Monday, August 18, 2014

సర్వేనా! అఫిడవిట్ల సేకరణా!




సమగ్ర కుటుంబ‌ సర్వే అంటే శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలను సేకరించుకోవడం. దానిపై అభ్యంతరం ఎందుకుండాలని కొందరు అమాయకంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. నేను జి.హె.యం.సి. వెబ్ సైట్ లో పెట్టిన సర్వే నమూనా పత్రాలను పరిశీలించిన మీదట నాలో జనించిన ఆలోచనలను మిత్రులతో పంచుకొంటున్నాను.  రాజకీయాలకు, ప్రాంతీయ దురభిమానాలకు అతీతంగా, ప్రజాస్వామ్యయుతంగా, హేతుబద్ధంగా ఈ అంశాలపై దృష్టి సారించి, ఆలోచించి, ఒక నిర్ధారణకు రావాలని మనవి. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరుతో పౌరుల నుండి డిక్లరేషన్ పేరుతో అఫిడవిట్ లను తీసుకొంటున్నది. సర్వే ఐచ్ఛికమని హైకోర్టుకు తెలియజేసింది. భారత ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో పౌరుల నుండి సమాచారాన్ని సేకరించుకొంటుందే గానీ "అఫిడవిట్స్"ను కోరదు. భారత జననగణన‌ చట్టం మేరకు ఈ సర్వే నిర్వహించడ‍ం లేదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్టబద్ధంకాని సర్వేలో పౌరుల నుండి "నాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు" అని అఫిడవిట్స్ కోరడంలోని లోగుట్టేంటో ముందు బహిర్గతం చేయాలి. ప్రభుత్వమన్నాక పారదర్శకంగా, జవాబుదారితనంతో వ్యవహరించాలి. అందులోనూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం.
పౌరుల జనన ధృవీకరణ పత్రం నకలును సర్వేలో భాగంగా సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలోని ఆంతర్యమేమిటి? స్థానికులు, స్థానికేతరులు అన్న వర్గీకరణ చేసుకొని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న‌ సంక్షేమ పథకాల అమలులో తెలుగు ప్రజల మధ్య‌ వివక్షత ప్రదర్శించాలనే దుర్భుద్ధి ఉందనే అనుమానాలు బలంగా వేళ్ళూనుకొన్న పూర్వరంగంలో సర్వే నిర్వహించబడుతున్నది. గోరుచుట్టపై రోకటి పోటన్నట్లు రాష్ట్ర విభజనతో కుదేలై ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ హైదరాబాదీయులను లక్ష్యంగా చేసుకొని 1956 సంవత్సరాన్ని ప్రాతిపథికగా స్థానికతను నిర్ధారిస్తామని పదేపదే తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ఆ మాటలు భారత రాజ్యాంగం, చట్టం ముందు చెల్లుబాటు కావని కొంత మంది మాహా మేధావులు తేలికగా కొట్టిపారేయవచ్చు. కానీ, రాష్ట్ర విభజన తరువాత‌ అభద్రతకులోనౌతున్న పామరులు, అసంఘటిత కార్మికులు, పేద జనం, ఉద్యోగ వర్గాలనే లక్ష్యంగా చేసుకొని బలవంతపు వలసల వైపు ఆ తరగతి ప్రజలను నెట్టి, తద్వారా లబ్ధి పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయంగా టి.ఆర్.యస్. పార్టీ ఆలోచన చేస్తున్నట్లు కనబడుతున్నది. నిజంగా అలాంటి కుట్ర దాగివున్నదేమో! కాస్త విజ్ఞతతో అందరూ ఆలోచించాలి. పైపెచ్చు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ  ప్రసారమాధ్యమాలలో ఆధారాలతో సహా వార్తలు ప్రసారమవుతున్నాయి.
పౌరుల స్థిర/ చరాస్థుల వివరాలు, దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బందికి ఎందుకివ్వాలి? పౌరుల‌ ఆస్థులకు రక్షణ మాటేమిటి? లాండ్ మాఫియాలు పట్టా భూములను కూడా ఆక్రమించుకొని అవినీతి కూపంలో కూరుకపోయిన రిజిస్ట్రేషన్ అధికార యంత్రాంగం సహకారంతో ఏకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్స్ య‌దేచ్ఛగా చేసేస్తున్నారు. అదేంటంటే ఆస్తుల అసలు హక్కుదారుడెవరో విచారించే పని మాది కాదని తప్పించుకొనడానికి, రిజిస్ట్రేషన్ చట్టాన్ని తడికెగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూములు, భవనాలు, అపార్ట్ మెంట్స్ ఆక్రమణలకు గురై అసలు హక్కుదారులు లబోదిబో మంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో ఆస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే నిమిత్తం ఇంటింటికి పంపబడుతున్న ప్రభుత్వ సిబ్బంది లేదా కార్యకర్తలకు అప్పగించాలని ప్రభుత్వం కోరడం తీవ్ర అభ్యంతరకరమే కాదు, చట్ట విరుద్ధం, బాధ్యతారాహిత్యం, అత్యంత ప్రమాదకరం. పౌరులను ఇబ్బందుల పాలు చేసే ప్రమాదకర చర్య. స్థిరాస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బంది నాలుగు డబ్బులకు అమ్ముడుపోయి లాండ్ మాఫియాలకు, దందాలు చేసి అక్రమార్జనకు పాల్పడే రౌడీలు, గూండాలకు అందజేయరని, ఒకవేళ అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చట్టబద్ధమైన "అఫిడవిట్"ను పౌరులకు ఇస్తుందా?
పౌరులందరి నుండి పాన్ కార్డు నంబర్లను, బ్యాంకు/ పోస్టాఫీసు ఖాతాల నంబర్లు, ఏఏ బ్రాంచీలలో ఉన్నాయో! అలాగే ఆ వివరాలున్న పాస్ బుక్ లోని మొదటి పేజీ జిరాక్స్ కాపీలను ఎందుకివ్వాలి? నగదు బదిలీ పథకాన్ని అమలు చేసినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించే సందర్భంలో బ్యాంక్ అకౌంట్ నంబరు అడిగి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ పౌరులందరి వ్యక్తిగత ఖాతాల వివరాల సేకరణ ఎందుకోసం? ఖాతా నంబర్లను ఎవ్వరికీ తెలియజేయవద్దని బ్యాంకుల నుండి తరచూ ఖాతాదారులకు యస్.ఎం.యస్.లు వస్తుంటాయి. అంటే ఖాతాలోని డబ్బును ఎవరు తస్కరించకుండా ఖాతాదారుల రక్షణార్థం బ్యాంకులు ఈ తరహా సమాచారాన్ని చేరవేస్తున్నాయి.
సర్వేని జవాబుదారితనంతో, పారదర్శకంగా, అపార్థాలకు తావివ్వని రీతిలో ఏ ప్రభుత్వమైనా చేయవచ్చు. అందులో భాగంగా పౌరుల నుండి సొంత ఇల్లు ఉన్నదా? ఉంటే ఏ తరహా ఇల్లు? ఫోన్/మొబైల్ ఉన్నదా? గ్యాస్ కనెక్షన్ ఉన్నదా? రెండు చక్రాలు/మూడు చక్రాలు/నాలుగు చక్రాల వాహనాలున్నాయా? ఆస్తి పన్ను కడుతున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి‍పొందుతున్నారా? సాగు భూమి లేదా ఇంటి స్థలం ఉన్నదా? వగైరా సాధారణ‌ సమాచారాన్ని పౌరుల నుండి శాస్త్రీయ పద్ధతులలో సేకరించుకొని దారిద్ర్యారేఖకు దిగువనున్న జనాభా గణాంకాలను వర్గీకరించుకొని సంక్షేమ పథకాల అమలులో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ కార్యాచరణను రూపొంది‍చుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలా చేస్తే పౌరులు కూడా అభ్య‍తరం చెప్పరు. పైపెచ్చు అలాంటి ప్రక్రియలో భాగస్వాములు కావడ‍ం పౌరుల బాధ్యత కూడా.
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే హేతుబద్ధతపై తెలంగాణా సమాజం కూడా స్పందించాలి. 



No comments:

Post a Comment