Sunday, August 9, 2015

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా: పార్లమెంటు విశ్వసనీయత ?

విభజనతో సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంజుకొని, బలమైన పునాదులపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి " ప్రత్యేక తరగతి హోదా"ను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్ట సభ అయిన‌ రాజ్యసభ వేదికగా వ్రాత పూర్వకంగా ఇచ్చిన హామీ అమలులో రెండు నాలుకల దోరణి ప్రదర్శిస్తుండడంతో ప్రజల్లో నిరాశ, నిస్పృహలు రోజు రోజుకూ బలపడుతున్నాయ‌నడానికి ప్రబల నిదర్శనం తిరుపతిలో ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని, నిప్పు పెట్టుకొని, ఆత్మహత్య చేసుకోవడం. ఈ ఘటన అత్యంత విషాదకరమైనది, హృదయ విదారకమైనది. వ్యక్తి గత సమస్యలకు గానీ, ప్రజలు లేదా సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలకు గానీ ఆత్మ‌హత్యలు ఏ మాత్రం పరిష్కారం కావు, కాబోవు. ప్రజల చైతన్యం, శక్తి సామర్థ్యాలు, సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో అవగాహన చేసుకొని, అంకిత భావంతో పోరాడి సాధించుకోవాలే గానీ ఆవేశాలకు లోనై, నిర్వేదంతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు.
రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకొచ్చాక నాలుక మడత పెట్టి మరొక మాట మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడ‍డం క్షమించరాని నేరం. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుక పోయింది. విభజనకు భేషరతు మద్దతు ఇచ్చిన బిజెపి అధికారంలోకొచ్చి, విభజన చట్టంలో పేర్కొన్న మరియు రాజ్యసభ వేదికగా వ్రాత పూర్వకంగా నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదనే భావన ప్రజల్లో బలపడే తీరులో వ్యవహరించడం తీవ్ర గర్హనీయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ విజ్ఞత, చిత్తశుద్ధి ప్రదర్శించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో సన్నగిల్లి పోతున్న విశ్వాసాన్ని పునరుద్ధించాలంటే చట్టాలు, చట్ట సభల వేదికగా ఇచ్చిన వాగ్ధానలకు కట్టుబడి, త్వరితగతిన అమలు చేయాలి. రాష్ట్ర‌ విభజనతో ఆర్థికంగా, పారిశ్రామికంగా తీవ్ర వెనుకబడిన రాష్ట్రంగా బలవంతంగా మార్చబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవలసిన నైతిక బాధ్యత, రాజ్యాంగ బద్ధమైన కర్తవ్యం కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ బాధ్యతను విస్మరించి, వ్యవహరిస్తే కాంగ్రెసుకు పట్టిన గతే బిజెపికి పడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరంకుశంగా, అప్రజాస్వామికంగా విభజించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన రాజకీయ పార్టీలన్నీ చరిత్రహీనుల ఖాతాలో చేరిపోయాయి. ఇప్పటికైనా సంకుచిత, స్వార్థ‌ రాజకీయాలకు స్వస్తి పలికి, దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తే ప్రాయచిత్త‍ం చేసుకొన్న పార్టీలుగానన్నా కాస్త మిగులుతాయి.

3 comments:

  1. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే సామాన్య ప్రజలకు ఒరిగేదేమిటో నాకు అర్ధం కావడం లేదు. పెట్టుబడిదారులకు రాయితీ లిస్తే ఎల్లయ్య, మల్లయ్య బ్రతుకులెలా బాగుపడతాయి? డెల్టా రైతులకి నీళ్ళొస్తాయా? రుతువులు క్రమ పడతాయా? ఏ పెట్టుబడిదారీ విధానాలతో మనుగడే ప్రశ్నార్ధకం చేసుకున్నామో, ఆ చట్రం లోనే అభివృద్ధిని చూడడం శోచనీయం. దాని కోసం పోరాడడం లో శాస్త్రీయత ఎక్కడుంది? రాజకీయం ప్రజలను నిజమైన సమస్యలనుండి పక్క దారి పట్టిస్తున్నది.

    ReplyDelete
  2. Please read my article on this subject. It is available in my blog.

    ReplyDelete
  3. Please read my article on this subject. It is available in my blog.

    ReplyDelete