Wednesday, December 14, 2011

డాలరు డాబు, రుబాబు!

published in Surya Telugu daily on 6th December 2011

- పెరుగుతున్న ధరలు
- ఉపాధికోసం పోరాటాలు
- దేశంలో దిగజారిన డాలర్‌ విలువ
- ఐనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఏలుతున్న వైనం

అమెరికా ఆర్థికసంక్షోభంలో తన్నుకొంట ున్నది. అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఆ దేశ స్థూలఉత్పత్తి (జీడీపీ) విలువ పద్నాలుగు ట్రిలియన్‌ డాలర్లు ఉంటే, దానికి సరి సమానంగా రుణభారంచేరుకొన్నది. గృహ రుణ గహ్రీతలు వాయిదాలు చెల్లించలేని దుస్థితితో పేరు మోసిన బ్యాంకులు దివాలా తీశాయి. బ్యాంకు సేవలు స్తంభించాయి. విమానయాన సంస్థలూ నష్టాలతో ఐపీ పెట్టాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఆర్థికలోటు (కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌) పెరుగుతూ పెద్ద రుణగహ్రీత దేశంగా దశాబ్దాలుగా కొనసాగుతున్నది. డాలర్లను ముద్రించే హక్కున్న ఫెడరల్‌ బ్యాంకు మార్కెట్లోకి డాలర్లను మోతాదుమించి విడుదల చేసింది. పర్యవసానంగా అమెరికాలో డాలర్‌ విలువ దిగజారింది.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల కొనుగోలుశక్తి సన్నగిల్లిపోతున్నది. ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. నిరుద్యోగ వృద్ధిరేటు 9 శాతాని కి చేరుకొన్నది. అమెరికా వాణిజ్యలావాదేవీలలో ప్రస్తుతం పెద్దలోటున్నది.ప్రపంచం మొత్తంగా జరిగే ఎగుమతుల్లో అమెరికా వాటా 12.3 శాతం ఉంటే, దిగుమతుల్లో 18.9 శాతం ఉన్నది. సంపన్నులకు, సామాన్యులకు మధ్య అగాథం పెరిగి పోతున్నది. నిరుద్యోగులు ఉపాథి కోసం, భృతి (అనెంప్లాయ్‌మెంట్‌ డోల్‌) కోసం వీధిపోరాటాలకు ఉపక్రమించారు. శ్రామికులు మెరుగైన వేతనాలకోసం రోడ్లకెక్కారు. సామాన్యప్రజలు సామాజిక భద్రత, ఆరోగ్యబీమా కోసం కన్నెర్రచేశారు. వాల్‌స్ట్రీట్‌ వార్తల్లోకెక్కింది. కానీ అమెరికా డాలర్‌ మాత్రం ప్రపంచ దేశాల్లో వెలిగిపోతున్నది, ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఏలుతున్నది! సరకుల తరహాలోనే విదేశీ మారక ద్రవ్యం (డాలర్‌) విలువ సప్లై, డిమాండ్‌ మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్‌ సిద్ధాంతకర్తలు సూత్రీకరిస్తున్నారు.

ఇదొక మిథ్యాఆర్థిక సిద్ధాంతం. దీన్ని ప్రబోధించే ఆర్థికవేత్తలు సప్లై, డిమాండ్‌లను నియత్రించే సామాజిక, రాజకీయాంశాలను మభ్యపెడుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ డాలరు చుట్టూ పరిభ్రమించేలా చక్రబంధంలో ఇరికించారు. ప్రపంచీకరణ ముసుగులో వాణిజ్య, వ్యాపార లావాదేవీలను, అంతర్జాతీయ రాజకీయాలను, దేశాల మధ్య దౌత్యసంబంధాలను కూడా డాలరు సామ్రాజ్యమే నియంత్రిస్తున్నది. సంపదను ఒకప్పుడు బంగారం రూపంలో నిల్వ చేసుకొనేవారు. తెల్లదొరల పాలన సాగినంతకాలం బంగారంతో పాటు బ్రిటిష్‌ పౌండ్‌ రూపంలోకూడా సంపదను నిల్వచేసుకొనే విధానం ఉండేది. 18 వ శతాబ్దం ప్రారంభం నుండి దాదాపు 150 సంవత్సరాల పాటు బ్రిటిష్‌ పౌండ్‌ వరల్డ్‌ రిజర్వ్‌కరెన్సీగా ఒక వెలుగువెలిగి ఆరిపోయింది. రెండవ ప్రపంచయుద్ధానంతరం అప్పుల ఊబిలో కూరుకు పోయిన బ్రిటిష్‌ సామ్రాజ్యం కుప్పకూలి, అమెరికా నూతన శక్తిగా ఆ స్థానాన్ని ఆక్రమించడంతో డాలర్‌ పెత్తనం మొదలయ్యింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో జరిగిన బ్రెటన్‌ ఉడ్స్‌ మహాసభ ఆమోదంతో పౌండ్‌ స్థానాన్ని డాలర్‌ ఆక్రమించింది.1971 తరువాత బంగారాన్ని అసలు కొలబద్దగా లేకుండా కనుమరుగుచేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సంపూర్ణఆధిపత్యాన్ని డాలర్‌ కైవసం చేసుకొంటున్నట్లు నాటి అమెరికా అధ్యక్షుడు రిచ్ఛర్డ్‌ నిక్సన్‌ ఏకపక్షంగా ప్రకటించడంతో నాటినుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పెత్తనాన్ని కొనసాగిస్తున్నది. దశాబ్దం క్రితమే ప్రపంచ ద్రవ్యనిల్వలు 68శాతం డాలర్ల రూపంలో ఉండేవని అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు వెల్లడించారు. దాన్నిబట్టి డాలరుశక్తి ఎంత బలీయంగా ఉందో బోధపడుతుంది. డాలరు పెత్తనంతో అంతర్జాతీయ వాణిజ్యం అసమతుల్యంగా తయారయ్యింది. ఈ క్రీడలో అమెరికా డాలర్లను అచ్చువేస్తుంది, మిగిలిన ప్రపంచ దేశాలు సరుకులను ఉత్పత్తిచేస్తాయి, వాటికి డాలర్లలో ధరలు నిర్ణయించి, కొంటారు.

అంతర్జాతీయంగా అనుసంధానించిన ప్రస్తుత ఆర్థికవ్యవస్థలో వాణిజ్యం పరస్పర ప్రయోజనమే గీటురాయిగా జరగడం లేదు. ఏకధృవ ప్రపంచం కోణంలో సాగుతున్నది. విదేశీ రుణాలను చెల్లించడానికి, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించడానికి, ఎగుమతి దిగుమతుల్లోని లోటును చెల్లించడానికి డాలర్లు అవసరం. మన రూపాయి మారకపు విలువ పడిపోకుండా స్థిరంగా ఉండేలా పరిరక్షించుకోవడానికి భారీగా డాలర్లను నిల్వచేసుకోవాలి, అందుకే ఎగుమతుల్లో పోటీపడి డాలర్లను ఆర్జించాలి. స్వేచ్ఛామార్కెట్‌ ముసుగులో కుట్రలు, కుతంత్రాలతో సాగించే స్పెక్యులేటివ్‌ అండ్‌ మానిపులేటివ్‌ వాణిజ్యంలో జరిగే దాడుల నుండి రూపాయి బలహీన పడకుండా, రిజర్వ్‌ బ్యాంకు సర్కులేషన్‌లో ఉన్న మన కరెన్సీకి సమానంగా డాలర్లను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవాలి. ఈ ఏడాది జూలైలో 319 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిల్వలుంటే, నవంబరు 25 నాటికి 304 బిలియన్‌ డాలర్లకు పడిపోవడంతో ప్రభుత్వానికి కంపనం పుట్టుకొన్నది.

ప్రపంచీకరణ భావజాలమే ఆయుధంగా, వెనుకబడ్డ, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువలపై డాలరు ముప్పేటా దాడిచేస్తున్నది. అందులో భాగంగానే మన రూపాయి విలువ నవంబరు 23 నాటికి మునుపెన్నడూ లేని విధంగా కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఒక డాలరు కావాలంటే రూ.52.38 చెల్లించుకోవలసి వచ్చింది. ఈ పూర్వరంగంలో డాలర్ల ఆర్జన కోసం కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లుపడుతున్నది. దిగుమతి వ్యాపారంచేసే సంస్థలు, ముడి చమురును దిగుమతి చేసుకొనే ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు డాలర్లకోసం ఎగబడుతున్నాయి. డాలర్లకు కృత్రిమంగా గిరాకీ పెంచి, రూపాయి విలువను క్షీణింపజేశారు. ద్రవ్యోల్భణం విజృంభించి 2010 డిసెంబర్‌ నుంచి 10 శాతం అటు ఇటు చక్కర్లు కొడుతున్నది.

ధరల పెరుగుదలకు ఆజ్యం పోసి , ప్రజల కొనుగోలు శక్తిని గొడ్డలి పెట్టుకు గురి చేశారు. ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మనదేశం మాత్రం ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ కళ కళలాడిపో తున్నదని ఢీల్లీ పెద్దలు భుజాలు చరుచుకొన్నారు. అది కాస్తా పతనంవైపు ప్రయా ణిస్తున్నది. ద్రవ్యోల్బణాన్నఇదుపుచేసి, నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేసేందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చిల్లర వర్తకం, పింఛను రంగాల్లోకి ఆహ్వా నిస్తున్నామని సెలవిస్తున్నారు. మన విధాన నిర్ణేతలందరూ ఆర్థిక రంగంలో నిష్ణా తులైన వారే. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేథోసంపన్నుల కనుసన్నల్లో ఆర్థిక విధానాలు రూపొంది, అమలు జరుగుతున్నాయి. అయినా తిప్పలు తప్పడం లేదు.

స్వదేశంలో డాలరు విలువ పతనమైనా, అంతర్జాతీయ సంతలో విలువ పెంచుకోవడం ద్వారా ఆర్థికసంక్షోభంనుండి బయటపడాలని అమెరికా ఆడుతున్న రాచక్రీడలో మన రూపాయే కాదు, వివిధ దేశాల కరెన్సీల మారక విలువలు భారీగా పతనమైనాయి. ఆసియా ఖండంలో అందరికంటే మనమే ఎక్కువ నష్టపోయాము. మనం చేసుకొనే దిగుమతుల్లో ముడి చమురు కీలకమైనది. అలాగే రసాయనిక ఎరువులు, కెమికల్స్‌, స్టీల్‌ వగైరా దిగుమతుల మొత్తం విలువ దాదాపు పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు (357.7 బిలియన్‌ డాలర్లు)గా 2010లో అంచనా వేశారు. ఎగుమతులు దాదాపు పదకొండున్నర లక్షల కోట్లు (225.6 బిలియన్‌ డాలర్లు) గా అంచనా వేశారు. అంటే మన దేశ విదేశీ వాణిజ్యం లోటు దాదాపు రూ. ఏడు లక్షల కోట్లు (132.1 బిలియన్‌ డాలర్లు). 2011 జూన్‌ 30 నాటికి మన దేశం అప్పు రూ.

పదహారున్నర లక్షల కోట్లు (316.9 బిలియన్‌ డాలర్లు). ఆ మేరకు డాలర్లను సంపాదించుకొని చెల్లించాలి. లేదా విదేశీ రుణ భారం పెరిగిపోతుంటుంది. డాలర్లు కావాలంటే 1.ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు వగైరా సంస్థల నుండి అప్పులు చేయాలి. 2. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవాలి. బీమా రంగమా, రక్షణ రంగమా, చిల్లర వర్తక రంగమా , పెన్షన్‌ రంగమా, ఉన్నతవిద్యా రంగమా- ఏ రంగమన్న విచక్షణ లేకుండా బహుళజాతి సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించాలి. 3. మేథో వలసలను ప్రోత్సహించి, ప్రవాస భారతీయుల నుండి పెట్టుబడులను ఆకర్షించాలి. 4. మన ప్రజల అవసరాలు తీరకపోయినా పలురకాల నాణ్యమైన సరుకులను విదేశాలకు ఎగుమతిచేసి డాలర్లను ఆర్జించాలి.

అందు కోసం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లినా పరవాలేదు, రైతులను ప్రోత్సహించి వాణిజ్య పంటలను సాగుచేయించి, ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. ఇనుప ఖనిజం తదితర సహజ వనరులను ఎగుమతి చేసి డాలర్లు సంపాదించాలి. ఆ రాజకీయ తంత్రాన్నే నేడు మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమలు చేసున్నది. కార్మికులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులనే కొని అనుభవించలేని ఆర్థిక దుస్థితిలో ఉన్నారు. కార్మికుడు సృష్టించే అదనపువిలువను కాజేస్తున్న పెట్టుబడిదారులు సరుకులన్నిం టినీ వినియోగించుకోలేరు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ ఉపాథి, మెరుగైన వేతనాలు కల్పించి, కొనుగోలు శక్తిని పెంచి, ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. ఆర్థికవిధానాల రూపశిల్పులలో అలాంటి ఆలోచనే కొరవడింది. అమెరికాకు, బహుళ జాతి సంస్థలకు నమ్మిన బంట్లుగా సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తున్నది చమురే. ముడి చమురు నిల్వలను కబ్జా చేయడానికి అమెరికా ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుందని ఇరాక్‌ దురాక్రమణతో అర్థమైపోయింది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను తన గుప్పెట్లో బంధించింది. ముడి చమురు కొనుగోలు చేయాలంటే డాలర్లుంటేనే సాధ్యపడుతుంది. పెట్రో డాలర్‌తో ప్రపంచ దేశాలను అమెరికా కొల్లగొడుతున్నది. బలమైన డాలర్‌ విధానం అమెరికాకు బహుముఖ ప్రయోజనాలను కలిగిస్తున్నది. చౌకగా సరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసుకోవచ్చు. విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా ఆస్తులు ఖరీదైనవిగా మారతాయి. ఇతర దేశాలకంటే తక్కువ వడ్డీకి అమెరికా రుణాలను సేకరించుకొనే ప్రత్యేక సౌకర్యం కలిగిఉన్నది . డాలరు ప్రపంచంలో ఏకైక మారక ద్రవ్యంగా చలామణి కావడంతో ఇతర దేశాలకు పెద్ద ఎత్తున అప్పులిచ్చే దేశంగా అవతారమెత్తింది.

డాలరు పెత్తనానికి దూరంగా జరగాలనే ఆలోచనలు అంతర్జాతీయంగా ఊపందుకొని, బలపడుతున్నాయి. వివిధదేశాల జాతీయబ్యాంకులు డాలర్ల నిల్వలను తగ్గించుకొం టూ బంగారం లేదా యూరోనిల్వల్లోకి ఆస్తులను తరలించడం ప్రారంభించాయి. ఫలితంగా ఒకానొక దశలో ప్రపంచ నిల్వల్లో డాలర్ల నిల్వలు 63 శాతానికి పడిపోయాయి. యూరో కరెన్సీజోన్‌లోని దేశాలు ఒక్కొక్కటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. డాలరుకుపోటీగా ఎదగాలనే ఆకాంక్షతో ఆవిర్భవించిన యూరో విలువ మసకబారుతున్నది. పరిస్థితులను అనుకూలంగా మలచుకొని డాలరు అధిపత్యాన్ని కొనసాగిస్తూ లబ్ధిపొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.

1. ప్రపంచ విపణిలో బంగారం, చమురు ధరల నిర్ధారణలో డాలరును ఉపయో గించడం మానివేసిన రోజే డాలరు అధిపత్యానికి పుల్‌స్టాప్‌ పడ్డట్లు భావించాలి. డాలరుకు స్వస్తిచెప్పాలని ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు సౌదీ అరేబియా అడ్డుపడు తున్నది. 2. డాలరు ఏకఛత్రాథిపత్యానికి చరమగీతం పాడి బహుళ కరెన్సీ ల వినియోగానికి, లావాదేవీలకు వీలుకల్పించే విధంగా దేశాలమధ్య వాణిజ్య పర మైన దౌత్యఒప్పందాలు చేసుకోవాలి. సోవియట్‌ యూనియన్‌ మధ్య 1978లో డా లరు ప్రమేయం లేకుండా మన రూపాయి, వారి రూబుల్‌ల మధ్య మారకంతో వాణిజ్యఒప్పందం జరిగింది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం 1991లో ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకొన్న రష్యా 2009లో అమెరికా ఆర్థికసంక్షోభం పూర్వరం గంలో మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధించుకోవాలని ప్రతిపాదించింది.

చైనా గత కొన్ని సంవత్సరాలుగా అర్జెంటైనా, ఇండొనేసియా, బెలారస్‌ తదితర దేశాలతో సొంత కరెన్సీ యువాన్‌ ప్రాతిపదికన వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్నది. ఈ ఒరవడి వివిధదేశాలు, ప్రాంతాలమధ్య పెరుగుతున్నది. 3. డాలర్లు ఆర్జించడమే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత ఎగుమతుల విధానాన్ని అమలు చేసినంతకాలం పరాధీనత తప్పదు. 4. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకోసం జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధానాలకు స్వస్తి చెప్పి‚, దేశీయవనరులపై ఆధారపడే ఆర్థికవిధానాలపై దృష్టి సారించాలి.

No comments:

Post a Comment