Wednesday, May 27, 2015

మోడీ - మన్మోహన్ భేటీ మ‌తలబేంటి?


మోడీ ప్రస్తుత ప్రధాన మంత్రి, మన్మోహన్ మాజీ ప్రధాన మంత్రి. ఇరువురు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు. ఇరువురూ కార్పోరేట్ రంగానికి నిఖార్సైన ఏజెంట్లన్న భావన ప్రజల్లో నెలకొని ఉన్నది. ఆరు నూరైనా అగ్రహారం పాడైనా 2013 భూసేకరణ చట్టానికి మౌలికమైన సవరణలు చేసి తీరుతానని భీకర ప్రతిజ్ఞ చేసిన మోడీ పట్టువిడవని విక్రమార్కునిలా రెండు సార్లు ఆర్డినెన్సులు జారీ చేశారు. రెండు సార్లు ప్రతిపాదిత బిల్లును లోక్ సభ ఆమోదంరతో రాజ్యసభకు పంపారు, పెద్దల సభ అడ్డుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో సభా సంఘానికి 'రెఫర్' చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల ప్రారంభం నాటికి సభా సంఘం నుండి అనుకూలమైన నివేదికను తెప్పించుకొని పార్లమెంటు ఉభయ సభల ఆమోద ముద్ర వేయించుకోవడానికి మోడీ పావులు కదుపుతున్నారనడానికి ప్రబల నిదర్శనం మన్మోహన్ ను తేనీటి విందుకు ఆహ్వానించడమే అన్నది సుస్పష్టం.
బొగ్గు కుంభకోణంలో ఇరుక్కొని, విచారణను ఎదుర్కొ‍ంటున్న మన్మోహన్ నిర్ధోషిగా బయటపడి, మసక బారి పోయిన ప్రతిష్టను కాస్తోకూస్తో పున:ప్రతిష్టించుకోవాలన్న మనోవేద‌నలో ఆయనున్నారు. ఏడాది పాలన సంబరాలు జరుపుకొంటున్న‌ మోడీ వ్యూహాత్మకంగా తేనీటి విందుకు ఆహ్వానించగానే మన్మోహన్ రెక్కలు కట్టుకొని వాలి పోయారు. ఆర్థిక సంస్కరణల అమలు తీరు తెన్నులపై, విదేశాంగ విధానాలపై మాత్రమే వారు ముచ్చటించుకొన్నారన్న అనధికార వార్తలను ప్రచారంలో పెట్టినా, ప్రస్తుత ప్రధాన మంత్రి మరియు తాజా మాజీ ప్రధాన మంత్రి మధ్య జరిగిన సమావేశం లోగుట్టుపై సందేహాలు, అనుమానాలు రావడం సహజమే కదా!
పైపెచ్చు, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై, తీవ్రసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. మనుగడ కోసం క్రిందా మీదా పడుతున్నది. నైరాశ్యానికి గురైన రాహుల్ గాంధీ కొ‍ద్ది రోజులు సెలవుపై వెళ్ళి, తిరిగొచ్చాక మోడీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్నాడన్న ప్రచారాన్ని ప్రసారమాధ్యమాలు చేస్తున్నాయి. మోడీ ఏడాది పాలనకు సున్నా మార్కులు రాహుల్ యిస్తే! సున్నాగాడు మాట్లాడితే దానికి విలువేంటని వెంకయ్య ప్రతివిమర్శ చేశారు. ఈ పూర్వరంగంలో మన్మోహన్, మోడితో ఏకాంతంగా భేటీ అయి ముచ్చటించడం, బహిరంగంగా కాకపోయినా వ్యక్తి గతంగా అభినంధించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలను ఇవ్వదలుచుకొన్నారో! వారికే తెలియాలి.
కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా భూసేకరణ చట్టానికి ప్రతిపాదించబడిన‌ సవరణలకు భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష మద్ధతు తెలియజేసి పార్లమెంటు ఆమోదం లభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినా, బొగ్గు కుంభకోణం కేసు నుండి మోడీ ప్రత్యక్ష, పరోక్ష‌ సహకారంతో మన్మోహన్ బయట పడినా రెండు పార్టీల నిజస్వరూపం మరొకసారి బహిర్గతం అవుతుంది. మోడీ, మన్మోహన్ నిజాయితీ, విశ్వసనీయత ఏ పాటిదో కూడా వెల్లడవుతుంది. నేను ప్రధాన మంత్రిగా నా కు‍టుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ మేలు చేసే పనికి ఒడిగట్టలేదని మన్మోహన్ మోడీతో కలిసి 'టీ' త్రాగడానికి కొన్ని గంటల ముందు వాపోయారు. మోడీ పాలనతో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్నదన్న‌ ఆవేదనను కాంగ్రెస్ పార్టీ విధ్యార్థి విభాగం యన్.యస్.యు.ఐ. నిర్వహించిన సభలో మాట్లాడుతూ దేశ ప్రజలతో పంచుకొన్నారు. అంతలోనే మోడీతో ఆంతరంగిక చర్చలు జరపడం ద్వారా జాతిని వంచించడానికి రంగం సిద్ధమౌతున్నదేమోనన్న అనుమానాలు రేకెత్తడం సహజమే కాదా!

No comments:

Post a Comment