Thursday, February 12, 2015

హిందుత్వం, కార్పోరేటీకరణపై తొలి దెబ్బ‌

డిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలపై భిన్న కోణాలలో విశ్లేషణలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాలలో ఇదొక‌ మూల మలుపుగా అభివ‌ర్ణించబడుతున్నది. రాజ్యాంగ ముఖపత్రంపై లిఖించబడిన‌ "సామ్యవాదం , లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం" లక్ష్యాలను విడనాడి సంక్షేమ రాజ్యం స్థానంలో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేస్తున్న విధానాలపైన, హిందుత్వ భావజాలంతో దూకుడు ప్రదర్శిస్తున్న సంఘ్ పరివార్ కూటమి విద్వేష పూరిత విధానాలపైన‌ దేశ రాజధానీ నగర ప్రజానీకం తమకు ప్రజాస్వామ్య వ్యవస్థ దఖలు పరచిన 'ఓటు' ఆయుధాన్నిసమర్థవంతంగా ఎక్కుపెట్టారనడంలో నిస్సందేహం. ప్రజలు తలచుకొంటే తమ‌ ఓటు హక్కుతో రాజకీయ పార్టీల, నాయకుల తల రాతలను మార్చగలరని మరొకసారి పునరుద్ఘాటించారు. ప్రత్యర్థి పార్టీలు అత్యంత బలహీనంగా ఉన్నాయని, ఇష్టారాజ్యంగా పాలన చేయవచ్చని తలపోస్తూ, గర్వంతో విర్రవీగుతున్ననరేంద్ర మోడీ చూపులను సామాన్యులు ఒక్క దెబ్బతో క్రిందికి దించారు.
డిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయ పార్టీలకు గొడ్డలి పెట్టు. డిల్లీ శాసన సభ ఎన్నికలు బిజెపికి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యనే హోరా హోరీగా సాగాయి. లోక్ సభ ఎన్నికలు, అటుపై వివిధ రాష్ట్రాల‌ శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా మూడు నాలుగు స్థానాలకు నెట్టి వేయబడిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తేమిటన్న అంశం చుట్టూ చర్చను మళ్ళించడం ద్వారా మోడీని రక్షించే పనిలో కొందరు పడ్డారు. చచ్చిన పామును కొట్టినట్లు కాంగ్రెస్ ధీనావస్థపై సాగించే చర్చల వల్ల దేశానికి కలిగే ప్రయోజనమేంటి? కాంగ్రెస్ పార్టీ ప్రజల సోదిలోనే లేదు. నేడు దేశాన్నేలుతున్న పార్టీ బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన్ను ఉపయోగించుకొని దేశ‌ సంపదను కొల్లగొట్టి గుట్టలు గుట్టలుగా పోగేసుకొనే పనిలో నిమగ్నమైన వారు కార్పోరేట్ దిగ్గజాలు, మోడీని తడికెగా వాడుకొని హిందుత్వ భావజాలాన్ని దేశంపై రుద్దే కార్యాచరణలో ఉన్నవారు రాష్ట్రీయ‌ స్వయం సేవక్ మరియు దాని అనుబంధ సంస్థలు, డిల్లీ ఎన్నికల ఫలితాలు ఆ శక్తులపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయన్నదే నేటి ప్రశ్న.
డిల్లీ ప్రజానీకం న‌రేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా జట్టుకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కుట్రలు, కుతంత్రాలు, కులాల సమీకరణ, మత రాజకీయాలు, అధికారం, ధన బలం, ప్రసారమాధ్యమాల అండదండలతో ఎన్నికల్లో గెలిచి, దేశంపై పెత్తనం చేయవచ్చనుకొంటున్న దుష్ట శక్తులకు డిల్లీ ఓటర్ల తీర్పు శరాఘాతం వంటిది. హిందుత్వవాద శక్తుల దూకుడుకు 'స్పిడ్ బ్రేక్'. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ వ్యాప్తంగా పడి బిజెపి విస్తరణ వ్యూహానికి అడ్డుకట్టపడే అవకాశాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. తద్వారా కాషాయ దళం ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. లోక్ సభలో ఆధిక్యత ఉన్నా రాజ్యసభలో మైనారిటీలో ఉన్న మోడీ సర్కార్ కు ఇక్కట్లు తప్పేలా లేవు. మోడీ పోకడలను మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్న‌ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, అసంతృప్తివాదులకు కూడా ఈ ఫలితాలు కాస్తా ఊరటనిచ్చి ఉండవచ్చు.
మోడీకి మొదటి దెబ్బ: మోడీ అధికార పగ్గాలు చేబట్టి ఎనిమిది మాసాలు గడచి పోయాయి. నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ సానుకూల ఫలితాలనే సాధించుకొన్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలలో అధికారంలోకి బిజెపి వచ్చింది. జమ్మూ & కాశ్మీర్ లో పిడిపి తో కలిసి అధికారాన్ని పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ వరవడిని కొనసాగిం చుకొంటూ పోయి రానున్న కాలంలో బీహార్ తదితర రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని వ్యూహాలు పన్నుతున్నారు. తద్వారా పెద్దల సభ అయిన రాజ్యసభలోనూ ఆధిక్యాన్ని సంపాదించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఆ లక్ష్యాన్ని కూడా చేరుకొంటే తమ రాజకీయ అజెండాను శరవేగంతో అమలు చేయడానికి అడ్డొచ్చే శక్తే ఉండదని ఊహల్లో తేలిపోతున్న నేపథ్యంలో డిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలు చెంప చెళ్ళుమనిపించాయి. దేశ ప్రజలను పునరాలోచనలో పడేటట్లు చేశాయి. 'యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్' అన్న‌ ఆంగ్లంలోని నానుడిని జనం గుర్తు చేసుకొంటున్నారు. మోడీ మాటలు ఘనంగా ఉన్నాయే గానీ ఆచరణ శూన్యం అన్న భావన ప్రజల్లో రోజు రోజుకూ బలపడుతున్నది. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, అందరితో కలిసి ... అందరి కోసం పని చేద్దాం, వగైరా వినవింపుగా ఉన్న నినాదాలిస్తూ, వాటికి మంచి మార్కెటింగ్ ప్రచారకర్తగా మాత్రమే మోడీ తయారయ్యాడని భావిస్తున్నట్లు డిల్లీ  ప్రజలు కోడై కూశారు.
డిల్లీ వీధుల్లో మోడీ చారిస్మా వెలవెల పోయింది. ఆకర్షణీయమైన మోడీ ఫోటోలు, ప్రలోభపెట్టే వాగ్ధానాలతో, కోట్లు కుమ్మరించి  పత్రికలు, టీవిల్లో అడ్వర్ టైజ్ మెంట్స్ ద్వారా హోరెత్తించే ప్రచారం చేసుకొన్నాడిల్లీ ఓటర్లు ఎలాంటి ప్రభావానికి లోనుకాలేదు. మోడీ, అమిషాతో పాటు నలబై మందికిపైగా కేంద్ర మంత్రులు, దాదాపు నూటాయాభై మంది పార్లమెంటు సభ్యులు, పదుల వేల సంఖ్యలో బిజెపి మరియు ఆర్.యస్.యస్. కార్యకర్తలు ఎంత‌ శ్రమటోడ్చినా ఫలితం దక్కలేదు. 
మోడీ మీద గంపెడాసలు పెట్టుకొన్న‌ మధ్యతరగతి ప్రజానీకం 'డైనమిక్' గా మారారు. ఆయన కార్పోరేట్ సంస్థల‌ సేవలో తరిస్తున్నాడని, సామాన్యుల ఈతి బాధలు ఆయనకు ఏ మాత్రం పట్టలేదని, అవినీతి రహిత సుపరిపాలన అందిస్తానని, దేశ సరిహద్దులు దాటిపోయి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తానని, నిరుద్యోగులకు ఉపాథి కల్పిస్తానని లాంటి చాలా హామీలిచ్చిన మోడీ వాటిని నేడు మరిచారని, పైపైచ్చు మత విద్వేషాలను రెచ్చగొడుతున్న దుష్ట శక్తుల చర్యలను నిలవరింప చేయకపోగా నోరు మెదపడం లేదని, రాజ్యాంగ బద్ధమైన ప్రధాన మంత్రి పదవిలో ఉంటూ కూడా పరోక్షంగా ఆ శక్తులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే భావానికి డిల్లీ ఓటర్లు ప్రధానంగా వచ్చారు. దానికి కారణాలు లేక పోలేదు. 
రాముని సంతానమో! అక్రమ సంతానమో! తేల్చుకోవాలని కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి అనాగరిక వ్యాఖ్యలు చేసినా ఆమెను మంత్రివర్గంలో కొనసాగించారు. భారత రాజ్యాంగాని కంటే గీత గ్రంథం శ్రేష్టమైనదని మరో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యాంగాన్ని అవమానించే తీరులో వ్యాఖ్యానించినా మాట వరసకు కూడా ఖండించలేదు. హిందూ స్త్రీలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తూ పది మంది దాకా కనాలని బిజెపి పార్లమెంటు సభ్యులు నోరు పారేసుకొన్న స్పందన లేదు. భారత దేశం హిందూ దేశమేనని, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనని అసంబద్ధమైన మాటలను ఆర్.యస్.యస్. మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పదే పదే వల్లిస్తున్నా వాటిపై నోరు విప్పలేదు. క్రైస్తవ ప్రార్థనాలయాలను తగులబెట్టడం, దాడులు చేయడం లాంటి దుష్ట చర్యలను అరికట్టక పోవడం, ఖండించక పోవడం మోడీకే చెల్లింది. కడకు గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ‍ విడుదల చేసిన అడ్వర్ టైజ్ మెంట్స్ లో రాజ్యాంగ ముఖపత్రంపై ఉన్న సామ్యవాదం, లౌకిక వ్యవస్థ అన్న పదాలను తొలగించి విడుదల చేసినా పట్టించుకోక పోవడాన్ని బట్టి మోడీ వీటన్నింటినీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్థిస్తున్నాడన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. 
అందుకే కాబోలు లోక్ సభ ఎన్నికల్లో మోడీకి జై కొట్టిన మధ్యతరగతి ఓటర్లు డిల్లీ శాసన సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ల పంట పండించారు. బిజెపికి 2013 శాసనసభ ఎన్నికల్లో 31 స్థానాలు, 33.02% ఓట్లు వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఏడుకు ఏడు స్థానాలు, 46.63% ఓట్లు వచ్చాయి. 2015 శాసన సభ ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లో గెలిచి 32.2% ఓట్లను నిలబెట్టుకొన్నది. లోక్ సభ ఎన్నికలతో పోల్చి చూస్తే 14.43% ఓట్లను కోల్పోయింది. సాంప్రదాయకంగా తమ ఓటు బ్యాంకుగా ఉన్న‌ ట్రేడర్స్ కమ్యూనిటీని నిందించే రీతిలో ప్రవర్తించడం ద్వారా వారిని కేజ్రివాల్ కు మద్దతిదారులుగా బిజెపి మార్చింది. ప్రజల పక్షాన నిలిచిన‌ అరవింద్ కేజ్రీవాల్ ను అరాచకవాదిగా, నక్సలైట్ గా మోడీ అభివర్ణించడాన్ని డిల్లీవాసులు ఛీదరించుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2013 శాసన సభ ఎన్నికల్గొన్నా కేవలం 8 స్థానాలకు పరిమితమై 24.55% ఓట్లను పొందింది. అటుపై లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.15.22% ఓట్లకు కుదించబడింది. ఈ ఎన్నికల్లో పూర్తి నిరాకరణకు గురైన ఆ పార్టీ శాసన సభలో ప్రాతినిథ్యానికి కూడా నోచుకోలేదు. అవమానకరంగా 9.7% ఓట్లకు నెట్టివేయబడింది. లోక్ సభ ఎన్నికల‌తో పోల్చి చూస్తే 5.52% ఓట్లు కోల్పోయింది. అందుకే కాంగ్రెస్ మళ్ళీ కోలుకొని బతికి బట్టకట్టగలదా! అన్న చర్చకు మరొక సారి తెరలేచింది.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ  అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అవినీతి రహిత సుపరిపాలన, సామాన్యులకు అందుబాటులో నిత్యావసర వస్తువుల ధరలు, రక్షిత‌ త్రాగును, విద్యుత్ కంపెనీల అక్రమార్జనకు అడ్డుకట్ట వేసి సరసమైన ఛార్జీలకు విద్యుత్తు సరఫరా, మహిళలకు భద్రత, మురికివాడల అభివృద్ధి వగైరా మాటలను డిల్లీ ప్రజలు విశ్వసించారు. దానికి ప్రాతిపదిక లేకపోలేదు. 2013 ఎన్నికల తదనంతరం రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్న 49 రోజుల్లో ఆయన అనుసరించిన విధానం, తీసుకొన్న నిర్ణయాలు, అమలు చేసిన పనులు, కార్పోరేట్ సంస్థల దోపిడీని ఎండగట్టడం, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం లాంటి అనుభవాలున్నాయి. అధికార పీఠాలను కాపాడుకోవడానికి కన్నగడ్డి మేయడానికైనా సిద్ధమౌతున్న రోజుల్లో తాను నమ్మిన రాజకీయాల కోసం అవకాశవాదానికి ఏ మాత్రం తావివ్వకుండా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన ఘటన ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నది. ఆ చర్య దుందుడుకు చర్య అని కొందరు విమర్శించినా, కేజ్రీవాల్ అది తప్పేనని అంగీకరి‍చి పక్షాత్తాపం వ్యక్తం చేసి ఈ దఫా ఐదేళ్ళూ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పినా ప్రజలు దాన్ని త్యాగంగానే భావించినట్లుంది. అందుకే కేజ్రీవాల్ చిత్తశుద్ధిని ప్రజలు శంకించ లేదు. డిల్లీలోని దాదాపు 60% ప్రజానీకం నివసించే 'జగ్గీ'లని పిలువబడే మురివాడల్లో మంచి నీరు, డ్రైనేజీ సౌకర్యాలు తదితర మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న పేద ప్రజలు, అసంఘటిత కార్మికులు, బీహార్ - ఉత్తర ప్రదేశ్ - పంజాబ్ తదితర‌ రాష్ట్రాల నుండి వలస వచ్చిన‌ కార్మికులు ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకొన్నారు. 
బిజెపి మత రాజకీయాల పట్ల అప్రమత్తమైన మైనారిటీ మతస్తులు  బిజెపికి డిల్లీలో నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీనేనని గుర్తించారు. మత, కుల రాజకీయాల పట్ల వ్యతిరేకత ప్రదర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు 13% గా ఉన్న ముస్లింలు, 1%గా ఉన్న క్రైస్తవులు మొగ్గు చూపారు. ఎప్పుడూ కాంగ్రెసుకు ఓటు బ్యాంకుగా ఉండిన ఈ తరగతి ప్రజల మద్ధతు కూడా తోడు కావడంతో ఆప్ సముద్ర కెరటంలా ఎగిసిపడింది. స్వచ్చ భారత్ పేరుతో ఛీపురును లాగేసుకొందామని కలలుగన్న మోడీ ఆశలపై నీళ్ళు చల్లుతూ, బిజెపిని తన పుల్లల ఛీపురుతో డిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఊడ్చేసింది. ఆ పార్టీ 2013 శాసన సభ ఎన్నికల్లో 28 స్థానాలు, 29.49% ఓట్లు సాధించుకొంటే, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవక పోయినా 33.08% ఓట్లను తన ఖాతాలో జమ చేసుకొన్నది. ఈ ఎన్నికల్లో ఏకంగా 67 స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించి 54.3% ఓట్లను రికార్డు స్థాయిలో సంపాదించుకొన్నది. లోక్ సభ ఎన్నికలతో పోల్చి చూస్తే  21.22% ఓట్లను అదనంగా పొందింది. దీన్ని బట్టి లోక్ సభ ఎన్నికలలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు కోల్పోయిన ఓట్లలో అత్యధిక భాగాన్ని తన ఖాతాలోకి మళ్ళించుకో గలిగింది. దీని వెనుక అరవింద్ కేజ్రీవాల్, ఆయన సహచర బృందం, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు గడచిన ఏడాది ఏడాదిన్నరగా చేసిన కఠోర శ్రమ ఇమిడి ఉన్నదన్న నిప్పులాంటి నిజాన్ని మరచిపోకూడదు.

ఇద్దరూ గాంధేయవాది అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగించబడిన‌ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఇద్దరూ సహచర ఉద్యమకారులే. నిన్నటి డిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరైన‌ కిరణ్ బేడీ ఎన్నికల సమరంలో చతికల బడితే, కేజ్రివాల్ విజయకేతనం ఎగరేశారు. అవకాశవాద రాజకీయాలకు డిల్లీ ప్రజలు బుద్ధి చెప్పాలను కొన్నారు. ఫలితం కిరణ్ బేడీ అనుభవించారు. అపఖ్యాతిని మూటగట్టుకోక తప్పలేదు. పార్టీలు పిరాయించిన వారికీ తగిన శాస్తే చేశారు. యు.పి.ఎ.ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకురాలుగా మంత్రి పదవి వెలగబెట్టి ఎన్నికల సందర్భంగా బిజెపిలో చేరి పోటీ చేసిన క్రిష్ణ తిరత్ లాంటి వారికీ తగిన బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికలను నిశితంగా విశ్లేషిస్తే గెలుపోటములకు సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక కారణాలు చాలానే కనపడతాయి.

                                                     

No comments:

Post a Comment