Tuesday, September 29, 2015

ప్రహసనంగా మారిన‌ రైతు రుణ మాఫీ పథకం



చిత్తూరు జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేశారు. ఆ రైతు ఆంధ్రా బ్యాంకు నుండి 2013 జనవరి 17న రు.95,000 పంట‌ రుణం తీసున్నారు. ఆ రుణం వడ్డీతో కలిపి రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధేశించుకొన్న(కటాఫ్ డేట్) 2013 డిసెంబరు 31 నాటికి రు.1,05,111 అయ్యింది. రు.1,50,000 వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తునట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం రు.50,000 లోపు రుణ మాఫీకి అర్హత‌ ఉన్న రైతులకు ఒకే దఫా రద్దు చేసింది. అంత కంటే ఎక్కువ రుణ‌ భారం ఉన్న‌ రైతులకు రు.1,50,000 వరకు ఐదు కంతుల్లో చెల్లిస్తామని ప్రకటించింది.  రుణ మాఫీ నిబంధనల ప్రకారం ఆ రైతుకు రు.1,38,320 మాఫీకి అర్హత ఉన్నదని ప్రభుత్వం పేర్కొన్నది. ఫలితంగా ఉన్న‌ మొత్తం రు.1,05,111(అసలు రు.95,000 + 10,111 వడ్డీ) రుణ మాఫీకి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం వెబ్ సైట్ లో కూడా పెట్టింది. అందులో ఐదవ వంతు రు.21,142 లను మొదటి కంతు క్రింద‌ బ్యాంకులో డిపాజిట్ కూడా చేసింది. మరో నాలుగు కంతుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఇంత వరకు బాగానే ఉన్నది.
పంట రుణాలపై 4% వడ్డీని మాత్రమే బ్యాంకులు వసూలు చేసుకోవాలి. కానీ, బ్యాంకులు అమలు చేస్తున్న‌ విధి విధానాల ప్రకారం రైతు తీసుకొన్న రుణం చెల్లింపు గడువు ముగిసిన నాటి నుండి 12% వడ్డీ వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందన్న విశ్వాసంతో రైతులు తాము తీసుకొన్న రుణాన్ని గడువు లోపు చెల్లించలేదు. నేడు అమలు చేస్తున్న అసమగ్రమైన‌ రుణ మాఫీ పథకంతో బ్యాంకుల నుండి రైతులకు కొత్త‌ చిక్కొచ్చి పడింది.  'లోన్ రెన్యూ' చేసుకోమని బ్యాంకు సిబ్బంది రైతుల‌పై వత్తిడి చేస్తున్నారు. నాతో మాట్లాడిన రైతుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రు.21,142 లను బ్యాంకు వడ్డీ క్రింద జమ చేసుకొన్నది. అసలు రుణం, అపరాధ‌ వడ్డీ కలిపి ఇంకా రు.1,09,200 చెల్లించాలని, వెంటనే రు.9,200 చెల్లించి, మిగిలిన రు.1,00,000 రుణాన్ని, కొత్త రుణంగా మార్చుకోమని(లోన్ రెన్యూ) అంటే బుక్ అడ్జస్ట్ మెంట్ చేసుకోమని బ్యాంకు సిబ్బంది ఆ రైతు వెంట పడుతున్నారు. బ్యాంకు సిబ్బంది వత్తిడికి త‌లవొగ్గి ఇప్పటికే చాలా మంది రైతులు వారు చెప్పినట్లు 'లోన్ రెన్యూ' చేసుకొన్నారు. రుణ మాఫీకి అర్హత పొందిన మొత్తంపై బ్యాంకులు వసూలు చేస్తున్న 12% అపరాధ వడ్డీని కూడా చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి కదా?
ప్రభుత్వం చెల్లించే ఐదు కంతుల రుణ మాఫీ మొత్తాలను ఇలా బ్యాంకులు వడ్డీ క్రిందనే ఐదేళ్ళు జమ చేసుకొంటూ పోతే, ఇహ! రుణ మాఫీ పథకం వల్ల‌ రైతుకు జరిగే మేలేంటి? అంత్యమంగా రైతు తీసుకొన్న అసలు రుణం మొత్తాన్ని, అపరాధ వడ్డీతో కలిపి తానే చెల్లించుకొని, రుణ విముక్తుడు కావలసిన‌ విధిలేని దుస్థితి ఏర్పడుతుంది కదా? ఈ పథకం వల్ల యాతావాతా జరుగుతున్నదేమిటి? ప్రభుత్వం ప్రజాధనాన్ని రైతు రుణ మాఫీ పథకం పేరిట బ్యాంకులకు రైతులు చెల్లించాల్సిన‌ వడ్డీల మొత్తాన్ని మాత్రమే చెల్లించే బాధ్యత తీసుకొన్నట్లవుతుంది. ఈ పథకం వల్ల‌ కేవలం రు.50,000 లోపు రుణ భారం ఉన్న రైతులకు మాత్రమే విముక్తి లభించిందన్న మాట‌. మిగిలిన రైతులను ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టి, మానసిక వత్తిడికి గురి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్యాంకు అధికారుల వత్తిడికి తలవొగ్గి "లోన్ ను రెన్యూ" చేసుకొంటే ఆ రుణం కాస్తా కొత్త రుణంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ మాఫీ పథకం అసలు వర్తిస్తుందో! లేదో!, మిగిలిన నాలుగు కంతులను ప్రభుత్వం బ్యాంకుకు జమ చేస్తుందో! లేదో! అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నా దృష్టికి వచ్చిన ఈ క్షేత్ర స్థాయి సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం, ఉపాధ్యక్షులు మరియు రుణ మాఫీ పథకం అమలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ సి.కుటుంబరావు దృష్టికి తీసుకెళ్ళాలను. బ్యాంకుల వల్లనే ఈ సమస్య ఉత్ఫన్నమవుతున్నదని, 'లోన్ రెన్యూ' చేసుకొన్న రైతులకు మిగిలిన నాలుగు కంతుల మొత్తాన్ని వారి రుణ ఖాతాలో జమ చేస్తామని, ఒక వేళ రైతే రుణం మొత్తాన్ని బ్యాంకుకు చెల్లిస్తే, అలాంటి రైతుల వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వివరణ ఇచ్చారు. ఈ సమస్యతో రైతులు ప్రభుత్వం, బ్యాంకుల మధ్య నలిగి పోతున్నారు.
ప్రభుత్వం జవాబుదారీతనంతో, పారదర్శకంగా వ్యవహరించకుండా రుణ మాఫీ పథకాన్ని ఒక ప్రహసనంగా మార్చి రైతాంగాన్ని అనిచ్ఛిత పరిస్థితుల్లోకి నెట్టేసింది. పర్యవసానంగా వడ్డీలు, అపరాధ వడ్డీల భారం రైతుల మీద పడింది. వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని చెల్లించని రైతాంగానికి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బాధ్యత గలిగిన ప్రభుత్వం మాఫీ చేసిన మొత్తం మేరకు బ్యాంకుకు బాండ్ల‌ రూపంలో పూచీ ఇచ్చి, ఆ మొత్తాన్ని చెల్లించే బాధ్యతను తీసుకొని, రైతును ఆ రుణ భారం నుండి విముక్తి చేసి, వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవసరమైన కొత్త రుణాలు తీసుకోవడానికి రైతులను అర్హులను చేయాలి. 'బుక్ అడ్జస్ట్ మెంట్స్' కాకుండా కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఒప్పించాలి. అప్పుడే రుణ మాఫీ పథకం అమలు వల్ల కొంత మేరకైనా అప్పుల ఊబిలో కూరుకపోయిన రైతాంగం ఊరట పొంది, వ్యవసాయాన్ని కొనసాగించడానికి వీలుకలుగుతుంది.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని, ఆత్మహత్యల పాలౌతున్న రైతాంగాన్ని ఆదుకొనే సదాశయంతో అమలు చేస్తున్న రుణ మాఫీ పథకం నిష్ప్రయోజనంగా మారడం గర్హనీయం. విభజనతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిన రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్న‌ప్పటికీ రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడం సాహసోపేత చర్యే. కానీ, పథకాన్ని ఆచరణాత్మకమైనదిగా, న్యాయబద్ధంగా రూపొందించి, అర్హులైన రైతులందరికీ ఒకేసారి అమలు చేసి ఉంటే సత్ఫలితాలు వచ్చేవి. దాదాపు యాభై లక్షల మంది రైతు కుటుంబాలకు, రు.24,500 కోట్ల రుణ మాఫీ చేశామని, ఇప్పటికే దాదాపు రు.7,500 కోట్లు బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రచార‍ చేసుకొంటున్నా రైతాంగానికి మాత్రం పూర్తి స్థాయిలో ఊరట కలిగించలేదు. రుణ మాఫీకి అర్హులైన రైతులు అనర్హులుగానో, పాక్షిక లబ్ధిదారులుగానో మిగిలిపోయి, దగా పడ్డామన్న భావనతో నిస్సహాయులుగా మిగిలి పోయారు. నకిలీ రైతులు, దళారీ రైతులు, అక్రమార్జన పరులు, చాలా మంది అనర్హులైన వారు ఈ పథకం వల్ల లబ్ధి పొందిన ఘటనలు లేక పోలేదు. అనేక అక్రమాలను ప్రసార మాధ్యమాలు వెలుగులోకి కూడా తీసుకొచ్చాయి.
కరువు పీడిత రైతులకు మొండి చేయి: రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి రూపొందించిన నిబంధనల మూలంగా మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఉద్యానవన పంటలకు ఎకరాకు రు.10,000 వరకు మాత్రమే రుణ మాఫీ, బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణం తీసుకొని ఉంటే అర్హతలేదని, వగైరా నిబంధనలు మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల రైతాంగంలో అత్యధికులకు రుణ మాఫీ పథకం వర్తించకుండా పోయింది. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీతాలతో బతుకు పోరు సాగిస్తూ, ఆరుగాలం, పురుగు పుట్రా అనకుండా శ్రమిస్తూ సమాజానికి వ్యవసాయోత్ఫత్తులను సరఫరా చేస్తున్ననిత్య‌ కరువు పీడిత రైతాంగంలో ఆశలు రేకెత్తించి, ఆచరణలో చెంపదెబ్బ, గోడ దెబ్బ అన్న నానుడిగా ప్రభుత్వం రైతాంగం నోళ్ళలో మట్టికొట్టిందన్న భావన ఆ ప్రాంతాల రైతుల్లో సర్వత్రానెలకొన్నది. పదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ళ పాటు కంటికి రెప్పలాగా పెంచుకొంటూ, కాపాడుకొంటూ వచ్చిన మామిడి, నిమ్మ వగైరా పండ్ల చెట్లు నిత్య కరువులకు మలమల మాడిపోయాయి. భూగర్భ జలాలు శర వేగంగా పతనమై పాతాళానికి చేరుకొంటున్నాయి. బోర్ల మీద ఆధారపడన రైతులు ఒకటి కాదు మూడు నాలుగు బోర్లు వేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినా రుణ మాఫీ పథకం వారికి వర్తించదు. కడప జిల్లా చిట్వేలి మండలానికి చెందిన రైతు ఒకరు ఫోన్ చేసి, మండలం మొత్తానికి ఏడు మందికి మాత్రమే రుణ మాఫీ అయ్యిందని చెప్పారు. కానీ, ఎకరా కోట్లు ధర పలుకుతున్న అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రం విశాల హృదయంతో రుణ మాఫీ పథకం క్రింద‌ ఒకే దఫా రు.1,50,000 ప్రభుత్వం చెల్లించింది. ఆ రైతులకు అలా న్యాయం చేయడాన్ని సమర్థించాల్సిందే. కానీ, రుణ మాఫీకి అసలు అర్హులైన మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల‌ రైతాంగానికి న్యాయం చేయడంలో వివక్ష చూపడం మాత్రం దారుణం. పైపెచ్చు రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన వన పంటలకు 'హబ్'గా తీర్చిదిద్దుతామన్న ప్రకటనలు గిప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వo కళ్ళు తెరిచి, రుణ మాఫీ పథకం అమలులో తలెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలి. అప్పుల ఊబిలో పీకల్లోతు మునిగి, ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్న రైతాంగానికి ప్రభుత్వం, సమాజం అండగా నిలబడుతుందనే విశ్వాసాన్ని పాదుకొల్పాలి. రైతాంగానికి రుణ విముక్తి కల్పించి, వారికి ఆర్థిక పరిపుష్టి కలిగేలా వ్యవసాయోత్ఫత్తులకు లాభదాయకమైన ధరలు లభించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించి, రాజకీయ సంకల్పంతో అమలు చేయాలి. ఈ చర్యలు ఆహార భద్రతను కల్పించుకోవడం కోసమే అన్న‌ భావన‌ సమాజంలో వెల్లివిరియాలి. అప్పుడు మాత్రమే యావత్తు సమాజం అభివృద్ధి వైపు అడుగు ముందుకు వేయగలదు. దాదాపు 70% మందికి జీవనాధారంగా ఉన్న‌ వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, కునారిల్లి పోతుంటే! మిగిలిన సమాజం అభివృద్ధి చెందుతుందని ఎవరైనా భావిస్తే, అది భ్రమగానే మిగిలిపోతుంది.

1 comment:

  1. మీరు రుణ మాఫీ పై రాసిన పోస్ట్ చాలా బాగుంది.రుణ గ్రస్తుల జాబితా సేకరించిన ప్రభుత్వం రక రకాలా నిబంధనలు పొందు పరచి మొత్తం రైతులలో 25 శాతం మందికే రుణ మాఫీ చేసామనిపిమ్చారు.మొత్తం రైతుల్లో 95 శాతం మంది అప్పుల్లో ఉన్నారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయిఅందులో 65 శాతం మంది మాత్రమె బ్యాంకులలో రుణాలు పొందారు.అంటే అందులో అర్హత ఉంది కూడా 70 శాతం మందికి రుణ మాఫీ కాలేదు..అది చూపించి రిజర్వు బ్యాంకును నచ్చ చెప్పాల్సిన అధికార యంత్రాంగం మొక్కుబడి తంతును ముగించింది.

    ReplyDelete