Tuesday, December 20, 2011

చౌరస్తాలో రష్యా

published in Surya Telugu daily on 21st December 2011

- పుతిన్‌ పార్టీకి బొటాబొటి ఆధిక్యత
- బలం పుంజుకున్న కమ్యూనిస్టులు
- పాలక పార్టీపట్ల వ్యతిరేకతే కారణం
- తాజా ఎన్నికలపై అక్రమాల ఆరోపణలు
- ఎన్నికల రద్దుకు ఆందోళనలు
- క్షీణించిన వృద్ధి రేటు
- పెరుగుతున్న నిరుద్యోగం

ప్రపంచ గమనాన్ని మార్చి, ప్రగతిశీల శక్తులకు స్ఫూర్తినిచ్చి, విప్లవోద్యమాలకు నూతనోత్సాహాన్ని కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలిచిన నాటి యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ (యు.యస్‌.యస్‌.ఆర్‌.) కు గుండెకాయ లాంటి రష్యా నేడు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి గమ్యమెటని తలపోస్తున్నది. రష్యన్‌ పార్లమెంటు ప్రతినిథుల సభ డ్యూమాకు డిసెంబరు 4 న జరిగిన ఎన్నికలు రిగ్గింగులు, అవకతవకలతో ఒక ప్రహసనంలా జరిగాయని ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఎన్నికల తీరుతెన్నులు, ఫలితాలు, రష్యా భవిష్యత్తుపై ప్రపంచ వ్యాపితంగా ఆసక్తికరమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రష్యన్‌ ప్రజల ఆశాజ్యోతిగా, ఉక్కుమనిషిగా వారి ఆదరాభిమానాలను చూరగొన్న వ్లదిమిర్‌ పుతిన్‌ ఆధిపత్యాన్ని నేడు అదే ప్రజానీకం వీధుల్లో కొచ్చి సవాలు చేసే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

మొన్న జరిగిన ఎన్నికలను రద్దుచేసి అక్రమాలకు తావులేకుండా మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్‌ ఊపందుకొంటున్నది. ఆరోపణలను తిరస్కరిస్తూనే ప్రస్తుత దేశాధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్‌ విచారణకు ఆదేశించారు. మరొక వైపున దేశాధ్యక్షుని ఎన్నికకు రంగం సిద్ధమవుతున్నది. 2012 మార్చిలో జరిగే ఎన్నికల్లో వ్లదిమిర్‌ పుతిన్‌ భవిష్యత్తు తేలనున్నది. ప్రపంచ నేపథ్యం చూస్తే, ద్రవ్యదళారీ విధానాలతో చక్రం తిప్పుతూ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏక ఛత్రాధిపత్యం వహించాలని కలలు కన్న అమెరికా- ఆర్థిక సంక్షోభంలో పడింది. పారిశ్రామిక విప్లవానికి పురుడుపోసిన యూరప్‌ పారిశ్రామిక రంగంలో తలెత్తిన సంక్షోభం వల్ల తాజాగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆర్తనాదాలు చేస్తున్నది.

ఒకనాడు విముక్తి ఉద్యమాలకు, స్వాతంత్రోద్యమాలకు, విప్లవోద్యమాలకు ఆపన్న హస్తం అందించిన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై రెండు దశాబ్దాలు గడచిపోయాయి. అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతతో సమ్మిళితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొంటూ వచ్చిన సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ ప్రజల మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్వార్థపర శక్తులు పైచేయి సాధించి, మేడి పండు లాంటి పాశ్చాత్య దేశాల అభివృద్ధిని చూపెట్టి, జాతీయవాదం ముసుగులో తన పంథాను ఎంచుకొన్న రష్యా చతికిలబడింది. ఆంతరంగికంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలోపేతం చేయడంలో, మౌలిక సమస్యల పరిష్కారంలో ఘోరవైఫల్యం చెందింది. పర్యవసానంగా ఆ దేశంలో అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయి. సోషలిజం పంథాను విడనాడి మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వైపు పరుగులు తీస్తే, చివరికిఉనికే ప్రశ్నార్థకమయ్యింది.

మార్క్సిజం లెనినిజం భావజాలానికి ప్రయోగశాలగా భావించిన గడ్డపై రాజకీయ, ఆర్థిక సంస్కరణలు పెట్టుబడికి దాసోహం పలికాయి. ఫలితంగాసామాజిక అసమానతలు, ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆర్థిక గణాంకాలు, ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డ్యూమా ఎన్నికల్లో వాటి ప్రభావం ప్రతిబింబించినట్లు స్పష్టంగా కనపడుతున్నది. రష్యాలో దామాషా ఎన్నికల విధానం అమలులో ఉన్నది. గత ఎన్నికల్లో 64 శాతం ఓట్లు పొందిన పుతిన్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ, తాజా ఎన్నికల్లో 49.32 శాతం ఓట్లు మాత్రమే పొందింది. తద్వారా డ్యూమాలోని మొత్తం 450 స్థానాల్లో గతంలో ఉన్న 315 నుండి 238కి దిగజారి, బొటాబొటి ఆధిక్యత సాధించింది. రాజ్యాంగ సవరణలు చేయాలంటే ప్రతిపక్షాల సహకారం అనివార్యం. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డ్మిట్రీ మెద్వెదేవ్‌ 71.25 శాతం ఓట్లు పొంది రికార్డు సృష్టించారు. ఆ చరిత్ర తిరగబడింది. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితే 31 శాతానికి మించి పుతిన్‌ పార్టీకి రాకపోవచ్చని ఎన్నికలకు ముందు నిర్వహించిన కొన్ని సర్వేలు వెల్లడించాయి.

కమ్యూనిస్టు పార్టీకి 11.57 శాతం నుంచి 19.19 శాతానికి ఓట్లు పెరగడంతో 48 నుంచి 92 స్థానాలకు ఎగబాకి బలమైన ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. పుతిన్‌ పార్టీ యునైటెడ్‌ రష్యా పార్టీకి తప్ప మరెవరికైనా ఓటెయ్యండి అన్న నినాదం బాగా ప్రభావం చూపినట్లుంది. కాబట్టే కమ్యూనిస్టు పార్టీతో పాటు ఎ జస్ట్‌ రష్యా పార్టీ తన బలాన్ని 6.74 శాతం నుండి 13.24 శాతానికి పెంచుకొని 64 (26), లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 8.14 శాతం నుండి 11.67 శాతానికి పెరిగి 56 (40) స్థానాలు సంపాదించుకొన్నాయి. కనీసం ఐదు శాతం ఓట్లురాని పార్టీలకు డ్యూమాలో ప్రాతినిథ్యం లభించదు. కానీ అలాంటి చిన్నాచితకా పార్టీలకు కూడా ఓట్ల శాతం పెరిగింది. పాలక పార్టీకి వ్యతిరేక ఓట్లుగానే వాటిని పరిగణించాలి తప్ప ప్రతిపక్షాలకు పడ్డ సానుకూల ఓట్లుగా చూడడం సరైనది కాకపోవచ్చు. మొత్తం 10,92,37,780 ఓట్లలో అసలు పోలింగే 60 శాతం. దీన్నిబట్టి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది.

అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెన్నడి జ్యుగనోవ్‌ ఉండబోతున్నారని, ఎ జస్ట్‌ రష్యా పార్టీ నాయకుడు సెర్గెయ్‌ మిరొనొవ్‌, లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత వ్లదిమిర్‌ జిరినోవ్‌స్కీలు పోటీలో ఉంటారని భావిస్తున్నారు. వీరు 2008 ఎన్నికల్లో యునైటెడ్‌ రష్యా పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్‌ పై పోటీ చేసి పరాజయం పొందినవారే. గడచిన రెండు దశాబ్దాల కాలంలో మధ్య తరగతి, సంపన్న వర్గం, కుబేరులు ఆవిర్భవించారు . పోర్బ్‌‌స పత్రిక సమాచారం మేరకు పద్దెనిమిది బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. లక్ష కోట్లు) సంపదతో రష్యాలోని కుబేరుల్లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన, అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుడైన మిఖాయిల్‌ ప్రొఖొరోవ్‌ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

ప్రజల్లో పలుకుబడి పెద్దగా లేకపోయినా ధన బలంతో మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకట్టుకొని రాజ్యాధికారాన్ని చేబట్టాలని ప్రొఖొరోవ్‌ ప్రయత్నిస్తున్నట్లుంది. డ్యూమాలో ప్రాతినిథ్యంలేని పార్టీల ప్రతినిథులు, స్వతంత్ర అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే రష్యన్‌ రాజ్యాంగం మేరకు ముందుగా ఇరవై లక్షలమంది ఓటర్ల సంతకాలను దేశవ్యాపితంగా సేకరించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. అవి సక్రమంగా ఉన్నాయని కమిషన్‌ నిర్ధారిస్తేనే పోటీకి అర్హత లభిస్తుంది. మధ్య తరగతి ప్రజల ప్రయోజనాల పరిరక్షకుడుగా అవతారమెత్తిన ప్రొఖరోవ్‌ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు రష్యాలో చోటు చేసుకొంటు న్నాయి.మెద్వదేవ్‌తో తాను కుదుర్చుకొన్న పదవుల మార్పిడి ఒప్పందాన్ని పుతిన్‌ సెప్టెంబర్‌లో బహిరంగంగా వెల్లడించారు.

అప్పటినుంచి పుతిన్‌ పలుకుబడి పతనం కావడం మొదలయ్యిందని అంటున్నారు. దాని పర్యవసానమే డ్యూమా ఎన్నికల్లో యునైటెడ్ష్య్రా పార్టీకి గణనీయంగా ఓట్లశాతం దిగజారి, సీట్లు తగ్గిపో యాయనే ప్రచారాన్ని పశ్చిమ దేశాల ప్రసారమాధ్యమాలు ముందుకు తెచ్చాయి. వాస్తవానికి ప్రజలలోని మార్పుకు ఆ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలే ప్రధాన కారణమనిపిస్తుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ 9.6 శాతం ద్రవ్యోల్బణంతో ఒడిదుడుకుల నెదుర్కొంటు న్నది. ఆర్థిక వృద్ధి రేటు చైనాలో 9.8శాతం, మన దేశంలో 7 శాతం ఉంటే, రష్యాలో 4 శాతం మాత్రమే. వ్యవసాయ వృద్ధి రేటు -12 శాతంగా ఉన్నది. రష్యా వార్షిక ఆదాయం పెరుగుదల, తరుగుదల- అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఆధారపడి ఉన్నది. కారణం చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరుల ఎగుమతిపై ప్రధానంగా ఆధారపడి రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మను గడ సాగిస్తున్నది.

అంటే ముడి చమురు ధరలు పెరిగితే రష్యాకు ఆదాయం పెరుగుతుంది, మనలాంటి చమురు దిగుమతి దేశాలకు చిలుమూడుతుంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది. 2007లో ఉపాథికల్పన వృద్ధి రేటు 0.03 శాతం ఉంటే, 6.1శాతం ఉన్న నిరుద్యోగ వృద్ధి రేటు 2011 జనవరికి 7.6 శాతానికి పెరిగింది. ఇది మాస్కోలో 1.4 శాతం ఉంటే ఇంగుసేటిన్‌ ప్రాంతంలో అత్యధికంగా 47.5శాతంగా ఉంది. మాస్కోకు సుదూరంగా ఉన్న ప్రాంతాలన్నిటి లోనూ కొద్దిగా అటూ ఇటూ ఉదే పరిస్థితి. కోటీ ఎనబై లక్షల మంది అంటే 12.7 శాతం జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఆహార్రదవ్యోల్బణం 17.6 శాతా నికి పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు మన దేశంలో లాగే ఆకాశాన్నంటు తున్నాయి. ఉదా: గోధుమల ధర 120 శాతం, బంగాళా దుంపల ధర 104 శాతం పెరిగాయి. పర్యవసానంగా ఆర్థిక అసమానతలూ పెరిగాయి.

నాటి సోవియట్‌ యూనియన్‌లో నాణ్యమైన విద్య, ఉపాథి, ఆహారం, ఆరోగ్యం, నివాసం వగైరా పౌరులందరూ ప్రాథమిక హక్కుగా పొందేవారు. 1981-90 మధ్య మాస్కో మహానగరానికి నాలుగైదు దఫాలు, సోవియట్‌ యూనియన్‌లోని రెండు మూడు ఇతర ప్రాంతాలలో పర్యటనకు వెళ్ళిన సందర్భాలలో, అంతర్జాతీయ విద్యార్థి యువజన మహాసభలు, వేదికల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, కాంసొమోల్‌ (యువజన సంఘం), స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యు.యస్‌.యస్‌.ఆర్‌. నాయకత్వాలతో సంభాషణల సందర్భంలో- ఆ దేశ విద్యా వ్యవస్థ, ఉపాథి రంగం, యువత బహుముఖ రంగాలలో- అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నాడు ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలపై అధ్యయనం చేసే సదవకాశం లభించింది. ఉన్నత విద్య వరకు విద్యార్థులందరికీ ఉపకారవేతనాలిచ్చి ఉచిత విద్యనందించేవారు. రష్యన్‌ విద్యార్థులకే కాదు, దౌత్యసంబంధాలలో భాగంగా, సౌహార్ద సంబంధాలలో అంతర్భాగంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల తరపున పంపిన- వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను ఉచితంగా అందించారు.

సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం గడచిన రెండు దశాబ్దాలుగా ఆర్థిక సంస్కరణలలో భాగంగా అమలు చేస్తున్న మార్కెట్‌ ఆర్థిక విధానాల మూలంగా ఇవన్నీ అంగడి సరుకులుగా మారిపోయాయి. సంస్థాగత సంస్కరణల పేరిట విద్య, ఆరోగ్య రంగాలకు నిథుల కేటాయింపు తగ్గించారు. విద్యార్థులకిచ్చేఉపకార వేతనాల్లో కోతపెట్టారు. వేతన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదించే పనిని స్థానిక పరిపానా సంస్థలకు అప్పగించారు. పెన్షన్‌ పథకానికీ నిథుల్లో కోత పెట్టారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, డ్యూమా ఎన్నికలలో పుతిన్‌, మెద్వదేవ్‌ల నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రజలు ఎందుకు చేదు ఫలితాల రుచి చూపించారో అర్థం అవుతుంది.

ఈ నేపథ్యంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎన్నికల అనంతరం గత గురువారం రష్యా ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ జాతీయభావాలు, స్వతంత్ర విదేశాంగవిధానం గురించి నొక్కివక్కాణించడం, అమెరికా పెత్తందారీ పోకడలపై ధ్వజమెత్తడం ద్వారా దేశ ప్రజలను మళ్ళీ తన వైపు తిప్పుకొనే ప్రయత్నంలో పడ్డట్టు కనపడుతున్నది. ఎన్నికల చెల్లుబాటును ప్రశ్నిస్తూ హిల్లరీ క్లింటన్‌ చేసిన విమర్శలను తిప్పికొడుతూ, రష్యాను అస్థిరపరచాలనే దురుద్దేశంతో అమెరికా పథకం ప్రకారం ప్రతిపక్షాలకు నిథులను అందజేస్తున్నదని విమర్శించారు. వీటన్నింటినీ గమనిస్తే డ్యూమా ఎన్ని కల ఫలితాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించి మార్చిలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధిపొందాలనే పనిలో పుతిన్‌ పడ్డట్లు గోచరిస్తున్నది.

No comments:

Post a Comment