Friday, December 16, 2011

సిబాల్‌ ఎందుకు శివాలెత్తారు ?

published in Surya Telugu daily on December 16,2011

ప్రపంచీకరణలో భాగంగా ఉన్నత విద్యా రంగంతో పాటు అన్ని వ్య వస్థలనూ అంతర్జాతీయ వ్యవస్థలతో అను సంధానిం చాలని, విదేశీ సంస్థలకు, పెట్టుబ డులకు తలుపులు బార్లా తెరవాలని ఉబలాట పడుతున్న కేంద్ర సమాచార, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖామాత్యులు కపిల్‌ సిబాల్‌ సామాజిక మాధ్యమంపై మాత్రం ఆంక్షలను అమలు చేయాలని డిమాండ్‌ చేయడంలో మతలబు ఏమి టి? భావ ప్రకటనా స్వేచ్ఛపై అప్రకటిత నిషేధాన్ని విధించే ఆలోచనతో ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ చట్టాన్ని రూపొందించే పనిలో ఒకవైపు ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. ఈ నేపథ్యంలోనే సామాజిక అనుసంధాన వేదికల (సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌- ఎస్సెన్నెస్‌) పై కపిల్‌ సిబాల్‌ విరుచు కుపడ్డారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఒక వార్త యాహూ వెబ్‌ సైట్‌లో పెట్టారని కత్తిగట్టారు. తమ నాయకురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ శ్రేణులు భావి ప్రధానిగా కొనియాడుతున్న రాహుల్‌ గాంధీలకు వ్యతిరేకంగా ప్రచారం జరగకుండా నిలవరించడం కోసమే ఇదంతా అని కొందరు భావిస్తున్నారు.

ప్రసార మాధ్యమాలు, ప్రత్యేకించి ఇంటర్నెట్‌ ద్వారా జరుగుతున్న సమాచార ప్రవాహంలో అంతర్భాగంగా పాశ్చాత్య సంస్కృతి, అశ్లీల సాహిత్యం యువతను పక్కదోవ పట్టిస్తున్నదనే నిరసన భావం ప్రజానీకంలో వ్యక్తమవుతున్న మాట వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకొని సామాజిక మాధ్యమంపై వివాదాన్ని రగల్చడం ద్వారా ప్రజల దృష్టిని మళ్ళించి, అప్రతిష్ఠపాలైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపశమనం పొందాలనే దూ(దు)రాలోచన కపిల్‌ సిబాల్‌ బుర్రలో మెదినట్లున్నది. ఆమోదయోగ్యం కాని, మత ఘర్షణలకు దారితీసే ద్వేషపూరిత ప్రసంగాలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే దృశ్యాలను, అశ్లీల రచనలను, చిత్రాలను, తిట్లు, బెదిరింపులు, వేధింపులు, దైవ దూషణ, అపఖ్యాతిపాలు చేసే, చట్ట వ్యతిరేకమైన వాటిని నిషేధించాలని అంతర్జాతీయ ఇంటర్నెట్‌ నిర్వాహక సంస్థలను డిమాండ్‌ చేస్తే, అవి నిర్ద్వందంగా తిరస్కరించాయని, ఆ వైఖరి ఆమోదయోగ్యం కాదని సిబాల్‌ వ్యాఖ్యానించారు. యాహూ, గూగుల్‌, ఫేస్‌ బుక్‌, మైక్రోసాప్ట్‌ తదితర సంస్థలతో చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని హెచ్చరించారు.

మన చట్టాలను ఉల్లంఘించి విదేశీ గడ్డపై నుండి ఇలాంటి రెచ్చగొట్టే సమాచారాన్ని ఇంటర్నెట్‌ లోకి చొప్పిస్తున్నారనీ, ఏ దేశ సరిహద్దుల్లో సమాచారాన్ని ఇంటర్నెట్‌ లో చొప్పిస్తున్నారో ఆ దేశ చట్టాలకు లోబడి- పశ్చిమ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని నెట్‌లో పెడుతున్నారు కానీ, ఆ వ్యక్తుల పేర్లను ఇవ్వడానికి ఇంటర్నెట్‌ సంస్థలు నిరాకరించాయని కూడా సిబాల్‌ సెలవిచ్చారు. అంటే మనమెంత కాకిగోల పెట్టినా ప్రయోజనం లేదని తేలిపోయాక కూడా, ఏం ఆశించి ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారు?
భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రగతిశీల శక్తులు ఉద్యమాలు చేస్తున్నా పెడచెవిన పెట్టి, పాశ్చాత్య సంస్కృతికి మన యువతరాన్ని బానిసలుగా చేసే సంస్కరణలను విద్యారంగంలో అమలు చేస్తూ- సామాజిక అనుసంధాన వేదికల్లో దర్శనమిస్తున్న అవాంఛనీయ సమాచారం, చిత్రాలపై గుడ్లురిమితే లాభమేమిటి?

అమూల్యమైన దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు, పర మత సహనం, సహజీవనం, లౌకిక భావాలు, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న జాతి ఔన్నత్యాన్ని బోధించే సామాజికశాస్త్రాల బోధనకు కాలం చెల్లిందని తీర్మానించిందెవరు? పబ్‌ కల్చర్‌ను ప్రోత్సహించిందెవరు? విద్యావిధానంలో శాస్ర్తీయమైన, మౌలికమైన మార్పులుచేసి ఏ దుర్లక్షణాల ఊబిలో యువతరం కూరుకుపోయిందని గుండెలు బాదుకొంటు న్నామో, దానికి పరిష్కారం కనుగొనాలి.సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌ విశ్వ వ్యాపితంగా విస్తరించి ఉన్నాయి. వాటిని మన దేశీయ చట్టాల చక్రబంధంలో ఇరికించ లేమని కపిల్‌ సిబాల్‌ చేతులెత్తేశారు కదా! పోనీ ఉన్నశాసనాలను అమలు చేయవద్దని ఎవరైనా ప్రభుత్వానికి అడ్డుపడ్డారా? కపిల్‌ సిబాల్‌ ప్రయత్నాలు ఫలించి అవాంఛనీయమైన సమాచారాన్ని సెన్సార్‌ లేదా వడపోతపట్టడానికి రూపుదిద్దుకొనే యంత్రాంగం ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది? అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటే వారికి వత్తాసు పలికే దుస్థితి నెలకొనదనే హామీ లేదు. చరిత్రలో చాలా అనుభవాలున్నాయి.

అసలు సమాచార వ్యవస్థను భ్రష్ఠు పట్టించిందీ, ఊహాగానాలపై అధారపడి అవాస్తవాలు, అర్థసత్యాలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేసిందీ ప్రభుత్వ గద్దెనెక్కిన పెద్దమనుషులే కదా? ఉదాహరణకు తెలంగాణ అంశమే తీసుకుంటే- ఈ అంశంపై కేంద్రంలోని మంత్రి పుంగవులు పూటకొక మాట, వ్యక్తికో మాట మాట్లాడి ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరి మాటను నమ్మాలో తేల్చుకోలేక రాష్ట్ర ప్రజానీకం కోలుకోలేని నష్టాన్ని ఎంతగా చవిచూస్తున్నదో అంచనా వేయడం ఎవరికీ సాధ్యంకాదు. దీనికి బాధ్యులెవరు? సామాజిక అనుసంధాన వేదికల (ఎస్‌ఎన్‌ఎస్‌) వల్ల జరిగే దుష్పరిణామాలపై కన్నెర్రజేసిన కపిల్‌ సిబాల్‌ ఇలాంటి అంశాలపై మంత్రివర్గ వేదికలపై ఎందుకు నోరు విప్పలేక పోతున్నారు?

ప్రజావ్యతిరేక విధానాలతో సామాన్య ప్రజానీకం విసిగిపోయి ఉన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల యూపీఏ ప్రభుత్వ అసమర్థతకు ప్రతిరూపంగా నిలిచాయి. అవినీతి కుంభకోణాలలో ప్రపంచరికార్డులన్నింటినీ బద్దలుకొట్టారు. 2- జి కుంభకోణం నుండి ఎలా బయట పడాలో దిక్కుతోచడం లేదు. ఇదంతా హోమ్‌ మంత్రి చిదంబరం మెడకు చుట్టుకొంటున్నదనే ఆందోళనలో ఉన్నారు. చిదంబరానికి ఏ పాపం తెలియదని సిబాల్‌ వకాల్తా పుచ్చుకొని వాదిస్తున్నారు. అవినీతిపై ప్రజలు కత్తిగట్టి, పటిష్ఠమైన లోక్‌పాల్‌ చట్టం కోసం పోరాడుతున్నారు. ఈ సమరంలో యువత ముఖ్యమైన భూమిక పోషిస్తోంది. సామాజిక అనుసంధాన వేదికలే యువతను చైతన్యపరిచాయి, సంఘటితపరిచాయి. కపిల్‌ సిబాల్‌ ఎస్‌ఎన్‌ఎస్‌ లపై ఆగ్రహంతో ఇప్పుడు ఊగిపోవడానికి అసలు కారణం ఇది కూడా కావచ్చు. వీరికి ఆత్మ బంధువైన అమెరికాలో ఉప్పెనలా లేచిన వాల్‌ స్ట్రీట్‌ ఉద్యమానికి శక్తియుక్తులను, జవసత్వాలను ఒనగూడ్చి పెట్టింది ‘సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌’ అన్న సంగతి కపిల్‌ సిబాల్‌ కు బాగా తలకెక్కింది.

సమాచార వ్యవస్థపై దాడి ఎక్కుపెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగం వగైరా సమస్యలపై నుండి ప్రజల దృష్టిని కొంత వరకైనా మళ్ళించాలనే పథకంలో కపిల్‌ సిబాల్‌ ఈ నాటకానికి తెరలేపారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రశ్నించడం ద్వారా కలకలాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే- సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంపై అధారపడి ఉన్నది. పౌరుల చేతుల్లో సమాచార హక్కు చట్టం ఆయుధంగా ఉన్నది. ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆవిర్భావంతో ప్రసార మాధ్యమాల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించి రూపు రేఖలే మారిపోయాయి.

కంప్యూటర్ల యుగంలో తంతి, తపాలా, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, సినిమాలు, ఫ్యాక్స్‌, కరపత్రాలు, పుస్తకాలు వగైరా సమాచార ప్రసార మాధ్యమాల ప్రాధాన్యత తగ్గి, కాగితం- కలం అవసరంలేని అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉన్న ఇంటర్నెట్‌ సమాచార వ్యవస్థ చౌకగా చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. 2000 నాటికి ఇంటర్నెట్‌ చందాదారులు యాబై లక్ష మంది ఉంటే, 2011 జూన్‌ 30 నాటికి పది కోట్ల మందికి పెరిగారు. ఆసియా ఖండంలో మొత్తం తొంబై కోట్ల మందికిపైగా ఉంటే వారిలో కేవలం 10.7 శాతం మంది మన దేశంలో ఉన్నారు. చైనాలో 36.3 శాతం మందిఉండడం విశేషం. సమాచారవిస్ఫోటనాన్ని ఉపయోగించుకోవడంలో చైనాకంటే చాలా వెనకబడి ఉన్నాం.

ఈ- మెయిల్స్‌ ద్వారా సమాచారాన్ని అందించుకోవడంతో పాటు, ముఖాముఖి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఇంటర్నెట్‌ను సంధానకర్తగా వాడుకొనే ఫేస్‌ బుక్‌ వినియోగంలోకి వచ్చింది. దేశంలో మూడు కోట్ల మంది సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా ఫేస్‌ బుక్‌ వినియోగదారులున్నారు. డెబైఐదు కోట్లకుపైగా మొబైల్‌ చందాదారులున్నారు. ఎస్సెమ్మెస్‌ల ద్వారా వార్తలను, సమాచారాన్ని వేగం గా చేరవేసే సౌలభ్యం ఒనగూడింది. వ్యక్తిగతంగా బ్లాగ్‌లను ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేసి, అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆధునిక ప్రపంచంలో పౌరులు అనుభవిస్తున్న ఈ సమాచార హక్కునుకాలరాసే ప్రయత్నాలకు స్వస్తిచెప్పి, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, విస్తరించ డానికి ప్రోత్సహించాలి.

దుర్వినియోగాన్ని ప్రస్తుత చట్టాల పరిథిలోనే అరికట్టడా నికి చర్యలు తీసుకోవాలి. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విభేదించే, చర్చించే, నిరసన తెలిపే, ఆందోళన చేసే హక్కుకు భంగం కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. వరంగల్‌లో జులాయిగా తిరిగే ఒక యువకుడు మృగంలా తయారై ఒక యువతిపై ప్రేమోన్మాదంతో యాసిడ్‌తో దాడిచేశాడు. పోలీసులు అత న్ని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు, విద్యార్థులు పోలీసుల చర్యను కొనియాడారు.ఆవేశం, ఉద్రేకంతోకాకుండా ప్రశాంతంగా,విజ్ఞతతో, ప్రజాస్వామ్య కోణంలో వివేచనతో ఆలోచిస్తే- అది పరిష్కార మార్గమని సమర్థించగలమా?

No comments:

Post a Comment