Monday, June 23, 2014

నవ్యాంధ్రప్రదేశ్ ముందున్న పెను సవాళ్ళు





రాష్ట్ర విభజనతో భవిష్యత్తు మీద బెంగతో కృంగిపోయి ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించి, ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం యొక్క చారిత్రక ఆవశ్యకత నేడున్నది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అపారమైన పాలనానుభవమున్న‌ చంద్రబాబు నాయుడు ఆ బాధ్యతను నిర్వర్తించ గలరనే ప్రబల విశ్వాసంతో ప్రజలు అధికారాన్ని అప్పజెప్పారు. రాజకీయ కోణంలో చూస్తే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మాత్రం తీవ్ర ఆందోళనకరంగాను, అస్పష్టంగాను ఉన్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలించిన వారికెవరికైనా పదమూడు జిల్లాలతో కూడిన నవ్యాంధ్రప్రదేశ్ అంతుచిక్కని ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కోబోతున్నదనే భావన కలుగుతుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి బలవంతంగా నెట్టబడి కొత్త సంసారాన్ని ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్ కు రాష్ట్ర రాజథాని నిర్మాణానికి అవసరమైన నిథుల సేకరణే పెను సవాలుగా నిలిచింది. ఈ పూర్వరంగంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలపై దృష్టిసారించి, ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని, రాష్ట్ర పునర్నిర్మాణానికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు ఉపకరించే ప్రణాళికల అమలుతో త్వరితగతిన ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించాలి. ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసి అన్ని వర్గాల ప్రజానీకానికి అవగాహన కలిగించాలి. అస్థవ్యస్థంగా తయారై ఉన్న పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టాలి. ప్రభుత్వం అమలు చేసే ప్రతి చర్యా జవాబుదారీతనంతో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక ముంద‌డుగుగా ఉండాలి. ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలను అమలు చేయడానికి పూనుకొంటే ప్రతిపక్షం ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడ‍ం ద్వారా నిర్మాణాత్మకమైన‌ పాత్ర పోషి‍చాలి. ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలి.
ప్రభుత్వం నూతనంగా అమలు చేయ‌బోయే ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధి పథకాలేవైనా వికేంద్రీకరణ దృష్టితో రూపొందించి, అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన‌ సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. లేనిపక్షంలో ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగిపోతాయి. పర్యవసానంగా మరొక విచ్ఛిన్నకర ఉద్యమానికి భీజాలు నాటినట్లవుతుంది. నవ్యాంధ్ర‌ప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నమూడు ప్రాంతాల మధ్య  ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు, వైవిధ్యంతో కూడిన సామాజిక పరిస్థితులు ఉన్న విషయాన్ని ముందు గమనంలో ఉంచుకోవాలి. రాయలసీమ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రు. 74,525. రాయలసీమ ప్రాంతలోని మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు రాష్ట్ర తలసరి ఆదాయం కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం జిల్లాల వారిగా తలసరి ఆదాయాలు: 1) విశాఖపట్నం రు. 1,09,800 , 2) క్రిష్ణా రు. 89,398,3) ప్రకాశం రు.81,516, 4) గుంటూరు రు.78,762, 5) నెల్లూరు రు.78,537, 6) పశ్చిమ గోదావరి రు. 78,345, 7)  తూర్పు గోదావరి రు.75,977, 8) అనంతపురం రు.75,463 9) కడప రు.66,015 10)  చిత్తూరు రు.64,816 11) విజయనగరం రు.60,178 12) కర్నూలు రు. 57,311 13) శ్రీకాకుళం రు.52,701.  
అవశేష ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఏకైక మహానగరం విశాఖపట్నం. ఆ జిల్లా తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచింది. ఫలితంగా ఉత్తరాంధ్రాకు విశాఖపట్నం ఆశా కిరణంగా ఉన్నది. రాయలసీమ భవిష్యత్తుకు బరోసా ఇచ్చే అలాంటి నగరం లేదు. కరవుసీమగా గణతికెక్కిన‌ రాయలసీమ రాష్ట్ర విభజనతో అంధ‌కారంలోకి నెట్టివేయబడింది. స్థూలంగా చూస్తే వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందిన‌ మధ్య మరియు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం రు. 80,423 తలసరి ఆధాయంతో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్నది. ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించే సందర్భంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి.
రాష్ట్ర రాజధాని ఎక్కడ, దాని నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి, హైదరాబాదు మహానగరాన్ని తలదన్నే విధంగా రాష్ట్ర రాజధానీ నగర నిర్మాణాన్ని చేపడతాం, సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తాం లాంటి అతిశయోక్తితో కూడిన మాటలు ప్రజలను భ్రమల్లో తేలిపోయేలా చేయడానికే ఉపయోగ‌పడతాయి తప్ప వాస్తవాల ప్రాతిపదికపై ఆలోచనలను రేకెత్తించవు.  ఉద్యోగులకు జీతభత్యాలే చెల్లించుకోలేని దుస్థితిలోఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిథులను కేటాయించి పేదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకాన్ని సామాజిక బాధ్యతగా ఆదుకొంటూ, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నమూనా ఉపాథి కల్పనా సామ‌ర్థ్యాన్ని పెంచడానికి, అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన, సమగ్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. రాష్ట్ర విభజన చట్టంలో నిర్ధిష్టమైన అభివృద్ధి ప్రణాళికను ప్రకటించకుండా తేలికపాటి మాటలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి, ఆర్థికంగా తోడ్పాటును అందిస్తామని చెప్పడంతోనే సరిపుచ్చుకొంటే రానున్న కాలంలో ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది.
ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతున్న అంశాలు: 1) రాష్ట్ర విభజనానంతరం జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన రుణ భారం రు. 1,04,894 కోట్లు. ఇందులో బహిరంగ మార్కెట్ నుండి, కేంద్ర ప్రభుత్వ నుండి తీసుకొన్న‌రుణాలు, అలాగే ఇతర   రుణాలు, ప్రత్యేక పూచీకత్తు ఇచ్చి ఫ్రావిడెంట్ ఫండ్ మరియు చిన్నమొత్తాల పొదుపు పథకాల ద్వారా సేకరించుకొన్న రుణాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని వాగ్ధానం చేసిన కేంద్ర ప్రభుత్వం మొదటి సహాయ చర్యగా కేంద్రం నుండి తీసుకొన్న రుణాలలో రాష్ట్ర వాటాగా వచ్చిన దాదాపు రు.12,000 కోట్లను మాఫీ చేస్తే ఆ మేరకు కాస్త ఊరట కలుగుతుంది. 2) నవ్యాంధ్రప్రదేశ్ రాబడి రు.66,152 కోట్లు అయితే వ్యయం రు. 72,473. వ్యయానికి, రాబడికి మధ్య వ్యత్యాసం రు. 6,321 కోట్లు. అంటే లోటు బడ్జెట్ తో కొత్త సంసారం మొదలయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఎనిమిది మాసాల బడ్జెట్ లోటు దాదాపు రు.16,000 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ద్వారా రు.15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నియంత్రణా చట్టం2003(ఎఫ్.ఆర్.బి.యం.) నిబంధనలను సడలించి అధికంగా రుణాలను సేకరించుకోవడానికి వీలుకల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ప్రసారమాద్యమాలలో వార్తలొచ్చాయి. 3) రాజధాని నగరం లేని రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా ప్రజలపై బలవంతంగా రుద్దారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలతో కూడిన రాజధానీ నగరాన్ని నిర్మించుకోవడానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందో! అన్న చర్చ జరుగుతున్నది. కేంద్ర‍ ప్రభుత్వ పెద్దల నుండి హామీల జల్లులు కురుస్తున్నాయి. కానీ ఆచరణకొచ్చే సరికి ఏ మేరకు నిథులను రాలుస్తారో వేచి చూడాల్సిందే. ఆ భాగాన్ని అటుంచితే రాష్ట్ర ఖజానాపై మాత్రం పెనుభారం పడక తప్పని పరిస్థితి. 4) ఉద్యోగుల‌ వేతన సవరణకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనార్థం సిద్ధంగా ఉన్నది. గడచిన దశాబ్ద కాలంలో అమలు చేయబడ్డ నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీసి ఉద్యోగుల, కార్మికుల నిజవేతనాలు పతనమై కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. పర్యవసానంగా వేతన సవరణ అనివార్యం. ఆ ఆర్థిక భారాన్ని విధిగా మోయవలసిందే. 5) సంక్షేమ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక భద్రత, ఆహార భద్రత‌ కల్పించడం కోసం అమలు చేస్తున్న సబ్సీడీపై బియ్యం, వృద్ధులకు వితంతువులకు - వికలాంగులకు పెన్సన్లు, విద్యార్థులకు బోధనారుసుములు మరియు ఉపకారవేతనాల చెల్లింపు వగైరా సంక్షేమ పథకాల అమలు భారంల ఉండనే ఉన్నది. తీవ్ర‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం, బలహీన వర్గాలకు చెందిన గృహ వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్ రాయితీ తదితర ఆర్థిక భారాలు ఉండనే ఉన్నాయి. 6) కరవు కోరల్లో చిక్కిశల్యమతున్నరాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లా సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చే సదుద్ధేశంతో కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్రo యొక్క సొంత ఆర్థిక వనరుల నుండే వెచ్చించాలి. నికర జలాల ఆధారంగా, కేంద్ర జల సంఘం అనుమతితో నిర్మిస్తున్న ప్రాజెక్టులు కాదు కాబట్టి వీటి నిర్మాణానికి ఆర్థిక సంస్థల నుండి అప్పు చేయడానికి కూడా అవకాశం లేదు. 7) పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి ఆమోదముద్ర వేసింది. ఇది శుభ పరిణామం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందజేసే 90% నిథులకు తోడు మిగిలిన 10% నిథులను ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర‌ ఖజానా నుండే వెచ్చించాలి. 8) రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య‌ తలెత్తే వివాదాల పరిష్కార నిమిత్తం నెలకొల్పబడుతున్న నిర్వ‌హణ బోర్డులకయ్యే ఖర్చులను ఉభయ రాష్ట్రాలు భరించాలి. 9) కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులకు రు. 4,573 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రాథమిక‌ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం దాని వ్యయం రు.6,000 కోట్లకు పెరిగింది. దాని కోసం రుణం తెచ్చుకొనే అవకాశం ఉన్నది. కానీ, అప్పు చేసి కృష్ణా డెల్టా ఆధునీకీకరణ చేపట్టి నికర జలాల వినియోగంలో ఆదా చేసే నీటిలో 20 టి.యం.సి.లను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడుతున్న  భీమా ఎత్తిపోతల పథకానికి ఇవ్వాలి. రుణ భారం మాత్రం ఆంధ్రప్రదేశ్ పైనే పడుతుంది. 10) మౌలిక సదుపాయాలలో విద్యుత్ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా రుణ భారాన్ని జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్తును మాత్రం గడచిన ఐదేళ్ళ వియోగం సగటును లెక్కించి ఆ ప్రాతిపథికన పంపిణీ చేసింది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్తులోనే విద్యుత్ కొరతను పెద్ద ఎత్తున ఎదుర్కోబోతున్నది. నేడు ఉన్న విద్యుత్ అవసరాలకు తోడు నీటి పారుదల రంగంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్ కావాలి. పారిశ్రామికంగా వెనుకబడ్ద ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటే ముందుగా అందుబాటులోకి రావలసింది విద్యుత్తే. కాబట్టి విద్యుదుత్పత్తికి అవసరమైన పెట్టుబడులను జెన్కోకు సమకూర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లపై రు. 3,332 కోట్ల రుణ భారం ఉన్నది. 11) ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్ర రవాణా సంస్థ(ఎ.పి.యస్.ఆర్.టి.సి.) రు.5,000 కోట్ల అప్పుల్లో కూరుకపోయి మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యింది. ఈ రుణ భారాన్ని కూడా జనాభా ప్రాతిపథికపైనే పంపిణీ చేయబోతున్నారు. ఈ కోవలోనే మరికొన్ని ఆర్థిక భారాలను నూతన రాష్ట్రం విధిలేని పరిస్థితుల్లో మోయక తప్పని పరిస్థితి.
పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిశీలిస్తే నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంతటి గడ్డు స్థితిలోకి నెట్టివేయబడి ఉన్నదో  ఎవరికైనా బోధపడుతుంది. దీనికి తోడు అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చంద్రబాబు వాగ్దానాల మీద వాగ్దానాలు చేశారు. ఓట్లేసి అధికార పీఠాన్ని అప్పగించిన‌ ప్రజలకు ఆ ఎన్నికల హామీలన్ని‍టినీ తూ. ఛా తప్పకుండా అమలు చేయాలని అడిగే హక్కు ఉన్నది. అందువల్ల జనం కోర్కెలు గుర్రాలై పరిగెడుతున్నాయ్! రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టుకొంటూ, ఆర్థికంగా చితికి పోయి ఉన్న ప్రజానీకంపై భారాలు మోపకుండా ఆదాయాన్ని పెంచుకొంటూ చేసిన వాగ్దానాలను అమలు చేయడం ద్వారా విశ్వాసాన్ని నిలబెట్టుకొనే గురుతర బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్నది. అదే సందర్భంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ను నిర్మించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని పదేపదే చెబుతున్న మాటలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు తనకు తానుగా తలకెత్తుకొన్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో తానే పెద్ద కూలీనని కూడా ప్రకటించుకొన్నారు.
అడుగు ముందుకు ఎలా?: అవశేష‌ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా ఉంటానని ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గట్టి వాగ్దానం చేశారు. హైదరాబాదు నగరం సాప్ట్ వేర్ రంగంలో ప్రగతి సాధించిందని, ఆంధ్ర నాట హార్డ్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, విశాలమైన సముద్ర తీరాన్ని, రాష్ట్రంలో లభిస్తున్న ఖనిజాల ఆధారంగా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్న‌ నిర్ధిష్టమైన హామీలు కూడా ఇచ్చారు. నేటి వరకు అభివృద్ధికి కేంద్ర స్థానంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాథికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాథి కల్పనతో కూడిన‌ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి మాత్రమే వారి భవిష్యత్తుకు భరోసా కల్పించగలదు. నేడు దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఉపాథి రహిత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ తరహా విధానాల వల్ల కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జీవనోపాథి లభించదు. జీవన ప్రమాణాలూ పెరగవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగక పోగా మరింత పతనమవుతుంది. మార్కెట్లో సరుకులు అమ్ముడు పోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన వనరు అయిన‌ అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరగదు. మానవ వనరుల అభివృద్ధి, సక్రమ వినియోగంపైనే రాష్ట్రాభివృద్ధి కూడా ఆధారపడి ఉన్నది.
కృష్ణా - గోదావరి బేసిన్ లో అపారమైన సహజవాయువు నిల్వలున్నాయని గ్యాసాధారిత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్నాయని, 970 కి.మీ. విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా విద్యుత్ ఉత్పాదనలో మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించ వ‌చ్చని కలలు కనేవారూ లేకపోలేదు. గత ప్రభుత్వాలు అలాంటి అనాలోచిత విధానాల అమలుకు పూనుకొని సుమారు 35,000 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుదుత్ఫ‌త్తి కేంద్రాల ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేసి, సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. వాటి వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, సారవంతమైన వ్యవసాయ భూములు నిరుపయోగం కావడం, రైతు కూలీల జీవనోపాథి గొడ్డలిపెట్టుకు గురికావడం లాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సౌర విద్యుదుత్పాదనపై దృష్టిసారించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్ కో కు ఆర్థిక పరిపుష్టి కల్పించడం ద్వారా ప్రోత్సహించాలి.
ఆశ్రిత పెట్టుబడిదారీ దృక్పథంతో ఆర్థిక, పారిశ్రామిక విధానాలను రూపొందించుకొని అమలు చేస్తే ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య మరింత అంతరాలు పెరిగిపోతాయి. అందుచేత‌ రాజ్యాంగ వ్యవస్థ‌, రాజకీయ వ్యవస్థ బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో, అత్యంత నైపుణ్యంతో వ్యవహరించాలి. దూరదృష్టితో అన్ని ప్రాంతాల‌ సమగ్రాభివృద్ధికి బాటలు వేసే శాస్త్రీయమైన ప్రణాళికల‌ను రూపొందుకొని కార్యాచరణకు పూనుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉన్నది. పలు జఠిలమైన సమస్యలు ఎదురు కాబోతున్నాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాల భావజాలానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకాన్ని అమలు చేస్తే కొత్తకొత్త సమస్యలకు ఆజ్యం పోసినట్లవుతుంది. అందుకే గత చరిత్రను గమనంలో ఉంచుకోవాలి.
అతివిశ్వాసంతో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆధారపడితే భంగపడక తప్పదనిపిస్తోంది. పార్లమెంటు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగ పాఠవాన్ని పరిశీలిస్తే యు.పి.ఎ. ప్రభుత్వం భ్రష్టుపట్టించిన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి, స్థూల జాతీయోత్ఫత్తిని పెంచుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిథులను సేకరించుకొని వార్షిక బడ్జెట్ లోటును భర్తీ చేసుకొనే దుస్థితిలో గత ప్రభుత్వం ఉండేది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వామి అవుతుందో వేచిచూడాలి. కేవలం కొన్ని రాయితీలు కల్పించి, నామ మాత్రపు నిథులు మంజూరు చేస్తే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథుల నుండి ప్రత్యేక కేటాయింపులు చేసి పారిశ్రామికంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో భారీ పరిశ్ర‌మలను నెలకొల్పడానికి ముందుకు రాకపోతే ప్రయోజనం ఉండదు. ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాల్సిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బాధ్యతారహితంగా వ్యవహరించాయి. పర్యవసానంగా పారిశ్రామికాభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ఉపాథి కల్పనా కేంద్రాలు  తిరుమల, శ్రీకాళహస్తి, కానిపాకం, శ్రీశైలం, మంత్రాలయం తదితర దేవస్థానాలే.
రాయలసీమ ప్రాంతం గ్రామకక్షలకు, హత్యా రాజకీయాలకు నెలవుగా ఉన్నదనే నెపంతో ప్రయివేటు పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పడానికి వెనకాడుతున్నారన్న అపవాదు ఉన్నది. దాని కంటే తీవ్రమైన సమస్య నీటి సమస్య. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా నికర జలాలను కేటాయించాలి. భారీ పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన భూమి ఒక్క రాయలసీమలోనే ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఆలోచనే కొరవడింది. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి చొరవ ప్రదర్శించి, ప్రయివేటు పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తేగానీ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి పునాదులుపడవు. ఆ ప్రాంత‌ వెనుకబాటుతనానికి నివృత్తి ఉండదు. అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ధేశించుకోని యడల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశించిన ప్రగతిని సాధించడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇచ్చే అరకొర పన్నుల రాయితీలు పారిశ్రామిక వేత్తలు సొంతం చేసుకొని ఆస్తులు పెంచడానికి మాత్రమే దోహదపడతాయి. నవ్యాంధ్ర‌ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత జాగరూకతతో, పారదర్శకంగా, జవాబుదారితనంతో ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తుందని ఆకాంక్షిద్ధాం!

                                                                                                                       

1 comment:

  1. comprehensive discussion on the issues of the new state of Andhra Pradesh.

    ReplyDelete