Wednesday, April 30, 2014

శ్రమపై పెట్టుబడి ముప్పేట దాడి


Surya Daily, May 1, 2014

శ్రమ శక్తి సమరశీల పోరాటానికి ప్రతీక మే డే. ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో నగర కార్మికులు 128 (1886 మే 1) సంవత్సరాల క్రితం చేసిన వీరోచిత సమ్మె ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో చేరింది. నాటి కార్మిక వర్గం చేసిన ప్రాణ త్యాగాలు, చిందించిన రక్తం నేటితరం కార్మిక వర్గానికి విప్లవ స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. ఇంత వరకు నడచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రేనని కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స, ఫ్రెడరిక్‌ ఎంగెల్‌‌స పేర్కొన్నారు. ఆ వర్గ పోరాటాల చరిత్ర కొనసాగింపులో నేడొక నూతన దశ ఆవిష్కృతమయ్యిందని భావించవచ్చు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరప్‌ లోని సోషలిస్టు దేశాలు కుప్పకూలిన తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థకు మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న అమెరికా పెట్రేగిపోయింది. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ భావజాలాన్ని అంతర్జాతీయ సమాజంపై రుద్దింది. బూర్జువా వర్గం ఉత్పత్తి చేసే సరుకులకు నిత్యం విస్తరించే మార్కెట్‌ కావాలి గనుక, ఆ అవసరం ఆ వర్గాన్ని ప్రపంచపు నలుమూలలకు తరుముతోంది. ప్రపంచ మంతటినీ తన మార్కెట్‌ గా చేసుకోవడం ద్వారా బూర్జువావర్గం ప్రతి దేశంలోనూ సరుకుల ఉత్పత్తికీ, సరుకుల వినియోగానికీ జాతి అతీత స్వభావం కల్పించింది అన్న కమ్యూనిస్టు ప్రణాళికలోని అంశం అక్షర సత్యంగా నేటి ప్రపంచీకరణ విధానాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రపంచీకరణ భావజాలంతో ఊపు మీదున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తన సహజ లక్షణాలు ప్రకోపించడంతో సంక్షోభాల సుడిగుండంలోకి మునిగింది. అమెరికా పుట్టి ముంచిన ఆర్థిక సంక్షోభం మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్లతనం బహిర్గతమయ్యింది. సామ్రాజ్యవాదుల చేతుల్లో పనిముట్లుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య మండలి పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభం నుండి బయటపడవేయడానికి రంగంలోకి దిగాయి. అమెరికాకు, బహుళ జాతి సంస్థలకు కొమ్ముగాస్తూ వెనుకబడ్డ, వర్ధమాన దేశాల ప్రభుత్వాల నెత్తిన కూర్చొని నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలును వేగవంతం చేశాయి.

ఆర్థిక సంక్షోభాల నుండి ఉపశమనం పొంది, దోపిడీ వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రభుత్వాలు, యాజమాన్యాలు కార్మిక వర్గాన్ని బలిపశువుగా చేస్తున్నాయి. కార్మిక వర్గ హక్కులపై పథకం ప్రకారం బహుము దాడికి పూనుకొన్నాయి. సంఘం పెట్టుకొనే ప్రాథమిక హక్కును, సమ్మె హక్కును కాలరాయడానికి బరితెగించాయి. నిజ వేతనాల్లో కోత విధిస్తూ పని భారాన్ని పెంచేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక భద్రతా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య సాకుతో పెట్టుబడిదారులు శ్రమదోపిడీ నిష్పత్తిని పెంచుకొంటున్నారు. అసంఘటిత కార్మికులను, శ్రామిక మహిళలను, యువతను, బాలకార్మికులను అధికంగా దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికులు పోరుబాట పట్టారు. అమెరికాలో సహితం జరిగిన ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
మన దేశంలోని జాతీయ కార్మిక సంఘాలు రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా సార్వత్రిక సమ్మెలు చేశాయి.

అయినా కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రక్రియను యథేచ్చగా కొనసాగిస్తున్నది. పెట్టుబడిదారీవర్గం గరిష్ఠ లాభాలను ఆర్జించుకోవడానికి శాస్త్ర, సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొంటూ, కార్మికుల శారీరక, మేథో శ్రమలను దోచుకొంటున్నది. పెట్టుబడి ప్రవేశపెడుతున్న సరికొత్త దోపిడీ రూపాలను పసిగట్టడమే కార్మిక వర్గానికి దుర్లభంగా పరిణమించింది. దోపిడీ శక్తులు సాగిస్తున్న బహుముఖ దాడులను ఎదుర్కొంటూ కార్మికవర్గం మనుగడ సాగించడమే జీవన్మరణ సమస్యగా తయారయ్యింది. ఆత్మరక్షణలో పడిన కార్మిక వర్గం అపారత్యాగాలతో సముపార్జించుకొన్న చట్టాలు, హక్కుల పరిరక్షణ ఉద్యమాలకే అధిక ప్రాధాన్యత నివ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. సంస్కరణల అమలు మొదలైన1990 దశకం ప్రారంభం నుండి సంభవించిన దుష్పరిణామాలు కార్మిక వర్గానికి శరాఘాతంగా తగులుతున్నాయి. జాతీయ స్థూలఉత్పత్తి (జి.డి.పి.) పెరుగుదల, తరుగుదల గణాంకాలతో బూర్జువా ఆర్థికవేత్తలు అభివృద్ధి నిష్పత్తిపై మల్లగుల్లాలు పడుతున్నారు తప్ప, పతనమవుతున్న కార్మికుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవడమే లేదు.

జాతి సంపద సృష్టికర్తలైన శ్రామిక ప్రజల సంక్షేమాన్ని విస్మరించడంతో పాటు, వారి మూలుగల్ని పీల్చి పిప్పిచేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఉపాధి రహిత అభివృద్ధితో- శాశ్వత స్వభావంగల ఉద్యోగాలను కనుమరుగు చేస్తున్నారు. అసంఘటిత రంగంలోనే 2 శాతం ఉపాధి కల్పన ఉన్నదని ప్రభుత్వ కమిటీల నివేదికలు వెల్లడించాయి. అసంఘటిత రంగంలోని కార్మికు ఉపాధికి, వేతనాలకు, సామాజిక భద్రతకు రక్షణ లేదని, పనిపరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కూడా ఆ నివేదికలే పేర్కొన్నాయి. దేశంలో 45.95 కోట్ల శ్రామిక జనాభా ఉంటే వారిలో 2.65 కోట్లు (5.66శాతం) సంఘటిత రంగంలోను, 43.3 కోట్లు (94.34శాతం) మంది అసంఘటిత రంగంలోను పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ తన 2004-05 నివేదికలో వెల్లడించింది. ఆ తరువాత సంస్కరణల అమలు వేగం పెరగడంతో ఆ సంఖ్య మరింత పెరిగి అధ్వాన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సంఘటిత రంగంలోని అత్యధిక కార్మికులు, ఉద్యోగులు కేంద్ర కార్మిక సంఘాలలోనో లేదా పారిశ్రామిక, ఆయా సంస్థల కార్మిక సమాఖ్యలలోనో సభ్యులుగా చేరి సమష్ఠి బేరసారాలాడే శక్తిని ప్రదర్శిస్తూ కాస్తమెరుగైన వేతనాలు, ఉద్యోగభద్రత తదితర హక్కులను అనుభవిస్తు న్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో అత్యధికులు కార్మిక సంఘాల వెలుపల చెల్లా చెదురుగా విస్తరించిఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కార్మికుల కొనుగోలు శక్తిపై, జీవన ప్రమాణాలపై గొడ్డలి పెట్టుగా పరిణమించింది. కోట్ల మంది అసంఘటిత కార్మికులు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్నారు. అర్ధనిరుద్యోగులుగా పేదరికంలో, అర్థాకలితో బ్రతుకులీడుస్తున్న అసంఘటిత కార్మికులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పిల్లలకు విద్యావసతులు అందు బాటులో లేవు. ఉమ్మడి బేరసారాలాడే శక్తిని బల హీనపరచడం, న్యాయబద్ధమైన కోర్కెలను తిరస్కరిస్తూ, శాంతియుతమైన నిరసనలను కూడా ప్రభుత్వాలు, యాజమాన్యాలు సహించలేని వాతావరణం నెలకొన్నది. పెద్ద సంఖ్యలో కార్మికులను, ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని పెంచేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వవిభాగాల్లో, కార్పొరేషన్లలో కాంట్రాక్టు కార్మికులు, క్యాజువల్‌ కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల నియామకం ద్వారా శాశ్వత ఉద్యోగాల స్వభావం కలిగిన పనులను చేయించుకొంటున్నారు.
సంఘటిత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులపైనా దాడికి పూనుకోవడంతో మొత్తం కార్మిక వర్గమే కష్టాలకడలిలో పడింది. ఒకరోజు సమ్మెకు మూడునుండి వారం రోజుల వేతనాన్ని ప్రభుత్వ సంస్థల్లో కోత పెడుతున్నారు.

ప్రయివేటు సంస్థలో ఉపాధి నుండి తొలగిస్తు న్నారు. ప్రయివేటు రంగంలోని అత్యధిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, సేవా రంగం, అసంఘటిత రంగంలోని యాజమాన్యాలు కార్మికుల చేత 12 నుండి 14 గంటలు పని చేయించుకొంటున్నారు. కనీస వేతనాలు చెల్లించడం లేదు. హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానాన్ని అమలు చేస్తూ పని భద్రత లేకుండా చేశారు. సామాజిక భద్రతా చట్టాల అమలు ఊసేఎత్తడం లేదు. కార్మిక శాఖ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చట్టాలు నిరుపయోగంగా తయారయ్యాయి. అసంఘటిత కార్మికుల్ని సంఘటితపరిచి వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను సంఘటిత కార్మిక వర్గం కొంత వరకు గుర్తించినట్లు కనబడినా ఆచరణలో ముందడుగు వేయలేకపోతున్నది. కార్మిక సంఘాలు చొరవచేసి నిరుద్యోగులను కార్మికోద్యమం వైపు ఆకర్షించి, సంఘటితపరచి నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా, అందరికీ ఉపాథికల్పించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలకు ఉపక్రమించక పోతే కార్మిక వర్గ అభ్యున్నతికి నిరుద్యోగ సమస్య పెద్ద అవరోధంగా నిలుస్తున్నది. పారిశ్రామిక విప్లవంతోపాటు కార్మికోద్యమం ఆవిర్భవించింది. అంతర్జాతీయ కార్మికోద్య మంలో అంతర్భాగంగా మన దేశంలో ప్రప్రథమంగా ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎ.ఐ.టి.యు.సి.) 1920 అక్టోబరు 31న బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల వలస పాలన కాలంలోనే ఉద్భవించింది. కార్మికశక్తిని సంఘటితపరచి స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది.

కార్మికుల హక్కుల కోసం వివిధ రూపాలలో కార్మికోద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కార్మిక శాసనాలు రూపొందించబడలేదు. అవి కార్మిక వర్గం అపారమెన త్యాగాలు, పోరాటాలతో సాధించుకొన్నవే. వర్‌‌కమన్‌‌స కాంపెన్‌ జేషన్‌ చట్టం-1923 మొదలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టం-1926, పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ చట్టం- 1936, పారిశ్రామిక వివాదాల చట్టం- 1947, ఫ్యాక్టరీల చట్టం- 1948, కనీస వేతనాల చట్టం- 1948, ఇ.యస్‌.ఐ. చట్టం- 1948, ఇ.పి.ఎఫ్‌. చట్టం- 1952, మెటర్నిటీ బెనిఫిట్‌ చట్టం- 1961, బోనస్‌ చట్టం- 1965, కాంట్రాక్‌‌ట కార్మికుల (క్రమబద్ధీకరణ- నిషేధం) చట్టం- 1970, గ్యాట్యుటీ చట్టం- 1972, సమాన పనికి సమాన వేతన చట్టం- 1976 వగైరా అనేక కార్మిక చట్టాలను ఉద్యమాలద్వారా సాధించుకొన్న ఘనమైనచరిత్ర భారత కార్మికోద్యమానికి ఉన్నది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ జపం చేస్తున్న ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో పెట్టుబడిదారులకు అనుకూలంగా మౌలికమైన మార్పులు, చేర్పులూ చేయాలని, కొన్నింటిని అటకెక్కించాలని శత విధాల ప్రయత్నిస్తున్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థపై తిరుగబడి, తెగించి పోరాడితేతప్ప కార్మిక వర్గం మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

దేశాభివృద్ధి ఫలాలను పెట్టుబడిదారీవర్గం సొంతం చేసుకొని అనుభవిస్తున్నది. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి దోపిడీ కనికట్టు మాయాజాలంగా తయారయ్యింది. సహజవనరుల్ని కొల్లగొడుతున్నారు. ఉత్పత్తి సాధనాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని, అతి తక్కువ వేతనాలతో శ్రమ శక్తిని దోపిడీ చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఉత్పత్తులకు విశాలమైన మార్కెట్‌, ప్రసార మాధ్యమాలు, రాజకీయ రంగం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టు సాధించుకొని స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థలు, ప్రయివేటు సంస్థలు దోపిడీని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను కనుమరుగుచేస్తూ రాజ్యాంగంలో పొందుపరచుకొన్న సంక్షేమరాజ్యస్థాపన లక్ష్యంనుండి పాలకపార్టీలు ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణానికి కంకణబద్ధులైనాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం దోపిడీ శక్తులు, దోపిడీకి గురయ్యే శ్రామిక వర్గం మధ్య అనివార్యంగా వర్గ సంఘర్షణ ఉంటుంది. రెండింటి సైద్ధాంతిక దృక్పథాలు వేరు. వర్గ పోరాటాల వైపు సంఘటిత, అసంఘటిత కార్మికులను, నిరుద్యోగ యువతను నడిపించాల్సిన గురుతరబాధ్యత కార్మికోద్యమంపై ఉన్నది.

No comments:

Post a Comment