Wednesday, December 7, 2011

ప్రపంచీకరణ ముసుగులో ' డాలరు ' పెత్తనం

అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడి విల విలా తన్నుకొంటున్నది . అప్పుల ఊబిలో కూరుకుపోయింది . ఆ దేశ స్థూల ఉత్పత్తి ( జి .డి .పి .) విలువ పద్నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉంటే దానికి సరిసమానంగా పోటీ పడుతూ రుణ భారం చేరుకొన్నది . గృహ రుణగ్రహీతలు కంతులు చెల్లించలేని దుస్థితి ఏర్పడడంతో పేరుమోసిన బ్యాంకులు దివాలతీశాయి . బ్యాంకు సేవలు స్తంబించాయి . విమానయాన సంస్థలూ పీకల్లోతు నష్టాలతో ఐ.పి. పెట్టాయి . ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నది . ప్రభుత్వ ఆర్థిక లోటు ( కరెంట్ అకౌంట్ డెపిసిట్ ) పెరుగుతూ పెద్ద రుణగ్రహీత దేశంగా దశాబ్దాలుగా కొనసాగుతున్నది . డాలర్లను ముద్రించే హక్కున్న పెడరల్ బ్యాంకు మార్కెట్లోకి డాలర్లను మోతాదుమించి విడుదల చేసింది . పర్యవసానంగా అమెరికాలో డాలర్ విలువ దిగజారింది . నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి . ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లిపోతున్నది . ఆర్థిక వృద్ధి రేటు మందగించింది . లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి . నిరుద్యోగ వృద్ధి రేటు పెరుగుతూ 9% కి చేరుకొన్నది . యువత ఆశలు అడియాశలౌతున్నాయి . అమెరికా వాణిజ్య లావాదేవీలలో ప్రస్తుతం పెద్ద లోటున్నది. ప్రపంచం మొత్తంగా జరిగే ఎగుమతుల్లో అమెరికా వాటా 12.3% ఉంటే దిగుమతుల్లో 18.9% ఉన్నది . " మేడి పండు చూడ మేలిమై ఉండు , పొట్టవిప్పి చూడ పురుగులుండు " అన్న చందంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తయారయ్యింది . సంపన్నులకు , సామాన్యులకు మధ్య అగాదం పెరిగి పోతున్నది . నిరుద్యోగులు ఉపాథి కోసం , భృతి ( అనెంప్లాయ్ మెంట్ డోల్ ) కోసం వీథి పోరాటాలకు ఉపక్రమించారు . శ్రామికులు మెరుగైన వేతనాల కోసం వీధికెక్కారు . సామాన్య ప్రజలు సామాజిక భద్రత , ఆరోగ్య భీమా కోసం కన్నెర్ర చేశారు . ఉద్యమాల సెగ మొదలైయ్యింది . వాల్ స్ట్రీట్ వార్తల్లోకెక్కింది . కానీ అమెరికా డాలర్ మాత్రం ప్రపంచ దేశాల్లో వెలిగిపోతున్నది . ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏలుతున్నది . ఎంతటి వైచిత్ర్యం .
సరుకుల తరహాలోనే విదేశీ మారక ద్రవ్యం ( డాలర్ ) విలువ " సప్లయ్ , డిమాండ్ " మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్ సిద్ధాంత కర్తలు సూత్రీకరిస్తున్నారు . ఇదొక " మిథ్యా" ఆర్థిక సిద్ధాంతం . దీన్ని ప్రభోదించే ఆర్థికవేత్తలు " సప్లయ్ , డిమాండ్ " ను నియత్రించే సామాజిక , రాజకీయాంశాలను తెలివిగా మభ్యపెడుతున్నారు . ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ డాలరు చుట్టూ పరిభ్రమించేలా చక్రబంధంలో ఇరికించారు . ప్రపంచీకరణ ముసుగులో వాణిజ్య మరియు వ్యాపార లావాదేవీలను , అంతర్జాతీయ రాజకీయాలను , దేశాల మధ్య దౌత్య సంబంధాలను కూడా " డాలరు సామ్రాజ్యమే " నియంత్రిస్తున్నది . సంపదను నిల్వ చేసుకోవాలంటే ఒకప్పుడు " బంగారం " రూపంలో నిల్వ చేసుకొనేవారు . రవి అస్తమించని సామ్రాజ్యంగా తెల్ల దొరల పాలన సాగినంత కాలం బంగారంతో పాటు " బ్రిటీష్ పౌండ్ " రూపంలో కూడా సంపదను నిల్వ చేసుకొనే విధానం అమలులో ఉండేది . 18 వ శతాబ్దం ప్రారంభం నుండి దాదాపు 150 సంవత్సరాల పాటు " బ్రిటీష్ పౌండ్ ", " వరల్డ్ రిజర్వ్ కరెన్సీ" గా ఒక వెలుగు వెలిగి ఆరిపోయింది . రెండవ ప్రపంచ యుద్దానంతరం అప్పుల ఊబిలో కూరుకపోయిన బ్రిటీష్ సామ్రాజ్యం కుప్పకూలి . అమెరికా నూతన శక్తిగా ఆవిర్భవించి , ఆ స్థానాన్ని ఆక్రమిండంతో " డాలర్ పెత్తనం " మొదలయ్యింది . రెండవ ప్రపంచ యుద్దం ముగింపు దశలో జరిగిన బ్రెటన్ వూడ్స్ మహాసభ ఆమోదంతో పౌండ్ స్థానాన్ని డాలర్ ఆక్రమించి‍ంది . 1971 సంవత్సరం తరువాత బంగారాన్ని అసలు కొలబద్దగా లేకుండా కనుమరుగు చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సంపూర్ణ ఆధిపత్యాన్ని డాలర్ కైవసం చేసుకొంటున్నట్లు నాటి అమెరికా అధ్యక్షులు రిచ్ఛర్డ్ నిక్సన్ ఏకపక్షంగా ప్రకటించడంతో నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పెత్తనాన్ని కొనసాగిస్తున్నది .
దశాబ్దం క్రితమే ప్రపంచ ద్రవ్య నిల్వలు 68% డాలర్ల రూపంలో ఉండేవని అంతర్జాతీయ ఆర్థిక రంగ నిపుణులు వెల్లడించారు . దాన్ని బట్టి డాలరు శక్తి ఎంత బలీయంగా ఉందో ! బోధపడుతుంది . డాలరు పెత్తనంతో అంతర్జాతీయ వాణిజ్యం అసమతుల్యంగా తయారయ్యింది . ఈ క్రీడలో అమెరికా డాలర్లను అచ్చువేస్తుంది , మిగిలిన ప్రపంచ దేశాలు సరుకులను ఉత్పత్తి చేస్తాయి , వాటికి డాలర్లలోధరలు నిర్ణయించి , కొంటారు . అంతర్జాతీయంగా అనుసందానించబడిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం పరస్పర ప్రయోజనమే గీటు రాయిగా జరగడం లేదు . ఏకదృవ ప్రపంచం కోణంలో సాగుతున్నది . విదేశీ రుణాలను చెల్లించడానికి , విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించడానికి , ఎగుమతి దిగుమతుల్లోని లోటును చెల్లించడానికి డాలర్లు అవసరం . మన రూపాయి మారకపు విలువ పడిపోకుండా స్థిరంగా ఉండేలా పరిరక్షించుకోవడానికి భారీగా డాలర్లను నిల్వ చేసుకోవాలి , అందుకే ఎగుమతుల్లో పోటీ పడి డాలర్లను ఆర్జించాలి . స్వేచ్ఛా మార్కెట్ ముసుగులో కుట్రలు , కుతంత్రాలతో సాగించబడే "స్పెకులేటివ్ అండ్ మానిపులేటివ్ " వాణిజ్యంలో జరిగే దాడుల నుండి మన రూపాయి బలహీన పడకుండా జాగ్రత్త పడడానికి రిజర్వ్ బ్యాంకు సర్కులేషన్ లో ఉన్న మన కరెన్సీకి సమానంగా డాలర్లను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవాలి . ఈ ఏడాది జూలైలో 319 బిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలుంటే నవంబరు 25 నాటికి 304 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ప్రభుత్వానికి కంపనం పుట్టుకొన్నది .

ప్రపంచీకరణ భావజాలమే ఆయుధంగా " తడిగుడ్డతో గొంతులు కోసేవాడు " అన్న నానుడిగా వెనుకబడ్డ , అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువలపై డాలరు ముప్పేటా దాడి చేస్తున్నది . అందులో భాగంగానే మన రూపాయి విలువ నవంబరు 23 నాటికి మునుపెన్నడూ జరగని విధంగా కనిష్ఠ స్థాయికి పతనమై , బక్కచిక్కి ఒక డాలరు కావాలంటే రు .52.38 పైసలు చెల్లించుకోవలసి వచ్చింది . ఈ పూర్వరంగంలో డాలర్ల ఆర్జన కోసం మన కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లుపడుతున్నది . దిగుమతి వ్యాపారం చేసే సంస్థలు , ముడి చమురును దిగుమతి చేసుకొనే ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగ సంస్థలు డాలర్ల కోసం ఎగబడుతున్నాయి . డాలర్లకు కృత్రిమంగా గిరాకీ పెంచి , రూపాయి విలువను క్షీణింపజేశారు . ద్రవ్యోల్భణం విజృంభించి 2010 డిశంబరు నుంచి 10% అటు ఇటు చక్కర్లు కొడుతున్నది . ధరల పెరుగుదలకు ఆజ్యం పోసి , ప్రజల కొనుగోలు శక్తిని గొడ్డలి పెట్టుకు గురి చేశారు . ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ కళ కళలాడిపోతున్నదని డిల్లీ పెద్దలు చంకలు చరుచుకొన్నారు . అది కాస్తా పతనం వైపు ప్రయాణిస్తున్నది . " ఎందుకురా క్రింద పడ్డావ్ అంటే అదొక లగువులే " అన్నట్లు ద్రవ్యోల్భణాన్నిఅదుపు చేసి , నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేసేందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చిల్లర వర్తకం , ఫించను రంగాల్లోకి ఆహ్వానిస్తున్నామని నిస్సిగ్గుగా సెలవిస్తున్నారు . మన విధాన నిర్ణేతలందరూ ఆర్థిక రంగంలో నిష్ణాతులైన వారే . ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ వేదికలపై నుండి ఆర్థిక రంగానికి దిశా నిర్ధేశం చేస్తూ పుంకాను పుంకాలుగా ఉపదేశాలు చేస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు . డాక్టర్ రంగరాజన్ నేతృత్వంలోని ప్రధాని ఆర్థిక సలహా బృందం సభ్యులందరూ పేరెన్నికగన్న ఆర్థిక వేత్తలే . ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వెలగబెట్టి వచ్చిన మరో ఆర్థిక నిపుణుడు , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాన్టెక్ సింగ్ అహ్లువాలియా ఉండనే ఉన్నారు . రాజకీయ చాణిక్యుడగా మన్ననలందుకొంటున్న ప్రణాబ్ ముఖర్జీ ఆర్థిక శాఖామాత్యులుగా ఉన్నారు . రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డాక్టర్ సుబ్బారావు వగైరా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేథోసంపన్నుల కనుసన్నల్లో ఆర్థిక విధానాలు రూపొందించబడి , అమలు చేయబడుతున్నాయి . అయినా తిప్పలు తప్పడం లేదు . లోపమెక్కడుంది ?
స్వదేశంలో డాలరు విలువ పతనమైనా అంతర్జాతీయ సంతలో విలువను పెంచుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలని అమెరికా ఆడుతున్న రాచ క్రీడలో మన రూపాయే కాదు వివిధ దేశాల కరెన్సీల మారక విలువలు భారీగా పతనమైనాయి . ఆసియా ఖండంలో అందరికంటే మనమే ఎక్కువ నష్టపోయాము . మనం చేసుకొనే దిగుమతుల్లో ముడి చమురు కీలకమైనది . అలాగే రసాయనిక ఎరువులు , కెమికల్స్ , స్టీల్ వగైరా దిగుమతుల మొత్తం విలువ దాదాపు పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ( 357.7 బిలియన్ డాలర్లు) గా 2010 లో అంచనా వేశారు . ఎగుమతులు దాదాపు పదకొండున్నర లక్షల కోట్లు( 225.6 బిలియన్ డాలర్లు ) గా అంచనా వేశారు . అంటే మన దేశం యొక్క విదేశీ వాణిజ్యం లోటు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ( 132.1 బిలియన్ డాలర్లు ) . 2011 జూన్ 30 నాటికి మన దేశం అప్పు పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ( 316.9 బిలియన్ డాలర్లు ) . ఆ మేరకు డాలర్లను సంపాదించుకొని చెల్లించాలి లేదా విదేశీ రుణ భారం పెరిగిపోతుంటుంది . డాలర్లు కావాలంటే 1) ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు వగైరా సంస్థల నుండి అప్పులు చేయాలి . 2) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవాలి . భీమా రంగమా , రక్షణ రంగమా , చిల్లర వర్తక రంగమా , పెన్షన్ రంగమా , ఉన్నత విద్యా రంగమా , ఏ రంగమన్న విసక్షణ లేకుండా బహుళ జాతి సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించాలి . 3) మేథో వలసలను ప్రోత్సహించి , ప్రవాస భారతీయుల నుండి పెట్టుబడులను ఆకర్షించాలి . 4) మన ప్రజల అవసరాలు తీరక పోయినా పలు రకాల నాణ్యమైన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసి డాలర్లను ఆర్జించాలి . దాని కోసం భారీ రాయితీలను ఇచ్చి ప్రోత్సహించాలి . ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లినా పరవాలేదు , రైతులను ప్రోత్సహించి వాణిజ్య పంటలను సాగు చేయించి , ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి . అమూల్యమైన ఇనుప ఖనిజం తదితర సహజ వనరులను కొల్లగొట్టి , పర్యావరణాన్ని ధ్వంసం చేసైనా ఎగుమతి చేసి డాలర్లను సంపాదించాలి . ఆ రాజకీయతంత్రాన్నేనేడు డా : మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు . పి . ఎ . ప్రభుత్వం జంకు బొంకు లేకుండా అమలు చేసున్నది . కార్మికులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులనే కొని అనుభవించలేని ఆర్థిక దుస్థితిలో ఉన్నారు . కార్మికుడు సృష్టించే అదనపు విలువను కాజేస్తున్న పెట్టుబడిదారులు సరుకులన్నింటినీ వినియోగించుకోలేరు . మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ ఉపాథి , మెరుగైన వేతనాలు కల్పించి , కొనుగోలు శక్తిని పెంచి , ఉత్పత్తుల వినియోగాన్నిపెంచడం ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు . ఆర్థిక విధానాల రూపశిల్పులలో అలాంటి ఆలోచనే పూర్తిగా కొరవడింది . అమెరికాకు , బహుళ జాతి సంస్థలకు మాత్రమే నమ్మిన బంట్లుగా సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు .
" డాలర్ పవర్ " ను అడ్డంపెట్టుకొని ప్రపంచంపై ఆధిపత్యాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని అమెరికన్ సామ్రాజ్యవాదం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది . ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి డాలర్ను పావుగా వాడుకొంటున్నది .
ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తున్నది చమురే . ముడి చమురు నిల్వలను కబ్జా చేయడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుందన్న విషయం ఇరాక్ దురాక్రమణతో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది . అంతర్జాతీయ చమురు మార్కెట్ ను తన గుప్పెట్లో బంధించింది . ముడి చమురును కొనుగోలు చేయాలంటే డాలర్లుంటేనే సాధ్యపడుతుంది . " పెట్రో డాలర్ " తో ప్రపంచ దేశాలను అమెరికా కొల్లగొడుతున్నది . ఒక దేశానికి సంబంధించిన కరెన్సీ ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయిస్తే జరిగే విపరిణామాలు ఎలా ఉంటాయో మనం అనుభవిస్తున్నాము . కానీ బలమైన డాలర్ విధానం అమెరికాకు బహుముఖ ప్రయోజనాలను కలిగిస్తున్నది . చౌకగా సరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసుకోవచ్చు . విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా ఆస్తులు ఖరీదైనవిగా మారతాయి . ఇతర దేశాల కంటే తక్కువ వడ్డీకి అమెరికా రుణాలను సేకరించుకొనే ప్రత్యేక సౌకర్యం కలిగి ఉన్నది . డాలరు ప్రపంచంలో ఏకైక మారక ద్రవ్యంగా చలామణి కావడంతో ఇతర దేశాలకు పెద్ద ఎత్తున అప్పులిచ్చే దేశంగా అవతారమెత్తింది . అంతర్జాతీయ విపణిలో బంగారం , ముడి చమురు తదితర సరుకుల ధరలను డాలర్లలోనే నిర్ణయించడం పర్యవసానంగా డాలరు విలువ పతనమైనా అమెరికాకే లాభం , కారణం దిగుమతులు చౌకగా లభిస్తాయి . ప్రపంచ దేశాల జాతీయ బ్యాంకులు , విదేశీ ఆర్థిక సంస్థలు వారి ఆస్తులను అమెరికా డాలర్ల రూపంలోనే నిల్వ చేసుకోవాలి . విదేశీ వ్యాపార లావాదేవీలను డాలర్లలోనే పరిష్కరించుకోవాలి .
2007 సం. లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం అమెరికాను చావు దెబ్బకొట్టింది . ఆ ప్రకంపనలకు ప్రపంచ దేశాలూ కుప్పకూలాయి . చైనా , భారత్ లాంటి కొన్ని దేశాలు మాత్రమే బలమైన ప్రభుత్వ రంగ సంస్థల పుణ్యమాని కాస్త తట్టుకొని నిలబడగలిగాయి . ఆ చారిత్రాత్మకమైన అతిపెద్ద ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ భావజాలాన్నేప్రశ్నార్థకం చేసింది . ఆత్మరక్షణలో పడ్డ అమెరికా ఆర్థికవేత్తలు , నిపుణులు దుస్ఫలితాల విశ్లేషణలలో అంతర్భాగంగా " ప్రపంచ రిజర్వ్ కరెన్సీ" గా చెలామణిలో ఉన్న డాలరు పెత్తనం అంతానికి రోజులు దగ్గర పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు . డాలరు పెత్తనానికి చెల్లు చీటీ రాయాలని వివిధ దేశాలకు చెందిన మెథావులూ పిలుపిచ్చారు . ఇది ప్రస్తుతానికి హాస్యాస్పదంగా కనిపించినా అనివార్యం . తాజాగా అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడి కొటుమిట్టాడుతున్నది . డాలరు పెత్తనానికి దూరంగా జరగాలనే ఆలోచనలు అంతర్జాతీయంగా ఊపందుకొని , బలపడుతున్నాయి . వివిధ దేశాల జాతీయ బ్యాంకులు డాలర్ల నిల్వలను తగ్గించుకొంటూ బంగారం లేదా య్యూరో నిల్వల్లోకి ఆస్తులను తరలించడం ప్రారంభించాయి . ఫలితంగా ఒకానొక దశలో ప్రపంచ నిల్వల్లో డాలర్ల నిల్వలు 63% కు పడిపోయాయి . డాలరు పెత్తనం మొదలయ్యాక ఇదే కనిష్ఠ స్థాయి . దాంతో కంగుతిన్న అమెరికా తేరుకొని పథకం ప్రకారం ఇతర కరెన్సీలను దెబ్బగొట్టే పనిలో పడింది . " యూరో కరెన్సీ జోన్ " లోని దేశాలు ఒక్కొక్కటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి . డాలరుకు పోటీగా ఎదగాలని ఆకాంక్షతో ఆవిర్భవించిన " యూరో " విలువ మసక బారుతున్నది . పరిస్థితులను అనుకూలంగా మలచుకొని డాలరు అధిపత్యాన్నికొనసాగించుకొంటూ లభ్దిపొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నది . డాలరు పెత్తనాన్ని సవాలు చేసే భౌతిక పరిస్థితులు నేడు ప్రపంచంలో నెలకొని ఉన్నాయి . ఒకనాడు అలీనోద్యమానికి నాయకత్వం వహించిన చరిత్ర , తృతీయ ప్రపంచ దేశాలలో అతిముఖ్యమైన మన దేశం గళం విప్పాలి .
1) ప్రపంచ విపణిలో బంగారం , చమురు ధరల నిర్ధారణలో డాలరును ఉపయోగించడం మానివేసిన రోజే డాలరు అధిపత్యానికి "పుల్ స్టాప్" పడ్డట్లుగా భావించాలి . డాలరుకు స్వస్తి చెప్పాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు సౌది అరేబియా అడ్డుపడుతూవస్తున్నది . పరస్పర ఆధారిత ప్రపంచంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కటే ప్రయోజనం పొందడానికి మిగిలిన అన్ని దేశాల హక్కులను , ప్రయోజనాలను హరించి వేయడాన్నిఅనుమతించ కూడదు . ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి దారి తీస్తున్న డాలరు ఆధిపత్యానికి తెరపడాలి .
2) డాలరు యొక్క ఏకఛత్రాధిపత్యానికి సత్వరం చరమగీతం పాడి బహుళ కరెన్సీల వినియోగానికి , లావాదేవిలకు వీలుకల్పించే విధంగా దేశాల మధ్య వాణిజ్యపరమైన దౌత్య ఒప్పందాలు చేసుకోవాలి . తద్వారా పెద్ద ఎత్తున డాలర్లను ఆర్జించి , నిల్వ చేసుకోవలసిన అగత్యం ఉండదు . అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులు సంబవిస్తాయి . ఉభయ తారకంగా ఉండే వాణిజ్యం దేశాల మధ్య జరుగుతుంది . భారత దేశం , సోవియట్ యూనియన్ మధ్య 1978 సంవత్సరంలో డాలరు ప్రమేయం లేకుండా మన రూపాయి , వారి రూబుల్ ల మధ్య మారకంతో వాణిజ్య ఒప్పందం జరిగింది . సోవియట్ యూనియన్ పతనానంతరం 1991 లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొన్న రష్యా 2009 లో అమెరికా ఆర్థిక సంక్షోభం పూర్వరంగంలో మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధించుకోవాలని ప్రతిపాదించింది . చైనా గత కొన్ని సంవత్సరాలుగా అర్జెంటైనా , ఇండొనేషియా , బెలారస్ తదితర దేశాలతో సొంత కరెన్సీ యువాన్ ప్రాతిపదికన వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్నది . ఈ ఒరవడి వివిధ దేశాలు , ప్రాంతాల మధ్య పెరుగుతున్నది .
3) డాలరు ( అమెరికా) కు సేవలందించడం కోసం డాలర్లు ఆర్జించడమే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత ఎగుమతుల విధానం అమలు చేసినంత కాలం పరాధీనత తప్పదు . మన ఆర్థిక వ్యవస్థ బలహీనమైన పునాదులపైనే నిర్మించబడుతుంది . మన ఆర్థిక వ్యవస్థను మనమే విధ్వంసం చేసుకొన్నవారమవుతాము . డాలరు ( అమెరికా) చేతులో కీలు బొమ్మలా కొనసాగుతూ మనుగడ కోసం పాకులాడుతూనే జీవనం సాగించాలి . మిగిలిన దేశాలది మన లాంటి దుస్థితే .
4) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానాలకు స్వస్థి చెప్పి , దేశీయ వనరులపై ప్రధానంగా ఆధారపడే ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి . మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను నిండా ముంచుతున్న డాలరు పెత్తనానికి అంతం పలకాలి .

No comments:

Post a Comment