Wednesday, August 13, 2014

ప్రజల‌ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్న రాచక్రీడ‌



"మా ఉద్యమం సీమాంధ్ర‌ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాత్రమే ఎక్కుపెట్టబడిందని, పొట్ట కూటి కోసం వచ్చిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకొంటామని పదేపదే వల్లె వేసిన తెలంగాణ ఉద్యమకారులు వారి కల సాకారమై, అధికార పగ్గాలు చేతికందగానే నాలుక మడతబెట్టి, మాట మార్చారు. తెలంగాణలోని పాలక పార్టీ అంబుల పొదలో నుంచి ఒక్కొక్క ఆయుధాన్ని తీసి ఎక్కుపెడుతున్నారు. స్థానికత అంశ‍ంపై వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినమైన 1956 నవంబరు 1ని ప్రాతిపథికగా పరిగణించి స్థానికులెవరో! స్థానికేతరులెవరో! నిర్ధారించి ధృవపత్రాలను జారీ చేసే ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా బోధపడుతున్నది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ రాజథానీ నగరమైన హైదరాబాదు, తెలంగాణలోని ఇతర జిల్లాలలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి అనేక దశాబ్దాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న సామాన్య‌ ప్రజలు, వారి పిల్లల‌ ప్రాథమిక హక్కులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తద్వారా వారి అస్థిత్వాన్నే ప్రమాదపుటంచులకు నెట్టే కుటిల‌ ప్రయత్నాలు జరుగుతున్నట్లున్నది.
స్థానికతతో ముడిబడి ఉన్న‌ఉద్యోగుల విభజనాంశం ఒక కొలిక్కి రాక రెండు రాష్ట్రాల‌ పాలనా యంత్రాంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే వృత్తి విద్యా కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన అంశాన్ని స్థానికతతో ముడిపెట్టి వాయిదా వేయించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్న‍ం సుప్రీం కోర్టులో బెడిసికొట్టింది. రాష్ట్ర విభజన చట్టం, అలాగే అమలులో ఉన్న ఆర్టికల్ 371డి కి అనుగుణంగా అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 31 నాటికి విధిగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాస్తా ఊపిరి పీల్చుకొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్ద విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకార వేతనాల‌ చెల్లింపు అంశాన్నిస్థానికతతో ముడిపెట్టి  ఈ అంశాన్నిఇంకా తెగలాగాలని ప్రభుత్వం చూస్తున్నది. సామాజిక, ఆర్థికాంశాలపై సమగ్ర అధ్యయనం పేరిట ఈనెల 19వ తేదీన ఒక్క రోజులో యుద్ధ ప్రాతిపథికపైన‌ నూతన‌ గణాంకాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవడ‍ం వెనక దాగి ఉన్న చిదంబర‌ రహస్యం ఏమిటి? అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్దంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా రాష్ట్ర రాజథానికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారి గణాంకాలను వర్గీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల నుండి స్థానికేతరుల పేరిట‌ వారిని తొలగించే కుట్రలో అంతర్భాగంగానే ఇదంతా జరుగుతున్నదనే అనుమానాలు సర్వత్రావినిపిస్తున్నాయి.
ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు? ఎవరివి చట్టబద్దమైన వలసలు? ఎవరివి చట్ట వ్యతిరేక వలసలు? రాజ్యాంగం ఏం చెబుతున్నది? చట్టంలో ఏముంది? చారిత్రక వాస్తవాలేమిటో నిగ్గుదేలాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటా సంపాదించుకోవడానికి, ప్రణాళికా సంఘం నుండి నిథులను పొందడానికి మొత్తం రాష్ట్ర‌ జనాభాను ప్రాతిపథికగా చూపెట్టి లబ్ధిపొందుతారు. విభజన చట్ట ప్రకారం జనాభా ప్రాతిపథికగా ఆస్తులు పొందారు. వారు చెల్లించే పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. కానీ సంక్షేమ పథకాల‌ లబ్ధిదారుల ఎంపిక‌ వచ్చేసరికి స్థానికత సమస్యను లేవనెత్తి ఉమ్మడి రాష్ట్ర కాలంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారు అన‌ర్హులంటారు. స్థానికేతరులగా ముద్రవేసి ద్వితీయ పౌరులుగా జీవించాలనడం సమంజసమా? ఆంధ్ర పునాదులున్న‌ వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వనగూడ్చితే తెలుగేతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు కూడా వాటిని డిమాండ్ చేస్తారని వక్రబుద్ధితో సమాధానాలు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. 1956కు పూర్వం స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారే తెలంగాణా వారని, అటుపై ఈ ప్రాంతానికి వలస వచ్చిన వారంతా తెలంగాణాయేతరులని సూత్రికరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయ‍ం తీసుకొంటే, అది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర‌ విభజన‌ చట్టానికి లోబడి ఉన్నదా? లేదా? అన్న అంశాలు న్యాయ స్థానాలే తేల్చవలసిన దుస్థితి నెలకొంటున్నది.
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రజలే కాదు తెలంగాణలోని ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వలసొచ్చిన ప్రజలు కూడా 1956కు పూర్వం స్థానికతను రుజువు చేసుకోవడానికి మూడు తరాల మూలాలకు సంబంధించిన ధృవపత్రాలను ఆధారాలుగా చూపెట్టాల్సి ఉంటుంది. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొత్తం 1959 సంవత్సరానికి పూర్వం ఆంధ్ర ప్రాంతంలో అంతర్భాగంగా ఉండింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న మునగాల ప్రాంతం  కృష్ణా జిల్లాలో ఉండేది, అలాగే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్, అలంపూర్ ప్రాంతాలు కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉండేవి. ఈ ప్రాంతాల‌ ప్రజలు స్థానికులు అవునో కాదో తేల్చాల్సి వస్తుంది. ఈ సమస్య ఒక విషవలయంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయలబ్ధి కోసం అమాయక‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడడం, విద్వేషాన్ని రెచ్చగొట్టి, వివక్షతను ప్రదర్శించడం, తెలుగు ప్రజల అభ్యున్నతికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుంది. రెవెన్యూ అధికారుల నుండి ధృవపత్రాలను పొందడంలో అవినీతి పై చేయి సాధించి తెలంగాణ సమాజం తీవ్రమైన‌ గందరగోళంలోకి నెట్టబడుతుంది. ఈ అంశంపై తెలంగాణ మేథావి వర్గ‍ం, మరీ ప్రత్యేకించి వామపక్ష మేథావులుగా చెప్పుకోబడేవారు ఎందుకని స్పందించడంలేదు?
స్థానిక, స్థానికేతరుల అంశాన్ని తేల్చడానికి 1956కు ఉన్న హేతుబద్ధత, రాజ్యాంగబద్ధత‌ ఏమిటి? రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన‌ 2014 జూన్ 2కు లేని హేతుబద్ధత ఏమిటో కూడా ఆలోచించాలి. తమ సొంత‌ రాష్ట్ర‍ రాజథానీ నగరమైన‌ హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రజానీకం యొక్క ప్రాథమిక‌ హక్కులను కాలరాస్తూ వలసవాదులుగా చిత్రీకరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా? స్థానికత సమస్య పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు మరియు కాంట్రాక్టర్లు, ఇతర‌ సంపన్నుల జీవితాలను ప్రభావితం చేసే సమస్య కాకపోవచ్చు. కానీ, పేదసాదలు, మధ్యతరగతి ప్రజానీకం యొక్క ఉనికి, అస్థిత్వంతో ముడిపడిన జీవన్మరణ సమస్య. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో 1969,72 లలో జరిగిన విభజనోద్యమాల‌ నేపథ్యంలో తెలుగు జాతి అభ్యున్నతిలో సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో రాజ్యాంగానికి సవరణ చేసి ఆర్టికల్ 371డి ని పొందుపరిచారు. తదనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఆర్టికల్ 371డి అమలులో ఉన్నతెలంగాణ‌ రాష్ట్రంలో జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ 370ని అమలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చెల్లుబాటు అవుతాయా? ఈ రెండు ఆర్టికల్స్ భిన్నదృక్పథాలతో రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా అమలులోకి తేబడ్డాయి. ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాల పరిరక్షణా ధ్యేయంగా దేశ విభజన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని రూపొందిస్తే, ఆర్టికల్ 371డి ని తెలుగు ప్రజల ఐక్యతా పరిరక్షణా లక్ష్యంగా రూపొందించబడింది. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.
మన దేశంలో, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వలసల అంశాన్ని కాసేపు ప్రక్కనపెట్టి ఒక దేశం నుండి మరొక దేశానికి మానవ వనరుల‌ వలసల అంశంపైన, కాందిశీకుల సమస్యపైన‌ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా ఆలోచించాలి. ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాము. ఇరవై మరియు ఇరవై ఒకటవ శతాబ్దాలలో వలసలు ఒక అనివార్య సామాజిక‌ పరిణామంగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తున్నది. ద్రవ్య పెట్టుబడి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న‌ మానవ వనరులకు దేశ సరిహద్దులను బార్లా తెరిచి ప్రభుత్వాలు ఘనస్వాగతం పలుకుతున్నాయి. అలాగే ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వలసలు వెళ్ళడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది. ఉన్నచోట జీవితావసరాలను, కోర్కెలను తీర్చుకోలేని దుర్భర పరిస్థితులు, కరవు కాటకాలు, వ్యవసాయ‍ రంగం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ‌ బలహీనపడడం, భవిష్యత్తుకు బరోసా లేకపోవడం వల్ల ఉపాథి, మెరుగైన  మౌలిక సదుపాయాలు మరియు జీవనం కోసం నూతన‌ అవకాశాలను వెతుక్కొంటూ ప్రజలు వలసలు వెళ్ళడమనేది అనాదిగా జరుగుతున్న ప్రక్రియే. బ్రిటీష్ పాలకులు మొదలు నైజాం నవాబు వరకు పాలనా యంత్రాంగంలోను, అభివృద్ధి కార్యకలాపాల అవసరార్థం వలసలను ప్రోత్సహించి నైపుణ్యం ఉన్న మానవ వనరులను సమకూర్చుకొన్నారు. స్వాతంత్ర్యానంతరం క్రమేపీ పట్టణీకరణ, నగరీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంతో గ్రామసీమల నుండి పెట్టుబడులతో పాటు నైపుణ్యం ఉన్న మరియు లేని మానవ వనరులూ పట్టణాల బాట పట్టాయి. ఆకలికి, పేదరికానికి, జీవనోపాథికి, సామాజిక భద్రతకు సరిహద్దులు లేవు. సమస్యల్లా! అవి చట్టబద్దమైన వలసలా? చట్ట వ్యతిరేకమైన వలసలా? అన్నదే. ఈ అంశాన్ని విసక్షణతో రాగ ద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగం మరియు అమలులో ఉన్న‌ చట్టాల పరిథిలో ఆలోచించాలి.
దేశ విభజన నేర్పిన పాఠం: భారత దేశ విభజన జరిగి 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించిన నాటి నుండే తూర్పు పాకిస్తాన్, తరువాత బాంగ్లాదేశ్ గా విముక్తి పొందిన మీదట కూడా మన దేశానికి పదుల లక్షల సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజానీకం వలస వచ్చారు. వారిలో చట్టబద్ధమైన ధృవపత్రాలు ఉన్నవారు, లేనివారు ఉన్నారు. భారత్- బాంగ్లాదేశ్ ల మధ్య దౌత్యసంబంధాలకు ఇది కంటిలో నలుచులాగా చికాకుపెడుతూనే ఉన్నది. ఇంతటి సున్నితమైన, సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించుకోవడానికి 1971 మార్చి 25 వ తేదీని ప్రాతిపథిక సంవత్సరంగా పరిగణించాలని, అటుపై వలస వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించకూడదన్న అంశంపై స్థూలమైన‌ ఏకాభిప్రాయం రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వంలో వెల్లడవుతున్నది. ఈ తేదీని పరిగణలోకి తీసుకోవడానికి ఒక చారిత్రక ఘట్టం ప్రాతిపథికగా నిలిచింది. తూర్పు పాకిస్తాన్ లో నాడు జరిగిన ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘనవిజయం సాధించిన మీదట బాంగ్లాదేశ్ పేరిట‌ స్వతంత్ర దేశంగా ప్రకటించుకొన్నది. ఈ పరిణామంపై కన్నెర్రజేసిన పశ్చిమ‌ పాకిస్తాన్ 1971 మార్చి 26న యుద్ధానికి తెరలేపింది. ఆ యుద్ధ కాలంలో పది లక్షల మంది శరణార్థులుగా మన దేశానికి వలస వచ్చారని చెప్పబడుతున్నది. అనేక మంది చట్ట వ్యతిరేకంగానే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్నారు. జఠిలంగా తయారైన ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రక్రియలో భాగంగా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజును ప్రాతిపథిక‌ తేదీగా తీసుకోవాలన్న భావన బలంగా వ్యక్తమయింది. ఈ సంక్లిష్టమైన‌ సమస్య పరిష్కారానికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15వ తేదీని ప్రాతిపథిక‌ తేదీగా నిర్ధారించాలని ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కోరలేదు. సహజంగా దేశాల మధ్య ఉత్ఫన్నమవుతున్న ఇలాంటి సమస్యల వల్ల‌ సార్వభౌమత్యానికి, ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశాలుంటాయి. కానీ, ఈ పరిణామం ప్రత్యేకమైనది. వలస వచ్చిన వారంతా వారసత్వంగా సంక్రమించిన విలువైన‌ ఆస్తులనన్నింటినీ ఉన్నపళంగా వదులుకొని భారత దేశానికి పారిపోయి వచ్చి, ఇక్కడ‌ స్థిరపడ్డారు. అలాంటి వారిలో కొందరు పాకిస్తాన్ నుండి వలస వచ్చి స్థిరపడి చట్టసభలకు ఎన్నికై ఉన్నత పదవులను అధిరోహించి రాజ్యాధికారంలో భాగస్వాములైనారు. చరిత్ర నుండి మంచిని గ్రహించడానికి ఇక్కడ మరొక ముఖ్యమైన ఘటనను ప్రస్తావించుకోవడం ఎంతైనా అవసరం. భారత దేశ విభజనానంతరం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో ప్రప్రథమంగా ప్రసంగించిన‌ మహమ్మదాలీ జిన్నాముస్లింలకు, హిందువులకు మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదని, అందరూ సరిసమానమైన పాకిస్తాన్ పౌరులని విస్పష్టంగా ప్రకటించారు. జిన్నా మరణానంతరం మతచాందసవాదులు 1950లో మతఘర్షణలను, అల్లర్లను రెచ్చగొట్టి బలవంతపు వలసల ద్వారా మన దేశానికి వచ్చి స్థిరపడాల్సిన విధిలేని పరిస్థితులను కల్పించారు. పర్యవసానంగా జరిగిందేమిటి? పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలహీనపడి, సైన్యం పెత్తనం సాగిస్తున్నది. ఉగ్రవాదానికి, పేదరికానికి నిలయంగా మారింది. ప్రప‍ంచ దేశాల పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి చేదు అనుభావాలు అనేక‍ం కనబడతాయి. చారిత్ర నుండి సరియైన పాఠాలు నేర్చుకొనే సంస్కారం నేటితరం రాజకీయ నాయకత్వానికి ఉండాలి. రెండు దేశాల మధ్య నలుగుతున్న వలసల సమస్య పరిష్కార తీరుతెన్నులను ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు 1956 నవంబరు 1న ఆవిర్భవించిన ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రం దురదృష్టవశాత్తు 2014 జూన్ 2 న‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విభజింపబడింది. పర్యవసానంగా ఒక‌ విచిత్ర పరిస్థితి సృష్టించబడింది. ఆర్టికల్ 371డి ని రాజ్యాంగం నుండి తొలగించలేదు, దాన్ని సవరించనూ లేదు. అంటే అది యథాతదంగా అమలులో ఉన్నది. జన్మస్థలాన్ని బట్టే కాదు, పదవ తరగతికి ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యనార్జిస్తే అక్కడ స్థానికులుగా గుర్తించబడాలని ఆర్టికల్ 371డి లో పేర్కొనబడింది. భారతీయ సమాజంలో వివాహిత స్త్రీలు కాన్పు సమయంలో పుట్టింటికెళ్ళి పురుడుపోసుకోవడ‍ం సహజసిద్ధమైన విషయ‍ం. హైదరాబాదులో దశాబ్దాలుగా స్థిరనివాసం ఉన్నా కాన్పు సమయంలో పుట్టింటికెళ్ళి పిల్లలకు జన్మనిస్తే వారిని స్థానికేతరులుగా పరిగణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల జన్మస్థలం ప్రాతిపథికగా పిల్లల స్థానికతను నిర్ణయించబడాలనే మరొక వితండవాదాన్ని కూడా వినిపిస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని అధ్యాయం-2 క్రింద పొందుపరచిన‌ ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు పౌరుల హక్కులు, అస్థిత్వానికి సంబంధించి విస్పష్టంగా పేర్కొనబడింది. భారత స‌రిహద్దుల్లో జన్మించిన లేదా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా భారత సరిహద్దుల్లో జన్మించినా లేదా  నిర్ధేశిత తేదీకి ముందు ఐదు సంవత్సరాలకు పైగా భారత దేశంలో స్థిరనివాసం ఉన్న వారందరినీ పౌరులుగా రాజ్యాంగం గుర్తిస్తున్నది. పాకిస్తాన్ నుండి మన‌ దేశానికి వలస వచ్చిన వారికి కూడా ఆర్టికల్ 6 ప్రకారం పౌర హక్కులు సంక్రమింప జేయడ‍ం జరిగింది. ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులు దేశ మంతటా స్వేచ్ఛగా సంచరించవచ్చు, ఏ ప్రాంతంలోనైనా(జమ్మూ కాశ్మీర్ మినహా) స్థిర‌నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దేశ జనాభాలో 32.6 (28.5%)కోట్ల మంది (2007-08 యన్.యస్.యస్.ఒ. అధ్యయన నివేదిక‌) అంతర్రాష్ట్ర మరియు అంతర్ జిల్లాలకు వలసలు వెళ్ళి స్థిరనివాసం  ఏర్పాటు చేసుకొన్న వారున్నారని తేల్చింది. వలసలకు వివాహ సంబంధాలు, ఉద్యోగ, ఉపాథి వగైరా కారణాలు ప్రధానమైనవని నివేదిక పేర్కొన్నది. విద్య, ఉపాథి, ఆహార సబ్సీడీ, గృహ సదుపాయం, రక్షిత త్రాగు నీరు, పారిశుధ్యం మరియు ఆరోగ్య వసతులు, సామాజిక భద్రత, చట్టభద్రత వగైరా విషయాలలో వలస ప్రజానీకానికి ఉన్న హక్కులను కాలరాయడానికి ఏ ప్రభుత్వమైన పూనుకొంటే అది రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుంది. ఒకే జాతి, ఒకే రాష్ట్రంగా దాదాపు ఆరు దశాబ్దాల పాటు కలిసి జీవిస్తూ అభివృద్ధిలో భాగస్వాములైన‌ ప్రజలను రాజకీయ కారణాలతో వివక్షతకు గురిచేసి, బలవంతపు వలసల వైపు నెట్టాలని చేసే కుట్రలపై ప్రజాస్వామ్య శక్తులు, చైతన్యయుతమైన తెలంగాణ సమాజం కూడా స్పందించాలి.

No comments:

Post a Comment