Monday, March 2, 2015

కేంద్ర బడ్జెట్: మోడీ ఆర్థిక 'నీతి'




ప్రచురణ: మార్చి3,2015 సూర్య దినపత్రిక‌

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే తొలి పూర్తి స్థాయి వార్సిక బడ్జెట్ వైపు దేశ ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూశారు. తీరా బడ్జెట్ తీరుతెన్నులు చూశాక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అవాక్కయ్యారు. దానికి ప్రజల అవగాహనా లోపమే తప్ప మోడీది కాదు. తనది 'బిజినెస్ ప్రెండ్లీ' ప్రభుత్వమని పదేపదే మోడీ చెబుతూనే వస్తున్నారు. ఆ మాటకు మనసా వాఛా కట్టుబడి ఉన్నట్లు 2015-16 వార్సిక బడ్జెట్ ప్రతిపాదనలతో దేశ ప్రజానీకానికి మరొకసారి విస్పష్టంగా వెల్లడించారంతే. దాన్ని ఆయన దాచుకోలేదు కూడా. పెట్టుబడికి అనుకూలమైన‌ బడ్జెట్ ఇది అని ఆయన నిర్భీతిగా ప్రకటించుకోవ‌డాన్ని అభినందించాలి. తద్వారా దాగుడు మూతల ఆటకు తెరదించారు. తాను ప్రధాన మంత్రి కావడానికి ప్రజలు ఓట్లు వేసివుండవచ్చు, కానీ తన ఆర్థిక నీతికి అనుగుణంగానే పాలన సాగిస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశాభివృద్ధికి ఉపకరించే పారిశ్రామిక మరియు వాణిజ్యాభివృద్ధి, తద్వారా ఉపాథి కల్పన అన్న లక్ష్యసాధనే తన ధ్యేయమని చెప్పే మోడీ మాటలు ఆచరణలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే! 
సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు కాబట్టి సంపన్న వర్గాలకు అనుకూలమైన ఆర్థిక‌ సంస్కరణల అమలులో వడివడిగా అడుగులు వేయాలన్న కృతనిశ్చయంతో మోడీ ఉన్నట్లు బడ్జెట్ వెల్లడిస్తున్నది. కార్పోరేట్ రంగం తనకు వెన్నుదన్నుగా నిలవక పోతే తానీ స్థితిలో ఉండేవాడిని కాదన్న నగ్న సత్యం ఆయనకు తెలియంది కాదు. కాబట్టే! కార్పోరేట్ రంగం రుణం తీర్చుకోవడానికి 30% ఉన్న కార్పోరేట్ పన్నును రాబోయే నాలుగేళ్ళలో 25%కి క్రమంగా తగ్గించే ప్రక్రియకు ఈ వార్సిక బడ్జెట్ తో శ్రీకారం చుట్టారు. తద్వారా తాను కార్పోరేట్ రంగం పక్షపాతినే అన్న‌ సందేశాన్ని దేశ ప్రజలకు విస్పష్టంగా తెలియజేశారు. మరొక వైపు ప్రస్తుతం 12.23%గా ఉన్న సేవల పన్నును 14%కి పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారు. బడ్జెట్ ప్రతిపాదనలతో తీవ్ర నిరాశకు గురై ఇంకా తేరుకోని ప్రజానీకానికి గోరుచుట్టపై రోకటిపోటులా కొన్ని గంటల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా లీటరుకు రు.3.50 చొప్పున పెంచారు. ఇప్పటికే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయినా ఆ నిష్పత్తిలో వినియోగదారులకు లబ్ధి చేకూరకుండా కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకొంటున్నది. ఈ చర్యలను చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు అన్న సామెత గుర్తుకు రాకమానదు. భ్రష్టు పట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, పరుగులు తీయించే లక్ష్యంతోనే ఈ చర్యలన్నింటినీ అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జెట్లీ నమ్మబలుకుతున్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా మన‌ దేశం మాత్రం 2014-15లో 7.4% ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేసుకొని వెలిగి పోతున్నదని (లెక్కల గారడీ చేయడానికి స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేసే కొలబద్దను మార్చి, నూతన పద్ధతిలో గణాంకాలు తయారు చేశారు), 2015-16లో 8.1% నుండి 8.4% వృద్ధి రేటుకు చేరుకొంటామన్న ధీమాను 14వ ఆర్థిక సంఘం వ్యక్తం చేసింది. దానిపట్ల ఆర్థిక సర్వే నివేదిక పెదవి విరిచింది. ప్రస్తుతానికి మన ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్న స్థితిలో మాత్రమే ఉన్నదని, ఉరకలు వేసే స్థితిలో లేదని పేర్కొన్నది. పారిశ్రామిక ఉత్పత్తులు, వాణిజ్యం మరియు వ్యవసాయ రంగాలకు సంబంధించిన గణాంకాలను పరిగణలోకి తీసుకొంటే ఆర్థిక సంఘం వ్యక్త‍ చేసిన అభిప్రాయం నమ్మశక్యంగా లేదని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి రేటును పెంచుకోవాలంటే ప్రజలకిచ్చే సబ్సిడీల్లో భారీగా కోత పెట్టాలని, మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెద్ద ఎత్తున పెట్టాలని, పెట్టుబడుల కోసమే ప్రభుత్వం అప్పులు చేయాలి తప్ప ప్రణాళికేతర ఖర్చుల కోసం అప్పు చేయకూడదని ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసింది.
ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ 14వ ఆర్థిక సంఘం నివేదిక చెప్పినట్లు దేశం ఆర్థికాభివృద్ధిలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నదని ఘనంగా ప్రకటించుకొన్నారు. కానీ ఆ అభివృద్ధి ఫలాలను సంపద సృష్టికర్తలైన శ్రామికవర్గానికి, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందించక‌పోగా సబ్సిడీల్లో భారీ కోత విధించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రు.2,66,692 కోట్లు సబ్సిడీలపై వెచ్చిస్తే 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో రు.2,43,811 కోట్లకు కుదించారు. అంటే ఆర్థిక సర్వే నివేదికలోని సిఫార్సు మేరకు పేదలకు, రైతాంగానికిచ్చే సబ్సిడీల్లో రు.22,881 కోట్లు కోత పెట్టారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5.1%గా ఉన్నదని, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ 6% మించకుండా కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు తగ్గుతాయని ఆర్థిక వేతలు చెబుతారు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు కనపడవు. పైపెచ్చు ఈ బడ్జెట్ లో ద్రవ్య‌ లోటు 3.9% ఉంటుందని అంచనా వేశారు. అంటే దాన్ని పూడ్చుకోవడానికి కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టక పోవడమో! లేదా మరిన్ని అప్పులు చేయడమో! లేదా ప్రజలపై మరింత పన్నుల భారం మోపడమో! చేస్తారు.
ఈ బడ్జెట్లో చెప్పుకోవడానికి మంచేమి లేదా! అంటే కొన్ని రంగాలకు సంబంధించి ఉన్నది. అసంఘటిత రంగంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడానికి వీలుగా రు.20,000 కోట్ల మూలధనం, రు. 3,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో 'మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర) నెలకొల్పబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పేదలకు సామాజిక భద్రత కల్పించడానికి వీలుగా రెండు భీమా పథకాలను ప్రకటించారు. రు.12 వార్షిక ప్రీమియంతో రు.2,00,000 ప్రమాద భీమా పథకం, రు.330 ల వార్షిక ప్రీమియంతో జీవిత భీమా పథకం, అలాగే రు.1,000 వార్షిక ప్రీమియం వరకు చెల్లించే పథకం ద్వారా జీవితాంతం చెల్లించే వృద్ధాప్య పెన్షన్ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల్లో చందాదారులు చెల్లించే మొత్తాలకు సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం వార్షిక ప్రీమియం మొత్తాలను చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. వీటి ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతారో ఆచరణలో చూడాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం అమలుకు గత ఏడాది కంటే రు.5,000 కోట్లు పెంచి రు.34,699 కోట్లు కేటాయించారు. గత ఏడాది అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకొంటే కేటాయించిన మొత్తంలో రు.14,000 కోట్లకు లోపే ఖర్చు చేశారన్న వాస్తవాన్నికూడా గమనించాలి. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పథకం చట్టబద్దమైనది కాబట్టి పేదల్లో వ్యతిరేకత పెల్లుబకకుండా జాగ్రత్త పడడానికి కేటాయింపులైతే చేశారు. ఎంత వ్యయం చేస్తారో చూడాలి. ర‌హదారులు, రైల్వేలు తదితర‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు.70,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు.25,000 కోట్లు కేటాయింపు చేశారు. నాబార్డుకు రు.25,000 కోట్లు కేటాయించారు. ఇలాంటి కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి కొన్ని మంచి పనులకు నిథులను కేటాయించక తప్పదు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును సమాఖ్య వ్యవస్థ స్పూర్తికి కట్టుబడి అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎనిమిదింటిని రాష్ట్రాల ఖాతాలోకి నెట్టేసింది. ఆ జాబితాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథక‍ కూడా ఉన్నది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకాలను తమ నిథులతో కొనసాగించాలి, లేదా అటకెక్కించాలి. పన్నుల్లో వాటాను 42%కి పెంచి నిథులను కుడి చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకొన్నట్లుగా ఉన్నది. యాతావాతా కేంద్రం నుండి రాష్ట్రాలకు గత ఏడాది లభించిన 62% ఆర్థిక వనరుల తరలింపుకే పరిమితం చేయబడింది. మరి రాష్ట్రాలకు ఒరిగిన మేలేంటో అరుణ్ జెట్లీ గారే చెప్పాలి.
బడ్జెట్ లక్ష్యమేమిటి?: బడ్జెట్ అంటే సాధారణ పరిభాషలో జాతీయ స్థూల ఉత్పత్తి మూలంగా సృష్టించబడే అదనపు విలువ(సర్ ప్లస్ వ్యాల్యూ) నుండి కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాలలో సమకూరబోయే వార్షిక ఆదాయాన్నిఅంచనా వేసి, హేతుబద్దంగా వ్యయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. జాతీయోత్పత్తి నుండి అదనపు విలువ రూపంలో సంపదను గుట్టలు గుట్టలుగా పోగేసుకొంటున్న కార్పోరేట్ మరియు సంపన్న వర్గాలకు ఇబ్బడి ముబ్బడిగా రాయితీలు ఇచ్చి, తమ శారీరక మరియు మేథో శ్రమ శక్తితో జాతీయోత్పత్తికి కారకులైన శ్రామికులకు సంపద పంపిణీలో న్యాయబద్దమైన వాటా కల్పించకపోగా దోపిడీదారుల ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్ద పీఠ వేయడం అత్యంత దారుణం, రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక లక్ష్యాలకే వ్యతిరేకం. సంక్షేమ రాజ్యంలో సామాజిక న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ దృక్పథంతో పరిశీలిస్తే బడ్జెట్ వర్గ స్వభావం బోధపడుతుంది. కార్పోరేట్ సంస్థలు ఆర్జించే లాభాలపై పన్ను, వ్యక్తులుగా శ్రామికులు లేదా ఉద్యోగులు మరియు యజమానులు ఆర్జించే వ్యక్తిగత‌ ఆదాయంపై మినహాయింపులకు మించిన ఆదాయంపై పన్ను, అలాగే మినహాయింపులకు మించిన బహుమతులపై పన్ను వగైరా ప్రత్యక్ష పన్నుల పద్దు క్రిందికి వస్తాయి. పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే ఎక్సజ్ డ్యూటీ, విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వస్తువులపై విధించే కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను తదితరాలు పరోక్ష పన్నులుగా పరిగణించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష‌ మరియు పరోక్ష‌ పన్నుల విధానానికి సంబంధించి ఏ ఏ వర్గాలకు రాయితీలు ఇచ్చారు, ఏ ఏ వర్గాలపై పన్ను భారం మోపారు అన్న అంశాన్ని నిశితంగా పరిశీలించాలిస్తే గానీ బడ్జెట్ ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నదో! ఎవరికి హానికరంగా ఉన్నదో! బోధపడదు. పరోక్ష పన్నుల పెంపు అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడమే. అలాగే ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయాన్ని, వ్యయం చేసేటప్పుడు  అనుసరించబోయే ప్రభుత్వ ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే కేటాయింపులు ఏఏ వర్గాల ప్రయోజనార్థం చేశారో అర్థమవుతుంది. ఈ కోణంలో అరుణ్ జెట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2015-16 సంవత్సరం వార్షిక బడ్జెట్ నిస్సంకోచంగా సంపన్నులకు, కార్పోరేట్ మరియు వ్యాపార వర్గాల ప్రయోజనాలకే పెద్ద పీఠ వేసిందనడం నిర్వివాదాంశం.
ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి: రాష్ట్ర విభజనతో నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర‌ సంక్షోభంలోకి నెట్టారు. ఆ పాపంలో విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఎంత వాటా ఉన్నదో! సహకరించిన బిజెపికి అంతే వాటా ఉన్నది. కనీసం విభజన చట్టంలో పొందుపరచిన‌ మరియు రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి చేసిన వాగ్దానాలకు అనుగుణంగా వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపు ద్వారా న్యాయం చేయాల్సిన నైతిక‌ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. 2015-16 బడ్జెట్ కేటాయింపులను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గోడు పెడచెవిన పెట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నది. రాజధానిలేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గుడ్డిలో మెల్లన్నట్లు విశాఖ మినహా పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగమే వెన్నుముకగా కొనసాగుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతున్నది.
ఈ పూర్వరంగంలో రాజధాని నిర్మాణనికి నిథులను సమకూరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆ వూసే ఎత్త లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఊదరగొట్టి ఇప్పుడేమో రాబోయే రెండేళ్ళలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న‌ బీహార్, పశ్చిమ బెంగాల్ సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చేర్చి ప్రత్యేక‌ ఆర్థిక సహాయ నిథిని నెలకొల్పి దాని ద్వారా ఆదుకొంటామని సెలవిచ్చారు. అంటే ప్రత్యేక హోదా వాగ్దానాన్ని గాలిలో కలిపేశారన్న మాట. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి నిథుల కేటాయింపు చేయలేదు. ఏ మేరకు చేస్తారో కూడా చెప్పలేదు. వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక‌ అభివృద్ధి ప్యాకేజీలను అమలు చేస్తామన్నారు. నేటి బడ్జెట్లో ఆ మాటే మరిచారు. ఆచరణలో నిష్ప్ర‌యోజనకరమైన ఒకటి అర రాయితీలనే మళ్ళీ ఏకరువు పెట్టారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామన్న హామీ అమలు ప్రస్తావన లేదు.  
బహుళార్థ సాధక ప్రాజెక్టయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రు.16,000 కోట్లకుపైగా వ్యయం చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రు.100 కోట్లు కేటాయించడమంటే ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి బహిర్గతమతున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ‍ వెచ్చించిన రు.3,500 కోట్లకు పైచిలుకు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందో లేదో కూడా స్పష్టం చేయలేదు. విభజన చట్టం మేరకు నెలకొల్పుతామని చెప్పిన విద్యా సంస్థలకు తదితర అన్ని కేటాయింపులను కలుపుకొంటే రు.400 కోట్లు కూడా కేటాయించలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రీతిలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు సరిసమానంగా అభివృద్ధిలోకి తెస్తారో! దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే సెలవియ్యాలి. చాలా చాలా మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు, మరి వాటి అమలుకు గీటు రాయి ఆచరణే కదా!
                                                                                                                                    

1 comment:

  1. very nice analysis. also i felt that the decisions regarding salaried employees regarding income tax are a bit confusing.

    ReplyDelete