Monday, November 14, 2011

మానవాభివృద్ధిలో మనం ఎక్కడ ?

సూర్య దినపత్రిక , నవంబరు 15 , 2011

- దూరంగా ఉన్న వృద్ధిరేటు లక్ష్యం
- చైనా, శ్రీలంక కంటె వెనుకనే!
- తలసరి ఆదాయమూ తక్కువే
- నిరక్షరాస్యత అధికం
- క్షీణించిన ఉపాథి
- నెరవేరని పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు

అభివృద్ధి వైపు శర వేగంతో ముందుకు వెడుతున్నామని, 2010-11లో 8.5 శాతం ఆర్ధిక వృద్ధి రేటు సాధించామని, 2011-12 లక్ష్యమైన 9 శాతం వృద్ధి రేటును చేరుకోవడానికి ప్రస్తుతం అవకాశాలు కొంత సన్నగిల్లడంతో అది 8.2 శాతం ఉంటుందని కేంద్ర ప్రణాళికా సంఘం, ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి అంచనా వేస్తున్నట్టు ప్రకటించాయి. అ యితే, ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ఆర్ధిక మాంద్యం పూర్వ రంగంలో మన ఆర్ధిక రేటుపై కేంద్ర ప్రభుత్వం సహజంగానే సంబరపడిపోతున్నది. సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసివ్‌ గ్రోత్‌) విధానాలను అమలు చేస్తూ ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని వల్లె వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2011 వెలువడింది. ఆ ప్రకారం మానవాభివృద్ధి సూచికలు (హెచ్‌డిఐ) ఆధారంగా 187 దేశాల్లో మన దేశం 0.547 హెచ్‌డిఐ విలువతో 134 ర్యాంకుతో మధ్యస్తంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన మాత్రమే స్థానాన్ని కొనసాగించుకుంటున్నది. మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా 0.687 హెచ్‌డిఐ విలువతో 97వ స్థానాన్ని, శ్రీలంక 0.691 హెచ్‌డిఐ విలువతో 101 ర్యాంకుతో మనకంటె ముందు వరసలో కొనసాగుతుండడాన్ని గమనించి గుణపాఠాలు నేర్చుకోవాలి.

స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యత, ఆరోగ్యం, సగటు ఆయుర్దాయం, పిల్లలు- తల్లుల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, ఆర్ధిక సంస్కరణల ప్రభావం వగైరా ప్రాతిపదికల ఆధారంగా అధ్యయనం చేసిన మీదట శాస్ర్తీయంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన వివరాలు చూసైనా మన దేశాధినేతలకు, ఆర్ధిక విధానాల రూపకర్తలు కనువిప్పు కలగాలి. మన జాతీయ తలసరి ఆదాయం 3,468 అమెరికా డాలర్లు అయితే, చైనాలో 7,476 డాలర్లు. సగటు ఆయుర్దాయం మన దేశంలో 65.4 సంవత్సరాలు ఉంటే శ్రీలంకలో 74.9 సంవత్సరాలు, చైనాలో 73.5 సంవత్సరాలుగా ఉంది.

లింగ అసమానత సూచికలో మన దేశం 0.617తో 129వ స్థానంలో ఉంటే, చైనా 0.209తో 35వ స్థానంలో, శ్రీలంక 0.419తో 74, బంగ్లాదేశ్‌ 0.550తో 112, నేపాల్‌ 0.558తో 113, పాకిస్థాన్‌ 0.573తో 115 స్థానాలలో ఉండడం మనకు తల వంపులు తెచ్చే అంశం. దారిద్య్రం బహుముఖమైనది. ఆర్ధిక దారిద్య్రం, ఆదాయేతర దారిద్య్రం, బహుముఖ పేదరిక సూచిక (ఎండిపిసి) ప్రకారం 0.283తో మన దేశం శ్రీలంక (0.021), చైనా (0.056) కంటె బాగా వెనుకబడి ఉంది. 15 సంవత్సరాల వయస్సు పైబడినవారిలో 62.8 శాతం అక్షరాస్యత కలిగి వెనుకంజలో ఉన్నాము.

11వ పంచవర్ష ప్రణాళికా కాలం (2007-12)లో మన లక్ష్యాలు ఘనంగా ఉన్నాయి. కాని ఆదాయం, పేదరికం, విద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం రంగాలలో నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను చేరుకోవాలని సమ్మిళిత వృద్ధి వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. కానీ ఆచరణలో ఘోర వైఫల్యం చెందినట్టు ప్రణాళికా సంఘం అధికార గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ప్రణాళికా కాలంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సంవత్సరానికి 9 శాతం సాధించి 5.8 కోట్ల మేరకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నీరుగారింది. 2009-0లో జీడీపీ రూ. 61, 33, 230 కోట్లుగా అంచనా వేసినా, అందుకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందక పోగా సంస్కరణల పుణ్యమా అని సన్నగిల్లాయి. సంఘటిత రంగంలో నామ మాత్రపు పెరుగుదల ఉంది. ప్రైవేట్‌ రంగంలో కాస్త ఉపాధి కల్పన జరుగుతున్నా భద్రత కొరవడింది. ప్రభుత్వ రంగంలో అవకాశాలు మృగ్యం. కార్మికుల నిజవేతనాలు పడిపోయాయి.

7 సంవత్సరాలు పైబడినవారిలో 85 శాతం అక్షరాస్యత సాధించి, స్ర్తీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని పది శాతానికి తగ్గిస్తామని చెప్పారు. పురుషుల్లో 75.3, స్ర్తీలలో 53.7- సగటున 64.8 శాతం అక్షరాస్యత మాత్రమే సాధ్యమైంది. 6-14 సంవత్సరాల పిల్లలకు విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. బడి మానివేసే పిల్లల సంఖ్యను అరికట్టడం ద్వారా సమన్యాయాన్ని సాధించడానికి చేవలసినది ఎంతో ఉంది. జీడీపీలో 6 శాతం నిధుల్ని వెచ్చిస్తామని చెప్పడమే గాని మూడు శాతానికి మించి వ్యయం చేయడం లేదు. ప్రైవేటీకరణ వల్ల నాణ్యమైన విద్యకు బడుగు, బలహీనవర్గాలవారు దూరమైపోతున్నారు.ఏడాదిలోపు వయస్సున్న శిశు మరణాల రేటును ప్రతి వేయి మంది జననాలకు 28కి తగ్గిస్తామన్నారు.

ఈ సంఖ్య శ్రీలంకలో 15, చైనాలో 32, ఇండోనేసియాలో 36 ఉన్నది. బాలింత మరణాలను, ప్రతి వేయి ప్రసవాలకు ఒకరికి తగ్గిస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఇది 3.01 ఉన్నది. చైనాలో 0.56, శ్రీలంకలో 0.92 ఉన్నది. 2009 నాటికి అందరికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో 73.2, పట్టణ ప్రాంతాలలో 90 శాతానికి- సగటున 77.9 శాతం జనాభాకే అందుతున్నది. 0-3 వయసు పిల్లలో పౌష్ఠికాహార లోపంతో బాధపడేవారి సంఖ్యను, బాలికలు- మహిళల్లో రక్తహీనత గలవారి సంఖ్యను సగానికి తగ్గిస్తామన్న వాగ్దానం నెరవేరలేదు. దేశంలో 20 శాతం మంది పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు.

వైద్యం, ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నది జీడీపీలో 4 శాతానికి మించడం లేదు. పౌర సరఫరాల వ్యవస్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, స్వర్ణ జయంతి గ్రామీణ రోజ్‌గార్‌ యోజన, ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవెలప్‌మెంట్‌ స్కీం, అంత్యోదయ అన్న యోజన, మధ్యాహ్న భోజన పథకం వంటివి అమలు చేస్తున్నా ఆహార భద్రత అందని దుస్థితి కొనసాగుతున్నది. ఆహార భద్రత చట్టం ద్వారా 80 శాతం మందికి రక్షణ కల్పించాలని జాతీయ సలహా మండలి సిఫారసు చేసింది. ఈ పథకం అమలుకు 70 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు అవసరం కాగా, ప్రసుత్తం 59 మిలియన్‌ టన్నుల సేకరణ జరుగుతోంది. ఈ చట్టంపై నిపుణుల కమిటీ చర్చోపచర్చలతోనే కాలం గడుపుతున్నది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు గాలిలో వేలాడుతున్నది. భ్రూణహత్యల్ని నివారించే చట్టం ఉన్నా ఫలితం కనబడడంలేదు.
దేశంలో సంపద, సంపన్నుల సంఖ్య పెరుగుతున్నాయి. మన దేశంలోని వెయ్యి మంది కుబేరుల సంపద 2,41,275 మిలియన్‌ డాలర్లు. అంటే రూ.12 లక్షల కోట్లు. మన జీడీపీలో ఇది 20 శాతం. సహజవనరుల్ని కార్పొరేట్లు కొల్లగొడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతా రాహిత్యం పెరిగింది. అంకెల గారడీతో పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపేందుకు కేంద్రం పాల్పడుతున్నది. అందులో భాగంగానే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని, ఎగువన ఉన్నవారిని విభజించి తక్కువ సంఖ్యలో కుటుంబాలకే ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. పరిస్థితి ఈ విధంగా ఉండగా, అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నామనడంలో అర్ధం లేదు. లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాలతో దారిద్య్ర నిర్మూలన సాధ్యం కాదు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలోనైనా జాతి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి హేతుబద్ధమైన విధానాలను అమలు చేయాలి.


No comments:

Post a Comment