Tuesday, July 5, 2016

విజయవాడలో రోడ్డెక్కిన స్వామీజీలు


గడచిన రెండేళ్ళ చరిత్రను పరిశీలిస్తే ప్రజల్లో దైవ భక్తి, విశ్వాసాలు, మూడనమ్మకాలను పెంచి పోషించడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారన్న విషయం స్పష్టంగా కనబడుతున్నది. ఆర్భాటంగా పుష్కరాల నిర్వహణ, చీటికీ మాటికీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున‌ పూజలు పునష్కారాలు నిర్వహిస్తున్నారు. వాస్తు పేరిట మార్పులు, చేర్పులు, కూల్చి వేతలు, నిర్మాణాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేసి, రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలను నిర్వహిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా అభద్రతా భావంతో మోతాదుకుమించి భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తున్నారు. లౌకిక భావాలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే, ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ మత విశ్వాసాలకు అనుగుణంగానే నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకడుగు ముందుకేసి యజ్ఞయాగాలు కూడా అట్టహాసంగా నిర్వహించారు.

ఈ పరిణామం హిందుత్వవాద శక్తులకు, బిజెపికి సహజంగానే మిగుడుపడలేదు. కారణం, హిందూ మత విశ్వాసాలకు తామొక్కరమే 'పేటెంట్' తీసుకొని, ఓటు బ్యాంకుగా మార్చుకొంటుంటే, మధ్యలో కెసిఆర్, చంద్రబాబులు కూడా పోటీదారులుగా తయారైనట్లు భయం పట్టుకొన్నట్లుంది. అందుకే ఎక్కడ కాస్త అవకాశం వస్తే, అక్కడ ప్రజల మనోభావాలను, విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే విషయం విజయవాడ ఘటనలతో బోధపడుతున్నది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మొదట బిజెపి రోడ్డెక్కింది. అటుపై కాషాయ వస్త్రధారణలో ఉన్న స్వామీజీలు రోడ్డెక్కి, ఆందోళనకు పూనుకొన్నారు.

రహదారుల విస్తరణను అసంబద్ధంగా, ప్రజా వ్యతిరేకంగా కొనసాగిస్తున్నా, లేదా పాలక టిడిపి నాయకుల ఆస్తులను రక్షించడం కోసమే ప్రార్థనా మందిరాలున్న వైపు విస్తరణకు మాత్రమే అధికారులు పూనుకొన్నారనే ఆరోపణలు వాస్తవమైనా, నిజంగా ప్రార్థనా స్థలాలను విసక్షణారహితంగా కూల్చివేసి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకొనే అవకాశం మిత్రపక్షమైన బిజెపికి ఉన్నది కదా! ప్రజల్లో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు? రాజకీయ లబ్ధి కోసం కాకపోతే మరి దేని కోసం? బహిరంగ సభలో ఒక స్వామీజీ మాట్లాడుతూ తానొక స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబానికి చెందిన వాడిని, నాకు ఆస్తి పాస్తులు లేవు, కేవలం రు.3,000/‍ మాత్రమే బ్యాంకులో నిల్వ ఉన్నది, నాపైనా ఆరోపణల‍ంటూ స్థానిక పార్లమెంటు సభ్యుడిపై విరుచుకు పడ్డారు. శాంతి వచనాలు పలకాల్సిన స్వామీజీలు శాపనార్థాల పరంపర కొనసాగించారు. అభివృద్ధి పేరిట మా మనోభావాల(ఉపాథి)పై దెబ్బకొడతారా! ఒకవేళ గుడులను తొలగించాలంటే మాతో సంప్రదించి, మా అనుమతితో ఆ పని చేయాలే కానీ, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఎలా చేస్తుందని నిగ్గదీశారు. అ‍ంటే, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం స్వామీజీల కనుసన్నల్లో పని చేయాలే తప్ప స్వతంత్రంగా వ్యవహరించకూడదు. గుడుల తొలగింపు స్వామీజీల అనుమతితో చేస్తే అప్పుడు అపవిత్ర చర్య కాదు, భక్తుల విశ్వాసాలు గాయపడవన్న మాట. మమ్మల్ని అడిగి చేయలేదు కాబట్టి మా అహం దెబ్బ తీన్న‌దనే నూనతా భావం వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. మా ఉపాథి సంగతేంటి అన్న బాధ కూడా కనబడుతున్నది. రహదారి విస్తరణలో భాగంగా నష్టపోయిన పేద, మధ్య తరగతి ప్రజల గోడు వినిపించుకొన్న వారే కరువైనారు.

రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడిన కొన్ని కట్టడాల సమస్య ప్రజల మనోభావాలను ఎంతగా గాయపరచిందో! లేదో! తెలియదు కానీ, వామపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా ఈ సమస్యపై గొంతులు చించుకోవడం ఆశ్చర్యంగానే ఉన్నది. దీన్ని చైతన్యరాహిత్యమనాలో లేదా మత విశ్వాసాలను మనం కూడా కాస్తో కూస్తో ఉపయోగించుకొందామనే సంకుచిత భావాలకు లోనైనారో తెలియదు. కోస్తాంధ్రకు నడిబొడ్డుగా ఉన్న విజయవాడ, కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా గణతికెక్కింది. అశాస్త్రీయమైన మత విశ్వాసాలు, మూడనమ్మకాలపై రాజీలేని భావజాల పోరాటాన్ని కొనసాగించాల్సిన తరుణంలో మత విశ్వాసాల పునాదులను పటిష్టపరిచే దోరణిలో  వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

No comments:

Post a Comment