Tuesday, August 26, 2014

మన ఎన్నికల వ్యవస్థ డొల్లతనం!





ఆగస్టు 26, 2014  సూర్య దినపత్రిక

మన ఎన్నికల వ్యవస్థ డొల్లతనం మరొకసారి చర్చనీయాంశమయ్యింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 31% పొందిన భారతీయ జనతా పార్టీ 282 స్థానాలలో విజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించింది. కాంగ్రెస్ పార్టీ 19.3% ఓట్లను పొందినా కేవలం 44 స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కూడా లభించలేదు. తద్వారా ప్రతిపక్ష నాయకుడి భాగస్వామ్యంతో రాజ్యాంగబద్ధమైన పదవులకు సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయవలసిన ప్రక్రియ‌ ప్రశ్నార్థకమవుతున్నది. అందువల్లనే లోక్ పాల్ ఎంపిక‌ అంశాన్నిసుప్రీం కోర్టు నిర్ధిష్టంగా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్నివివరణ కోరింది. నూతనంగా రూపొందించబడిన‌  జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకం మొదలు సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్(సి.వి.సి.), సమాచార హక్కు చట్టం అమలు కోసం ప్రధాన సమాచార‌ కమీషనర్ మరియు కమీషనర్లు, సి.బి.ఐ. డైరెక్టర్, లోక్ సభ సెక్రటరీ జనరల్ తదితర రాజ్యాంగ పదవులకు అర్హులను ఎంపిక చేసే కమిటీల్లో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడుగా ముఖ్యమైన భూమిక పోషించవలసి ఉన్నది. అధికారికంగా గుర్తించబడిన విపక్ష నాయకుడే లేని దుస్థితిలో రాజ్యాంగ పదవుల నియామక ప్రక్రియ కేవలం పాలక పార్టీ కనుసన్నల్లో తూతూ మంత్రంగా జరిగి పోయే ప్రమాదం ఉన్నది. ప్రతిపక్ష నాయకునికి స్పీకర్ అధికారిక గుర్తింపు ఇవ్వకపోయినా సభ్యుడుగా కాకుండా ఆహ్వానితుడుగా ఆయా కమిటీల్లో పాల్గొనవచ్చన్న‌ వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అది సమర్థనీయం కాదు. సభ్యుడికి ఉండే హక్కులు ఆహ్వానితుడికి ఉండవు, కేవలం  సలహాలు ఇచ్చే అవకాశమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన‌ ప్రతిపక్ష నాయకుడు కీలకమైన పాత్ర‌ పోషించాల్సి ఉండగా సాంకేతిక కారణాలు, లోపభూయిష్టమైన సాంప్రదాయాలు, దశాబ్దాల క్రితం రూపొందించుకొన్న‌ నిబంధనలను తడికెగా వాడుకొని ప్రతిపక్ష నాయకుడ్ని గుర్తించ నిరాకరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు వన్నె తెచ్చే నిర్ణయం కాదు.   
దేశంలోని పాలనా వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని, వాటిని ప్రక్షాళన చేసి పట్టాలెక్కించి, ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను పటిష్టవంతం చేసే గురుతర బాధ్యతను తలకెత్తుకొన్నానని పాలనా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజానీకానికి వాగ్దానం చేశారు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకున్ని ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించ నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తున్నటు తేలిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన సాంప్రదాయాన్ని, నియమ, నిబంధనలకు అనుగుణంగానే, న్యాయ సలహా కూడా తీసుకొన్న మీదట‌ నిర్ణయం తీసుకొన్నానని ప్రస్తుత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ విస్పష్టంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి మనోభావాలకు అనుగుణంగానే స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారనడంలో సందేహం లేదు. పతనావస్థలో ఉన్నప్రధాన‌ ప్రత్యర్థి అయిన‌ కాంగ్రెస్ పార్టీని దెబ్బ మీద దెబ్బకొట్టాలనే రాజనీతిని ప్రదర్శించారే కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లడానికి ఈ చర్య హాని చేస్తుందన్న విశాల దృక్పథం కనబరచకపోవడం మన రాజకీయ నాయకత్వం యొక్క హ్రస్వ‌దృష్టికి నిదర్శనం.
ప్రజా వ్యతిరేక పాలన సాగించిన‌ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన‌ శిక్ష విధించారు. అత్యంత అవమానకరమైన ఫలితాలతో ఆ పార్టీ కోలుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ పరిస్థితి పట్ల దేశంలో ఎవ్వరికీ సానుభూతి లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడికి లోక్ సభలో అధికారికంగా గుర్తింపు నివ్వడం, ఇవ్వకపోవడమన్నది అసలు సమస్య కాదు. కానీ దాని దుష్ప్రభావం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పని విధానంపై అనివార్యంగా పడుతుంది. ఈ సమస్యను మన ప్రజాస్వామ్యం యొక్క నాణ్యతకు సంబంధించిన అంశంగా పరిగణి‍స్తే సమాజానికి మేలు జరుగుతుంది.
స్వాతంత్ర్యానంతరం గడచిన 67 సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు సంబవించాయి. సమాజం ప్రగతి బాటలో ముందడుగు వేస్తున్నది. ప్రజాస్వామ్యంలో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాలు సముచిత పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అవినీతిరహిత, సుపరిపాలన సాగించడానికి విధాన నిర్ణయాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ఎంతైనా అవసరం. ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించడం, గౌరవించడం, సానుకూలంగా స్పందించడం ద్వారా పాలక పక్షం మెరుగైన పాలన సాగించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత‌ పటిష్టవంతం అవుతుంది. ఈ భావనతోనే రాజ్యాంగబద్ధమైన పదవులకు వ్యక్తుల ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడికి సభ్యత్వం కల్పించబడింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఆచరణ కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి తగినసాస్తి జరిగిందని కొందరు అల్పసంతోషాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాంటి భావనల వల్ల ప్రజాస్వామ్యం బలపడదు. రాజకీయ నాయకత్వం సంకుచిత ఆలోచనల బానిసత్వం నుండి విముక్తి చెంది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచన చేయాలి.
ఇంత బ్రతుకు బ్రతికి, ఇంటి వెనకాల పడి చచ్చినట్లు అన్న లోకోక్తిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారయ్యింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కోసం ప్రయత్నించి బంగపడింది. స్వాతంత్య్రానంతరం గడచిన 67 సంవత్సరాలలో దాదాపు 55 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారాన్నివెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంతటి హీనస్థితికి దిగజారిపోయిందో ఈ ఘటనే ప్రబల నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు మన‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ బ్రష్టు పట్టించింది. సత్ సాంప్రదాయాలను నెలకొల్పడానికి బదులు సంకుచిత దృక్పథంతో వ్యవహరించింది. ఫలితంగా నేడు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నా తమ నాయకుడికి చట్టబద్ధంగా ప్రతిపక్ష నాయకుడి హోదాను దక్కించుకోలేక పోయింది.  
పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సముచిత‌ పాత్ర పోషించినప్పుడు మాత్రమే ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి వీలౌతుంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. జాతి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. ప్రతిపక్షం అప్రమత్తంగా ఉంటూ పాలక పక్షం అనుసరించే విధానాలలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎండ గడుతూ, ప్రజానుకూల విధానాల నుండి ప్రభుత్వం గాడి తప్పుతున్నప్పుడు స్పందించి సద్విమర్శ చేస్తూ తన బాధ్యతను సమర్థవంతగా ప్రతిపక్షం నిర్వహించినప్పుడు, పాలక పక్షం జవాబుదారితనంతో ప్రతిపక్షం వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా పాలన సాగించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేసింది. ఆ తప్పుడు మార్గంలోనే మోడీ పయనిస్తూ విపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం చేయడం ద్వారా రాజకీయ లబ్ధిపొందుదామని భావిస్తే దేశానికి మంచిది కాదు.
ఇటీవల జరిగిన సాధారణ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య 543లో 10% స్థానాలు అంటే 55 కూడా దక్కక లేదన్నది వాస్తవమే. కానీ పోలైన ఓట్లలో 19.3% ఓట్లు ఆ పార్టీకి లభించాయన్న వాస్తవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. లోక్ సభ నిర్వహణకు అవసరమైన కోరమ్ సంఖ్య 55, ఆ సంఖ్య కంటే తక్కువ బలం ఉన్న పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించ కూడదన్న నియమాన్ని, సాంప్రదాయాన్నిగతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రాజనీతినే నేడు బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ. కూటమి లోక్ సభ స్పీకర్ ద్వారా అమలు చేయించడ‍ం దుస్సాంప్రదాయాన్ని కొనసాగించడమే అవుతుంది.
ఈ అంశాన్ని121(1) నిబంధన‌ క్రింద లోక్ సభ స్పీకర్ ఆదేశాల పరిథిలోకి తెచ్చారు. పార్లమెంటు సభ్యులకు చెల్లించ వలసిన వేతనాలు, భత్యాల చట్టం - 1977 లో ప్రతిపక్ష నాయకునికి చెల్లించాల్సిన జీత భత్యాల అంశాన్ని కూడా పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాను కేవలం జీత భత్యాల చెల్లింపు అంశంగా పరిగణించడమే తీవ్ర అభ్యంతరకరమైనది.
ప్రథమ లోక్ సభలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎ.కె.గోపాలన్ ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించబడ్డారు. అటుపై 1969 వరకు, ఆ తరువాత 1970 డిసెంబరు నుండి 1977 జూన్ మధ్య కాలంలోనూ, 1979 ఆగస్టు మొదలు 1989 డిసెంబరు వరకు అధికారికంగా గుర్తింపు ఉన్న ప్రతిపక్ష నాయకుడు లోక్ సభలో లేరు. కాంగ్రెస్ పార్టీ నైజానికి ఇది ప్రబల నిదర్శనం. ఆ కుటిల నీతినే కొనసాగించాలనడంలో ఔచిత్యం ఉన్నదా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ హితం దృష్ట్యా ఆలోచించాలి.
దేశంలో మొత్తం 83,41,01,479 ఓట్లు ఉంటే వాటిలో పోలైన ఓట్లు 55,38,01,801 (66.4%). భాజపాకు వచ్చిన ఓట్లు 17,16,57,549(31%). అంటే మొత్తం ఓట్లలో 20.58% మాత్రమే. ఈ ఓట్లతోనే లోక్ సభలోని మొత్తం 543 గాను 282 స్థానాలను సంపాదించుకొని, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసు పార్టీకి పోలైన ఓట్లలో 10,69,38,242 (19.3%)  వచ్చినా కేవలం 44 స్థానాల్లోనే విజయం సాధించింది. లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10% అంటే 55 స్థానాల బలం ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత లభించదు. అమలులో ఉన్న సాంప్రదాయం, నిబంధనల పరిథిలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదాను లోక్ సభ స్పీకర్ తిరస్కరించడాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ వైఖరినే ప్రదర్శించింది కాబట్టి స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీ కోల్పోయింది.  బి.యస్.పి. కి 2,29,46,182(4.1%) ఓట్లు వచ్చినా ఒక్క స్థానం కూడా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల విధానం ఎంతటి లోపభూయిష్టంగా ఉన్నదో ఈ గణాంకాలను బట్టి బోధపడుతుంది.
పార్టీలకు వచ్చిన ఓట్లకు, సీట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి దామాషా ఎన్నికల విధానాన్ని అమలు చేస్తే తప్ప ప్రజా ప్రాతినిథ్య సభ అయిన లోక్ సభలో పార్టీల వాస్తవిక బలాబలాలు, ప్రజాభిప్రాయం ప్రతిబింబించే అవకాశం లేదు. తాజా పరిణామాల పూర్వరంగంలోనైనా ఎన్నికల సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థవంతంగా తీర్చిదిద్దడం, పటిష్టవ‍త‍ం చేయడమన్నదే ధ్యేయంగా పెట్టుకోవాలి.



5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Nice analysis. Either a Parliament or a state assembly, they should take measures to uplift the spirit of democracy. Coming to the percentage of votes, it happens most of the times...the winners or the losers are decided by a narrow margin of votes. Earlier, long time back, i've mentioned in my blog or a Facebook comment, that : if out of 10 people, 8 persons participate in voting, one person got 4 votes and other three got 2,1 and 1 respectively, the one, who got 4 votes becomes the leader... though he was rejected by another 6. But this time, for obvious reasons, the central govt is now formed with an unbeatable majority and after a long time, a stable, powerful govt is in charge. They should think with a big heart to consider the measures and modifications needed to get the things done with a broad mind and a wider perspective. At the same time, we should understand that it takes time to establish certain policies and to reflect the changes in the system..and even more time to see their actual results. we have seen the irresponsible oppositions at the state or central levels, instead of going for a constructive criticism, expressing slogans expecting magic to be unveiled in few months. And it is pathetic to watch their behavior during the sessions. It is the time even for the opposition parties (however rudimentary they may be), to develop an open mind and offer suggestions and constructive feedback for the development of the state/country. Then only they can deserve any such advantages mentioned by you.

    ReplyDelete
  3. I agree with you. But we should not carried by subjective reactions. Both the ruling and opposition parties are responsible for the non functioning of the legislatures. Ruling parties are not interested on fruitful discussions on the existing problems. The Opposition parties instead of playing a positive and constructive role always try to blame the treasury benches. The net result is non functioning of legislatures.

    ReplyDelete