Friday, April 18, 2014

చక్రం తిప్పనున్న ప్రాంతీయ పార్టీలు


 
ప్రాంతీయ పార్టీలపై తక్కువ అంచనాలు
యుపిఎ భవితవ్యం మాత్రం స్పష్టం
రేసులో మోడీది ముందువరసే!
మసకబారిన వామపక్షాల బలం
జాతీయ పార్టీల వరుస వైఫల్యాలు
ప్రాంతీయ పార్టీలకు అదే ఊపిరి


మూడో ప్రత్యామ్నాయం లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊహాజనితమేనని, కాంగ్రెస్‌ సంఖ్య రెండం కెలు దాటదని, మోడీ జోరు మీదున్నారనీ- జరుగుతున్న ప్రచారంలోని వాస్తవికతపై సందేహాలు లేకపోలేదు. మోడీని భుజాలపైకెక్కించుకొన్న ప్రసారమా ధ్యమాలు, కార్పొరేట్‌ సంస్థల ధనబలంతో నమూనా అధ్యయనాలు (సర్వేలు) నిర్వహిస్తున్న సంస్థలు- బలంగా వేళ్ళూనికొని ఉన్న ప్రాంతీయ పార్టీల బలా బలాలను తక్కువగా అంచనా వేస్తూ, ఆ రాష్ట్రాలలో నిర్మాణపరంగా అత్యంత బలహీనంగా ఉన్న భాజపాకు కొన్నింటిలో కొత్తగా మిత్రులు దొరికినా, మరి కొన్నింటిలో అనివార్యంగా సొంతంగానే పోటీ చేస్తున్న ఆ పార్టీని మోడీ గాలి విజయపథాన నడిపిస్తుందనే భ్రమలను సృష్టించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారనిపిస్తోంది. ఆ మైకంలో ఉన్నవారికి మే16న వెలువడనున్న ఎన్నికల ఫలితాలే కనువిప్పు కలిగిస్తా యనడంలో సందే హం లేదు.
వాస్తవాలను వాస్తవాలుగా పరి గణలోకి తీసుకొనే దృక్పథాన్ని అలవాటుచేసుకొని, నిష్పాక్షికంగా రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, హేతు బద్ధమైన నిర్ధారణలకు రావడం ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు వాటి విశ్వసనీయతా పెరుగుతుంది. అలాకాకుండా తమ మెదళ్ళలో తొలుస్తున్న పాక్షిఆలోచనలకు అనుగుణంగా ప్రజల మనోభావాలను మలచాలనిచేసే ప్రయత్నాలు నిరర్థకంగా మిగిలిపోయే ప్రమాదమూ ఉంటుంది. పదహారవ లోక్‌ సభ గడువు మే 31తో ముగుస్తుంది. జూన్‌ మొదటి వారంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. దేశ రాజకీయ ముఖచిత్రాన్నివాస్తవిక దృష్టితో పరిశీలిస్తే, ఎన్నికల తదనంతరం ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయంలో అస్పష్టత, గందరగోళ పరిస్థితి నెలకొనిఉన్నది. ప్రజాగ్రహానికి గురవుతున్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఎ. కూటమి అధికారం నుంచి వైదొలగుతుందన్న విషయంలో మాత్రం ప్రజలకు స్పష్టత ఉన్నది.
ఎవరు అధికార పగ్గాలను అందిపుచ్చుకొంటారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరుగుతున్న ఎన్నికల పరుగు పందెంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బి.జె.పి. ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ముందు వరసలో ఉన్నారనే అంశంపైన పెద్దగా వివాదం లేదు. కానీ బి.జె.పి.కి, ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రధాన మంత్రి పీఠం దక్కుతుందా- అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. బి.జె.పి. లేదా కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామ్యం లేదా వాటి మద్దతులేని ప్రభుత్వం ఏర్పడుతుందనే తెలివి తక్కువ ఆలోచనలూ ఎవరికీ లేవనేచెప్పవచ్చు. అలాగే ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం సమయానుకూలంగా పచ్చి అవకాశవాద వైఖరులను ప్రదర్శిస్తాయనడంలో కూడా ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. పైపెచ్చు అవినీతి కూపంలో కూరుకపోయిన ప్రాంతీయ పార్టీల నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఢిల్లీ గద్దెపై ఆసీనులయ్యే వారి చేతుల్లో శక్తిమంతమైన ఆయుధం సి.బి.ఐ. ఉండనే ఉన్నది.
మన దేశం వైవిధ్యభరితమైనది. అంతే వైవిధ్యభరితంగా ప్రజల మనోభావాలు, రాజకీయ పార్టీల వైఖరులు ఉన్నాయి. మనది బహుళ పార్టీ వ్యవస్థ. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. వర్ణనాతీతమైన, సాహసోపేతమైన ప్రజా ఉద్యమాలు, అపారమైన త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పరితపించిన త్యాగధనులు తొలినాళ్ళలో చట్ట సభలకు ఎన్నికై ఆ వేదికలకే వన్నెతెచ్చారు. 1980 దశకం తరువాత క్రమేపీ ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పింది. మనది పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థని బల్లగుద్ది వాదించుకొన్నా, కొన్ని పరిమితులకులోబడే అది పని చేస్తున్నదన్న విషయం వివాదరహితం. ధన బలం, కండ బలం, మద్యం, కులం, మతం, తెగలు, ప్రాంతం వగైరా అంశాలు ఎన్నికల వ్యవస్థను బలహీనపరచి, ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నాయి.
వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములైన వారు యథేచ్ఛగా చట్ట సభల్లోకి రొమ్ము విరుచుకొని అడుగు పెడుతున్నారు. డబ్బులేని వాడికి రాజకీయమెందుకు అన్న పరిస్థితి బలంగా వేళ్ళూనుకొన్నది. రాజకీయ రంగం వ్యాపారమయమై పోయింది. ఎన్నికల సంస్కరణలను తీసుకొచ్చి ధన బలం ప్రభావాన్ని అరికట్టవలసిన ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని పెంచేసి, డబ్బున్న వాడికే పరోక్షంగా మద్దతు పలికింది. నీతి, నిజాయితీతో కూడిన ప్రజాసేవ- అంటే అర్థం లేని వెర్రిబాగుల మాటగా మారిపోయింది. నైతిక విలువలు కాలుష్య వాతావరణంలో కొట్టుకు పోతున్నాయి.మసకబారిన వామపక్షాల బలం: సామాజిక ప్రగతికి అలుపెరగని పోరుసల్పే కమ్యూని స్టులు, వామపక్షాలు బలహీనపడడంతో ఛాందసవాదులు, మతోన్మాదులు, రాజకీయ అవకాశ వాదులు లబ్ధిపొందుతున్నారు.
ప్రగతిశీల శక్తులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజా ఉద్యమాలను చట్ట సభల్లో ప్రతిబింబిస్తూ, సామాజిక ప్రగతికి దోహదపడే మెరుగైన శాసనాల కోసం చట్ట సభల్లో పోరుసలుపుతున్న వామపక్షాల బలం తరిగిపోతున్నది. ఇది శ్రామిక జనావళి భవిష్యత్తుకు హానికరమైనది, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు తీవ్రఆందోళన కలిగించే పరిణామం. స్వాతంత్య్రానంతరం మూడవ లోక్‌ సభ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉండి పాలక పార్టీ అయిన కాంగ్రెస్‌కి ఎదురొడ్డి నిలిచిన ఘనమైన చరిత్ర ఉంది. కమ్యూనిస్టు ఉద్యమానికి చీలిక గొడ్డలి పెట్టుగా పరిణమించింది. అయినా ఐదవ లోక్‌ సభ (1971-77)లో సి.పి.ఐ. (యం) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది.
1989లో వి.పి.సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ్రఫంట్‌, 1996లో దేవెగౌడ- 1997లో ఐ.కె. గుజ్రాల్‌ నాయకత్వంలో యునైటెడ్‌ ప్రంట్‌, 2004లో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో యు.పి.ఎ. ప్రభుత్వాల ఏర్పాటులో వామపక్షాలు క్రియాశీలమైన భూమిక పోషించాయి. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, మూడు దశాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన పశ్చిమ బెంగాల్‌లో, కేరళ శాసనసభఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తరువాత వామపక్షాల ప్రాభవం తగ్గిపోయిందనే భావన సర్వత్రానెలకొన్నది. పర్యవసానంగా ఎన్నికల్లో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవడానికికూడా యు.పి.ఎ., యన్‌.డి.ఎ. కూటముల్లో భాగస్వాములు కాని బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు విముఖత ప్రదర్శించారు. తామే సొంతంగా పోటీచేసి అత్యధిక స్థానాలను గెలుచుకొని, ప్రధాన మంత్రి అయిపోవాలన్న దురాశ వారిలో కలగడం కూడా ఒక కారణం కావచ్చు. గతంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన వామపక్షాలను మౌనరోదన చేసే పరిస్థితికి నెట్టడం నిస్సందేహంగా దుష్పరిణామం.
వామపక్షాల బలాన్ని కేవలం ఓట్లు, సీట్ల కొలబద్దతో కొలవడం హేతుబద్దం కాదు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని ప్రకటించిన కమ్యూనిస్టుల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి చట్టసభల్లో ప్రాతినిథ్యాన్ని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొంటారు. పార్లమెంటరీ పెడధోరణులతో చట్టసభల్లో ప్రాతినిథ్యాన్ని పెంచుకొన్నా, అధికారానికొచ్చినా ఉద్యమం బలపడదు కానీ, వామపక్షాలు నిర్వహించిన ఉద్యమాలకు సరియైన ప్రాతినిథ్యం లభిస్తే అది సమాజానికి మేలు చేస్తుంది.ప్రాంతీయ పార్టీల బలం మిథ్య కాదు: జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, బలమైన పునాదులను ఏరాటు చేసుకొన్నాయి. ప్రాంతీయ పార్టీల వైఫల్యాల వల్ల ఉప ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పర్యవసానంగా దేశంలో ఏకపార్టీ పాలన అంతరించి, సంకీర్ణ ప్రభుత్వాల దశ నడుస్తుండడంతో జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల పాత్ర క్రియాశీలంగా మారింది. ఈ మార్పు దేశానికి మేలు చేస్తుందా- కీడు చేస్తుందా, సమాఖ్య వ్యవస్థ బలపడుతుందా- బలహీనపడుతుందా- అన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు వంద స్థానాలకు మించి, బి.జె.పి.కి ఎక్కువలో ఎక్కువ 175 స్థానాలకు దాటి వచ్చే అవకాశాలే లేవన్నది సుస్పష్టం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా, మనుగడసాగించాలన్నా- ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నదన్న విషయం నిప్పులాంటి నిజం. అవి ప్రభుత్వంలో పాలుపంచుకొంటయా లేదా బయటి నుండి తోడ్పాటు అందిస్తాయా అన్నది వేరే విషయం. వాటిని విస్మరించలేని అనివార్య పరిస్థితులు మాత్రం నెలకొని ఉన్నాయి. అందుకే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ అయినా, భాజపా అయినా ప్రాంతీయ పార్టీల వెంటబడుతున్నాయి. ప్రస్తుతానికి యన్‌.సి.పి. ఆర్‌.జె.డి., ఆర్‌.యల్‌.డి., నేషనల్‌ కాన్పరెన్స్‌, కేరళ కాంగ్రెస్‌ వంటి పార్టీలు యు.పి.ఎ. కూటమిలో ఉంటే- అకాళిదళ్‌, శివసేన పార్టీలు గతం నుంచి యన్‌.డి.ఎ. కూటమిలో ఉన్నాయి. తాజాగా తెలుగు దేశం, లోక్‌ జన శక్తి, డి.యం.డి.కె., యం.డి.యం.కె., పి.యం.కె., కె.యం.డి.కె వగైరా పార్టీలు భాజపాతో జట్టు కట్టాయి. ఈ రెండు కూటములకు బయట ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలు స్వతంత్రంగా ఎన్నికల బరిలో ఉన్నాయి.
అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర్రపదేశ్‌ లో సమాజ్‌ వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, బీహార్‌లో జనతా దళ్‌ (యునైటెడ్‌), పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఒడిస్సాలో బిజూ జనతా దళ్‌, తమిళనాడులో ఎ.ఐ.ఎ.డి.యం.కె., డి.యం.కె., ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌, తెలంగాణలో టి.ఆర్‌.యస్‌., కర్ణాటకలో జనతా దళ్‌ (సెక్యులర్‌), అస్సాంలో అస్సాం గణ పరిషత్‌, అలాగే ఈశాన్య భారత దేశంలోని ఏడు రాష్ట్రాలలోని పలు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. కొద్ది మాసాల క్రితమే జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంలో పురుడుపోసుకొని, ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసి నెలరోజుల పాటు పాలన సాగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. నేడు జాతీయ ప్రసారమాధ్యమాలలో బి.జె.పి., కాంగ్రెస్‌ పార్టీల తరువాత స్థానంలో అత్యధికంగా ప్రచారాన్ని పొందుతున్న పార్టీ- ఆమ్‌ ఆద్మీ పార్టీనే.
కేంద్ర ప్రభుత్వ అండదండలతో రిలయన్స్‌ సంస్థ కె.జి. బేసిన్‌ లోని సహజ వాయువు నిల్వలను కొల్లగొట్టి, అక్రమార్జనకు పూనుకొన్న అంశంపై వామపక్షాలు సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ఏనాడూ తగిన ప్రచారాన్ని ఇవ్వని ప్రసారమాధ్యమాలు, కేజ్రివాల్‌ ఆ అంశంపై మాట్లాడడం మొదలుపెట్టాక దాన్నొక ప్రధాన చర్చనీయంశంగా చేశాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ విధానాలు, పోకడలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండవచ్చు. అధికారం కోసం ఉవ్విళూరుతున్న మోడీకి సవాలుగా దేశ వ్యాపితంగా అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ పార్టీ ఎన్నికల ఫలితాలను ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఎన్ని స్థానాల్లో విజయబావుటా ఎగరేస్తుందో వేచి చూడాలి. పది- పదిహేను గెలిచినా అవేమీ తక్కువ కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఒక్క లోక్‌ సభ సభ్యుడు ఉన్న పార్టీలకు కూడా ఎనలేని ప్రాధాన్యత వస్తుంటుంది.
మన రాష్ట్రంలో యం.ఐ.యం., కేరళలో ముస్లిం లీగ్‌ వంటి పార్టీలు ఈ కోవ క్రిందికే వస్తాయి. ఈ ధపా మన రాష్ట్రంలో లోక్‌ సత్తా, జై సమైక్యాంధ్రప్రదేశ్‌ పార్టీలు మొదటిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి ప్రవేశించాయి. ఎన్నికల సందర్భంలో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుల్లా పుట్టుకొస్తుంటాయి. కొన్ని ఉనికిలోకే రావు. మరికొన్ని ఒకటి, అర స్థానాలను సంపాదించుకొని చట్ట సభల్లో అడుగుపెడుతుంటాయి.విశ్వసనీయత ప్రశ్నార్థకమే, కానీ?: ప్రాంతీయ పార్టీల నాయకత్వాలపై జాతీయ స్థాయిలో విశ్వసనీయత కొరవడిన మాట వాస్తవం. యు.పి.ఎ. ప్రభుత్వానికి బయటి నుండి మద్దతిచ్చిన ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి- అవినీతి కేసుల్లో ఇరుక్కొని సి.బి.ఐ. విచారణల నుండి బయటపడడం కోసం అనుసరించిన అవకాశవాద వైఖరుల వల్ల అప్రతిష్ఠ పాలైనారు. ముజఫర్‌ నగర్‌ జిల్లాలో జరిగిన మత ఘర్షణలతో- అధికారంలో ఉన్న సమాజ్‌ వాది పార్టీ ప్రతిష్ఠ మసకబారినప్పటికీ ములాయం సింగ్‌ బలహీనపడిపోయినట్లు భావించడం తొందరపాటే అవుతుంది.
ఒక వైపున ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడిందని, మాయావతి నాయకత్వంలోని బి.యస్‌.పి. ఇంకా కోలుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 10 స్థానాలకే పరిమితమై, అటుపై జరిగిన శాసన సభ ఎన్నికల్లో మూడో స్థానంతో తృప్తి పడవలసి వచ్చిన భాజపా ఒక్కసారిగా బలం పుంజుకొని మోడీ ప్రభంజనంతో రాష్ట్రంలోని 80 స్థానాల్లో 50 వరకు తన ఖాతాలో వేసుకొంటుందన్న ప్రసారమాధ్యమాల నమూనా అధ్యయనాల విశ్లేషణలలో పాక్షిక దృష్టి ఉన్నట్లుతోస్తున్నది.పశ్చిమబెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన వామపక్షాలను 2011 శాసనసభ ఎన్నికల్లో ఓడించి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ దేశ ప్రజల దృష్టిలో పడ్డారు. యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీగా ఉండిన తృణమూల్‌- మన్మోహన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని ఒక కుదుపు కుదిపింది. రాష్ట్రంలో వామపక్షాల కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తూ బలహీనపరిచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తనకు వ్యతిరేకంగా రాస్తున్న విశ్వవిద్యాలయాల ఆచార్యులపైన, ప్రసారమాధ్యమాలపైన కన్నెర్రజేసి, కక్షపూరిత చర్యలకు పూనుకొన్నది. దుందుడుకుగా వ్యవహరిస్తూనే పంచాయితీ ఎన్నికల్లో తన స్థానాన్ని మరింత పదిలపరచుకొన్నది. ఆ రాష్ట్రం మొత్తంగా దాదాపు 20 శాతం, కొన్ని నియోజకవర్గాలలో 40 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడంలో చాలా వరకు సఫలీకృతమైనట్లే కనబడుతున్నది. అందుకే ఒకనాటి మిత్రపక్షమైన్‌ బి.జె.పి.ని, ప్రత్యేకించి నరేంద్ర మోడీపైన తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగిస్తున్నది. తృణమూల్‌ 2009 లో 19స్థానాల్లో గెలుపొందిదింది. ఈదఫా ఆ సంఖ్యను పెంచుకొంటుందన్న వార్తలొస్తున్నాయి.ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పై ప్రజల్లో విశ్వాసం సడలలేదని, బిజూ జనతా దళ్‌ కే సానుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు.
గతం నుండి గుణపాఠాలు నేర్చుకొన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రజానుకూల పాలన సాగిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.యం.కె. కుటుంబ తగాదాలు, యు.పి.ఎ. ప్రభుత్వంలో జరిగిన టెలికం కుంభకోణంలో పీకల్లోతు కూరుకపోయి ఉన్న నేపథ్యంలో ఎ.ఐ.ఎ.డి.యం.కె. కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, అత్యధిక స్థానాలను సొంతం చేసుకొంటామనే భరోసా ఉండబట్టే జయలలిత ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కుదుర్చుకొన్న సీట్ల సర్దుబాట్ల ఒప్పందానికి తిలోదకాలిచ్చారని అంటున్నారు. తానే ప్రధాన మంత్రి కుర్చీలో ఎందుకు కూర్చోకూడదన్న ఆలోచన మెదడులో వచ్చి పుదుచ్చేరితో కలిపి రాష్ట్రంలో ఉన్న40 స్థానాల్లో అత్యధికం గెలవడానికి పట్టుదలతో చమటోడుస్తున్నారు. మోడీతోఉన్న స్నేహ బంధాన్ని ప్రక్కకు నెట్టి, మమతతో కలిసి కొత్త జట్టు కట్టడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు యన్‌.డి.ఎ.లో భాగస్వామిగా ఉన్న జనతా దళ్‌(యు) బీహార్‌లో అధికారంలో కొనసాగుతున్నది. జనతా దళ్‌(యు) - సి.పి.ఐ., కాంగ్రెస్‌ - ఆర్‌.జె.డి., బి.జె.పి.- లోక్‌ జనశక్తి పార్టీలతో కూడిన మూడు కూటముల మధ్య ముక్కోణ పోటీ నెలకొన్నది. జనతాదళ్‌ పోయిన ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచింది. ఆ సంఖ్యను నిలబెట్టుకోలేక పోవచ్చనే అంచానాలు వేస్తున్నారు. ఒకటి రెండు తగ్గితే తగ్గవచ్చు.మొత్తం మీద జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్‌, నితీశ్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, దేవెగౌడ, ప్రపుల్ల కుమార్‌ మహంతి, వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి, కె.సి.ఆర్‌.ల నేతృత్వాలలోని ప్రాంతీయ పార్టీలకు ప్రస్తుతం 114 మంది లోక్‌ సభ సభ్యులున్నారు. కొత్తగా కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలో కొచ్చింది. ఆయా రాష్ట్రాల్లోని నిర్ధిష్ఠ పరిస్థితులను, పార్టీల స్థితిగతులను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో ఈ పార్టీల బలం 150 నుంచి 175 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వీటికి తోడు వామపక్షాలకు ప్రస్తుతమున్న 24 స్థానాలకు ఒకటి అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నది.ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో దేశ రాజకీయ రంగంలో సంభవించిన పెనుమార్పుల అంశాన్ని ఎవరూ గుర్తించ నిరాకరించలేరు. ప్రస్తుత లోక్‌ సభలో 38 పార్టీల ప్రాతినిథ్యం ఉన్నది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్రపదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఒడిశాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో 223 లోక్‌ సభ స్థానాలున్నాయి. కాకపోతే వీరిని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య- నాయకత్వ కొరత. ములాయం, నితీశ్‌, నవీన్‌, జయలలిత, మమత, మాయావతి వీరందరూ ఎవరికి వారు ప్రధాన మంత్రి పీఠంపై కన్నేసి ఉన్నారు. వీరి మధ్య ఐక్యతను సాధించ గలిగిన సూత్రబద్ధమైన విధానాల ప్రాతిపథిక లేదు. అందుకు తోడు అహంభావం, వ్యక్తిగత పోకడలు, రాజకీయ నిబద్ధత- సమన్వయం- అంకితభావం లేకపోవడం, కొందరు ఒకే రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా మనుగడ సాగిస్తుండడం- కాంగ్రెసుకు, భాజపాకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రూపకల్పనలో అవరోధంగా నిలిచాయి. ఎన్నికల తదనంతరం పరిస్థితులు తన్నుకొస్తే ఒకే వేదికపైకి రావచ్చు లేదా అవకాశవాదంతో సొంతదారులు చూసుకొని భాజపా పంచన చేరనూ వచ్చు!

No comments:

Post a Comment