Thursday, July 3, 2014

మన్మోహన్‌ మార్గంలోనే మోడీ

జూలై 4, 2014  సూర్య దినపత్రిక
25 ఏళ్ళనుండి సంస్కరణల భారం
మోయలేకే మోడీకి అధికార దండం
బడ్జెట్‌కు ముందే పెను భారాలు
మింగుడుపడని ఎన్‌డిఎ విధానాలు
నెల రోజుల్లోనే అధిక చార్జీల వడ్డింపు
భగ్గు మన్న రైల్వే, పెట్రోల్‌, గ్యాస్‌
గత ఆర్ధిక విధానాలపై సమీక్ష కరవు
యుపిఎను మించిన బిజెపి
ప్రజల గోడు నేడూ అరణ్య రోదనే!
తొలి బడ్జెట్‌తో తేలనున్న ప్రభుత్వ వైఖరి


చార్జీలు పెంచడమే పరిష్కారమా?

భారత రైల్వేల చరిత్రలో కనీ వినీ ఎరుగనంత భారీ స్థాయిలో ప్రయాణికుల ఛార్జీలను 14.2%, సరుకు రవాణా ఛార్జీలను 6.5% పెంచేశారు. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అమలు చేయడానికి సాహసించ లేదు. ఎన్నికల్లో విజయ దుందుభి మ్రోగించిన మోడీ- నిర్భీతిగా బీరువాలో ఉన్న ఆ దస్త్రాన్ని బయటికి తీసి దుమ్ము దులిపి అందులోని నిర్ణయాన్ని యధాతథంగా అమలు చేశారు. రైల్వే రంగానికి నష్టాలెందుకు వస్తున్నాయో- లోతైన అధ్యయనం చేయకుండానే ఛార్జీల పెంపుదలతో చేతులు దులుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. రైల్వేలలో ఉన్న అవినీతిపై దృష్టిసారించి, ప్రక్షాళన చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలనేవైపే ఆలోచన చేసినట్లు లేదు.

పెరగడమే తప్ప తగ్గని ధరలు:

ఒకవైపున ఇరాక్‌ ఆంతరంగిక సంక్షోభం, మరొకవైపున డాలర్‌ బలపడి రూపాయి బక్కచిక్కిందని నమ్మబలుకుతూ పెట్రోల్‌ లీటరు ధరను రు.1.69 పైసలు, డీజిల్‌ ధరను రు.0.50 పైసలు చొప్పున చమురు కంపెనీలు జూన్‌ 30నుండి పెంచేశాయి. ఈ పెరుగుదలకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలుచేసే అమ్మకపుపన్ను ఉండనే ఉన్నది. పర్యవసానంగా నిత్యావసర సరుకుల ధరలు ఇంకా పైపైకే పరుగులు తీస్తున్నాయి. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంధన సర్దుబాటు చార్జీల ముసుగులో రైల్వే చార్జీలను, బస్సు చార్జీలను, సరుకు రవాణా చార్జీను ప్రభుత్వాలు ఇంకా ఇంకా పెంచుకొంటూ పోతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజల బ్రతుకులు ఏం కావాలి?

గడచిన రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రజల వెన్ను విరిచాయి. సామాన్య ప్రజ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపకరించే ఆర్థిక విధానాలను అమలు చేయాలని మోడీకి దేశ ప్రజలు అధికారాన్ని అప్పగించారు. ప్రజల ఛీత్కారానికి గురైన యు.పి.ఎ. కూటమి ప్రభుత్వ విధానాలపై లోతైన సమీక్ష చేసి, ప్రజానుకూల విధానాలను రూపొందించి అమలు చేయవలసిన యన్‌.డి.ఎ. కూటమి తాజా నిర్ణయాలు ప్రజలకు మింగుడు పడడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆ వ్యవస్థను బలహీనపరిచే ఎలాంటి చర్య అయినా సమర్థనీయం కాదు. కొద్ది రోజుల వ్యవధిలోనే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగబోతున్న పూర్వరంగంలో ప్రజలపై పెద్దఎత్తున ఆర్థిక భారాలు మోపుతూ ఏకపక్ష నిర్ణయాలను తీసుకొని అమలు చేయడాన్ని బట్టి, మోడీ మార్కు ఆర్థిక విధానాలు- మన్మోహన్‌ అమలు చేసిన ఆర్థిక విధానాల కొనసాగింపేనని సుస్పష్టమవుతున్నది. ఉల్లిపాయలు మొదలుకొని అన్ని నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో నేటి ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమౌతున్నది. ద్రవ్యోల్బణం పైచూపు చూస్తూనే ఉన్నది.

నిత్యం పెరిగిపోతున్న ధరల విషవలయంలో చిక్కి బతుకు పోరుచేస్తున్న ప్రజలగోడు చెవికెక్కించుకొనే స్థితిలో ప్రభుత్వాలు లేవని మరొకసారి రుజువయ్యింది. నరేంద్ర మోడీ పాలనా పగ్గాలు చేపట్టి నెల రోజులు తిరక్క ముందే రైల్వే ఛార్జీలను, పెట్రోల్‌, డీజిల్‌, సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధరలను పెంచేసి, ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ధరల పెరుగుదలకు మూలం నయా ఉదారవాద ఆర్థిక విధానాలే. వాటి అమలు తీరు తెన్నులను సమీక్షించడానికి మోడీ సర్కార్‌ సిద్ధపడకుండా రోగమొకటైతే మందొకటి ఇచ్చే పనిలో ఉన్నట్లు కనబడుతున్నది.కొండత ఆశతో మోడీని భుజాలపై మోసుకెళ్ళి డిల్లీ గద్దెపై కూర్చుండబెడితే, ఓటేసిన సిరా గుర్తు చెరిగి పోకముందే- పలు ఆర్థిక భారాలు మోపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. మోడీ బాదుడు మొదలయ్యిందని విమర్శకులు గళమెత్తగానే- ఆర్థిక మంత్రి అరుణ్‌ జెట్లీ మొదలు మంత్రులందరూ ఏ మాత్రం తడుముకోకుండా- యు.పి.ఏ. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని, అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిపోయిన వాటినే తాము అమలు చేస్తున్నామని- నిస్సిగ్గుగా సెలవిచ్చారు.

ఆ మాత్రం భాగ్యానికి వారిని గద్దె దించి వీరిని ఎక్కించడం ఎందుకో!రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని మన్మోహన్‌ ప్రభుత్వమే తీసుకొని ఉండవచ్చు. కానీ ఆ నిర్ణయంలో ఉన్న హేతుబద్ధతను, అలాగే సామాన్య ప్రజలు ఆ భారాన్ని మోయగల స్థితిలో ఉన్నారా, లేరా అన్న విచక్షణను యన్‌.డి.ఎ. కూటమి ప్రభుత్వం ప్రదర్శించక పోవడం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో అన్ని ప్రభుత్వాలకు- హనీమూన్‌ అనుభవించే భాగ్యం లభించినా, తన ప్రభుత్వానికి వంద రోజులు కాదుగదా- వంద గంటలు కూడా ఆ సౌక్యాన్ని అనుభవించే అవకాశం లభించలేదని మోడీ తెగ బాధపడిపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్‌ భ్రష్ఠు పట్టించిందని, చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించిన ప్రధాన మంత్రి మోడీ- సామాన్యులపై కొరడా ఝుళిపించారే గానీ కార్పొరేట్‌ శక్తులకు అసంతృప్తి కలిగించే ఒక్క చిన్నచర్యను కూడా ఇప్పటివరకు తీసుకోలేదన్నది గమనార్హం. పైగా ఆటోమొబైల్‌ రంగంలోని పరిశ్రమలకు లాభాలు గడించి పెట్టడానికా అన్నట్లు, ఎక్సజ్‌ సుంకంపై ఇస్తున్న రాయితీని డిసెంబర్‌ వరకు పొడిగించారు.

ఈ చర్యలన్నింటినీ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
రద్దీ సీజన్లలో తత్కాల్‌ కోటాను 40% వరకు పెంచేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఫలితంగా రెండు నెలలకు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవడానికి ప్రయాణికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతున్నది. చాలా ముందస్తు రిజర్వేషన్లు చేసుకొని, ప్రయాణాలు రద్దు చేసుకోవడం ద్వారా రైల్వేలకు వస్తున్న ఆదాయం గణనీయంగా ఉంటున్నది. తత్కాల్‌ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. సాధారణ బోగీలలో ప్రయాణించడమంటే నరకయాతనే. బోగీ సామర్థ్యానికి మించి రెండింతలు, మూడింతల టిక్కెట్లు జారీ చేస్తారు. ఇలా వివిధ రూపాలలో ప్రయాణికులను దోపిడీ చేస్తూ కూడా- నష్టలొస్తున్నాయని ఛార్జీలను భారీగా పెంచారు. కానీ, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను, భద్రతను కల్పించడం ద్వారా సురక్షితమైన ప్రయాణానికి అవసరమైన చర్యలను మాత్రం తీసుకోవడం లేదు. అందు వల్లనే రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

తాజాగా దర్బాంగ్‌ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాద ఉదతం కళ్ళ ముందు కదలాడుతున్నది. ఏ రోజు, ఎక్కడ, ఏ రైలులో మంటలు చెలరేగుతాయో, ఏ రైలు ఎక్కడ పట్టాలు తప్పుతుందో- అన్న భయాందోళనల మధ్యనే విధిలేక ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. దొంగల బెడద మరొక పెద్ద సమస్య. అరచేత ప్రాణాలు పెట్టుకొని రైలెక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. స్టేషన్లు, రైళ్ళ శుభ్రత మొదలుకొని పట్టాల నిర్వహణ వరకు ప్రయివేటు సంస్థలకు అప్పగించేశారు. ప్రమాదాలకు ఒక కారణంగా భావిస్తున్న పాత బోగీల స్థానంలో కొత్త బోగీలను ఏర్పాటు చేయడం లేదు. నిథుల లేమితో రైల్వేలు కునారిల్లి పోతున్నాయని వంక పెట్టి- ఆర్థిక భారాలను మాత్రం ప్రజలపై ఎడాపెడా మోపుతున్నారు. మోడీ సర్కార్‌ తన తొలి బడ్జెట్‌ లోనైనా ఈ అంశాలపైన దృష్టిసారిస్తుందేమో చూడాలి. యు.పి.ఎ. అనుసరించిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలనే యన్‌.డి.ఎ. కూడా మరింత అంకితభావంతో అమలుకు పూనుకొన్నట్లు రైల్వే చార్జీల పెంపుదలతో స్పష్టమవుతున్నది. పెంచిన ప్రయాణికుల చార్జీలలో 4.2%, సరుకు రవాణా చార్జీలలో 1.5% ఇంధన సర్దుబాటు చార్జీ (ప్యూయల్‌ అడ్జస్ట్‌ మెంట్‌ కాంపొనెంట్‌) కూడా ఉన్నది.

అంటే డీజల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆరు మాసాల కొకసారి రైల్వే చార్జీలను పెంచే విధానాన్ని కూడా అమలులో పెట్టారు.అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ఉత్పత్తుల ధరలను అమెరికన్‌ డాలర్లలో నిర్ణయించే విధానం అమలులో ఉన్నది. తద్వారా అంతర్జాతీయ సమాజంపై డాలర్‌ పెత్తనం చేస్తున్నది. తరచు మన రూపాయి విలువ పతనమైపోతూ డాలరు విలువ పెరుగుతున్నది. మనకు కావలసిన చమురు ఉత్పత్తుల్లో 80% పైగా విదేశాల నుండి దిగుమతి చేసుకొంటున్నాము. విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక భాగాన్ని చమురు ఉత్పత్తులు దిగుమతి కోసమే వెచ్చిస్తున్నాము. అరబ్‌ ప్రపంచంలో ఎప్పుడు ఉద్రిక్తతలు నెలకొన్నా ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయి, మన ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి.సబ్సీడిపై పంపిణీ చేస్తున్న వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికొచ్చి, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. వీటిపై సబ్సీడిల రూపంలో ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారాన్నిసమీప భవిష్యత్తులో పూర్తిగా ప్రజలపైకి నెట్టేయాలన్న కృతనిశ్చయానికి మోడీ కూడా వచ్చినట్లు ధృవపడుతున్నది.

రైల్వే చార్జీల భారీపెంపుదలను భారత వాణిజ్య, పరిశ్రమల సమ్యా (అసోచాం) స్వాగతించడాన్నిబట్టి సామాన్యులపై ఆర్థిక భారం మోపడం వారికి ఎంతటి సంతోషాన్ని కలిగించిందో అర్థమవుతుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రైల్వే చార్జీలను, చమురు ఉత్పత్తుల ధరలను పెంచడాన్ని బట్టి ప్రభుత్వ స్వభావం బహిర్గతమయ్యింది. ఈ దుస్సాంప్రదాయాన్నే కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తూ వచ్చింది. ఆ వారసత్వాన్ని బి.జె.పి. నేతృత్వంలోని యన్‌.డి.ఎ. కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడాన్ని బట్టి ప్రజలు కోరుకొన్న మార్పు రాలేదని రుజువవుతున్నది. లీటరు డీజిలుపై రు.3.40, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న కిరోసిన్‌ పై రూ.33.07, సబ్సీడిపై సరఫరా చేస్తున్న వంట గ్యాస్‌ సిలెండరుపై రూ. 449 నష్టాన్ని భరిస్తున్నామని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో నష్టం(అండర్‌ రికవరీ) రూ. 56,550 కోట్లు ఉండవచ్చని చమురు సంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

అండర్‌ రికవరీ అంటే నష్టం అనే భావనను ప్రజల్లో కల్పించే కుటిలనీతిని చమురు సంస్థలు అనుసరిస్తున్నాయి. ప్రతి ఏడాది చమురు సంస్థలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాయి. అంటే లాభాలు గడిస్తున్నట్లే కదా!దేశం ఆర్థికంగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నదన్న మోడీ మాటలకు బలాన్ని చేకూర్చుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు రూ. 5,28,631 కోట్లుగా ఉండబోతున్నదని, పన్నుల రూపంలో ఖజానాకు రావలసిన స్థూల రాబడి రూ. 97,000 కోట్ల మేరకు తగ్గనున్నదని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ జూన్‌ 30న వెల్లడించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే పేదసాదలకు, వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీలను మరింత కుదించి వేసే చర్యలకు పాల్పడవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 70,000 కోట్ల మేరకు పోగేసుకోవాలని ప్రభుత్వం తలపోస్తున్నట్లు వార్తలొచ్చాయి. ప్రణాళికా వ్యయంలో కోతవిధించే అవకాశమూ లేకపోలేదు. వీటన్నింటికీతోడు పార్లమెంటు సమావేశాల తరువాత రెండవ విడత బాదుడుకు రంగాన్ని సిద్ధం చేసుకొన్నట్లు కూడా కనబడుతున్నది.

భవిష్యత్తులో గ్యాస్‌ ధరలు రెండింతలు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్రిష్ణా-గోదావరి బేసిన్‌లోని డి-6 బావిలో ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు యూనిట్‌ ధరను 4.25 డాలర్ల నుండి 8.4 డాలర్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి చేస్తున్నది. గ్యాస్‌ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి వేసింది. ధర పెంచకపోతే పెట్టుబడులు పెట్టడాన్ని నిలుపుదల చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది. స్వదేశంలో ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను రూపాయిల్లో కాకుండా డాలర్లలో నిర్ణయించడం అసంబద్ధమైనది. రిలయన్స్‌ సంస్థ వత్తిడికి నాటి మన్మోహన్‌ ప్రభుత్వం తల ఒగ్గింది. కానీ 2014 ఏప్రిల్‌ 1 నుండి పెంచిన రేట్లను అమలు చేయలేకపోయింది. మోడీ ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతానికి వాయిదా వేసింది. మోడీకి, ముఖేష్‌ అంబానీకి మధ్య ఉన్న అవినాభావ సంకబంధాలు లోకానికి తెలుసు. ప్రభుత్వ అధినేతగా ప్రజల పక్షాన నిలుస్తారా, లేక రిలయన్స్‌ కు దాసోహం పలుకుతారా అన్న విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే!

సిమెంటు ధరల పెరుగుదల ఉదంతం కళ్ళ ముందు కదలాడుతున్న ప్రత్యక్ష సాక్షం. పరిశ్రమల అధిపతులు సిండికేట్‌గా ఏర్పడి రూ. 170 ఉన్న బస్తా ధరను రూ. 325 వరకు పెంచేశారు. అంటే అడ్డగోలు దోపిడీకి పారిశ్రామికాధిపతులు బరితెగించారు. అధిక లాభార్జనే ధ్యేయంగా పెట్టుకొన్న ప్రయివేటు సంస్థలు చేస్తున్న దోపిడీకి కళ్ళెం వేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించడమే కాకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ద్వారా కూడా ప్రజలపై మోతాదుమించి ఆర్థిక భారాలు మోపడం అత్యంత దారుణమైన అంశం. మోడీ అనుసరించబోయే ఆర్థిక విధానం మన్మోహన్‌ అనుసరించిన దానికి భిన్నంగా ఉండదేమో అన్న భావన ప్రజల మెదళ్ళను తొలుస్తున్నది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసి, ధరల నియంత్రణపై మోడీ ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారిస్తుందా, లేదా అన్న విషయం ఈనెల 10న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెటు ద్వారా తెలిసే అవకాశం ఉన్నది.

No comments:

Post a Comment