Saturday, April 11, 2015

శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్: చర్చ





టీవి5 చర్చలో నేను వ్యక్తం చేసిన‌ అభిప్రాయాలపై స్పందించి అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులకు ధన్యవాదాలు.
శేషాచలం అడవుల్లో జరిగింది ఎన్ కౌంటర్ ఔవునా? కాదా? అన్న ప్రశ్నకు 'ఔను, కాదు' అన్న నిర్ధిష్టమైన సమాధానం చెప్పడానికి నా వద్ద ఆధారాలు లేవు. ఆధారాలున్న వారు నొక్కి వక్కాణించవచ్చు. అనుమానాలపై ఆధారపడి ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు చేసే వారుండ‌వచ్చు. నేను ఆకోవకు చెందిన వాడిని కానని వినమ్రతతో విన్నవించుకొ‍ంటున్నాను.
ఈ ఉదంతాన్ని నేను రెండు కోణాల నుంచి చూస్తున్నాను. 1) ఎన్ కౌ‍ంటరా ? లేదా ఫేక్ ఎన్ కౌంటరా? 'సబ్జెటివ్ రియాక్షన్' తో ఒక నిర్ధారణకు వచ్చి ఈ ప్రశ్నకు నిర్ధిష్టమైన సమాధానం చెప్పడం అసంబద్ధమైనదని నేను భావిస్తున్నాను. ప్రజల్లో రెకెత్తిన అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి నిజనిద్ధారణ చేయవలసిన బాధ్యత‌ న్యాయస్థానాలపై ఉన్నది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. న్యాయ స్థానాలపై విశ్వాసం లేదంటే అదివేరే విషయం. పెట్టుబడిదారీ వ్యవస్థలోని చట్టాలకు, న్యాయ వ్యవస్థకు వర్గ స్వభావం ఉంటుందన్న విషయం నిర్వివాదాంశ‍ం. అలా అని న్యాయ వ్యవస్థను తృణీకార భావ‍‍ంతో చూడగలమా! అందుకనే జరిగిన ఎన్ కౌంటర్ నిజమైనదా? లేదా ఫేక్ ఎన్ కౌంటరా? తేల్చవలసింది నాయస్థానాలన్నది నా అభిప్రాయం. దాన్నే టీవి చర్చలో చెప్పాను.
2) వ్యవస్థీకృత నేరాల పట్ల వైఖరి: సమాజాన్ని అతలాకుతం చేస్తూ అశాంతిని, అభద్రతను, దోపిడీని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ వ్యవస్థీకృత నేరాల వ్యవస్థ‌ పెంచి పోషిస్తున్నది. దోపిడీ వర్గాలు ఈ దుష్టశక్తులను పెంచి పోషిస్తున్నాయి. బొగ్గు మాఫియా, ఎర్రచందనం మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూముల మాఫియా, టోల్ టాక్స్ మాఫియా, పెట్రోల్ మాఫియా, ఎన్నికల్లో బూతుల ఆక్రమణ మ‌రియు రిగ్గింగ్ మాఫియా, గ్రామ కక్షలు మరియు హత్యా రాజకీయాలను కొనసాగించే హంతక ముఠాలు, వగైరా  చట్ట వ్యతిరేకమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన, పౌర హక్కులను కాలరాస్తున్న వ్యవస్థీకృత నేరాల వ్యవస్థ పట్ల, అందులో అంతర్భాగమైన‌ మాఫియా గ్యాంగ్స్ కార్యకలాపాల పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించాలో వారి వారి చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలలో తెలిసి తెలిసి భాగస్వాములై, ప్రాణాలకు తెగి‍ంచి అక్రమార్జనాపరులకు తోడ్పడుతూ, తామూ ఆ అక్రమార్జనలో ఏదో ఒక మేరక లబ్ధి పొందుదామని నేరాలకు పాల్పడుతున్న వారిని సమర్థించాలన్న చైతన్యాన్ని నాకు మార్కిస్టు భావజాలం కల్పించలేదు.
3) ఎవర్ని కార్మికులంటాం? కూలీలంటాం? కార్మిక వర్గ‍ం అంటాం? చట్టబద్ధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ తమ శారీరక, మేధోపరమైన శ్రమ‌ శక్తిని అమ్ముకొంటూ, జాతి సంపదను సృష్టించే వారిని కార్మికులు, కూలీలు, వారి సమూహాన్ని కార్మిక వర్గం అంటాం. అంతే కానీ వ్యవస్థీకృత నేరాలలో పాల్గొంటున్న 'లుంపెన్' గ్యాంగ్స్ ను, ముఠాలను కార్మిక వర్గంలో అంతర్భాగంగా చూడాలనే విశాలమైన కమ్యూనిస్టు చైతన్యం నాకు లేదు. టోల్ గేట్ అక్రమ వసూళ్ళకు వ్యతిరేకంగా గళం విప్పిన  వెటరర్న్ కమ్యూనిస్టు పన్సారేను ఈ మధ్య కాలంలోనే టోల్ గేట్ మాఫియా గ్యాంగుకు చెందిన కిరాయి గూండాలు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. హత్యలు చేయడమే వృత్తిగా పెట్టుకొని కిరాయి గుండాలుగా మారిన వారికి, జాతి సంపదను కొల్లగొట్టే మాఫియా ముఠాలతో చేతులు కలిపిన కిరాయి వ్యక్తులను కూలీలుగా అభివర్ణించడం కమ్యూనిస్టు చైతన్యం అనుకొంటే నేను చెప్పగలిగిందేమీ లేదు. మానవ హక్కులు, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సాంఘిక వెనుకబాటుతనం లాంటి గొడుగుల నీడన రాజ్యాంగ బద్ధం కాని, చట్టబద్ధం కాని, సమాజంలోని మిగిలిన పౌరుల హక్కులను కాలరాచే దుష్టశక్తులకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వత్తాసు పలకడం పరనింద, ఆత్మవంచన అవుతుంది. దాని వల్ల సమాజానికి ఏ మాత్రం మేలు జరగక పోగా తీవ్ర హాని జరుగుతుంది. అరాచకం, దోపిడీ ఇంకా వెర్రితలలు వేస్తాయని మార్క్సిస్టు భావజాలంలో నాకున్న మిడిమిడి జ్ఞానంతో చెబుతున్న మాట. కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా నిలవాలే గానీ వ్యవస్థీకృత నేరాల వ్యవస్థలో భాగస్వాములైన 'లుంపెన్ గ్యాంగ్స్'కు కాదు. ఈ దృక్పథంతోనే శేషాచలం అడవుల్లో జరిగిన ఘటనను, తెలంగాణ గడ్డపై ఉగ్రవాద ముఠాకు చెందిన కొందరిని హతమార్చిన ఘటనను చూస్తున్నాను. ఆయా ఘటనలను విశ్లేషి‍ంచుకోవడంలో నాకున్న‌ దృక్పథం లోపభూయిష్టమైనదేమో! మేధావులెవరైనా అందులోని లోపాన్ని ఎత్తి చూపి నన్ను సరిచేస్తే సంతోషమే.    

No comments:

Post a Comment