Thursday, May 26, 2011

నేతలకు ఓటరు గుణపాఠం!




నేతలకు ఓటరు గుణపాఠం! మే 26, 2011 సాక్షి దినపత్రిక





వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలై, తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలనాటి దుష్టసంప్రదాయం మళ్లీ పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అవకాశవాద విధానాల పర్యవసానంగా తెలంగాణ సమస్య మరింత జటిలమైంది. పార్టీలో ఎవరు ఎవరికి విధేయులో తెలియని దుస్థితి నెలకొన్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ,కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. అపనమ్మకం, అనుమానాలు, అవిధేయత పాలక పార్టీని అంధకారంలోకి నెట్టాయి.

కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలి తాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి అనైతికంగా సాగించిన పోరులో, ప్రజలు విచక్షణతో కూడిన తీర్పును ప్రకటించడం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు, ఆ తీర్పుకు ఆత్మవంచనతో కూడిన మాటలను జోడించి ఓటర్లను కించపరిచే ప్రయత్నాలకు ఒడిగట్టడం విచారకరం. కడప జిల్లాలో రిగ్గింగులు, బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, దాడులు, ప్రతిదాడులు, హత్యలు వంటి అప్రజాస్వామిక ఘటనలు లేకుండా ఎన్నికలు జరుగుతాయా? అన్న కుతర్కాలకు దిగడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. ఓటమి పాలైన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు సంయమనం కోల్పోయి, ఉద్దేశపూర్వకంగానే ఫలితాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బగా పరిణమించిన ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయనడం అతిశయోక్తి కాదు.

ఏ ఎన్నికల్లోనైనా రాజకీయపార్టీలు గెలుపు కోసం చెమటోడ్చడం సహజం. కానీ కడప ఉప ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ గెలుపు కోసం కాక, ప్రధాన ప్రత్యర్థి ఆధిక్యతను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు గతంలో ఎన్నడూలేని స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్థబలాన్ని, అంగబలాన్ని పెద్దఎత్తున ప్రదర్శిం చారు. అయినా భంగపాటు తప్పలేదు. సానుభూతి పవనాలు బలంగా వీయడంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని నమ్మబలకడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నించడం దిగజారుడు రాజకీయాలనే గుర్తుచేస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవాలనే ఆరాటంలో నిమగ్నమైన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డినా, తమ అభ్యర్థి ధరావత్తు కోల్పోవడంతో ‘దినదిన గండం నూరేళ్ల ఆయష్షు’ అన్నట్లు గుంభనంగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మీసం మెలేసి, తొడచరిచి మురిసిపోయిన మెగాస్టార్‌కు ఓటర్లు తొడపాశం పెట్టడం కూడా విలక్షణ తీర్పులో భాగమే.

తీర్పుకు వక్రభాష్యాలు తగదు!

వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డు కడప. ఉప ఎన్నికల ప్రచార పర్వంలో వీచిన రాజకీయ వడగాడ్పులు వేసవి ఎండలను సైతం మరపించాయి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహార సరళిని గమనించిన వారికి, మనం ఏ తరహా ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సందే హం కలగ క మానదు. పోలీసుల దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలను ‘సీజ్’ చేశారంటే, ధన ప్రభావాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ డబ్బు ఎవరిదో బహిరంగపరచడంలో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి. ‘బైండోవర్’ కింద పది వేల మందిని అదుపులోకి తీసుకున్నారంటే అధికార దుర్వినియోగం ఏ మోతాదులో జరిగిందో బోధపడుతుంది. అయినా స్థూలంగా ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగడం పట్ల ప్రజాస్వామ్యవాదులు సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఇన్ని వత్తిళ్ల మధ్య ఓటర్లు మాత్రం నిబ్బరంగా వారివ్వదల్చుకొన్న తీర్పును ఇచ్చారు. దాన్ని హుందాగా గౌరవించాలి. కేవలం సానుభూతి వరవడిలో ప్రజలు కొట్టుకుపోయారని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేస్తే భవిష్యత్తులోనూ భంగపాటు తప్పదు.

ఉప ఎన్నికల ఫలితాల వెనుక దాగిన వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే సానుభూతి ఒక ప్రధానాంశమైనప్పటికీ, అందులో అంతర్లీనంగా ఇమిడి ఉన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకోక తప్పదు. వైఎస్ అకాలమరణంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలై, తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలనాటి దుష్టసంప్రదాయం మళ్లీ పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అవకాశవాద విధానాల పర్యవసానంగా తెలంగాణ సమస్య మరింత జటిలమైంది. పార్టీలో ఎవరు ఎవరికి విధేయులో తెలి యని దుస్థితి నెలకొన్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవి ర్భావంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ, కాంగ్రెస్ పార్టీ భవి ష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. అపనమ్మకం, అనుమానాలు, అవిధేయత పాలక పార్టీని అంధకారంలోకి నెట్టాయి. ఈ పూర్వరంగంలో ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా ముందుకొచ్చాయి. 2009 ఎన్నికల నాటికీ, నేటికీ పెనుమార్పులు సంభవించాయి. ‘మార్పు’ నినాదంతో ప్రజల ముందుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ చతికిలపడి, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ బోటు ఎక్కింది.

దేశంలో రెండు పార్టీల వ్యవస్థ వేళ్లూనుకోవాలనే కోరిక కొన్ని శక్తులకు బలంగా ఉన్నా, దానికి నూకలుచెల్లిపోయాయి. సంకీర్ణ రాజకీయాలు అవశ్యంగా మారాయి. కూటముల వ్యవస్థ రూపుదాల్చింది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో పార్టీల మధ్య సర్దుబాట్లు ఉన్నప్పటికీ స్థూలంగా ఏకపార్టీ పాలనా వ్యవస్థే కొనసాగుతున్నది. రెండు పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. నేటి పరిస్థితిని విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీల ఆధిపత్య రాజకీయాలకు మన రాష్ట్రంలో కూడా రోజులు దగ్గరపడ్డట్టు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరహా మార్పులవల్ల నష్టపోతామనుకునేవారు, వాటిని ఆదిలోనే అడ్డుకోవాలని యత్నించడం సహజం.

చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం మీదే దృష్టి సారించి చతికిలపడ్డాడు. ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని కాకుండా జగన్‌మోహన్‌రెడ్డినే ప్రధాన శత్రువుగా భావించడంతో, ఆ ఎత్తుగడలు వికటిస్తున్నాయి. కడప స్థానిక సంస్థల నుండి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థి రంగంలో లేకపోయినా ఓటింగ్‌లో పాల్గొన్న ఘటనలు దానికి నిదర్శనం. అలాంటి వ్యూహాత్మక తప్పిదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో టీడీపీకి కూడా పరాభవం తప్పలేదు. మంచికో చెడుకో మూడో పార్టీని ఆదరించాలని ఓటర్లు భావిస్తున్నారు. నాయకుల ఇష్టాఇష్టాలతో ప్రజలకు నిమిత్తం లేదు. వారికున్న చైతన్యం, అనుభవాల ఆధారంగా ప్రత్యామ్నాయాలను రూపొందించుకుంటారన్నది చరిత్ర.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదు. జలయజ్ఞానికి విఘ్నం కలిగింది. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బద్వేలు ప్రాంత వాసులకు తెలుగుగంగ, జమ్మలమడుగు ప్రాంతం వారికి గండికోట రిజర్వాయర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, కమలాపురం ప్రజలకు గాలేరు-నగరి, పులివెందుల ప్రజలకు ఎత్తిపోతల పథకాల పనులు ఆగిపోవడం జీవన్మరణ సమస్యగా మారింది. వైఎస్ అవినీతిని గురించి ఎంత దుష్ర్పచారానికి ఒడిగట్టినా జిల్లాలో జరిగిన అభివృద్ధిని కప్పిపుచ్చడం సాధ్యంకాదు. వేంపల్లె ప్రజానీకానికి ట్రిపుల్ ఐటీ, కడప వాసులకు ‘రిమ్స్’ దర్శనమిస్తూనే ఉంటాయి. వీటన్నింటి మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్ల తీర్పులో ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నది గుర్తించక తప్పదు.

విలువలకు పాతర

కడపకు ఘనమైన చరిత్ర ఉన్నది. నీతికి, నిజాయితీకి, నిస్వార్థ ప్రజాసేవకు ప్రతిరూపంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఎద్దుల ఈశ్వరరెడ్డిని నాలుగు దఫాలు లోక్‌సభకు ఎన్నుకొన్నారు. ఉమ్మ డి మద్రాసు రాష్ట్రంలో ఉండగా 1951లోనూ, 1962, 1967, 1971లో జరిగిన ఎన్నికల్లో ఈశ్వరరెడ్డిని గెలిపించడమే కాక, ‘ఓటు-నోటు’ నినాదంతో ఎన్నికల నిధులను సమకూర్చారు. నైతిక విలువలు మూర్తీభవించిన ప్రజానాయకుడికి బ్రహ్మరథం పట్టిన ప్రజలే 1977లో జరిగిన ఎన్నికల్లో దరావత్తు కోల్పోయేలా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల ఓబులరెడ్డి డబ్బు సంచులతో రంగప్రవేశం చేసి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. తనకు డిపాజిట్ కూడా రాలేదని ఆనాడు ఈశ్వరరెడ్డి ప్రజలను నిందించలేదు. పెపైచ్చు ప్రజలకు మరింత అంకిత భావంతో సేవ చేయడం ద్వారా దగ్గర కావాలని ఉద్భోదించారు. తద్భిన్నంగా నేడు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. డబ్బులకు అమ్ముడుపోయారని, సానుభూతి పవనాల్లో కొట్టుకుపోయారని ప్రజలను అవమానించడం మంచిదికాదు.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు!

తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం స్థానాలు 824 కాగా కాంగ్రెస్ 170, బీజేపీ కేవలం 5, వామపక్షాలు 141 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే 500 పైచిలుకు స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకొన్నా యి. ఈ ఎన్నికలు వామపక్షాలకు గొడ్డలిపెట్టుగా మారినా, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ఊరట కలిగించింది. విచ్ఛిన్నకర ఉద్యమాలతో విసిగిపోయిన అసోం ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షించి బోడో పీపుల్స్‌ఫ్రంట్‌తో ఎన్నికల అవగాహన కుదుర్చుకొన్న కాంగ్రెస్‌కు తిరిగి పట్టం కట్టినట్టు బోధపడుతుంది.

మమతా బెనర్జీ దయాదాక్షిణ్యాలతో పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ కొంతమేర సానుకూల ఫలితాలను పొందిం ది. ప్రభుత్వానికి, వామపక్షపాలక పార్టీకి మధ్య ఉండవలసిన విభజన రేఖ చెరిగిపోవడంతో జరిగిన అనర్థాలు, 34 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఎంతో కొంత గూడుకట్టుకొన్న ప్రజా వ్యతిరేకత, పారిశ్రామికాభివృద్ధికి భూసేకరణలో అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలతో పాటు మావోయిస్టులు, ఎస్‌యూసీఐ లాంటి పార్టీలతో చేతులు కలిపిన మమత అధికార పగ్గాలను చేపట్టింది. అక్కడ మమతతో సఖ్యత కొనసాగించడం కాంగ్రెస్‌కు పరీక్షే. 2-జీ స్పెక్ట్రం కుంభకోణం, కుటుంబ పాలనల మూలంగా డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా తమిళనాడులో నిండామునిగింది. ఈ ఫలితాలన్నింటినీ ఏ విధంగా విశ్లేషించినా, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడే కీలకం అన్నది సుస్పష్టం. ఇది రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామమే!
-టి.లక్ష్మీనారాయణ,సీపీఐ సీనియర్ నాయకులు

No comments:

Post a Comment