Tuesday, June 3, 2014

మంత్రుల విద్యార్హతలపై అసంబద్ధ చర్చ




భారత దేశం వంటి వైవిధ్యభరితమైన (అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, తెగలు, మతాలు, కులాలు, ప్రాంతాలు వగైరా గల) దేశానికి దిశానిర్దేశం చేసే రాజకీయ నాయకత్వం ఉన్నత విద్యావంతంగా ఉంటే మెరుగైన పాలనకు అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. సామాజిక స్పృహ, శ్రేష్ఠమైన నాయకత్వ లక్షణాలు లేనివారు ఎంతటి విద్యావంతులైనా సమర్థవంతమైన పాలనను అందించలేరని చరిత్ర రుజువు చేసింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువు దీరిన కేంద్ర మంత్రివర్గం పొందికపై వ్యాఖ్యానిస్తూ- డిగ్రీ పట్టభద్రురాలు కూడా కాని స్మృతి ఇరానీ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యురాలా!- అంటూ పెదవి విరిచారు. దాంతో మొదలైన విమర్శ ప్రతివిమర్శల పర్వం కాంగ్రెస్‌, భాజపాల మధ్య నాసిరకమైన చర్చకు దారితీశాయి. స్మృతి ఇరానీ విద్యార్హతపై మాట్లాడే ముందు యు.పి.ఎ. అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ- ప్రముఖ ఆర్థిక వేత్త, దేశ ప్రధాని డా మన్మోహన్‌ సింగ్‌ను రిమోట్‌ కంట్రోల్‌తో నడిపించిన సోనియా గాంధీ విద్యార్హతపై భాజపా నాయకులు, స్మృతి ఇరానీ సహచర మంత్రులు ప్రశ్నించడంతో- కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది.

ప్రజల చేత ఛీత్కారానికి గురైన కాంగ్రెస్‌ నాయకులు గుణపాఠాలు నేర్చుకోవడానికి బదులు అసంబద్ధ వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకోవడం పరిపాటయ్యింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించబోయే విధానాలపై దృష్టిసారించి హేతుబద్ధమైన, నిర్మాణాత్మకమెన వైఖరి ప్రదర్శించడానికి బదులు, కేంద్ర మంత్రుల విద్యార్హతలపై అసందర్భమైన, అపరిపక్వమైన విమర్శలు చేసి మరొకసారి నవ్వులపాలయ్యారు. దేశాన్ని అన్ని రంగాలలో భ్ర„ష్ఠు పట్టించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు విధానాలపై చర్చించే చైతన్యం కానీ, విజ్ఞత కానీ ఉన్నట్లు కనపడడం లేదు. స్మృతి ఇరానీపై వచ్చిన మరొక ఆరోపణ- ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో తేడాలున్నాయన్నది.

2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు- 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయంనుండి దూరవిద్యద్వారా బి.ఎ. పట్టభద్రురాలైనట్లు పేర్కొన్నారని, 2014 ఎన్నికల నామినేషన్‌ పత్రంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనే దూర విద్య ద్వారా 1994లో బి.కాం. ప్రథమ సంవత్సరం విద్య ఆర్జించినట్లు పేర్కొనడంతో రెండింటి మధ్య తేడాలున్నాయని ఆరోపించారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం ద్వారా వ్యక్తుల విశ్వసనీయత దెబ్బతింటుంది. ఆమె బి.ఎ. చదివారా, లేదా బి.కాం. ప్రథమ సంవత్సరం పూర్తి చేశారా- అన్న విషయంలో కూడా స్పష్టతలేని చైతన్యరాహిత్యంలో స్మృతి ఇరానీ ఉన్నారా- అన్న అనుమానం ఎవరికైనా రావడం సహజం. ఆ విషయంపై ఎన్నికల సంఘానికే స్పందించే అధికారం ఉన్నది.
ఈ వివాదం పూర్వరంగంలో, ఢిల్లీ విశ్వవిద్యాలయ అధికారులు పత్రాలను రహస్యంగా చేరవేశారనే ఆరోపణపై ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం, „స్మృతి ఇరానీ జోక్యంతో మళ్ళీ ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ కేంద్రమంత్రుల విద్యార్హతలపై బహుళ ప్రచారం జరుగుతున్నది. ఆ మాటకొస్తే, దేశానికి దిశానిర్దేశం చేయవలసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహితం ఢిల్లీ విశ్వవిద్యాలయంనుండి దూరవిద్య ద్వారానే రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పట్టభద్రుడైనారని చెబుతున్నారు.

ఆయన సమర్థవంతమైన పాలనాధక్షుడని దేశ ప్రజలు అధికార పగ్గాలు అప్పగించారు. ప్రజల విజ్ఞతను ప్రశ్నించగలమా? మహిళా- శిశు సంక్షేమ శాఖామాత్యులు మేనకా గాంధీ, భారీ పరిశ్రమలు- ప్రభుత్వ రంగ సంస్థల శాఖామాత్యులు అనంత్‌ గీతే, విమానయాన శాఖామాత్యులు అశోక్‌ గజపతి రాజు, విమానయాన శాఖ సహాయ మంత్రి జి.యం. సిద్ధేశ్వర, గనులు- ఉక్కు- కార్మిక, ఉపాథి శాఖ సహాయ మంత్రి విష్ణు దియో సాయ్‌, వినియోగదారులు- ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్‌ సాహెబ్‌ పాటిల్‌ దన్వె తదితరుల విద్యార్హత మెట్రిక్యులేషన్‌ లేదా ఆ లోపే! జలవనరులు, గంగా నది శుద్ధి శాఖామాత్యులు ఉమాభారతి విద్యార్హత కేవలం 6వ తరగతే. ఉమాభారతి మోడీ మంత్రివర్గంలో అత్యంత తక్కువ విద్యార్హత ఉన్న మంత్రి అని అంటున్నారు. కానీ ఆమెకు ఒక పెద్దరాష్టమ్రైన మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
మానవ వికాసానికి విద్య దిశానిర్దేశం చేస్తుంది. సామాజిక స్పృహ మానవుని ఔన్నత్యాన్ని పెంచుతుంది. రాజకీయ నాయకులు సామాజిక స్పృహతో సమాజాభివృద్ధికి అంకితమై కృషి చేయాలి. నీతి, నిజాయితీ, కర్తవ్య నిర్వహణ పట్ల చిత్తశుద్ధే కొలబద్ధగా ప్రజాసేవకు నిబద్ధతతో పనిచేసే వారెవరైనా ప్రజాపాతినిథ్య చట్టం మేరకు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిథులుగా ఎన్నిక కావచ్చు. రాజ్యాంగ బద్ధమైన పదవులు చేపట్టి పాలన చేయవచ్చు.

మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలకమైనది. విద్య, పరిశోధనా రంగాల పట్ల సంపూర్ణ అవగాహన ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం తప్పు కాదు. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే సామర్థ్యం ఉన్నదా, లేదా- అన్నది వారి పని విధానాన్ని పరిశీలించిన మీదట, అంశాల ప్రాతిపదికగా సద్వివిమర్శలు చేయవచ్చు. ప్రస్తుత విద్యావిధానం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విద్యా ప్రమాణాల పెరుగుదలపై దృష్టి సారించి సత్వరచర్యలు చేపట్టాల్సిన అంశం ప్రథమ ప్రాధాన్యతాంశంగా ముందు కొచ్చింది. కేంద్ర, రాషా్టల్ర ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొంటూ సమర్థవంతంగా పథకం ప్రకారం కృషి చేయాల్సి ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడగలిగిన స్థాయికి మన ఉన్నత విద్యా సంస్థలు అభివృద్ధి చెందక పోవడం ఒక సవాలుగా పరిణమించింది. ప్రతిష్ఠాత్మకమైన ఐ.ఐ.టి. వంటి సంస్థలున్నా, మన ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు పొందలేక పోతున్నాయి. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిపుణులైన అధ్యాపకుల కొరత తీవ్రమైన సమస్యగా పరిణమించింది. పరిశోధనా రంగం వెనకపట్టు పట్టింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (యంసిఐ) వంటి సంస్థల్లో అవినీతి చెదలు ప్రవేశించి వైద్య విద్యారంగాన్ని అభాసుపాలు చేశాయి. ప్రైవేటు విద్యాసంస్థలవల్ల విద్య, ప్రత్యేకించి వృత్తి విద్య అంగడి సరకుగా మారిపోయింది. ఇలా అనేక జఠిలమైన సమస్యలతో సతమతమవుతున్న విద్యారంగం నిధుల కొరతతో కునారిల్లి పోతున్నది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ తక్షణం దృష్టి సారించి సమర్ధవంతంగా పని చేయాల్సి ఉన్నది. ఆమె పని విధానాన్ని కొంత కాలమైన తరువాతే అంచనా వేయడానికి వీలవుతుంది.

ప్రభుత్వ తాత్విక చింతనే కీలకం:
అటల్‌ బిహారీ వాజ్‌ పేయ్‌ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులుగా బాధ్యతలు నిర్వహించిన మురళీ మనోహర్‌ జోషి విద్యాధికులే. ఆయన అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి యం.యస్సీ. పట్టభద్రుడైనారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనా పత్రాన్ని సమర్పించి డాక్టరేట్‌ పొందారు. ఆ విశ్వవిద్యాలయం లోనే భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పని చేశారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆర్జించిన మురళీ మనోహర్‌ జోషి- జ్యోతిష్యాన్ని ఉన్నత విద్యాసంస్థలైన కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులలో బోధనాంశంగా ప్రవేశపెట్టడానికి పూనుకొన్నారు. కారణం- సంఘ్‌ పరివార్‌ కూటమి అజెండా అయిన విద్యా కాషాయికరణ బాధ్యతను ఆనాడు మురళీ మనోహర్‌ జోషి తలకెత్తుకోవడమే. అందులో భాగంగా భారతీయ చరిత్ర, సంస్కృతి ముసుగులో చరిత్రను వక్రీకరించి తిరగరాసే ప్రయత్నం చేశారు. మురళీ మనోహర్‌ జోషి ఉన్నత విద్యార్జన చేసిన వారేకదా! మరి అశాస్త్రీయమైన, మూఢనమ్మకాలను ఒక శాస్త్రంగా భావించి బోధనాంశంగా ప్రవేశ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను ఏమనాలి?

దేశానికి అత్యంత విలువైన ఆస్తి మానవ సంపద. ప్రపంచ దేశాలన్నింటి కంటే మన దేశంలోని జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉన్నది. మానవ వనరులను సక్రమంగా, సమర్థవంతంగా, అభివృద్ధి చేసి, నిపుణులను తయారు చేసుకొని సద్వినియోగం చేసుకోవడంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నది. ఈ కర్తవ్య నిర్వహణలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాత్ర ప్రముమైనది. ఈ శాఖామాత్యులుగా బాధ్యతలు నిర్వహించే వారు విద్యావంతులై ఉంటే మంచిదే! నేటి విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ స్వభావాన్ని అర్థంచేసుకొని ప్రక్షాళన చేయడానికి, నాణ్యమైన విద్యను విస్తరింపచేయడానికి- ప్రణాళికా బద్ధంగా కృషి చేయడంలో వారికి ఉపకరిస్తుంది. అన్నింటి కంటే వారికున్న సామాజిక స్పృహ, శాస్త్రీయ దృక్పథం, మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేయగల సామర్థ్యం ఉన్నదా, లేదా- అన్నది ముఖ్యం. శాస్త్రీయ విజ్ఞానాన్ని అంగీకరించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి, శాస్త్రీయవిజ్ఞానం ప్రాతిపదికన మానవవనరులను తీర్చిదిద్దడంద్వారా దేశాభివృద్ధికి అవసరమమైన నిపుణులను అందించడానికి రాజకీయ సంకల్పం ముఖ్యమైనది. ఉన్నత విద్యనార్జించి పట్టభద్రులైనంత మాత్రానో లేదా శాస్త్ర విజ్ఞాన రంగంలో డాక్టరేట్‌ పొందిన వారైనంత మాత్రానో మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్రులు కావడానికి అర్హులని భావిస్తే పొరపాటు. ప్రభుత్వాధినేత అయిన ప్రధాన మంత్రి తాత్తి్వక చింతన, మంత్రుల సొంత ఆలోచనలు, వారు ప్రాతినిథ్యంవహిస్తున్న రాజకీయ పార్టీ భావజాలం ప్రాతిపదికన స్థూలంగా విధానాల రూపకల్పన, అమలు ఆధారపడి ఉంటుంది.

మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ముఖ్యభూమిక పోషించే సంస్థలైన భారత చారిత్రక పరిశోధనా మండలి (ఐ.సి.హెచ్‌.ఆర్‌.) యూనివర్సిటీ గ్రాంట్‌‌స కమిషన్‌ (యు.జి.సి.)లకు ఛైర్మన్లుగా, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసర్‌‌చ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌.సి.ఆర్‌.టి.)కు డైరెక్టర్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌.యస్‌.యస్‌.)కు సన్నిహితులైన వారిని నియమించడం ద్వారా విద్యారంగాన్ని కాషా యీƒరించడానికి నాటి యన్‌.డి.ఎ. ప్రభుత్వం పథకం ప్రకారం చర్యలు చేపట్టింది. ఆ సందర్భంగా శాస్త్ర విజ్ఞాన రంగాలలో ప్రఖ్యాతిగాంచిన మేథావులు స్పందించి సమైక్య గళం వినిపించారు. జాతీయ స్థాయిలో సమావేశమై- యన్‌.డి.ఎ. ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడానికి తీసుకొన్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. డా మురళీ మనోహర్‌ జోషి ఉన్నత విద్యార్హతలున్న అనుభవజ్ఞుడైన భాజపా నాయకుడి నేతృత్వంలోనే మానవ వనరుల అభివృద్ధి శాఖ లోపభూయిష్టమైన, అశాస్త్రీయమైన విద్యావిధానాన్ని భావిభారత పౌరుల మెదళ్ళలోకి చొప్పించాలని ప్రయత్నించింది. దీనిని బట్టి చూస్తే, స్మృతి ఇరానీ విద్యార్హత అంత ప్రాధాన్యతాంశం కాదు, కానీ ఆమెకూడా భాజపా నాయకురాలే కాబట్టి, మురళీ మనోహర్‌ జోషి అర్థాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిన విద్యా కాషాయీకరణ అజెండాను మళ్ళీ ముందుకు తెచ్చి అమలు చేయడానికి పూనుకొంటారో లేదో వేచి చూడాలి. మూఢƒనమ్మకాలకు, అశాస్త్రీయ భావాలకు ప్రాణంపోసి, పెంచిపోషించే చర్యలకు పూనుకొన్నా, లౌకిక వ్యవస్థకు హానికల్పించే చర్యలు చేపట్టినా, శాస్త్రవిజ్ఞాన పరిశోధన- అభివృద్ధికి అవరోధం కల్పించే విధానాలు అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకొన్నా ప్రజాస్వామ్య ప్రగతిశీలశక్తులు, శాస్త్ర విజ్ఞాన రంగానికి చెందిన మేథావులు ప్రతిఘటించడానికి సంసిద్ధులైఉండాలి. అంతేగానీ వ్యక్తిగత విద్యార్హతలపై అసంబద్ధ విమర్శలు చేయడం అర్థరహితం. విధానాలపై ఎవరైనా విమర్శలు చేయవచ్చు, ఆందోళనలు, ఉద్యమాలు చేయవచ్చు.

నాయకత్వ లక్షణాలు ముఖ్యం:
తెలివితేటలకు విద్యార్హత ఒక్కటే కొలబద్దగా భావించడం సబబు కాదు. వృత్తి నైపుణ్యంతో పనిచేయవలసిన ఉద్యోగస్థులకు- ఆ ఉద్యోగానికి సంబంధించి కనీస విద్యార్హత తప్పనిసరి. మరి, మంత్రి పదవులు చేపట్టే వారికి తగిన విద్యార్హతలు ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అందరూ ఉన్నత విద్యావంతులు కావాలన్న ఆకాంక్ష ఉన్నతమైనది. కానీ దురదృష్టవశాత్తు దేశంలో విద్య అందరికీ అందుబాటులోకి రాలేదు. దేశంలో అక్షరాస్యుల సంఖ్య 2010-11 గణాంకాల మేరకు 73%. అంటే 27% మంది నిరక్షరాస్యులే.
ప్రాథమిక పాఠశాలలలో చేరిన బాలబాలికల్లో పదవ తరగతిలోపే 49.3% మంది చదువు మానేస్తున్నారు.

ప్రత్యేకించి నాణ్యమైన ఉన్నత విద్య, వృత్తి విద్య అందని ద్రాక్ష పండ్లు గానే మిగిలిపోయాయి. వివక్షతో కూడుకొన్న విద్యా వ్యవస్థ కొనసాగుతున్నది. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం పర్యవసానంగా విద్యకు నోచుకోని పిల్లల సంఖ్య దేశంలో గణనీయంగా ఉన్నది. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడడం లేదు. ప్రాథమిక, మాథ్యమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్‌ మీడియట్‌ విద్యలోపే చదువుకు స్వస్తిచెప్పే వారి సంఖ్య గణనీయంగా ఉంటున్నది. స్మృతి ఇరానీకి ఈ విషయంలో జీవితానుభవం ఉన్నది. ఆమెలో నిజంగా పట్టుదల, కసి ఉంటే పేదరికంతో తాను అందుకోలేక పోయిన నాణ్యమైన ఉన్నతవిద్యను అందరికీ అందించాలనే చిత్తశుద్ధితో కర్తవ్యనిర్వహణకు పూనుకోవచ్చు. దానిపై దృష్టి లగ్నం చేసి మానవ వనరుల అభివృద్ధి శాఖను సమర్థవంతంగా కార్యాచరణలోకి దించవచ్చు. చరిత్రలో అనేకమంది ఎలాంటి ఉన్నత చదువులు చదవకుండానే సామాజిక „స్పృహతో సమాజ సేవలో రాణించి చరిత్రలో సముచిత స్థానాన్ని పొందారు. అలా అని- చదువు ప్రాధాన్యతనూ తక్కువ చేసి చూడకూడదు. చదువు లేనివాడు వింత పశువుతో సమానమన్న లోకోక్తి ఉన్నది.

విద్య మనిషి మెదడుకు పదును పెడుతుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జించిన పౌరులు సమాజానికి నాణ్యమైన సేవలను అందించగలరు. రాజకీయ రంగం ద్వారా ప్రజాసేవ చేయదలచిన వారు, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజ అభివృద్ధి దశను అర్థంు చేసుకొని, సామాజికాభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉన్నత విద్యార్జన ఉపకరిస్తుంది. ఈ అంశం నిర్వివాదాంశం. అయితే, రాజ్యాంగం మేరకు ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఎన్నికల్లో పోటీచేసి చట్టసభ సభ్యులుగా ఎన్నికైన ప్రతిఒక్కరికీ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా బాధ్యతలు చేపట్టే అర్హత ఉన్నది. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీలేదు. విద్యార్హత లేదనే అసంబద్ధమైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా ప్రజాప్రతినిధుల హుందాతనానికి భంగం కలిగించడం నాగరికత అనిపించుకోదు. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలను నిర్ణయించాలనే డిమాండ్‌ చేసే వారూ లేకపోలేదు. నిరక్షరాస్యులు డబ్బుకు, మద్యానికి ఓట్లు అమ్ముకొంటున్నారని చైతన్యరాహిత్యంతో మాట్లాడే వారూ లేకపోలేదు. ఆమాటకొస్తే ఓటు హక్కును వినియోగించు కోవడంలోనూ, డబ్బు, మద్యం ప్రలోభానికి లొంగిపోవడంలోను విద్యావంతులు కూడా ఏ మాత్రం వెనుకబడిలేరని అనుభవాలు తెలియజేస్తున్నాయి.
రాజకీయ నాయకుడు లేదా నాయకురాలుకి ఉండవలసిన లక్షణాలకు సంబంధించి వారు విశ్వసిస్తున్న భావజాలం, అమలు చేస్తున్న విధానాలు, ఆచరిస్తున్న నైతిక ప్రమాణాలు, బాధ్యతలు నిర్వహించడానికి సమర్థత ఉన్నదా లేదా వగైరా అంశాల ప్రాతిపథికగా అంచనా వేయాలి. యు.పి.ఎ. ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన డా మన్మోహన్‌ సింగ్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త, ఆయన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరం, ఆర్థిక సలహాదారులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు అందరూ పేరుగాంచిన ఆర్థికవేత్తలు, ఉన్నత విద్యావంతులే కానీ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేక పోయారు. నిత్యావసర ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తూ సామాన్యుల మూలుగలు పీల్చేస్తున్నా నియంత్రించ లేక చేవ చచ్చి కూర్చున్నారు. అందువల్ల ఉన్నత విద్యావంతులైతే మెరుగైన సేవలందిస్తారన్నది అపోహ మాత్రమే. నేటి మన విద్యా వ్యవస్థ శ్రేష్ఠమైన నాయకత్వ లక్షణాలతో యువతకు తర్ఫీదు ఇస్తున్నదో లేదో పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. ఈ రోజు దేశంలో జరిగిన ఆర్థిక కుంభకోణాల్లో, అవినీతి ఊబిలో కూరుక పోయిన ఘరానా పెద్ద మనుషులందరూ విద్యాధికులే. అందుకని తొందర పాటు వ్యాఖ్యానాలు చేయడం సముచితం కాదు. రాజకీయ నేతల్లో చూడవలసింది నీతి, నిజాయితీ, విశ్వసనీయత, వారి భావజాలం, ప్రజాసేవ పట్ల అంకిత భావం ఉన్నాయా, లేవా అన్న అంశాలే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా, లేవా అన్న అంశాలపై చర్చ చేస్తే దేశానికి మేలు చేసిన వారమవుతాము.

No comments:

Post a Comment