Monday, May 11, 2015

రాజకీయం గెలిచింది ! నైతిక విలువలు అటకెక్కాయి !



అవినీతి కేసు నుండి జయలలిత బయటపడ్డారు. జయ మద్దతుదారుల ఆనందానికి అవదుల్లేవు. నీతివంతమైన, సుపరిపాలన  అన్నవి, సమకాలీన రాజకీయాల్లో చెల్లని కాసులు. అధికార బలం, బలగం ఉంటే అవినీతి కేసుల నుండి విముక్తి పొందడానికి పెద్దగా శ్రమపడాల్సిన పని లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే అన్ని పనులు వాటంతకి అవే సర్దుబాటు అయిపోతాయని మరొకసారి డంకా భజాయించి లోకానికి  చెప్పబడింది.
 తమిళనాట సొంతంగా వేళ్ళూనుకొందామని కాషాయ దళం పోయిన ఎన్నికల్లో శథవిధాల ప్రయత్ని‍ంచి విఫలమయ్యింది. జయ జయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో మాత్రం మోడీ అధికార పగ్గాలు చేబట్టారు. కానీ, రాజ్యసభలో భాజపా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నది. తన తాత్విక చింతనకు అనుగుణంగా చట్టాలను చేయడానికి రాజ్యసభలో ఆపసోపాలు పడుతున్నారు. ఉదా: భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును ప్రతిపక్షాలు ఒక్కటై అడ్డుకొంటున్నాయి. మరొక వైపు ప్రజల ఛీత్కారానికి గురైన కాంగ్రెసుకు లోక్ సభలో 10% స్థానాలు కూడా దక్కక పోవడంతో ప్రతిపక్ష స్థానం కూడా పొందలేక పోయింది. లోక్ సభలో ఉప సభాపతి స్థానానికి ప్రతిపక్షం నుండి ఒకరిని ఎన్నుకోవడం ఒక‌ సాంప్రదాయంగా వస్తున్నది. మోడీ వ్యూహలో భాగంగా ఆ స్థానానికి ఎ.ఐ.డి.యంో.కె. లోక్ సభ సభ్యులు శ్రీ యం.తంబిదురైని 2014 ఆగస్టు 13న‌ ఎన్నుకొన్నారు. తద్వారా మోడీ, జయ మధ్య అప్రకటిత రాజకీయ అనుబంధం చిగురించింది. మోడీ సర్కారుకు ఎ.ఐ.డి.యం.కె. 37 మంది సభ్యులతో మూడవ అతిపెద్ద పార్టీగా లోక్ సభలోను, 11 మంది సభ్యులతో రాజ్యసభలోను అనుకూలంగా వ్యవహరిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే 2014 సెప్టంబరులో జయ అవినీతి కేసుపై విచారణ చేసిన‌ ప్రత్యేక న్యాయ స్థానం ఆమెకు శిక్ష విధించింది. ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది. ప్రత్యేక న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమె కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ రాజకీయ పక్షాల మధ్య ఏర్పడిన అనుబంధం యొక్క ప్రభావం మన లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రత్య‌క్షంగానో, పరోక్షంగానో మిగిలిన వ్యవస్థలపైన ఎంతో కొంత మేరకు పడుతుందన్న నిప్పు లాంటి నిజాన్ని చరిత్ర ద్వారా తెలుసు కొంటూనే ఉన్నాం. తాజా కేసు దానికి మినహాయింపని ఎవరైనా భావిస్తే అప్పులో కాలేసినట్లే అవుతుందేమో!
ఎంత దుర్మార్గులైనా వారు మరణించగానే అయ్యో! పాపం అన్న సానుభూతి చూపించే  గొప్ప భారతీయ‌ సమాజంలో మనం నివసిస్తున్నాం. జయలలితకు శిక్ష పడినప్పుడు కూడా కొందరు అమాయకంగా అరే! లక్షల కోట్ల కుంభకోణాలు జరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కేవలం 66 కోట్ల అక్రమాస్తుల సంపాదనా కేసు నుండి బయటపడ లేక పోయిందే! ఒక వంద కోట్లు లంచం పడేసి తప్పించుకొని ఉండవచ్చు కదా! అన్న రీతిలో వ్యాఖ్యానాలు నాడు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోకి వచ్చాయి. అంటే నేటి సమాజం అవినీతి, అక్రమాల పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నదో గమనించవచ్చు. డి.యం.కె.అధినేత కరుణానిథి గారాలపట్టి టెలికం కుంభకోణం(2జి) కేసులో జైలు కెళ్ళివస్తే  తమిళనాట ఆమెకు లభించిన స్వాగత సత్కారాలు చూశాం. మన రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి అనుభూతులు ఉండనే ఉన్నాయి.
ఇప్పుడు అవినీతి కేసు ను‍ండి బయటపడిన జయకు కూడా తమిళనాట ఆమె మద్ధతుదారులు భ్రహ్మరథం పట్టవచ్చు. తమిళనాట జయ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బలహీనంగా ఉండడమే కాకుండా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్ననేటి రాజకీయ వాతావరణాన్ని మంచి అదునుగా భావించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమూ జయ చేయవచ్చు.
కర్నాటక హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడమే కాదు, తాను కడిగిన ముత్యం లాంటి దానినని తమిళనాడు ప్రజల నుండి తీర్పును కోరుతున్నానని జ‌య ముందస్తు ఎన్నికలకు వెళ్ళనూ వచ్చు. తద్వారా ఐదేళ్ళ పాలనా పగ్గాలను చేజిక్కించుకొనే రాజకీయ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అత్యమంగా నీతి, నియమాలు, నైతిక విలువలు నేటి సమాజంలో సమాధి కట్టబడుతున్నాయి. ఆ మేరకు ఈనాటి సమాజం నాణ్యత కోల్పోతున్నది.
 

No comments:

Post a Comment