Tuesday, November 29, 2011

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జాతి ప్రయోజనాలకు ఎసరు!

suyra telugu daily November 29,2011

- ప్రజల జీవనోపాధికి గొడ్డలిపెట్టు
- గుత్తాధిపత్యానికి విదేశీ కార్పొరేట్ల వ్యూహం
- స్వదేశీ కార్పొరేట్లు సైతం ఉబలాటం
- దేశీయ ఉపాధి రంగాలకు పెను ముప్పు
- రోడ్లపాలు కానున్న కిరాణా వ్యాపార కుటుంబాలు
- వినియోగదారులపై అదనపు ఖర్చుల భారాలు

కోట్లాది మంది సామాన్య ప్రజల జీవనోపాథిని గొడ్డలి పెట్టుకు గురి చేసే ప్రమాదకరమైన చట్టాలను పార్లమెంటు చేత త్వరిత గతిన ఆమోదింప చేసే పనిలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ- 2 ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై ఉన్న పరిమితులను ఎత్తివేసే చట్టం తేవడానికి బరితెగించింది. ప్రస్తుతం నిషేధంలో ఉన్న బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలోకి 51 శాతం, ఒకే బ్రాండ్‌ చిల్లర వర్తకంలో ప్రస్తుతం ఉన్న 51శాతం పరిమితిని తొలగించి ఏకంగా 100 శాతానికి పెంచే బిల్లుకు పచ్చ జెండా ఊపుతూ కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం ఇందుకు ప్రబల నిదర్శనం.

కిరాణా రంగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించడంతో సంభవించే దుష్పరిణామాలపై దేశ వ్యాపితంగా విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. నూట ఇరవై కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద, చిల్లర వర్తకానికి విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలున్న దేశం మనది. వివిధ సంస్థల అంచనాల మేరకు రూ.30 లక్షల కోట్ల (600 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) వాణిజ్య కార్యకలాపాలకు మన దేశ చిల్లర వర్తక రంగంలో అవకాశాలున్నాయి. ఇది ఉపాథి కల్పనలో వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగం. దేశ వ్యాప్తంగా కోటి ఇరవై లక్షల దుకాణాలతో పట్టణ ప్రాంతాల నుండి మారు మూల గ్రామాల వరకు పెద్ద ఎత్తున వికేంద్రీకృతమై, మొత్తం ఉపాథి కల్పనలో 8 శాతం వాటాతో (దాదాపు 4 కోట్ల మంది), జనాభాలో 4 శాతం మందికి జీవనాధారమైన కీలక రంగం ఇది. 97 శాతం చిల్లర వర్తకం అసంఘటిత రంగంలో జరుగుతుంటే, కేవలం 3 శాతం సంఘటిత రంగంలోఉన్నది. చిల్లర వర్తకంలోని సంఘటిత రంగంలో కాలు మోపిన స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు వ్యూహాత్మకంగా భారీ పెట్టుబడులతో గుత్తాధిపత్యం కోసం అడుగులు వేస్తున్నాయి.

అధికశాతం లాభాలకు అవకాశాలు ఉన్న ఈ మార్కెట్లో పాగా వేయాలని, అంతర్జాతీయంగా గుత్తాధిపత్యంఉన్న వాల్‌ మార్ట్‌, టెస్కో, క్యారీఫోర్‌, ఊల్స్‌ వర్త్‌, మెట్రో వగైరా బహుళ జాతి సంస్థలు కాచుకున్నాయి. వీటికి తోడు ఇప్పటికే ఈ రంగంలో చొరబడి అధిక లాభాల రుచిమరిగిన ఫ్యూచర్‌ గ్రూప్‌, రిలయన్స్‌, ఆదిత్య బిర్లా, భారతి గ్రూప్‌, టాటా, స్పెన్సర్స్‌, ఫాన్టలూన్‌, లైప్‌ స్టైల్‌, రహెజాస్‌, సుభిక్ష, త్రినేత్రి, విశాల్‌ గ్రూప్‌, పిరమిడ్‌ వంటి స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు స్వతంత్రంగా, బహుళ జాతి సంస్థల భాగస్వామ్యంతో చిల్లర వర్తకాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నాయి.
విదేశీ సరుకులతో మన దేశీయ మార్కెట్లు నిండితే, కిరాణా రంగంతో పాటు వ్యవసాయం, చిన్న- మధ్యతరహా పరిశ్రమలు, చేతి వృత్తుల రంగాలు మరింత సంక్షోభంలో పడతాయి.

మానవవనరులు పుష్కలంగాఉన్న మన దేశంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా పరిణమిస్తుంది. ఆర్థిక దోపిడీకి రాచబాట వేసినట్లవుతుంది. పర్యవసానంగా సమాజంలో అశాంతి, అలజడి, అభద్రతాభావం తీవ్ర రూపం దాల్చుతాయి. గ్రామీణ ప్రాంతాలకు పెట్టుబడులు తరలివస్తాయని, ఆరు లక్షల గ్రామాలలోని రైతాంగ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, గ్రామసీమల స్వరూప స్వభావాలే మారిపోతాయని, ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయవచ్చునని, తద్వారా ధరలు నియంత్రితమై సరసమైన ధరలకు సరుకులు లభిస్తాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నికూడా ఎఫ్‌డీఐలు వెంటబెట్టుకు వస్తాయని, ప్రత్యక్షంగా- పరోక్షంగా కోటి మందికి ఉపాథి దొరుకుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ చెబుతున్నారు. అంటే దేశ వ్యాపితంగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు విస్తరిస్తాయని చెప్పకనే సూచిస్తున్నారు. స్వయం ఉపాథి పొందుతున్న కోట్లాది మంది జీవితాలు ప్రశ్నార్థకమవుతాయన్న పచ్చి నిజాన్ని ప్రభుత్వం మరుగున పడేస్తున్నది.

శీతల గిడ్డంగులు వగైరా మౌలిక వసతుల లేమి కారణంగా ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, పూలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, రొయ్యలు తదితర వ్యవసాయ- అనుబంధ రంగాల ఉత్పత్తులలో దాదాపు 40 శాతం కుళ్ళి పోవడం మూలంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల సంపదను చేజేతులా నష్టపోతున్నామని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎఫ్‌డీఐల రాకతో ఈ నష్టాన్ని సగానికి తగ్గించుకోవచ్చని నమ్మ బలుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రం నుండి వినియోగదారుని చేతిలోకి సరుకు చేరేసరికి ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నాయని స్వయంగా ప్రధాన మంత్రే సెలవిచ్చారు. వినియోగదారుడు చెల్లించే మొత్తంలో కేవలం మూడవ వంతు మాత్రమే రైతులు తమ ఉత్పత్తులకు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ’ చర్చా పత్రంలో కూడా పేర్కొన్నారు.

శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణ, ఆహార- ఆహారేతర వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా గొలుసు కట్టు వ్యవస్థ (సప్లయ్‌ చైన్‌) ను మెరుగు పరచడానికి భారీ నిథుల అవసరం దృష్ట్యా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించక తప్పదని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన నిథులను కేటాయించి ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల వ్యవస్థ, మార్కెట్‌ యార్డులు, మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించడంలో, విస్తరించడంలో, సమర్థవంతంగా నిర్వహించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం, తాను అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలను సవరించుకోవడానికి బదులు తన భాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నది. ప్రజా పంణీవ్యవస్థ (పీడీఎస్‌) ను విస్తరించడం ద్వారా అందరికి ఆహారభద్రత కల్పించాల్సిన- ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వంగా అవతారమెత్తింది.

కనీసం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన విదేశీ సంస్థలను మాత్రమే అనుమతిస్తామని, ఆ మొత్తంలో సగం నిథులను వస్తూత్పత్తి ప్రాంతాలలో (బ్యాక్‌ ఎండ్‌) సరుకుల ఉత్పత్తి, శుద్ధి (ప్రాసెసింగ్‌), పంపిణీ , డిజైన్ల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల నియంత్రణ, గిడ్డంగులు, శీతల రవాణా వ్యవస్థ, ప్యాకింగ్‌ వగైరా మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని విదేశీ పెట్టుబడిదారులకు బిల్లులో షరతు విధించామని ప్రభుత్వం చెబుతున్నది. చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తిదారుల నుండి 30 శాతం వినిమయ సరుకులను విధిగా సేకరించాలనే షరతునూ పొందుపరిచామంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ప్రభుత్వానికే మొదటి హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ షరతులన్నింటినీ అమలు చేస్తున్నామని బహుళ జాతి సంస్థలు స్వయంగా సంబంధిత ప్రభుత్వ విభాగాలకు తెలియజేస్తే చాలన్న మినహాయింపునూ ఇచ్చారు. ఈ ఒక్క మినహాయింపు చాలు ‘చట్టాన్ని చట్టుబండ చేసి అడ్డగోలు దోపిడీ చేయడానికి’ అన్న విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియదనుకొంటే ప్రజలు పప్పులో కాలేసినట్లే.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశ పర్యటన నాటికే చట్టం చేసే ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసి, బహుమతిగా ఇవ్వాలనుకొన్నారు. కానీ ఆనాడు సాధ్యపడ లేదు. అమెరికా అధినేత ఒత్తిడి, బహుళ జాతి సంస్థల ఒత్తిడి, ప్రలోభాల పర్యవసానం కావచ్చు, ఎట్టకేలకు ఇప్పుడు చిల్లర వర్తక రంగంలో ఎఫ్‌డీఐలకు పరిపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించే బిల్లు పార్లమెంటు తలుపు తడుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పది లక్షల జనాభాకు పైనున్న 53 పట్టణాలలో ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తున్నది. నేటి విత్తే రేపటి మరిచెట్టు అన్న చందంగా, పాతుకుపోయి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందన్న ఆలోచనే కొరవడింది. ప్రతిపక్ష పార్టీలు, ఒకటి రెండు యూపీఏ భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకిస్తున్నా చట్టంచేసి తీరుతామని శపథం చేసింది.

సూపర్‌ మార్కెట్లను నెలకొల్పు కోవడానికి లైసెన్సులిచ్చే అధికారం తమ చేతుల్లోనే ఉన్నది కాబట్టి, తాము అనుమతించబోమని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీరాలు పలుకుతున్నాయి. వీటి స్వభావం ప్రజలకు తెలియంది కాదు. ఒకసారి చట్టం రూపు దాల్చిన తరువాత దేశ వ్యాపితంగా ఎలా చొచ్చుకుపోవాలో బహుళ జాతి సంస్థలకు బాగా తెలుసు. ఎఫ్‌డీఐల ప్రవేశం వల్ల దుష్పరిణామాలు కోకొల్లలు. మచ్చుకు 1) చిల్లర వర్తకం, వ్యవసాయం, చిన్న- మధ్య తరహా పరిశ్రమలు, చేతి వృత్తుల రంగాలు, చిరు వ్యాపారులు (హాకర్స్‌), వీధి వ్యాపారులు (స్ట్రీట్‌ వెండర్స్‌ ) గొడ్డలి వేటుకు గురై ఉపాథి కోల్పోతారు. విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలు చిల్లర వర్తక రంగంలో విస్తరించే కొద్దీ కిరాణా వ్యాపారంపై అధారపడి స్వయం ఉపాథి పొందుతున్న కుటుంబాలు వీధులపాలు కాక తప్పదు.

వివిధ దేశాల అనుభవాలు కానీ, లేదా మన దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు చెందిన పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లు వెలిసిన ప్రాంతాలలో సంభవించిన దుష్పరిణామాలపై పలు స్వతంత్ర సంస్థలు ముంబయి, డిల్లీ తదితర మహానగరాలలో నిర్వహించిన పలు అధ్యయనాల నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలను బహిర్గతం చేశాయి. 2) మన ఆహార సేకరణ, పంపిణీ వ్యవస్థను విదేశీ గుత్త సంస్థల చేతుల్లో పెట్టడం అత్యంత ప్రమాదకరం. అత్యధిక ప్రజానీకం ఆహార భద్రత కొరవడి దారిద్య్రంలో మగ్గి పోతున్న పూర్వ రంగంలో ఒక వైపు ఆహార భద్రతా చట్టాన్ని తెస్తున్నామని కబుర్లు చెబుతూ, మరొక వైపున ఆహార ఉత్పత్తుల సేకరణ, నిల్వ, రవాణా, అమ్మకం కార్యకలాపాలను బహుళ జాతి సంస్థల గుప్పెట్లో ఇరికిస్తే భవిష్యత్తులో భయానక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

3) ఆహార- ఆహారేతర నిత్యావసర వస్తువుల ఉత్పత్తిదారులపైన, మండీ తదితర చిల్లర వర్తకంపైన, సరఫరా వ్యవస్థ మొత్తంపై గుత్తాధిపత్యం సాధించాక వారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహారం నడుస్తుందనడంలో సందేహం లేదు. 4) ఆహార ఉత్పత్తుల్లో ఒడుదుడుకులు, కృత్రిమ కొరత, ధరల పెరుగుదల తదితర సమస్యలతో మరింత అధ్వాన్నమైన పరిస్థితులు దాపురిస్తాయి. 5) గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్న రైతాంగ భవిష్యత్తును బహుళ జాతి సంస్థలకు అప్పగిస్తే ఏం జరుగుతుందో ఊహకందని విషయమేమీ కాదు. రైతాంగాన్ని తమపైపు ఆకర్షించడానికి వ్యవసాయోత్పత్తులకు మొదట కాస్త మెరుగైన ధరలను కల్పించి, తమ గుప్పెట్లోకి లాక్కొన్నాక తమ అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తాయి.

బహుళ జాతి సంస్థలు ఈ రంగంలో ప్రవేశిస్తే , దళారీ వ్యవస్థ అంతరించి పోయి రైతులకు మెరుగైన ప్రతిఫలం లభిస్తుందని ఊరిస్తున్నారు. దళారీ వ్యవస్థ రద్దవుతుందని చెప్పడం పెద్ద దగా. ఇప్పుడున్న రూపంలో కాక పోతే మరో రూపంలో దళారీ వ్యవస్థ కొనసాగుతుంది. ఇతర దేశాల అనుభవాలు అదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఏ పంట పండించాలో, ఏ విత్తనాలు విత్తాలో, ఏ కంపెనీ ఎరువులు వాడాలో, ఏ క్రిమి సంహారక మందులు వినియోగించాలో వారే రైతాంగానికి నిర్దేశించే దుస్థితి నెలకొంటుంది. వారు నిర్ణయించిన ధరలకే సాగుకు కావలసిన ఇన్‌ పుట్స్‌ను కొనుక్కోవలసి, వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవలసి వస్తుంది. 6) వినియోగదారుల ఆహారపు అలవాట్లను కూడా వారే నిర్దేశిస్తారు. 7) తర తరాలుగా కిరాణా వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కోట్లాది మంది ఉపాథి గొడ్డలి పెట్టుకు గురౌతుంది.

విదేశీ పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన సరుకులను, నాణ్యతాలోపం వల్ల తిరస్కరించి వస్తువులను , అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో అమ్ముడుపోని నాసిరకం సరుకులను- బహుళ జాతి సంస్థలు మన దేశీయ మార్కెట్‌లో అమ్మడం ద్వారా చిన్న- మధ్యతరహా దేశీయ పరిశ్రమలు మూతబడి, కోట్లది మంది ఉపాథి కోల్పోతారు. 9) ప్రస్తుతం ఈ రంగానికి చెందిన మండీ వ్యాపారులు, దళారులు, చిల్లర వర్తకులు తమ లాభాలను మన దేశంలోనే పెట్టుబడులుగా మారుస్తున్నారు. బహుళ జాతి సంస్థలు గడించిన లాభాలను తమ దేశాలకు తరలించుకు పోతారు. 10) కార్పొరేట్‌ సంస్థలు వినియోగదారులను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకోవడానికి వ్యాపార ప్రకటనలు, విశాలమైన ఏర్‌ కండిషన్‌ హాళ్ళు, రియల్‌ ఎస్టేట్‌ కారణంగా పెరిగిన అద్దెలు, సూపర్‌ మార్కెట్ల నిర్వహణ కయ్యే భారీ ఖర్చులన్నింటినీ సహజంగానే వినియోగదారుల నుండే వసూలు చేస్తాయి. పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోతాయి.

No comments:

Post a Comment