Monday, June 2, 2014

చీకటి నుంచి చీకటికి

Publised: Sakshi : June 03, 2014 
చీకటి నుంచి చీకటికి
విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది.

 తెలుగు జాతి ఆశా సౌధంగా నిర్మించుకొన్న ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యింది. రాష్ర్ట విభజనతో దగాపడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. రాష్ర్ట విభజనలో  కాంగ్రెస్‌కు ఎంత భాగస్వామ్యమున్నదో, భారతీయ జనతాపార్టీకి కూడా అంతే భాగస్వామ్యమున్నది. కాబట్టి ప్రస్తుతం అధికారం చేపట్టిన మోడీకి ఆంధ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత ఉంది.  అభివృద్ధికి కేంద్రంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాధికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాధికల్పనతో కూడిన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి తక్షణావసరం. విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది.

  శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు 900కిలో మీటర్లకుపైగా విస్తరించి ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొని కొత్త ఓడరేవుల నిర్మాణం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ- కాకినాడల మధ్య పెట్రో కారిడార్, కృష్ణా-గోదావరి సహజవాయువు ఆధారంగా ఎరువుల కర్మాగారాలు, విద్యుదుత్పాదనా కేంద్రాలు వగైరా పరిశ్రమలను నెలకొల్పడానికి చర్యలు చేపట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నేడు చర్చంతా విశాఖ- నెల్లూరు జిల్లాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతంపై కేంద్రీకరించారు. పర్యవసానంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ  కృత్రిమ ‘హైప్’ను తగ్గించి, వాస్తవికతకు దగ్గరగా ప్రజలు ఆలోచించేలా మొదట నిర్మాణాత్మకమైన చర్యలను చేపట్టాలి.

  విద్యుత్ పంపిణీలోనూ ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయానికి గురయ్యింది. ఆస్తులను అప్పులను, జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసి, విద్యుత్తును మాత్రం ప్రస్తుత వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. ఫలితంగా దాదాపు రెండువేల మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. తాత్కాలికంగా కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ శాశ్వతంగా నష్టపరచి, నూతన పరిశ్రమల రాకకు అవరోధం కల్పించడం ఏ మేరకు సమంజసం?  విద్యుత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తే సత్పలితాలుంటాయి.

 భవిష్యత్తు తరాల తలరాతలతో ముడిపడి ఉన్న మౌలిక సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. నేడు జరుగుతున్న చర్చల సరళిని పరిశీలిస్తే లోపభూయిష్టమైన కేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలే మళ్లీ అమలులోకి వచ్చేలా సూచనలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1965-75 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.ఎల్., బి.హెచ్.ఇయల్., ఐ.డి.పి.ఎల్, హెచ్.యం.టి, మిథాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో బి.హెచ్.పి.వి., జెన్‌కో లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది. ప్రభుత్వ పెట్టుబడులతో భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా ముఖ్యంగా హైదరాబాద్, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలలో పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడినాయి. ప్రయివేటు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా తరలి వచ్చి అభివృద్ధికి పాలుపంచుకొన్నాయి.  కానీ నేడు సరళీకృత ఆర్థిక విధానాల అమలు మూలంగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను నెలకొల్పే విధానానికి స్వస్తి చెప్పారు. ఈ పూర్వరంగంలో పారిశ్రామికాభివృద్ధికి కేవలం ప్రైవేటు పెట్టుబడులపైనే ఆధారపడవలసిన అనివార్య పరిస్థితి.

 కానీ రాయలసీమ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధి చేయకుంటే ఎండమావిగానే మిగిలిపోతుంది. శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం వద్ద బి.హెచ్.ఇ.యల్., యన్.టి.పి.సి సంస్థలు సంయుక్తంగా నెలకొల్పుతున్న విద్యుత్ పరికరాల పరిశ్రమను సత్వరం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. తిరుపతి కేంద్రాన్ని ఉన్నత విద్యా కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఐ.టి. తదితర పారిశ్రామికాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని నిర్మించాలి. ఒకవైపున చెన్నై, రెండవ వైపున బెంగళూర్, అలాగే కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

 కడప జిల్లాలో ప్రైవేటు రంగంలోస్థాపించ తలపెట్టి అర్థాంతరంగా ఆగిపోయిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారం స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను స్థాపించవచ్చు. అనంతపురం జిల్లాలో నెలకొల్పి తలపెట్టి మూలనపడిన లేపాక్షి పారిశ్రామికవాడ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావచ్చు. రేణిగుంట రైల్వే వ్యాగన్ రిపేర్ కర్మాగారం స్థాయిని పెంచవచ్చు. కర్నూలు జిల్లాలో ఖనిజాధార పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కడప జిల్లాలోని యర్రగుంట్ల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పరిసరాలలో సిమెంటు కర్మాగారాలు మినహాయిస్తే చెప్పుకోతగ్గ పరిశ్రమలే రాయలసీమలో లేవు. ఈ ప్రాంతాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య నీరు. దానికి పరిష్కారాన్ని కనుగొనాలి.

No comments:

Post a Comment