Thursday, July 24, 2014

సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర 2 వికేంద్రీకరణే శరణ్యం!

విజ్ఞప్తి: "సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర 2 వికేంద్రీకరణే శరణ్యం!" అన్న శీర్షికతో జూలై 25, 2014, సూర్య దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం. (జూలై 23, బుధవారం సంచిక తరువాయి భాగం)



ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్‌
విద్యుత్‌తోటే పారిశ్రామికాభివృద్ధి
మరో గుదిబండ- ఆర్‌టిసి అప్పులు
ఆజ్యం పోస్తున్న ప్రాంతీయ అసమానతలు
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


నేడు ఉన్న విద్యుత్‌ అవసరాలకు తోడు నీటి పారుదల రంగంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్‌ కావాలి. పారిశ్రా మికంగా వెనుకబడ్ద ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటే ముందుగా అందుబాటులోకి రావల సింది విద్యుత్తే. కాబట్టి విద్యుదుత్పత్తికి అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుదుత్ఫాదన సంస్థ(జన్కో) కు సమకూర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నది. ఇప్పటికే విద్యుత్‌ సంస్థలు రుణ భారంతో సతమ తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్ర రవాణా సంస్థ (ఎ.పి. యస్‌.ఆర్‌.టి.సి.) రూ. 5,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతను చేపట్టాలన్న డిమాండ్‌ ఉండనే ఉన్నది. ఈ కోవలోనే మరికొన్ని ఆర్థిక భారాలను నూతన రాష్ట్రం విధిలేని పరిస్థితుల్లో మోయక తప్పని పరిస్థితి ఉన్నది.
ఓట్లేసి అధికార పీఠాన్ని అప్పగించిన ప్రజలకు- ఎన్నికల హామీలన్నిటినీ తు.చ. తప్పకుండా అమలు చేయాలని అడిగే హక్కు ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టుకొంటూ, ఆర్థికంగా చితికిపోయి ఉన్నసామాన్య ప్రజానీకంపై భారాలు మోపకుండా, ఆదాయాన్ని పెంచుకొంటూ చేసిన వాగ్దానాలను అమలు చేయడం ద్వారా విశ్వాసాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్నది. అదే సందర్భంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని పదే పదే చెబుతున్న మాటలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు తనకు తానుగా తలకెత్తు కొన్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో తానే పెద్ద కూలీనని కూడా ప్రకటించుకొన్నారు.
అడుగు ముందుకు ఎలా?: అవశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అండగా ఉంటానని ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గట్టి వాగ్దానం చేశారు. హైదరాబాదు నగరం సాప్‌‌ట వేర్‌ రంగంలో ప్రగతి సాధించిందని, ఆంధ్ర నాట హార్‌‌డ వేర్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, విశాలమైన సముద్ర తీరాన్ని, రాష్ట్రంలో లభిస్తున్న ఖనిజాల ఆధారంగా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని నిర్దిష్ఠమైన హామీలు కూడా ఇచ్చారు. నేటి వరకు అభివృద్ధికి కేంద్ర స్థానంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాథికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాథి కల్పనతో కూడిన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి మాత్రమే వారి భవిష్యత్తుకు భరోసా కల్పించగలదు. నేడు దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఉపాథి రహిత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ తరహా విధానాల వల్ల కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి జీవనోపాథి లభించదు. జీవన ప్రమాణాలూ పెరగవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగక పోగా మరింత పతనమవుతుంది. మార్కెట్లో సరుకులు అమ్ముడు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన వనరు అయిన అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరగదు. మానవ వనరుల అభివృద్ధి, సక్రమ వినియోగంపైనే రాషా్టభ్రివృద్ధి కూడా ఆధారపడి ఉన్నది.
కృష్ణా- గోదావరి బేసిన్‌లో అపారమైన సహజవాయువు నిల్వలున్నాయని గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్నాయని, 970 కి.మీ. విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా విద్యుత్‌ ఉత్పాదనలో మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చునని కలలు కనేవారూ లేకపోలేదు. గత ప్రభుత్వాలు అలాంటి అనాలోచిత విధానాల అమలుకు పూనుకొని సుమారు 35,000 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేసి, సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. వాటి వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, సారవంతమైన వ్యవసాయ భూములు నిరుపయోగం కావడం, రైతు కూలీల జీవనోపాథి గొడ్డలిపెట్టుకు గురికావడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సౌర విద్యుదుత్పాదనపై దృష్టిసారించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కో కు ఆర్థిక పరిపుష్ఠి కల్పించడం ద్వారా ప్రోత్సహించాలి.

ఆశ్రీత పెట్టుబడిదారీ దృక్పథంతో ఆర్థిక, పారిశ్రామిక విధానాలను రూపొందించుకొని అమలు చేస్తే ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య మరింత అంతరాలు పెరిగిపోతాయి. విశాఖ- చెన్నయ్‌- కోస్తా కారిడార్‌ పేరిటో, పెట్రో కారిడార్‌ పేరిటో అపసవ్యమైన విధానాలను రూపొందించుకొని అమలుకు పూనుకొంటే ప్రజల నుండి ప్రతిఘటనను చవిచూడవలసి వస్తుంది. అందుచేత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో, అత్యంత నైపుణ్యంతో వ్యవహరించాలి. దూరదృష్టితో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలువేసే శాస్త్రీయమైన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణకు పూనుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉన్నది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల భావజాలానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ, అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తే కొత్త కొత్త సమస్యలకు ఆజ్యం పోసినట్లవుతుంది. అందుకే గత చరిత్రను గమనంలో ఉంచుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటి ప్రభుత్వరంగ సంస్థలనుండి పెట్టుబడుల ఉపసంహరణద్వారా నిధులను సేకరించుకొని వార్షిక బడ్జెట్‌ లోటును భర్తీ చేసుకొనే ప్రైవేటీకరణ ఆర్థిక నీతినే మోడీ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది. కార్పొరేట్‌ రంగానికి ప్రాధాన్యతఇస్తే తప్పేమిటని కేంద్ర విత్తమంత్రి అరుణ్‌ జెట్లీ బహిరంగంగా వ్యాఖ్యానించారంరటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు ఎలా ఉండబోతాయో సుస్పష్టమే. నేటి వరకూ ప్రభుత్వాలు వల్లెవేస్తూ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పిపిపి) అభివృద్ధి నమూనా స్థానంలో- ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యం (పిపిపిపి) ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి నమూనా మంత్రంగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి అవుతుందో వేచిచూడాలి. కేవలం కొన్ని రాయితీలు కల్పించి, నామ మాత్రపు నిథులు మంజూరు చేస్తే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథులనుండి ప్రత్యేక కేటాయింపులు చేసి పారిశ్రామికంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో భారీపరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు రాకపోతే ప్రయోజనం ఉండదు.
రాయలసీమ ప్రాంతం- గ్రామ కక్షలకు, హత్యా రాజకీయాలకు నెలవుగా ఉన్నదనే నెపంతో ప్రైవేటు పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పడానికి వెనకాడుతున్నారన్న అపవాదు ఉన్నది. దాని కంటే తీవ్రమైన సమస్య నీటి సమస్య. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా కృష్ణా, తుంగభద్ర నికర జలాలను కేటాయించాలి. భారీ పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన భూమి ఒక్క రాయలసీమలోనే ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఆలోచనే కొరవడింది. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి చొరవ ప్రదర్శించి, ప్రైవేటు పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తేగానీ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడవు. ఆ ప్రాంత వెనుకబాటుతనానికి నివృత్తి ఉండదు. అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్రాధాన్యతా క్రమాన్ని నిర్దేశించుకోనిఎడల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశించిన ప్రగతిని సాధించడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇచ్చే అరకొర పన్నుల రాయితీలు- పారిశ్రామిక వేత్తలు సొంతం చేసుకొని ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే దోహదపడతాయి. నవ్యాంధ్ర ప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత జాగరూకతతో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజల భాగస్వామ్యం తో కృషి చేస్తుందని ఆకాంక్షిద్దాం!

No comments:

Post a Comment