Friday, October 9, 2015

ఈటీవి ప్రతిధ్వని, అక్టోబరు 8: 'సాగరమాల...స్వర్ణాంధ్ర' శీర్షికతో నిర్వహించిన చర్చలో స్థూలంగా నేను వ్యక్తం చేసిన అంశాలు.




రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన రాష్ట్రంగాను, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంగా నెట్టివేయబడింది. ఈ నేపథ్యంలో అంది వచ్చే అన్ని అవకాశాలను అంది పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి పాటు పడాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర‌ ప్రభుత్వంపై ఉన్నది. ఆ కోణంలో పరిశీలించినప్పుడు 'సాగరమాల' ఒక అవకాశంగా పరిగణి‍చవచ్చు. ప్రస్తుతం ఉన్న విశాఖపట్న‍ం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులకు తోడు నూతనంగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిన బందరు, దుర్గరాజ‌పట్నం లేదా రామయపట్నం ఓడరేవులను, మిగిలిన చిన్నచిన్న ఓడరేవులను సద్వినియోగం చేసుకొని జల రవాణాను అభివృద్ధి చేసుకొంటే చౌకగా రవాణా సౌకర్యాలు లభిస్తాయి.
దేశానికి 7,000 కి.మీ. పైగా కోస్తా తీరం ఉంటే, అందులో ఆంధ్రప్రదేశ్ కు 960 కి.మీ. కోస్తా తీరం ఉన్నది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 9 జిల్లాలు సాగర‌ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సముద్ర తీరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. నేడున్న పోర్టులను అభివృద్ధి చేసుకోవడం, ప్రతిపాదిత‌ కొత్త పోర్టులను త్వరితగతిన‌ నిర్మించుకోగలిగితే ఉపాథి అవకాశాలు మెరుగవుతాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ, పర్యాటక రంగం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, కోస్తా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధి పర్యవసానంగా ఉపాథి కల్పన జరుగుతుంది.
సాగరమాల పథకాన్ని రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైలు మార్గాలతో అనుసంధానం చేస్తే బహుళ ప్రయోజనాలు పొందవచ్చు. ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం నుండి తమిళనాడు సరిహద్దులోని తడ వరకు, హైదరాబాదు నుండి పిడుగురాళ్ళ, అద్దంకి మీదుగా ఒంగోలు, హైదరాబాదు నుండి కర్నూలు, కడప మీదుగా చెన్నయ్, అనంతపురం మీదుగా బెంగుళూరు వరకు ఉన్న‌ జాతీయ రహదారులు  ఉన్నాయి. హౌరా - చెన్నయ్, తిరువనంతపురం, బెంగుళూరు, ముంబాయ్ - చెన్నయ్, డిల్లీ - చెన్నయ్ రైలు మార్గాలకు తోడు నిర్మాణంలో ఉన్న‌ న‌డికుడి - శ్రీకాళహస్తి, ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైలు మార్గాలను త్వరితగతిన పూర్తి చేసి సాగరామాల పథకంతో అనుసంధానం చేస్తే వెనుకబడిన ప్రాంతాలతో సహా మొత్తం ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుంది. పారిశ్రామికాభివృద్ధికి, ఉపాథి కల్పనకు ఉపకరిస్తుంది.
ప్రతిపాదిత సాగరమాల ద్వారా సముద్ర జల రవాణా మార్గం మరియు బకింగ్ హామ్ కెనాల్ ను పునరుద్ధరించడం ద్వారా యానాం నుండి కాకినాడ మీదుగా చెన్నయ్, పుదుచ్ఛేరి వరకు జల రవాణా సౌకర్యాలను అమలులోకి తీసుకురాగలిగితే రోడ్డు, రైలు మార్గాలపై దినదినానికి పెరుగుతున్న రద్దీ తగ్గుతుంది. తద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. లారీల ద్వారా సరుకు రవాణాకు రు.100 ఖర్చు అవుతుందనుకొంటే అవే సరుకులు రైలు మార్గంలో రవాణాకు రు.55, జల రవాణా ద్వారా అయితే కేవలం రు.25 ఖర్చు అవుతుందని నిపుణుల అంచనా. అంటే జల రవాణా చౌక.
అంతే కాదు భద్రత, పర్యావరణ కోణంలో కూడా మెరుగైనది. ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతం. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగకుండా నియంత్రించడానికి కూడా దోహదపడుతుంది. సరుకు రవాణా ఖర్చులు తగ్గితే ఆ మేరకు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు వీలవుతుంది. దేశానికీ ఆర్థిక ప్రయోజనం వనగూడుతుంది. ముడి చమురును అత్యధికంగా విదేశాల నుండి దిగుమతి చేసు‍కొంటూ ఆర్థికంగా తీవ్రమైన దోపిడీకి గురవుతున్నాము. డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరిగినప్పుడల్లా మన మీద మోయలేని ఆర్థిక భారం పడుతున్నది. దీన్నుంచి కూడా కొంత మేరకైనా ఉపశమనం కలుగుతుంది. పై అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే సాగరమాల పథకం ప్రయోజనకరమైనది. అయితే ఈ పథకం అమలులో తక్కువ భూసేకరణ, ఎక్కువ ఉపాథి కల్పన, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం కృషి చేయాలి. 
 https://www.youtube.com/watch?v=3bVTlrAOd6k

No comments:

Post a Comment