Monday, November 21, 2011

పింఛనుదారుల భవిష్యత్తుకు పెను ముప్పు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ( ఎఫ్ . డి . ఐ .) పింఛను రంగంలోకి అనుమతిస్తూ పార్లమెంటు ముందున్న " పింఛను నిథుల నియంత్రణ , అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) _ 2011 బిల్లు " లో సవరణ చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో ప్రమాదఘంటికలు మోగించింది . శ్రామిక ప్రజానీకానికి ఒక హక్కుగా సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది . కార్మికులుగా , ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ అనారోగ్యం పాలైనా , ప్రమాదానికి గురైనా , అకాల మరణం చెందినా, ఉపాథి కోల్పోయినా , వృద్ధాప్యం వల్ల రిటైర్ అయినా ఆర్థికంగా ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉన్నది . వీటిలో ఏ ఒక్క కారణంగానైనా ఆ కుటుంబ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది . వృద్ధాప్య పింఛను పథకం సామాజిక భద్రతా పథకాల్లో అత్యంత కీలకమైనది . జీవితాంతం శ్రమను వెచ్చించి సమాజానికి సేవ చేసిన పౌరునికి వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం గడపడానికి కనీస రక్షణకు హామీ ఉండాలి . కాస్తా స్థిరమైన ఆర్థిక వనరు ఉన్నప్పుడే దానికి బరోసా ఉంటుంది .
సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక హక్కుగా పింఛను సౌఖర్యాన్నిఅనుభవిస్తూ వచ్చారు . సర్వీసు నుండి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న వేతనం ప్రాతిపదికన పెన్షన్ ను నిర్ధారించి , విశ్రాంతి ఉద్యోగులకు లేదా ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి జీవితాంతం చెల్లించే చట్టబద్దమైన విధానం అమలులో ఉన్నది . నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కరువు భత్యం , వేతన సవరణలను వర్తింప చేసి పింఛను చెల్లించడం ద్వారా జీవిత చరమాంకంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన , ప్రశాంత జీవనం సాగించడానికి చట్టం బరోసా ఇచ్చింది . 2003 సం. లో నాటి యన్ . డి .ఎ . ప్రభుత్వం పి . ఎఫ్ . ఆర్. డి . ఎ . ను కేవలం ఒక ఉత్తర్వు ద్వారా నెలకొల్పి పింఛను చెల్లింపు విధానానికి చెల్లు చీటీ ఇచ్చేసింది . అటుపై వచ్చిన యు . పి .ఎ . _ 1 ప్రభుత్వం దాన్ని చట్టం చేయాలని శత విధాలా ప్రయత్నించినా వామ పక్షాల ప్రతిఘటన మూలంగా సాధ్యపడలేదు .
పెన్షన్స్ చెల్లింపు ప్రభుత్వానికి పెను భారంగా తయారయ్యిందని , సగటు ఆయుద్ధాయం పెరగడంతో పింఛనుదారుల సంఖ్య పెరిగిపోతున్నదని , ఈ సమస్య ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా పరిణమించిందని ప్రపంచ బ్యాంకు , ఆర్థిక సంస్కరణవాదుల సలహా చెవికెక్కించుకొన్న ప్రభుత్వం ఈ దుస్సాహసానికి పూనుకొన్నది . నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన పింఛను విధానాన్ని ప్రవేశ పెట్టింది . దాని ప్రకారం 2004 జనవరి 1 తరువాత ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగంలో చేరిన వారికి వృద్ధాప్య మరియు కుటుంబ పింఛను
చెల్లించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం చేతులు దులిపేసుకొన్నది .
" కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం " లో ప్రభుత్వ , ప్రయివేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పౌరులెవరైనా ఈ పథకంలో చందాదారులుగా చేరి వృద్ధాప్యంలో పింఛను పొందడానికి వీలు కల్పించారు . కేంద్ర ప్రభుత్వం తో పాటు 27 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకంలో భాగస్వాములైనాయి . సాధారణ పౌరులూ చందాదారులుగా చేరుతున్నారు . ఇప్పటికి చందాదారుల సంఖ్య దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి చేరుకొన్నది . పింఛను నిథుల నియంత్రణ , అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) ఛెర్మన్ యోగేష్ అగర్వాల్ వెల్లడించిన సమాచారం మేరకు మదుపుదారులు ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియం డబ్బులతో రు . 8,500 కోట్లకు మూలనిథి ( కార్పస్ ఫండ్ ) చేరుకొన్నది . ప్రసార మాధ్యమాలలో వచ్చిన తాజా సమాచారం ప్రకారమైతే రు . 10,000 కోట్లకు చేరుకొన్నది . 2019 నాటికి రు. 15,00,000 ( 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ) కు మూలనిథి చేరుకొంటుందన్న అంచనా వేస్తున్నట్లు కూడా అగర్వాల్ ప్రకటించారు .
ఈ పథకంలో అంతర్భాగంగా వెయ్యి రూపాయల వార్షిక ప్రీమియంతో పేదల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న " స్వావలంబన పథకం " లో ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా సభ్యులుగా చేరారని కూడా అగర్వాల్ వెల్లడించారు . దీని పరిథిని విస్తరించడంపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించమని కేంద్ర ప్రభుత్వం శ్రీ జి . యన్ . బాజ్ పాయ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది . సమీప భవిష్యత్తులోనే భారీ స్థాయిలో మూల నిథులు పోగుబడి ఆర్థిక రంగంలో అత్యంత కీలకమైన , వ్యాపారానికి విస్తృతమైన అవకాశాలున్న రంగంగా ఆవిర్భవించబోతున్నది . దీన్ని కబ్జా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని స్వదేశీ మరియు విదేశీ గుత్త సంస్థలు పోటీ పడుతున్నాయి . విదేశీ సంస్థలకు సంబంధించి " కాలిపోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ , కాలిపోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ సిస్టమ్ " లాంటి సంస్థలు ఆతృతతో ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . కారణం ప్రతి సంవత్సరం నూతనంగా పదుల లక్షల సంఖ్యలో శ్రామిక జనాభాకు తోడవుతున్నారు . పింఛను పథకం పరిథి బయట ఉన్న అసంఖ్యాకులైన అసంఘటిత కార్మికులకు నూతన పింఛను పథకాన్ని వర్తింప చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టుతున్నది . దాంతో భీమా రంగం మరియు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆర్థిక రంగ పరిశ్రమల కంటే పింఛను రంగం చాలా పెద్దదని పసిగట్టాయి . అందు వల్లనే సంస్కరణలలో భాగంగా పింఛను , భీమా రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని మన పాలకులపై బహుళ జాతి సంస్థలు తీవ్ర స్థాయిలో వత్తిడి చేశాయి . పర్యవసానంగానే మొదటి దశలో భీమా రంగంలో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ( యఫ్ . డి . ఐ . ) అనుమతిస్తూ చట్టం చేశారు . అది చాలదని చట్టానికి సవరణ చేసి యఫ్ . డి . ఐ . పరిమితిని 49 % కు పెంచాలని ప్రభుత్వం ఉబలాట పడుతున్నది . ఈ పూర్వ రంగంలోనే ప్రతిపాదిత పి . ఎఫ్ . ఆర్ . డి . ఎ . లో సవరణ చేసి యఫ్ . డి . ఐ . కి తలుపులు బార్లా తెరవాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది .
కార్మిక సంఘాలన్నీ రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నా , ఖాతరు చేయచేయడం లేదు . మరొక వైపున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( ఇ . పి .ఎఫ్ .) , ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ( ఇ . పి . యస్ .) లపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తున్నది . 2010_11 ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇ . పి .ఎఫ్ . ఆర్ .) లో సంఘటిత రంగంలోని 4,50,000 సంస్థలకు చెందిన ఐదు కోట్లకు పైబడి ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు . రు. 1,85,000 కోట్ల మూల ధనం ఉన్నది . ఇ . పి . యస్ . ఖాతాలో దాదాపు లక్ష కోట్ల రూపాయలున్నాయి . ఎంప్లాయీస్ డిఫాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్ ( ఇ . డి . యల్ . ఐ .) ఖాతాలో పది వేల కోట్ల రూపాయలున్నాయి . మూడు పథకాల్లోని మొత్తం కలిపితే దాదాపు మూడు లక్షల కోట్ల మూలధనం ఉన్నదని అంచనా. ఈ నిథులను షేమా ర్కెట్ లో పెట్టుబడులుగా మలచాలని ప్రభుత్వం తలపోస్తున్నది . కార్పోరేట్ సంస్థలు వాటిని వినియోగించుకోవాలని గోరీకాడ నక్కల్లా కాచుక్కుర్చున్నాయి . ఉద్యోగుల సుదిర్ఘ పోరాటాల తరువాత గానీ ఇ . పి .ఎఫ్ . డిపాజిట్ల మీద 9.5% వడ్డీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించ లేదు . జి .పి .ఎఫ్ . మరియు పి . పి . ఎఫ్ . డిపాజిట్లపై ఇప్పటికీ 8 % వడ్డీనే ఇస్తున్నారు . ఈ నిథులన్నింటినీ ప్రభుత్వాలే బాండ్ల రూపంలో రుణాలుగా తీసుకొని వాడుకొంటున్నాయి . సేవింగ్స్ పై బ్యాంకులిస్తున్న వడ్డీతో సమానంగా కూడా ఇవ్వడం లేదు . ఉపాథి భద్రతకు ఎసరు పెడుతున్నారు . పర్మనెంట్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది . ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లోని ప్రయోజనాల్లో కోత విధించారు . దేశంలో ఉన్న దాదాపు 45 కోట్ల శ్రామిక జనాభాలో 8% కూడా లేని సంఘటిత రంగ కార్మికుల దుస్థితే ఇలా ఉంటే అసంఘటిత కార్మికుల స్థితిగతులు వర్ణనాతీతం .
కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది . చట్టబద్దమైన ఎలాంటి సామాజిక భద్రతా హక్కులూ లేవు . ఉపాథికి భద్రత లేదు . నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెరుగుదల ఎండమావే . విద్య , వైద్యం , నివాసం వగైరా మార్కెట్ లో ఖరీదైన సరుకులుగా మారిపోయాయి . ఈ తరగతి శ్రామికులకు వృద్ధాప్యంలో కనీస రక్షణ కల్పించలేని విధంగా నూతన పింఛను పథకం ( యన్ . పి . యస్ .) ను అమలు చేస్తే దుప్షరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం . ఈ పథకంలోని చందాదారులకు సరళీకరణ , ప్రయివేటీకరణ , ప్రపంచీకరణ విధానాల రుచిని ప్రభుత్వం చూపిస్తున్నది . కార్మికులు , ఇతర పౌరులు జీవితాంతం మదుపు చేసుకొన్న నిథుల ( రిటైర్మెంట్ సేవింగ్స్ ) నిర్వహణ బాధ్యతను " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " కు అప్పగించడం ద్వారా ప్రయివేటీకరించాలని 2008 జూలైలో మొదట కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు కేంద్ర కార్మిక సంఘాలు ప్రతిఘటించడంతో , వాటి ప్రాతినిథ్యం ఉన్న " సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ " కూడా అంత సానుకూలత వ్యక్తం చేయలేదు . కార్పొరేట్ రంగంలో దిగ్గజాలుగా ఉన్న హెచ్ . యస్ . బి . సి ., ఐ . సి .ఐ .సి .ఐ . , రిలయన్స్ సంస్థలతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఫండ్ మేనేజర్స్ గా నియమించడానికి ప్రయత్నించింది . విమర్శలు వెల్లువెత్తడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్రస్టీ బ్యాంకు గాను , యస్ . బి . ఐ . , యు . టి .ఐ ., మరియు యల్ . ఐ . సి . సంస్థలను " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " గా తాత్కాలిక ప్రాతిపదికపై ఎంపిక చేసి , బాధ్యతలను అప్పగించారు . దాని ప్రకారం నిథుల్లో 55% యస్ . బి . ఐ . , 40% యు . టి .ఐ ., 5% యల్ . ఐ . సి . లకు కేటాయించారు . 2008_ 09 నుండి 2010_11 ఆర్థిక సంవత్సరాల మధ్య 8.05% నుండి 16.38 % వరకు ఆదాయాన్ని సముపార్జించి పెట్టాయి . ఫండ్ మేనేజర్స్ అనుసరించే విధానాలపై రాబడి ఆధారపడి ఉంటుంది . ప్రతి సంవత్సరం టెండర్లు స్వీకరించి ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ ను నియమించాలనే నిబంధన విధించారు . పి. ఎఫ్ . ఆర్ . డి . ఎ . చట్టంగా రూపొందిన తరువాత " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " నియామక ప్రక్రియలో ప్రభుత్వ రంగ సంస్థలకు , స్వదేశీ మరియు విదేశీ గుత్త సంస్థల మధ్య అసలు పోటీ మొదలవుతుంది . ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ సిండికేట్ గా ఏర్పడి కూడబలుక్కొని మదుపుదారులను దగా చేయరనే " గ్యారంటీ " లేదు . సమకాలీన చరిత్రలో బోలెడు చేదు అనుభవాలున్నాయి .
పింఛను నిథుల నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) _ 2011 బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని యు . పి . ఎ ._ 2 ప్రభుత్వం మార్చి 24 న లోక్ సభలో ప్రవేశ పెట్టింది . దానిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బి . జె .పి . నేత మరియు మాజీ ఆర్థిక శాఖా మంత్రి యస్వంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని నియమించారు . అధ్యయనం , పరిశీలన చేసిన మీదట మదుపుదారుల ప్రయోజనాల పరిరక్షణకు సభా కమిటీ మూడు నిర్దిష్టమైన సిఫార్సులు చేసింది . 1) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26% నికి మించకుండా చట్టంలో పరిమితి విధించాలి . 2) పెట్టుబడులపై కనీస ఆదాయానికి సంబంధించిన షరతు విధించడం ద్వారా మదుపుదారుల కనీస పింఛనుకు రక్షణ కల్పించాలి . 3) పింఛను పథకం ఖాతాల నుండి ఎప్పుడైనా నిథులను ఉపసంహరించుకొనే హక్కు మదుపుదారులకు కల్పించాలి .
కాంగ్రెస్ కు , బి . జె . పి . కి లేదా యన్ . డి . ఎ ., యు . పి .ఎ . కూటముల మధ్య ఆర్థిక సంస్కరణలపైన , విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే అంశంపైన పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవన్న సంగతి జగమెరిగిన సత్యం . ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త బాధ్యతాయుతంగా ఆలోచించినట్లు కనబడుతున్నది . కేంద్ర కార్మిక సంఘాలన్నీ కట్టగట్టుకొని పింఛను పథకం నిథుల ప్రయివేటీకరణను గట్టిగా తిరస్కరించాయి . వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోయినా స్థాయీ సంఘం మదుపుదారులకు కాస్త రక్షణ కల్పించడానికి ఆ సిఫార్సులను చేసింది . వాటిని కూడా నిద్వంధంగా తిరస్కరించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది . భీమా రంగంలో యఫ్ . డి . ఐ . పై 26 % పరిమితి విధించడంతో ఇప్పుడు 49 % నికి పెంచాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని , చట్టానికి సవరణ చేస్తే తప్ప సాధ్యపడదని , ఆ అనుభవం దృష్ట్యా ఈ చట్టంలో పరిమితి విధించడానికి అంగీకరించ లేమని తేల్చేశారు . అంటే భవిష్యత్తులో కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే యఫ్ . డి . ఐ . శాతాన్ని పెంచుకొ౦టూ పోవడానికి
కృతనిశ్చయంలో ప్రభుత్వం ఉన్నది . ఇదే జరిగితే పింఛను పథకంపై నియంత్రణ , నిథుల వినియోగంపై బహుళ జాతి సంస్థలకు పూర్తిగా పెత్తనాన్ని అప్పజెప్పడమే అవుతుంది . మదుపుదారులను ముంచినా , తేల్చినా వాటిపైనే అధారపడాలి . కనీస ఆదాయంపై షరతు విధించలేమని , మదుపు సొమ్ము ఉపసంహరణకు చందాదారులు చూపెట్టే కారణాలపై సంతృప్తి చెందితేనే అనుమతిస్తామని సెలవిచ్చారు . కనీస పింఛనుకు రక్షణ కల్పించని యడల వృద్ధులను పేదరికంలోకి నెట్టివేయడమే అవుతుంది . ఖాతాదారులు తమ అవసరాల కోసం పొదుపు సొమ్మును ఉపసంహరించుకొనే హక్కును కాలరాయడం అప్రజాస్వామ్యం .
సవరణలతో కూడిన బిల్లును రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చట్టం చేసి అమలు చేయాలని యు . పి .ఎ . ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నది . తద్వారా స్వదేశీ , విదేశీ గుత్త సంస్థల కబంధహస్తాల్లోకి భావి పింఛనుదారుల భవిష్యత్తును బలవంతంగా నెట్టవేసే అత్యంత ప్రమాదకరమైన విధాన నిర్ణయం వైపు వేగంగా అడుగులు వేస్తున్నది . మార్కెట్ శక్తుల జూదానికి నెలవుగా మారిన షేర్ మార్కెట్లో పింఛను పథకంలోని నిథులను పెట్టుబడులుగా పెడితే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కష్టం కాదు . అమెరికాలో 2007 లో పురుడుపోసుకొని ప్రపంచాన్నికుదిపేసిన ఆర్థిక సంక్షోభం భయంకరమైన చేదు అనుభవాలను మిగిల్చింది. యూరప్ లో సంబవిస్తున్న దుష్పరిణామాలను చూస్తూనే ఉన్నాం . అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలోని పింఛను పథకాల్లోని చందారులు దిక్కుతోచని పరిస్థితుల్లో వీధుల్లో పడ్డారు . కానీ మన దేశాధినేతలు ఏ మాత్రం గుణపాఠాలను నేర్చుకొన్న దాఖలాలు కనిపించడం లేదన్న దానికి ఇది ప్రబల నిదర్శనం . లోపభూయిష్ట విధానాలతో సామాన్యులను బలిపసువులును చేయడం దుర్మార్గం . కొండంత ఆశతో జీవితాంతం మదుప చేసుకొన్న అమూల్యమైన సొమ్ముకు భద్రత లేకపోతే శేష జీవితంలో ముసలితనాన్నిఎలా గడపాలనే హృదయ ఘోష పాలకుల చెవికెక్కడం లేదు . వారి మస్తిస్కాలు అమానుషమైన సంస్కరణల చుట్టే పరిభ్రమిస్తున్నాయి .
ఆర్థిక సంస్కరణలు ప్రజాభాహుళ్యం యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి దోహదపడాలే గానీ , సామాన్యుల జీవన ప్రమాణాలను గొడ్డలి పెట్టుకు గురిచేసి , జీవితాలను చిద్రం చేయడానికి దారితీయకూడదు . సంస్కరణల అమలులో రెండు దశాబ్దాల సుధీర్గ అనుభవాన్ని గడించాము . దేశీయ కార్పోరేట్ సంస్థల దురాగతాలను , వాటి వాల్ల సంబవిస్తున్న దుష్పరిణామాలను చూస్తున్నాం , అనుభవిస్తున్నాం . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్థూలంగా వ్యతిరేకత లేదు . సమస్యల్లా ! ఏ ఏ రంగాలలోకి అనుమతించాలి , ఏ ఏ రంగాలలోకి అనుమతించకూడదు అన్నదే . విసక్షణ , విజ్ఞతతో నిర్ణయించుకోవాలి . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోజుతోనో ! అతిగా ఆధారపడో ! జాతి ప్రయోజనాలను బుగ్గిపాలు చేసే విధానాలను అనుమతించకూడదు . అభద్రతాభావంతో " దినదిన గండం నూరేళ్ళాయుస్సు" అన్న చంగదంగా బతకాల్సిన దుస్ఠితిని ఫించను పథకం మదుపుదారులకు కల్పించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు .

No comments:

Post a Comment