Monday, February 16, 2015

మాటలకు కొదవ లేదు...మరి చేతలో!



ప్రచురణ: పిబ్రవరి 17, 2015  సూర్య దినపత్రిక‌

భారత పరివర్తన జాతీయ‌ సంస్థ(నీతి) ఆయోగ్ పాలక మండలి ప్రథమ సమావేశంలో ప్రధాని నరేంద్ర‌ మోడీ మాట్లాడుతూ 'అందరితో కలిసి...అందరి వికాసం కోసం' జట్టుగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపిచ్చారు. నినాదం బాగానే ఉన్నది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కాళ్ళు ఇరగ్గొట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడలేని నికృష్టమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టారు. జవసత్వాలను కూడగట్టుకొని ఇతరులతో సరిసమానంగా ప్రగతి మార్గంలో పరిగెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసం విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, రాజ్యసభ వేదికగా నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ నిర్దిష్టంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమలు చేయాలి.
రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అదోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకు పోయింది. రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించిన బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ. కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి సముచిత‌ రీతిలో న్యాయం చేయకుండా కాలం వెళ్ళబుచ్చితే కాంగ్రెసుకు పట్టిన గతే నేటి పాలకులకూ పడుతుందన్న మాట ప్రజల నోట వినిపిస్తున్నది. అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచారు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. వర్ణనాతీతమైన కష్టాల  పాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కాలరెగేస్తూ పార్లమెంటు సభామందిరాల ద్వారాలు మూసేసి, మైకులు ఆపేసి, గొంతులు నొక్కేసి విభజన చ‌ట్టం ఆమోదించబడిందని ప్రకటించుకొన్నారు. ఆ అప్రజాస్వామిక చట్టాన్నైనా గౌరవించి విభజనతో తీవ్రంగా నష్టపోయిన‌ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాస్తా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందేమో! అనుకొంటే రిక్త హస్తం చూపెట్టే దోరణి కనబడుతున్నది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, రాష్ట్ర రాజధానీ నిర్మాణానికి నిథులు, రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఆర్థిక సహాయం వగైరా చట్టబద్ధమైన హామీలిచ్చారు. దుష్టపాలన సాగించిన‌ కాంగ్రెసు పార్టీకి ప్రజలు రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్నందించినా, కష్టాల కడలి నుండి గట్టెక్కడానికి బిజెపి చేయూతనిస్తుందని ప్రజలు గంపెడాశ పెట్టుకొన్నారు. రాష్ట్రంలో తెలుగు దేశంతో కలిసి బిజెపి అధికారంలో ఉన్నదని, బిజెపితో జట్టుగట్టి టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది, కాబట్టి కొంతైనా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు గడచి పొయాయి.  కేంద్ర మంత్రులు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయ్! కానీ అడుగు గడప దాటడం లేదు అన్న నానుడిగా ఆచరణ ఉన్నది.
దీన్ని ఆర్థిక ప్యాకేజీ అనగలమా?: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 లోని సెక్షన్ 46(2), (3) మేరకు ఆంధ్రప్రదేశ్ కు తోడ్పాటునందించడానికి,  వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉన్నదని చెబుతున్నా ఆచరణలో దగాకోరుతనం కనబడుతున్నది. వెనుకబడిన ఏడు జిల్లాలలో అభివృద్ధి పనుల నిమిత్తం 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రు.50 కోట్లు చొప్పున రు.350 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసే అవకాశం ఉన్నదని, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వనరుల స్థితిగతులపై అంచనా వేసి, 2014-15 కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర‌ రాబడి వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన అంశంపై సిఫార్సులు చేయమని అంతర్ మంత్రిత్వ శాఖల సంయుక్త కమిటీని గృహ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ తాత్కాలికంగా రు.500 కోట్ల మేరకు తోడ్పాటును ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తున్నట్లు 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మరియు పన్ను రాయితీలు" ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ పిబ్రవరి 4వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది.
విభజన చట్టంలోని సెక్షన్ 94(1) మేరకు రెండు రాష్ట్రాలలో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి వీలుగా పన్ను రాయితీలతో పాటు ద్రవ్య‌ పరమైన చర్యలను అమలు చేయాల్సిన బాధ్యత‌ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని గుర్తు చేసుకొంటూనే ఒకటి, రెండు నామమాత్రపు ప్రోత్సాహాలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర‌ వెనుకబడిన ప్రాంతాలలో తాయారీ రంగంలో పరిశ్రమలను నెలకొల్పితే నూతన ప్లా౦ట్ మరియు యంత్రాలపై మొదటి ఏడాదిలో 15% అదనపు తరుగుదల రాయితీ కల్పించబడుతుంది. అలాగే  రానున్న ఐదేళ్ళ కాలంలో ఎప్పుడు నూతన పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టినా 15% అదనపు పెట్టుబడుల అలవెన్సు రాయితీ ఇవ్వబడుతుందని, రు.25 కోట్లకు తక్కువగా పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఇది వర్తిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహ విభాగం పరిశీలనలో మరికొన్ని ప్రతిపాదనలున్నట్లు ముక్తాయింపు పలుకు కూడా  పలికారు.
కనీసం రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన మేరకు మరియు చట్ట సభ అయిన రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి హోదాలో డా.మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్ధానాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన‌ కార్యాచరణకు పూనుకొని, అవసరమైన నిథుల కేటాయించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. తబ్ధిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రనిరాశ కల్గిస్తూ, అరకొర నిథుల కేటాయింపు, పారిశ్రామికాభివృద్ధి పేరుతో లోపభూయిష్టమైన ఒకటి, రెండు నామమాత్రపు రాయితీలతో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన జుగుప్సాకరంగా ఉన్నది. దీనిపై రాష్ట్ర ముఖ్యమ‍ంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీని కలిసి మాట్లాడితే విభజన చట్టంలో పేర్కొన్న, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలు, అన్నింటినీ గౌరవిస్తున్నామని, అమలు చేస్తామని మరొకసారి హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ మాత్రం నోరువిప్పి ఒక్క మాట మాట్లాడడ‍ం లేదు. ఈ పరిణామాలను గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించాల్సి ఉన్నదని స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశాయని, తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని చెబుతూ ఈ సమస్యను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా పొందడానికి ఈ రాష్ట్రానికి అసలు అర్హత ఉన్నదా! అన్న సంశయాన్ని కొందరు బిజెపి నేతలు ప్రసార మాధ్యమాల చర్చల్లో వ్యక్తం చేస్తున్నారు. అంటే పరోక్షంగా అర్హతలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గారే ప్రత్యేక హోదా అంశంపై బహిర‍ంగంగా మాట్లాడడానికి స్వస్తి చెప్పాలని తమ మిత్రపక్షమైన టిడిపికి పత్రికాముఖాన‌ హితబోధ చేశారు. రంగాల‌ వారిగా కేంద్ర మంత్రిత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపుకొని ఆర్థిక సహాయం కోసం ప్రయత్నాలు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశం లేదనే విషయాన్ని అన్యాపదేశంగానే సెలవిస్తున్నారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా? రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో మరే రాష్ట్రమైనా ఉన్నదా? ఇంత కంటే హేతుబద్ధమైన కొలబద్ధ మరొకటి కావాలా? పచ్చగా కళకళ లాడుతున్న రాష్ట్రాన్ని రాజకీయ కారణాలతో నిట్టనిలువునా చీల్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తుంది? ఇతర రాష్ట్రాలు అభ్యంతారాలు లేవనెత్తుతాయన్న అంశం విభజన‌ చట్టానికి మద్దతు పలికినప్పుడు తెలియదా? విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ప్ర‌త్యేక హోదా కల్పించడానికి ఏ శక్తి అడ్డగా నిలవగలదు. ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలు అవరోధంగా ఉంటే వాటిని సవరించైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం వారి బాధ్యత.
వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసింది. రు.24,500 కోట్ల అంచనా వ్యయంతో ఒక అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించిందని చెప్పబడుతున్నది. ఏడు జిల్లాల్లో 347 మండలాలున్న ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రాకేజీ అంటూ కేవలం జిల్లాకు రు.50 కోట్లు చొప్పున‌ రు.350 కోట్లు కేటాయి‍చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ నామమాత్రపు నిథులతో ఏ పాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? పైపెచ్చు 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చింది. వాటిని ఖర్చు చేస్తారా లేదా అన్న సందేహం రావడం సహజం. వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి, దాని అమలుకు ఏ మేరకు నిథులను వెచ్చించాల్సి ఉంటుంది, ఏ గడువు లోపు అమలు చేసి నిర్ధేశిత లక్ష్యాలు సాధించాలనే ఆలోచనే చేయకుండా కంటి తుడుపు చర్యగా భిక్షమేసినట్లు అరకొర నిథులను కేటాయిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం.
అలాగే, వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో తయారీ రంగంలో నూతనంగా పరిశ్రమలు, నూతన యంత్రాలను నెలకొల్పితే 15% అదనపు తరుగుదల రాయితీని ఐదేళ్ళ పాటు కల్పిస్తామని, పెట్టుబడులపై కూడా 15% పన్ను రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. ఐదేళ్ళ గడువు అన్నదే ఆచరణాత్మకం కాదు. ఈ గడువులోపు నూతన పరిశ్రమలు నెలకొల్పి ఈ రాయితీలు ఉపయోగించుకోవడం సాధ్యమా! కాదా! అన్న అంశాన్ని ప్రక్కనబెడితే ఈ తరహా రాయితీలతో వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమేనా! అన్నది ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర స్థానం విశాఖపట్నం. ఆ నగరాన్ని ఇన్పర్మేషన్ టెక్నాలజీకి హబ్ గా మారుస్తానని, ఐ.టి. రంగాన్ని అభివృద్ధి చేయడం వల్లనే హైదారాబాదు ఈనాడు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మహానగరంగా వెలిగిపోతున్నదని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. తిరుపతిని ఐ.టి.కేంద్రంగా మారుస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క తయారీ రంగానికే ఈ కాస్త రాయితీలను కూడా పరిమితం చేస్తే ఐ.టి. రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ ముందుకొస్తుంది?
స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటును రానున్న మూడు నాలుగేళ్ళలో ఏడెనిమిది శాతానికి తీసుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తున్నది. ఆ వృద్ధి రేటును సాధించాల‍ంటే రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జి.యస్.డి.పి.) కూడా వేగంగా పెరగాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి అతిముఖ్యమైన రాష్ట్రం తీవ్రమైన‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే దేశం ఎలా నిర్ధేశిత వృద్ధి రేటును సాధించగలదు? జాతి ప్రయోజనాల దృష్ట్యా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయట పడవేసి, ప్రగతి బాట పట్టించడానికి యుద్ధ ప్రాతిపదికపై కార్యాచరణ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ సంస్థను నెలకొల్పింది. దాని తొలి సమావేశంలో పాల్గొన్న‌ ఆర్థిక నిపుణులు ప్రయివేటు రంగంపైనే ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఆశించిన వృద్ధి రేటును సాధించ గలమని విస్పష్టమైన సూచనలు చేసినట్లుగా ప్రసారమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. వాటిని మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
కరవు కాటకాల మధ్య చిక్కిశల్యమవుతున్న రాయ‌లసీమ ప్రాంతం ప్రధానంగా మెట్ట వ్యవసాయంపై ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. ప్రయివేటు రంగంలోనే పరిశ్రమలను ప్రోత్సహిస్తామంటే ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి మిథ్యగానే మిగిలిపోతుంది. ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి భారీ పరిశ్రమ లేదు. ప్రభుత్వ రంగం అభివృద్ధితోనే హైదరాబాదు అభివృద్ధి చెందింది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలి. కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీని నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజీలో దాని ఊసే ఎత్తలేదు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికాభివృద్ధికి నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి.  త్రాగడానికి, సాగు నీళ్ళ కోసం ప్రజలు నిరంతరం ఆకాశం వైపు ఎదురు చూసే దుస్థితిలో ఉన్న ఈ ప్రాంతలో పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత అతిపెద్ద సమస్య. కాబట్టి నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాలి. తాగు, సాగు, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నీటిని గోదావరి - క్రిష్ణా - పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు అందించాలి. ఈ అంశాలతో పాటు విద్య, వైద్య, పర్యాటక తదితర రంగాల అభివృద్ధి ప్రాతిపదికపై సమగ్రాభివృద్ధికి ప్రణాళికను రూపొందించి, రానున్న నాలుగైదేళ్ళ కాలంలో అమలు చేయడానికి వీలుగా కేంద్ర వార్షిక బడ్జెట్స్ లో నిథులను కేటాయించి, ఖర్చు చేయాలి. అప్పుడే వెనుకబడిన‌ ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యo నెరవేరుతుంది.
రానున్న కేంద్ర బడ్జెట్ లో నిథులను కేటాయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ప్రస్తుత వేతనాలనే చెల్లించడానికి ఖజానాలో డబ్బుల్లేని దుస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పదవ వేతన స‍ంఘ‍ం సిఫార్సుల మేరకు జీతాలు పెంచితే పడే భారాన్ని భరించే స్థితి లేదు. అందు వల్ల ఐదేళ్ళ పాటు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని రెవెన్యూ లోటును పూర్తిగా కేంద్రం భర్తీ చేయాలి. రాజధానేలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి అభివృద్ధికి తోడ్పాటునందించాలి, అన్ని హంగులతో కూడిన‌ రాజధాని నిర్మాణానికి అవసరమైన నిథులను పూర్తిగా కేంద్రమే భరించాలి. వెనుకబడిన ప్రాంతాల్లో నెలకొల్పే నూతన పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను 15% నుండి స్పెషల్ క్యాటగిరీ రాష్ట్రాలలో ఇస్తున్న మేరకు ఇవ్వాలి. అలాగే ఒక్క తయారీ రంగానికే కాకుండా సేవా రంగం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, పర్యాటక‌ రంగానికి కూడా వర్తింప చేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క భవిష్యత్తుకు బరోసా ఇచ్చినట్లవుతుంది.    
                                                                                                                                   

No comments:

Post a Comment