Thursday, January 21, 2016

హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనలు, రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల విస్తృతి విశాలమైనదిగాను, లోతైనవిగాను కనబడుతున్నది. భిన్న భావజాలాల మధ్య సంఘర్షణ ఉన్నది. దాని పర్యవసానంగా నిరసన, ఆందోళనలు, సోషల్ మీడియాలో దూషణలు, వాటి కినసాగింపుగా భౌతిక దాడులు, ఐదుగురు విద్యార్థులపై సస్పెషన్ వేటు, రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటనలపై సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని, విశ్లేషించుకోకుండా పాక్షిక దృష్టితో కొన్ని నిర్ధారణలకు వచ్చి వ్యాఖ్యానాలు చేయడం తొందరపాటు అవుతుందేమో! వాస్తవిక దృష్టి, సామాజిక స్పృహ, వర్గ దృక్పథంతో స్పందించాల్సిన తరుణం ఇది. వాస్తవాలను, వాస్తవాలుగా మాట్లాడుకోనే వాతావరణాన్ని ముందు కల్పించుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో వామపక్ష విద్యార్థి సంఘాలు పాలుపంచుకొన్నట్లు లేదనిపిస్తున్నది. ఆసా భావజాలం వామపక్ష విద్యార్థి సంఘాల భావజాలానికి మధ్య కూడా విభజన రేఖ ఉన్నదని గమనించాలి. ఆసా వామపక్షాల పట్ల మిత్ర భావంతో మెలుగుతున్న సంస్థ కూడా కాదన్న అంశాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.

ముంబాయి బాంబు ప్రేలుళ్ళకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటును అందించిన యాకూబ్ మెమోన్ కు ఉరిశిక్ష విధించడం సమంజసం కాదన్న వాదనతో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన, ప్రతిగా ఎ.బి.వి.పి. నాయకుడు రెచ్చగొట్టే విధంగా 'గూండాలని' ఎ.యస్.ఎ.నాయకులను దూషించడం. పర్యవసానంగా భౌతిక దాడి, కేసులు, ఎ.బి.వి.పి. నాయకులకు వత్తాసు పలుకుతూ దత్తాత్రేయ గారు కేంద్ర మానవ వనరులను శాఖా మంత్రికి ఉత్తరాలు వ్రాయడం, స్మృతి ఇరానీ గారు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాయడం ద్వారా వత్తిడి తీసుకొచ్చి ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయించడం. కేంద్ర మంత్రులు గానీ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని చెప్పబడుతున్న యూనివర్సిటీ వీ.సి. గానీ నిష్పాక్షికంగా వ్యవహరించక పోవడం తీవ్ర గర్హనీయం. ఆసా సంస్థ నాయకులను గూండాలుగా దూషించిన ఎ.బి.వి.పి.నాయకుడ్ని కూడా సస్పెండ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు.

పైపెచ్చు ఆసా కార్యకర్తలను జాతి ద్రోహులుగా ముద్ర వేయడం, శిక్షించడం,  సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం యూనివర్సిటీ యాజమాన్యం యొక్క బాధ్యతారాహిత్యానికి ప్రబల నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తమదేనన్న అహంభావంతో ఎ.బి.వి.పి.కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించడానికి అవకాశం కల్పించారనడంలో ఏలాంటి సందేహం లేదు.

 ఆధునిక సమాజంలో 'ఉరి శిక్ష' యొక్క హేతుబద్ధతను ప్రశ్నించడంతో మొదలైన ఘర్షణ, హిందుత్వ భావజాలం, కాషాయికరణ, అంబేద్కర్ భావజాలం, కుల వివక్షత తదితర అంశాలపై రెండు ప్రత్యర్థి విద్యార్థి సంస్థల మధ్య ఆరని చిచ్చులా మారిందనిపిస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేఛ్ఛ పరిథికి లోబడి ఆరోగ్యకరమైన చర్చ, నిరసన, ఆందోళన, ఉద్యమాలు నిర్వహించుకో గలిగితే సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. కారణాలేమైనా, అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో బాగా కొరవడినట్లు జరిగిన పరిణామాలను బట్టీ బోధపడుతున్నది.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కు గురై పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఒకడైన రీసర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమైన దుర్ఘటన. స్వభావరీత్యా రోహిత్ ఒక ఉత్తమ విద్యార్థి అని, అధ్యాపకుల పట్ల గౌరవ భావంతో సఖ్యతగా మెలిగే వాడని, జనరల్ క్యాటగరీలోనే సీటు సంపాదించుకొన్న నైపుణ్యం ఉన్న విద్యార్థి అని విన్నాను. అలాంటి విజ్ఞానవంతుడైన ఒక యువ రీసర్చ్ స్కాలర్ ను సమాజం కోల్పోవడం దురదృష్టకరం. రోహిత్ ఆత్మహత్య సభ్య సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యంపై  విమర్శలు వెల్లువెత్తాయి.ఈ పరిణామం సహజ సిద్ధమైనది. దాన్ని సమాజం కూడా అర్థం చేసుకోగలదు. ఈ తరహా ఆందోళనల నుండి సంకుచిత రాజకీయ లబ్ధి పొందాలనే వారు 'ఓవర్ యాక్షన్' చేస్తూ అసలు సమస్యను, వాస్తవాలను ప్రక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తారన్నది చరిత్ర నేర్పిన గుణపాఠం. అందుకే హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన, జరుగుతున్న ఘటనలపై కాస్త జాగ్రత్తగా ఆలోచించి, వాస్తవిక దృష్టితో సామాజిక న్యాయం కోసం, రెండు తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థకే ఆదర్శప్రాయంగా ఉండ వలసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో నిజంగా కుల వివక్షత వేళ్ళూనుకొని ఉంటే వాటిని పెకలించడానికి వామపక్ష, లౌకిక శక్తులు నడుం కట్టాల్సిందే. భావ ప్రకటనా స్వేఛ్ఛకు, ప్రజాస్వామ్య హక్కుల కోసం, సామాజిక మార్పు కోసం విద్యార్థులను చైతన్యపరచి, సంఘటితపరచి, ఉద్యమాలు నిర్వహించడానికి పూనుకోవాల్సిందే. ఆ కర్తవ్యం ఏల్ల వేళలా నిబద్ధత,సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష ఉద్యమంపై ఉన్నది. అదే సందర్భంలో కేవలం రాజకీయ కోణంతో, మనోభావాలు, ఉద్రేకాలపై ఆధారపడకుండా క్షేత్ర స్థాయి వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే వర్గ శతృవుకు ఆయుధం సమకూర్చినట్లవుతుంది. నాలుక కర్చుకోవలసిన పరిస్థితీ దాపురిస్తుంది.

No comments:

Post a Comment