్చి, ప్రొక్రైనర్లను మరియు బుల్ డోజర్లను ఉపయోగించి గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. అడ్డొచ్చిన గుడెసవాసులపై స్త్రీ పురుష భేదం లేకుండా లాఠీలను ప్రయోగించి, చెదరగొట్టారు.
ఆ ఘటనకు సంబంధించిన‌ సమాచారాన్నిసి.పి.ఐ. రాష్ట్ర సమితి, నాటి కార్యదర్శికి రంగారెడ్డి జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చేరవేసింది. ఘటనా స్థలానికెళ్ళి పార్టీ తరుపున‌ బాధితులకు మద్దతు తెలియజేయమని ఆయన నన్ను పురమాయించాడు. నా వెంట ఎ.ఐ.యస్.ఎఫ్. జాతీయ సమితి పూర్వ‌ అధ్యక్షుడు కా.మురళి కూడా వచ్చాడు. మా కోసం ఎదురుచూస్తున్నసిపిఐ జిల్లా కార్యదర్శి యన్. బాలమల్లేష్ నాయకత్వంలోని దాదాపు వంద మంది కార్యకర్తలు వెంటరాగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులకు సంఘీభావం ప్రకటించడానికి ఉదయం 9 గంటల ప్రాంతంలో వెళ్ళాం. అక్కడే మకాం వేసి ఉన్న‌ పోలీసు దళాలు ఆ ప్రాంతాన్ని పహారాకాస్తున్నాయి. అయినా లెక్కచేయకుండా కూలగొట్టబడిన‌ గుడిసెల వద్దకు చేరుకొన్నాము. తమ‌ కష్టార్జితంతో నిర్మించుకొన్నగుడిసెలను పోలీసులు ధ్వంసం చేయడంతో బాధిత మహిళలు హృదయ విదారకంగా రోధిస్తున్నారు. ప్రభుత్వ దుర్చర్యను ఎండకడుతూ కార్యకర్తల నినాదాలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించాయి.
ఘటనా స్థలానికి మేము చేరుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన‌ ప్రత్యేక పోలీసు బలగాలు రేసు కుక్కల్లా పరుగు పరుగున వచ్చి కసిగా మాపై దాడి చేశాయి. పైబర్ లాఠీలతో ఇష్టం వచ్చినట్లు బాదారు. ఆ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నానని పసిగట్టిన‌ ఒక పోలీసు ఉన్నతాధికారి నన్ను టార్గెట్ చేసి దాడికి పూనుకొన్నాడు. స్పెషల్ పోలీసులు, రెగ్యులర్ పోలీసులు వారి భాషలో తిట్లదండకాన్నిఅందుకొన్నారు. నాపై పిచ్చికుక్కల్ల్లా పడి చొక్కా చించేసి, ఫ్యాంటు లాగేయడానికి ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలు అడ్డుపడి, లాఠీ దెబ్బలను లెక్కజేయకుండా నన్ను రక్షించడానికి శతవిధాల ప్రయత్నించారు. ఆ తోపులాటలో పక్కనే ఉన్న గుంతలో పడిపోయాను. సుమారు పది మంది కార్యకర్తలు నాపై పడ్డారు. అయినా పోలీసు మూకలు వదిలి పెట్టకుండా పైబర్ లాఠీలతో మోదుతూనే ఉన్నారు. నా నడుము విరిగిపోతుందన్నంత తీవ్రమైన‌ వత్తిడికి గురయ్యాను. ఇంతలో ఒక పోలీసు ఆధికారి జోక్యంతో అప్పటికే అలసి పోయి ఉన్న‌పోలీసులు కాస్తా వెనక్కు తగ్గి మమ్మల్ని అరెస్టు చేసి ఆల్వాల్ పోలీస్ స్టేషనుకు తరలించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నయోదు చేశారు.
అటుపై కొన్నిగంటల తరువాత రక్తమోడుతున్న‌గాయాలతో బాధపడుతున్న‌నన్ను, మరికొందరు కామ్రేడ్స్ ను సమీపంలో ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రాథమిక పరీక్షలు, చికిత్స చేయించారు. ఇంత జరిగినా బాధ కలగలేదు. పేద ప్రజల కోసం ప్రాణాలకు తెగించి నిలబడ్డామనే తృప్తి కలిగింది. కానీ నన్ను పురమాయించి పంపిన పెద్దమనిషి రాత్రి 7 గంటల తరువాత మరి కొంత మంది సహచర‌ నాయకులను వెంటబెట్టుకొని తాఫీగా పోలీసు స్టేషన్ కు వచ్చి పరామర్శించారు. పైపెచ్చు వారి ఆలస్యానికి కారణం తెలిశాక మనసు నొచ్చుకొన్నది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏదో ఘటన జరిగింది. అక్కడికెళ్ళి ఆ పార్టీ నాయకులకు సంఘీభావం తెలియజేసి రావలసి వచ్చిందని ముక్తాయింపుగా వివరణ ఇచ్చారు. భావజాల రీత్యా వర్గ శత్రువులుగా పరిగణించబడే వారికిచ్చిన ప్రాధాన్యత ఉద్యమంలో భాగంగా పోలీసు లాఠీఛార్జీలో తీవ్రంగా గాయపడి పోలీసు స్టేషన్ లో నిర్భందించబడిన‌ ఉద్యమ‌ సహచరులకు ఇవ్వకపోవడం బాధకలిగించే అంశమే కదా!
పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి ఆ రోజు రాత్రి 10 గంటల తరువాత మేజిస్ట్రేట్ ముందు మమ్ములను హాజరుపరిచారు. బేయిల్ వచ్చే అవకాశం లేదని మా తరుపున హాజరైన న్యాయవాది అభిప్రాయపడ్డారు.   చిరిగిన బట్టలతో నీరసించిన ముఖాలతో ఉన్నమమ్ములను విద్యుత్ దీపాల వెలుగులో చూసిన మేజిస్ట్రేట్ హృదయం ద్రవించిందేమో తెలియదు కానీ మాకు సొంత పూచికత్తుపైనే బెయిల్ మంజూరు చేశారు.
ఆ కేసు మేడ్చల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆరున్న సంవత్సరాల పాటు కొనసాగింది. మధ్యలో వాయిదాలకు హాజరు కావడంలేదని నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ కావడంతో తరువాత ఆరుగురు బాధితులం (నాతో పాటు మురళి, బాలమల్లేష్, క్రిష్ణమూర్తి, నరసింహ) కోర్టు వాయిదాలకు హాజరయ్యాం. సుధీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్టు చివరకు మాపై మోపిన కేసును 2014 మార్చి 24న కొట్టివేసింది. గుడిసెవాసుల కోసం ఇన్ని కష్టాలు, బాధలుపడినా పేదలకు ఆ ఇళ్ళ స్థలాలు మాత్రం దక్కలేదు. మా పోరాట ఫలితంగా కొంత మంది పేదలకు ఆ ప్రక్కనే స్థలాలను మంజూరు చేశారని పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఆ పేదల్లో అత్యధికులు నేడు కమ్యూనిస్టు పార్టీని అంటిపెట్టుకొని లేకపోవడం బాధ కలిగించే పరిణామం. ఆ ఉద్యమ స్మృతులు గుర్తుకొచ్చినప్పుడు "బిడ్డ దక్కలేదు కానీ బొడ్డు చుట్టూ మచ్చలు మాత్రం మిగిలాయి" అన్న లోకోక్తి గుర్తుకొస్తున్నది. 
******************************************************************************
చిరిగిన బట్టలతో ఉన్న నా ఫోటోతో పాటు నాటి భూ పోరాట దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు విశ్లేషణాత్మకమైన‌ వార్తను సెప్టంబరు 15, 2007న‌  ఈనాడు దినపత్రిక, హైదరాబాదు ఎడిషన్, మొదటి పేజిలో ప్రముఖం గా ప్రచురించింది . ఆనాటి వార్త ఇదే.
మాటలే తూటాలు
చేతులే లాఠీలు

ఇవి పోలీసు దెబ్బలు పైకి కనిపించకు‍డా కొడతారు
చొక్కాలు చించడమూ ఒక భాగం
నేతలపై తిట్లు, పిడిగుద్దులతో దాడి
హత్య, హత్యాచారం కేసులు
భూ ఉద్యమాలపై కొత్త వ్యూహం

(రంగారెడ్డి జిల్లా కౌకూర్ వద్ద రెండ్రోజుల కిందట గుడిసెల తొలగింపును అడ్డుకోబోయిన సిపిఐ నేత లక్ష్మీనారాయణ చొక్కా చించేస్తున్న పోలీసులు)


వారు పోలీసులు తుపాకులు తీసుకురారు. లాఠీలు తెస్తారు. కానీ ... పెద్దగా ఉపయోగించరు. ఇంకేం చేస్తారంటే... చేతులు మాత్రమే వాడతారు. పైకి కనిపించకుండా 'పోలీసు దెబ్బలు' కొడతారు. బయటి వారికి తెలియకుండా లోలోపల కుళ్ళబొడుస్తారు. మాటలతో ఎత్తిపొడుస్తారు. చొక్కాలు చించుతారు. అర్థరాత్రి వెళ్ళి హెచ్చరిస్తారు. అవమానిస్తారు. నిరసన ప్రదర్శనలు, భూ ఉద్యమాలను ఎదుర్కొనేందుకు పోలీసులు అనుసరిస్తున్న కొత్త వ్యూహమిది. ముదిగొండ కాల్పుల అనంతరం పోలీసులు 'ఇంతగా మారిపోయారు' మరి.
భూ పోరాటాలను ఎదుర్కొనేందుకు గతంలో లాఠీలు, తుపాకులతో ప్రత్యేక పోలీసులు తరలివెళ్ళేవారు. వామపక్షనేతలు, కార్యకర్తలను లాఠీలతో చితకబాదేవారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా లాఠీలకు విశ్రాంతినివ్వలేదు. ముదిగొండ కాల్పుల తర్వాత కొంత ఇరకాటంలో పడ్డా... ప్రభుత్వం భూ పోరాటంపై కఠిన వైఖరే అవలంబించింది. కానీ ... ఉద్యమకారులపై కాల్పులు జరిపితే సంచలనం. లాఠీఛార్జి జరిపితే అది మీడియాలో క్రూరంగా, హేయంగా కనిపిస్తుంది. ఏం చేసినా ... ఉద్యమకారులనూ భయపెట్టాలి. పోలీసు యంత్రాంగం దీనిపై చర్చించింది. ఒక వినూత్న వ్యూహాన్ని రూపొందించింది. అధికారికంగా ఉత్తర్వులివ్వకపోయినా ... దీనికి సంబంధించి మౌకిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ సరికొత్త వ్యూహంలో ... మాటలే తూటాలు. చేతులు కాళ్ళే లాఠీలు. ఇక్కడ లాఠీఛార్జి జరగదు. కానీ ... కార్యకర్తలు గాయపడతారు.
తిట్టు ... కొట్టు ... కొత్త విధానం ప్రకారం ... పోలీసులు భూ పోరాటంలో పాల్గొంటున్న నేతలు, ముందుండి నడిపిస్తున్న వారిని లక్ష్యంగా పెట్టుకొంటారు. రెండు రకాలుగా 'దాడి'కి దిగుతారు. ఒకటి ... నోటితో తిట్టడం. రెండు ... కాళ్ళు చేతులతో కొట్టడం. 'ఇవి ప్రభుత్వ భూములు మీరెవర్రా ఆక్రమించేందుకు' అన్న స్థాయిలో తిడతారు. అరెస్టయ్యేందుకు, లాఠీదెబ్బలు తినేందుకు సిద్దపడిన నేతలు ఈ మాటల దాడి నుండి కోలుకొనేలోపే ... పోలీసులు హఠాత్తుగా మీదపడి వారి చొక్కాలు చించడం వంటివి చేస్తారు. అదే సమయంలో ఆందోళనకారులపై పిడిగుద్దులు కురిపిస్తారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇదే వ్యూహం అమలు చేశారు. కౌకూర్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ తదితరులు సుమారు వ్రెయ్యి మందితో భూ ఆక్రమణ పోరాటానికి దిగారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు నేతలను తూలనాడుతూ, లక్ష్మీనారాయణ దుస్తులు చింపేశారు. ఆయన్నే లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు. పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడ్ద 10 మంది రెండురోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. నెల రోజుల క్రితం గర్భసంచి శస్త్రచికిత్స చేయించుకొన్న ఓ మహిళ కడుపుపైనా పోలీసులు కొట్టారు.


No comments:

Post a Comment