Monday, June 2, 2014

పోలవరంపై పేచీ ఎందుకు?





Published: Surya Daily May 31st 2014
పోలవర‍ం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు తెలంగాణాలో అంతర్భాగంగా ఉంటే అధికార పగ్గాలు చేపట్టాక కుటిలనీతితో అభ్యంతరాలు లేవదీసి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవచ్చని భావించిన వారికి నిరాశే మిగిలింది. నిర్వాశితులపైన కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రచ్చ చేస్తున్న వారు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకమా? లేదా! నిర్వాశితులకు మెరుగైన సహాయ‌, పునరావాస పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారా? లేదా! ముంపు గ్రామాలపై పెత్తనాన్ని కోల్పోతున్నామనే ఆవేదనకు గురౌతున్నారా? అన్న విషయాన్ని స్పష్టం చేస్తే ప్రజలు వారి నిజ స్వరూపాన్ని అర్థం చేసుకొంటారు. 1956కు ముందున్నసరిహద్దులతో కూడిన‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేసిన వారు ఈనాడు ఏ నైతిక బలంతో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ఆందోళనలు చేస్తున్నారు? ఆ ప్రాంతాలు ఒకనాటి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాలు కదా! పైపెచ్చు తాముకోరని భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాలను బోనస్ గా పొందారు కదా! ఆ ప్రాంతాలు ఒకనాటి ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగమే కదా!  నూతనంగా ఆవిర్భవించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భద్రాచలం రెవెన్యూ డివిజను కోల్పోయి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పర్యవసానంగా ముంపుకుగురయ్యే గ్రామాలున్న మండలాలను మాత్రమే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా పొందగలిగింది. ఇప్పటికే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలతో ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కొత్త సమస్యలు ఎదురుకాకుండా  రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉద్దేశించబడిందని భావించాలి.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన చట్టం అమలు ప్రక్రియలో భాగంగానే ఆ ఆర్డినెన్స్ జారీ చేయబడింది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్న నానుడిగా తెలంగాణ రాష్ట్రం కావాలి, భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాలు మావే అన్న అసంబద్ధవాదన చేయడంలోని ఔచిత్యం ఏ మాత్రం లేదు. జాతీయ ప్రాజెక్టుగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా ఉండడానికి సౌలభ్యంగా ముంపుకు గురయ్యే గ్రామాలున్న మండలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. భద్రాచలం దేవస్థానం ఉన్న‌ పట్టణాన్ని తెలంగాణాలోనే అంతర్భాగంగా కొనసాగించాలని విభజన చట్టంలో పేర్కొన్న దానికి అనుగుణంగా ఆ పట్టణానికి రహదారి కోసం కొన్ని గ్రామాలను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. కానీ పోలవరం నిర్మాణానికి శికండిలా అడ్డుపడదామనుకొన్న దుష్ట‌శక్తులు మాత్రం అవకాశం చేజారి పోయినందుకు నిస్పృహతో రోడ్డుకెక్కారు. తెలంగాణాలో అధికార పగ్గాలు చేబట్టబోతున్న పార్టీ బాధ్యతతో వ్యవహరించక పోతే కొత్తకొత్త సమస్యలతో తెలంగాణా సమాజం ఇబ్బందులుపడే అవకాశం ఉన్నది. మచ్చుకు ఒకటి ప్రస్తావించుకోవాలి. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా చేసే నీటిలో 20 టియంసి లను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ప్రాజెక్టుకు కేటాయించారు. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులైతే మొదలే కాలేదు, కానీ భీమాకు నికర జలాలను సర్దుబాటు చేశారు. ఇప్పుడు ఆధునీకీకరణ పనులకు నిథుల‌ వ్యయం ఆంధ్రప్రదేశ్ చేయాలి, ఆదా అయ్యే నికరజలాలను మాత్రం తెలంగాణ అనుభవించాలి. ఇదెక్కడి న్యాయమని ఆ ప్రాంతం వారు పేచీపెడితే వివాదాలను పెంచుకోవడమే అవుతుంది కదా! రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించక పోతే సమస్యలు, వివాదాల వలయంలోకి ప్రజలను నెట్టివేసే ప్రమాదం ఉన్నది.
బహుళార్థ సాధక ప్రాజెక్టు :  గోదావరి పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌ మూడు వేల టిఎంసీల నికరజలాలు లభిస్తాయని 1980లో అంచనా వేసి ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి 1480 టిఎంసీలను కేటాయించింది. మనం దాదాపు 800 టిఎంసీలను మాత్రమే వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం వినియోగించుకుంటున్నాం. ఇంకా 700 టిఎంసీల నికర జలాలను వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నాము. పర్యవసానంగా ప్రతి సంవత్సరం వరద నీటితో కలిపి సగటున మూడు వేల టిఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నది. వరదలొచ్చినప్పుడు లక్షలాది ఎకరాలలోని పంటలు నీట మునిగి వేల కోట్ల రూపాయల నష్టాలతో రైతాంగం దివాలా తీస్తున్నది. పోలవరం నిర్మాణం ద్వారా వరదల వల్ల జరుగుతున్న ఈ భారీ నష్టాన్ని నివారించవచ్చు. గోదావరి నదిలో సంవృద్ధిగా ఉన్న నీటిని, నీటి ఎద్దడి ఉన్నకరవు పీడిత ప్రాంతాలకు తరలించడం ద్వారా తెలుగు నాట‌ సమగ్రాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఆహార భద్రతకు బరోసా కల్పించవచ్చు.ఈ లక్ష్యానికి అనుగుణంగా నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్‌ (పోలవరం) బహుళార్ధ సాధక ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం తెలుగు జాతి ప్రయోజనాలకు హాని తలపెట్టడమే అవుతుంది. తెలుగు ప్రజల ద‌శాబ్దాల కోరిక నెరవేరబోతున్నప్పుడు దానికి తోడ్పాటును అందించాలే గానీ ద్రోహబుద్ధితో ఆలోచించకూడదు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత నమూనాను బట్టి వివిధ ప్రాంతాల ప్రజానీకానికి బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి.
1) ధాన్యాగారమైన కృష్ణ, గోదావరి డెల్టాకు సాగునీటి సరఫరాలో తరచు ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ధవళేశ్వరం, విజ్ఞేశ్వరం ఆనకట్టలు 10.50 లక్షల ఎకరాలున్న గోదావరి ఆయకట్టకు పంట కాలం మొత్తానికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. రెండు మూడేళ్ళకొకసారి ఇలాంటి చేదు అనుభవాలను రైతాంగం చవిచూస్తున్నది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మాత్రమే గోదావరి ఆయకట్టకు రక్షణ కల్పించబడుతుంది.
2) తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలలో 7. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. 3) కృష్ణా డెల్టా ఆయకట్టకు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 80 టిఎంసీల గోదావరి నీటిని సరఫరా చేసి, తత్ఫలితంగా ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలలో కర్ణాటక, మహారాష్ట్రల‌ వాటా క్రింద 35 టిఎంసీలు పోను మిగిలిన 45 టిఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నది. అలా ఆంధ్రప్రదేశ్ కు సంక్రమించే 45 టియంసి ల నికరజలాలను కరవు పీడిత రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సద్వినియోగం చేసుకోవచ్చు. 4) విద్యుత్ కొరతలతో విలవిల్లాడిపోతున్న పూర్వరంగంలో 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదన చేసుకోవడానికి వీలతుంది. 5) మహానగరంగా అభివృద్ధి చెందిన‌ విశాఖపట్నానికి రక్షిత మంచినీరు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకొన్న ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం 23. 44 టిఎంసీలను సరఫరా చేయాలని ప్రాజెక్టు లక్ష్యాలలో నిర్దేశించుకోవడం జరిగింది. వీటిని ప్రాంతీయ కోణం నుంచి పాక్షిక దృష్టితో చూడరాదు.
జాతీయ ప్రాజెక్టు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఈ దశలో ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డడం తెలుగు జాతి ప్రయోజనాలకు హాని కల్పించడమే. ప్రాజెక్టు నమూనా మార్చాలని, జలాశయం ఎత్తును తగ్గించి ముంపు ప్రాంతాలను తగ్గించాలన్న‌ డిమాండ్లు ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాలకు వ్యతిరేకమైనవి. ప్రస్తుత ప్రాజెక్టు నమూనానే అత్యుత్తమమైనదని నిపుణుల కమిటీ, అలాగే కేంద్ర జల సంఘం లోతైన అధ్యయనం తరువాత నివేదికలిచ్చాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ లో 38, 186 హెక్టార్లు, చత్తీస్‌గఢ్‌లో 1,637 హెక్టార్లు, ఒడిశాలో 1, 182 హెక్టార్ల భూములు, వాటిలో భాగంగా 3, 267 హెక్టార్ల అటవీప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, 34, 143 కుటుంబాలకు చెందిన 1, 40, 275 మంది జనాభా, ప.గో. జిల్లాలో 42 గ్రామాలు, 6,959 కుటుంబాలు, 25, 026 మంది జనాభా, తూ.గో. జిల్లాలో 29 గ్రామాలు, 3, 472 కుటుంబాలు, 11, 874 మంది జనాభా నిర్వాసితులవుతారని అంచనా వేశారు. వీరిలో 45 శాతానికి పైగా గిరిజనులే కావడం గమనార్హం. అందువల్ల ప్రత్యేక దృష్టితో సహాయ, పునరావాస పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులే మొదటి లబ్ధిదారులు కావాలి. ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతం పరిథిలోనే చట్టబద్దంగా ముంపు ప్రాంతాలుంటే నిర్వాశితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్ట‌డానికి సౌలభ్యంగా ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవరోధాలు ఉండవు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు కల్పించాలనే దురుద్ధేశాలున్న వారి ఆటలు సాగవు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మూలంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలోను, నష్ట పరిహారాన్ని చెల్లించడంలోను, సహాయ మరియు పునరావాస పథకాన్ని అమలు చేయడంలోనూ, ఒకటిఅర ఏదైనా అనుమతులు పొందాల్సి ఉంటే వాటిని పొందడానికి భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా త్వరిత గతిన ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని భావించవచ్చు. ఒడిశా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాల నివృత్తికి కూడా కేంద్ర ప్రభుత్వం సత్వరం చొరవ తీసుకొని, ఆ సమస్యను పరిష్కరించి, రానున్న ఐదేళ్ళ కాలంలోనైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం తడిసి మోపిడవుతున్నది.
నిర్వాశితులకే మొదటి న్యాయం: ప్రాజెక్టు నిర్మాణం మూలంగా నిర్వాశితులయ్యే ప్రజానీకానికి, ప్రత్యేకించి సామాజికంగా వెనుకబడ్డ గిరిజనులకు ప్రప్రథమంగా మెరుగైన సహాయ, పునరావాస పథకాన్ని నిబద్ధతతో అమలు చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు డోకా లేకుండా చూడాలి. వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు మార్గాన్ని సుగమం చేయాలి. వెనుకబాటుతనంతో పేదరికంలో మగ్గిపోతూ అనాగరికులుగా జీవిస్తున్న‌ గిరిజనులకు మెరుగైన జీవనోపాథిని కల్పించాలి. వారి సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాల పరిరక్షణకు అనుగుణంగా పునరావాస కేంద్రాలను నిర్మించాలి. ఈ సమస్యల పట్ల‌ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రథమ ప్రాధాన్యతనిచ్చి నిథులు కేటాయించి సహాయ పునరావాస పథకాన్ని అమలుచేయాలి. భూములు కోల్పోయిన వారికి ప్రాజెక్టు ఆయకట్టు క్రిందనే భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించడం ద్వారా వారి జీవనోపాథికి భంగం కలగకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. చేతి వృత్తుల వారికి, గ్రామీణ సేవారంగంలో ఉపాథి పొందుతున్న అసంఘ‌టిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాథి కల్పించాలి. విద్య, వైద్య, రహదారులు, రక్షిత మంచి నీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిర్వాశితులవుతున్న గిరిజనులు మరియు గిరిజనేతరుల న్యాయబద్ధమైన కోర్కెల పరిష్కారంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. విజ్ఞత ప్రదర్శించి, ప్రజల విస్తృత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పోలవరం బహుళార్థ సాధక‌ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం తెలుగు జాతి అభివృద్ధికి సహకరించడమే అవుతుంది.



No comments:

Post a Comment